అనాదిగా భారతీయ సమాజం అనేక రకాల ఆధిపత్యాలను, అసమానతలను తనలో నింపుకుని కాలంతో పాటు ప్రయాణం చేస్తుంది. ఇట్లాంటి అసమానతలకు, ఆధిపత్యాలకు వ్యతిరేఖంగా పీడిత సమూహాల పోరాట పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సాగుతున్న ఈ పోరాటాలలో ఎంతో మంది మనుషులు కుల, వర్గ, జాతి, లింగ భేదం లేకుండా తమ జీవితాలను త్యాగమయ జీవితాలుగా మార్చుకున్నారు. ఏ అసమానతలు లేని సమాజం కోసం తమ ప్రాణాలను సైతం యుద్ధంలో ఉంచారు. అట్లాంటి మార్పుకోసం జరిగే యుద్ధంలో పాల్గొన్న మనుషులు కూడా అనేక సార్లు సమాజం విధించిన అణచివేతల భావజాలం నుండి తప్పించులేకపోయారు. అది దళితులు అయితే కులం నుండి తప్పించుకుకోలేకపోయారు. స్త్రీ అయితే పురుషాధిపత్య భావజాలం నుండి, ఆ భావజాలం స్త్రీని చూసే కోణం నుండి వేరుపడలేకపోయారు. అట్లా మహోన్నత ఉద్యమంలో భాగమైన ఒక స్త్రీ సమాజ అవలక్షణమైన పురుషాధిపత్యంపైన, దాని వలన తాను ఎదురుకొన్న అవమానాలపైన మౌనంగా తన జీవితకాలం చేసిన పోరాటమే మేరువు నవలలో సావిత్రమ్మ పాత్ర. ఒక పీడుతురాలిగా, విప్లవకారిణిగా వర్గ పోరాట ఆచరణలో సమాజ మన్ననలు పొందినా, ఒక స్త్రీగా పురుషాధిపత్య భావజలంపైన జరిపిన పోరాటంలో సమాజమంతటితో యుద్ధం నెరిపి దిటువుగా, నిటారుగా నిలబడిన స్త్రీ వ్యక్తిత్వం సావిత్రమ్మ పాత్ర.
అయితే ఈ యుద్ధం సావిత్రమ్మ అనే కల్పిత పాత్రది కాదు. ఆ పాత్రకు ప్రేరణగా ఉన్న ద్రోణవల్లి అనసూయమ్మ యుద్ధం. అట్లాంటి పరిస్థితులలో ఉన్న అనేక మంది స్త్రీల తాలూకు యుద్ధం. ఈ నవల రచయిత నల్లూరి రుక్మిణి ఆమె పరిచయంలో, ఆమె జ్ఞాపకాల్లో ఉన్న ద్రోణవల్లి అనసూయమ్మ జీవితాన్ని కొంత దగ్గరి నుండి చూసింది. మరికొంత జీవితాన్ని అనసూయమ్మ చుట్టూ అల్లుకున్న సమాజం నుండి తీసుకుంది. రచయిత నల్లూరి రుక్మిణే నవలకి ముందుమాటలో రాసినట్టు “కంటికి కనపడేదే అసలు జీవితం కాదు, కనపడే జీవితం వెనుక కనపడని వేదన ఉంటుంది. దాన్ని అందరు అర్థం చేసుకోవాలి అంటాను”. అట్లా అనుకుంది కాబట్టే ఆమె అనసూయమ్మలో కనిపించని వేదనను నవలగా రాసింది. నల్లూరి రుక్మిణి ఈ నవలలో అనసూయమ్మ జీవితంలోని రెండు యుద్ధ క్షేత్రాలను కార్యరంగంగా తీసుకుంది. అసమానతలు లేని సమాజం కోసం, అందరూ బాగుండే ఒక సమాజ అవసరం కోసం, సమసమాజం కోసం తాను పీడితురాలిగా జరిపిన వర్గ పోరాట యుద్ధ క్షేత్రం మొదటిది. అనాదిగా సమాజ ఆలోచన విధానంలో వెళ్ళూనుకుపోయిన పురుషాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా స్వేచ్చ కోసం, ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం ఒక స్త్రీగా తాను చేస్తున్న పోరాటం తాలుకు యుద్దక్షేత్రం రెండవది. ఈ రెండు యుద్దక్షేత్రాలలో భాగమైన ద్రోణవల్లి అనసూయమ్మను సావిత్రమ్మ అనే పాత్రగా మేరువు నవలలో చిత్రించడం జరిగింది. వర్గ శత్రువుతో జరిపే పోరాటం కంటే పితృస్వామ్య వ్యవస్థతో జరిపే పోరాటం ఎంత కఠినంగా ఉంటుందో సావిత్రమ్మ అనే పాత్ర ద్వారా నల్లూరి రుక్మిణి మనకు చూపిస్తుంది.
నవలా వస్తువు:
తెలంగాణ సాయిధ పోరాటంలో పుట్టుక, నక్సల్బరీ గుండా సాగిన యవ్వనం, విప్లవోద్యమంతో సమాంతరంగా సాగిన జీవితం సావిత్రమ్మది. విప్లవోద్యమం నడక లాగే ఎత్తుపల్లాల నడక. విప్లవోద్యమ ఆచరణ లాగే అత్యంత సంక్లిష్ఠ జీవితాచరణ ఆమెది. “సమాజానికి, మానవ జాతికి వర్గ రహిత సమాజం వినా ఏదీ పరిష్కారం కాదు. అది ఎంతకాలం వాయిదా పడుతుందో అంత కాలం మనుషులకు, మానవ సమూహాలకు సంక్షోభం తప్ప శాంతి ఉండదు. అయితే ఆ సుధీర్ఘ ప్రయాణం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి సాగడం తప్పదు. ఆ విషయాన్ని ఏదో ఒక నాటికి ఈ భూగోళం అంతా తెలుసుకునే రోజు వస్తుంది”(రుక్మిణి, నల్లూరి.2019. పుట:158) ఇవి మేరువు నవల చివరి వాక్యాలే కాదు సావిత్రమ్మ తన జీవితం చివరి దాకా బలంగా విశ్వసించి, ఆచరించిన భావాలు. తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చిన ఆ ఎరుకతోనే చిన్నప్పుడే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ సందర్భానికి అనివార్యమైన ఆయుధాన్ని పట్టింది. నిత్య నిర్భందాలతోనే శాశ్వత బంధాన్ని కొనసాగించింది. తాను నమ్మిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను నమ్మిన వాడినే ప్రేమించింది. యుద్ధంలో సంసార బంధనాలు దరిచేరకుండా పుట్టిన సంతానాన్ని ఆదరించమని అత్తమామలకు అందజేసింది. మాతృత్వం కంటే ప్రజా జీవితమే గొప్ప ఆశయంగా ఎంచుకుంది. తను ప్రేమించిన వాడు యుద్ధంలో అమరత్వం పొందినా అశయాల పరంపరే అసలైన ప్రేమ అనుకుంది. అందుకే తన సహచరుడు అమరత్వం చెందినా కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం యుద్ధ విరమణ ప్రకటించేదాకా అక్కడే ఉంది. ప్రేమను, ప్రేమించినా పోరాటాన్ని రెండూ ఒకే కాలంలో కోల్పోయింది. ఇష్టపడిన వ్యక్తి, ఇష్టంతో ఎత్తుకున్న విప్లవ రాజకీయాలు ఒకే కాలంలో దూరం అవడం వలన రాగాన్ని, శబ్దాన్ని కోల్పోయిన అక్షరంగా మూగబోయింది. అలవాటు లేని అసలే ఆసక్తి లేని సంసార జీవితంలోకి అనుకోకుండా వచ్చి పడింది. అట్లాంటి పరిస్థితులలో కూడా ఆమె పిల్లల్ని చూసుకుంటూ మాతృత్వ జీవితాన్ని అనుభవించాలని అనుకోలేదు. బతుకు బతకడానికి ఏదో ఒక పని చేయాలని అనుకోలేదు. . అప్పుడు కూడా పార్టీ కోసమే పని చేయాలి అని అనుకుంది. అందుకే మళ్ళీ తిరిగి జిల్లాలకి ఆర్గనైజర్ గా వెళ్ళింది. అట్లా వెళ్తున్న దారిలో ఒంటరి జీవితానికి ఒక తోడును వెతుక్కుంది, ఒక స్నేహాన్ని వెతుక్కుంది. ఆశయాల కలయికతో జరిగిన కలయిక అది. నక్సల్బరి వసంత మేఘం కమ్ముకు వస్తున్న సమయంలో ఆ రాజకీయాలను విశ్వసిస్తున్న చలపతిరావుతో కలిసింది. మళ్ళీ ఒకసారి యుద్ధంలోనే ప్రేమను వెతుక్కుంది. అక్కడి నుండే ఆమె జీవితంలో అసలైన యుద్ధం మొదలైంది. అప్పడి వరకు ఆమె విప్లవాచరణకు ఆకాశానికెత్తిన బంధువులు, మిత్రులు ఆఖరుకు పార్టీ కూడా ఆమె పైకి వేల్లెత్తారు. దానికి కారణం చలపతిరావుకు అప్పడికే పెళ్లి అయింది. కుటుంబం, భార్య పిల్లలు ఉన్నారు. సావిత్రమ్మ సమాజం నుండి వచ్చే అనేక ప్రశ్నలను విన్నది. కానీ ఆ ప్రశ్నలకి జవాబు చెప్పాలి అని ఆమె అనుకోలేదు. పార్టీ కూడా దీన్ని అంగీకరించలేదు. పార్టీ నుండి చలపతిరావును బహిష్కరించింది. మళ్ళీ యుద్ధం నుండి బయటికి వచ్చిన సావిత్రమ్మ సంసార బంధనాల మధ్య చేరింది. కానీ ఆ యుద్ధం నుండి బయటికి వచ్చాక సమాజ అసలు రూపం చూసింది. తన గుండెల మీద పెరిగిన పిల్లలు పెద్దవాళ్లై సమాజంలోకి వెళ్లారు. సమాజ ఆధిపత్య ఆలోచనలు చదువుకున్నారు. ఇప్పుడు అవమానాలు బయటి నుండే కాదు ఇంట్లో కూడా మొదలయ్యాయి. ప్రజా జీవితంలో ఉంటూ పిల్లల్ని పట్టించుకోకపోవడం, సహచర్యం వెతుక్కోవడం అప్పుడు గర్వంగా అవసరంగా అనిపించినా ఆమె పిల్లలు పెద్దవాళ్ళై ఎదురుతిరిగినపుడు మాత్రం అట్లా నిలబడిపోయింది. సమాజం కోసం చేసిన పోరాటాలకు, ఎదుర్కొన్న కేసులకు, జైళ్లకు, దొరలకు దేనికి భయపడని సావిత్రమ్మ ఆరోజు సమాజానికి భయపడింది. ” సీరియస్ రాజకీయాల్లోనూ, ప్రజా జీవితంలోనూ వుండే స్త్రీల జీవితాన్ని ఏదో మేరకు సంక్షుభితంగానే ఉంటాయి. ఈ పురుషాధిక్య వర్గాధిక్య ప్రపంచం స్త్రీలను అంత తేలిగ్గా అంగీకరించదు. పితృస్వామ్య ఎంత బలీయమైందో” ( రుక్మిణి, నల్లూరి.2019. పుట:30) అని అభిప్రాయపడింది. ఆ భయంలోనే జీవితంలోని కొంత కాలాన్ని పూర్తి చేసింది. చీకటి అనేది ఎప్పుడూ ఉండదు. కొంతకాలం తర్వాత వెలుగు రావడం తథ్యం. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ చీకట్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న వెలుగు రేఖలు విరబూసుకుని కనిపిస్తాయి. అట్లా సావిత్రమ్మ జీవితంలోకి వచ్చిన చిన్న వెలుగురేఖ రామదాసు గారు. ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధి కూడా. అంత భాదలో ఉన్న సావిత్రమ్మకు అండగా నిలబడిన వ్యక్తి రామదాసు. గతం తాలూకు ప్రభావంతో దుఃఖంలో ఉన్న ఆమె వర్తమానాన్ని మళ్ళీ భవిష్యత్తులోకి, భవిష్యత్ తరాన్ని ఇచ్చే పోరాటంలోకి ఆహ్వానించాడు. పార్టీ నిర్బంధంలో ఉంది. అందుకే రైతు కూలి సంఘంగా జనంలోకి వెళ్ళింది. కమ్మ, కాపుల మధ్య ఓట్ల వలన జరిగిన గొడవలో తమకు ఓటు వేయనందుకు తమ పొలాల్లోకి పనికి రావద్దు అని రైతులకు కమ్మ సమాజపు హెచ్చరిక. నమ్ముకుని ఓట్లు వేసిన కాపు నాయకులు చేతులు ఎత్తేసారు. అందుకే ప్రజలకి పార్టీ గుర్తొచ్చింది. పార్టీ, సావిత్రమ్మ సమస్య కేంద్రంలోకి వచ్చారు. తాము ఏడాదంత కష్టం చేసి పండించిన పంట కోసం మొదలైన పోరాటం సమస్యకు అనుగుణంగా భూ పోరాటంగా మలుపు తీసుకుంది. ఇంకా మళ్ళీ పోరాటాలు, గొడవలు, కేసులు, జైళ్ళు. సావిత్రమ్మ తన అద్భుతమైన ప్రజా జీవితపు గతాన్ని మళ్ళీ ఒకసారి అనుభవించింది.
పాత్ర చిత్రణ:
నల్లూరి రుక్మిణి సావిత్రమ్మ పోరాట జీవితాన్ని చాల గొప్పగా చిత్రించారు. ఆ మాటకొస్తే ప్రజా జీవితాలను దగ్గరగా చూసి, ఈ మట్టితో మనసు విప్పి మాట్లాడిన ప్రతీ మనిషి జీవితం గొప్పదే. అట్లా మాట్లాడిన ఎంతోమందికి అనుకరణే సావిత్రమ్మ పాత్ర. అందుకే ఆ పాత్ర ప్రజా జీవితాన్ని ఎన్నుకుంది. ప్రజల కోసం ఆయుధాన్ని ఎత్తుకుంది. రచయిత సావిత్రమ్మ జీవిత ప్రయాణాన్ని సమాంతరంగా చిత్రించలేదు. ఎన్నో విజయాలు, ఇంకెన్నో అపజయాలు, ఎన్నో సమీక్షలు, మరెన్నో అవలోకనాలు. విప్లవోద్యమంతటి ప్రయాణాన్ని సావిత్రమ్మ ప్రయాణానికి రాసుకుంది. ఆ ప్రయాణంలో ఆ పాత్ర ఎన్నో మలుపులను చూసింది. ఇంకెన్నో మలుపులలో భాగమైంది. గొప్పగా సాగుతున్న సాయుధ పోరాటాన్ని చూసింది. రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన ఆ పోరాట విరమణను చూసింది. మళ్ళీ చాల కాలం సంది సమయం. అకస్మాత్తుగా పేలిన నక్సల్బరి వసంత కాల మేఘగర్జన శబ్దం విన్నది. అనుకరించిన శ్రీకాకుళ పోరాటం తన అనుభవంలో ఉన్నది.. అన్ని విప్లవోద్యమ అనుభవాలు. అంతేనా ప్రతీ అనుభవం సావిత్రమ్మ జీవితానుభవమే. ఇంకా సావిత్రమ్మ పాత్ర జీవిత ప్రయాణం చాలా చూసింది. నిర్బంధ శిబిరం అయిన ఆంధ్రప్రదేశ్. కనపడితే కాల్చి పడేసే పరిస్థితులు. సాయుధ పోరాట పంథా తుడిచిపెట్టుకుపోయింది అనుకున్న భూస్వామ్య వర్గాలకు సింహ స్వప్నంగా ఉత్తర తెలంగాణలో వినపడిన దున్నే వాడికే భూమి నినాదాలు. సాంస్కృతిక దళాల డప్పు మోతలు, గజ్జెల దరువులతో మారుమోగిన ఆంధ్ర పల్లెలు. రచయిత సావిత్రమ్మ పాత్రను గొప్ప పోరాట యోధురాలుగానే కాకుండా గొప్ప సహచరిగా కూడా రచయిత చిత్రించింది. భౌతిక సుఖాలను కాకుండా ఆశయాల ఆచరణనే అసలైన ప్రేమగా సావిత్రమ్మ పాత్ర చూసింది. తన భావాలు తనను కోరుకున్న రాఘవను పెళ్లి చేసుకున్నది. తాను నమ్మిన ఆశయం కోసం యుద్ధానికి వెళ్తే తనతో పాటే వెళ్ళింది. ” రేపు పార్టీ కోసం పని చేసే క్రమంలో ముందు ముందు నిర్బంధాలు రావచ్చు. అయినా మనం పార్టీని వదలరాదు, ఒకవేళ మనలో ఎవరైనా ముందే చనిపోతే రెండో వాళ్ళం పార్టీలో ఉండి మన ఆశయాన్ని కొనసాగాలి”( మేరువు పుట:91) అని చెప్పిన తన సహచరుడి మాటతో అంగీకరించింది. తాను అమరుడు అయినా తాను నమ్మిన ఆశయాల కోసం అట్లానే జీవితకాలం నిలబడింది. అట్లా వెళ్తున్న మార్గంలోనే చలపతిని సహచరుడిగా ఎంచుకుంది. ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా తన వెంటనే ఉన్నది. చివరి దశలో సైన్యం లేని నాయకుడిగా మారిన చలపతిని చూసింది. పార్టీని వీడతాను ఆన్న చలపతికి వద్దు అని చెప్పింది. తాను నిర్మించిన పార్టీని వదిలితే తన సహచరుడు ఎవరికి కాకుండా పోతారని బాధపడింది. చివరివరకు పార్టీలో కొనసాగితే మహానాయకుడిగా ఆయన పార్థివదేహాన్ని ఘనంగా పార్టీనే సాగనంపుతుంది. అట్లే తమ సహచర్యం కూడా గొప్పగా మిగిలిపోయేది అనుకుంది. ఎవరి దయాదాక్షణ్యాల మీదనో ఆయన అంతిమయాత్ర జరపకూడదు అనుకుంది. తమ సహచర్యం యుద్ధంలోనే చివరి వరకు ఉండాలని అనుకుంది. సహచరిగా, తల్లిగా కన్న ఒక గొప్ప విప్లవకారిణిగానే సావిత్రమ్మ పాత్ర నవలలో కనిపిస్తుంది. పోరాటంలో భాగమైనపుడు మాతృత్వాన్ని కూడా మర్చిపోయింది సావిత్రమ్మ పాత్ర. జైల్ కి వెళ్ళాక, కొంత పరిస్థుతులు స్థిమితపడ్డాక బిడ్డను గుర్తుకు తెచ్చుకుంది. బిడ్డ ఆకలి గుర్తుకు తెచ్చుకుంది. రచయిత సావిత్రమ్మ పాత్రకు స్త్రీలు తమ జీవితాలు తమ జీవితాన్ని పునర్నిర్మించుకునే గొప్ప కమ్యూనిస్ట్ చైతన్యాన్ని ఆపాదించింది. ” చివరి దాకా ఇట్టాగే చస్తా, ఎర్రజెండా మీద కప్పించుకోవాలి అదే నా చివరి కోరిక” ( మేరువు పుట:107) అని ప్రకటించేంతగా సావిత్రమ్మ పాత్ర ప్రజలను ప్రేమించింది. రచయిత నల్లూరి రుక్మిణి ఈ నవలలో సావిత్రమ్మ పాత్రను ఎన్ని తుఫానులు వచ్చినా తట్టుకుని నిలబడే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా అద్బుతంగా రాసుకున్నారు. సీరియస్ రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండే స్త్రీలకు, సమాజ పాత ఆలోచనలను ధిక్కరించి నూతన ఆలోచనలను ఎత్తుకునే స్త్రీలకు సమాజం నుండి ఎదురయ్యే సంక్లిష్ఠతలను సావిత్రమ్మ పాత్ర కోణం నుండి విశ్లేషించారు. ఆమె కోణం నుండి స్త్రీల సమస్య పైన ఒక ప్రగతిశీల చర్చ చేసారు. విప్లవోద్యమం, పురుషాధిపత్యా సమాజం గురించి సావిత్రమ్మ పాత్ర ద్వారా కొన్ని ప్రశ్నలు, ఇంకొన్ని చర్చలను చాల అర్థవంతంగా చేశారు. ఒక పుస్తకం ఒక చర్చను లేవనేస్తుంది. విప్లవోద్యమం దృక్పథంతో వచ్చిన పుస్తకం ఇంకాస్త ఎక్కువ చర్చను లేవనేస్తుంది. కానీ ఆ చర్చ స్త్రీ కోణం నుండి జరగడం అనేది మేరువు నవలలో ఉన్న ప్రత్యేకత. ఆ చర్చను ఒక వాస్తవ పాత్రను, వాస్తవ జీవితాన్ని నేపథ్యంగా చేయడం అనేది రచయిత నల్లూరి రుక్మిణి గొప్పతనం.
రచనా నైపుణ్యం:
నల్లూరి రుక్మిణి రచనలో నైపుణ్యం కంటే ఆ రచన సామాన్య పాఠకుడికి చేరడమే లక్ష్యంగా రచనలు చేసిన వ్యక్తి. అందుకే సాధారణ పాఠకుడికి అర్థమయ్యేంత సులభ పద్ధతిలోనే మేరువు నవలను రచించింది. రచన అంటే జీవితాన్ని చెప్పే ఒక ప్రక్రియ అని నమ్మిన వ్యక్తి అనుకుంది కాబట్టే సుదీర్ఘ జీవితానుభవాలను నవలలోకి తీసుకువచ్చింది. తాను నమ్మిన సిద్ధాంతాలను, తాను ఏర్పరచుకున్న దృక్పథం నుండే సమాజాన్ని, మనుషులను చూసింది. అట్లే తాను రాసుకున్న పాత్రలను కూడా. మేరువు నవల విప్లవ రాజకీయాల నేపథ్యంగా జరిగిన కథ. పురుషాదిపత్యం సమాజంపైన ఎంత బలంగా ఉంటుందో చెప్పిన కథ. ఈ నవల వాస్తవిక నవల. ఈ నవలలో ఉన్న పాత్రలు, పరిస్థితులు అన్ని వాస్తవానికి దగ్గరగా ఉన్నవే. అందుకే సావిత్రమ్మ పాత్రని బలంగా చిత్రిస్తూనే, తన చుట్టూ ఉన్న విప్లవ రాజకీయాలను గురించి ఒక స్పష్టమైన చర్చ చేసారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా విప్లవ రాజకీయాల గురించి ఈ నవలలో రికార్డు చేసింది. అక్కడ జరిగిన రైతు కూలీ సంఘం కార్యకలాపాలు, రాడికల్స్ కార్యకలాపాలు, లంక భూముల కోసం జరిగిన పోరాటాలు, ఐలూరు, గురివిందపల్లి, దేవరపల్లి భూపొరాటాలను మేరువు నవల చిత్రించింది. ఈ నవలలో వాడిన భాష కూడా ప్రాంతీయ భేదాలు లేకుండా తెలుగు పాఠకులకి అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నది. తీసుకున్న వస్తువు కూడా ఒక ప్రాంతంలో సంబంధించిన రాజకీయాలే అయినా తెలుగు నెల మీద జరిగిన విప్లవ రాజకీయాలన్నిటిని తడిమి చూసినట్టు అనిపించేలా రాసింది.
రచయిత పరిచయం:
నల్లూరి రుక్మిణి విప్లవ రచయిత్రి . విప్లవ రచయితల సంఘంలో సభ్యురాలు. ఆర్థిక, రాజకీయ సామాజిక అంశాల చుట్టూనే ఈమె తన రచనా వ్యాసంగాన్ని చేసారు. ఒక మనిషి వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం వీటి మూలంగా ఏర్పడిన సంబంధాల మధ్య ఉన్న సంఘర్షణనే గొప్ప రచనా వస్తువుగా అనుకుంది. ఈమె మొదటగా కథలు రాసేది. కానీ కథలలో కంటే నవలలో జీవితాన్ని విస్తృతంగా చెప్పవచ్చు అనుకుని నవలా రచనలోని అడుగుపెట్టింది. ఈమె రాసిన మొదటినవల ” నర్రెంక చెట్టు కింద”. ఒక అమరుడి జీవిత ప్రేరణతో ఈ నవలను రాసింది. చిన్నప్పటి జ్ఞాపకాలు నుండి అప్పటి సామాజిక చరిత్రను, సంస్కృతిని “ఒండ్రుమట్టి” నవలను రాసింది. దళిత కోణంలో కుల చైతన్యం ఒకటే సరిపోదు సామాజిక చైతన్యం కూడా ఉండాలి అని “నిషిద “ను రాసింది. పితృస్వామ్య సమాజంపై స్త్రీ చేసిన యుద్ధంగా “మేరువు” ను రాసింది. నవలలే కాకుండా అనేక కథలను రాసింది. ఏ ప్రక్రియలో రచన చేసిన రాజకీయ, సామాజిక అంశాలు ప్రధానంగా సాగినవే. ఏ రచన చేసినా రచయితకు తప్పకుండా ఒక దృక్పథం ఉండాలి అని బలంగా నమ్మిన రచయిత నల్లూరి రుక్మిణి.