విరసం ప్రపంచ విప్లవ మానవుడిగా పేర్కొన్న అమరుడు కామ్రేడ్ జి ఎన్ సాయిబాబా ఎక్కడ పుట్టి చేతులతో పాకుతూ, బుద్ధితో జ్ఞానాన్ని పొందుతూ చేతనతో వివేకాన్ని పెంచుకుంటూ నిజంగానే ప్రపంచమంతా తిరుగుతూ విప్లవ ప్రస్థానం చేసాడు. అమలాపురం పక్కన ఒక వ్యవసాయ కూలీగా మారిన పేద రైతు ఇంట్లో పుట్టి చదువు కోసం ఆ ఊరు చేరేనాటికి అది కోనసీమ. ఆయన జీవితం మాత్రం తండ్రి నాడు చిన్న రైతుగా కొంత భూకమతం కలిగి ఉన్నా బతుకు దుర్భరమై సాయిబాబా, పోలియో బాధితుడైన సాయిబాబా చదువుకుంటేనైనా భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు సాహసం చేసి అమలాపురానికి తరలివచ్చారు. అయితే సాయిబాబా జన్మించిన 24 జులై 1967 అటువంటి వలస బతుకులను, అటువంటి విస్థాపిత బతుకులను బాగు చేయడానికి శస్త్ర చికిత్సకు పూనుకున్న సంతాల్ ఆదివాసుల వసంత మేఘ గర్జన – నక్సల్బరీలో రెండు నెలల క్రితమే ఒక అగ్గి రవ్వ జానకితాడును అంటుకున్నట్లు ఆయన పొరుగున, గోదావరి ఏజెన్సీ పొడుగునా తూర్పుగోదావరి జిల్లా నుంచి అదిలాబాదు దాకా ఒక దావానలమై వ్యాపించింది. తల్లిదండ్రులు సాయిబాబా చదువు కోసమే ఇక తమ జీవన పోరాటమనుకున్నారు.

అది పేరుకు కోనసీమ అయినప్పటికీ సాయిబాబా గ్రామం సముద్రానికి ఇరవై కిలోమీటర్ల దిగువన సముద్రం వెనక్కి నెట్టే నల్లని నీళ్లు వచ్చే (బ్యాక్ వాటర్) స్థలంలో ఉండడం వల్ల కూడా ఆయన తల్లిదండ్రులు ఊరు వదలవలసి వచ్చింది. ఐదేళ్ల దాకా సాయిబాబా మాటలతో పాటు ఆటలు నేర్చి నడక, పరుగు కూడా అనుభవించిన, పెద్దయ్యాక అనుభూతి చెందగల బాల్యం దక్కిన పేద పిల్లల వలె కలిగే ఉన్నాడు. పోలియో వల్ల ఐదో ఏట కాళ్ళు పూర్తిగా పడిపోవడమే కాక 90% అంగవైకల్యానికి గురైయ్యాయి. అంగవైకల్యం అని, వికలాంగుడు అని మామూలుగా చెప్పుకునే ఈ సమస్యలు భౌతికంగా సవాళ్లు స్వీకరించే వాళ్ళు మాత్రమే ఎదుర్కోగల ఈ సామర్థ్యాన్ని మరొకచోట వెతుక్కొని, సవాల్‌గా స్వీకరించి పదును పెట్టుకునే వాళ్ళు అనే అర్థంలో ఇవాళ సాయిబాబా తన జీవిత పోరాట ఆచరణతో రుజువు చేసాడు. ఆయన తొంభై శాతం కోల్పోయిన శరీర ఆచరణ సామర్థ్యమంతా క్రమంగా ఆయన మెదడులో వచ్చి చేరింది గనుకనే గడ్చిరోలి కోర్టు మొదలు సుప్రీంకోర్టు సెలవు రోజు కూచొని బొంబాయి హైకోర్టు విడుదల తీర్పును నిలుపుదల చేసే దాకా రాజ్యానికి అది ప్రమాదకరమనిపించింది. కానీ చిత్రంగా ఆయన మరణించి కూడా ఆ మెదడును శత్రువు చేతిలో పడనివ్వకుండా వైద్య విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా ఉపయోగపడేలా ఆసుపత్రికి తన భౌతిక కాయాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. ఇంక వలస పాలకుల పోలీసుల చేతుల్లో తన చావు తప్పదని తెలిసినప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ శత్రువు నుంచి పరిగెత్తుతూ ఒక పార్కులో చేరి ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. పోలీసులు చుట్టుముట్టారు అని తెలిసినప్పుడు శత్రువు, అందులోనూ సామ్రాజ్యవాద వలస పాలకుల తుపాకీ గుండుకు తన ఆలోచించే తల గురికాకూడదని చంద్రశేఖర్ ఆజాద్ తన పిస్టల్ తోనే నుదుటి మీద కాల్చుకొని అమరుడయ్యాడు. ఇప్పుడు అలహాబాదులో ఆ చెట్టు ఒక స్వాతంత్ర ప్రతీక అయింది. ఆ చెట్టు కింద అమరుడైన చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆజాదీకి ప్రతీక అయ్యాడు. సాయిబాబా ఇంకొక అడుగు ముందుకు వేసాడు. విడుదలయ్యాక మార్చి 7 నుంచి ఆగస్టులో హైదరాబాదుకు వచ్చేదాకా ఒక ఐదు నెలల పైగానే ఢిల్లీలో గడిపాడు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఇచ్చిన చారిత్రాత్మక ప్రసంగం తర్వాత ఆయన ఎయిమ్స్‌లో ఫిజియోథెరపీ చికిత్స చేయించుకున్నాడు. ఎందరో పాత మిత్రులను, విద్యార్థులను కలిసాడు. వాళ్లంతా ఆ ఫిజియోథెరపీ జరిగినంత కాలం ఆయనను కంటికి రెప్పలా చూసుకున్నారు. కానీ తను, తనవంటి ఆలోచనాపరులు, ఢిల్లీ యూనివర్సిటీలో సహచరులు, విద్యార్థులు, జెఎన్‌యు వాతావరణం అంతా ఆయనకు ఒయాసిసుగానే అనిపించింది. రాజ్యం ముక్కు కింద బ్రహ్మజెముడు అలుముకున్న ఎడారిలాగనిపించింది. అక్కడ తన కాలేజీలోనే చదువుకున్న తన కూతురు మంజీర, తనకోసం ఢిల్లీ కేంద్రంగా పోరాడుతున్న సహచరి వసంత కొద్దిమంది సహచరులతో ఒక ఒంటరి పోరాటం చేస్తున్నట్లుగా అనిపించింది. తన సమయమంతా,  ఫిజియోథెరపీ పోను మిగిలిన సమయాన్నంతా పది సంవత్సరాల కాలంలో తన పరిణత జ్ఞానాన్ని, చైతన్యాన్ని, ముఖ్యంగా విద్వేషపూరిత కాషాయ వాతావరణాన్ని కబీర్ ప్రేమ సందేశంతో ఎదుర్కోవాలని అందుకోసం ఎన్నో ప్రసార సాధనాల ద్వారా హిందీ, ఇంగ్లిషు భాషల్లో ప్రపంచానికి వినిపించడానికి వినియోగించాడు. అక్టోబర్ 12న ఆయన శాశ్వతంగా కన్నుమూసిన తర్వాత వసంత అయినా, తమ్ముడు రాందేవ్ అయినా, కూతురు మంజీర అయినా, మాకు ఆయనతో పట్టుమని పది నిమిషాలు మాట్లాడడానికి సమయం ఎక్కడ దొరికింది? ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు వింటూ ఆయన భౌతికంగా మా మధ్య ఉన్నాడనే తృప్తి, చికిత్స, స్వల్ప నిద్రకు పోగా మిగిలిన సమయమంతా జైల్లో ఎంతో అసాధ్యమైన ఆయన స్వరాన్ని వినగలిగామనే తృప్తితోనే గడిపారు. బహుశా ఇపుడింక ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ మళ్లీ మళ్లీ ఆయన ఇంటర్వ్యూలు వింటూ, ఆయన రచనలు చదువుతూ, ఆయన సేవ చేసిన ప్రజల మధ్యన, ఆయన వదిలి వెళ్ళిన పోరాటాన్ని కొనసాగించడానికి అంకితం కావాలి.

అప్పటికే 19 అవయవాలు వైఫల్యం – తానెక్కువ కాలం బతకలేనేమో కానీ బతకాలనే ఆకాంక్షతో వచ్చి ఆయన నిమ్స్‌లో చేరాడు. ఆసుపత్రితో సహ హైదరాబాదును ఎంతో ఆత్మీయ కలయికలతో కదిలించాడు.

తాను రెండుసార్లు జైల్లో మృత్యుముఖం నుంచి బయటపడిన వాడు. క్యాన్సర్, కోవిడ్ కలగలిసి తన తల్లి మృత్యువాతన పడినప్పుడు కడచూపుకు నోచుకోని రాజ్యం క్రూరత్వాన్ని ఢిల్లీ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఎంత కన్నీరు పెట్టించాయో విహ్వలంగా చెప్పాడు. హైదరాబాదులో తన తమ్ముని ఇంట్లో ఆ క్రూరమైన అసహాయ స్థితిని తలచుకొని గాడమైన నిశ్శబ్దంలోకి పోయాడు. ఎనిమిదిన్నర సంవత్సరాలు జైల్లో తన శరీరం ఎంత శిథిలమైందో తనకు తెలుసు. బొంబాయి హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్, భిన్నమైన సందర్భాల్లో అరుదైన న్యాయ వివేకం ప్రదర్శించి తనను నిర్దోషిగా ప్రకటించినా, నాగపూర్‌కే చెందిన, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి బెంచి మహారాష్ట్ర ప్రభుత్వం స్టే అడిగితే ఇవ్వనిరాకరించినా రాజ్యం వదలదని తనకు తెలుసు.

అందుకే ఆయన మూడు రోజులు గాల్ బ్లాడర్‌లో రాళ్ళతో భరించలేని నొప్పి అనుభవించి ఎయిమ్స్‌‌లో శస్త్ర చికిత్సకు నెలలు పట్టవచ్చునని తిరిగి నిమ్స్‌‌కు వచ్చీరాగానే శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మృత్యురూపంలోని శత్రువు ఆయనను వెంటాడి కబళించాడు. అది ఆయన ఊహించినదే.

నాకు బతకాలని ఉంది నన్ను బతికించండి అని నెల్లూరు ఆసుపత్రి ముందు గొడ్డలితో నరకబడిన గంటి ప్రసాదం, విప్లవం కోసం తనను బతికించమని కోరాడు. సాయిబాబా అట్లాగే కోరాడు కానీ ఇద్దరికీ తెలుసు రాజ్యం తమని మృత్యుముఖంలోకి తోసిగాని ఊపిరి పీల్చుకోదని –  అందుకే నిమ్స్‌లో శస్త్ర చికిత్స అయ్యాక ఆయన బతికితే చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూనే కలలు కంటూనే, నేను మరణిస్తే నా భౌతిక కాయాన్ని ఆసుపత్రికి ఇవ్వండి అన్నాడు. తన మెదడు శత్రువు చేతిలో పడకుండా విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ఎవరూ పోల్చుకోలేని రహస్యంగా నమోదయింది. చాలామంది అనుకున్నట్లు ఆయన చక్రాల బండిమీద తిరిగిన కాలం కేవలం ఎనిమిదేళ్ళే. ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగం వచ్చాక గాని 2008లో ఆయన మనం ఇప్పుడు ఒక ఇమేజరీగా ఊహించి రాసుకుంటున్న వీల్ చెయిర్ కొనలేదు. అప్పటిదాకా ఆయన చేతులతోనే దేశమంతా తిరిగాడు. త్రిచక్ర వాహనంలో కూర్చుని తిరిగాడు.  చేతులతో పాకుతూ అమలాపురంలో పదవ తరగతి దాకా చదువుకున్న సాయిబాబాకు వసంత పదవ తరగతిలో క్లాస్‌మేట్ అయింది.

ఆయన తర్వాత కాలంలో రాసుకున్నట్లు సాహిత్యం, చరిత్ర, రాజనీతి శాస్త్రం అన్నిటిని మించి తత్వశాస్త్రం ఎంతో చదువుకున్న సాయిబాబా పదో తరగతి పరీక్షల్లో లెక్కల్లో ఫెయిల్ అవుతానని భయపడ్డాడు. వసంత ఆయనకు గణితం బోధించి ఆయన నుంచి సాహిత్య పాఠాలు చెప్పించుకొనే క్రమంలో ఆమె ప్రేమ చిగురించింది.

ఈ చేతులతో నడిచే మనిషి ఆలోచనలు, చేతలు హృదయానికి ఎంత దగ్గరగా ఉన్నాయోనని ఆయన సాహచర్యాన్ని ఎంచుకున్నది. ఆయన మెట్రిక్‌లో ప్రధముడిగా వచ్చి మెడల్ పొందాడు.

అక్కడే ఇద్దరూ డిగ్రీలో చేరారు. మొన్న విడుదలై వచ్చిన సందర్భంలో ఆయన పదో తరగతిలో ఉండగా జరిగిన ఒక సంఘటనని తన జీవిత లక్ష్యాన్ని ఎట్లా నిర్ణయించిందో చెప్పాడు:

ఆయన అట్లా చేతుల మీద పాకుతూ అమలాపురంలో ఒక సభా వేదిక పక్క నుంచి వెళ్తుంటే – అది 1982 – 83 మధ్యకాలం. ఒక ఆజానుబాహుడైన స్ఫురద్రూపి. నేను ఇక్కడ ఏజెన్సీ ఆదివాసుల ప్రజల కోసం హిందీలో మాట్లాడితే తెలుగు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడట. మీరు ఇంగ్లిషు మాట్లాడితే నేను చేయగలనని దేకుతూ వెళ్ళి చెప్పాడట సాయిబాబా. అతనే బి డి శర్మ.  ఆ రోజు ఆయన ఆదివాసి పోరాటాలు, ఆ పోరాటాలను గుర్తించక తప్పని రాజ్యాంగం. వాళ్లకు కల్పించిన హక్కులు అప్పటికి ఒక ముప్పై అయిదు సంవత్సరాలుగా  ఉల్లంఘనకు గురయినంతగా అమలుకు రాలేదన్న విషయము, అవి బయటికి తన నోట తెలుగు మాటలుగా ఎట్లా ప్రజలకు చేరాయో, అట్లా సాయిబాబాకు ఒక కొత్త రక్తాన్ని ట్రాన్స్‌‌ఫ్యూజ్  చేసుకుంటున్నట్లుగా తనలోకి ప్రవహించాయి. ఆశ్చర్యమేమంటే అప్పుడు పరిచయమై మళ్లీ ఎఐపిఆర్‌ఎఫ్ ఏర్పడేదాకా 95, 97 దాకా కలిసే అవకాశం రాని   బి డి శర్మ, సాయిబాబా జైలుకు పోయే దాకా ఆయన వేలు విడువలేదు. 2014 జనవరి సంక్రాంతి రోజులు మహారాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ ఢిల్లీ పోలీసులు రెయిడ్ చేసినప్పుడు ఆ వార్త తెలిసి యూనివర్సిటీలోని హాస్టల్స్ గ్వైర్ హాల్‌లోని ఆయన క్వార్టర్ వరండాలో ఉద్విగ్న క్షణాలతో గడిపిన వారిలో అరుంధతి రాయ్, బి డి శర్మ ఉన్నారు.

అప్పుడు చేసిన ఆరోపణ – తిరగవేస్తే అది రాజ్యం మీద చేయవలసిన ఆరోపణ – అహిరిలో ఒక దొంగతనం జరిగింది. దాని బరామతు కోసం, జఫ్తు కోసం వచ్చామన్నారు. ఆయన దగ్గర దొరికిన ఎర్ర అట్టల సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలలో ఆ చోరికి సంబంధించిన సమాచారం ఉందని ఆరోపించారు.

1980లో అమరుడు పెద్ది శంకర్ మొయిన్‌బిన్ పేటలో ఎన్కౌంటర్ అయినప్పటి నుంచి బయట ప్రపంచానికి 1984 కమలాపూర్ రైతు కూలీ సభల దాకా, ఆ తర్వాత 2014లో సాయిబాబా అరెస్టు దాకా చెప్తున్న విషయం అదే. అహిరిలోనే కాదు, గడ్చిరోలీలోనే కాదు, మధ్య, తూర్పు భారతాల్లోని అడవిలో కార్పొరేట్ కంపెనీలు, వాళ్ళ దళారీలు చేస్తున్న ప్రకృతి సంపద దోపిడీలు, అది ప్రపంచమంతా చెప్పి చైతన్యం కలిగించే పనియే సాయిబాబా చేసాడు. అప్పటిదాకా మధ్యభారతంలోని ముఖ్యంగా నాగపూర్, అదిలాబాద్ అడవుల నుంచి అరెస్టయి జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల వైపు వాదించిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఆయన సహచర న్యాయవాదులు వాదించారు. 2017 మే 9వ తేదీన నిర్దోషిగా విడుదలవుతానని రమ్మంటే ఢిల్లీలో పధ్నాలుగు నెలల బెయిల్ మీద చికిత్స చేయించుకుంటున్న సాయిబాబా, హైదరాబాదు కేర్ ఆసుపత్రిలో చేరి సోమరాజు గారి దగ్గర హృద్రోగ చికిత్స చేయించుకోవచ్చునని వచ్చాడు. 1982 నుంచి గడ్చిరోలి జిల్లాలో జరిగిన హింసకు, విధ్వంసానికి అంతటికి సాయిబాబా ఆలోచనలే కారణమని, ఆయన మెదడున్న తలను తొలగించే న్యాయ వివేచన చేయకుండా యుఎపిఎ వంటి చట్టం కూడ తన చేతులను కట్టివేసిందని సెషన్స్ జడ్జి చింతిస్తూ ఆయనకు, సహముద్దాయిలు నలుగురికి యావజ్జీవ ఖైదు శిక్ష విధించి, విజయ్ టిర్కీకి పది సంవత్సరాల శిక్ష వేసాడు.

పదో తరగతి తన ఆలోచనలు ఆదివాసుల అడవుల్లో వీచే గాలులలో పరిమళించడం ఆరంభమైతే అమలాపురం కాలేజీలో సాయిబాబాకు తెలుగు లెక్చరర్ కొల్లూరి సత్యనారాయణ (ఎక్స్‌రే సాహిత్య పత్రిక సంపాదకుడు) విప్లవ సాహిత్య పరిచయం చేసాడు. రాడికల్ విద్యార్థుల భావనలను పరిచయం చేసాడు. ఇంక సాయిబాబా ఆలోచనా ప్రపంచం విస్తరించింది. సృజన- ఎక్స్‌రే సాహిత్య పత్రికకు ఎక్చేంజ్ కాపీగానే కాకుండా అమలాపురంలో, తూర్పు గోదావరి జిల్లా సాహిత్యాభిమానుల కోసం కొల్లూరి సత్యనారాయణగారికే వెళ్ళేది. అట్లాగే విరసం సాహిత్యం కూడా. అందుకే డిగ్రీ పూర్తి అయ్యాక కొంత కాలం ఉద్యోగం కూడ చేసిన సాయిబాబా ఎం.ఎ ఇంగ్లిషులో హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో సీటు రాగానే రెక్కలు కట్టుకుని హైదరాబాదులో వాలాడు. ఎన్నడూ అమలాపురం వదిలి జిల్లా కేంద్రానికి కూడ వెళ్లని సాయిబాబా ఎం.ఎ ఇంగ్లిషులో చేరడానికి హైదరాబాదుకు చేసిన రైలు ప్రయాణం గురించి వసంత తమ ముప్పైయవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబాకు నాగపూర్‌కు రాసిన సుదీర్ఘ  ఉత్తరంలో ప్రస్తావించింది. పదవ తరగతి అయిపోయి, డిగ్రీ చేసినంత కాలం వాళ్ళు రాసుకున్న ప్రేమలేఖలు, హైదరాబాదు ప్రయాణంతో సహా, హైదరాబాదు సామాజిక సంచలనం గురించి రాసిన లేఖలు వసంతను కూడా తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి హైదరాబాదుకు వచ్చేలా చేసినవి.

ఇంక అప్పటికి తల్లిదండ్రులు భూమిలేని నిరుపేదలు మాత్రమే కాదు, వ్యవసాయ కూలీలు కూడా కాదు. కనుక సాయి బాబా తల్లిదండ్రులను, తమ్ముడు రాందేవ్‌ను, తమ ఇద్దరి మధ్యన పుట్టిన భవానీని కూడ తీసుకొని హైదరాబాదు చేరుకున్నాడు. ఇటువంటి వలస సాహసాలు జీవితమంతా సాయిబాబా చేసిన దృష్టాంతాలు ఎన్నో పేర్కొనవచ్చు. 1996లో ఆయన ఢిల్లీకి అట్లానే వెళ్ళాడు.

ఆయన డిగ్రీ పూర్తయి ఉద్యోగం చేసిన కాలం డిగ్రీ చదివిన కాలమంతా ఆంధ్రప్రదేశ్ 1985-89  ఆట, మాట, పాట బందయిన కాలం. ఆయన అమితంగా ప్రేమించిన, తనను ఏకలవ్యుని వలె భావించిన ఆర్ఎస్‌యు ఉజ్వల త్యాగాలు, అమరత్వాల చరిత్ర రచించి పీపుల్స్ వార్ పార్టీతో పాటు అప్రకటిత నిషేధానికి గురయి ఆట, మాట, పాట బందైన కాలం. ఆ కాలమంతా ఆయన ఏం ఆలోచించాడో, ఏ సంఘర్షణలు మనసులో  చెలరేగాయో కానీ హైదరాబాదులో సాపేక్ష ప్రజా సంచలనాలు ఉక్కపోత నుంచి, ఉక్కుబూట్ల అణచివేతల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్న కాలం, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలో ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ విప్లవాత్మకంగా ఆలోచిస్తున్న కాలం. ఆ విశాలమైన క్యాంపస్, అక్కడి లైబ్రరీ, అక్కడ తన సహ విద్యార్థులు, ప్రతిభాశాలురు, బంగారు పతకాలు పొందగలవారయి కూడ బూర్జువా చదువులను ప్రశ్నిస్తున్న కాలం.  

అదే కాలం – నిర్బంధం నుంచి అజ్ఞాత జీవితం ఎంచుకున్న జననాట్యమండలి, బృందం నుంచి దాని నాయకుడు గద్దర్ అయిదేళ్ల అజ్ఞాత జీవితం నుంచి బయటికి వచ్చిన కాలం కూడ. మూడు చక్రాల బండిమీద స్టేజి వెనుకకు వచ్చి, సహ విద్యార్థుల సహాయంతో వేదిక ఎక్కి వచ్చి గద్దర్‌ను చూడాలని, ఆయన కరస్పర్శ చేయాలనే ఆకాంక్షలను తీర్చుకున్నాడు. అక్కడే ఆ సభకు అధ్యక్షత వహించిన రైతు కూలీ సంఘం నర్సన్నతో, సుభాష్ నగర్, అల్వాల్, వెంకటాపురంకు చెందిన ఎందరితోనో పరిచయం.

 ఇంక మర్నాటి నుంచి జననాట్యమండలి, విరసం, హైదరాబాదులో మరో రెండేళ్ల పాటు పనిచేసిన రాడికల్ విద్యార్థి సంఘం నాయకత్వంతో పరిచయం చదువు మీద ఉన్న వ్యసనం కంటే వ్యగ్రత వల్లనే మొదట మహాబోధి పాఠశాల నిర్వహణలో వసంతను టీచర్‌గా చేర్చి విద్యా బోధనలో తనకున్న విప్లవాత్మక సంస్కరణలన్నీ ప్రవేశపెట్టాలనుకున్నాడు. కాని 90-91 కాలమంతా ఒకవైపు అద్వానీ రథయాత్రలు -రామ జన్మభూమి కోసం బాబ్రీ మసీదు విధ్వంసం కోసం బహిరంగ కుట్రలు – ఒక మాటలో కాషాయీకరణ ప్రయత్నాలు, మరొకవైపు వి. పి. సింగ్ ప్రధానిగా మండల్ కమిషన్ సూచనలు అమలు చేయాలని దళిత, బహుజన ఉద్యమాలే కాకుండా ఆర్‌ఎస్‌యు ఒక్కటే వామపక్ష, విప్లవ భావాలు గల విద్యార్థి సంఘాలనుంచి ముందుకు వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే చదువుకున్న దామోదర్ రెడ్డి, పూర్తి కాలం విప్లవోద్యమంలోకి వెళ్లి హైదరాబాదు నగర విప్లవ నిర్మాణాన్ని, ఉద్యమాన్ని చూస్తున్న రోజులు అవి.  1997లో ఎన్‌కౌంటర్‌లో తన సహ కామ్రేడ్స్‌తో పాటు అమరుడయ్యే నాటికి సంజీవ్ పేరుతో దక్షిణ తెలంగాణ కార్యదర్శిగా ఉన్నాడు. ఆర్‌ఎస్‌యు నిర్మాణాన్ని సెంట్రల్ యూనివర్సిటీలో మంజీర (రవికుమార్) ఉస్మానియా యూనివర్సిటీలో వీరన్న, వీరారెడ్డి చూస్తున్నారు. హైదరాబాద్ పీపుల్స్ వార్ కార్యదర్శి ఆర్‌టిసి కండక్టర్ రామేశ్వర్ – సురేష్ అనే పేరుతో ఉద్యోగం వదిలి వృత్తి విప్లవకారుడయ్యాడు. అటు ఎం.ఎ లో కేంద్ర విశ్వవిద్యాలయంలో గానీ తర్వాత పిజి డిప్లమా చేసిన ఇఫ్లూలో గాని ఉన్న వాతావరణం క్యాంపస్‌లకే పరిమితం కాలేదు.

తమ తల్లిదండ్రులు, కుటుంబంతో ఉన్న అడిక్‌మెట్, సీతాఫల్‌మండి, ఎక్కడ చూసినా అక్కడ విప్లవగాలులు వీస్తున్న వాతావరణం. అడిక్‌మెట్ నుంచి బాగ్ లింగంపల్లి నుంచి ఆర్ఎస్‌యు, విరసం సభ్యులతో సాన్నిహిత్యం, అలిశెట్టి ప్రభాకర్ దగ్గరికి పోతే అక్కడ బెయిల్ మీద ఉన్న సూర్యం గారి పరిచయం ఇంక సాయిబాబా మంచినీటికి చేప ఎక్కినట్లుగా ఆయనకు కావల్సిన స్వేఛ్ఛా వాతావరణాన్ని చూసుకున్నాడు, అందులో ప్రవేశించాడు. సరిగ్గా 1991లో గ్లోబలీకరణ (ప్రపంచీకరణ), 92లో బాబ్రీ మసీదు విధ్వంసం, కార్పొరేటు కాషాయల  మిలాఖత్తు కాలంలో సాయిబాబా మనుస్మృతికి వ్యతిరేకంగా మానవ స్మృతి రచించే విప్లవ ప్రజాస్వామిక వాతావరణంలోకి వచ్చాడు.      

విరసం సభ్యత్వం తీసుకున్నాడు. మొదట్లో కవితలు రాసాడు. ఇఫ్లులో పిజి  డిప్లొమా చేస్తున్న కాలంలోనే 1991 మార్చి 7న వసంతతో విరసం ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం చేసుకున్నాడు.

నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో కమండల్ వర్సెస్ మండల్ అని అగ్నివేశ్‌ను పిలిచి నిర్వహించిన వేలాది మంది విప్లవాభిమానుల సభ. బాబ్రీ మసీదు విధ్వంసానికి వ్యతిరేకంగా, మండల్ కమిషన్ సిఫారసుల అమలు కోసం ఇచ్చిన బంద్ విజయవంతం చేయడం మొదలు అంతర్జాతీయ రాజకీయాలకు కూడ స్పందించింది అప్పుడు ఆర్ఎస్‌యు. ముఖ్యంగా 1990 మే 20న బాగ్దాద్‌పై అమెరికా బాంబు వేసినపుడు నిరసన తెలుపుతూ సామ్రాజ్యవాద వ్యతిరేక వేదిక నిర్మాణం చేసి ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా లా కాలేజి విద్యార్థుల చొరవతో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో స్ట్రీట్ ప్లేలు (వీధి నాటకాలు) వేసి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కదిలిన విద్యార్థులతో పాటు నేపథ్యంలో ఆయన ఉన్నాడు. సాయిబాబా తన నుంచి, తన ఇంటి నుంచి విప్లవాచరణ మొదలు పెట్టాడు. అట్లా 1990-95 మధ్య కాలంలో ఆయన, ఇల్లు, కుటుంబం విప్లవోద్యమ కేంద్రాలయినవి. విప్లవోద్యమంలో పూర్తి కాలం పని చేయడానికి ఆయన చెల్లెలు భవానీ సంసిద్ధురాలయింది. సాయిబాబా వలె కాకుండా ఆమె చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా పనిలో ఉంటూ మహిళా సంఘాలలో కన్నా విప్లవ నిర్మాణంలోకి వెళ్లడానికి నిశ్చయించుకుని అజ్ఞాత జీవితానికి వెళ్లి నగర కార్యదర్శి సురేశ్ (హయత్‌నగర్ దళిత కుటుంబం నుంచి వచ్చిన రామేశ్వర్) సాహచర్యాన్ని ఎంచుకున్నది. 1997 జనవరి సంక్రాంతి రోజు హైదరాబాదు పాత బస్తీలో సురేశ్‌ను, మజ్జిగ రాజు అనే మరో నగర పార్టీ సభ్యుడిని అరెస్టు చేసి మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లో ఆ ఇద్దరిని కాల్చి వేయడంతో దక్షిణ తెలంగాణ జిల్లాల ఎన్‌కౌంటర్ల పరంపర ప్రారంభమైంది. ఆ నాటికే సాయిబాబా ఢిల్లీకి కూడా మారాడు గనుక ఆ విషయాలు అలా ఉంచి, ఆ తర్వాత కాలంలో నిర్బంధం మళ్ళా పెరిగి నలగొండ జిల్లా పీపుల్స్‌‌వార్ దళంలో పనిచేస్తున్న భవాని కూడా 2000 సంవత్సరంలో ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు కామ్రేడ్స్‌‌తో పాటు అమరురాలు అయింది. తల్లి సూర్యవతమ్మ, సాయిబాబా మరింత దృఢదీక్షతో విప్లవోద్యమంలో పనిచేయడానికి భవానీ త్యాగం ఒక తీవ్రమైన రక్తస్పర్శ అనుభవమయింది.

1992 మేలో కలకత్తాలో అఖిలభారత విప్లవ ప్రజా ప్రతిఘటన వేదిక ఆవిర్భవించింది. 1991లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, 92లో బాబ్రీ మసీదు విధ్వంసాల తర్వాత సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, విధ్వంసపూర్వక అభివృద్ధి నమూనాను, దానికి తైనాతిగా పనిచేస్తున్న బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రతిఘటించి ప్రచారం చేయడానికి ఏర్పడిన మిలిటెంటు ప్రజా సంస్థ, ఆలిండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (ఎఐ‌పి‌ఆర్‌ఎఫ్) గోరు మాధవరావు అధ్యక్షుడుగా, బీహార్‌కు చెందిన విజయకుమార్ ఆర్య ప్రధాన కార్యదర్శిగా ఏర్పడి అఖిల భారత స్థాయిలోనేకాకుండా అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో నిర్మాణమవుతూ వచ్చింది. అప్పటికింకా దేశవ్యాప్తంగా నూతన ప్రజాస్వామిక విప్లవంలో ప్రధాన పోరాట రూపమైన సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశంలోని పీపుల్స్‌వార్, ఉత్తర భారతదేశంలోని బీహార్, బెంగాల్ మొదలు ఢిల్లీ, పంజాబ్‌ల వరకు  పనిచేస్తున్న సిపిఐ (ఎంఎల్) పార్టీ యూనిటీ, ఎంసిసి పార్టీల భావజాలంతో ప్రజాసంస్థల్లో పనిచేస్తున్న బుద్ధి జీవులు 1983 నుంచే ఎఐఎల్‌ఆర్‌సిలో (అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమితి)లో పనిచేస్తున్నారు. అది ప్రధానంగా రచయితల, కళాకారుల, సాంస్కృతిక కార్యకర్తల లీగ్.

ఈ భావజాలపు నిర్మాణంలోని బుద్ధి జీవులందరూ ఎం‌ఎల్‌ఎం ప్రాపంచిక దృక్పథాన్ని ఆమోదిస్తూ ఎఐపిఆర్ఎఫ్‌లో చేరారు. ఆ కృషి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడానికి సాయిబాబా, పున్నారావు వంటి విప్లవ కార్యకర్తలకు చేతినిండా పని వచ్చిన కాలం.

చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు సిఇఒగా ప్రకటించుకున్న కాలం. ఈ కాలం  ఒకవైపు సామ్రాజ్యవాద ప్రపంచీకరణను, ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే పనిచేయడం లక్ష్య ప్రకటనగా ఎన్‌టిఆర్‌ను పడగొట్టి వచ్చిన కాలమయితే మరొకవైపు పీపుల్స్‌‌వార్ స్పెషల్ కాన్ఫరెన్స్ ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక అభివృద్ధి నమూనాను అమలు చేయడానికి గ్రామ రాజ్య కమిటీలు నిర్మాణం చేసిన కాలం. ఈ రెండు పరస్పర భిన్నమైన అభివృద్ధి నమూనాల మధ్య సంఘర్షణ కగార్ అంతిమ యుద్ధం ప్రకటించిన కాలంలో జనతన రాజ్య కేంద్రంగా దండకారణ్య విప్లవం తీవ్రమైన రాజ్య హింస కాలంలో సాయిబాబా ఒక విప్లవ మానవుడుగా అమరుడు కావడం ఫాసిస్టు వ్యతిరేక విశాల ఐక్య సంఘటన నిర్మాణం చేసే కాలంలో విప్లవ ప్రజాపంథాకు తట్టుకోలేని ఎదురుదెబ్బ. ఆయన ఈ కర్తవ్య నిర్వహణ కొరకు 1996 ఫిబ్రవరిలో ఢిల్లీకి మారకముందు ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ప్రధానమైన పోరాటాలు – 1995లో ఆయన ఏఐపిఆర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. సరిగ్గా అదే కాలంలో 1994 డిసెంబర్ నుంచి 95 మార్చి దాకా అంటే ఎన్‌టిఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయిన కాలంలో జైల్లో రాజకీయ ఖైదీలు, జీవిత ఖైదీలు పీపుల్స్‌‌వార్ నాయకులు శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డి, మోడెం బాలకృష్ణల నాయకత్వంలో చేపట్టిన ప్రజాస్వామిక సంస్కరణల కోసం, రాజకీయ ఖైదీల, లైఫర్ల విడుదల కోసం బయట కలిసి వచ్చే అన్ని ప్రజాసంఘాలను కలుపుకొని మూడు నెలల పాటు సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి దగ్గర అప్పుడు ఇఫ్లూలో చదువుతున్న అంధ విద్యార్థి పవన్‌తోపాటు నాయకత్వం వహించి శిబిరం నిర్వహించి నాలుగు వందల మంది లైఫర్లు విడుదల కావడానికి, రాజకీయ ఖైదీలు లైఫర్లు పెట్టిన 41 డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించడానికి నాయకత్వం వహించాడు. ప్రభుత్వంతో జరిగిన ఈ ఒప్పందంపై సంతకం చేసిన అమరులు ఎమ్.టి ఖాన్‌, కె. జి కన్నబిరన్‌లను కూడా ఈ సందర్భంలో స్మరించుకోవాలి.

చంద్రబాబు నాయుడు 1995 ఆగస్టు వైస్రాయ్ హోటల్ కుట్ర ద్వారా ఎన్‌టిఆర్‌ను పడగొట్టి, ఎన్‌టిఆర్‌ తాత్కాలికంగా తొలగించిన పీపుల్స్‌వార్ పార్టీపై నిషేధాన్ని పునరుద్ధరించాడు. అట్లాగే సారాపై నిషేధాన్ని ఎత్తివేశాడు. రూపాయి కిలో బియ్యం మొదలు అన్ని సబ్సిడీలు రద్దు చేసాడు.

అప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో, ముఖ్యంగా కేంద్రంగా వున్న హైదరాబాదులో సబ్సిడీలను పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు, ముఖ్యంగా చైతన్య మహిళా సంఘం వంటి సంఘాలు సాయిబాబా నాయకత్వంలో జరిగిన పోరాటాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాయి.

ఈ వాతావరణంలో హైదరాబాదులో ఎఐపిఆర్ఎఫ్ రాష్ట్ర మహాసభలు నిర్వహించి, అంతర్జాతీయ సదస్సు 1992-96 మధ్యన సాయిబాబా నాయకత్వంలో చేపట్టిన ప్రజా పోరాటాలకు అన్ని ప్రజా సంఘాలకు కేంద్ర స్థానంలో, నాయకత్వ స్థానంలో సాయిబాబా, పున్నారావులు ఉన్నారు. అయితే సాయిబాబా జాతీయ ప్రస్థానంలో యిది తొలిమెట్టు మాత్రమే.

ఏఐపిఆర్ఎఫ్ ఢిల్లీలో జాతి విముక్తి పోరాటాలపై 1996 ఫిబ్రవరిలో నిర్వహించినప్పుడు సాయి, వసంతలు ఒక టైపు రైటర్ తీసుకొని ఢిల్లీకి వచ్చేసారు. అప్పుడు ఆ నిర్వహణ కోసం ఏర్పడిన కమిటీకి అప్పటిదాకా ఢిల్లీలో జెఎన్‌యులో జాతి-వర్ణంపై ఎమ్‌ఫిల్ చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేస్తూ ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ కలం పత్రికలో పనిచేస్తూ ఉండిన నవీన్ బాబు అప్పటికే కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్ (అప్పటికింకా మధ్యప్రదేశ్‌లో భాగం), ఝార్ఖండ్ (అప్పటికింకా బీహార్‌లో భాగం), తెలంగాణ వంటి ప్రాంతాలు ఏఐఆర్ఎస్‌ఎఫ్ విద్యార్థిగా విప్లవోద్యమ కర్తవ్యాల్లో తిరిగి వున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే తనకంటే చిన్నవాడు అయినా నవీన్‌బాబు కర్తవ్యాన్ని ఆయన వృత్తి విప్లవకారుడుగా కూడా మారాక సాయి స్వీకరించాడు. ఆ రెండు రోజుల సదస్సుకు సంబంధించిన టైపింగ్ పని అంతా చేసాడు. విదేశాల నుంచి వచ్చిన విలియం హింటన్, గూగి వా థియాంగో, ఫిలిప్పైన్స్, యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సుదీర్ఘ చర్చల్లో పాల్గొన్నాడు. ఇంక ఢిల్లీలోనే ఉండిపోవడానికి నిర్ణయం తీసుకొని ప్రీతంపురలో ఇల్లు తీసుకొని, జైలు పోరాటం ద్వారా విడుదలైన, అమరుడు శాఖమూరి అప్పారావు ప్రభావంతో విప్లవద్యమంలోకి వచ్చి పనిచేయడానికి సిద్ధపడిన కేరళకు చెందిన గోవిందన్ కుట్టి సహాయంతో ఎఐపిఆర్‌ఎఫ్ ఆఫీస్ తెరిచాడు. 1997లో ఎఐపిఆర్‌ఎఫ్ అఖిల భారత కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించాలి. ఒకటి సైద్ధాంతికంగా ఎఐపిఆర్ఎఫ్ ఎదుర్కొన్న సంక్షోభం- నష్టం. రెండు ఈ నిర్ణయంతో సాయిబాబా కార్యదర్శిగా పనిచేయడానికి తీసుకున్న నిర్మాణానికి సంబంధించిన అనుకూలాంశం. అప్పటివరకు ఎఐపిఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయ్ కుమార్ ఆర్య, ఎంసిసి రాజకీయాలకు నిబద్ధులైన కమిటీ సభ్యులు ఆ తర్వాత రానున్న ఎన్నికల్లో పీపుల్స్‌‌వార్ పాల్గొనబోతున్నదని, కనుక పార్లమెంటరీ విధానాన్ని నిరాకరించడమే కాదు, ఎన్నికల బహిష్కరణకు ఎఐపిఆర్ఎఫ్ పిలుపు ఇవ్వాలని షరతు పెట్టారు. అప్పటికి ఎఐపిఆర్ఎఫ్ వైఖరి ఎన్నికల బూటకత్వాన్ని బట్టబయలు చేయడానికి ప్రచారం చేయడం, సాహిత్యం తేవడం మాత్రమే. సదస్సుకు ముందు జరిగిన చర్చలో ఈ విషయంలో ఏకీభావం కుదరలేదు. సదస్సు వరకు వేచి ఉండి రెండవ రోజు బహిరంగ సభలో ‘నక్సల్బరీ ఏక్ హీ రాస్తా’,  ‘బూటకపు ఎన్నికలను బహిష్కరించండి’ అని నినాదాలు ఇస్తూ ముగింపు కన్నా ముందే వెళ్లిపోయారు.

ఆ సదస్సుకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా ఎంతో ఉత్సాహంతో నిర్వహించిన ప్రొఫెసర్ మనోరంజన్ మొహంతీ నవీన్ బాబు నాయకత్వంలో పనిచేసిన ఈ కమిటీని, ఎఐపిఆర్ఎఫ్ నాయకులను భోజనానికి పిలిచి ఈ కమిటీ ఢిల్లీ కేంద్రంగా జాతుల విముక్తి పోరాటాలకు దోహదం చేయాలని ఆశించాడు. ఆ ప్రతిపాదన పెట్టాడు కూడా. ఎందుకంటే అప్పటికి వాళ్ళందరూ నలభైలు మించని యువకులు. కానీ నవీన్ బాబు ఆ తర్వాత అజ్ఞాత జీవితానికి వెళ్లి పార్టీ మిలిటరీ పత్రిక జంగ్‌లో పనిచేసిన తూర్పుగోదావరి ఏజెన్సీలో అడ్డతీగల పోలీసు స్టేషన్‌పై జరిగిన దాడిలో కె. సత్యనారాయణ నాయకత్వంలో పాల్గొని, అటునుంచి పోలీసు కాల్పుల్లో ఆయనతో పాటే అమరుడయ్యాడు. అది గుర్తు తెలియని నక్సలైట్ శవంగా పోలీసులే దహనం చేయడం నావంటి వాణ్ణి ఇప్పటికీ అపరాధ భావానికి గురిచేయడంతో పాటు ఆయన అడుగుజాడల్లో ఆ బాధ్యతలు సాయి చేపట్టడం విప్లవోద్యమం నిరంతర స్రవంతికి, దార్శనికతకు, సృజనాత్మకతకు ఒక దృష్టాంతం.

సాయి ఎంఫిల్, పిజి డిప్లమా అయిపోయాక తన కుటుంబ పోషణకు ఉద్యోగ ప్రయత్నాలు చేసి మొదట కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఉద్యోగం పొంది, కొద్ది రోజుల్లోనే హైదరాబాదులోని ప్రింటింగ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కాలేజీకి ఇంగ్లిషు లెక్చరర్‌గా బదిలీ అయ్యాడు. రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసాడు. ఢిల్లీలో ఎఐపిఆర్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు 97 లో చేపట్టగానే ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఒక లేఖ రాసాడు. అది ఒక రాజకీయ ప్రకటన. అటువంటి రాజీనామా ప్రకటన తమిళనాడులో పీపుల్స్‌‌వార్ పార్టీలో చేరినప్పుడు అందాకా ప్రభుత్వ శాఖలో ఇంజనీరుగా పనిచేసిన రవీంద్రన్ మాత్రమే చేసి ఉన్నాడు. ఆ కామ్రేడ్ తర్వాత ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. ఆదివాసుల కోసమే మాట్లాడి, రాసి, పోరాడినందుకే కదా జీవితఖైదు పడి పదేళ్ళు దుర్భర జైలు శిక్షననుభవించారు. మళ్ళీ ఆదివాసుల గురించే ఎందుకు మాట్లాడుతున్నారంటే, అది మనిషినయినందుకు నా బాధ్యత, ప్రతి నాగరికుడి (సివిలైజ్డ్ పర్సన్) బాధ్యత అని కూడా నేను భావిస్తాను అన్నాడు సాయి. ఆ లేఖ కూడ అటువంటి స్పిరిట్‌తో రాసిందే (అయితే ఆదివాసుల గురించి మాట్లాడడానికేమో గానీ ఆదివాసుల కోసం పోరాడడానికి మాత్రం ప్రతి నాగరికుడు మావోయిస్టు పార్టీ వలె అన్‌లర్నింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళి సభ్య సమాజం భావించే అనాగరిక ఆదివాసులు కావాలి.)     

ఎఐపిఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ప్రత్యేక తెలంగాణ కోసం సూర్యాపేట, బోనగిరిలలో సభలు జరిగాయి. బోనగిరి సభను నిర్వహించిన వాళ్లలో పీపుల్స్‌‌వార్ సభ్యులు ఉన్నారు. సానుభూతిపరులు ఉన్నారు. కె.ఎస్ నాయకత్వంలో 1968 నుంచే ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సామ్రాజ్యవాద అసమ అభివృద్ధి పర్‌స్పెక్టివ్‌తో ప్రతిఘటించడంలో భాగంగా బలపరిచింది. చేపట్టింది. సూర్యాపేట సభ ఇండియా బహుళ జన కులాల, జాతుల సమాఖ్యగా భావించి పార్టీ ఏర్పాటు చేసిన మారోజు వీరన్న అనుయాయులు ఏర్పాటు చేసారు. కేశవరావ్ జాదవ్ పాల్గొన్నాడు. రెండు చోట్లా గద్దర్ పాల్గొన్నాడు. జయశంకర్ పాల్గొన్నాడు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టవలసింది గనుక ఇది అఖిల భారత స్థాయిలో ప్రచారం చేసి నిర్వహించవలసిందని భావించి ఆ బాధ్యత చేపట్టినవాడు ఎఐపిఆర్ఎఫ్ కార్యదర్శిగా సాయిబాబా. ఆ సూచన చేసినవాడు అప్పుడు మధుగా తెలిసిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజకుమార్.

ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సు 1997 డిసెంబర్ 27, 28 తేదీల్లో వరంగల్ ములుగు రోడ్డు దగ్గర ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో జరిగింది. అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి విశాలమైన ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ (హనుమకొండ)లో రెండున్నర లక్షల మందితో అపూర్వంగా జరిగింది. ఈ సభ నిర్వహిస్తే సభా వేదిక కింద బాంబులు పెట్టి పేలుస్తాం అని ప్రభుత్వ మాఫియా గ్యాంగ్ నాయకుడు నయీమ్ హెచ్చరికను సవాలుగా స్వీకరించి కాళోజి మొదట వేదిక మీదికి వెళ్లి ‘నేను వచ్చాను పేల్చండి’ అని ప్రసంగం ప్రారంభించాడు. ఇక్కడే వరంగల్ డిక్లరేషన్ ప్రకటించబడింది.

అప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో రాజమండ్రి మొదలు ఏటూరు నాగారం, పస్రా, లక్సెట్టిపేట జన్నారంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఆంధ్ర అగ్రకుల, ముఖ్యంగా కమ్మ సెటిలర్స్ గురించి, తెలంగాణ మైదాన ప్రాంతాల్లో 1800 గ్రామాల్లో గుంటూరు పల్లెలకు సంబంధించిన సెటిలర్స్ గురించి ప్రొఫెసర్ జనార్ధన్ పిహెచ్‌డి కోసం రీసెర్చ్ చేసి ఉన్నాడు. ఆ పర్స్పెక్టివ్‌తోనే ఆయన ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాంతకంగా పనిచేసి అమరుడయ్యాడు. జయశంకర్ నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ కావాలని మాట్లాడాడు. జనార్ధన్ తాను రీసెర్చ్ చేసిన అంశంపైనా, నిన్న, నేడు, రేపు –తెలంగాణ కీలక పత్రంపై వివి ప్రసంగం చేశారు.

ఆ సంవత్సరమే ఏర్పడిన ప్రజా కళా మండలి బాధ్యుడు ప్రభాకర్ నాయకత్వంలో ‘తెలంగాణ లొల్లి’ పేరుతో తెచ్చిన క్యాసెట్‌లోనే సిద్ధారెడ్డి బహుళ ప్రచారమైన పాట ‘నాగేటి చాళ్ళల్లో నా తెలంగాణ’ ఉన్నది.

ఈ సదస్సు ఆకుల భూమయ్య నాయకత్వంలోనే ఏర్పడి ఉండవలసిన తెలంగాణ జన సభ – అందులో ఆయన, ఇతర అధ్యాపక నాయకులు చేరడానికి డిటిఎఫ్ ఆమోదం కొరకు వాయిదా పడింది.

1997 ఏప్రిల్ 6న గద్దర్ మీద హత్యా ప్రయత్నం మృతదేహాల స్వాధీన కమిటీ కన్వీనర్‌గా, ఎస్‌సి వర్గీకరణ (మాదిగ దండోరాను బలపరుస్తూ) ఐక్య కమిటీకి చైర్మన్‌గా ఉండడమే కాకుండా బోనగిరి సభ నుంచే ప్రత్యేక తెలంగాణ కోసం పిలుపు ఇచ్చాడు గనుకనే జరిగిందని అందరికీ తెలుసు. ఆయన తన వెన్నుపూస బొక్క దగ్గర మిగిలిన తూటా వల్ల వస్తున్న నొప్పి గురించి ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్‌లో చికిత్స పొంది, అటు నుంచి పంజాబ్‌లో అక్కడి కళాకారులకు సాంస్కృతిక శిక్షణ ఇవ్వడానికి వెళ్లి ఈ సభల్లో పాల్గొనడానికే నేరుగా వరంగల్‌కు ‘పాటనై వస్తున్నానమ్మా’ అంటూ, ఆ తర్వాత బహుళ ప్రచారమైన పాటతో వచ్చాడు.

ఆ సాంస్కృతిక శిబిరంలోనే రాత్రి మూత్రానికి బయటికి పోయిన జననాట్యమండలి డోలక్ దయానంద్‌ను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కిడ్నాప్ చేసి చంపేసి హైదరాబాద్ పరిసరాల్లో తెచ్చి శవాన్ని వదిలేసారు. ఈ వార్త తెలిసిన విషాదంతో మర్నాడు కంటోన్మెంట్‌కి వెళ్లి విప్లవ జోహార్లతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సులో రూపొందించిన ‘వరంగల్ డిక్లరేషన్’ను బహిరంగ సభలో ప్రకటించారు.  ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కోసం పనిచేసిన ఎవరికైనా, చివరకు బూర్జువా పార్టీ మాత్రమే కాదు, పదేళ్ళ ఆచరణలో సామ్రాజ్యవాదం దళారి దొరల పార్టీగా ప్రజలు తిరస్కరించిన బిఆర్‌ఎస్‌గా మారిన టిఆర్‌ఎస్‌కు కూడా ఇదే దిక్కయింది. (తుపాకి మినహా నేను మావోయిస్టు పార్టీ ఎజెండానే అమలు చేస్తానన్న’ కెసిఆర్ ప్రగల్భాలు కూడ ప్రజల్ని మోసం చేయడానికే.)

ఈ సదస్సు నాటికి వరంగల్ జిల్లాలో, ముఖ్యంగా పరకాల, చిట్యాల మండలాల్లో వ్యాపార పంటలు వేసి, ముఖ్యంగా తొంభై శాతం పత్తి పంట వేసిన రైతులు మార్కెట్‌లో దగా పడి ఆత్మహత్యలు వరుసగా చేసుకున్నారు. ఈ రెండు మండలాలు పీపుల్స్‌‌వార్ పార్టీకి చాలా బలమున్న ప్రాంతాలు. మొగిలిచెర్లలో పుట్టి ఆ ఊరికి సర్పంచ్‌గా కూడా చేసిన పి. సుదర్శన్ రెడ్డి వరంగల్ రైతు కూలీ సంఘం సభల ద్వారా మళ్ళీ పార్టీ అజ్ఞాత జీవితాన్ని ఎంచుకొని వరంగల్ జిల్లా కార్యదర్శిగా ప్రజల ప్రియతమ నాయకుడయ్యాడు. ఆయన నాయకత్వంలో పత్తి రైతులకు ఆశ్వాసం ఇచ్చి, ఆత్మహత్యలు కాదు, రాజ్య వ్యతిరేక పోరాటాలు చేపట్టండి అని ఆ కుటుంబాల దగ్గరికి వెళ్లి, వాళ్లకు తాత్కాలిక సహాయం కూడ చేసాడు. ఎఐపిఆర్ఎఫ్ సదస్సు పత్తి రైతుల ఆత్మహత్యలపై తీర్మానం చేయడమే కాకుండా, నెల రోజులకు వరంగల్‌లో ఈ సదస్సు కోసం ఆఫీసు తెరిచి ఉన్న సాయిబాబా ఈ  సమస్యలన్నీ చర్చించడానికి స్వయంగా వెళ్లి ఆర్కేను కలిసి కూడ వచ్చాడు.

ఈ మధ్యకాలంలోనే జాతుల సమస్య సదస్సులో చర్చకు వచ్చిన కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల స్వయం నిర్ణయ హక్కు గురించి, పోరాటాల గురించి చర్చించి ఏం చేయాలో నిర్ణయించడానికి గౌహతిలో, ఎఐపిఆర్‌ఎఫ్ తరపున హురియత్ నాయకులతో సహా, నాగా విప్లవ కౌన్సిల్ (మువయ్యా) మొదలైన ప్రతినిధులతో చర్చలు జరిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడ ఏర్పాటు చేసాడు గానీ, ఆ కమిటీ తరఫున ఢిల్లీలో ఆఫీసు తీసుకొని, పత్రిక నిర్వహించాలన్న ఆకాంక్ష నెరవేరలేదు.

 విజయ కుమార్ ఆర్య నాయకత్వంలో ఉన్న ఎఐపిఆర్‌ఎఫ్ కమిటీ సభ్యులు రాజకిశోర్, ఖగేన్ దాస్, రక్షిత్ వంటి వాళ్లు బయటకు వెళ్లి పీపుల్స్ రివల్యూషనరీ ఫోరమ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఖండిత ఎఐపిఆర్ఎఫ్‌ను పునర్నిర్మాణం చేయడం సాయిబాబాకు ఒక బృహత్తర బాధ్యత అయింది. అయినా విస్తృతంగా కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, ఉత్తర భారతాల్లో తిరిగి ఒక బలమైన నిర్మాణంగా ఎఐపిఆర్ఎఫ్‌ను చిరకాలం గుర్తుపెట్టుకునే పోరాట సంస్థగా నిలబెట్టాడు.

1995 నాటికే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ రెండవ దశకు చేరుకొని ఎన్‌డి‌ఎ వాజపేయి ప్రభుత్వం, ఎల్. కె అద్వానీ ద్వారా ఎన్‌డి‌ఎ కన్వీనర్‌గా (1999) మారిన చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేయడం కోసం ఎల్‌పి‌జి సూత్రాలకు అనుగుణంగా విధ్వంసపూర్వక అభివృద్ధి నమూనాను అమలు చేస్తుంటే ఎప్పటికప్పుడు ‌డబ్ల్యూటి‌ఒ, డంకెల్, దావోస్ వంటి తీర్మానాలకు వ్యతికంగా ఫోరం ఎగైన్స్ట్ ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్ డంకెల్ వ్యతిరేక కమిటీ వంటివి ఎన్నెన్ని నిర్మాణం చేశాడో అది పుస్తకంగా రాయదగినంత సమాచారం.

హైదరాబాదు నిజాం కాలేజీ గ్రౌండ్స్ ఫోరం ఎగైన్స్ట్ ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్ సభ వేలాదిమందితో జరిగినప్పుడు వంగపండు ప్రసాదరావు రచించిన డంకెల్ భాగోతం రూపకం ప్రదర్శన ఈనాటికీ ఒక దృశ్యరూపంగా కళ్ళలో ఆడుతున్నది. ఇంక 2000 సంవత్సరంలో ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడి అవి విప్లవోద్యమం తొలినుంచి పోరాడుతున్న జార్ఖండ్ కో లాల్ ఖండ్ బనాయేంగే  (బీహార్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఒరిస్సాలలోని సంతాల్ ఆదివాసి ప్రాంతాలతో ఝార్ఖండ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఎమ్‌సిసి చేసిన పోరాటం) విశాల బస్తర్ (పీపుల్స్‌ వార్ చేసిన పోరాటం) కాకుండా దోపిడీ వర్గాలకు, స్థానిక భూస్వాములకు, బీహార్ మాఫియాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంతో ఈ తూర్పు, ఉత్తర భారతాల్లో ప్రకృతి సంపద అయిన వివిధ రకాల ఖనిజాల తవ్వకాలు, కార్పొరేటు కంపెనీల ప్రాజెక్టులు మొదలైన వాటికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జాఫిప్ (జాయింట్ యాక్షన్ ఫోరం ఫర్ ఇండిజినస్ పీపుల్ – జే‌ఎఎఫ్‌ఎఫ్‌ఐ‌పి) చేపట్టింది. కళింగనగర్ కార్మికులపై టాటా కంపెనీ ప్రయోజనాల కోసం జరిగిన కాల్పుల్లో పదకొండుమంది కార్మికులు మరణించిన ఉదంతం ధర్మకర్తృత్వ ట్రస్టీగా గాంధీ వర్ణించిన, నవభారత నిర్మాతగా నెహ్రూ ప్రశంసించిన టాటా వంశపు మోడీ చనిపోయినపుడు ఆయన నెత్తుటి చేతుల దుర్మార్గాల గురించిన చర్చ, ఆ పోరాటాలు, ఆ గాయాలు మళ్ళీ బాధితులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గుర్తు చేసుకున్నారు.

21 వ శతాబ్దంలోకి మన ప్రవేశం గుజరాత్ మారణకాండతో జరిగింది. అప్పటిదాకా గుజరాత్ మాడల్ (నమూనా)గా ప్రచారం జరుగుతున్న ఆర్థికాభివృద్ధి డొల్ల అని, 1980 ల నుంచే గుజరాత్ సామ్రాజ్యవాద దళారీ ఆర్థిక విధానాన్ని హిందుత్వ దేశీయ కాషాయంతో కలిపి చాప కింద నీరులా ప్రవేశపెడుతున్నారనే నగ్న సత్యం 2002 ఫిబ్రవరి 28, మార్చ్ 1, 2 లో గోద్రాలో మొదలై గుజరాత్ అంతా భగ్గుమన్నది. కనీసం రెండు వేల మంది ముస్లింలను చంపారు. బిల్కిస్ బానో ఉదంతం ఒక్కటే చాలు ముస్లిం స్త్రీలపై జరిగిన అత్యాచారాలకు, ఆమె కుటుంబంలో 12 మందిని చంపిన హత్యలకు ఉదాహరణగా చూపడానికి. దేశంలోనే మొట్టమొదటిసారి సాయి ఆదేశాలతో హైదరాబాదులో ఉన్న ముస్లిం మైనారిటీ హక్కుల నేత అబ్దుల్ లతీఫ్ (ఎఐపిఆర్‌ఎఫ్ సభ్యుడు కూడ) సియాసత్, మున్సిఫ్ పత్రికల యాజమాన్యం సహాయంతో ఏప్రిల్ 9 నుంచి 17 దాకా గుజరాత్‌లోని ఎనిమిది జిల్లాలకు నిజ నిర్ధారణను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాయకత్వంలోను, హైదరాబాదు పౌర హక్కుల, మహిళా హక్కుల నేత రజియా సుల్తాన్ నాయకత్వంలోనూ, విరసం ప్రాతినిధ్యంతో వెళ్ళి వచ్చింది. మే నెలలో రాజమండ్రిలో విరసం మహాసభలు గుజరాత్ గాయాన్ని కళ్ళకు కట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్ఫై మంది రచయితలు గుజరాత్ తిరిగివచ్చి ఏడాది పాటు నిర్వహించిన ‘గుజరాత్ గాయం’ ఉద్యమం, తెలుగు ఉర్దూలలో తెచ్చిన సాహిత్యం ఇప్పటికీ సాయి దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తాయి. పది సంవత్సరాల్లోనే బాబ్రీమసీదు విధ్వంసం, బొంబాయి, సూరత్‌ల మీదుగా ఒక పెను ప్రమాదంగా గుజరాత్‌లో మోడీత్వగా రూపొందింది. 

ఎమర్జెన్సీ కాలపు లెజిటిమెసీని సంఘ్ పరివార్ ఎట్లా సమాజాన్ని హిందూ ముస్లింలుగా  చీల్చి ముస్లింలను ఇతరులుగా చూసే ద్వేషభావాన్ని గుజరాత్‌లో ఆదివాసులను, దళితులను  చేతుల్లో త్రిశూలాలు పెట్టి దోపిడీకి రెచ్చగొట్టడంతో వాజీపేయి ‘రాజధర్మం’ రహస్యం ఏమిటో, అది 2014లో గుజరాత్ మాడల్ భారత మాడల్ కావడంతో విషవృక్షమైంది.

ఎఐ‌పి‌ఆర్‌ఎఫ్ 2004లో ముంబై రెజిస్టెన్స్ కార్యక్రమం మరింత విశాల ఐక్య సంఘటనగా ఉదారవాద ప్రజాస్వామ్యపు రాజకీయార్థిక ఎజెండాను బయట పెట్టడానికి పూనుకున్నది. సామ్రాజ్యవాదం తనను వ్యతిరేకించే సంస్థలను తానే పెట్టుకునే కార్మికవర్గం పట్ల యాజమాన్య కుటిల నీతిని  ఆసియా సోషల్ ఫోరమ్, ప్రపంచ సోషల్ ఫోరమ్ అనే పేరుతో ఇండియాలో ప్రవేశపెట్టి ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ దేశాల సంస్థల మీద పెట్టుకున్న భ్రమలనే ప్రజాస్వామిక వాదులను, ప్రజలను గందరగోళపెట్టే ఒక వేదికను కల్పించింది. హైదరాబాదులో ఆసియా సోషల్ ఫోరమ్ సభలు జరిగినప్పుడే ఎఐపిఆర్ఎఫ్, ఇది కూడ సామ్రాజ్యవాద పెట్టుడు సంస్థ అని సభల ద్వారా, సాహిత్యం ద్వారా బయట పెట్టింది. ఫేగ్ (ఫోరం ఎగేయినిస్ట్ ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్) కన్నా ఇంకా విశాలమైన సమూహాలతో ఆదివాసి, దళిత, మైనారిటీ, ప్రజాస్వామిక, గాంధేయ, లోహియైట్, అంబేద్కర్ సంస్థలను మూడు వందల సంఘాలను కలుపుకొని సరిగ్గా వరల్డ్ సోషల్ ఫోరమ్ జరుగుతున్న ముంబైలోని ఈస్ట్ గోరేగావ్‌లో రోడ్డుకు ఆవలవైపు అది జరుగుతుంటే ఇటువైపు ఎమ్‌ఆర్ 2004 (ముంబై రెసిస్టెన్స్ ఫోరమ్) ఎఐ‌పి‌ఆర్‌ఎఫ్  చొరవతోనే జరిగింది. ఇందులో బి డి శర్మ, గుజరాత్‌లోని కొన్ని సంస్థలను ఎన్జీవోలని సాకు చూపి ఒకటి రెండు సంస్థలు కలిసి రాకున్నా అంతర్జాతీయ స్థాయిలో ఇది నిర్వహింపబడింది.

సాయి నాయకత్వంలో ఎఐపిఆర్ఎఫ్ నిర్వహిస్తున్న సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి 2004 రెండు విధాల గుణాత్మకమైన మార్పుకు కారణమైంది. ప్రతికూలమైన అంశం పి వి నరసింహారావు ప్రపంచ బ్యాంకు గవర్నర్‌ను ఆర్థిక మంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ మొదటిసారి నామినేటెడ్ ప్రధాని అయ్యాడు దేశానికి – అంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అమలు చేయడానికి ప్రపంచ బ్యాంకు గవర్నరే మన దేశానికి ప్రధాని అయ్యాడు. మరొకవైపు 2004 సెప్టెంబర్ 21న  సిపిఐ (ఎమ్.ఎల్) పీపుల్స్‌వార్ (అప్పటికెప్పుడో 1999లోనే సిపిఐ ఎమ్.ఎల్ పార్టీ యూనిటీ పీపుల్స్‌వార్‌తో ఐక్యమై అదే పేరుతో కొనసాగుతున్నది) ఎంసిసిఐ ఐక్యమై సిపిఐ మావోయిస్టు ఏర్పడింది. అంటే దేశం సాయుధ పోరాటం ప్రధాన పోరాట రూపంగా నిర్వహిస్తున్న విప్లవ పార్టీల ఐక్యత ఒక పరిణత దశకు చేరుకున్నది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర భారతాల్లో సరండా కేంద్రంగా అమలవుతున్న ప్రత్యామ్నాయ రాజకీయాలు, దండకారణ్యంలో అమలవుతున్న జనతన సర్కార్‌ల పర్‌స్పెక్టివ్ ఇక మావోయిస్టు పర్‌స్పెక్టివ్‌గా, ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాల కేంద్రంగా విప్లవ మార్గం సుగమమయింది. ఆ ప్రభావంతో 1996లో విడిపోయి, విడివిడి సంస్థలు పెట్టుకున్న ఎఐపిఆర్ఎఫ్, ఆల్ ఇండియా పీపుల్స్ రెవల్యూషనరీ ఫోరమ్‌లు ఐక్యమై రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడింది. వెటరన్ విప్లవ ప్రజా సంఘాల నాయకుడు ఖగేన్ దాస్ అధ్యక్షుడుగా, డాక్టర్ దర్శన్‌పాల్  ఉపాధ్యక్షుడుగా, రాజకిశోర్ ప్రధాన కార్యదర్శిగా, జిఎన్ సాయిబాబా సంయుక్త కార్యదర్శిగా ఏర్పడిన ఈ విప్లవ ప్రజాస్వామిక ఫ్రంట్ నూతన ప్రజాస్వామిక విప్లవ ప్రచారంలోనే నిజమైన, ప్రత్యామ్నాయమైన ప్రజల విప్లవ ప్రజాస్వామ్యం సాధ్యపడుతుందనే లక్ష్యంతో ఏర్పడింది. కాని  అనతి కాలంలోనే అధ్యక్షుడు ఖగేన్ దాస్ మరణంతో 2006లో ఢిల్లీలో ఏర్పడిన పిడిఎఫ్ఐ బాధ్యతల్లోకి డాక్టర్ దర్శన్ పాల్, అర్జున్ ప్రసాద్‌లు ప్రధాన భూమికలు నిర్వహించడానికి వెళ్లడంతో ఆర్‌డిఎఫ్ బాధ్యతలన్నీ రాజ కిశోర్‌కు అండగా సాయి నిర్వహించాల్సి వచ్చింది. అంతేకాకుండా పిడిఎఫ్‌ఐ ఆవిర్భావ సభ కూడా నందితా హక్సర్, బి డి శర్మ, ప్రొఫెసర్ జగ్‌మోహన్‌వంటి వారి సహకారంతో నిర్వహించడంతోపాటు అటు పిడిఎఫ్ఐ అఖిలభారత కార్యక్రమాల సమన్వయాన్ని కూడా సాయి నిర్వహించవలసి వచ్చింది. 2005లోనే భారత ప్రభుత్వం యుఎపిఎ చట్టాన్ని తెచ్చింది. ఈ దుర్మార్గమైన చట్టం కింద కార్మిక సంఘాలు, మైనారిటీ సంస్థలు, ముఖ్యంగా ఆదివాసీలకు జల్, జంగల్, జమీన్, ఇజ్జత్‌ల కోసం పోరాడుతున్న సంస్థలు, ఆదివాసులు, కశ్మీర్‌లో హక్కుల కార్యకర్తలు వేల సంఖ్యలో అరెస్టయ్యారు. రాజకీయ ఖైదీల విడుదల సమస్య ప్రధాన ఎజెండాగా పిడిఎఫ్ఐ ముందుకు వచ్చి జి.ఎన్. సాయిబాబాయే సంస్థాపక సభ్యుడిగా గురుశరణ్ సింగ్ అధ్యక్షుడుగా, అమిత్ భట్టాచార్య ప్రధాన కార్యదర్శిగా, రోనా విల్సన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిఆర్‌పిపి ఏర్పడింది – కమిటీ ఫర్ ద రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్. అనతి కాలంలోనే గురుశరణ్ సింగ్ మరణించి, పార్లమెంటు మీద దాడిలో ఉరిశిక్షపడి, నందితా హక్సర్ పూనికపై ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపక సంఘం, దేశవ్యాప్త ప్రజా ఉద్యమాల ఫలితంగా నిర్దోషిగా బయటికి వచ్చిన ప్రొఫెసర్ గిలాని అధ్యక్షుడు అయ్యాక సిఆర్‌పిపి దేశవ్యాప్తంగా రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాడే సంస్థ అయింది.

2004 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానంతో చర్చలకు వచ్చిన సందర్భంగా అప్పటిదాకా పీపుల్స్‌‌వార్ రాష్ట్ర కార్యదర్శిగా ప్రభుత్వ, మీడియా భావిస్తున్న రామకృష్ణ సెప్టెంబర్ 21న తమ పార్టీ ఎమ్‌సిసితో ఐక్యమై మావోయిస్టు పార్టీ ఏర్పడిందని, ఇపుడు తాము ఈ చర్చల్లో మావోయిస్టు పార్టీగానే పాల్గొంటున్నామని ప్రకటించాడు. అంతకన్నా విస్తారంగా ఆ విషయాల ప్రస్తావన చేయబోవడం లేదు.

అప్పటికే దండకారణ్యంలోను జార్ఖండ్‌లోను ఆదివాసీ సమాజాలనే చీల్చి తృతీయ ప్రస్తుతి, సల్వాజుడుంల పేరుతో ఆదివాసులపై, ఆదివాసులకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులపై పెద్ద ఎత్తున దాడులు, గృహ దహనాలు, ఎన్‌కౌంటర్లు, స్త్రీలపై అత్యాచారాలు పెచ్చరిల్లినవి. సత్నామ్ స్వయంగా దండకారణ్యంలో నెలల తరబడి  తిరిగి రాసిన జంగల్‌నామాలో ఈ వివరాలున్నాయి. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో రాజహింసతో పాటు తూర్పు, ఉత్తర భారతాల్లో ఆదివాసులపై, విప్లవోద్యమంపై రాజ్యహింసను ఖండిస్తూ దేశమంతా కాలికి బలపం కట్టుకొని సాయిబాబా తిరిగాడు. కేవలం ఆదివాసీలపై రాజ్యహింసను ఖండించడానికి ఆదివాసీ, దళిత, మైనారిటీ, ప్రజాస్వామిక విప్లవ సంస్థలతో పాటు గాంధేయ, లోహియావాద, పర్యావరణవాద సంస్థలతో, వ్యక్తులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఫోరం ఫర్ ఇండిజినెస్ పీపుల్ – (మూలవాసులు, ఆదివాసులు) స్థాపించాడు.   రాజకీయ ఖైదీల విడుదల కోసం ప్రొఫెసర్ గిలాని, రోనా విల్సన్‌లు తిరిగారు.

2004లో రెండవసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మన్మోహన్ సింగ్ ప్రధాని, చిదంబరం హోం మంత్రి అయ్యారు. మన్మోహన్ సింగ్ దేశానికి అన్నిటికన్నా పెద్ద ప్రమాదం, అంతర్గత శత్రువు మావోయిస్టులని ప్రకటించాడు. అందుకోసం గ్రీన్‌హంట్ ఆపరేషన్ అనే ప్రజల మీద యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇంక ఉత్తర భారతమంతా ముఖ్యంగా పంజాబ్ నుంచి బెంగాల్ దాకా ఆర్‌డిఎఫ్ నాయకత్వంలో సాయిబాబా గ్రీన్‌హంట్ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించి ఢిల్లీ, పంజాబ్, బీహార్, బెంగాల్‌లలో ఆర్‌డిఎఫ్ రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసాడు.

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రజా సంఘాలను ఏకం చేసి గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాటాన్ని సభల్లోనే కాదు, వీధుల్లోకి కూడా తేవడానికి కదిలించాడు.

సల్వాజుడుంకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఉద్యమం, ప్రజా పోరాటాలు కూడ న్యాయపోరాటంలో ప్రతిఫలించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వాజుడుంను రద్దుచేసే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాడు. అయితే విద్యార్హత లేని, సైనిక శిక్షణ లేని పౌరుల చేతికి ఆయుధాలివ్వడం అంతర్యుద్ధానికి దారితీస్తుందని ఆయన ఇచ్చిన తీర్పు నుంచే సల్వాజుడుం నుంచి ఆ రెండు అర్హతలు ఉన్న మాజీలను, మాఫియాను కలుపుకొని ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ (డిఆర్‌జి)ను, ఇటీవల బస్తర్ ఫైటర్స్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బస్తర్‌పై  జరుపుతున్న ఆఖరి అంతిమ యుద్ధంలో వందలాది ఆదివాసులను, మావోయిస్టులను ఆకాశ మార్గాన గానీ, ద్రోణుల ద్వారా గానీ, రాకెట్ లాంచర్ల ద్వారా గానీ చంపుతున్నసాయుధ బలగాల్లో ఎయిర్ ఫోర్స్, సిఆర్‌పిఎఫ్‌తో పాటు ఈ డిఆర్‌జి, బస్తర్ ఫైటర్స్‌ అనివార్యంగా మావోయిస్టు స్థావరాలను లక్ష్యం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నారని మనమిక్కడే ప్రస్తావించుకోవాలి.

2012 ఏప్రిల్ 22న హైదరాబాదులో ఆర్‌డిఎఫ్ తన ప్రథమ మహాసభలు నిర్వహించుకున్నది. అక్కడ తిరిగి రాజకిశోర్, సాయిబాబాలు ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కానీ అప్పటికే రాజకిశోర్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది.

వివి అధ్యక్షుడిగా, గంటి ప్రసాదం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. గంటి ప్రసాదం 2006లో జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసంఘాలను గైడ్ చేయడంలో, పిడిఎఫ్‌ఐ సమస్యలను, ఆర్‌డిఎఫ్‌లో ఖాళీలను పరిష్కరించే పనుల్లో ఉన్నాడు. అందువల్లనే ఆయన ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనాక బాధ్యతలంతా మోసే సాయికి కొంత ఇతర కార్యకలాపాలపై కేంద్రీకరించే అవకాశం దక్కుతుందనిపించింది.

కానీ ఆ మహాసభ ఊరేగింపును అనుమతించకపోవడంతో నిర్బంధం ఏ రూపంలో ఉండబోతున్నదో అర్థమైంది. 2012 ఏప్రిల్ నెలాఖరులో మహాసభ జరుపుకున్న ఆర్‌డిఎఫ్‌ను, 2012 జూలై 10నాడు, సరిగా గంటి ప్రసాదం, వివిలు శ్రీకాకుళం సభలో ఉన్నపుడు వెంపటాపు సత్యం, కైలాసాల అమరత్వం రోజున  ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రత చట్టం కింద నిషేధించారు. ఆ నిషేధాన్ని సవాలు చేస్తూ మూడు నెలల లోపు ట్రిబ్యునల్‌కు పోతే ట్రిబ్యునల్ నిషేధాన్ని ధ్రువపరచింది. పరాకాష్టగా 2013 జూలై 4 విరసం ఆవిర్భావ సభ రోజు నెల్లూరు ఆసుపత్రి ముందు గంటి ప్రసాదాన్ని ప్రభుత్వ మాఫియా హత్య చేసింది. ఆర్‌డిఎఫ్‌ పనులన్నీ విరసం చేయవలసి వచ్చింది.

అయితే 2005లోనే ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ (ఐ‌ఎల్‌పి‌ఎం) వైస్ ఛైర్మన్ (సుప్రసిద్ధ కవి, ఫిలిప్పైన్స్ విప్లవ నేత జాస్ మారియా సూజన్ దీని అధ్యక్షుడు) అయ్యాడు సాయిబాబా.        

2005కు 2013 కు మధ్యన సాయిబాబా గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రపంచమంతా చేసిన ప్రచారం ముఖ్యంగా అమెరికా, యూరోప్‌లకు వెళ్లి చేసిన ప్రచారం చిదంబరానికి, భారత ప్రభుత్వానికి కన్నెర్ర అయింది.

అందుకు సాయి ఒక కార్య క్షేత్రాన్ని తయారు చేసుకున్నాడు. మొదట ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిషు లెక్చరర్ ఉద్యోగంలో చేరాడు. ఇండియన్ రైటర్స్ ఇంగ్లిషులో రాసిన ఆరు నవలలపై (అందులో అంటరాని వసంతం ఇంగ్లిష్ అనువాదం కూడా ఉంది. ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావు, ఆర్‌ కె నారాయణ్‌ల నవలలు, అరుంధతిరాయ్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ -మిగతా నవలలు) పిహెచ్‌డి చేసాడు. ఇది పూర్తిగా మార్క్సిస్టు దృక్పథంతో రాసిన చాల ప్రామాణికమైన గ్రంథం. ఈ అంశంపై మాట్లాడడానికి అమెరికా యూనివర్సిటీ ఆహ్వానంపై వెళ్ళాడు. ఇది చేయడానికన్నా ముందే ఢిల్లీలో, ఆయన విడుదలయ్యాక చాల చోట్ల చెప్పుకున్నట్లుగా జస్టిస్ రాజేంద్ర సచార్ సూచనపై అరుంధతి రాయ్, ఆనంద్ తేల్‌టుంబ్డే,  ప్రొఫెసర్ జగ్‌మోహన్‌ల వంటి వారితో కలిసి గ్రీన్‌హంట్ ప్రజలపై యుద్దస్థాయికి వెళ్లిందని కమిటీ అగెయినిస్ట్ వార్ ఆన్ పీపుల్ నెలకొల్పి స్వీడన్ నుంచి మావోయిస్టు మేథావి, రచయిత యాన్ మిర్డల్‌ను పిలిచి ఆవిష్కరించాడు. యాన్ మిర్డాల్ 1979లో ఒకసారి ఇండియాకు వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో రెండు విప్లవ పార్టీల నాయకులు కె.ఎస్, సి.పిలను మాత్రమే కాదు, జననాట్యమండలి, విరసం నాయకులను కూడ కలిసి ఇండియా వెయిటింగ్ అనే పుస్తకంలో ఆ వివరాలన్నీ రాసాడు. ఈసారి కూడ ఈ కమిటీని ఆవిష్కరించడమే కాకుండా దండకారణ్య గెరిల్లా జోన్‌కి వెళ్లి మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతితో పాటు నాయకత్వాన్ని కలిసి, జనతన రాజ్యం పని తీరుపై రెడ్ స్టార్ ఓవర్ ఇండియా (భారత్ పై అరుణతార పేరుతో ఎన్. వేణుగోపాల్ తెలుగు చేసిన పుస్తకం, మలుపు ప్రచురణలు) రాసాడు. ఇంక దానితో యాన్ మిర్డాల్ దేశంలో ఎప్పుడూ అడుగుపెట్టరాదని నిషేధం విధించడమే కాదు, దేశంలో ఆయన పర్యటనను మావోయిస్టు పార్టీ తరఫున సాయిబాబా ఏర్పాటు చేసాడని కేంద్రం కక్ష కట్టింది. ఆయన బయటికి వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఈ కమిటీని రద్దు చేయమని లేదా బయటికి రమ్మని చిదంబరం ఆయన మీద ఎంత ఒత్తిడి తెచ్చాడో, చివరకు ఆయన సహచరి వసంతకు, కూతురు మంజీరకు హాని తలపెడతామని కూడ బెదిరించారో స్వయంగా ఆయన మాటలు విన్న జ్ఞాపకాల తడి ఇంకా ఆరకముందే ఆయన కడుపులో ఇంటర్నల్ బ్లీడింగ్‌తో అక్టోబర్ 12న గుండెపోటుతో మరణించాడు.

అక్టోబర్ 17న ముంబై మీటింగ్‌లో ప్రముఖ మార్క్సిస్టు మేథావి బెర్నార్డ్ మాట్లాడుతూ అమెరికా, యూరప్‌లలో, ఇండియాలో తూర్పు, ఉత్తర భారతాలు కేంద్రంగా రాజ్యం ప్రజలపై యుద్ధం చేస్తున్నదనే విషయం, గ్రీన్‌హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రసంగాలు, సాయి రాజ్యం డొక్కలో బల్లెం అయ్యాడు. దళారీ ప్రభుత్వాలకు సామ్రాజ్యవాద దేశాల మెప్పు కావాలి. అక్కడి ఎన్‌ఆర్‌ఐల, ప్రభుత్వాల అండ కావాలి. ఇంక చిదంబరం మొదలు వెంకయ్య నాయుడు దాకా ప్రతి హోం మినిస్టర్ సాయిబాబా పేరు తీసుకొని ప్రమాదమని మాట్లాడడం ప్రారంభమైంది. 2013 సెప్టెంబర్ 7న ఆయన ఇంటిపై మహారాష్ట్ర పోలీసులు, ఎన్ఐఎ, ఢిల్లీ పోలీసులు, ఇంటెలిజెన్స్ దాడి చేసారు. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. గడ్చిరోలి జిల్లా అహిరిలో జరిగిన దొంగతనంకు సంబంధించిన వస్తువులు సాయి ఇంట్లో ఉన్నాయని. అప్పుడాయన ఢిల్లీ యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా గ్వైర్ హాల్ అనే క్వ్వార్టర్‌లో ఉన్నాడు. ఈ విషయం కావలిలో జనరల్ బాడీకి తెలిసిన విషయం అరసవెల్లి కృష్ణ ప్రస్తావించాడు. మళ్ళీ 2014 జనవరిలో వరంగల్ కాళోజి నగర్ విరసం మహాసభలు జరుగుతుంటే రెండోసారి సాయి ఇంటిపై దాడి జరిగింది. ఆయనను అహిరి కేసులో ముద్దాయిగా చూపారన్నది స్పష్టమైంది. 2013 సెప్టెంబర్‌లో మొట్టమొదట బలార్షాలో రైలు దిగిన హేమ్ మిశ్రా (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో చైనీస్ భాషలో డిప్లొమా చేస్తున్న సాంస్కృతిక కార్యకర్త. కామ్రేడ్ ఆజాద్‌ తోపాటు ఎన్‌కౌంటర్‌లో అమరుడైన హేమ్‌చంద్ర పాండే, ఆయన సహచరి బబితలకు ఉత్తరాఖండ్ నుంచి సన్నిహితుడు)ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన పాండు నరోటే, మహేష్ టిర్కీలను అరెస్టు చేశారు.

నిజానికి హేమ్ మిశ్రా మోచేయి కీలు నొప్పితో బాధపడుతూ ఏ వైద్యంతోనూ చికిత్స అందక గడ్చిరోలి జిల్లా హేమల్కస్‌లో ఆదివాసీలకు, గాయపడిన జంతువులకు చికిత్స చేయడానికి ఆసుపత్రిని, ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ప్రకాష్ ఆమ్టే (బాబా ఆమ్టే కొడుకు) దంపతుల దగ్గరికి తీసుకుపోవడానికి ఆ ఇద్దరు ఆదివాసులు వచ్చారు. కాని ఆ ఇద్దరు అప్పటి మావోయిస్టు పార్టీ గడ్చిరోలి జిల్లా కార్యదర్శి నర్మద కొరియర్లని, సాయిబాబా గణపతికి రాసిన ఉత్తరం నర్మద ద్వారా పంపించడానికి పెన్ డ్రైవ్‌లో వేసి పంపుతున్నాడని ఆరోపించి నెల రోజులు చిత్రహింసలు పెట్టారు. అట్లాగే వాళ్ళ దగ్గర దొరికిందనే సమాచారంతో రాయపూర్‌లో రాజకీయ ఖైదీలని కలవడానికి వెళ్ళిన ప్రశాంత్‌రాహి అనే సీనియర్ జర్నలిస్టు, రాజకీయ ఖైదీల విడుదల యాక్టివిస్టును, విజయ్ టిర్కీ అనే మరో ఆదివాసీని అరెస్టు చేసారు. అప్పుడు నమోదు చేసిన ఎఫ్‌ఐ‌ఆర్ లోనే సాయిబాబాను ప్రధాన ముద్దాయిగా చేర్చారు. ఎందుకంటే గణపతికి రాసిన ఉత్తరం నర్మదకు చేర్చడానికి హేమ్ మిశ్రాకు పంపించాడని. ఇప్పుడు 2024 మార్చ్ 7న వచ్చిన హైకోర్టు బెంచ్ తీర్పులో ఇవన్నీ ఆరోపణలే తప్ప ఇందులో ఒక్క దానికి తగిన సాక్ష్యాధారాలు లేవని, ఎలక్ట్రానిక్ మెటీరీయల్ తప్ప సాక్షులు లేరని, ఒక్క హింసా చర్య లేదని అసలు ఎఫ్‌ఐ‌ఆర్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి, ఆమోదం కూడ లేవని నిర్దోషులుగా ప్రకటించారు.

ఇదంతా ఒక ఎత్తు. 2014 మే 9న అరెస్టు చేసినప్పటినుంచీ భారత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ఖైదీగా చూసి జైల్లో పెట్టిన చిత్రహింసలు ఒక ఎత్తు. ఇవన్నీ 17 అక్టోబర్‌న ముంబైలో జరిగిన సాయిబాబా సంస్మరణ సభలో సీనియర్ లాయర్ మిహిర్ దేశాయి, ఆయనకు బొంబాయి హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు రిట్ పిటిషన్ వేసి మొదటి బెయిల్ తెచ్చిన గాయత్రి సింగ్, ఇది సంఘ్ పరివార్ కుట్ర అని అక్టోబర్ 17న అడ్వకేట్ సూసాన్ అబ్రహం చెప్తూ ఉంటే మళ్ళీ అన్నీ సాయి నోట విన్నవి, న్యాయవాదుల వాదనలుగా వినిపించినట్లుగా అనిపించింది. 

మే 9న అది అరెస్టు కాదు కిడ్నాప్‌. కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తూ ఉంటే కారును అడ్డగించి డ్రైవర్‌ను తోసేసి ఎన్‌ఐ‌ఎ ఎయిర్‌పోర్టుకు తీసుకుపోయారు. ఆయన వీల్ చెయిర్‌ను విరిచేసారు. వసంత క్యాంపస్ పోలీసు స్టేషన్‌లో ఆగంతకులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తే, ఎయిర్ పోర్టు నుంచి ఎన్‌ఐ‌ఎ అరెస్ట్ చేసి నాగపూర్ తీసుకుపోతున్నామని చెప్పింది. నాగపూర్ జైల్లో ఒక భయంకర టెర్రరిస్టు వలె బందోబస్తుతో ప్రవేశపెట్టారు. మొదటిసారి బెయిలు వచ్చేదాకా ఆయన మందులనివ్వడం నిలిపేసి అండా సెల్‌లో పడవేసారు. గడ్చిరోలి కోర్టుకు ఇరవై అర్ధ సైనిక బలగాల ఎకె 47 వంటి ఆయుధాల వాహనాల మధ్యన తీసుకపోయారు.              

జైల్లో ముఖ్యంగా మెడికల్ ట్రీట్‌మెంట్ చేయకపోవడమే కాక ఆయన వెంట ఉన్న మందులు కూడ ఇవ్వకపోవడం వల్లనే ఆయన శరీరం శిథిలమవుతున్నదని ముంబయి హైకోర్టు లాయర్ గాయత్రి సింగ్ రిట్ పిటిషన్ వేస్తే చీఫ్ జస్టిస్ బెయిలు ఇచ్చాడు. కానీ మూడవ నెలలోనే నాగపూర్ హైకోర్టు బెంచి, మా జురిస్‌డిక్షన్‌లో వున్న ఖైదీని, అందులోనూ యుఎపిఎ కింద టెర్రరిస్టును విచారించడానికి చీఫ్ జస్టిస్ ఎవరని బెయిల్ రద్దు చేసి ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిబాబాను అరెస్టు చేయించి మళ్ళీ నాగపూర్ జైలుకు పంపారు.

అప్పటికి ఢిల్లీలో మోడీ ప్రభుత్వం వచ్చింది. చివరకు సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది చీమా వాదనలతో బెయిల్ వచ్చి పద్నాలుగు నెలలు బయట ఉన్న కాలంలోనే హైదరాబాదు కేర్ హాస్పిటల్‌లో  సోమరాజు దగ్గర చికిత్స పొంది తిరిగి ఢిల్లీలో అర్థోపెడిక్ చికిత్స చేయించుకుంటున్నతనికి 2017లో సెషన్స్ కోర్టు అయిదుగురికి యావజ్జీవ శిక్ష, విజయ్ టిర్కీకి పదేళ్ళ శిక్ష విధించింది. ఈ కేసు వాదించిన సురేంద్ర గాడ్లింగ్ విడుదలవుతావు ఇక్కడనుండి హైదరాబాదుకు వెళ్లవచ్చుననే భరోసాతో, ఆ వాదనలు విన్న విశ్వాసంతోనే హైదరాబాదు ప్రయాణమయ్యి గడ్చిరోలీకి వచ్చిన సాయిబాబా సహ ముద్దాయిలతో పాటు నాగపూర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడ ప్రశాంత్ రాహిని అమరావతి జైలుకు, హేమ్ మిశ్రాను కొల్హాపూర్ జైలుకు పంపించి సాయిబాబాను ఒంటరిగా అండా సెల్‌లో ఉంచారు. ఇక్కడి నుంచి ఎనిమిదిన్నర సంవత్సరాలు 2024 మార్చి 7 దాకా ఆయన చేసిన పోరాటాలు బహుశా గ్వాటిమలా జెయిళ్లలో, అమెరికా, కశ్మీర్ జైళ్ళలో రాజకీయ ఖైదీల విషయంలో కూడా విని ఉండం. తనకు తోడుగా టాయిలెట్‌కు తీసుకుపోవడానికి, మంచినీళ్లు ఇవ్వడానికి మనుషులు కావాలి, చికిత్స విషయం అట్లా వుంచి బయట నుంచి వసంత పంపించే మందులు, స్వెటర్, కంబళి అయినా ఇవ్వాలి, పత్రికలు, పుస్తకాలు ఇవ్వాలి అనే ప్రతి దానికీ జైల్లో ఉన్న ఒకే ఒక్క పోరాట రూపం నిరాహార దీక్ష. బయట 1990 నుంచి 2014 దాకా ప్రజల మధ్య  ఉండి చేసిన పోరాటం వంటిది కాదు. అమెరికా జైళ్ళలో ఇంకా ఉన్న బ్లాక్ పాంథర్స్ గురించి, నలభై ఏళ్లుగా జైల్లో ఉన్న అబూ జమాల్ గురించి ఆయన అమెరికా వెళ్లినప్పుడు తెలుసుకొని వచ్చాడు. బహుశా భారత దేశం జైళ్ళలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుశీల్ కుమార్ ఒక్కడే ఈ విషయంలో పోల్చదగినవాడు. ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో జుడీషియల్ కస్టడీలో అమరుడయ్యాడు. సాయి విడుదలయ్యేనాటికి, పత్రికలు, పుస్తకాలు బయటినుంచి తెప్పించుకునే పోరాటాలు నిరాహారదీక్ష ద్వారా, న్యాయపోరాటాల ద్వారా సాధించాడు.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమంటే రాజ్యం ఆయనకు జీవిత శిక్ష విధించి కూడ ఆయన విషయంలో వేధింపులు వదలలేదు. హోమ్ మంత్రి వెంకయ్య నాయుడు మావోయిస్టులను మేధావులుగా గుర్తించడానికి నిరాకరిస్తూ సాయిబాబాను టెర్రరిస్టుగా పేర్కొంటూ ఆంధ్రజ్యోతిలో రాసాడు. ఇంక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, ఆయన బిజెపి, శివసేన ప్రభుత్వం ఆయనను ఒక దేశద్రోహిగా, టెర్రరిస్ట్‌గా చిత్రించి మాట్లాడారు. నేషనల్ సెక్యూరిటీ ఛీఫ్ దోవల్ మొదలు ఎన్‌ఐ‌ఎ సంస్థ దాకా ఇన్ని చిత్రహింసలలోనూ ఆయన పోరాడుతూ ఉండడాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు.

ఈ శిక్ష ప్రకటించినాక ఢిల్లీలో ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షుడుగా అరుంధతి రాయ్, ఆనంద్ తేల్‌తుంబ్డే వంటి వాళ్ళతో డిఫెన్స్ కమిటీ ఏర్పడినట్లే మహారాష్ట్రలో నలభై  ప్రజా సంఘాలు నాగపూర్ ఎమ్‌ఎల్‌ఎ క్వార్టర్స్‌లో సమావేశమై చర్చిస్తుంటే, హాస్టల్ గేటు బయట పెద్దపెద్ద నినాదాలు, అరుపులు వినవచ్చాయని – బయటికి వెళ్లి చూస్తే సాయిబాబాను ఉరితీయాలని నినాదాలిస్తున్న సంఘపరివార్ కాషాయధారులు కనిపించారని, వాళ్ల చేతుల్లో ప్లే కార్డులు, బ్యానర్‌లు కూడ సాయిబాబాను ఉరితీయాలని రాసుకొచ్చారని అడ్వకేట్ సూసన్ అబ్రహం చెప్పింది. సాయి జైల్లో ఉండి కూడ సంఘ్ పరివార్‌ మోషా ప్రభుత్వాల అంత విద్వేష ప్రభావాన్ని ఎదుర్కొంటూ లోపల ఏం చేసారో, తన ప్రాణాలు నిలుపుకోవడానికి శత్రువు చేతిలో చావకుండా ఉండడానికి ఏం చేసాడో ఇప్పుడు అక్షర సత్యాలుగా మన ముందున్నాయి.

ఆ కాలమంతా కబీర్ ప్రేమ సందేశాన్ని భారతదేశ విభిన్న, వైవిధ్య సమాజంలో ఆయన అది ఎట్లా విస్తరిస్తూ వస్తున్నదో అధ్యయనం చేస్తున్నాడు. బయటికి ఆ సందేశాన్ని సహచరి వసంతకు, జీవించి ఉన్న కాలంలో తల్లికి, కూతురు మంజీరకు, స్నేహితులకు, తమ్ముడి పిల్లలకు, అమెరికాలో అశోక్ పిల్లలకు ప్రేమలేఖల్లో వినిపించాడు.

 జైలుకు వెళ్లాక తన నిరాహార దీక్షలు, న్యాయపోరాటాలతో పాటు నిరంతర అధ్యయనంతో ఎంతో పరిణతిని పొందాడు. శరీరం ఎంతగా శిధిలమై పోతుంటే మనోధైర్యాన్ని అంతగా కూడదీసుకున్నాడు. ఆ కూడదీసుకోవడానికి అవసరమైన సాహిత్యాన్ని, పోరాటాలను ఆకళింపు చేసుకున్నాడు. నాగపూర్ జైల్లో యాకూబ్ మెమెన్ ఉరిశిక్షను చూసి ఆయనతో తాను మాట్లాడానని, ఆయన నిర్దోషి అని బెయిలుపై వచ్చినప్పుడే హైదరాబాదులో లామకాన్‌లో చెప్పాడు. యాకూబ్ మెమెన్‌తో మొదలై,  తన కళ్ళముందర 37 ఏళ్ల యువకుడు తన సహ కామ్రేడ్ తన చేతులమీదుగానే పాండునరోటే  కన్ను మూయడం చూసాడు. ఎన్ని కన్నీళ్ళు కార్చాడో అంత గుండె నిబ్బరం పెంచుకున్నాడు. ఢిల్లీ జాతుల సమస్య సదస్సులో తనకు స్నేహమేర్పడిన గూగీ వా థియాంగో ఆత్మకథ మొదటి భాగాన్ని అనువదించాడు. అది మలుపు ప్రచురణలో వెలువడి హైదరాబాదులో గూగీ వా థియాంగో చేతుల మీదుగానే ఆవిష్కరింపబడింది. ఇంక తన వలనే పాకిస్తాన్ జైళ్ళలో యుద్ధ ఖైదీగా ఉన్న ఫైజ్ అహమ్మద్ కవిత్వాన్ని అనువదించాడు. ఆయన వలెనే హమ్ దేఖేంగే అని ధిక్కారం ప్రకటించాడు. విద్వేషాన్ని ఓడించేది ప్రేమ ఒక్కటే అని ఈ కాలపు కబీర్‌గా మనకు సందేశం ఇచ్చి వెళ్లిపోయాడు. ఇదంతా ఎందరో అమరులైన విప్లవకారుల, పోరాడుతున్న ఆదివాసీల పోరాటాలతో ఆయన నిర్మించుకున్న చైతన్యం, వసంతతో సుడిగాలిలా వస్తానని చెప్పినట్లుగా వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన సందేశం మనల్ని నడిపిస్తుంది. మొదటిసారి 1974 నవంబర్‌లో భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరి తీసే ఉత్తర్వులు వచ్చినప్పుడు వాళ్ళు తమ ఆఖరి కోరికగా తమ కళ్ళను ప్రభుత్వాసుపత్రికి ఇవ్వమన్నారు. అప్పుడు సుప్రసిద్ధ రచయిత, సినీ నిర్మాత, దర్శకుడు కె. ఎ. అబ్బాస్ అప్పుడు బొంబాయి నుంచి వెలువడుతున్న రాజకీయ వారపత్రిక బ్లిట్జ్ లో తన లాస్ట్ పేజీ కాలమ్‌లో “ ఆ కళ్ళు మనను కనిపెడుతూ ఉంటాయి” (Those eyes will watch us) అని రాసాడు.

అట్లా సాయి నిమ్స్‌‌లోనే తన కళ్ళను ఎల్.వి. ప్రసాద్ నేత్ర చికిత్స సంస్థకిచ్చి మరుక్షణం నుంచే మనను కనిపెడుతూనే ఉన్నాడు. ఆ కళ్ళతోనే, ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరో వచ్చిన వారందరినీ పరామర్శించాడు.

బహుశా ఇంచుమించు పదేళ్ళ తర్వాత హైదరాబాదు, సికిందరాబాదు నగరాలకు దేశమంతటి నుంచి ప్రజాపోరాటాభిమానులను రప్పించి గాంధీ ఆసుపత్రిదాకా నడిపించాడు. నినాదాలతో, బ్యానర్లతో, ‘వాళ్ళు నన్ను చంపలేరు’ అనే ధిక్కార సందేశంతో, పాటలతో నడిపించాడు. అది కన్నీటి వీడ్కోలు మాత్రమే కాదు. ప్రతిఘటనా ప్రతిజ్ఞ.

శవపేటికలో నిద్ర పోయిన పార్థివ దేహం ఆసుపత్రిలో టీచర్ అయి (నన్ను మీరు ఎన్నో పేర్లతో పిలవడం కన్నా టీచర్ అని పిలవడం ఇష్టపడతానన్నాడట మావో) వైద్య విద్యార్థులకు పాఠం కాబోతున్నది. ఇంక కగార్ వ్యతిరేక విశాల ఐక్య సంఘటనా పోరాటానికి సాయి నాయకత్వం వహిస్తుందనుకున్న భరోసా, ఆయన అంతిమ యాత్రలో ప్రసరించిన చూపులో మనకొక పురోగామి చూపునిస్తుంది.

జోహార్ అమర కామ్రేడ్ సాయి.

Leave a Reply