ఈ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. ఇద్దరూ చాలా సౌకర్యంగా ఒకటి మర్చిపోయారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు చేసిన విభజన చట్టం. దానికి పదేళ్ల వయసు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ‘నవ్యాంధ్ర’ను నిర్మిస్తానన్నాడు. కానీ విభజన చట్టం గురించి ఊసెత్తలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు. విభజన చట్టం నోరెత్తలేదు.  చెరి ఐదేళ్లు వంతులవారి రాష్ట్రాన్ని పాలించారు. ఈ పదేళ్లలో తాయిలాలకు లోటు లేదు. ఉచితాలకు అంతులేదు. పోటీపడి సామాజిక పింఛన్లు వాగ్దానాలు చేశారు. తోచిన వరకు ఇచ్చారు. కానీ విభజన చట్టం అమలు కోసం ప్రయత్నించలేదు. కేంద్రాన్ని ధైర్యం చేసి అడగలేదు. పోలవరం నిర్మాణానికి పరుగులు తీయడం తప్ప చేసిందేమీ లేదు. భారీ ప్రాజెక్టు కాబట్టి అంత వరకు ఆగలేక మధ్యంతర సౌకర్యంగా చంద్రబాబు పట్టిసీమను నిర్మించాడు. గోదావరి నీళ్లను కృష్ణా నదిలో కలిపి కోస్తా ప్రాంతానికి మరిన్ని నీళ్లిచ్చాడు. తద్వారా కృష్ణా నదిలో మిగిలిన నీళ్లను శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు ఇవ్వాలని మాత్రం అనుకోలేదు. వరద వచ్చినప్పుడు పారిన నీళ్లు తప్ప రాయలసీమకు చట్టబద్ధ హక్కులను కల్పించలేదు. ఆ నీటిని నిలువ చేసుకోడానికి పట్టిసీమ అంత హడావిడిగా రాయలసీమలో జలాశయాలు నిర్మించలేదు.  నీళ్లు ఇస్తున్నాను కదా.. అని బుకాయించాడు. చట్టబద్ధ హక్కులు కల్పించి నీళ్లు ఇవ్వాలని రాయలసీమ వాళ్లు అడిగారు. దానికి ఆయన ‘నీళ్లు కావాలా? చట్టం కావాలా?’ అని ఎదురు ప్రశ్న వేశాడు.

ఆ రకంగా కూడా చంద్రబాబు విభజన చట్టాన్ని ఖాతరు చేయలేదు. తాను దయాధర్మంగా నీళ్లు ఇస్తే తీసుకోవాలి. అంతే.  హక్కులు అడిగేందుకు వీల్లేదని తెగేసి చెప్పాడు. ఒకసారి చట్టం చేస్తే ఏమయ్యేదీ ఆయనకు బాగా తెలుసు. ఆయన తర్వాత వచ్చిన జగన్‌దీ ఇదే దారి. విభజన చట్టం రాయలసీమకు, మిగతా ప్రాంతాలకు కొన్ని హామీలు ఇచ్చింది. అమరావతి అని ఒకరు సరిపెట్టుకున్నారు. మూడు రాజధానులని మరొకరు నాటకం ఆడారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమల అభివృద్ధికి, సమాన అవకాశాలకు, హక్కులకు రాజ్యాంగ ఆదేశంగా విభజన చట్టాన్ని ఈ రెండు పార్టీలు భావించలేదు.

ఇవన్నీ కొత్తగా గుర్తు చేయాల్సినంతగా చంద్రబాబు మర్చిపోయాడు. రాష్ట్ర ‘అభివృద్ధి’ గురించి ఆయన ఆరాటపడుతున్నాడు. దాన్ని వంధిమాగధ మేధావులు కథలు కథలుగా చెబుతున్నారు. అమరావతి కడితే ఇక అంతా అయినట్లే అంటున్నారు. నోటి మాటగా మిగతావి వల్లిస్తున్నారు. చంద్రబాబు  అభివృద్ధి విధానాన్ని కనీసంగా ప్రశ్నించడమే లేదు. ఆయనేమీ కొత్తగా అధికారంలోకి రాలేదు. ఇది  నాలుగోసారి. ఇన్ని విడతల్లో తేలిందేమిటి? ఆయన ‘అభివృద్ధి’ విధానంలో  వెనుకబడిన ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమల ప్రస్తావనే ఉండదని కొత్తగా ఆరోపించాల్సిన పని లేదు. నిజానికి ఇది ప్రాంతాల పరంగానే ఆలోచించి సరిపెట్టుకొనేది కాదు. దీనికి ఇంకా అనేక తలాలు ఉన్నాయి. అన్నింటా  ఆయన అభివృద్ధి విధానాన్ని చర్చించాలి. దీని కోసం మరీ వెనక్కి పోనక్కరలేదు. ఐదేళ్ల కిందట ఐదేళ్లపాటు సాగించిన ఆయన పాలనను గుర్తు చేసుకుంటే చాలు.  

జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో జరిగి అనేక నష్టాల్లో ఒక విషయం చర్చనీయాంశం కావడమే లేదు.  అనేక చారిత్రక కారణాల వల్ల   ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య మొదటి నుంచీ అంతరం ఉండిరది. జగన్‌ పాలనలో అది పెరిగిపోయింది. రెండు పార్టీల, రెండు కులాల, ఆ కులాల్లోని సంపన్నవర్గ ప్రయోజనాల మధ్య కుమ్ములాట రెండు ప్రాంతాల మధ్య మరింత ఎడానికి దారి తీసింది.  పుట్టుకతో చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ రాయలసీమ వాళ్లే కావచ్చు. కానీ ఈ విపరిణామం ముదిరింది.

ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ప్రాంతాల వారీగా ఆలోచించాల్సినవీ ఉంటాయి. ఉమ్మడిగా చర్చించుకొని తేల్చుకోవాల్సినవీ ఉన్నాయి.  ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల ప్రజలు దానికి సిద్ధం కావాలి. నిర్దిష్టంగా నాలుగు ప్రాంతాల ప్రజల మధ్య సమన్వయం  జరగాలి.  విభజన చట్టం సహా నాలుగు ప్రాంతాల వైపు నుంచి చంద్రబాబు  ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అంశాలపట్ల స్పష్టత సాధించాలి.    ప్రజాస్వామిక విలువలు దీనికి గీటురాయి కావాలి. సమాన హక్కులు ప్రాతిపదిక కావాలి. అన్నిటికంటే ప్రభుత్వం మీద కలిసి ఒత్తిడి తెచ్చి   సాధించుకోవాల్సినవి ఉన్నాయనే ఎరుక ప్రదర్శించాలి. ఇప్పుడు ఆయన కేంద్రంలో చక్రం తిప్పగల పెద్ద మనిషి. మరి రాష్ట్రానికి తనంత తాను ఏం చేస్తాడో అడగొద్దా? కేంద్రంతో ఏం చేయిస్తాడో అడగొద్దా? విభజన చట్టంలోని హామీలు న్యాయబద్ధంగా అన్ని ప్రాంతాలకు సమానంగా అమలయ్యేలా చూడమని అడగొద్దా? ఈ పనికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజాస్వామిక వాదులు ముందుకు రావద్దా? అంతకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజల అవసరం ఏముంది?

Leave a Reply