‘ఎంతమంది ఆడోల్లు ఆ రుతువు ఎరక్కుండా వుండారో’
ఆడవాళ్ళో నోట్లో నువ్వుగింజ నానదు అని సామెత తయారుచేసి దానికి వుపపత్తిగా యెన్నో పౌరాణిక గాథల్ని కల్పించుకున్నాం. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే అని పాటలు రాసుకున్నాం. మహిళల ముచ్చట్ల గురించి మగవాళ్ళు కట్టుకునే ట్యూన్లూ కార్టూన్లు అనేకం. కానీ ఏకాంత సమయాల్లో స్త్రీలు తోటి స్త్రీలతో చెప్పుకునే దేవ రహస్యాలు బయటి ప్రపంచానికి తెలీవు. ఇంటా బయటా వాళ్ళ ఆలోచనలపైన వాటి వ్యక్తీకరణలపైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలమధ్య నిషేధాల మధ్య అణచిపెట్టుకున్న మాటలు లోలోపల వుగ్గబట్టుకున్న భావనలు చెప్పుకోడానికి అవకాశం వస్తే రాయడానికి ఇతిహాసాలు పురాణాలు చాలవు. యుగాలుగా దాచి వుంచిన గుట్టు మట్టులు రట్టు కాక మానవు. అయితే వాటిని యెవరు యెప్పుడు యెక్కడ బహిరంగపరుస్తారు అన్నదే పెద్ద సవాలు. రచయిత్రి ఎండపల్లి భారతి ఆ ఛాలెంజ్ స్వీకరించింది. సాహిత్యంలో పాతుకుపోయిన మౌన సమయాల్ని బద్దలుకొట్టింది.
అశ్లీల పద – అర్థ గుణ దోష చర్చ చేసిన అలంకారశాస్త్రజ్ఞులు పండితమ్మన్యులు మొల్ల తెనాలి రామలింగాల చుట్టూ బూతు కథలు అల్లుకొని వినోదించారు. సినిమాల్లో ద్వంద్వార్థాల పాటలకు మాటలకు చప్పట్లు కొట్టి విరగబడో ముసిముసిగానో నవ్వుకున్నవాళ్ళు నీలిమేఘాలు భాషకు బుగ్గలు నొక్కుకున్నారు. నిజానికి ఫెమినిజం అర్బన్ మధ్య తరగతి ఆలోచనల అభిప్రాయాల వ్యక్తీకరణకి మాత్రమే పరిమితమైనప్పుడు గ్రామీణ శ్రామిక కులాలకు చెందిన మహిళల భాషాభివ్యక్తులకు స్వరూప సుభద్ర వినోదిని భారతి వంటి వేళ్ళమీద లెక్కబెట్టగల కొద్దిమందే సాహిత్యరూపాన్ని ఇవ్వగలిగారు.
స్త్రీల సాహిత్యాన్ని నీలి రాతలుగా కొట్టి పడేసిన పురుష ‘పుంగవుల’ రంకెల్ని దాటి చాలా ముందుకు వచ్చామనుకుంటున్న అత్యాధునిక కాలంలో అనేక నియంత్రణల మధ్య స్త్రీలు తమను తాము వ్యక్తీకరించుకుంటున్నప్పటటికీ యింకా కనిపించని సంకెళ్లేవో అడుగడుగునా పదాలకు అడ్డుపడుతూనే వున్నాయి. స్త్రీల మాటలు అభిప్రాయాలు సెన్సారింగ్ ని యెదుర్కొంటూనే వున్నాయి. స్వీయ నియంత్రణకి గురవుతూనే వున్నాయి. నిజానికి అశ్లీలం మాటలో వుండదు, మనసులో ఉంటుంది. బూతు భాషలో వుండదు, భావనలో వుంటుంది. అపార్థం అనడంలో వుండదు, ఆలోచనల్లో వుంటుంది. భారతి తన మాటల్లో స్త్రీ పురుషులెవ్వరినీ యెక్కడా కించపరచలేదు. అవమానించలేదు. గమనించండి. అర్బన్ మధ్యతరగతి సాహిత్య చట్రాలనుంచి బయటికి వచ్చి చూడండి.
మనుషులు మనసులు ‘ముగతిడిసి’ యెటువంటి దాపరికాల్లేకుండా మాట్లాడుకునే మాటలివి. ఆధునిక స్త్రీవాద పరిభాషలో చెప్పాలంటే ఆ మాటల్లో వాళ్ళ శరీరం గురించిన స్పృహ వుంది. ‘ఒళ్ళు తత్వం’ గురించిన మనో వైజ్ఞానిక చింతన వుంది. లైంగికత గురించిన లోతైన అవగాహన వుంది. ఆత్మ శోధన వుంది. జానపద వైద్య విజ్ఞానం వుంది. ఆరోగ్య చిట్కాలున్నాయి. మనస్తత్వశాస్త్రజ్ఞులు చేసే విశ్లేషణలున్నాయి. తల్లడిల్లే మనస్సులకు సాంత్వన కలిగించే యుక్తులున్నాయి. లచ్చుమమ్మ ఈరవ్వ గంగవ్వ నరసమ్మ ఎల్లమ్మ నాగమ్మ పద్మ సరస శ్యామల రామ లచిమి సాయిత్రి నీలి ఉత్తమ్మ .. యిలా మూడుకాళ్ళ ముత్తవ్వలు ముట్లు నిలిచిపోయిన మధ్య వయస్కలు బాలింతలు తొలి కలయికల దుస్స్వప్నాలు జీవితాంతం మర్చిపోనివాళ్ళు కొత్తగా పైటేసిన పిల్లలు పంచుకునే ప్రతి ముచ్చటా సెన్సూ సైన్సూ మిళితమైన వొక పరిశోధన పత్రం. ‘ఇగటకొయి’ మాటల్లా కనిపించే ఆ స్త్రీల జీవితానుభవ పాఠాల్లో బహిర్గతమైంది సమగ్ర లైంగిక స్వాస్థ్య విజ్ఞానమే.
నాలుగైదేళ్ల పసిపిల్లల లైంగిక చేష్టల దగ్గర్నుంచి స్త్రీల జీవితంలో అతి ముఖ్యమైన సమర్త, గర్భ ధారణ, ప్రసవం వంటి నలుగురికీ తెలిసిన సాధారణ విషయాలు సేఫ్ సెక్స్, జుమ్మ (భావప్రాప్తి), ఎక్స్ట్రా నాట్, పియంఎస్ వంటి నిర్దిష్ట శాస్త్రీయ దృగంశాల వరకూ భారతి తడమని వస్తువు లేదు. తెలుగు భాష యింకా పూర్తిగా ఎదగలేదు; శాస్త్రవిజ్ఞానాన్ని రాయడానికి అవసరమైన పారిభాషిక పదజాలం తెలుగులో రూపొందలేదు అనే మాట కేవలం అపోహే అని భారతి యీ కథనాల్లో నిరూపించింది. ప్రజల భాషలో ప్రతి భావనకీ వ్యక్తీకరణ రూపం వుంటుంది. ప్రాంతాలను బట్టీ సముదాయాలను బట్టీ మారొచ్చు గానీ ఆ వ్యక్తీకరణ యెంతో సహజంగా వుంటుంది. అది నాగరికులకు మోటుగా వినిపిస్తుంది. దీన్నే ఇంగ్లీషు/సంస్కృత పదాల్లోకి తర్జుమా చేస్తే నెత్తిమీద పెట్టుకొని వూరేగుతాం. ప్రకృతికి దూరంకాని రచయితలే వాడగలిగిన ప్రాకృతిక భాష యిది. సహజసిద్ధ జీవితానికి పక్కకి తొలగని మట్టి మనుషులు మాత్రమే చెప్పగలిగిన కథలివి.
కొన్ని వందల అభిసారిక (ధనికొండ, రాంషా, శిరీష ) రేపు (సి నరసింహరావు) పత్రికల సంచికలు చేసిన/చేయలేని పని భారతి యీ కాసిన్ని కథల ద్వారా చేసింది. తరతరాలుగా లైంగిక వైద్య నిపుణులు సెక్సాలజిస్టులు వుద్గ్రంధాల్లో చెప్పినవీ చెప్పనివీ యిపుడు భారతి గొప్ప సాహసంతో విప్పిచెబుతోంది. అనుభవ మంటపంలో స్త్రీల జ్ఞానాధికారాన్ని అంగీకరించని మగ తత్వవేత్తల ముందు నిలబడి శతాబ్దాల జ్ఞానాధిపత్యాన్ని ప్రశ్నించిన భక్తజ్ఞాని అక్కమహాదేవికి సాటి సాహసి మా భారతి. అక్కమ్మలాగానే ఆమె ప్రశ్నించడం దగ్గర ఆగడంలేదు. సమాధానాలిస్తుంది. భారతి రాసిన ఆధునిక ‘వచన’ కావ్యం యిది. గ్రామీణ శ్రామిక మహిళల జీవితాల్లో అనివార్య భాగమైన యీ లైంగిక విజ్ఞానాన్ని ప్రచురిస్తే యే వుపద్రవాలు ముంచుకువస్తాయో అనే బెరుకు లేకుండా ఆమె సజీవ కథనాల్ని ఆర్గానిక్ భావనల్ని వడగట్టకుండా అక్షరశ: పొల్లుపోకుండా ‘ఛాయా’ వెలికితెస్తుంది. పురుషస్వామ్య సమాజంలో ఆడవాళ్లు రాయడమే వుపద్రవం. అందునా అట్టడుగు వర్గానికి చెందిన స్త్రీలు యిలా దేవరహస్యాలు బహిరంగపరచి చెప్పడం మహోపద్రవం. ఈ గ్రహింపు రచయిత్రికి వుంది. ‘ఇవన్నీ నాతోనే పాకూడదు’ అన్న స్పష్టమైన యెరుకతో తన చుట్టూ వున్న మహిళా ప్రపంచంపై గొప్ప కన్సర్న్ తో రాసిన కథనాలు తెలుగులో యింతకుముందు కనలేదు; వినలేదు. భారతి అందిస్తోన్న ‘ఎలక నూక్కాయల పొడి’ లాంటి యీ కథల్ని వయసొచ్చిన ప్రతి ఆడపిల్లా ఆయుధంలా ధరించాలి. చాలా సార్లు రహస్యాలు చెప్పడానికే కాదు వినడానిక్కూడా ధైర్యం కావాలి. గుండె దిటవు పరచ్చుకొని విందాం. రండి.
దమ్మున్న కథలకు దమ్మున్న మాట..
PRABHAKAR —-I AGREE WITH U SIR —NICE WRITE UP
BHARATHI GARU -GREAT DARING WRITER -SHE IS RIGHT -TRUTH IS THERE
====================
BUCHIREDDY GANGULA