మోడీ  పాలన దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి తీసుకెళ్లింది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను మోడీ నోమిక్స్‌ అని పిలుస్తారు. మోడీ నోమిక్స్‌ ప్రధానాంశాలు: భారత తయారీ రంగ అభివృద్ధి కోసం మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ కేంద్రంగా మార్చడం అని సంగ్రహించవచ్చు. ఈ లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడి అనుకూల సంస్కరణలు, విదేశీ పెట్టుబడికి ఎర్ర తివాచీ పర్చడంగా పాలన సాగుతోంది. అంటే మోడీ నోమిక్స్‌ అనేది పెట్టుబడిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన వ్యూహం. అందువల్లనే మొత్తం ప్రపంచాన్ని ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఒప్పించడానికి వివిధ దేశాల పర్యటనలు, కార్పొరేట్లతో సమావేశాలు జరిపారు. అయినా, గ్లోబల్‌ ఇన్వెష్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మోడీ నోమిక్స్‌, అదానీ బంధంగా మారింది. మోడీనోమిక్స్‌ భారత్‌లో ‘మోదానీ’గా మారింది. మొత్తంగా మోడీనోమిక్స్‌తో స్వావలంబనకు తోడ్పడే స్వీయ ఉత్పత్తి రంగం కుదేలయింది. దేశ ఆర్థిక వ్యవస్థ మోడీనోమిక్స్‌గా మారింది.

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. కొన్ని దేశీయ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి కరోనాను కారణంగా చూపుతూ పలు సందర్భాల్లో బిజెపి ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పుకుంటూ వస్తోంది. మోడీ పాలనలో ప్రభుత్వరంగ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఫలితంగా సహజ వనరులు లూటీ, పర్యావరణ విధ్వంసం, ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. మరోవైపు మోడీ పాలనలో భారత్‌లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత్‌లో యువతకు నాణ్యమైన ఉద్యోగాలు లేవు. మోడీ హయాంలో పదేండ్లలో గతంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాలు దీనినే వెల్లడిస్తున్నాయి. గుజరాత్‌, యూపీ, హర్యానా, రాజస్థాన్‌లకు చెందిన యువత ఇజ్రాయెల్‌, రష్యా యుద్ధాల నడుమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

ఇటీవల భారత ప్రభుత్వ ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్‌ గత మార్చి నాటికి 6.4 శాతం జిడిపి సాధించిందిట. అయితే, ఆ ప్రకటనపై వెంటనే స్పందించిన ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అరవింద సుబ్రహ్మణ్యం ‘ఆ లెక్కలు చాలా అయోమయంగా ఉన్నాయని, ఇంకా చాలా స్పష్టత ఉంటే కానీ అవి సరైనవా, కాదా చెప్పటం కష్టం’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. అరవింద సుబ్రహ్మణ్యం 2014-2018 మధ్యలో ఇదే బిజెపి ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన విషయం మనం ఇక్కడ మరిచిపోకూడదు. ఈ ఏడాది ఫిబ్రవరి 7, 2024న పార్లమెంటులో ప్రస్తుత బిజెపి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై చర్చ సందర్భంగా ఎన్నో ముఖ్యమైన విషయాలు బయట పడ్డాయి. ఉపాధి రహిత వృద్ధి, ఆర్థిక అంతరాలు, కునారిల్లుతున్న పరిశ్రమలు, కష్టాల్లో వ్యవసాయం, కొడిగడుతున్న విద్య, వైద్యం, పెరుగుతున్న రుణం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి, అంటే 2014లో, భారతదేశం 2.05 ట్రిలియన్‌ డాలర్ల విలువైన మార్కెట్‌ పరిమాణం కలిగి ఉంది. అప్పటికి మన దేశం మొత్తం అప్పు 55.87 లక్షల కోట్ల రూపాయలు. నాటి జిడిపి వృద్ధి 7.41 శాతం. ప్రస్తుతం భారతదేశ మార్కెట్‌ పరిమాణం 3.75 ట్రిలియన్‌ డాలర్లు. అయితే 2024లో మన మొత్తం అప్పు 2014 నాటి అప్పుకు మూడు రెట్లు (రూ.180 లక్షల కోట్లు)పెరిగింది. 2014-2024 మధ్యకాలంలో ఒక్క 2020లో తప్ప మన జిడిపి ఎప్పుడూ యూపిఎ ప్రభుత్వం పాలన నాటికన్నా మోడీ పాలనలో తక్కువగానే ఉందన్నది ఆర్థిక శాఖ చెప్పే గణాంకాలు.  18-19లో 3.87 శాతం, 19-20లో 5.83 శాతం, 20-21లో 9.5 శాతం (కొవిడ్‌ సమయంలో), 21-22లో 7.0 శాతం అని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కారణం పదేళ్లలో మోడీ ఆర్థిక విధానాలు పెద్ద వ్యాపారాలను, బడా పారిశ్రామిక వేత్తలను, వారి లాభాలను మెరుగుపరచడం ద్వారా విస్తృతంగా బలోపేతం చేశాయి. అత్యధిక ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను నిర్మాణాత్మకంగా బలహీనపరిచారు.

2019-20లో మన ఆర్థిక లోటు ఏడు లక్షల ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలుంటే, 20-21 నాటికి మన ఆర్థిక లోటు పద్దెనిమిది లక్షల నలభై ఎనిమిదివేల ఆరు వందల యాభై కోట్లు. 2023-24 మార్చి నాటికి మన ఆర్థిక లోటు పదిహేడు లక్షల ఎనభై ఆరు వేయిల ఎనిమిది వందల పదహారు కోట్లుగా ఉంది. అంటే మన జిడిపి ప్రగతి 6.4 శాతం అప్పుల నుంచీ వచ్చిందన్నమాట. ఆదాయం నుంచి కాదు. ఆర్థిక శాఖ గణాంకాలిట్లుంటే, మోడీ భారతదేశాన్ని తనే ప్రపంచంలోని  మూడవ ఆర్థిక శక్తిగా మారుస్తున్నట్టు ఉపన్యాసాలు దంచుతుంటాడు. మోడీ ప్రభుత్వం పాలించిన ఈ దశాబ్ద కాలంలో దేశంలో ఉత్పత్తి రంగంలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. యూపిఎ ప్రభుత్వం గద్దె దిగేనాటికి ఎన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలు ఉన్నాయో తరువాత కాలంలోనూ అన్నే ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ఆంధ్రా, తెలంగాణలో విభజన చట్టం ప్రకారం ఏర్పరచిన విద్యాసంస్థలకు సమగ్ర రూపం ఇవ్వటంలోనే పుణ్య కాలమంతా గడిచిపోయింది. ఇంకా వాటిల్లో అన్ని విభాగాలు ఏర్పడలేదు. అధ్యాపకులు నియామకాలు జరగలేదు. తెలంగాణలో పెడతామన్న ఎయిమ్స్‌, ఆంధ్రాలో పెట్టిన ఎయిమ్స్‌ ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయటం ఆరంభం కాలేదు. ఈ లోపలే వాటిని జాతికి అంకితం ఇచ్చేశాడు మోడీ.

2014 ఎన్నికల ప్రచారంలో యూపీ, బీహార్‌లలో యువతనుద్దేశిస్తూ మోడీ చేసిన ప్రసంగం ‘‘మీరు నాకు 10 సంవత్సరాలు సమయమివ్వండి. నేను మీ జీవితాలను మారుస్తాను’’ అని అన్నారు. అయితే, భారత్‌ ఇప్పటికే పదేండ్ల మోడీ పాలనను చూసింది. అయినప్పటికీ, యువత జీవితాలు మారలేదని రుజువైంది. ‘‘భారత్‌లో ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల కోసం లక్షల్లో యువత విదేశాలకు వెళ్తున్నది. 1991లో సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి 45 ఏండ్లలో అత్యధిక నిరుద్యోగిత స్థాయికి, అత్యల్ప సగటు జిడిపి పెరుగుదల, తలసరి ఆదాయ వృద్ధికి భారత్‌ పడిపోయింది’’ అని గణాంకాలు తెలుపుతున్నాయి. మోడీ అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో పెట్టుబడుల్లో అత్యల్ప వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్‌ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానమని మోడీ సర్కారు చెప్తున్నప్పటికీ.. దానిని పెట్టుబడిదారులెవరూ నమ్మకపోవటం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైంది.

గడచిన ఏడు దశాబ్ధాలుగా ప్రజలు చెల్లించిన పన్నులతో నిర్మితమైన ప్రభుత్వరంగ పరిశ్రమల నుంచి ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ఉధృతిగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఆంధ్రాలో (నాడు ఉమ్మడి రాష్ట్రంలో)  ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరించే కార్యక్రమం ప్రారంభించారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, మణుగూరు స్పాంజ్‌ ఐరన్‌, విశాఖ రైల్వే జోన్‌ అన్ని నీటిమీద రాతలు లాగానే అలలపై ఊగిసలాడుతూ, ఎక్కడికో కొట్టుకుపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులకు ఇవ్వవలసిన జీతభత్యాల విషయంలో, పెన్షన్‌ వసతి కల్పించే అంశంలోనూ మోడీ వైఖరి ‘ఎంత తక్కువ భారంలో పని జరిగితే అంత మంచిదనే’ టట్టు గానే ఉంది. సిపిఎస్‌ విధానంలో కూడా ప్రభుత్వం ఎన్పీఎస్‌కు తన వాటా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్లనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తిగా నిలిపివేశారు మోడీ. ఇప్పటికీ 30 లక్షల పోస్టులు కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల్లో ఖాళీగా ఉన్నాయి. ఆఖరుకు సైన్యం నియామకాలలో కూడా (అగ్నిపథ్‌/అగ్నివీర్‌ పథకం) కేవలం నాలుగు సంవత్సరాలకే పరిమితమయ్యే సేవా నియమాలు రూపొందించారు.

ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిన దశలో, వినియోగ డిమాండ్‌ చాలా తక్కువగా ఉన్నప్పుడు కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయి? భారత జిడిపి వృద్ధిలో దాదాపు 60 శాతం పది శాతం కుటుంబాలే కాజేస్తున్నాయి. వృద్ధి ఫలితాలు అట్టడుగు 50 శాతానికి కేవలం 6 శాతమే అందుతుంది. కొంతకాలం క్రితం ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత దశాబ్దంలో సగటు ప్రైవేట్‌ వినియోగ వృద్ధి వార్షికంగా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రైవేట్‌ పెట్టుబడులు ఎలా ఫలిస్తాయి. అంతేకాకుండా, 2017-18 నుంచి 2022-23 వరకు ఐదేండ్లలో భారతదేశంలో వేతన వృద్ధిలో స్తబ్ధత నెలకొన్నదని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే సూచిస్తున్నాయి. ఇన్‌కార్పొరేటెడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విడుదల చేసిన వార్షిక సర్వే ప్రకారం… 2011-12తో పోలిస్తే 2022-23లో యువత నిరుద్యోగం (15 నుంచి 29 ఏండ్ల మధ్యవారు) రెండిరతలు పెరిగి 12 శాతానికి చేరుకున్నది.

దేశీయ ఉత్పత్తి రంగం  ఉద్యోగ కల్పనలో బాగా వెనుకబడి పోయింది. చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థల్లోనే కాకుండా అనధికారికంగా నడుస్తున్న సంస్థల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి విధింపు, కొవిడ్‌ విపత్తు వంటి ఒడిదుడుకులే దీనికి కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా అనధికారిక రంగంలో ఉద్యోగ కల్పన బాగా తక్కువగా ఉంటోంది. చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థల్లో సైతం 2015-16, 2022-23 మధ్యకాలంలో కేవలం 86 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. అంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగాల సంఖ్య కేవలం 7 శాతం మాత్రమే పెరిగింది. సగటున ఏటా పది లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది. ఈ రంగంలో ఉద్యోగాల కల్పన తక్కువగా ఉండటంతో పాటు కొత్తగా వచ్చిన ఆ ఉద్యోగాలు సైతం ఉత్పాదకతను పెంచలేకపోయాయి. మరోవైపు ఎన్‌డిఎ పాలనలో తయారీ రంగం పెరుగుదల క్షీణించింది. తయారీ రంగం పెరుగుదల 2015-16లో 13 శాతం నుండి 2023-24 సంవత్సరానికి 5 శాతానికి పడిపోయింది.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. నిరుద్యోగం పెరిగింది. ఫలితంగా ఆర్థిక అంతరాలు పెరిగాయి. అందుకు మోడీ ప్రభుత్వ అనుచిత చర్యలు… ప్యాసింజర్‌ రైళ్లను రద్దుచేసి వాటి బదులు అన్ని రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లే అని మార్చి కనీస చార్జీలు పది రూపాయల నుంచి ముప్పయి రూపాయలకు పెంచి సామాన్యుడి నడ్డి అమాంతంగా విరిచేశాడు. అన్ని వర్గాల కన్సెషన్స్‌ రద్దు చేశాడు. లాక్‌డౌన్‌ రెండేళ్ల కాలంలో జమ కూడిన డబ్బుతో కొత్తగా వందేభారత్‌ రైళ్లను పట్టుకొచ్చాడు. ఇంతవరకూ (అంటే డిసెంబర్‌ 30, 2023) 37 వందేభారత్‌ రైళ్లు పట్టాలపైకి వస్తే, అన్నిటినీ మోడీనే ప్రారంభిస్తాడు.  పోనీ ఈ రైళ్లు మామూలు మెయిల్‌, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కన్నా గొప్పవా అంటే ఏ విషయంలోనూ కాదనే జవాబు వస్తుంది. మొదట్లో వందే భారత్‌ వేగం గంటకు 150-160 కి.మీ. ఉంటుందని ఊదరగొట్టి ఇప్పుడు మన రైల్వే ట్రాక్‌ మీద 120 కంటే ఎక్కువ వేగంతో పోలేకున్నాయి. కానీ, టికెట్‌ డబ్బులు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి.

ఇక 2014 నాటి గ్యాస్‌ సిలిండర్‌ (గృహ వినియోగ సిలిండర్‌) ధర రూ.415 ఉంటే గత ఏడాదికి (2023కు) అది రూ.1170కి పెరిగింది. సామాన్యులు, మధ్యతరగతి వారికిది భరించలేని భారంగా మారింది. ఇది మోడీ పాలన మార్క్‌. ఏ ప్రభుత్వమైనా ధరలు అదుపులో ఉంచి దిగువ, మధ్య తరగతుల జీవన గతులు మెరుగుపడాలని చూస్తాయి. కానీ, మోడీకి ధరలపై నియంత్రణ లేదు. బియ్యం నుంచి పప్పులు, నూనెలు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటి భారం భరించలేక మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు. అయినా మోడీకి ఇవేమీ కనిపించవు. ఇక తగిన మద్ధతు ధర లేక రైతులు తమ ఉత్పత్తులను ఎలా విఫణి వీధిలో అమ్మాలో తెలియక గిజగిజలాడి పోతున్నారు. అయినా మోడీ వీటిని సమస్యలుగా పట్టించుకోడు. ధరల స్థిరీకరణ, మద్దతు ధర, మార్కెటింగ్‌ సౌకర్యం వంటివి విశ్వవ్యాపితంగా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ ఉన్నాయి. మరి భారతదేశం ఏ విషయంలో ‘విశ్వగురు’ అవబోతుందో ఎవరికీ అర్థం కాదు. భారతదేశంలో మూడవ అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టం ఉందని తరచూ ఊదర కొడుతుంటాడు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ స్టార్టప్‌ల ఆర్థిక పరిమాణం ఎంత, అవి ఎంత ఆర్థిక ప్రగతి సాధించాయి, వాటివల్ల సామాన్యుడికి, మధ్యతరగతి వారికి ఒనగూడిన ప్రయోజనాలు ఏమీటో చెప్పరు. పోనీ వాటి సమాచారం ఏ ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండదు.

2024-25 కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులు, పేదలు, రైతులకు సంబంధించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఆహారం, వంటగ్యాస్‌, పెట్రోలియం, యూరియా వంటి ఎరువులకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్‌లో సామాన్య పేద ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలగలేదు. ఆహార సబ్సిడీకి సంబంధించి 2022-23 బడ్జెట్‌లో రూ.2,72,802 కోట్లు కేటాయించగా, 2023-24లో దాన్ని రూ.2,12,332 కోట్లకు తగ్గించారు. దాన్ని 2024-25 బడ్జెట్‌లో రూ.2,05,250 కోట్లకు తగ్గించారు. ప్రజా పంపిణీకి 2023-24లో రూ.137.36 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.106.73 కోట్లకు తగ్గించారు. గ్యాస్‌ సబ్సిడీకి 2023-24లో రూ.12,240 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.11,925.01 కోట్లకు తగ్గించారు. మహిళ భద్రత పథకాల కేటాయింపుల్లో భారీ కోత విధించారు. 2023-24లో రూ.1,009 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.155 కోట్లకు తగ్గించారు.

పట్రోలియానికి సంబంధించి 2023-24 బడ్జెట్‌లో రూ.12.240 కోట్లు కేటాయించగా, దాన్ని 2024-25 బడ్జెట్‌లో రూ.11.925 కోట్లకు తగ్గించారు. రైతులకు సంబంధించిన ముఖ్యమైన ఎరువులకు 2022-23 బడ్జెట్‌లో రూ.2,51,889 కోట్లు కేటాయించగా, 2023-24లో రూ.1,88,894 కోట్లకు తగ్గించారు. దాన్ని 2024-25 బడ్జెట్‌లో రూ.1,64,000 కోట్లకు తగ్గించారు. అందులోనూ యూరియాకీ 2022-23 బడ్జెట్‌లో రూ.1,65,217 కోట్లు కేటాయించగా, 2023-24లో దాన్ని రూ.1,31,100 కోట్లకు తగ్గించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.1,00,340 కోట్లకు తగ్గించారు. పంటల బీమా పథకానికి సంబంధించి 2023-24 బడ్జెట్‌లో రూ.1,31,100 కోట్లకు తగ్గించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.1,00,340 కోట్లకు తగ్గించారు. పంటల బీమా పథకానికి సంబంధించి2023-24 బడ్జెట్‌లో రూ.15,000 కోట్లు కేటాయించగా, దాన్ని 2024-25 బడ్జెట్‌లో రూ.14,600 కోట్లకు తగ్గించారు. నేషనల్‌ రూరల్‌ హల్త్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)కి కేటాయింపులే లేవు. స్మార్ట్‌ సిటీలకు 2023-24లో రూ.18,200 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10,400 కోట్లకు తగ్గించారు.

‘నవభారతం’ అనే మాట ఈమధ్య బాగా వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ వెబ్‌సైట్‌లలో ఈ మాట బాగా కనిపిస్తోంది. గత పదేళ్ళుగా హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి, మత సహనం గురించి ఆ వెబ్‌సైట్‌లో ఎంతో చక్కగా వండి వార్చారు. ప్రపంచ స్థాయిలో భారత స్థితి గురించి చాలా గొప్పగా చర్చ జరిగింది. ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు ఆర్థిక పరిమాణంలో కాకుండా ఆర్థికాభివృద్ధిలో పెరుగుదల ఉంటుందని ఎవరైనా భావిస్తారు. వారు చూపించే పెరుగుదల 1980 నుంచి కూడా నమోదైంది. ఆదాయం, ఆరోగ్యం, విద్య, జ్ఞానంలో ఐక్యరాజ్యసమితికి చెందిన మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ)లో ఎలా ఉందో పరిశీలిద్దాం. ‘మానవాభివృద్ధి సూచిక’లో ఉన్న 193 దేశాల్లో భారత దేశం 134వ స్థానంలో, అంటే దక్షిణాసియా దేశాలైన శ్రీలంక(78), భూటాన్‌(125), బంగ్లాదేశ్‌(129) కంటే తక్కువ స్థితిలో ఉంది. అలాగే ఆర్థిక పరిమాణంలో 5వ స్థానంలో ఉన్నా, తలసరి ఆదాయంలో 137వ స్థానం, కొనుగోలు శక్తిలో 131వ స్థానంలో భారత్‌ నిలువడం సిగ్గుచేటు. ఆకలి సూచీలో 111వ స్థానంలో ఉంది.

అదానీ వ్యాపార సామ్రాజ్యానికి, మోడీకి మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. ఎన్‌డిఎ పాలనలో ప్రభుత్వ వ్యాపార సంబంధాలు మారాయి. దీన్ని వివరించడానికి ఆశ్రితపక్షపాతం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అన్న పదాలను వాడుతున్నారు. మోడీ పాలనలో ఆశ్రిత పెట్టుబడిదారుల సంపద అనూహ్య రీతిలో పెరిగిపోతుంది. ప్రభుత్వ విధానాలు కూడ వారినే ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల విడుదలైన హురున్‌ జాబితా ప్రకారం, 2012-22 మధ్య వెయ్యి కోట్ల రూపాయల సంపద కంటే ఎక్కువగా పెరిగిపోయిన వారు వంద నుంచి వెయ్యికి పెరిగారు. అంటే పది రెట్లు పెరిగిపోయారు. డాలర్లలో లెక్కేస్తే బిలియనీర్లు 59 నుంచి 221 మంది, అంటే నాలుగు రెట్లు పెరిగిపోయారు. ఈ జాబితాలో తాజాగా 2024 సమాచారం ప్రకారం, ఒక్క ఏడాదిలో చైనాలో 54 మంది బిలియనీర్లు పెరగగా, మనదేశంలో 94 మంది బిలియనీర్లు పెరిగారు. వీరిలో గౌతం అదానీ, ముఖేష్‌ అంబానీ చెరొక 33 బిలియన్‌ డాలర్ల సంపదతో(లక్ష నలబై వేయిల కోట్లు) అగ్రస్థానంలో ఉన్నారు. ఆసియాలోని ఏ నగరంలోనూ లేని విధంగా ముంబయిలో 92 మంది బిలియనీర్లు ఉన్నారు. ముంబయి బిలియనీర్ల రాజధానిగా పేరు తెచ్చుకుంది. బ్రిటిష్‌ వలస పాలనలో కంటే ప్రస్తుతం అసమానతలు పెరిగాయని ‘క్యాపిటల్‌ ఇన్‌ ది ట్వెన్టీ ఫస్ట్‌ సెంచరీ’ పుస్తక రచయిత థామస్‌ పిక్కెటి, అతని బృందం గుర్తించింది.

దూరపు కొండలు ఎప్పుడూ నునుపే. దూరం నుండి చూస్తే అంతా అందంగా, అత్యద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ‘మేడి పండు చూడ మేలిమై ఉండును… పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మన ఆర్థిక వ్యవస్థ ఉంది. మోడీ ప్రభుత్వం మూడోసారి కూడా అధికారంలోకి వచ్చింది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం గాడిలో పడటం లేదు. ప్రజలు పీకల్లోతు అప్పుల్లో, కష్టాల్లో కూరుకుపోతున్నా.. సర్కారు కార్పొరేట్లకే జై కొడుతోంది. ఆర్థిక వృద్ధి అంటే సెన్సెక్స్‌ పరుగులు పెట్టడం, జిడిపి వృద్ధి కాదన్న విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవటం లేదు. ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ దిగజారుతూనే ఉంది. ప్రజల వినియోగ వ్యయం గణనీయంగా పడిపోతోంది.

మోడీ ప్రభుత్వ రాజకీయ ఆర్థిక విధానాలు తలకిందులుగా ఉనాయి. అత్యధిక ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోయి ఉపాధి దొరకక తల్లడిల్లుతుంటే ప్రజల డిమాండ్‌ పెంచే విధంగా చర్యలు లేదు. మోడీ ప్రభుత్వం సప్లై సైడ్‌ మాత్రమే ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఫలితంగా సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదలు మరింత పేదలుగా బతుకులీడుస్తున్నారు. ఈసారి బిజెపి కేంద్రంలో ఏక పార్టీగా పరిపాలించే అవకాశం కోల్పోయినప్పటికీ, ఆ పార్టీ విద్వేష రాజకీయాలు, మతతత్వం, సామ్రాజ్యవాద అనుకూల విధానాలు, కార్పొరేట్‌ ఎజెండాను మరింత వేగంగా అమలు చేస్తోంది. మోడీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా బడాబాబులకు పన్ను రాయితీలు ఇచ్చి వారి సంపద పెరిగేటట్టు చేస్తోంది మోడీ ప్రభుత్వం. మరోవైపు సామాన్య ప్రజలపై భారీగా వివిధ పన్నుల రూపంలో భారం మోపి నడ్డి విరిచేస్తోంది. ఇవాళ మోడీ నోమిక్స్‌ భ్రమలు మన చుట్టు ఉన్న చీకటిని దాచలేవని రైతాంగం, కార్మిక, విద్యార్థి, ఆదివాసీ ఉద్యమాలు తేటతెల్లం చేస్తున్నాయి.

దేశ సంపదను దోచుకుతింటున్న 157 అపరకుబేరుల కుటుంబాల సంపదపై రెండు శాతం పన్ను  విధిస్తే జాతీయ ఆదాయం 0.5 శాతం పెరిగి దేశంలోని దారిద్రాన్ని కొంతైన తగ్గించవచ్చు. వట్టిపోతున్న ప్రభుత్వ ఖజానాను ప్రభుత్వరంగ పెట్టుబడుల ఉపసంహరణ (ప్రజల ఆస్తులు) ద్వారా నింపుకుంటున్నాయి. ఈ దివాళా కోరు ఆర్థిక విధానాల ద్వారా సామాన్య ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తూ, కార్పొరేట్లకు దేశ సంపదను దోచి పెడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇదైతే ‘దేశం వెలిగిపోతోంది, వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌’ అంటూ అబద్ధాలను గోది మీడియా ద్వారా ఊదరగొడుతున్నారు. గత పదేళ్లలో పెరిగినంతగా ఆర్థిక అసమానతలు బ్రిటీష్‌ పాలనలో కూడా పెరగలేదని ప్రపంచ అసమానతల ప్రయోగశాల-2024 ప్రకటించింది. సామాజిక, ఆర్థిక, న్యాయ, విద్య, వైద్య రంగాల్లో ఉన్న తీవ్ర అసమానతలను పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నేటి ప్రభుత్వాలు రాజ్యాంగ లక్ష్యమైన ప్రజా సంక్షేమ బాధ్యత నుంచి పూర్తిగా వైదొలిగాయి. ఈ పరిస్థితుల్లో కార్మికవర్గం, రైతాంగం, మహిళ, యువత, విద్యార్థి, ప్రజల సమస్యలపై స్వతంత్ర, ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలి.

Leave a Reply