బస్తర్ ఆదివాసీ  హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడితే జైలుకు పంపిస్తారు – ఎందుకని? తమ నీరు, అడవి, భూమిపైన  ఆదివాసులకు  హక్కు వుంది. కానీ అడవి చెట్లను నరికివేయవద్దంటే,  సహజ నదులను కలుషితం చేయవద్దంటే, తమ పూర్వీకుల భూమి నుండి వెళ్లగొట్టడానికి వీల్లేదనిఅంటే  ఆదివాసులను  అభివృద్ధి వ్యతిరేకులని అంటారు. ఈ అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు పోలీసు బలగాల క్రూర ప్రయోగానికి వ్యతిరేకమగా మాట్లాడితే మావోయిస్టులని,  మావోయిస్టుల మద్దతుదారులని  ప్రకటించి ఖైదు చేస్తారు.

సునీతా పొట్టం యిందుకు ఒక ఉదాహరణ. ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ప్రభుత్వమూ, పాలనాయంత్రాంగం దృష్టిలో నేరస్థులేనని ఆమె అరెస్టు స్పష్టం చేసింది. బీజాపూర్ జిల్లాలోని కోర్చోలి గ్రామానికి చెందిన 25 ఏళ్ల ఆదివాసీ కార్యకర్త, మానవ హక్కుల పరిరక్షకురాలు సునీతా పొట్టంను జూన్ 3 సోమవారం ఉదయం 8.30 గంటలకు బీజాపూర్ డీఎస్పీ గారిమా దాదర్ నేతృత్వంలోని బీజాపూర్ జిల్లా పోలీసుల బృందం రాయ్‌పూర్‌లోని తాత్కాలిక నివాసం నుంచి ఈడ్చుకొంటూ తీసుకెళ్ళింది.

ఓపెన్ స్కూల్‌లో 10 వ తరగతి చేరడానికి సునీత రాయ్‌పూర్‌కు వచ్చింది. ఆమె ఇక్కడ మహిళా మండల సహచరులతో కలిసి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతోంది. అలాంటప్పుడు అమెను తన నివాసం నుండి తీసుకెళ్ళారు. అత్యంత అనుమానాస్పదమైన విషయం ఏమిటంటే, ఆమె ఇద్దరు సహచరులను ఒక గదిలోకి నెట్టి, బయట నుండి తాళం చేసి, ఇంటి యజమానిని తలుపు తెరవకుండా నిషేధించి, నంబరు లేని వాహనంలో తీసుకువెళ్లారు.

సునీత స్నానం చేసి ఇంటి నుండి బయటకు రాగానే పోలీసులు ఆమెను రెండు వైపుల నుండి పట్టుకొని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. నెలసరి కారణంగా శానిటరీ ప్యాడ్,  దుస్తులు మార్చుకోడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, డి‌ఎస్‌పి గరిమా ఆమెను రెండు చెంప దెబ్బలు కొట్టి,  నంబరు ప్లేటు లేని కారులోకి నెట్టింది. సునీత కాంకేర్, బిలాస్‌పూర్‌లోని న్యాయవాదులకు ఈ విషయం చెప్పింది. అరెస్టు చేసిన అరగంటలోనే డీఎస్పీ గరిమా తిరిగి వచ్చి, ఆమెతో పాటు రాయ్‌పూర్‌లో ఉన్న పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) సభ్యురాలు శ్రేయ ఖేమానీకి వారెంట్ కాపీని ఇచ్చింది.

ఆ సాయంత్రం, పోలీసులు జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనలో బీజాపూర్‌లోని వివిధ పోలీసు స్టేషన్లలో హత్య, హత్యకు యత్నం, దహనం వంటి తీవ్రమైన కేసులలో సునీత వున్నదని, వాటిలో 11 శాశ్వత వారెంట్లు జారీ అయ్యాయని, ఆమె మావోయిస్టుల పట్టణ నెట్‌వర్క్‌కు ముఖ్యమైన లింక్ అని పేర్కొన్నారు. మూడు రోజులు తరువాత కూడా ఆమెపై ఎఫ్ఐఆర్‌లో ఐపిసిలోని ఏ సెక్షన్‌లు పెట్టారో చెప్పలేదు.

బీజాపూర్ జిల్లా నుండి 55 కిలోమీటర్ల దూరంలో, గంగలూరు ప్రాంతంలో కొర్చోలి అనే గ్రామం ఉంది. సునీతా పొట్టం అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు ఐతు పొటామ్, మంగలి పొటామ్‌ ఏడుగురు పిల్లలలో ఒకరు. సునీతను నేను 2018లో ఒక ఘటన గురించి రిపోర్టింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆమె గ్రామంలో కలుసుకున్నాను. ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమె తక్కువ చదువుకున్న మహిళ అని అనిపించదు.

చదువు ఎందుకు మానేశావు అని అడిగితే, దీర్ఘ శ్వాస తీసుకుంటూ “నాకు చదవడం చాలా ఇష్టం అక్కా, కానీ సల్వాజుడుమ్ కారణంగా పాఠశాల మూతబడింది. పెరుగుతున్న హింస భయంతో మేం గ్రామాన్ని విడిచిపెట్టి దట్టమైన అడవులలో నివసించాల్సి వచ్చింది” అని సునీత చెప్పింది. గ్రామంలో ఆమె చుట్టూ ఉన్న అనేక మంది మహిళలు, యువకులను చూస్తే, ఆమెకు ఎంతో ప్రజాదరణ ఉన్నట్లు అనిపించింది. ఎందుకు వుండదు? అప్పటికి  సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం, 2016 లో, 19 సంవత్సరాల వయస్సులో, అదే గ్రామానికి చెందిన 18 ఏళ్ల మున్నీతో కలిసి, బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ ప్రాంతంలోని కడేనార్, పాలనార్, కోర్చోలీ, అండ్రి గ్రామాలలో జరిగిన ఆరు  మంది వ్యక్తుల చట్టాతీత హత్యలకు వ్యతిరేకంగా సునీత ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (Suneeta Pottam & Others Vs State of Chhattisgarh and Others WP ((PIL) 82/2016).

ఈ కేసు హైకోర్టుకు చేరిన తరువాత, స్థానిక పోలీసుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా  తమకు న్యాయం జరుగుతుందనే ఆశ సునీతకు, గ్రామస్తులకు కలిగింది. దాంతో సునీతను , మున్నీని   పోలీసులు బెదిరించారు. న్యాయవాదులు ఈ బెదిరింపుల గురించి 2016 అక్టోబర్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) కు తెలియజేశారు. కమిషన్ జోక్యం చేసుకున్న వెంటనే బీజాపూర్ ఎస్‌పి వారి భద్రతకు హామీ ఇచ్చిన తరువాత కేసును రద్దు చేశారు.

ప్రగతిశీల మహిళా సంస్థలు, మానవ హక్కుల సంస్థల సభ్యుల సహకారం సునీతకు, గ్రామస్తులకు ధైర్యాన్నిచ్చింది. 2015 అక్టోబర్ 19-24 లో పెగ్డాపల్లి, చిన్నాగెలూర్, పెద్దగెలూర్, గుండమ్, బుర్గిచెరు గ్రామాలలో, ఆ తరువాత 2016 జనవరిలో బీజాపూర్‌లోని బల్లం నెంద్ర, సుక్మా జిల్లాలోని కున్నా గ్రామాలలో మహిళలపై పోలీసుల అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు క్రమంగా వెలుగులోకి రావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వతంత్ర విచారణ జరిపి అవి వాస్తవమని గుర్తించి, బాధిత మహిళలకు 37 లక్షల రూపాయలు పరిహారమివ్వాలని ఆదేశాన్నిచ్చింది. ఈ సమస్యలన్నింటినీ ముందుకు తీసుకురావడంలో సునీతా పొట్టంచురుకైన పాత్ర పోషించింది.

వైచిత్రమేమంటే, రాజ్యాంగ పరిధిలోనే జరుగు తుగున్న ఇటువంటి చర్యలకు  సునీత వంటి ఇతర గ్రామస్తులను మావోయిస్టులుగా ప్రకటించి, పరిపాలనా యంత్రాంగం అనేక కేసులను దాఖలు చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని మహిళల సంస్థ అయిన విమెన్ అగెన్స్ట్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ స్టేట్ రిప్రెషన్ (డబ్ల్యుఎస్‌ఎస్) నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) దృష్టికి తీసుకువచ్చింది (డైరీ నం. 1050 / IN / 2021).

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదివాసీలపట్ల జవాబుదారీ వహించేట్లు చేయడంలో ప్రాంతీయ స్థాయిలో నాయకత్వం వహించింది. పెసా చట్టాన్ని ఉల్లంఘించి, గ్రామసభల అనుమతి లేకుండా గ్రామాల మధ్యలో రహదారులను విస్తరించడం, గ్రామస్తులకు ప్రయోజనకరమైన అనేక చెట్లను నరికివేయడం వంటి అనేక చర్యలకు వ్యతిరేకంగా జరిగిన  ప్రతిఘటనలకు ఆమె నాయకత్వం వహించింది. స్థానిక ఆదివాసీల పట్ల పోలీసులు,  ప్రభుత్వము- పాలనా యంత్రాంగాల హింసాత్మక ప్రవర్తనకు వ్యతిరేకంగా బస్తర్‌లో  బాధితులకు మద్దతుగా యువ నేతృత్వంలోని ప్రజా ఉద్యమం బీజాపూర్, సుక్మా సరిహద్దు గ్రామమైన  సిలింగేర్ నుండి ప్రారంభమైంది, 2021 మే నెలలో పోలీసు క్యాంపు ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన  శాంతియుత నిరసనలో పోలీసుల విచ్చలవిడి కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మరణించారు.

సునీతా పొట్టం,  ఇతర ఆదివాసీ యువ నాయకులు బస్తర్‌లోని ఆదివాసీల నిజమైన అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వాన్ని జవాబుదారీ వహించాలన్నారు. ప్రైవేటు సంస్థలకు గనులను లీజుకు ఇవ్వడం ద్వారా అభివృద్ధిని ఆశించడం కంటే పాఠశాలలు, ఆసుపత్రులు, అటవీ ఆధారిత జీవనోపాధి ఎంపికలు మొదలైనవి నిజమైన అభివృద్ధికి అవసరమని ఒత్తిడి చేసారు. తమ దట్టమైన అడవుల కింద  వున్న ఖనిజ సంపదలో మాత్రమే ప్రభుత్వానికి ఆసక్తి వున్నదన్నారు. ఈ అంశాలపై, మూల్‌వాసీ బచావో మంచ్ బ్యానర్ కింద జరుగుతున్న ఉద్యమం గురించి, సునీతా పొట్టంతో సహా ఇతర చురుకైన యువ నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ బస్తర్ విభాగంలోని ఇతర ఎమ్మెల్యేలతో కలిసి 2021 మే-ఆగస్టు 2021 మధ్య ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్‌తో చర్చలు జరిపారు.

అంతేకాక, నక్సల్స్ ఆపరేషన్ పేరుతో గ్రామస్తులను నక్సలైట్లుగా ప్రకటించి అరెస్టు చేయడం, లేదా బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపడం, మావోయిస్టులుగా ప్రకటించి వారిని బలవంతంగా లొంగిపోయేట్లు చేయడం వంటి తీవ్రమైన సమస్యలపైన కూడా యితరులతో కలిసి పనిచేసేది. అదేవిధంగా, నక్సలైట్లను లొంగిపోయేలా చేసి తమ బలగాల్లో చేర్చుకొని, వారు గ్రామస్తులను హింసించేలా చేయడంపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎడెస్‌మెటా, సర్కేగుడా ఘటనలపై  స్వతంత్ర న్యాయ విచారణ జరిగి పోలీసులే భాధ్యులని తేలింది. ఆ విషయంపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడకపోవడాన్ని, 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం, జైలులో ఉన్న అమాయక ఆదివాసీలను విడుదల చేస్తామని వాగ్దానం చేయడం మొదలైన అంశాలను సవాలు చేసింది.

ఈ ప్రశ్నలన్నింటిపై మళ్ళీ నిశ్శబ్దం నెలకొనడంతో, మూల్‌వాసీ బచావో మంచ్ యువ నాయకుడు 2022 జనవరిలో ఆనాటి ఛత్తీస్‌ఘడ్ గవర్నర్ అనుష్కయ్య ఉయెకిని కలవడానికి కొద్దిమంది తో బయలుదేరాడు. కాని కోవిడ్‌ను కారణంగా చూపించి బీజాపూర్ నుండి బయలుదేరిన సహచరులను పోలీసులు కొండాగావ్‌లో ఆపి, కోవిడ్ ఆసుపత్రిలో చేర్చి ఆ తరువాత యింటికి పంపించేశారు. ఆ యువతలో సునీతా పొట్టం కూడా ఉన్నది. అరెస్టు చేయలేదని, కోవిడ్, సెక్షన్ 144 అమలు కారణంగా, వారి ఉద్యమాన్ని కొనసాగించడం సాధ్యం కాదని, వారిని క్వారంటైన్ సెంటర్లో ఉంచామని, వారు కోలుకున్న తర్వాత విడుదల చేస్తామని బస్తర్ ఐజిపి సుందర్ రాజ్ అన్నాడు.

2023 డిసెంబర్‌లో బిజెపి భారీ విజయం సాధించిన తరువాత, ఆదివాసీ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రమాణస్వీకారం చేయడానికి ముందే నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి, ఇది అనేక ఎన్కౌంటర్లను సందేహాస్పదం చేసింది. బీజాపూర్ జిల్లాలోని గంగాలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ ముత్వేందిలో జనవరి 1 న 6 నెలల చిన్నారి మరణం క్రాస్-ఫైరింగ్లో జరిగింది అన్నారు పోలీసులు.  ఏప్రిల్ 20 న బాసగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ బెల్లామ్ నెంద్రలో ముగ్గురు ‘మావోయిస్టు’లను చంపారు. జనవరి 30 న భైరమ్‌ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ బోడ్గా గ్రామంలో చనిపోయిన ఒక గ్రామస్తుణ్ణి పోలీసులు ఆ తరువాత క్రాస్-ఫైరింగ్‌లో చనిపోయాడని చెప్పారు. మార్చి 27 న తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు గ్రామమైన బీజాపూర్ జిల్లా చీపుర్ భట్టిలో 6 మంది “మావోయిస్టులు”, ఏప్రిల్ 2 నాడు కొర్చోలి- నేంద్రా గ్రామాల దగ్గర 13 మంది “మావోయిస్టులు”, మే 10 నాడు గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలో పీడియా గ్రామంలో 10 మంది “మావోయిస్టులు”, కాంకేర్ జిల్లాలోని చోటీ బిటియా పోలీసు స్టేషన్ పరిధిలో కోయిల్‌బెడా ముగ్గురు “మావోయిస్టులు” చనిపోయారని ప్రకటించారు.

సునీతా పొట్టం ఈ ఎన్కౌంటర్ల గురించి పాత్రికేయులకు సమాచారం అందించింది, వారి కుటుంబ సభ్యులతో కలిసి వాస్తవాలను నిర్ధారించడానికి సహాయం చేసింది. మానవ హక్కుల కార్యకర్తలు లేదా న్యాయవాదులను వారి కుటుంబ సభ్యులను పరిచయం చేసింది. మానవ హక్కుల కార్యకర్తగా, సునీతా పొట్టం బీజాపూర్ పోలీసులకు అడ్డంకిగా తయారైంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 9న బీజాపూర్, గంగలూరు ప్రాంతంలో ఒక ఘటనా బాధితులకు జిల్లా ఆసుపత్రిలో సహాయం చేయడానికి వచ్చిన సునీతను పోలీసులు మెయిన్ రోడ్డు మీద పరుగెత్తి పట్టుకొని మోటార్ సైకిల్‌పైన బలవంతంగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు. ఎలాగో అలా ఆమె ఒక దుకాణంలోకి పరుగెత్తింది, అక్కడ వున్న ఆమెకు తెలిసిన కొంతమంది జర్నలిస్టులు అరెస్ట్ వారెంట్ చూపించమని పోలీసులను అడిగారు. పాత్రికేయుల, స్థానిక నాయకుల, సమాజంలో ఆమెకున్న ప్రజాదరణను చూసి పోలీసులు వెనక్కి తగ్గారు.

ఈ ఘటనను మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది బేలా భాటియా, ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి, మూల్‌వాసీ బచావో మంచ్ అధ్యక్షుడు రఘు మిడియాం, ఇతర సభ్యులు తమపై పోలీసులు బెదిరింపులు, వేధింపులకు పాల్పడినట్లు ఫిబ్రవరి 17న ఐజీ బస్తర్, పి. సుందర్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. అదే రోజు సునీతా పొట్టం, యువ ఆదివాసీలు జగదల్పూర్ ప్రెస్ క్లబ్ లో ఒక పత్రికా సమావేశంలో తమ అనుభవాలను పంచుకున్నారు. తన గుర్తింపును, చిరునామాను దాచిపెట్టి, రాయపూర్‌లో నివసిస్తున్నదని, మావోయిస్టుల పట్టణ నెట్‌వర్క్‌లో (ఫ్రంటల్ ఆర్గనైజేషన్) కీలక పాత్ర పోషిస్తున్నదని బీజాపూర్ పోలీసులు సునీతా పోటమ్ పై ఆరోపణలు పెట్టారు. పి‌యు‌సి‌ఎల్ సభ్యురాలు శ్రేయ ఖేమానీ ఈ ఆరోపణాల్ని ఖండిస్తూ, సునీతా ఓపెన్ స్కూల్ నుండి 10 వ తరగతి ప్రవేశం కోసం రాయపూర్‌లో తమతో కలిసి నివసించినట్లు చెప్పారు. ఆమె తన పేరును మార్చలేదు,  దాచలేదు. గత మూడు సంవత్సరాలుగా, ఆమెపై కేసు నమోదు చేసినప్పటి నుండి, వారెంట్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నప్పటి నుండి, సునీతా బహిరంగంగానే  గ్రామంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన పని చేస్తూనే ఉంది. పోలీసు, కలెక్టర్, ఐజి, మీడియాలతో చర్చలు జరుపుతూనే ఉంది.

జగదల్పూర్ జైలులో వృద్ధ తల్లి, సోదరుడితోపాటు సునీతా పొట్టంను కలిసిన తరువాత, ఆదివాసీ నాయకురాలు  సోనీ సోరి మాట్లాడుతూ, “బస్తర్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బస్తర్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. రోజూ ఎవరో ఒకరు అరెస్ట్ అయినట్లు, ఏదో ఒక హత్య జరిగినట్లు వార్తలు గ్రామాల నుంచి వస్తూనే ఉంటాయి. సునీతా పోటమ్ వంటి యువత ఈ ఘటనలను బహిర్గతం చేస్తున్నారు, ఈ స్వరాలను వినడం చాలా ముఖ్యం, తద్వారా ఎడెస్‌మెటా లేదా సర్కేగుడా వంటి అవమానకరమైన సంఘటనలు మళ్లీ జరగవు. ఆదివాసీ యువతకు చెందిన చురుకైన సంస్థ అయిన మూల్‌వాసీ బచావో మంచ్ తన పనిని రాజ్యాంగ పరిధిలోనే చేస్తోంది. ఇలాంటి సంఘటనలు, అరెస్టులు ఆగితేనే బస్తర్‌లోని సామాన్య గ్రామస్తుల విశ్వాసాన్ని పొందగలదు” అన్నారు .

(బస్తర్ నుంచి  రిపోర్టు)

జూన్ 10, 2024

Leave a Reply