పిల్లలు పుట్టగానే జెండర్ తో సంబంధం లేకుండా వాళ్ళకు కొన్ని మూసపద్దతులను, కొన్ని తయారుచేయబడిన ప్రవర్తనలను, భావోద్వేగాలను (Manufactured Behaviours and Feelings)  సమాజం, కుటుంబం, తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు ఇలా వాళ్ళ చుట్టూ జనాలు నూరిపోస్తుంటారు. కాస్తా కూస్తో మినహాయింపులు ఇచ్చినట్టే ఇచ్చి కచ్చితంగా వాటిని పాటించాలని నియమం పెట్టకనే పెడ్తారు. పిల్లలకు ఇలాంటి కుట్ర ఒకటి జరుగుతుందని తెలియనివ్వరు. పొరపాటున ఇచ్చిన మినహాయింపులు దాటి ప్రవర్తిస్తే అది చాలా పెద్ద నేరంగా, బరితెగింపుగా, కొన్నిసార్లు కొన్ని వర్గాలు  ధైర్యంగా కూడా గుర్తిస్తారు. అయితే కొన్ని సమూహాలు స్వచ్ఛందంగానే పై పద్దతులను పాటించాలనే ఆంక్షలు పెట్టకుండా స్వేచ్ఛనిస్తారు కానీ దానిని గ్లోరిఫై (Glorify) చేయడానికి తెగ ఆరాటపడతారు మేము అందరిలా కాదు చాలా విశాలంగా ఆలోచించే సమూహాలు మావని. అలాంటి పెద్దలకు వినమ్రంగా చెప్పెదేంటంటే మీరెం మాకు ఇవ్వలేనిది, ఇవ్వకూడనిది ఏమీ ఇవ్వటం లేదు దేనికైతే మేము హక్కుదారులమో దానిని మేము పొందుతున్నాం అంతే మీరు దానికి గొప్పలు పోనవసరంలేదేమో కదా!!

పై పద్దతుల వల్ల ఎంత మంది స్వంత ఆలోచనా విధానాన్ని, సృజనాత్మకతని, స్వేచ్ఛని, సమానత్వాన్ని కోల్పోయి అందుబాటులో ఉన్న అన్ని కోణాల్లో అణచివేతకు గురౌతుంటారో కదా!! అంతా అయ్యాక దీనికి ఎవరూ బాధ్యత వహించరు. పైగా విచిత్రం ఏంటంటే ఆ పద్దతులను నేర్పించిన  వాళ్ళే అణచివేతకు గురవుతున్న, అన్యాయం జరుగుతున్న చోట్లలో  నిరసనలు కూడా ప్రకటిస్తారు. అది ఎలాంటి నిరసనంటే దేనివల్లైతే బాధించబడుతున్నారో ఆ పద్ధతులకు మద్దతిస్తూ అవి పాటించకపోవడం వల్లే ఇవన్నీ జరిగేవి అని కబుర్లు చెప్తారు. అసలు ఆ పిల్లలకు స్వతహాగా వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని, వాళ్ళకి సరిపోయే పద్దతులను (Customize) తయారుచేసుకునే వెసులుబాటు ఇవ్వరు? నేర్పించింది మీరే, తు.చ. తప్పకుండా పాటించమన్నది మీరే కానీ అలా చేయటం వల్ల ఎదుర్కొంటున్న పర్యావసనాలు మాత్రం మీకు అక్కర్లేదు పైగా నింద మొత్తం పిల్లల మీద.”గమనిక ఇప్పటి పెద్దలంతా ఒకప్పుడు పిల్లలే” మళ్ళా భుజాలు తడుముకోకండి.

పైన చెప్పిన దానికి ఒక ఉదాహరణ తీసుకుందాం అందరికీ తెలిసిందే. సాధారణంగా అమ్మాయిలను అబ్బాయిలతో మాట్లాడటానికి, కలిసి తిరగడానికి ఆంక్షలు పెడ్తారు. వాళ్ళిద్దరూ ఎంత కాలం నుంచి ఒకరికి ఒకరు తెలినవాళ్ళైనా సరే,ఎంత మంచి స్నేహితులైనా సరే. బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళతో కలిసి గట్టిగా నవ్వినా, మీద చేయి వేసి మాట్లాడినా వాటిని వక్రీకరించి మాట్లాడతారు.ముందు జాగ్రత్తల పేరుతో వాళ్ళకి లేనిపోని ఆలోచనలు కల్పిస్తారు‌. మొత్తానికి విడగొట్టి వాళ్ళ పంతం తీర్చుకుంటారు. కానీ అదే అమ్మాయికి పరిచయం లేని, అసలు ఇదివరకెన్నడు చూడని ఒకడినిచ్చి పెళ్ళి చేయడానికి, పైగా వాడు అడిగినంత డబ్బులివ్వడానికి, ఇంకా బంగారం, బాసాన్లు, టివి, ఫ్రిజ్, బైక్ ఇలా సకలం ఇవ్వడానికి రెడీ అయిపోతారు‌. వాడికి మంచి ఉద్యోగం ఉంది, చెల్లి లేదు, తల్లి లేదు,ఆస్తి ఉంది ఇంకా ఏవేవో చెప్పి పంపించేస్తారు. ఆ మూడు ముళ్లు పడేవరకే వాడు అమ్మానాన్న తెచ్చిన వాడు, అదైయ్యాక నీ మొగుడెంటే అలా చేస్తాడు , తెగ తాగుతాడు, తెగ తింటాడు, ఆ పొట్టెంటి అలా పెంచుతున్నాడు ఇలాంటి వంద ప్రశ్నలు. వాడినేదో ఆ పిల్ల కన్నట్టు, లేదంటే పెంచి పెద్ద చేసినట్టు, లేదంటే తనే ఎంచుకున్నట్టు ఇవేవీ తన చేతిలో లేవు తనేం చేయలేదు కానీ నిందలు మాత్రం తానే మోయాలి. ఎక్కువ శాతం జరిగే సంఘటనల గురించి మాత్రమే చెప్తున్నా మళ్ళా కొందరు భుజాలు తడుముకోకండి. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.

కులాలు, మతాలు, మనుషులే కాదు కొందరి భావోద్వేగాలు, బాధలు కూడా వివక్షకి గురౌతాయి తెలుసా? అందులో ముఖ్యంగా ఆడవారి భావోద్వేగాలు, బాధలు వివక్షకి గురౌతాయి. ఎందుకో ఆడవారి ప్రవర్తనకు, నడవడికకు, అందానికి, ఆహార్యానికి, ఆహారానికి కూడా నియమ నిబంధనలు రాసి పెట్టి ఉంటాయి. ఒక సాధారణీకరించిన (Normalized) సగటు జీవితం ఆడవారికి దక్కదు. సమయానికి పెళ్ళికాకున్నా, బిడ్డలు కనకున్నా, విడాకులు తీసుకున్న,మళ్ళీ పెళ్ళి చేసుకున్నా, అందంగా తయారైనా, ఏమి అలంకరణ లేకపోయినా, నిండా బట్టలు కప్పుకున్నా, ఇష్టమైనా బట్టలు వేసుకున్నా… ఏదీ, ఏదీ చేసినా ఏదో ఒక లోపాన్ని, వెటకారాన్ని, విసుగుని వ్యక్తపరుస్తుందీ లోకం. ఆడవారిని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని ఉండనివ్వకుండా ఆటబొమ్మలా, గాజుబొమ్మలా, మాతృమూర్తిలా, అణకువగా,సున్నితంగా, మృదుస్వభావిగా, అన్నింటికీ తలూపే గంగిరెద్దులా ఉండటాన్ని ఈ సమాజం గ్లోరిఫై చేస్తుంది, అలా చేసి రాక్షసానందాన్ని పొందుతుంది.

 ఆడవారు వివక్షను, అణచివేతను కొన్ని ఏండ్లుగా భరించి భరించి ఎదురుతిరిగి ఎదగడం ఎప్పుడైతే  మొదలుపెట్టారో అప్పుడు వారి పట్ల హింస మరింతగా పెరిగింది. విచిత్రం ఏంటంటే ఈ సమాజం ఆ హింసను, వివక్షను, అణచివేతను సాధారణీకరించడానికి (Normalized) ఎన్నో ఏండ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఓ చోట తిరుగుబాటు కూడా జరుగుతూనే ఉంది.

అలాంటి అణచివేతను,హింసను ఎదుర్కొని ప్రశ్నించి, పోరాడిన కొందరి ఆడవాళ్ళ కథే “చిక్ లిట్”.

“ఇది ఒక పవర్ గేమ్. ఎప్పుడైతే బలహీనులు గొంతెత్తి మాట్లాడతారో, అప్పుడు శక్తి ఉన్న వాళ్ళు హింసకు దిగుతారు” అని రచయిత “కడలి” సూటిగా చెప్పింది. మరైతే ఆ ఆడవాళ్ళు ఆ హింస నుంచి బయటపడ్డారా లేదా? వాళ్ళు ఎదుర్కొన్న ఆ హింస ఏంటి? తెలుసుకోవాలంటే కచ్చితంగా “చిక్ లిట్” పుస్తకాన్ని చదవండి. పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి ముగించే దాకా మీకు ఎన్నో ప్రశ్నలు పుడతాయి. సమాధానాలు మాత్రం కచ్చితంగా మీకు మీరైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంతోనే “మార్పు” మొదలౌతుంది. అదేవిధంగా ఎక్కడో ఓ చోట మీరు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ ఎదుర్కొన్న సమస్యలెన్నో మీకు తారసపడతాయి. మిమ్మల్ని మీరు ఏదో ఓ చోట చూసుకుంటారు.ఆ వెంటనే మిమ్మల్ని మీరు తడిమి చూసుకోండి అవసరమైతే పరివర్తన చెందడానికి ప్రయత్నం ప్రారంభించండి. ఎంతో క్లిష్టమైన అంశాలను సరళంగా, స్పష్టంగా చెప్పారు రచయిత. ఇది ఇప్పుడు ఎంతో అవసరం.

తరాలు మారుతుంటే పద్దతుల్లో కూడా “మార్పు”  మొదలవ్వాలి. అదే మూస పద్దతుల్లో కొనసాగాలంటే ప్రత్యుత్పత్తి  ఆగిపోవాలి. అభివృద్ధి, ఆధునీకరణ జరగనివ్వకుండా అడవి మనుషుల్లా ఎక్కడో, ఎప్పుడో ఆగిపోవాలి. “నొప్పి పుట్టించి నవ్వుకునే రాక్షస జాతిని రొడ్ల మీద స్వేచ్ఛగా తిరుగనిస్తుంది ఈ సమాజం”.  “ఆ నొప్పిని భరించే వాళ్ళ నోళ్ళను , కాళ్ళను మాత్రం నిర్దాక్షిణ్యంగా అనేక ఆంక్షలతో బంధించేస్తుంది”.  కానీ ఈ సమాజానికి తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తున్న విషయం ఏంటంటే “అనుకుంటే దెన్నైనా అడ్డుకునే, ఆపేసే శక్తి, సత్తా ఆడవాళ్ళకైతే పుష్కలంగా ఉంది”. “ఓపిగ్గా భరిస్తున్నారంతే మొదలుపెడితే సమాజం భరించలేదని కాస్తా వెసులుబాటంతే”.

ఉపయోగించకోకుండా ఇదే కొనసాగిస్తే ఆ తరవాత ఆపడం ఎవరితరం కాదు.”ఇది ముమ్మాటికీ నిజం”.

Leave a Reply