2018 ఫిబ్రవరి 23: ఫ్రెని మానిక్‌షా

సుమారు 27 ఏళ్ల క్రితం చలికాలంలో ఒకనాడు, కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న కునన్- పోష్‌పోరా అనే జంట గ్రామాల చౌకీదార్ జుమా షేక్, తహసీల్దార్ సికందర్ మాలిక్‌ను కలిశారు. ఆయన దగ్గర ఉర్దూలో రాసిన ఒక లేఖ ఉంది, దానిపై గ్రామస్తుల సంతకాలు, వేలిముద్రలు ఉన్నాయి. ఆ లేఖలో, ఫిబ్రవరి 23- 24 మధ్య రాత్రి ‘4 రాజపుతానా రైఫిల్స్’ సైన్యం వారి గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించిన సమయంలో తాము అనుభవించిన భయంకరమైన లైంగిక హింస, చిత్రహింసల గురించి సాధారణ భాషలో వివరంగా తెలియచేసారు. బాధితులలో 60 ఏళ్ల వృద్ధురాలి నుండి 14 ఏళ్ల బాలిక వరకు, అలాగే ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని నివేదికలు తెలిపాయి.

పురుషులను కూడా వదిలిపెట్టలేదు. వారిని మంచులో బయట ఉన్న తాత్కాలిక విచారణ కేంద్రాలకు తరలించి, జననేంద్రియాలపై కారం పొడి చల్లడం లేదా మర్మాంగాలకు విద్యుత్ షాక్‌లు ఇవ్వడం వంటి రకరకాల చిత్రహింసలకు గురిచేశారు.

అధికారులు ఏ మాత్రం పట్టించుకోని ఈ లేఖ, కునన్-పోష్‌పోరా గ్రామాలు న్యాయం, సత్యం కోసం సాగించిన సుదీర్ఘ పోరాటానికి ఒక ఆరంభం. ఒకప్పుడు ‘బ్లాక్ డే’ గా గుర్తుంచుకొన్న ఫిబ్రవరి 23ను, ఇప్పుడు ‘కశ్మీరీ మహిళల ప్రతిఘటనా దినం’గా జరుపుకుంటున్నారు. ఇది ప్రభుత్వాన్ని, సైన్యాన్ని తిరస్కరించడాన్ని, న్యాయానికి కలిగిస్తున్న ఆటంకాలను; గ్రామస్తుల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను ఎదుర్కోవడంలో జ్ఞాపకశక్తి, పట్టుదల ఎంత శక్తివంతమైన సాధనాలో ప్రతిబింబిస్తుంది.

సంఘర్షణలు, సైనికీకరణ జరిగిన సమయాలలో లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగించడాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. పూర్వ యుగోస్లేవియా ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యూనల్, రువాండా ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యూనల్, సియెర్రా లియోన్ ప్రత్యేక కోర్టు వంటి అనేక సంస్థలు దీనిని మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా పరిగణించి, పరిష్కరించడానికి చర్యలు చేపట్టాయి. అయితే, వర్మ కమిటీ చేసిన ప్రగతిశీల సిఫార్సులు ఉన్నప్పటికీ, కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఛత్తీస్‌గఢ్ వంటి సైనికీకరణ చేసిన ప్రాంతాలలో లైంగిక హింసకు పాల్పడే యూనిఫాంలో ఉన్న పురుషులపై చర్యలు తీసుకోవడానికి లేదా దీనిని గుర్తించడానికి భారత ప్రభుత్వం నిరాకరిస్తోంది.

కునన్-పోష్‌పోరా పోరాటం, సైనికీకరణ జరిగిన ప్రాంతాలలో న్యాయవాదులు సరిగానే వర్ణించిన “న్యాయం అసాధ్యం” అనే స్థితికి నిదర్శనంగా నిలుస్తుంది.

సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) వంటి కఠినమైన చట్టాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి  లేకుండా సైనికులపైన ఎటువంటి విచారణ లేదా ఇతర చట్టపరమైన చర్యలు చేపట్టడం సాధ్యం కాదు. అయితే, కేవలం చట్టం మాత్రమే కాకుండా, అటువంటి శిక్షా రాహిత్యానికి లభిస్తున్న మద్దతు కూడా ప్రధాన సమస్యగా మారింది. ఇది ఎంతగా విస్తరించిందంటే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, విచారణ జరపడం; కేసు ముగింపు నివేదిక ఫైల్ చేయడం వంటి సాధారణ నేర చట్ట ప్రక్రియలు కూడా అమలు కావడం లేదు. పోలీసు విభాగం ఎఎఫ్‌ఎస్‌పిఎ పరిధిలోకి రాకపోయినప్పటికీ, ‘భద్రత’ అనే సాకును చూపినప్పుడు ఆ శిక్షా రాహిత్యం వారికి కూడా వర్తిస్తోంది.

మానవ హక్కుల కార్యకర్తలు గమనించినట్లుగా, చట్టపరమైన శిక్షారాహిత్యం అనేది విస్తృతమైన నైతిక, సాంస్కృతిక శిక్షా రాహిత్యానికి ఉన్న ప్రతిరూపం. భద్రత, జాతీయవాదం అనే భావనలు ఎంతగా కలిసిపోయాయంటే, బాధితులనే “నేరస్తులు”గా మారుస్తున్నారు.

జమ్మూలోని కథువాలో అఫ్షా అనే ఒక చిన్నారి బకర్వాల్ బాలికపై జరిగిన ఘోరమైన అత్యాచారం; హత్య కేసులో నిందితుడైన ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌ను విడుదల చేయాలని కోరుతూ హిందూ ఏక్తా మంచ్ నాయకులు, ఒక బిజెపి నాయకుడు ఇటీవల ర్యాలీ నిర్వహించడం అనేవి న్యాయం పూర్తిగా తలక్రిందులవుతోందనడానికి ఒక భయంకరమైన ఉదాహరణ.

ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ కూడా నిస్సహాయంగా మారుతోంది. కేసు నమోదైనప్పుడు, న్యాయస్థానం ఇచ్చే సమన్లను పట్టించుకోని, విచారణకు హాజరుకాని లేదా సమాధానాలు ఇవ్వని సాయుధ బలగాలపైన తన అధికారాన్ని ప్రయోగించడంలో న్యాయవ్యవస్థ విఫలమవుతోంది. అయితే, అవే బలగాలు ఆ తర్వాతి దశలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, విచారణను జాప్యం చేసే ఎత్తుగడలను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాయి.

“జాతీయ భద్రత” అనే నినాదం ఎంతగా పాతుకుపోయిందంటే, సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా ఇప్పుడు దిగువ కోర్టుల అధికారాలనే కాకుండా పోలీసుల అధికారాలను కూడా నియంత్రిస్తోంది. షోపియాన్‌లో నిరాయుధులైన పౌరులను చంపినందుకు ఎఫ్ఐఆర్ నమోదైన మేజర్ ఆదిత్య కుమార్ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించి, “బలవంతపు చర్యలు తీసుకోవడం”  పైన స్టే ఆర్డర్ పొందడాన్ని ఇక్కడ గమనించాలి.

జమ్మూ కశ్మీర్ కోయలిషన్ ఆఫ్ సివిల్ సొసైటీ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం—ఎఫ్ఐఆర్ అనేది ఒక గుర్తించదగిన నేరం గురించి సమాచారాన్ని నమోదు చేయడం మాత్రమే. సంఘటన జరిగిన తీరుపై తన వెర్షన్‌ను చెప్పడానికి సైన్యానికి రెండో ఎఫ్ఐఆర్ డిమాండ్ చేసే హక్కు ఉంది; కానీ అసలు ఎఫ్ఐఆర్ నమోదును అడ్డుకోవడం అనేది పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది.

కాబట్టి, సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత—1991 మార్చి 8, నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంలో కునన్-పోష్‌పోరా గ్రామస్తులు చేసిన నిరంతర కృషిని అభినందించాలి. అలాగే, ఆ గ్రామాలను సందర్శించి నివేదికను అందజేసిన జిల్లా మెజిస్ట్రేట్ ప్రయత్నాలను కూడా గుర్తించాలి.

తొంభైల కాలంలో బిబిసి రేడియో గొంతుకగా ఉన్న స్థానిక జర్నలిస్ట్ యూసుఫ్ జమీల్ కృషిని కూడా మనం గుర్తించాలి. 1991 మార్చిలో ‘ది టెలిగ్రాఫ్’ పత్రికలో ఈ సామూహిక అత్యాచారాల వార్తను ఆయన వెలుగులోకి తెచ్చారు; ఇది అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే, జమీల్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా, ప్రముఖ ఎడిటర్, జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ కూడా “దేశద్రోహి”గా ముద్రవేయడం గమనార్హం.

(కాశ్మీరీ జర్నలిస్ట్ కమ్రాన్ యూసుఫ్‌ను అరెస్ట్ చేస్తూ, సైనికులకోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, రక్తదాన శిబిరాల గురించి నివేదించేవాడే అసలైన జర్నలిస్ట్ అని ఎన్‌ఐఎ నిర్వచించింది.)

కునన్-పోష్‌పోరా బాధితులు న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టిన తరుణంలోనే, సైన్యం ఒక “ప్రత్యామ్నాయ కథనాన్ని” రూపొందించింది. ఇందులో దివంగత జర్నలిస్ట్ బి.జి. వర్గీస్ కూడా భాగస్వామి అయ్యాడు. సైన్యం అభ్యర్థన మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోసం ఆయన ‘క్రైసిస్ అండ్ క్రెడిబిలిటీ’ అనే నివేదికను రూపొందించాడు. భారీఎత్తున జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపైన విచారణ జరపడానికి వర్గీస్, కె. విక్రమ్ రావులు 1991 మే-జూన్ మాసాల్లో రెండుసార్లు కశ్మీర్‌కు వెళ్ళారు. ఈ “సమగ్ర” విచారణ తొమ్మిది రోజుల్లో పూర్తయింది, అందులో కేవలం ఒక రోజు మాత్రమే కునన్‌లో గడిపారు. ఈ ప్రెస్ కౌన్సిల్ నివేదికలో, బ్లాక్ మెడికల్ ఆఫీసర్ నిర్వహించిన మెడికో-లీగల్ రిపోర్టులను వర్గీస్ “నిష్ప్రయోజనమైనవి” అని కొట్టిపారేసాడు. మహిళల దిగువ శరీరం, ఛాతీపై ఉన్న అనేక గాయాలు, గాట్లు, బహుశా కశ్మీరీ సంప్రదాయం ప్రకారం కాంగ్రీని (నిప్పు కుండ) శరీరానికి దగ్గరగా ఉంచుకోవడం వల్ల ఏర్పడి ఉండవచ్చని అన్నాడు. గుజరాత్‌లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపైన తీవ్రంగా పోరాడిన వర్గీస్, దురదృష్టవశాత్తు ఆ అత్యాచారాలు ఒక “పెద్ద మోసం” అనే తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోలేదు. 2013లో విచారణ మళ్లీ ప్రారంభమైనప్పుడు కూడా అతను కునన్-పోష్‌పోరా మహిళలను నిందించడం కొనసాగించాడు.

నేరం గురించి నివేదించడంలో ఆలస్యం జరిగిందని కూడా అతను వాదించాడు. అయితే, ఘటన జరిగిన మరుసటి రోజే గ్రామస్తులు రాసిన లేఖను, సైన్యం గ్రామాల చుట్టూ దిగ్బంధనం విధించి ప్రజల కదలికలను కష్టతరం చేసిన వాస్తవాన్ని ఆయన చాలా సులభంగా విస్మరించాడు. బహిరంగంగా ఎటువంటి సమాచారం అందుబాటులో లేని సమయంలో, చట్టబద్ధత లేని ఈ అనధికారిక పత్రమే (ప్రెస్ కౌన్సిల్ నివేదిక) ఈ కేసుపై ప్రజల అవగాహనను తీవ్రంగా వక్రీకరించడానికి, బాధితుల న్యాయం, సత్యం పొందే హక్కులను అడ్డుకోవడానికి ప్రాతిపదికగా మారింది.

1991లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా ఇదే తప్పుడు సమాచారాన్ని వల్లెవేస్తూ, పోలీస్ ఫైలును మూసివేయడానికి కారణం ఇదేనని పేర్కొన్నది. అయితే, హ్యూమన్ రైట్స్ వాచ్, ఆసియా వాచ్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ప్రెస్ కౌన్సిల్ కమిటీని విమర్శించాయి. ఆ కమిటీ “సత్యాన్ని వెలికితీయడం కంటే, స్వదేశీ, అంతర్జాతీయ విమర్శలను తిప్పికొట్టడం పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది” అని అవి పేర్కొన్నాయి.

1991 అక్టోబర్‌లో, నేరస్థుల జాడ తెలియలేదని, ఫైలును మూసివేసామని పోలీసులు ప్రజలను నమ్మించి తప్పుదోవ పట్టించారు. అయితే, నిబంధనల ప్రకారం వారు మెజిస్ట్రేట్ ముందు ఎటువంటి క్లోజర్ రిపోర్ట్‌ను దాఖలు చేయలేదు. 22 ఏళ్ల తర్వాత, 2013 మార్చిలో ఈ కేసును మళ్లీ ప్రారంభించాలని ఒక పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు కాబోతోందని తెలుసుకున్న పోలీసులు, హడావిడిగా మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లారు.

2012లో ఢిల్లీలో ఒక యువతిపై జరిగిన అత్యాచారం, హత్య (నిర్భయ ఘటన) నేపథ్యంలో రేకెత్తిన అశాంతి, ఆ తర్వాత వర్మ కమిషన్ ఏర్పాటు వంటి పరిణామాల మధ్య ఆశలను తిరిగి చిగురింపజేయడానికి కొందరు యువతులు ఈ పిల్ ను ప్రారంభించారు. ఈసార్, ఇఫ్రా, సమ్రీనా, మునాజా, నటాషా అనే ఐదుగురు మహిళలు అత్యాచార బాధితుల కోసం ఒక మద్దతు బృందాన్ని ఏర్పాటు చేసి, “డూ యూ రిమెంబర్ కునన్ పోష్‌పోరా?” (కునన్-పోష్‌పోరా మీకు జ్ఞాపకం ఉన్నదా? అనే విశిష్టమైన పుస్తకాన్ని రాశారు. ఒక న్యాయమూర్తి తన విధిని చక్కగా నిర్వహిస్తూ, పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌ ను ఆమోదించడానికి నిరాకరించారు. ఇద్దరు బాధితుల విన్నపం మేరకు, మూడు నెలల్లోగా ఎస్పీ చేత ఈ కేసుపై తదుపరి విచారణ జరిపించాలని ఆయన ఆదేశించారు.

అయితే, ఎప్పటిలాగే ఆ విచారణ ఎక్కడికీ సాగలేదు; పైగా పోలీసులు అప్పటికే మరణించిన ముగ్గురు వ్యక్తులకు సమన్లు జారీ చేశారు. దీనితో ఐదుగురు బాధితులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక పాక్షిక-న్యాయ సంస్థ  అయిన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశించినట్లుగా, నిష్పక్షపాత విచారణ, పరిహారం కావాలని వారు కోరారు. నిందితులకు, అలాగే ఈ ఉదంతాన్ని కప్పిపుచ్చడానికి బాధ్యులైన అధికారులకు క్రిమినల్ శిక్షలు పడాలని, బాధితులకు ఆర్థిక ఉపశమనం అందించాలని 2011లోనే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఫార్సు చేసింది.

దీని తర్వాత పరిహారం, నష్టపరిహార రాజకీయాలలో ఒక వికృత క్రీడ మొదలైంది. మొదట జమ్ము కశ్మీర్ ప్రభుత్వం పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కానీ హైకోర్టు అలా చేయమని ఆదేశించగానే, రాష్ట్ర ప్రభుత్వం తన పంథాను మార్చుకుని ఆ ఆదేశాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రెండేళ్ల తర్వాత, భారత ప్రభుత్వ పరిధిలోని రక్షణ మంత్రిత్వ శాఖ కూడా పరిహారాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టులో ఆర్మీ కూడా రెండు పిటిషన్లు దాఖలు చేసింది—ఒకటి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, మరొకటి దిగువ కోర్టు ఇచ్చిన తదుపరి విచారణ ఆదేశాలను సవాలు చేస్తూ. ఇటువంటి జాప్యం చేసే ఎత్తుగడల వల్ల, న్యాయం కోసం సాగుతున్న ఈ పోరాటం హైకోర్టు, సుప్రీంకోర్టులలోని ఐదు పిటిషన్ల మధ్య ఒక ఊబిలో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో, కనీసం ఐదుగురు బాధితులు ఇప్పటికే మరణించారు.

అయినప్పటికీ, “నేరం ఎప్పటికీ మరణించదు” అనే నానుడి నిజమవుతోంది. సత్యాన్ని, జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలని నిశ్చయించుకున్న ఒక కొత్త తరం ప్రతిఘటన యోధులు ఇప్పుడు తయారయ్యారు. డూ యూ రిమెంబర్ కునన్ పోష్‌పోరా?’ పుస్తక రచయితలు పేర్కొన్నట్లుగా:

“మా పోరాటం కేవలం ఫలితాల గురించి మాత్రమే కాదు; శిక్షా రాహిత్యాన్ని ప్రజలు ప్రశ్నించేలా, అన్యాయం జరిగినప్పుడు మేము మౌనంగా ఉండని ఒక ప్రతిఘటన సంస్కృతిని పెంపొందించడం మా లక్ష్యం.”

సత్యం కోసం వినిపించే ఈ గొంతుకలు ఈ కోలాహలంలో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి.

https://raiot.in/kunan-poshpora-keeping-truth-and-memory alive/

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply