2026 మార్చ్ 26

కొద్ది రోజుల క్రితం, నా తల్లి ఆసియా అంద్రాబీ (64) కి ఒక న్యాయమూర్తి మూడు జీవితకాల శిక్షలను విధించడాన్ని నేను స్వయంగా చూసాను. భారతదేశం అమలు చేసిన అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన నిబంధనల కింద ఇది వాస్తవానికి మరణశిక్షతో సమానం.

కశ్మీర్ స్వయం నిర్ణయాధికార పోరాటంలో పాల్గొన్నందుకు గాను, జీవిత ఖైదు విధించబడిన మొదటి కశ్మీరీ మహిళ నా తల్లి.

నా తల్లితో పాటు, ఆమె సహచరులు నహిదా నస్రీన్, సోఫీ ఫెహ్మీదాలకు ముప్పై ఏళ్ల జైలు శిక్షను వేసారు.

వీరి ముగ్గురినీ 2018లో అరెస్టు చేసారు;  విచారణ ఎనిమిదేళ్ల పాటు కొనసాగింది.

నా తల్లి తన జీవితంలో పదిహేనేళ్లకు పైగా వివిధ భారతీయ జైళ్లలో గడిపింది; ముఖ్యంగా ప్రజా భద్రతా చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్- పిఎస్‌ఎ) కింద – ఇది భారత పరిపాలనలో ఉన్న కశ్మీర్‌లో అసమ్మతిని లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన మరొక చట్టం.

ఇటువంటి కఠినమైన పరిస్థితిని నేను అనుభవించడం ఇది మొదటిసారి కాదు.

రెండు దశాబ్దాల క్రితం, ఒక చిన్న బిడ్డగా ఇటువంటి కోర్టు గదిలోనే, నా తండ్రి ఖాసిం ఫక్తూపై ఒక కల్పిత కేసులో జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఒక న్యాయమూర్తి ప్రకటించడాన్ని నేను చూశాను. అయితే వాస్తవానికి అది ఆయన పోరాటంలో పాల్గొన్నందుకే.

ఇటాలియన్ వామపక్ష మేధావి గ్రామ్స్సీ చెప్పినట్లుగా ఒక ‘సహజసిద్ధమైన మేధావి’ అయిన నా తండ్రి, ఇప్పటికి ముప్పై మూడు ఏళ్లు జైలు గోడల వెనుక గడిపారు. తన సెల్ నుండే ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు; జైలు నుండే ఇస్లామిక్ స్టడీస్‌లో డాక్టరేట్ పొందారు.

నా తల్లిదండ్రులు ప్రస్తుతం తమ ఇంటికి, పిల్లలకు; పరస్పరం కూడా వందల మైళ్ల దూరంలో ఉన్న రెండు వేర్వేరు జైళ్లలో ఉన్నారు.

నా తల్లిపై ఇచ్చిన శిక్షా ఉత్తర్వు ఇరవై ఎనిమిది పేజీల పొడవు ఉంది. అందులో సాధారణ న్యాయపరమైన భాషలో ఆ ముగ్గురు చేసినట్లుగా ఆరోపించే వివిధ నేరాల వివరాలు నిండి ఉన్నాయి.

కశ్మీరీల జీవితాలపై వారికి ఉన్న అధికారం విచిత్రమైనది; ఏమాత్రం ప్రాముఖ్యత లేనట్లుగా వారు మా జీవితాల నుండి సంవత్సరాలను ఎలా దొంగిలిస్తారో, మా ఇళ్లను ఎలా చిన్నాభిన్నం చేస్తారో, మా కుటుంబాలను ఎలా విడదీస్తారో, ఆపైన ఏమీ జరగనట్లు తమ సొంత ఇళ్లకు, తమ కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా ఎలా నిద్రిస్తారో అని ఆశ్చర్యంగా ఉంటుంది. మా ఇంట్లో నా తండ్రి కోసం ఒక గది ఉంది, కానీ ఆ ఇంట్లో ఆయన ఒక్క రోజు కూడా లేడు.

కానీ ఆయన నా కోసం పుస్తకాలు పంపేవారు. దశాబ్దాల పాటు ఆయన జైలు శిక్ష అనుభవించిన తర్వాత, మా ఇంట్లో ఇప్పుడు ఒక గ్రంథాలయం ఉంది—అది మా జీవితాల్లో ఆయన ఉనికికి- లేకపోవడానికి ఒక ఆనవాలు.

ఉర్దూలో, జీవిత భాగస్వామిని ‘షరీక్-ఎ-హయాత్’ అని పిలుస్తారు, అంటే జీవితాన్ని పంచుకునే తోడు అని అర్థం. నా తల్లి, ఆమెకున్న దృఢత్వంతో—తానూ ఇప్పుడు జీవిత ఖైదును పంచుకుంటున్నందున, నిజమైన అర్థంలో నా తండ్రికి ‘షరీక్-ఎ-హయాత్’ అయ్యానని చెప్పారు.

భారత్ క్రియాశీలతనే నేరమని ఎలా వ్యవహరిస్తుంది?

నా తల్లికి జీవిత ఖైదు విధించడం అనేది, భారత పరిపాలనలో ఉన్న కశ్మీర్ వంటి ప్రాంతాల్లో హింసాత్మక-అహింసాత్మక, పోరాట యోధులు-సాధారణ పౌరులు, మిలిటెంట్లు-క్రియాశీలక వాదులు, చట్టబద్ధమైన-చట్టవిరుద్ధమైన వంటి వర్గీకరణల నిరర్థకతను వెల్లడిస్తోంది.

ఉదారవాద ప్రపంచం ఎంతో నమ్మకంతో నిర్మించి, పర్యవేక్షించే ఈ భేదాలు, వలసవాద దేశాలు తమను వ్యతిరేకించే వారి పట్ల వాస్తవంగా ఎలా వ్యవహరిస్తాయనే నిశిత పరీక్షకు గురైనప్పుడు కుప్పకూలిపోతాయి. ఆక్రమణకు వ్యతిరేకంగా ఆయుధం పట్టే హక్కు ఎవరికైనా ఉన్నప్పటికీ, నా తల్లి మాత్రం ఎప్పుడూ ఆయుధాన్ని చేపట్టలేదు.

సాక్ష్యాధారాలు లేకపోవడంతో మారణకాండకు పాల్పడటం, మిలిటెన్సీకి నిధులు సమకూర్చడం వంటి ఆరోపణల నుండి కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది; ‘హింస’కు సంబంధించిన ప్రతి ఆరోపణను కొట్టివేసింది.

చివరకు మిగిలినవి కేవలం ఆమె మాటలు, ఆమె అనుబంధాలు, ఆమె నమ్మకాలు మాత్రమే. వాటికే ఆమెకు జీవిత ఖైదు విధించారు.

ఇది ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది: ఉదారవాద ప్రపంచం దేనినైతే అంగీకారయోగ్యమైనది-అంగీకారయోగ్యం కానిది అని విభజిస్తుందో, ఆ హింసాత్మక-అహింసాత్మక పోరాటాల మధ్య భేదం, తనను వ్యతిరేకించే వారిని శిక్షించాలని నిర్ణయించుకున్న వలసవాద దేశానికి ఎటువంటి ప్రాముఖ్యత లేనిది.

నా తల్లికి విధించిన శిక్ష, ఒక సాయుధ పోరాట యోధునికి విధించే శిక్ష కంటే తక్కువేమీ కాదు. అందుకు సమానమైనదే.

ఎందుకంటే, ఈ శిక్షవేయడంలో ఉన్న లక్ష్యం ప్రతిఘటనా పద్ధతికి కాదు, ఆ ప్రతిఘటనకే. కశ్మీర్ భారతదేశంలో భాగమని అంగీకరించడానికి నిరాకరించడమే అసలు కారణం.

దశాబ్దాల తరబడి ఎటువంటి క్షమాపణలు కోరకుండా, బహిరంగంగా ఆ మాటను చెప్పడమే నేరం. శిక్షా స్మృతి ఈ విషయంలో తనదైన శైలిలో నిజాయితీగానే ఉంది.

నా తల్లి పట్ల ఉదారత చూపడం అంటే, “భారతదేశంలోని అంతర్భాగాన్ని వేరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక స్ఫూర్తికి కొత్త జీవాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వడమే” అని ఆ ఉత్తర్వు పేర్కొంది.

ఈ మహిళల దృఢ సంకల్పమే భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.

భారతదేశానికి నా తల్లి, ఆమె సహచరులు, నా తండ్రి, జైళ్లలో ఉన్న వందలాది మంది కశ్మీరీలు కేవలం మనుషులు మాత్రమే కాదు.

వారు పాఠాలు; హెచ్చరికలు. ఆ సందేశాన్ని కాశ్మీరీ ప్రజలందరికీ చేరవేయడమే వారి ఉద్దేశం.

ఆ సందేశాన్ని విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల వయస్సు గల మహిళకు మేము మూడు జీవితకాల శిక్షలను విధించగలిగితే, మీ విషయంలో కూడా అదే చేయకుండా మమ్మల్ని అడ్డుకునేది ఏముంది? అన్నదే ఆ సందేశం.

పద్ధతిలో సందేశం

వలస పాలన నుండి పద్ధతులను నేర్చుకున్న ఒక వలసానంతర దేశం  ద్వారా ఎటువంటి ఆరోపణలు లేకుండా స్వయంగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కెన్యా రచయిత గూగీ వా థియోంగో ఈ విషయాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అర్థం చేసుకున్నారు.

బందీగా ఉంచడం అనేది కేవలం శిక్షాత్మకమైనది మాత్రమే కాదు, అది ఒక నాటకీయమైన ప్రక్రియ అని తన జైలు జ్ఞాపకాలలో రాశారు. రాజకీయ ఖైదు అనేది ఒక అనుకరించదగిన  “ఆచార ప్రతీకవాదం”  గా పనిచేస్తుంది.

రాజ్యం కేవలం ఒక ప్రతిఘటించే వ్యక్తిని సమాజం నుండి తొలగించడమే కాదు, ఆ వ్యక్తిని మానసికంగా కృంగదీయాలని, ఆ పతనాన్ని అందరికీ ప్రదర్శించాలని కూడా కోరుకుంటుంది.

ఖైదు చేయబడిన వ్యక్తులు తమ నమ్మకాల పట్ల పశ్చాత్తాపం చెందుతూ, తాము చేసిన పోరాటాన్ని వదిలేసి, జైలు నుండి బయటకు వచ్చేలా చేయగలిగితే, ఆ పాలకుడు కేవలం ఖైదు చేయడం కంటే మించిన పెద్ద విజయాన్ని సాధించినట్లే. అది ఒక “బహిరంగ నేర ఒప్పుకోలు”గా మారుతుంది. ఈ లెక్కల ప్రకారం, ఆ నేర ఒప్పుకోలు ఒక శుద్ధీకరణ ప్రక్రియ అవుతుంది: అది అంతకుముందు జరిగిన అన్ని అణచివేత చర్యలను సమర్థించడమే కాకుండా, భవిష్యత్తులో జరగబోయే అణచివేతకు ముందే అనుమతిని పొందుతుంది.

అలా కృంగిపోయిన ఖైదీని ఆ తర్వాత ఒక మార్గదర్శిగా మారుస్తారు—పోరాటం చేయవద్దని ఇతరులను హెచ్చరించే ఒక “సంస్కరించబడిన దూత”గా లేదా, ఆ స్థాయికి కూడా పనికిరానంతగా దెబ్బతిన్నట్లయితే, ఒక భీతిగొల్పే ఉదాహరణగా ప్రదర్శిస్తారు. ఎవరూ కూడా ఈ కష్టాలను తట్టుకోలేరని భవిష్యత్తు ఉద్యమకారులకు నిరూపించే ఒక మనిషి ఆకారంలోని శిథిలంగా వారిని చూపిస్తారు.

శిక్షా స్మృతి ఈ తర్కాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ఆ ముగ్గురు కశ్మీరీ మహిళలు తమ చర్యల పట్ల ఎటువంటి పశ్చాత్తాపం  చూపకపోవడాన్ని, వారి నేరాన్ని తీవ్రతరం చేసే ప్రధాన అంశాలలో ఒకటిగా కోర్టు గుర్తించింది.

తాము చేసిన పోరాటం పట్ల గర్వంగా ఉన్నామని, అవసరమైతే మళ్ళీ చేస్తామని వారు కోర్టుకు నిస్సంకోచంగా చెప్పారు. తమ ప్రజల కోసం తాము ఎప్పుడూ పోరాడుతామని వారు పేర్కొన్నారు. కశ్మీరీ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సంఘటితం చేసినందుకు తమపై కేసులు నమోదయ్యాయని, ఒకవేళ అవసరమైతే మళ్ళీ సంఘటితం అవుతామని వారు స్పష్టం చేశారు.

ఇలా అనడాన్ని సాక్ష్యంగా పరిగణించి కోర్టు వీరు ప్రమాదకరమైన వారని, పశ్చాత్తాపం లేని వారని, అందుబాటులో ఉన్న అత్యంత కఠినమైన శిక్షకు వీరు అర్హులని తీర్పునిచ్చింది.

నా తల్లి లొంగలేదు. రాజ్యం ఆశించిన ‘పాఠం’ ఆమె విషయంలో విఫలమైంది. అందుకే రాజ్యం తన వద్ద మిగిలి ఉన్న ఏకైక అస్త్రాన్ని ప్రయోగించింది: ఒకే జీవితంలో మూడు జీవితకాల శిక్షలు.

పుదీనా వాసన అంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. నేను కళ్లు మూసుకుంటే, ఇంట్లో ఆమె పుదీనా మొక్కలను పెంచుతున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతుంది; ప్రతి ఆకును ఎంతో సున్నితంగా, అంతే శ్రద్ధగా ఆమె పెంచే తీరు నాకు గుర్తుంది.

తమను నిరంతరం ఎదిరించే ఆమె పట్టుదలను చూసి, ఆక్రమణదారులు నా తల్లిని “మృత్యు దేవత” అని పిలుస్తారు. ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ, కశ్మీర్ పోరాటం పట్ల ఆమె నిశ్చలమైన పట్టుదలతో ఉన్నారు. ఆమెలోని ఆ సంపూర్ణత్వాన్ని, ఆ మానవత్వాన్ని, అదే సమయంలో కనిపించే ఆ తీక్షణతను, సున్నితత్వాన్ని చూసి నేను ఆమెను ప్రేమిస్తున్నాను.

అణచివేత ముందు ఆమె లొంగని శక్తి, కానీ తన పిల్లల పట్ల, తన కుటుంబం, తన ప్రజలు, అవును… తన పుదీనా మొక్కల పట్ల కూడా ఆమె అంతులేని అనురాగాన్ని చూపిస్తుంది. ఆమె వాటిని ఎంతో ప్రేమగా “నా పుదీనా” అని పిలిచేది. ఆమె త్వరలోనే తన ఇంటికి తిరిగి వచ్చి, మళ్ళీ తన పుదీనా మొక్కలను పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.

https://www.trtworld.com/article/d81c6848386c

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply