“మినహాయింపులెప్పుడూ …
మౌలిక వాస్తవాన్నే రుజువు చేస్తాయి”
చాలా ఆసక్తికరమైన ఈ వాక్యం కె.వి.ఆర్. ఆంధ్ర సాహిత్యంలో క్షీణయుగం గురించి రాస్తూ ప్రతిపాదించారు. ఈ వర్తమానం మీద నిలబడినప్పుడు కూడా మనకు ఈ మాట ఎంతో ఆశావహంగానే కాదు చరిత్ర సరికొత్తగా పునరావృత మవుతుందన్న ఆశయాన్ని ధ్రువీకరిస్తుంది. ఈ వెలుగుల్లో ఆయన రచన ‘నిశీథిని’ ని పర్యాలోకిద్దాం…
1565 తల్లికోట యుద్ధం, విజయనగర సామ్రాజ్య పతనం దీనికి”ఇరుగుపొరుగు సుల్తానులే కాదు రాజ్య శరీరంలో బలిసిన విష క్రిముల వంటి అమర నాయకులు కూడా కాదనలేము”. కె వి ఆర్ చెప్పిన ఈ విషయం చరిత్ర పరిణామాల్ని గుర్తించడంలో మనకు చాలా అవసరమని స్పష్ట మవుతుంది. నేలటూరి వెంకటరమణయ్య మాటల్లో అని చెబుతూ కె.వి.ఆర్ అమర నాయకులు’మ్రింగరాని కడులైనారు’ అంటారు. ఇది ఏ సందర్భంలోనైనా మనకు చరిత్ర గతిని అర్థం చేసుకునే శక్తినిస్తుంది కదా! వ్యక్తులుగా బలహీనంగా ఆలోచించే క్షణాల్లో సామూహికమైన సత్యమయిన చరిత్ర తన ప్రాధాన్యతను ముందుంచి మనల్ని తేటపరుస్తుంది. “సాహిత్యానికి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులకు ఉన్న సంబంధాన్ని స్పష్టంగా దర్శించి, ఆంధ్రదేశంలోని వివిధ రంగాల పరిణామ చరిత్రను విహంగ వీక్షణంతో తత్వ విశ్లేషణతో విపులంగా చిత్రించారు”అని కెవిఆర్ కృషిని ఎస్వీ. భుజంగరాయ శర్మ గారు తమ ముందు మాటలో అభినందించారు. ఆ వివరాలు కొన్ని ముందుంచడమే ఈ వ్యాసం ఉద్దేశం.
ఆంధ్ర సాహిత్యంలో క్షీణ యుగం అని 17,18,19 శతాబ్దాల తెలుగు సాహిత్యం ఎందుకు చెప్పబడిందో చారిత్రక నేపథ్యంతో ఆయన తెలియజేశారు.”ఎవరి శక్తి మేరకు వారు స్వతంత్రించారు. అలా తలెత్తిన రాజ్యాలే మధుర, తంజావూరు,చెంజి, పుదుక్కోట వగైరా. ఆంధ్రదేశం అంధకార నివేశనం కాగా గోల్కొండ గుడ్లగూబ చిల్లర మల్లర రాజ్యాలను పొడుచుకుతిన సాగింది” అని ఈ క్షీణయుగ చారిత్రక స్థితిని వివరించారు. ఇంకా ” మతాంతరులు మాత్రమే అయిన ముస్లింలను తోసి వేస్తూ, దేశాంతరులు కూడా ఆయిన పశ్చిమ యూరప్ దేశాల వ్యాపార సంస్థలు సూదిగా మొనచూపి దబ్బనంగా పరిణమించ సాగాయి”. అని నాటి చరిత్ర పరిణామ క్రమాన్ని అనేక ఉదాహరణలతో వివరించారు. వ్యవసాయిక సంపద కంటే పరిశ్రమల వస్తువులు మన దేశం నుండి అధికంగా తరలిపోతున్న పరిస్థితులను వలసవాద అభివృద్ధి పరిణామాల్ని విశ్లేషించారు.
దేశంలో ఓడలు బళ్ళు కావడం బళ్ళు ఓడలు కావడం అంటే మొదట ఇక్కడి రాజుల్ని బతిమిలాడి తమ వాణిజ్యపు వ్యవహారాల్ని జరుపుకున్న వలసవాదులు, తామే బలవంతులై ఇక్కడి రాజులే వాళ్ళ సహాయ సహకారాల కొరకు పోటీ పడాల్సిన స్థితి వచ్చింది అంటారు. చరిత్ర పరిణామ క్రమంలో పాలకవర్గాల బలాబలాలు తలకిందులవ్వడం, ఇక్కడ పరాయి పాలకుల పాలనా విధానాలు ముందుకు రావడం ఇంగ్లీష్ వారి పెత్తనం ప్రభావం మన ప్రజలపై నేరుగా పడడం తో ‘దేశ సంపద సముద్రయానం చేసి’ తరలిపోవడాన్ని చెబుతూ “భారతదేశంలో ఇంగ్లీషు రాజ్య స్థాపన, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవ సూచన ఏకకాలంలో జరిగిన మహా సంఘటనలు”అని నాటి పరిస్థితులను, వలస దోపిడీ తో ఇంగ్లాండుకు ఇండియా ‘పెరటితోటైన’ వైనాన్ని భారత ప్రజల జీవితాల్లో కమ్ముకున్న చీకట్లను క్రమంగా అర్థం చేయిస్తారు.
వృత్తుల పైన తమదైన శ్రమపైన ఆధారపడ్డ గ్రామీణ ప్రజల జీవితాల్లో ఈ పెను మార్పు పేదరికాన్ని ఆకలి మంటలని పెంచింది. ఇక్కడి గ్రామ పాలనా వ్యవస్థ పై ‘చావు దెబ్బ’ కొట్టిందని సంఘం గంగాళంలో కళపెళా మరిగే నీటిలా మన సమాజ సంక్షోభాన్ని కళ్ళ ముందుంచారు కె.వి.ఆర్. ఈ ఏకకాల ఘటనల క్రమంలో రెండు దేశాల్లో జరిగిన మార్పుల్ని వివరించారు. ఈ చారిత్రక సందర్భంలో చరిత్రలో నిలిచిపోగల గొప్ప కృషి చేసిన మహనీయులు భాషా శాస్త్రంలో క్యాంబెల్, మన్రో , బ్రౌను వంటి వారు భాషా సాహిత్య సామాజిక విద్యారంగాల్లో జరిపిన కృషిని దాన్ని అందుకొని ముందుకు సాగిన మన సమాజంలోని విద్యావంతుల సంఘసంస్కర్తల సేవలనూ వివరించారు.
“దేశాన్ని చీకటిలో కట్టి పడేసి ఉంచడానికే సంస్కృత విద్య” అనిన నవభారత యుగకర్త రామమోహన రాయ్ ని గురించి పేర్కొన్నారు. అనేక సామాజిక మార్పులను విద్యారంగంలో పాఠశాలల, కళాశాలల ఏర్పాటును లిబరల్ విద్యకు ఏర్పడిన ప్రాముఖ్యాన్ని అదే సందర్భంలో వృత్తి విద్యలకు జరిగిన నష్టాన్ని విశదీకరించారు. దేశంలో ఆంగ్ల విద్యావ్యాప్తితో వచ్చిన తీవ్ర పరిణామాల్ని, జీవన రంగాల్లో వచ్చిన పెను మార్పులను పేర్కొన్నారు. అట్లా క్రైస్తవ మత వ్యాప్తి తో జరిగిన సామాజిక మార్పుల్ని గురించి చెబుతూ, “రెండు లోకాల మధ్య ఘర్షణ, రెండు సంస్కృతుల మధ్య స్పర్ధ” అనీ ఇది తెలుగు సాహిత్య రంగంలో కూడా ప్రతిఫలించిన తీరును, రాజాశ్రయ, సంప్రదాయ చూరు పట్టుకోవడం నుండి తెలుగు సాహిత్యం ఎట్లా బయటపడిందో వివరించారు కె.వి.ఆర్.
ఈ క్షీణయుగ సాహిత్యంపై సామాజిక నేపథ్యం నుండి పండిత వర్గం భాషా సాహిత్య విమర్శకులు వారి వారి ఆలోచనల అవగాహనల మేరకు వివరించిన విషయాల్ని ఉదాహరిస్తూ ఆ యుగపు చీకటిని అందులోనే నిక్షిప్తమై ఉన్న వెలుగునూ కె.వి.ఆర్. తెలియజేస్తారు.
“ప్రబంధ రచనా సంప్రదాయ వేరులోనే పురుగు దూరింది. ఆ ముదిచెట్టు దక్షిణాంధ్ర నాయక రాజుల కాలాన కుక్క మూతి పిందెలు వేయ సాగింది” అంటారు కె.వి.ఆర్. అంతేకాదు ఎవ్వరేమన్నా దక్షిణాంధ్రనాయక యుగం ఆంధ్ర సాహిత్యంలో మునిమాపు వంటిది అని కూడా అంటారు. ఆనాటి సామాజిక స్థితిగతుల నుండి చారిత్రక ఉదాహరణలను పేర్కొంటూ జీవితానికి తగిలిన దెబ్బ సాహిత్యాన్ని కూడా తాగకుండా లేదన్న సారాంశాన్ని, ఈ సందర్భంలో అనేకుల సాహిత్య విమర్శకుల ఉటంకింపుల నుంచి వివరిస్తారు. రాచరిక భూస్వామ్య వ్యవస్థ లక్షణాలతో “స్త్రీ లౌల్యత” పరకీయ శృంగారం ఫలితమే ఈ క్షీణ యుగ సాహిత్య పదార్థం అంటారు కె.వి.ఆర్.
ఫలితంగా ప్రజలు దండయాత్రలకు, పరమత బోధలకూ లక్ష్యమయ్యారు. కవిత్వం జీవితానికి బాగా దూరమైపోయిన కాలమని శ్లేషకవిత చిత్రకవిత ఇంకా కాలికి తగిల్చిన సంకెళ్లు అయినాయని, క్షీణయుగ సాహిత్య రూపాన్ని సారాన్ని ఆయన విడమర్చి చెప్పారు. రాజులను బట్టి కవులు అని, కవిత్వమొక కడుపు నింపుకునే జీవన వ్యాపారం అయిపోయిందని అనేకానేక ఉదాహరణలతో ఉదంతాలతో వివరిస్తారు.
ఇదే సందర్భంలో కె.వి.ఆర్. ఈ యుగంలోని కొన్ని విశిష్టతల్ని తెలియజేస్తూ, వచన వాంగ్మయానికి సాహిత్య గౌరవం చేకూరడాన్ని, యక్షగానం , నాటకాలు వాటి ద్వారా ప్రజా జీవితం సామాన్యుల పాత్రలు, పాత్రోచిత భాష తొలిసారిగా తెలుగు వ్యావహారికం సాహిత్యంలో కనిపించిందంటారు. అయినా కవులంతా అస్వతంత్రులు, అనుకరణ శీలురు. నూతనత్వం లేదు. ఇది ప్రధాన లోపమని చెబుతూనే ఎంత నిరసించినా, కొన్ని అద్భుత విజయాలు 19వ శతాబ్ది సారస్వతం సాధించిందని అంగీకరించాలంటారు. “పిండి కొలది నిప్పటి.అనీ సాహిత్యానికి సమాజమే భూమికనీ.
క్షీణ యుగమన్న ఆనాడూ ఆత్మగౌరవం చిత్తశుద్ధి కలిగిన కవులు లేకపోలేదు. వేల సంవత్సరాలుగా బ్రాహ్మణీయ తంతులా జరుగుతున్న దానధర్మాలు సాహిత్యంలోనూ కొనసాగుతుండగా, దానాలను తీసుకోమన్న పోతన్నలు, లోకాన్ని మతాన్ని విమర్శిస్తూ తత్వ ప్రచారం చేసుకుంటూ, కవులు అనిపించు కోకుండానే కవిత్వం చెప్పిన వేమన్న, వీరబ్రహ్మం, ఏగంటి వారు ఉంటూ వచ్చారంటారు.
సింహాద్రి నారసింహ శతక కర్త గోగులపాటి కూర్మనాథ కవి మొదలగు శతక కర్తలను వారి చారిత్రక స్పృహను గుర్తు చేస్తారు.
సింహాద్రి నారసింహ శతకంలోని గోగులపాటి కూర్మనాథ కవి ఒక పద్యాన్ని ఇక్కడ కొంచెం వివరిస్తాను.
*పారసీకుల దండుపై కొండలో నుండి/ గండు తుమ్మెదలు ఉద్దండలీల తాకి,/ భోరున రక్త ధారలు కురియగా, కరచి /
నెత్తురు పీల్చి కండలెల్ల ఊడి పడ మూతుల వాడి మెరసి…
ఒక్కొక్కని చుట్టుముట్టి, అరుల పరిమార్చి చించి చెండాడి వధియించి చిత్రముగను
దాగె బంభరము లెల్ల ,
వైశాఖ పుర సమీప గిరిబిలంబున అది మొదలు “తుమ్మెదల మెట్ట” అనెదరు… దానిని.
సింహాద్రి నారసింహ శతకం లోని ఈ పద్యం చాలా ఆసక్తి కరమైనది. ఇప్పుడూ తుమ్మెదల మెట్ట అనే పేరుతో ఉన్న సింహాచలం వద్ద ఉన్న కొండ గుహ గురించి చెబుతూ కవి ఆ గుహలో ఉన్న గండు తుమ్మెదలు ఉద్దండ లీలగా పరాసులపై పారశీకులపై చేసిన దాడి . పైకి తుమ్మెదలుగా కనిపించిన
ఆ గుహల్లో నివసించిన గిరిజనుల ఉద్యమాన్ని తెలియజేసే చారిత్రక ఘటన. దురాక్రమణకు గురవుతున్న తమ జీవిత అస్తిత్వాలకై తమ భూమి కోసం ఆ ప్రజలు సామూహిక శక్తిగా ఎట్లా పోరాడారు. ఎంతగా శత్రువును గాయపరచ గలిగారు. మళ్లీ తాము సురక్షితంగా తమ చోటుకి ఎట్లా చేరుకున్నారో వాళ్ల సాహసాన్ని వాళ్ళ ఉద్యమ వ్యూహాన్ని తెలియజేసే ఒక పద్యం క్షీణ యుగంలో మెరిసిన ఓ మెరుపు. సజీవ సాహిత్య ఉదాహరణ. ఇటువంటివే నాటి కాలాన్ని పట్టి ఇచ్చే మౌలిక వాస్తవాలు. మినహాయింపులు.
అందుకే కె.వి.ఆర్ ఆ కవులను ఉద్దేశించి”వారు మురుగు ముంపున పడలేదు. వారి గొంతు వినిపించ లేదు. కాకి గోలలో కోకిల లయ్యారు” అని అంటారు. అయినా మొత్తంగా సమాజ సాహిత్య సందర్భం అధమాధమ స్థాయికి చేరుకున్న తీరును తెలియజేస్తారు. ఇలా మొత్తంగా చూస్తే దక్షిణాంధ్ర యుగం లోని తెలుగు సాహిత్యం ప్రబంధయుగం అనే చెట్టు కాసిన కుక్క మూతి పిందెలు గానే సర్వే సర్వత్రా కనిపించింది. అయినా సమాజ జీవితమనే వేరు కొన్ని ఆశావహ మౌలిక సత్యాల్ని చివురిస్తూనే ఉన్నది. ఇదొక చీకటి కాలపు మినహాయింపు. మినహాయింపు లెప్పుడూ మౌలిక వాస్తవాన్నే రుజువు చేస్తాయని, అనేకానేక చారిత్రక ఘటనల క్రమంలో వ్యక్తుల కృషిలో తారతమ్యాల్లో,ఆ తర్వాతి కాలపు సరికొత్త ఉదయాల్లో కె.వి.ఆర్.సామాజిక మూలాలతో శాస్త్రీయతతో మనకు విషదం చేస్తారు.
ఎంతటి చిమ్మ చీకటులనైనా దాటుకొని జాతి జీవనం అరుణారుణ కాంతిని అందుకునే కాలం వస్తుందనే ఆశావహ దృక్పథాన్ని ఆధునిక భారత సామాజిక క్రమాన్ని కె.వి.ఆర్. వివరిస్తారు. “ఇంగ్లీషు చదువుల పుణ్యమా అని మోడువారి పోతున్న ‘ముదిచెట్టు’ కొత్త చివుళ్లు వేయ సాగింది. అయితే ఆ నూతన విజ్ఞాన స్రవంతి చవిటిపర్రల పాలయింది. కబంధ హస్తం లాంటి హైందవ సంప్రదాయం కొత్తను జీర్ణించుకొని గర్రున తేన్చింది” అన్నారు. ఈ ‘పునరుజ్జీవన’ కాలంలో అరవిందుడు, రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రుడు, బంకించంద్రుడు, రవీంద్రుడు, దయానంద సరస్వతి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ,మైకేల్ మధుసూదన దత్, టేక్ చంద్ వీరంతా నవీన భావాలతో భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలలో చేసిన కృషిని, వారి వారి పరిమితుల్ని పరిథుల్ని విశదీకరించారు. వంగదేశం నుండి విలసిల్లిన ఈ పునరుజ్జీవన వికాసం ఆంధ్రుల సాంస్కృతిక జీవన రంగాల్లోకి,
ఎలా గురజాడ అక్షరాల అడుగు జాడలతో విస్తరించిందో తెలియపరిచారు.” తెలుగువారి మనసుల్ని మలిచిన మహనీయులందరూ అప్పటికి ఇంకా అడ్డాల బిడ్డలే”. అని 1848 త్యాగయ్య మరణం, వీరేశలింగం పుట్టుక. యుగాలు తారసిల్లిన సంవత్సరమది అని వీరేశలింగం వేగుచుక్క… గురజాడ తోకచుక్క అని ఆ తర్వాతి క్రమంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు 1877 కొమర్రాజు వెంకటలక్ష్మణ రావులను ఉదహరించి సాహిత్యం, భాష, మతం,చరిత్ర వీటి మేలి కూడికలైన సంస్కృతికి మళ్ళీ ఊపిరాడింది. తెలుగుదేశం వెలుగులను నీళ్లాడింది అని అద్భుతంగా చెప్తారు.
ఎడారి అంచున వ్యవసాయం చేయబూని గట్టి పంటను పండిస్తూ ఇసుకను దరిదాపులకు రాకుండా చేసిన కర్షకుడు వీరేశలింగం వేగుచుక్క అని, తోకచుక్కను “తలతు నేనిది సంఘసంస్కరణ ప్రయాణ పతాకగా” అని చెప్పిన గురజాడ ఆధునికనితకు ఆద్యుడని, ” సామాజికంగా రాజకీయంగా సంభవించే మార్పుల ప్రభావం సంస్కృతి సాహిత్యాలను బలంగా తాగుతుంది” అనే అవగాహనను అందించిన కె.వి.ఆర్ కృషి ఈ వర్తమాన చీకట్లలో కూడా మనల్ని, ఆయన చూపించిన వెలుగు దారుల వైపు నడిపిస్తుందన్న ఆశావహ దృక్పథంతో…




