కథలో జీవితం కనిపిస్తుంది . ఆ జీవితాన్ని కథ   మన అనుభవంలోకి తెస్తుంది .  ఆ అనుభవం మనల్ని ఆలోచనల్లోకి నెట్టి ఆచరణ వైపు నడిపిస్తుంది . కథ జీవితం లాంటిది. కథ లాంటిది  జీవితం. అదే విప్లవ కథ. అట్లాంటి విప్లవ కథ ‘అంటరాని బతుకమ్మ’. రచన  పి.చిన్నయ్య.

బతుకమ్మ అంటేనే తెలంగాణ. తెలంగాణ అంటేనే బతుకమ్మ. అట్లాంటి బతుకమ్మ ఇవ్వాటికీ కూడా విప్లవోద్యమం బలంగా ప్రభావం చూపిన అతికొద్ది గ్రామాల్లో మినహా అంటరాని బతుకమ్మగానే ఉంది.

ఆ మాట కొస్తే ఒక్క బతుకమ్మ అనేకాదు బోనాలు వంటి ఇతర పండుగల సందర్భాల్లో కూడా బీసీలు, ఇతర అగ్రకులాల వాళ్ళు జరుపుకున్న తర్వాతనో లేక వారికి దూరంగానో దళితులూ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ఈ కథలో మహిళలకు లోన్లు ఇప్పించే బ్యాంక్ మిత్రగా పనిచేస్తున్న పద్మ చదువుకున్న దళిత మహిళ. ఈ కారణంగా మిగతా బీసీ వర్గాల మహిళలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న మహిళ. హిందూమత  సామాజిక కుల కట్టుబాట్ల కారణంగా తోటి మహిళలతో బతుకమ్మ ఆడలేని పరిస్థితి. తనతో నిత్య సంబంధాల్లో ఉన్న మహిళలు కూడా తనని అంటరాని బతుకమ్మగానే చూసారు.

దీంతో అవమానానికీ దుఃఖానికీ బాదకీ గురైన పద్మ …అటువంటి స్థితినుండే కడకు, ఆత్మవిశ్వాసం ప్రకటించింది.

చెమట చేతుల్లో పుట్టిపెరిగిన పూలపండుగ బతుకమ్మ వెలిబతుకమ్మగా ….అంటరాని బతుకమ్మగా ఎందుకయ్యింది?

*మన* సంస్కృతిని లోతుగా పరిశీలించకుండా, దాన్ని ఆధునికంగా , విప్లవాత్మకంగా మార్చలేము. ఇలాంటి దృష్టి కోణాన్ని బలంగా ప్రసరింపజేసే కథ ఇది .

 హిందూ సనాతన ధర్మం రకరకాల పుక్కిటి పురాణాలతో  అంటరాని బతుకమ్మను చేసిన తీరు వివరిస్తాడు రచయిత.

మనిషి ఆలోచనలను ఆవు హైజాక్ చేస్తున్న వేళ కోడి ముక్క గురించే కాదు …పెద్దకూర రుచి పరిచయం చేస్తాడు రచయిత చిన్నయ్య.

అందరం హిందువులం, బంధువులం,  ఒకే రక్త సింధువులం అన్న నోట ‘హిందువులు’గా పరిగణింపబడుతున్న  తోటి మనుషులు అంటరాని వాళ్లుగా …వారు పేర్చిన బతుకమ్మ అంటరాని బతుకమ్మగా ఎందుకు హేళనకు గురవుతుందో తెలుసుకోవడం కోసం మరోసారి చదవాల్సిన కథ ఇది .

సృజనాత్మకత మీద సనాతన ధర్మం చురకత్తి వేలాడుతున్న సందర్భంలో మరొక్కసారి  *అంటరాని బతుకమ్మ* ను మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పి. చిన్నయ్య

‘‘అందరు తెలిసినోళ్ళే గదా నుకుంటి, మనసుల ఇంత విషం ఉంటదనుకుంటే బతుకమ్మ చేసే దాన్నేగాదు…’’ కడుపుల్నుండి తన్నుకొస్తున్న బాధనాపుకుంటూ నా పళ్ళెంల కోడి కూర ఏస్తూ అంది పద్మ. వాళ్లాయన నరేష్, దుర్గయ్య, నేను పక్క పక్కల కూసుని తింటున్నం.

‘‘నేను చెబుతనే ఉంటి ఈ పండుగ మనది గాదని. చేసుకుంటే చేసుకుంటివి. పోయి మన కులపోళ్ళ దగ్గరాడనుంటివి. గా సూదరోళ్ళ దగ్గరెందుకు పోయినవు?’’ అన్నడు నరేష్.

‘‘గిట్లయితదనుకున్ననా?’’ గుర్రున చూసింది పద్మ.

‘‘గాకుంటే ఏమైతది? ఏమన్న ఇప్లవం వచ్చిందనుకుంటున్నవా. అంతా మారి పోయి పై కులపోళ్ళతో ఆడెతందుకు?’’ కాస్త కోపంగా అన్నడు నరేష్.

నరేషను వారించిన. రాత్రంత నిద్రలే మితో గడిచినట్టుంది ఇద్దరికీ. ఇంతగనం చెప్పినా పద్మకర్థం కావటం లేదని నరేష్ కోపం.

పద్మను ఎట్ల ఓదార్చాలో నాకూ అర్థం కావటం లేదు. ఇటువంటి సంఘటనలు కొత్త గాకపోయినా పద్మకు కొత్తే. నిన్న రాత్రే జరిగిందంత ఫోన్ జేసి చెప్పిండు నరేష్. రాత్రంత దీని గురించే ఆలోచనల పడ్డట్ట యింది నాకు.

దసరా పండుగ దినం. ఇల్లంతా కలకలలాడాల్సింది పోయి బిక్క ముఖం ఏసినట్టయింది. వాతావరణాన్ని తేలిక చేయటాని కన్నట్టు ‘‘ఏంది చెల్లే, కోడి ముక్కలె ఏస్తున్నవు. పెద్ద కూర (గొడ్డు మాంసం) తేలేదా నరేష్ బావ!’’ అన్నడు దుర్గయ్య.

‘‘తెచ్చిండు. నేనె వండలె. ఆయన్నె వండుకొని తినమన్న’’ అంది ఉక్రోషంగా.

‘‘ఎంతయిన చెప్పు చెల్లె, ఆ కూర మీదకు ఈ చికెనేమొస్తది? మధ్యాహ్నం గౌస్మియా వస్తనండు. బిర్యానీ వండుతం తీయి…’’

ఇంకో సమయములైతె దుర్గయ్యతో వాదనకు దిగేది. కాని ఇప్పుడు వేటినీ పట్టించుకునే స్థితిల లేదు పద్మ.

నిన్న జరిగిన సంఘటనతో పూర్తిగ ఆత్మరక్షణల పడ్డట్టయింది. దాన్ని తలచుకుంటేనే తలలో నరాలు చిట్లినంత బాధ. ఎవరో తెలియనోళ్ళయితే పట్టించుకునేది గాదు. అంతా తన సుట్టుపక్కలోల్లె. చెల్లె, అక్కా, ఒదినా అన్నోళ్ళే. కనీసం గౌళోల్ల సరిత, సాకలోల్ల లక్ష్మి ‘ఏమైతది ఆడితే’ అని తనవైపు మాట్లాడకపోతిరి. అదే మింగుడుపడటం లేదనుకుంటా పద్మకు.

పద్మ ఈ వూర్లనే గ్రామీణ బ్యాంకుల బ్యాంక్ మిత్రగా పనిచేస్తుంది. మహిళా సంఘాలకు లోన్ ఇప్పించటం, తిరిగి కట్టించడం, వాటికవసరమైన ఓచర్లు రాయటం, సలహాలివ్వటం చేస్తుంది. దాంతో ఊర్ల మహిళలంత బాగా పరిచయం. పైగా అందరితో కలగలుపుగా కలుపుకొనిపోతది. అందరు తనను మంచిగనే గౌరవిస్తున్నట్టనిపించేంది పద్మకు.

కాని నిన్నటి అవమానం సమస్త నమ్మ కాల్ని కోల్పోయేటట్టు చేసింది. ఇదివరకు

నరేష్ కులాల గురించి వాదనకు దిగినప్పుడల్లా కొట్టిపారేసేది. ఈ కాలంలో వాటిని ఎవరు పట్టించుకుంటున్నరనేది. మనం మంచిగుంటే అందరు మనతో మంచిగుంటరని వాదించేది.

“కొద్దిగా కూర ఏసుకోన్నా”  నా పళ్ళెంలో కూర వేయబోయింది పద్మ.

“వద్దులేరా, సల్లున్నాదా?’’ అన్న.

‘‘రాజరెడ్డన్నకు ఏదున్న లేకపోయిన సల్లో పులుసో ఉంటే సాలు. మా ఇంట్లకూడ గవే పోసుకుని తింటడు’’ కూర ఏసుకుంట అన్నడు దుర్గయ్య.

‘‘కాదన్న, మీటింగులపుడు ఊరు ఊరున గౌరమ్మలు చేసి, బోనాలు పెట్టి అన్ని కులపోళ్ళు ఒక దగ్గర కలిసి ఆడినపుడు కులమంటు లేదుగాని, నిన్న సద్దుల బతుకమ్మ రోజున వాళ్ళతో ఆడితె తేడాలొచ్చినయా?’’ నా పళ్లెంల సల్లపోస్తూ అంది పద్మ.

‘‘అన్న నడిగితె ఏమి చెబుతడు? డబ్బులిచ్చి బతుకమ్మల్నాడిచ్చి బోనాలెత్తించిన ఆ పార్టీలను, జాగృతోళ్ళనడుగు ఏం చెబుతరో చూద్దం’’ అన్నాడు నరేష్ ఎకసెక్కెంగా.

‘‘ఎవర్నడుగుతది చెల్లె. ఆ నాయకురాలికి విదేశాల్లో బతుకమ్మలాడటమే సరి పోయె. మన వాడలకొచ్చె తీరికేది? అయినా వాళ్ళకు గావల్సిన తెలంగాణ వాళ్ళకొచ్చె …’’ కట్టె ఇరిచినట్టు మాట్లాడుడు అలవాటె దుర్గయ్యకు.

నిజమే, ఉద్యమ సమయంలో బతుకమ్మలను బోనాలను మంచికో, చెడుకో వాడుకున్నరు. మీటింగులకు, బతుకమ్మల ప్రదర్శనకు పద్మ, సరిత, లక్ష్మిలాంటోళ్ళకు డబ్బులిచ్చి బతుకమ్మలు తయారు చేయించినరు, ఆడిరచినరు, బోనాలు ఎత్తించినరు. అప్పుడు కులమంటు లేదు. కులాలడ్డు రాలేదు.

పద్మ మొండితనం ఏంటో ఆమె చిన్నప్పటి సంది చూస్తున్నదే. ఏదన్న పట్టిందంటె ఒదలదు. స్కూల్ల ఆటల్లో పాటల్లో మగ పిల్లలతో సమానంగ పోటీ పడేది. ఆ కాలంలో విప్లవ పాటలతో మా రు మోగుతుండేది ఈ ప్రాంతమంత. పద్మ అద్భుతంగా పాడేది. స్కూల్లో, ఊర్లో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగిన ఈమె గొంతు మోగాల్సిందె. తర్వాత తెలంగాణ పార్టీలకు ఈమె గొంతు కావల్సి వచ్చింది.  వాళ్ళతో ఎట్ల ఉండాలో పద్మకు తొలి నుంచి జాగ్రత్తలు చెబుతనే ఉండేవాడు నరేష్.

‘‘అసలు ఎట్ల జరిగిందో చెప్పు చెల్లె?’’ నిన్న జరిగిన విషయం గురించి అడిగిండు దుర్గయ్య.

అసలె సైనస్ మనిషి. రాత్రంత భార్యాభర్తల మధ్య జరిగిన సంవాదం, నిద్రలేమి, ఆందోళనతో ఆమె ముఖమంత ఎరుపెక్కింది. నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టింది పద్మ.

‘‘… నరేష్ చెబుతనె ఉండె, లేంది పోంది ఎందుకు పెట్టుకుంటవని, నేనె వినలె. మీటింగులకు బతుకమ్మలు చేసుడ లవాటయ్యె. పాణమాగలేక మా పెద్ద బావ కొడుకును పువ్వు తెమ్మంటె తంగేడు, గునుగుతెచ్చిండు. ఇంట్ల కాగితప్పూలుండె. వాటిని కలిపి బతుకమ్మను పేర్చిన. మీటింగులకు పోయిపోయి కులపోళ్ళతోనె ఆడాలనె సోయి లేకుండె. అయినా మా కులపోళ్ళు రెండు బజార్లవతలుంటిరి. మీటింగులకు బతుకమ్మలను మా ఇంట్ల, పేరుస్తుంటిమి. సరిత, లక్ష్మి గూడ బతుకమ్మను ఎట్ల పేర్చాలో మా ఇంట్లనే నేర్చుకున్నరు. ఆసోపతితోనే సరిత దగ్గరకు పోయి నిన్న పొద్దునె చెప్పిన నేను గూడ వాళ్ళతో వస్తనని. నా మాటలకు వాళ్ళేమి మాట్లాడ లేదు. నాకప్పుడు అర్థం గాలె.

సాయంత్రం బతుకమ్మలను తీసుకొని ఊరి మధ్యకు పోవాలంటే ఈ వాడకటోళ్ళందరూ మా ఇంటి ముందునుండె పోవాలి. పోయే ముందు సరిత, లక్ష్మి చెబుతరు తీయనుకున్న. ఆడికీ వాళ్ళింటికి ఒకట్రెండుసార్లు పోయొచ్చిన. వాల్లు ఉల్కుతలేరు పల్కుత లేరు. సరిత వాళ్ళత్త గొణుగుతుంది ఎందుకో. పండుగ సందట్లో నేను గూడ పట్టించుకోలె.

అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నయి. నరేష్ కంపెని నుండి రాలె ఇంకా.

పిల్లలు పెద్ద బావింటికి పోయినరు. ఇంటికి తాళం వేసి బతుకమ్మను ఎత్తుకొని బయటకొచ్చిన. వాడ కట్టొళ్ళు ఒకర్ని చూసి ఒకరు బతుకమ్మ లెత్తుతున్నరు. సరిత వాళ్ళింటివైపు నడిచిన. ఇంట్ల చూస్తే ఎవరు లేరు. ‘ఇగో ఇపుడే పోయినరు’ ఎవరో ఎనక నుండి అన్నరు. గబగబా నడుచుకుంట గుంపు దగ్గరకు చేరుకున్న. అందరు ఊరి మధ్యకు చేరుకున్నం. ఎప్పటిలాగే అలల్లవాళ్ళు బతుకమ్మలను దించుతున్నరు. అప్పటికే కోమటోళ్ళు, కాపోళ్ళు ఓ అడ్డ దగ్గర బతుకమ్మ ఆడటానికి సిద్ధంగా ఉన్నరు. నేను పోయి సరిత, లక్ష్మి బతుకమ్మల పక్కనే దించబోయిన. పక్కనే ఉన్న సరిత వాళ్ళత్త‘‘ఏంది పిల్ల ఈడ దించుతున్నవు?’’ అంది.

‘‘ఏందత్త అట్లంటున్నవు, ఆడెతందుకు!’’

‘‘మీ వాళ్ళ దగ్గరకు పోయి ఆడు.’’

‘‘ఈడ ఆడితే తప్పేంది అత్తా?’’

‘‘తప్పుగాదా! ఎప్పుడు లేంది ఊర్ల కొత్త పద్దతి తీసుకొస్తున్నవు. కులమాచారా లుండొద్దా? సిరి నీకుంటే మా వుండొచ్చు గాని, నీ దగ్గరే పెట్టుకో.’’

ఆ మాటలతో నోట మాట రాకుండ యింది. తల గిర్రున తిరిగినట్టయింది. నెత్తిలున్న బతుకమ్మను అట్లనే నేలగొట్టి పోదామనిపించింది. ఇంతలో సరిత దగ్గరికొచ్చి..

‘‘ప్లీజు పద్మ, నీవు ఈడ బతుకమ్మను పెడితే వీళ్ళు ఆడరు, పోయి మీ కులపోళ్ళ దగ్గర ఆడు’’ నెమ్మదిగ బతిమిలాడుతున్నట్లు బాధతో అంది.

నెత్తిన పిడుగు పడ్డట్టయింది.

సరితగూడ ఇట్లనుడేంది? లేసిందగ్గర్నించి ఇంట్లకొచ్చి కష్టసుఖాలు చెప్పుకునెటోళ్ళు, తిని పోయేటోళ్ళు, కూరలు ఏసుక పోయెటోళ్ళు …తల మొద్దుబారినట్లయింది. అందరు నా వైపె చూస్తున్నరు. సిగ్గుతో నెమ్మదిగా కులపోళ్ళ అడ్డ దగ్గరకు పోయిన. ఎట్ల ఆడిన్నో, పాడిన్నో, అందరికంటే ముందు చెర్ల పడేసి వచ్చిన …’’ పద్మ ముఖం మరింత ఎర్రగా మారింది..

‘‘నీ మంకు నీదేనాయె. చెబితే ఇంటవా? పై కులపోళ్ళు నిన్ను ఎట్ల కలుపుకుంటరనుకున్నవు? పిచ్చిదానివి కాకుంటే’’ ఈ మాట అని, ఎవరో పిలవడంతో బయటకు పోయిండు నరేష్.

తిరిగి లోపలికొచ్చి బీరువాలో పెట్టిన క్వార్టర్ మందు బాటిల్ తీసి బయట ఇచ్చిచ్చిండు.

‘‘పండగొస్తే చాలన్న … పాలోళ్ళతో గొడవ. మందు పోపియ్యకుంటే తిడుతరు. ఆ భయంతోనె నిన్న గుట్టలో పట్టుకొచ్చిన’’ నా పక్కన కూర్చుంటు అన్నడు నరేష్,

‘‘ఓ పెగ్గేస్తవా!’’ దుర్గయ్యనుద్దేశించి అన్నడు.

ఆ ‘‘అమ్మో వద్దన్నా…’’

‘‘పండుగేగా!’’

‘‘మరిచిపోయిందాన్ని మళ్ళా అలవాటు చేసుకొనుడెందుకు!’’

‘‘గట్టిగానే నిలబడిరడు దుర్గన్న!’’ నవ్వుతు అన్నడు నరేష్.

దీనికో కారణముంది. దుర్గయ్య పదో తరగతి తప్పినంక బండకొట్టె పనిల పడ్డడు. దుర్గయ్య ఒక్కడే గాదు. కులపోళ్ళంత బండ కష్టాన్ని మరిచెటందుకు మందుకు అలవాటుపడతరు. మామూలుగా తాగితే బాగె. కాని నాటుసారాకు బానిసగా మారిండు. ఆ సమయంలోనే ఉద్యమం పరిచయమయింది. తాగుడు మాన్పించటానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఫలితంగా సారా మరిచిపోయి కల్లుకు మాత్రం పరిమితమైండు.

‘‘ఇంట్లకు మందు తీసుకరావద్దని ఎంత ప్రయత్నించిన తప్పటం లేదన్న’’ తప్పు చేసిన వాడిలా అన్నడు నరేష్.

‘‘ఒక్కసారిగ ఏదీ మారదు. ఓపికతో మార్చుకోవల్సిందే’’ అని నేన్నననో లేదో-

‘‘కాదన్న ఈ పండుగను అన్ని కుల పోళ్ళు కలిసి ఆడెటట్టు చేయలేరా?’’ పద్మ అందుకుంది.

‘‘దీన్ని మార్చుడంటె అంత సులబమ నుకుంటున్నావా ఏంది?’’ అన్నాడు నరేష్.

‘‘ఎన్ని మారిపోట్లె.. ఇదో లెక్కా’’ అంది పద్మ.

‘‘మొండి వాదన సేయకు, తెలంగాణ వచ్చినంత సులబం గాదు దీన్ని మార్చుడంటే…’’

‘‘గదే ఎట్ల మారుతదో చెప్పు? ఏమన్నంటే ఆ విప్లవం, ఈ విప్లవం రావాలంటవు. అసలు సాంస్కృతిక విప్లవం అంటే ఏందన్న?’’ చివరికి పంచాయితి నా దగ్గరకొచ్చింది.

ఇద్దరి మొండితనం తెలుసు నాకు. ఈ ఇద్దరు మొండోళ్ళు ఎట్ల ప్రేమించి పెండ్లి చేసుకున్నరో ఆలోచిస్తే ఆశ్చర్యమనిపిస్తది!

వాళ్ళ పెండ్లికి కొన్ని నెలల ముందు ఉద్యమం నుండి బయటకు వచ్చుంటి. తన కూతురును నరేష్ కిచ్చి పెండ్లి చేయటం పద్మ తండ్రి కిష్టం లేకుండా… ఒక్కగానొక్క కూతురు. అంతకంటె అడ్డంకి నరేష్ ఒకటి రెండుసార్లు సానుభూతిపరుడనే పేరుతో బైండోవర్ చేయించబడ్డాడు. నరేష్కు, పద్మ తండ్రికి దూరపు బంధుత్వముంది. ఉద్యమావసరాల రీత్యా ఊరికి , వచ్చి పోతుండటం, పద్మ కాలేజీకి పోతున్న సమయంలో వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది.

పద్మ తండ్రి నాకు కూడ బాగా పరిచయమే. ఉద్యమంలో భాగంగా చాలాసార్లు అతని దగ్గరకు పోయినవాన్నె. ఆ చనువుతోనే నా దగ్గరకొచ్చి.

‘‘బిడ్డా, పద్మ ఎంత చెప్పిన ఇనటం లేదు, వాన్నె పెండ్లి చేసుకుంటనని మంకుపట్టుపట్టింది’’ అన్నడు.

‘‘మంచిదేగా ఇవ్వరాదు!’’ అన్న నేను.

‘‘ఏంది బిడ్డా అట్లంటున్నవు? అంతా తెల్సినోనివి. ఎట్టియ్యాలి చెప్పు?’’

‘‘నరేష్కిస్తే నష్టమేంటి? కంపెనీల పని చేస్తుండు. పద్మను మంచిగనే సాకుతడు.’’

‘‘అదిగాదు, లోపలికి పోతడేమోనని?’’ తన అనుమానాన్ని, బయాన్ని బయట పెట్టిండు.

నాది, నరేష్ది, పద్మ తండ్రిది పక్కపక్క గ్రామాలే. నరేష్తో పదేండ్ల స్నేహం కాబట్టి గట్టిగానే చెప్పా.

‘‘ఉద్యమంలోకి ఏం పోడు. పెండ్లి చేయి….’’

‘‘కాదు బిడ్డ, పెండ్లయ్యాక ….’’

‘‘నీవేమి బయపడొద్దు, వాళ్ళిద్దరు నా దగ్గరకొచ్చినరు. అన్ని మాట్లాడిన వాళ్ళతో….

ఇంత వాదనయ్యాక చివరికి వెళ్ళిపోతు అన్నడు పద్మ తండ్రి.

‘‘నీ ధైర్యంతో ఒప్పుకుంటున్న, ఏదన్న జరిగితె నీదే బాధ్యత’’ కోపంతో అలుగుతు నా మీద భారం వేసి పోయిండు. అట్ల వాళ్ళ పెండ్లయిపోయింది.

‘‘పద్మ ఉన్నవా?’’ బయటి నుండి ఎవరో పిలవటంతో ముందు గదిలకు పోయింది పద్మ.

‘‘అన్నా ఈడ కూర్చుంటే ఎవరో ఒకరొస్తుంటరు గాని, ఎన్కకూర్చుందాం’’. అంటూ కుర్చీలను, మంచాన్ని ఇంటెనుక వేపచెట్టు కిందకు మార్చిండు నరేష్.

ప్రభుత్వం కట్టించిన రెండు గదుల ఇల్లు అది. దానికి మరో రెండు గదులు కలిపి ఇంటిని మార్చుకుండు నరేష్. ఇంటెనుక మట్టి ప్రహరిగోడ ఉండేది. దాన్ని తీసేసి సిమెంటు ఇటుకలతో కట్టించాడు. ఇంటెనుక ఉన్న వేపచెట్టు గాలికి పాత జ్ఞాపకాలు ముసురుకుంటున్నాయి.

ఈ గ్రామ సమస్యలెగాదు, చుట్టు పక్కల గ్రామ సమస్యలు ఎన్నిసార్లు ఈ చెట్టు కింద కూర్చుని చర్చించలేదు! ఎన్ని తీర్మానాలు జరగలేదు! ఆ మనుషులు, ఆ చర్చలు, ఆ వాతావరణము ఎటుపోయె? నాలాటోడు నిలబడలేక ఏవో కారణాలతో బయటకొచ్చిండొచ్చు…

‘‘ఏందన్న ఆలోచనలబడ్డవు?’’

‘‘ఏం లేదు దుర్గయ్యా చెప్పు!’’ ఆలోచనల నుండి బయటకొస్తూ అన్నా.

‘‘నేనో మాటడుగుతా, ఏమనుకోరుగా’’ మమ్మల్ని ఉద్దేశించి అన్నడు దుర్గయ్య.

‘‘దీంట్లేముంది, ఏదో కొత్తని లెక్కడు గుతున్నవు!’’ నరేష్.

దుర్గయ్య ముందు రూంలకు పోయి చూసొచ్చిండు. పద్మ లేనట్టుంది.

‘‘కాదన్న, చెల్లె అంత గానం బాధపడుతున్నది గాని దళితులు కనీసం పై కులపోళ్ళ పక్కనన్న ఆడుతున్నరు మనూర్ల. మా వడ్డెరోళ్ళకు పండుగే లేదు. మాకెంత బాదుండాలి’’ దుర్గయ్య మాటలతో నిశ్శబ్దంగా మారినట్లయింది వాతావరణం.

నరేష్ ప్రశ్నార్థకంగా నా ముఖంలోకి చూసిండు. వెంటనే ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. కాస్త తేరుకొని అన్న.

‘‘కాదు దుర్గయ్య. మీ కులపోళ్ళకు చెరువుతో సంబంధం లేదుగా, అందుకె పండుగ లేనట్టుంది మీకు..’’

‘‘సరే అన్న మా కుల ‘‘కాదుదు పోళ్ళకు చెరువుతో సంబంధంలే సంబంధం లేదు. గా కోమటోళ్ళు, బాపనోళ్ళు, సాలోళ్ళు, హంసలోళ్ళు, వడ్లోల్లకు చెరువుతో సంబంధముందా? వ్యవసాయం చేస్త సాయం చేస్తుండ్రా వాళ్ళు? వాళ్ళకుండి, మాకెందుకు లేకుండ పోయింది?’’ వాదనకు దిగిండు దుర్గయ్య.

ఇట్ల దుర్గయ్యతో వాదనకు దిగుడంటే ఇష్టం నాకు. నాకు తెలియని సంగతులు, సామెతలు ఎన్ని చెబుతడో!

మొదట్లో బతుకమ్మను అన్ని కులపోల్లు కలిసి చేసుకుంటరని అనుకునేటోన్ని. ఉద్యమంలోకి పోయాకగాని అర్థంగాలే. ఇది కొందరికే పరిమితమైన పండగని, దీంట్లో ఇన్ని తేడాలున్నయని.

ఓ ఊర్ల ఇరవై ఏండ్ల కింద జరిగిన సంఘటన ఇప్పటికి కండ్లల్ల మెదుల్తానె ఉంటది.

ఉద్యమావసరాల రీత్యా ఆ ఊర్ల రెండు మూడు రోజులు ఉండాల్సి వచ్చింద ప్పుడు. ఆ ఊర్ల ఒక ఆర్ యంపి డాక్టరు చాలాకాలం నుండి వైద్యం చేస్తుండు. ప్రజల్లో మంచి పేరుంది. ఆ రోజు సజ్జల బతుకమ్మ. ఆ డాక్టరు భార్య ఇంటి పక్కన ఉండే కాపోళ్ళు, కురుమోళ్ళు, గౌళోళ్ళతో బతుకమ్మ ఆడిరది. దసరా పండుగ తెల్లారి పెద్ద గొడవ. ఎవరు చెప్పారో, ఎట్ల తెలిసిందోగాని ఆ డాక్టరు దళితుడని తెలిసిపోయింది. ఊర్లున్న బిసి, అగ్రకులపోళ్ళు ఏకమై డాక్టర్ హాస్పిటల్ మీద ఇంటి మీద దాడి చేసినరు. ఇంట్లున్న సామానులన్ని బయటపడేసి ఊరి నుండి వెళ్ళగొట్టినరు. కండ్ల ముందు జరిగిన విషాదం, కదిపేసి నట్లయింది నన్ను.

‘‘గింత ఘోరమా? అయినా అన్ని కులపోళ్ళు కలిసి చేసుకునే పండుగేగా?’’ తోటి క్రామేడ్స్తో అన్న ఆవేదనతో.

‘‘ఈ పండుగ గురించి పూర్తిగా తెల్వనట్టుంది అన్నకు’’ ఓ దళిత కామ్రేడ్ అన్నడో లేదో …

‘‘ఎట్ల తెలుస్తది, ఈ ప్రాంతపోడు గాదాయె, ఈ మతంగాదాయె, ఎట్లర్లమవుతయి ఈడి కట్టుబాట్లు!’’ మరో కామ్రేడ్ అన్నడు.

వీళ్ళ అన్నదాంట్ల వాస్తవముంది. తాను పుట్టింది. ఈ ప్రాంతంలోనైన, తన తల్లిదండ్రులు వేరే ప్రాంతం నుండి వచ్చి స్థిరపడి నోళ్ళు, దానికితోడు పదో తరగతి వరకు బయట ప్రపంచం తెలియకుండ మిషనరీ స్కూళ్ళ, చర్చి విశ్వాసాలతో పెరిగినోన్ని. ఉద్యమ పరిచయం ఆ జ్ఞాపకాల్లోంచి బయటికి లాగుతూ … మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళింది నన్ను.

‘‘కాదన్న, ఈ పండుగను ప్రకృతి పండగని, పూల పండుగని అంటున్నరుగదా. పొద్దున లేస్తే పుట్టలు, చెట్ల గట్ల మీదుండె మాలాంటోళ్ళకు ఎట్ల లేకుండాపోయె?’’ అమాయకంగా అడిగి నా మెదడుకు పని పెట్టిండు దుర్గయ్య.

పొద్దున లేస్తే బతుకు కోసం వెతుకులాడే అట్టడుగు సంచార జాతులకు పండుగల గురించి పట్టించుకొనే తీరికెక్కడిది? కడుపు నిండితె అదే పండుగ. దుర్గయ్యతో అదే అంటే ఒప్పుకోడు. ‘‘మేము సంచార జాతులమా ఇప్పుడు?’’ అని వాదనకు దిగుతడు. పోని వాళ్లను …. స్థిరపడిన కొన్ని కులాలకు కూడా ఈ పండుగ లేదు. ఆ కులాల పెద్దాళ్ళనడిగితే ఒకే కథను ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా చెప్పెటోళ్ళు.

‘ఎన్కట ఎప్పుడో జరిగిందంట. మా కులంది ఒకామె పనికిపోయి పొద్దంత పని చేసి చీకటిపడేటప్పుడు ఇంటికి చేరుకుంది. పండుగుందని గుర్తొచ్చి గబాగబా తానం చేసి, ఇంటి పక్కనున్న తంగేడు, గుమ్మడిపూలు తెంపి బతుకమ్మను పేర్చబోయింది. బతుకమ్మను పేర్చేటందుకు ఇంట్ల ఎంటెతికిన కనీసం శిబ్బిగూడ కనపడలేదు. ఏం చేయాలో అర్థంగాలా. ఇంటెనుక ఆవు పుర్రె కనిపిస్తే సంతోషంతో దాన్ని తెచ్చి బతుకమ్మను పేర్చింది దాంట్ల. తర్వాత దాన్ని తీసుకొని చెరువు దగ్గరకు బయలుదేరింది. ఎట్ల కనిపెట్టినరో ఏమోగాని, వాసన కనిపెట్టినరు పై కులపోళ్ళు, ఆవు పుర్రెల బతుకమ్మను పెట్టి తెచ్చినవు కనుక ఇప్పటి సంది మీకు బతుకమ్మ ఉండదని కట్టడి జేసిండ్రంట’ అని ఒక ముసలామె చెప్పింది ఊర్ల.

మరో దగ్గర, ‘పొద్దంత పనికి పోయెచ్చిన మా గూడెపామె అట్లనో ఇట్లనో బతుకమ్మను పేర్చింది గాని, వాయినానికి ఎంత ఎతికిన గింత పిండి దొరకలె. ఏం చేయాలో అర్థంగాక కిందమీదు అవుతుండగా, దండెమ్మీది తునకలు గుర్తొచ్చి, గబగబా వాటిని కాల్చుకొని బయలుదేరింది. దారిల కాకులు వాసనపట్టి ముక్కలతో పాటు బతుకమ్మను తన్నుకుపోయినయి. గప్పటి సంది పెద్ద కులపోళ్ళు మా కుల పోళ్ళకు బతుకమ్మ లేదని తీర్మానం చేసిండ్రంట’ కుల పెద్దాయన చెప్పిండు.

ఇంకో దగ్గర, ‘అప్పుడెపుడో ఊర్ల పెద్ద కరువొచ్చిందంట. ఆ కరువుల పై కుల పోళ్ళు ఏమోగాని, మా జాతోళ్ళు తిండిలేక మలమలలాడినరు. ఎంత హీనమంటే తినడానికి గింత తవుడు గూడ లేకుండ ఉండె. గటువంటి కష్టంలో మా జాతోళ్ళు బతుకమ్మ తబుకును అమ్ముకున్నరు. అగో గప్పటి సంది మాకు బతుకమ్మ లేకుండా పోయిందని మా పెద్దాళ్ళు చెబుతరు మాకు’ అని ఆ వూర్ల చెప్పినరు.

ఇట్ల అనేక జానపద కథలు పుట్టుకొచ్చినయి. శ్రామికులు బతుకమ్మకు ఎట్ల దూరమయ్యారనే ప్రశ్నకు మాత్రం నాకు జవాబు దొరకలా.

‘‘ఎల్లమ్మ గుర్తుందాన్న? అచ్చం పద్మ లాగే పాటలు పాడేది!’’ అన్నడు నరేష్,

‘‘ఎందుకు లేదు!’’ పదిహేనేండ్ల కింది విషయం గుర్తుకు తెచ్చుకుంటా అన్న.

‘‘మీ పాలామేగా?’’ అన్నడు దుర్గయ్య.

‘‘అవును. అప్పట్లోనే ఎల్లమ్మ పాటలు పాడుతుంటే సూదరోళ్ళు, పైకులపోళ్ళు బతుకమ్మ ఆడెటోళు…’’ మరిచిపోయిన ఎల్లమ్మను తిరిగి జ్ఞాపకాల్లోకి తీసుకొ చ్చిండు నరేష్.

ఎల్లమ్మ గురించి విన్నది గాని ప్రత్యక్షంగా చూసింది లేదు. ఆమె అద్భుతమైన గొంతు క్యాసెట్ల ద్వారా విన్నదే. ఆమె పాటలు వింటుంటే బెల్లి లలిత గుర్తుకు రావాల్సిందె. బతికుండగా ఆమెను ఎందుకు చూడలేకపోయానన్న బాధ ఇప్పటికీ వేధిస్తుంటది. ఎల్లమ్మ గురించి తెలుసుకునే ముందు ఆమె వూరు గురించి తెలుసుకోవాలి. తెలంగాణలోనే ఆ ఊరుకు ఓ ప్రత్యేక తుంది. తెలంగాణ సాయుధ పోరాటం నుండి ఇప్పటి పోరాటాల వరకు ఉద్యమకారులకు జీవం పోసిన ఊరది. ఊరి బయట విసిరి వేయబడెటట్టుండె దళితవాడలు కాల క్రమంలో ఊరి మధ్యకైనయి. దళితుల ఇండ్ల పక్కనె బిసి, ఉన్నత కులాల ఇండ్లు కలగలిసిపోయినట్టయినయి. ఎల్లమ్మ పాటలు పాడుతుంటే బిసి, ఉన్నత కులాల స్త్రీలు బతుకమ్మ ఆడేది. చిత్రమైన విషయం ఏమిటంటే దళితులు, బిసిలు, పైకులపోళ్ళు ఊరి మధ్యలో ఆడటం!

ఈ మార్పుకు ఓ కారణముంది.

ఆ ఊర్లనే సాతాను శేషయ్య పంతులనె పెద్దాయనుండేటోడు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కొరియర్గా పనిచేసిండని చెప్పుకుంటరు. పెండ్లి చేసుకోలె. ఎల్లమ్మతో స్నేహంగా ఉండేవాడని అనుకుంటరు.

తమ వాడల్లో బతుకమ్మ ఆడుకునే దళితులను డప్పులు కొట్టించుకుంటూ ఊరేగింపుగా ఊరి మధ్యకు తీసుకొచ్చెటోడు శేషయ్య పంతులు.

కొంతమంది పెత్తందార్లకిది ఇష్టం లేకుండె. కోపంతో అడ్డుకోటానికి ప్రయత్నం చేశారు. కాని ఆ ప్రాంతమంత ఎన్కౌంటర్లతో, దాడులతో దద్దరిల్లుతున్న కాలమది. పైగా నక్సలైట్లు వాళ్ళ వాడల్లోనే ఉంటారనే ప్రచారమొకటి. ఆ భయంతోనే గొడవలెందుకని ఊరకుండిపోయారు పెత్తందార్లు. అట్ల ఊరి మధ్యలో పైకులపోళ్ళ పక్కనే ఆడటం తెలంగాణలో ఒక అరుదైన దృశ్యం!

అప్పట్లోనే ఎల్లమ్మలాంటి ఓ దళిత స్త్రీ మధ్యల నిలబడి పాటలు పాడుతుంటే, పైకులపోళ్ళు బతుకమ్మ ఆడినరు. అటువంటిది, కాలం ఇంత మారాక కూడా పద్మ లాంటి వాళ్ళను కనీసం బిసి కులాలు ఎందుకు తమతో కలుపుకోని స్థితిల ఉన్నరు? ఈ సమస్య ఎట్ల పరిష్కారం కావాలి? ఎవరాలోచనల్లో వాళ్ళుండగానే హఠాత్తుగా గౌస్మియా వచ్చిండు. అతన్ని చూడగానే

‘‘నీ కోసమే ఎదురుచూస్తున్న, పెద్ద కూరతో బిర్యాని చేయాలి మనము’’  అన్నడు దుర్గయ్య.

‘‘బిర్యాని సంగతి తర్వాతగాని, నిన్న మా పెద్దమ్మ ఊర్ల జరిగిన విషయం పేపర్ల వచ్చిందన్నా’’ ఆ దగ్గరున్న దినపత్రికను చూస్తూ అండు గౌస్.

‘‘ఏ విషయము?’’ అడిగిన.

‘‘నిన్న యాదగిరిగుట్టకు పోతిగా. వస్తూ వస్తూ దార్ల మా పెద్దమ్మింటికి పోయిన పనుందని. పెద్ద గొడవయింది. ఊర్ల పండగ గురించి…’’

‘‘ఏం గొడవ?’’ ఆత్రంగ అడిగాడు నరేష్.

‘‘నిన్న సజల బతుకమ్మగా! మాల మాదిగలు తెలంగాణొచ్చిన సంబురంతో ఎప్పుడూ లేంది వాళ్ళ వాడల నుండి గ్రామ పంచాయితి దగ్గర కొచ్చినరు బతు కమ్మ ఆడెటందుకు. ఈడ ఆడొద్దని పైకుల పోళ్ళు అడ్డుపడ్డరు. మీతో ఆడం పక్కనే ఆడుకుంటమని దళితులు బతిమిలాడుకు న్నరు. పైకులపోళ్ళు ఒప్పుకోలే. మీరొచ్చి ఈడ ఆడితే మా బతుకమ్మ మైలపడుతదని బండబూతులు తిట్టినరు. కోపమొచ్చి బతుకమ్మలను చెర్ల వేయకుండా ఆడనే కూర్చున్నరు దళిత స్త్రీలు. పోలీసులకు ఎట్ల తెలిసిందోగాని ఊర్లకు వచ్చి, దళితులకు సర్దిచెప్పి బతుకమ్మలను చెర్ల ఏపించినరు’’.

దుర్గయ్య, నరేష్, నేను ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నం. పద్మకు జరిగిన ఈ అవమానం గౌను ఇంకా తెలియనట్టుంది.

‘‘…ఈ నా కొడుకులకు బలుపెక్కింది. ఎవరిని లెక్క చేయకుండవుతున్నరు. వాళ్ళను ఊర్ల పనులకు ఎవరు పిలవొద్దు. కూలీలుగా పెట్టుకోవద్దు. భూములు కౌలు కియ్యొద్దు’’ దళితులకు వ్యతిరేకంగా పైకుల పోళ్ళు చేసుకున్న తీర్మానాలను చెప్పుకు పోతుండు గౌస్.

‘‘గింత అన్యాయమా? మనూర్లనె నయమున్నట్టుంది. బతుకమ్మలను వాళ్ళేమన్న బంగారంతో చేసిండ్రా, మనం చేసినట్లే పూలతో చేసిరి. మనది అంటరానిదెట్లయ్యె, వాళ్ళది బంగారు బతుకమ్మ ఎట్లయ్యె? గిప్పటి సంది ప్రదర్శనలకు రమ్మని ఎవడన్నొచ్చి అడిగితే చెబుత వాళ్ళ సంగతి….’’ మా దగ్గరకు ఎప్పుడొచ్చిందోగాని కోపంగా అన్నది పద్మ.

‘‘గదే మాటమీదుండు!’’ వెంటనే అందుకొని సంతోషంగా నావైపు చూస్తూ అన్నాడు నరేష్.

Leave a Reply