ఒక రచనను దేశకాల నేపథ్యంలో వివేచించడం ఒక పద్ధతి. అలా వివేచించడం వల్ల ఆ రచన ఆదేశ స్థితిగతులను వివరించడంతో పాటు ఆ రచన ఆకాలాన్ని విశ్లేషిస్తున్న తీరులో వైరుధ్యాల్ని గమనించి ఆ వైరుధ్యాల స్వభావాన్ని విశ్లేషించిన తీరునూ గమనించవచ్చు. ఆ వైరుధ్యాలలో ఆ రచన ఎటువైపు నిలబడిందో రచయిత అవగాహనకుండిన శాస్త్రీయత ఏ పాటిదో అంచనా వేయవచ్చు.
ఇటీవల మల్లెల నరసింహమూర్తి ‘మాకూ ఒక నది కావాలి” కవిత్వాన్ని పై వివరించిన నేపథ్యంలో వివేచించడం ఈ వ్యాస పరిమితి. ఈ కవితలు రాసిన తేదీలను రచయిత ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ౨౦౦౪ లో ఈ కవి రాసిన జలస్వవ్నం తరువాత రాసిన కవితలుగా ఊహించవచ్చు. ఈ కవితా సంకలన శీర్చికకే గొప్ప నేపథ్యముంది. రాయలసీమ రైతాంగం తమకు కృష్ణానదిలో మూడు వందల టి.యం.సి.లు కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రమే ఉద్యమాలు చేశాయి. ఇది సీమ సంస్కృతి. పర్యవసానంగా హంద్రీ నీవా వచ్చింది కాని హామీల మేరకు, నిర్ణయించిన మేరకు కాలువ త్రవ్వలేదు. నీరు రాలేదు. కాలువ బందోబస్తు కాని, డిస్టిబ్యూటర్లు కాని ఏర్పరచలేదు.
దశాబ్దాలు గడుస్తున్నాయి. కనీసం కేటాయింపు నీటిని కూడా వినియోగించుకోవడం లేదు. కాలువల ద్వారా నీటి హక్కులు కాదు గదా మొత్తంగా ఒకసారి రాయలసీమకు నది కావాలనే డిమాండ్ ముందుకొచ్చింది. గతంలో అనంతలో పేరున్న రచయిత సీమస్థితి ఇలాగే కొనసాగితే ప్రత్యేకరాష్ట్రం కాదు గదా ఒక దేశమే కావాలనే డిమాండ్ రాయలసీమ వాసులు ముందుకు తెస్తారని అన్నారు. ఈ నేపథ్యంలోంచి చూస్తే ఈ సంకలన శీర్షిక సీమ సమస్యల డిమాండ్లలో నది కావాలనడం సబబే. న్యాయమైందే! ఈ కవితా సంకలనం చదివితే ఈ సత్యం బయట పడుతుంది.
అస్తిత్వ ఉద్యమాలను గురించి మాట్లాడుకుంటే రాయలసీమ అసిత్వ ఉద్యమం విలక్షణమైంది. అన్ని జిల్లాల సంస్కృతి, భాష యాస, జీవన వనరులు ఒకే విధంగా లేకపోయినా ముఠా తగాదాలు, కరవు, వలసలు అన్ని జిల్లాలో ఒకే విధంగా ఇంచుమించుగా వున్నాయి. అస్తిత్వ ఉద్యమ కవితా ప్రస్తానంలో అనంతపురం జిల్లాలో కీ.శే. ప్రేంచంద్, ఎక్కలూరి శ్రీరాములు, మల్లెల నరసింహమూర్తిని ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి.
ఈ నాటికీ ఈ కవులకు ప్రత్యామ్నాయం లేదు. కథా రచయితలకుండే గుర్తింపే ఈ కవులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వుంది.
ప్రస్తుత కవితా సంకలనం “మాకూ ఒక నది కావాలిలో కవి ప్రస్తావించిన ఈ సంకలనంలో
నరసింహమూర్తి ఎప్పటిలాగానే రాయలసీమ దుస్థితిని గురించిన కవితలు రాశారు. ప్రతి కవిత ఇందులో దేనికదే ప్రత్యేకమైంది. అదే సమయంలో ఆ కవిత ఇంకో కవితకు అనువాదమే. ఏ కవితైనా ఒరిజినల్ కాదు. భాష, సారాంశంలో ఒక అనువాదమే అన్న అక్టోవియోపాజ్ అన్న మాటను గుర్తు చేసుకుంటే గత ఇరవై ఏళ్ళ క్రిందటి జలస్వప్నమే మళ్ళీ మనముందు కొచ్చిందనిపిస్తుంది. సీమ రైతు దైన్యస్థితి, గ్రామీణ జీవన సౌందర్య వర్ణన, భూస్వాముల దర్పాన్ని వివరించే కవితలు వున్నాయి. గొప్ప అనుభూతితో రాసిన కవితలవి. ఆర్టత అడుగడుగునా కనిపిస్తుంది.
టైటిల్ కవితలో సీమకు సాగునీరందితే “పరస్పరం అలల కరచాలనం/ నదులు జరుపుకునే జలోత్సవం/ ౨ రైతు జనం మురిసి పడే ఒక జలోత్సవం” అని నదుల అనుసంధానం జరగాలంటారు. “జలం మా పొలాల్లో జగ్గినక్క ఆడాలి” అంటూ కలగంటారు. నదికి ఆహ్వానం పలుకుతూ “మా జనం గుండె దీపాన్ని హారతిగా/ ఇవ్వడం మాకు తెలిసిన సంస్కారం” అని కవి తన సంస్కృతిని చాటుకుంటారు. ఈ కవితా పాదాలు “కూర్చుండ మా యింట కుర్చీలు లేవు/ హృదయాంకమే నీకు పరువనుంటిొ అన్న జంధ్యాల పద్యపాదాలు గుర్తుకొస్తాయి.
ఇది అనుకరణ కాదు కవి ప్రతిభ. కావ్యమీమాంసలో రాజశేఖరుడు “కవిత అనుకరణం అనే వారికి, చౌర్యం అన్న వారికి మంచి సమాధానం చెప్పారు. దొంగ కాని కవి, దొంగ కాని వ్యాపారి లేరు. ఈ దొంగతనాన్ని తన చాతుర్యంతో కప్పి పుచ్చుకునేనాడు ఏమీ బాధపడడు, ఆనందిస్తాడు” అని తిరుమలరామచంద్ర ఒక చోట వ్యాఖ్యానిస్తారు. ఈ దృష్టితో చూసినపుడు మల్లె గొప్ప ప్రతిభావంతుడుగా కనిపిస్తారు. చాలా కవితల్లో సీమ జనజీవన విధానంలోని కాఠిన్యాన్ని దాన్ని సహనంతో అనుభవిస్తున్న రైతాంగపు దైన్యాన్ని తడిసిన హృదయంలో స్పృసిస్తారు. ఈ క్రమాన్ని “కొడుకా! కొండమీద రాయడా!” కవితలో ఆరుగాలపు పంటగా పాఠకుడు అనుభవిస్తాడు.
దుఃఖితమతి : గ్రామీణ జీవితం అనుభవించిన వారు మల్లెల. ఈ సత్యం ప్రతి కవితలో కనిపిస్తుంది. ఒకనాటి రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లా సారవంతమైన నేలలు కాబట్టి మంచి దిగుబడులుండేవి. పరిణామక్రమంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు మృగ్యమై జనజీవితం అతలాకుతలమైంది. ఈ విధ్వంస రూపాన్ని చాలా కవితల్లో వివరిస్తారు. ఆ వివరణలో వలపోత వుంటుంది. బాగా బ్రతికిన దినాల్లోని ఆనందాన్ని తలచుకొని దుఃఖితమతి అవుతాడు. ఈ నాటి సమాజానికి గత జీవిత విధాన సౌందర్యం అనుభవంలోకి
కాకపోయినా ఇలా వుండేదన్న విధానాన్ని గుర్తు చేయాలి. గత వర్తమానాలకు లంకె – క్రమానుగత పరిణామాల్ని అర్థం చేయించాలి. అందుకే వరిగింజ, కూతలేరు కూతలేవి, రెడ్డోరి వసారా గొడుగుమర్రి, నీళ్ళు చూసి కండ్లు మూస్తామప్పా వంటి కవితా శీర్చికల్లో వివిధ కోణాల్లో జీవితాన్ని తలచుకొంటూనే ప్రస్తుత పరిస్థితిని వివరిస్తారు.
ఇక్కడింకో ప్రత్యేక వర్ణనల్ని గుర్తుకు తెచ్చుకోవాలి. స్థానికతకు మంచి ఉదాహరణలో స్థానిక సంస్కృతిని వర్ణించడం “ఊరెన్నడూ పొమ్మనదు మనమే వదిలేస్తుంటాం” కవితలో కురవల పేర్పు, వాళ్ళ డోళ్ళ మోతలు, గొరవయ్య వేషం, మురళి వాయిద్యాలు ఉన్మత్తపు ధూపవలయాలు వంటి వర్ణన వల్ల కురబల సంస్కృతి గుర్తు చేసినట్రైంది. స్థానికతకు ఈ వర్ణనలు అవసరం. రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాలోనే కురబలు అధిక జనాభా కలిగి వున్నారు. వీరికి సమాంతరంగా బోయ కులస్తులున్నారు. కుల అస్తిత్వ పోరాటాలు
ముందుకొచ్చిన తరువాత లిఖిత చరిత్రకు ఒనగూరిన మేళ్ళలో ఆయా కులాల సాంస్కృతిక జీవనం నమోదు కావడం ఒకటి. ఇటీవల కాలంలో గుడికట్ల పండుగ చాలా పెద్ద ఎత్తున అనంతపురం పట్టణంలో జరిగింది. ఆయా గోత్రస్తుల విగ్రహాలంకారాలలో ఉపయోగించిన పురాతన నాణేల ప్రసక్తి గొప్పది. కట్లపొయ్యి కవిత ఇందులో గుర్తించ దగింది. కట్లపొయ్యి అంటే కట్టెలతో వెలిగించే పొయ్యి. ఎడారి ప్రాంతపు ఆహార అలవాట్లు ఈ కవితలో పొందు పరిచారు. కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా లేని ప్రాంతంలో చింత ఆకు చింతచిగురే
ఆకుకూర. ఆది వందే విధానం దాని రుచి అనుభవించి నోరూర తినే విధానం కవితకు స్థానికతను చేకూర్చింది. రాగి సంకటి చింతాకు పప్పు నేటికీ సీమవాసుల ఇష్టమైన ఆహారమే! గొర్లమంద నడుమ అన్న కవితలు గొరైల కాపరుల జీవనవిధానం గమనార్హం. కురవలు ప్రకృతిపై ఆధారపడి జీవించేవారు. వ్యవసాయం తదుపరి కాలంలో అభివృద్ధి చెందింది. వీరు పరభాగ్యోపజీవులు, వ్యాపారులు కాదు. స్వతంత్ర నిర్భీతిపరులు. పైగా కురబలలో హాస్యప్రియత్వం ఎక్కువగా కనబడుతుంది. ఇటీవల శ్రీశైలం రాసిన కవితలో శుభకార్యాలలో వరుసైన వారి పరియాచకాలు, హాస్యం గుర్తించదగినది.
ఒక్కొక్క కవితను వివరించడం కాదు గాని చాలా కవితలు సీమ ప్రజల జీవన విధానాన్ని సాగునీరు, వర్షాలు లేని కారణంగా విధ్వంసమవుతున్న బడుగు జీవిత చిత్రణ ఇందులో కనిపిస్తుంది. కేవలం వలపోతలేనా ప్రతిపాదనలు కర్తవ్యాలేమైనా వున్నాయా అని చూస్తే, తీవ్రమైన వత్తిడి తిరుగుబాటుకు దారి తీస్తున్నవైన ఇందులో కనిపిస్తుంది. దశాబ్దాల పాటు వగపు, ఫిర్యాదులేనా సీమకవిత్వం అన్న అభిశంసన ఎదుర్కొనవసరం లేదు.
అలుగుటయే ఎరుంగని…. సామాన్యంగా మల్లెల నరసింహమూర్తికి కోపం రాదు. అనుభూతి
ప్రధానంగా కవితలు రాసే స్వభావం ఆయనది. పరిస్థితికి వగపు బాధను వ్యక్తం చేస్తారే కాని ఆగ్రహించరు. ఇక్కడో విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. రాయలసీమ దుస్థితి కోణాల్ని చెప్పాలి, అది ప్రకృతి దోషమా? మానవ నిర్లక్ష్యమా? అన్న ప్రశ్నల్లో రెండింటికీ సమాధానాలు రచయితే చెప్పాలి. ఈ రెండు కారణాలు నివార్యమే. మరెందుకు కార్యాచరణ ముందుకు రాదు. దశాబ్దాలుగా ప్రతిపక్ష పార్టీలు రచయితలు సీమ దుస్ధితి ప్రపంచానికి చాటి చెప్పుతూ నిరసనను తెలిజేస్తూనే వున్నారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. హంద్రీ నీవా
జలాలు కాలువలు దాటి పొలాల్లోకి రావడం లేదు. ఎవర్షడగాలి? దివి నుండి భువికి దిగిరాను అన్న కవి భువిమీదనే వుండి దివికి పోకుండానే కవిత్వం రాశారు. అనుభూతులైనా సమాజం నుండే వస్తాయి. కాబట్టి మల్లెల నరసింహమూర్తికి దశాబ్దాల కరవుపై నిర్లక్ష్యం చూసి ఆగ్రహం చెందాడు. మంచి వాడిలో కూడా సహనం చచ్చింది. నీళ్ళ సంబరం కవితలో “మా సీమ జనాల ఆశలతో శ్వాసలతో / ఆడుకుంది ఈ రాజకీయం” అని పాలక వర్గాల నిర్లక్ష్యాన్ని చెబుతాడు. అనంతమ్మ కవితా శీర్షికన “పగటేసి గాలు… ఐపులేరు నా కొడుకులు/ ఆ గూట్లోనుంచి ఈ గూట్లోకి / ఈ గూట్లోనుంచి ఆ గూట్లోకి / అడివి బెలగాల్ల మాద్రి / రెక్కలిప్పుకోని / తిరుగుతాందారంట/ పారజల్లిన గింజల కోసం…. ఎదబదకందపా/ ఇప్పుడుదంకా ఎర్రినాకొడుకుల్ని సేసినారు/
ఈ బయల్నాటకం నాయాల్లూ/ పారలెత్తుదాం/ పికాసులెత్తుదాం/ కొడవండ్లెత్తుదాం… కోబలి అందాం… సావా టబ్రతుకొ తేల్చుకుందాం/ పల్లె పొలిమేరల్లో / నీళ్ళ తోరణాలు కడదాం” అంటూ నీటి సాధన మార్గం చెబుతారు. ఇంతకు ముందే బాలగోపాల్ సీమ నాయకుల గురించి చెబుతూ పార్లమెంటు విధానాలకు ఒక మెట్టు కింద, పాలెగాళ్ళ విధానాలకు ఒక మెట్టు పైన వున్నారని అన్నారు. ఇంకా ప్రజాప్రయోజనాల కాంట్రాక్టు పనుల విధానం ఆపేసి ప్రభుత్వమే నేరుగా పనులు చేయాలని అన్నారు. సరిగ్గా మల్లెల ప్రభుత్వ ధనాన్ని పారజల్లిన గింజలతో పోల్చినారు. పారలు పికాశిలతో పాటు కొడవండ్లెత్తి చావో రేవో తేల్చుకుందామని పిలుపునిచ్చాడు. ఇదీ ఈ నాటికి కావాల్సిన కవితా నినాదం!
సీమకు జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ ఉద్యమ నినాద కవిత కావాలని ఈ నాటి సీమకోరుకుంటుంది. మల్లెల ఎంతగా దైన్య స్థితిని గురించి విలపించినా చావో రేవో తేల్చుకోవాలని నడుం బిగించడం ఈ కవితా సంకలనంలో కొత్త పిలుపు! ఈ కవితా సంకలనంలో కేవలం సీమ సమస్యలే కాక సార్వత్రిక సమస్యలపై కొన్ని కవితలున్నాయి. మారుతున్న వనరులు, సామాజిక సంబంధాలు అనుబంధాలను దూరం చేస్తున్నాయి. కుటుంబ సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఆదాయాలు విలాసాలపై మోజుతో కన్నవారిని పుట్టిన ఊరిని మరచి ఊహలోకాల్లో యువత తేలియాడుతుంది. దీని ఫలితం మనుషులు విడిపోవదమే! మమతలు లేని మనుషుల్ని ఊహించలేము కదా! వర్గ సమాజంలో వర్గ మమతలుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సంబంధాల్ని అర్ధం చేసుకోవాలి. నా కొడుకు పరదేశి అన్న కవితలో “దేశం కాని దేశంలో / మా కొడుకు కొంపలోనే/ మేం పరాయి వాళ్ళం/’ అని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న కొడుకు ఇంట్లో ఇలా ఎందుకు బ్రతకాల్సి వస్తుంది. దాదాపు
ఇరవై ఏళ్ళకు పైగా పెంచిన తల్లిదండ్రులపై మమకారం చూపని పిల్లల ప్రేమ ఏమైనట్లు? చదువంటే సంస్కారం లేని, సాంకేతిక విద్యేనా? ఈ కవిత చదువుతూ వుంటే చిలుకూరి దేవపుత్ర ఏకాకి నౌక చప్పుడు కథ గుర్తుకొస్తుంది. పాఠశాల విద్యకంటే పాఠశాలేతర విద్య నిరంతరం అవసరమైంది. పాలక వర్దాలు తమ అస్తిత్వం కోసం సృష్టించే సంక్షోభం పాఠశాల విద్యేకాదు పాఠశాలేతర విద్య కూడా కాలరాయబడింది. తత్పర్యవసానంగా ఏర్పడిన ఫలితమే తల్లిదండ్రులపై నిరాదరణ. ఈ సమస్యను ఫిర్యాదు చేయడం కంటే మూలాలు వెదికే ప్రయత్నం ప్రయోజనకరం. ఈ ఎడబాటు విస్తరణ గురించి “కొడుకే ఇట్లా/ దూరమైతే/ మనవడి గురించి / ఏం మాట్లాడతాం” అంటూ రెక్కలు తెగిన పక్షులం/ కనుపించే కాసులదే కదా కాలం/ కనిపెంచిన వేర్లు/ ఎప్పటికైనా మట్టి కొట్టుకు పోయేవే కదా!” ఇందులో వైరుధ్యముంది. కాసుల వ్యామోహం సంస్కరణ హృదయంతో పరిష్కార యోగ్యం. కాని మట్టుకొట్టుకు పోయే వేర్లు ప్రకృతి సూత్రం. ప్రకృతిని ఇంకా మానవుడు పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకోలేదు. పైగా సామాజిక సూత్రాలకు ప్రకృతి సూత్రాలకు ముడి పెట్టడం తర్మ విరుద్ధమని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇయ్యగల వారే దాతలు రాయగలిగే వారే రచయితలు!
చరిత్రను ప్రస్తుత సామాజికావసరాలకు వినియోగించుకోవడం రచయిత విజ్ఞత. కట్టమంచి వారు ముసలమ్మ మరణం కావ్యంలో ఏం రాశారో ఇప్పటి పాఠకులకు తెలియదు. మొత్తానికి ఆమె చెరువు తెగినపుడు అడ్డంగా పడుకుని వున్నపుడు ఆమెపై మట్టికట్టను పేరిస్తే చెరువు తెగకుండా ఆగిందని స్థూలంగా కావ్య సారాంశం. ఆమె స్కృతి కవిత “ముసలమ్మ మరణించలేదని” ఈ కవితతో ఆమె త్యాగమయ జీవితాన్ని కీర్తిస్తూ గ్రామ దేవతను ఎద్దేవా చేయడం వల్ల ముసలమ్మ త్యాగానికి విలువ పెరిగింది. దేవతల్ని నాయకుల్ని నమ్ముకోకుండా ప్రజలే నడుం బిగించి ఉద్యమాలు నిర్మించుకోవాలని అన్యాపదేశంగా ఓ పిలుపుకూడా వుంది. సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన ప్రజలు అనేక నిర్బంధాల మధ్య చేయడం ఈ కవితకు యాధ్యచ్చిక సంఘటన. ముప్పై రెండు కవితల ఈ సంకలనం, మా మిత్రుడు వేంకటేశ్వర ప్రసాద్ ఆంధ్ర సాంస్కృతిక ముకురం మనంతపురం అన్నట్లుగా కరవు వలసలతో కూడుకున్న సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. దేవరకొండ కవితా శీర్షికలో “ఏ మతస్తుడైనా/ ఎలా మొక్కినా ఒకేలా/ నిష్కామ ప్రేమతో/ స్పందించే సూఫీ గుండె /మా దేవరకొండ” అని మల్లెల అంటారు. సూఫీ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు అనంతపురంలో చాలా వున్నాయి. గుంతకల్లు, అనంతపురం, కడప, గూగూడు, దర్గాహెన్నూరు, వెల్తార్తి పట్టణాల్లో సూఫీ గురువుల ఉత్సవాలు భిన్న రూపాల్లో జరుగుతున్నాయి. ఏక పక్షంగా ముస్లింలను దేశద్రోహులుగానూ, విధ్వంసకారులుగాను ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో సూఫీ తత్వాన్ని సుదీర్ధంగా వివరించి వుంటే కవిత గొప్ప సామాజిక ప్రయోజనాన్ని సాధించి వుండేది. అది మల్లెల పరిమితి కావచ్చును.
రచయిత భావనలు యాదృచ్చికంగా కొన్ని విధానాల్ని సమర్థించే పదజాలం కవితల్లో కనిపిస్తుంది. చినుకుల గుంపు కవితా శీర్షికలో “నేల ప్రాణాలను / కాపాడేందుకు/ మేఘాలు కొండల్నుంచి/ దూకిన / జలదళాలు మొయిలు దళాలు” అని అంటారు. ఈ కవితా పాదాలు ఏ రాజకీయ భావనల్న ధ్వనిస్తాయో పాఠకుడు ఊహించుకోగలడు. ఈ కవితా సంకలనంలో కొట్టొచ్చినట్టు కనిపించే కట్టమీద స్వామి కవిత.
ఒకనాటి గ్రామీణ జీవితంలో పైకి డాబు దర్చం కోసం కనిపించినా కుక్క ప్రయోజనం కనిపించని పెంపుడు జంతువు. ముఖ్యంగా గొ(రైైల కాపరులకు అదనపు రక్షాకవచం కుక్క ఈ కవితలో కుక్కకు మనిషితో వుండే మూగ భాషను తాత్వికంగా కవి వివరిస్తారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం తెలుగు విభాగంలోని భాషా శాస్త్ర ఆచార్యులు హెచ్.యస్. బ్రహ్మానంద జంతువులకూ సంజ్ఞా భాష వుంటుందనేవారు. అదేదో ఈ కవితలో చూడవచ్చును.
అనంతజన జీవిన విధ్వంసాన్ని సంస్కృతిని కళాత్మకంగా కర్తవ్యాన్ని చెప్పిన కవితా సంకలనమిది. ఐతే కర్తవ్య బోధలో “అస్తిత్వ యుద్ధం” ఇచ్చిన ప్రాధాన్యత ఈ సంకలనం ఇవ్వలేదు. ఇప్పుడు కావాల్సింది కర్తవ్య బోధ కవితా నినాదం.
కారణాంతరాల వల్ల తెలుగు ప్రాంతాలకు మల్లెల దూరంగా వున్న ఫలితం ఈ సంకలనంలో కనిపిస్తుంది. రాసిన కవితను ప్రచురించే ముందు సన్నిహితులతో చర్చించుకోవాలన్నట్లు నార్లవారు ఒక ఇంగ్లీషు విమర్శకుని మాటగా పేర్కొన్నారు. ఆ చర్చించుకునే అవకాశం లేనందువల్ల నీళ్ళ సంబరం కవితలో “ఒక బంగారు పద్మకలశం/ అందులో తాండవమాడే/ శివునిలా నాగలి భుజాన మోస్తూ అన్న పాదంలో అనౌచిత్యాన్ని గుర్తించు కోలేక పోయారు రచయిత. అలాగే నా కొడుకు పరదేశి కవితలో “పాపొడు/ వెన్నెలతో లాలపోసిన/ చందమామలా వున్నాడు/ అని అనటంలో అన్వయం కుదరలేదు. వెన్నెల నిచ్చేది చందమామ కదా! అలాగే “పరిమళ దవనం” వంటి సమాసం, నిలింపుల వంటి పద ప్రయోగం సరి చూసుకోవాల్సి వుండింది.
ఏది ఏమైనా కవిత్వమంటే ఇదీ అని చెప్పడానికి ఈ సంకలనం ఒక మంచి ఉదాహరణ, కథ, నవల, కవిత్వం విమర్శ అనంతపురం జిల్లాలో చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నాయి. ఈ వారసత్వాన్ని ద్విగుణీకృతంగా సామాజిక అవసరాల దృష్టా అందుకోవాల్సి వుంది. మల్లెల పండిత కవి.