మనుషులందరూ సమానంగా ఉండాలని, కుల, మత, వర్గ, లింగ వివక్ష లేని సుందరమైన సమాజాన్ని నిర్మించాలని, తరతరాల దోపిడీ నుండి విముక్తికై పీడిత ప్రజానీకం ఏకమై నిరంతరం జరిపే వర్గ పోరాటమే మావోయిస్టు ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించి, మావోయిస్టు రహిత భారత్ ను నిర్మిస్తామని మోదీ, అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మధ్య భారత దేశంలో హింస జరుగుతున్నది.
దండకారణ్యంలోని అపారమైన సహజ సంపదలను, 26 రకాల విలువైన ఖనిజ సంపదలను కార్పొరేట్ కంపెనీలు సామ్రాజ్యవాద శక్తులు కలిసి దోచుకోవడానికి, హిందుత్వం, సనాతనత్వం పునాదుల మీద దేశాన్ని కార్పొరేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికి ఆటంకంగా ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి వికసిక్ భారత్ పేరుతో, ఆపరేషన్ కగార్ (ఆఖరి యుద్ధం)పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి లక్షలాది సాయుధ బలగాలను మోహరించి, వందలాది పోలీసు క్యాంపులను ఏర్పాటు చేసి చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసుల మీద, యుద్ధం చేస్తున్నది.
2005 సల్వాజుడుంతో ప్రారంభించి, గ్రీన్‌హంట్, సమాధాన్, ప్రహార్‌ల పేరుతో దాడి చేసి, 2024 ఆపరేషన్ కగార్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ అమానుష యుద్ధాన్ని ఈ ఏడాది జనవరి1 నుంచి ప్రారంభించి బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో ఇప్పటికి 130 మందికి పైగా ఆదివాసులను, విప్లవకారులను హత్య చేశాయి. ఈ మారణకాండలో సుదీర్ఘమైన విప్లవ జీవితం కలిగిన నాయకత్వాని విప్లవోద్యమం కోల్పోపోయింది. కా. అన్నె సంతోష్ బీజాపూర్ కోర్చిల్ దగ్గర జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. ఆయనది అంకుశాపురం గ్రామం, జయశంకర్ జిల్లా. కా. సిరిపెల్లి సుధాకర్ కా. సుమనబాయి కాంకేర్ జిల్లా చోటే చోటా భీతియా దగ్గర అమరులయ్యారు. సుధాకర్‌ది చల్లగరిగ గ్రామం, జయశంకర్ జిల్లా. సుమనబాయిది డెడ్రా గ్రామం, కొమురంభీ జిల్లా. కా. చీమల నర్సన్న కా. కాసరవేని రవి టేకేమేట కాకూర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు. చీమల నరసన్నది జయ్యారం గ్రామం, పెద్దపల్లి జిల్లా. కాసబోయిన రవిది వంగర గ్రామం, హన్మకొండ జిల్లా.
వీళ్ళందరూ ఈ దేశంలోని అసమానతలను, పీడలను, దోపిడీ దౌర్జన్యాలను నిర్మూలించి ప్రజాస్వామిక సమాజాన్ని కాంక్షించారు. అందు కోసం రక్తసంబంధీకులను వదులుకొని, తమ జీవితాన్ని విప్లవోద్యమానికి తగినట్లుగా మలుచుకొని ఉన్నత వ్యక్తిత్వాలను అలవర్చుకున్నారు. ఈర్ష, ద్వేషాలు, స్వార్ధ రాజకీయాలతో ఉన్న సమాజంలో నిస్వార్ధ త్యాగాలు చేశారు. భవిష్యత్తు తరాలు సుఖంగా జీవించడానికి తగిన మానవీయ సమాజాన్ని నిర్మించడానికి రక్తం ధార పోసిన అమరవీరులు.
ప్రజల చేత ఎన్నికైన పాలకులు ప్రజల పక్షాన కాకుండా కార్పొరేట్ల పక్షాన నిలబడి ప్రజల పైన యుద్ధం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో దేశాన్ని కార్పొరేటీకరించి ఆదివాసీ జాతినే నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మానవాళికి హానికరం. దీన్ని ప్రజలుగా మనం అంగీకరించగలమా?!.
దశాబ్దాలుగా సాగుతున్న రాజ్య హింసలో వేలాది మంది ఈ దేశ విప్లవం కోసం తమ విలువైన ప్రాణాలను బలిదానం చేశారు. తమ బిడ్డల్ని, సహచరులని, తోబుట్టువులను, రక్తసంబంధీకులను కోల్పోయిన అమరుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా కన్నీరు పెట్టారు. ఆ దుఃఖంలో నుండే అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భవించింది. ఇప్పటికి ఈ సంస్థ ఏర్పడి 22 సంవత్సరాలైంది. అసాధారణ త్యాగాలు చేసిన విప్లవకారుల శవాలు తెచ్చి గౌరవంగా అంత్యక్రియలు చేస్తున్నది. వారి కోసం స్థూపాలు నిర్మిస్తున్నది. సంస్మరణ సభలు నిర్వహిస్తున్నది. విప్లవకారుల విశ్వాసాలను పీడిత ప్రజల మధ్య సజీవంగా నిలబెడుతున్నది. ఈ క్రమంలో అమరుల కుటుంబ సభ్యులు కూడా రాజ్యహింసకు గురవుతున్నారు. అయినా విప్లవంలోకి వెళ్లి త్యాగాలు చేసిన తమ కుటుంబ సభ్యుల ఆదర్శాల కోసం కన్నీటి మధ్యనే రాజ్యహింస వ్యతిరేక పోరాటంలో భాగమైంది. ప్రజలు చేస్తున్న పోరాటాలకు సంఫీుభావం ప్రకటిస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆవిర్భావ దినాన్ని ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా తలపెట్టింది. ఈ సభను విజయవంతం చేయడానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
(22వ ఆవిర్భావ దినం సందర్భంగా…)