2025 ఏప్రిల్ 9

భారత రాజ్యమూ, తమ పార్టీ మధ్య శాంతి చర్చలు జరగాలని కోరుతూ సిపిఐ (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసిందని 2025 ఏప్రిల్ 3 నాడు ది హిందూ వార్తా పత్రిక ప్రచురించింది. మావోయిస్టులు ముందుగా చొరవ తీసుకుని శాంతి చర్చలకు పిలుపునిచ్చినందుకు విప్లవకారులుగా, ప్రజానుకూల, ప్రజాస్వామిక దృక్పథం కలిగిన వ్యక్తులుగా మనం అభినందించాలి.

శాంతి చర్చలకు పిలుపునిచ్చింది ఆపరేషన్ కగార్ కింద “దహనం చేసిన భూమి విధానాన్ని” అనుసరించాలని ఎంచుకున్న భారత రాజ్యం కాదు, “యుద్ధం చేసే” పార్టీ అనే విషయాన్ని ఇది మన దృష్టికి తీసుకువస్తుంది.

(1. భూమి దహనం విధానం ప్రాథమిక లక్ష్యం, జయించిన భూభాగంలో శత్రువు నిలదొక్కుకోవడాన్ని కష్టతరం చేయడం. 2. “జయించిన భూభాగం” అంటే సాధారణంగా సైనిక ఆక్రమణ ద్వారా బలవంతంగా స్వాధీనం చేసుకున్న, నియంత్రణలో ఉంచుకున్న భూమి. 3. శత్రువును అడ్డుకోవడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, ఇది స్థానిక పౌర జనాభాకు అపారమైన బాధను కలిగిస్తుంది, వారు తమ ఇళ్ళు, జీవనోపాధి, ముఖ్యమైన వనరులను పొందలేని స్థితిలో ఉండవచ్చు. 4. నైతిక పరిగణనలు: స్కార్చ్డ్ ఎర్త్ విధానాలు విస్తృతమైన పౌర బాధలకు కారణమయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వివాదాస్పదమయ్యాయి. ప్రత్యేకించి  పోరాట యోధులు కాని వారిని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ప్రస్తుతం సాధారణంగా ఆధునిక యుద్ధాలలో నిషేధానికి గురయ్యాయి.)

భారత రాజ్యం చేస్తున్న ప్రజాస్వామిక నటనలో ఏ మాత్రమైనా నిజాయితీ అంటూ ఉంటే, తనకున్న రాజ్యాంగపర న్యాయ అధికారంతో శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, వాటి ఫలితం ఏదైనప్పటికీ, ఆ ఫలితం ప్రజల ఉత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం భారత రాజ్యపు మొదటి, ప్రధాన బాధ్యత అని నిస్సందేహంగా నొక్కి చెప్పాలి. ఈ దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర కమిటీ తరపున సి‌పి‌ఐ (మావోయిస్ట్) ప్రతినిధి కామ్రేడ్ అభయ్ ఈ ప్రతిపాదన చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమూ మావోయిస్టు పార్టీ బేషరతు కాల్పుల విరమణ ప్రకటించాలి, శాంతి చర్చలు జరపాలి’అనే అంశం పైన మార్చి 24న హైదరాబాద్‌లో ‘శాంతి చర్చల కమిటీ’ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని కామ్రేడ్ అభయ్ స్వాగతించారు. “ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాంతి చర్చలకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. అందువల్ల, శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి ఈ ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుకు తెస్తున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తే, మేము వెంటనే కాల్పుల విరమణ ప్రకటిస్తాము” అని ప్రకటించారు.

మార్క్సిజం-లెనినిజం-మావోయిజం భౌతిక పరిస్థితుల నుండి ఉద్భవించింది:  నక్సలిజానికి, రాజకీయ పరిష్కారాన్ని కనుగొనండి.   సైనికీకరణ కాదు!

భారతదేశంలో ఉత్పత్తి విధానంతో దానికి ఉన్న గతితార్కిక సంబంధం గురించి ఆలోచించకుండా శాంతి సమస్య గురించి ఆలోచించలేము. భారతదేశంలో అభివృద్ధి నమూనా అనేది మరణం, నిర్వాసిత్వం, విధ్వంసం అనే మూడు  ‘డి’లపై (డెత్, డిస్‌ప్లేస్‌మెంట్, డిస్ట్రక్షన్) ఆధారపడిన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా. ఈ అభివృద్ధి నమూనాలో, వనరుల దోపిడీని సులభతరం చేయడానికి, చౌక శ్రమను సంపాదించడానికి చాలా తరచుగా భారతీయ దళారీల ద్వారా బహుళ జాతి కంపెనీల, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి ద్వారా సామ్రాజ్యవాద పెట్టుబడి ఉంటుంది. ఈ కార్పొరేట్‌ల కోసం అతి చౌకగా భూమినీ అలాగే వాటి రక్షణ కోసం తుపాకులను, గూండాలను అందించే భూస్వామ్యవర్గాలు ఈ కార్పొరేటీకరణను తరచుగా సులభతరం చేస్తాయి. తన సామ్రాజ్యవాద యజమానులకు అనుకూలంగా ఉండటానికి ముఖ్యంగా తన సైనికీకరణ విధానాల ద్వారా రాజ్యం చురుకైన పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా ప్రజల భౌతిక పరిస్థితులలో ప్రతిఘటన, అశాంతి పాతుకుపోవడం వల్ల, సామ్రాజ్యవాదం, భూస్వామ్య, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానాలు ప్రజలకు ఎలా శత్రువులనేది ఇది చూపిస్తుంది. నక్సలిజం అనేది సమాజంలోని సామాజిక-ఆర్థిక సమస్యల నుండి ఉద్భవిస్తున్న సమస్య అని, దాన్ని సరిగా పట్టించుకోలేదనీ ప్రభుత్వ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో 1970లలో నక్సలైట్లతో వ్యవహరించడంలో అనుభవం ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి. బంధోపాధ్యాయ నేతృత్వంలో ప్రణాళికా సంఘం 2006లోఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రకాష్ సింగ్ (మాజీ యుపి డిజిపి), అజిత్ దోవల్ (ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్), బి.డి. శర్మ (రిటైర్డ్ ఉన్నతాధికారి, కార్యకర్త), సుఖ్‌దేవ్ థోరట్ (యుజిసి చైర్‌పర్సన్), కె. బాలగోపాల్ (మానవ హక్కుల న్యాయవాది) కూడా ఉన్నారు.

‘డౌన్ టు ఎర్త్’ అనే పత్రికలో వచ్చిన ‘నక్సలిజం పనిచేస్తుంది’ (సఖుజా &మిశ్రా, 2008) అనే వ్యాసంలో ఇలా వివరించింది: “భూమి పరాయీకరణ, పేదరికం, ప్రాథమిక అటవీ వనరులను పొందలేకపోవడంవంటివి షెడ్యూల్డ్ తెగలు, దళితులలో నక్సలిజం పెరుగుదలకు దోహదం చేసాయని ప్రణాళికా సంఘం పేర్కొంది. దాని నివేదిక ‘తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి సవాళ్ళు’ ఛత్తీస్‌గఢ్‌లోని సల్వా జుడుమ్‌పైనఆరోపణ చేసింది. ఈ నివేదిక సెజ్‌లను, పంచాయితీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం, 1996, అటవీ (సంరక్షణ) చట్టం, 1980 వంటి సాధనాల పూర్తి వైఫల్యాన్ని కూడా విమర్శిస్తుంది.”

వాస్తవానికి ఈ నివేదిక ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సమస్య పట్ల  విమర్శనాత్మకంగా ఉంటుంది; “భూసేకరణ చట్టంలో ప్రజా ప్రయోజనం జాతీయ భద్రత, ప్రజా సంక్షేమానికి పరిమితం కావాలి; కంపెనీలు, సహకార సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీల సముపార్జన కోసం విస్తరించకూడదు’ అని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక 2007 భూసేకరణ (సవరణ బిల్లు)లో ఉన్న సవరణలను లక్ష్యంగా చేసుకుంది. “నిర్వాసిత్వాన్ని తగ్గించడానికి, ప్రభావితమైన నిర్వాసితులైన వ్యక్తుల హక్కులను పొందేందుకు ఈ ప్రతిపాదనలను మరింత సవరించాలి” అని ప్రతిపాదన చేసింది.

“ప్రణాళికలో ఉన్న లోపం ఫలితంగా నక్సలిజం ఉద్భవించింది; నిరంతరం పరాయీకరణ చెందడం వల్ల ప్రజలు ఆయుధాలు చేపట్టాల్సి వచ్చింది; సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పునాదులుగా అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది” అని బందోపాధ్యాయ నక్సలిజంపై అవగాహనా, సహానుభూతి వైఖరిని తీసుకున్నారు.

వాస్తవానికి, ఆకమిటీ నేడు ఉనికిలో ఉండి ఉంటే, వారు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలకు అనుకూలంగా ఉండేవారు, “నక్సలైట్లతో చర్చలు జరపడం, వారితో విశ్వాసాన్ని పెంచుకోవడం బయటపడే మార్గమని నిపుణుల బృంద సభ్యులు భావిస్తున్నారు. గ్రూపులతో మాట్లాడే ఆలోచనకు తెరతీయాలి. ఉల్ఫా, కశ్మీరీ ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి పోలీసు-కేంద్రీకృత విధానంతో నక్సలైట్ల ను మరింత అణగదొక్కడం కంటే వారితో చర్చలు జరపడం చాలా కీలకమని” బందోపాధ్యాయ జోడించారు.

“మార్క్సిజం-లెనినిజం-మావోయిజం భారతదేశానికి అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు” అని చెప్పినపూర్వ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈ అంశాన్ని  అభివృద్ధి చెందకపోవడం, దోపిడీ, వనరుల లభ్యత లేకపోవడం, అభివృద్ధి చెందని వ్యవసాయం వంటి సమస్యలతో ముడిపెడుతూ ఇలా అన్నారు – “ఏమైనప్పటికీ  నక్సలిజం కేవలం శాంతిభద్రతల సమస్య కాదని మనం గుర్తించాలి. అనేక రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి నేరుగా సంబంధించినది నక్సలిజం. నేడు వామపక్ష తీవ్రవాదానికి ప్రధాన యుద్ధభూమిగా ఆదివాసీ ప్రాంతాలు ఉండటం యాదృచ్చికం కాదు. ఆదివాసీ భూభాగంలోని పెద్ద ప్రాంతాలు వామపక్ష తీవ్రవాదులను వేటాడేస్థలంగా మారాయి. దోపిడీ, కృత్రిమంగా తగ్గించిన వేతనాలు, అన్యాయమైన సామాజిక-రాజకీయ పరిస్థితులు, సరిపోని ఉపాధి అవకాశాలు, వనరుల లభ్యత లేకపోవడం, అభివృద్ధి చెందని వ్యవసాయం, భౌగోళిక ఒంటరితనం, భూ సంస్కరణలు లేకపోవడం – ఇవన్నీ నక్సలైట్ ఉద్యమం పెరుగుదలకు గణనీయంగా దోహదపడతాయి” (సింగ్, 2016).

ఇటీవల 2018లో, టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది, అందులో ప్రకాష్ సింగ్ (మాజీ అధికారి, సరిహద్దు భద్రతా దళ అధిపతి) ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, “సామాజిక-ఆర్థిక కారణాలను పరిష్కరించే వరకు (మావోయిస్ట్) ఉద్యమం అంతమైపోయిందని రాయడం తొందరపాటుతనం అవుతుంది. మార్క్సిజం-లెనినిజం-మావోయిజం ఆలోచనా విధానపు నిరంతర అవగాహనా, మావోయిస్టు పార్టీ దృఢత్వమూ సమాజంలోని భౌతిక పరిస్థితుల నుండి విడిగా ఆకస్మికంగా ఉద్భవించడం లేదని, వాటిలోనే వేళ్ళూనుకున్నాడనే విషయాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది.

ఇది మావోయిస్టు పార్టీ- భారత రాజ్యాల మధ్యన సమస్య కాదు; ఇది ప్రజలకు, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ రాజ్యానికి మధ్య ఉన్న సమస్య.

మార్క్సిజం-లెనినిజం-మావోయిజం అనే శ్రామికవర్గ సిద్ధాంతంతో మావోయిస్టు పార్టీ  నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమ మూలాలను దృష్టిలో ఉంచుకుని, మావోయిస్టు పార్టీకీ భారతదేశ రాజ్యానికీ మధ్య ఉన్న సమస్యగా కుదించే ఈ ధోరణిని మనం విమర్శనాత్మకంగా పరిశీలించాలి. దానిని సరైన పదాలలో రూపొందించాలి – ఇది భారతదేశ రాజ్యం తన సొంత ప్రజలపై, పౌరులపై జరుపుతున్న అప్రకటిత యుద్ధం. భారత రాజ్యం ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధాన్ని “నక్సలైట్ల”కీ- భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సంఘర్షణగా కుదించే ధోరణిని విప్లవం అంటే ఏమిటి లేదా అందులో ఏమి ఉంటుంది అనే అంశం పైన చేసిన వ్యక్తిగత విశ్లేషణగా మనం అర్థం చేసుకోవాలి.

సమాజంలోని అభివృద్ధి చెందిన సెక్షన్ల విప్లవకర  చైతన్య అభివ్యక్తే తప్ప విప్లవమూ విప్లవకర చర్య అనేది కేవలం కమ్యూనిస్ట్ పార్టీ నుండి లేదా ప్రజల వెలుపల నుండి వచ్చేది కాదు. దీని అర్థం అవసరమైన భౌతిక పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ ఉనికిలో ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ అనేది మార్క్సిజం (21 వ శతాబ్దంలో మార్క్సిజం-లెనినిజం-మావోయిజం) అనే శ్రామికవర్గ సిద్ధాంతం కింద ప్రజల విముక్తి లక్ష్యంతో నడిచే పార్టీ కాబట్టి , అది ప్రజల నుండి ఉద్భవించి, ప్రజలతో ఐక్యం కావడం ద్వారా మాత్రమే తనను తాను నిలబెట్టుకోగలదు.

అందువల్ల కమ్యూనిస్టు పార్టీకి ప్రజల మద్దత్తు ఉండాలి; ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించాలి. అంటే నీళ్ళలో చేపలా పనిచేయాలి.

 ప్రజల భాగస్వామ్యం లేని కమ్యూనిస్టు పార్టీ తనను తాను నిలబెట్టుకోలేదు, “జనం నుండి జనం వరకు” అనే తత్వాన్ని అనుసరించే వరకు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేదు. మావోయిస్టు పార్టీ ఉనికిలో ఉండటానికి ఈ పరిస్థితులు కారణం – ఇది ప్రజల సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అవసరాల నుండి ఉద్భవిస్తోంది కాబట్టి  అది తన కోసం కాదు, నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో శత్రువుల నుండి ప్రజలను రక్షించుకోవడానికి ఉనికిలో ఉంది.ఆపరేషన్ కగార్ కింద, ఆదివాసీలపై మారణహోమాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ప్రజలు సంఘటితమై, తమ శత్రువు నుంచి మంచిగా రక్షణ పొందగలరని నిర్ధారించుకోవడానికి పార్టీ ఉనికిలో ఉండవలసిన అవసరం ఉంది.

కాబట్టి కార్పొరేటీకరణ, సైనికీకరణ విధానానికి విరామం ఇవ్వడానికి ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని కామ్రేడ్ అభయ్ విజ్ఞప్తి చేస్తున్నారు. “కేంద్రంలోని హిందూత్వ ఫాసిస్ట్ బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ ప్రజల జీవితాలను, ప్రాథమిక రాజ్యాంగ నిబంధనలను దెబ్బతీస్తూ సొంత ప్రజలపైన సైనిక దాడిని ప్రారంభించింది. ఈ క్రూరమైన దాడి ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ హక్కుల కోసం జరుగుతున్న విప్లవోద్యమాన్ని అణిచివేయడాన్ని, సహజ వనరులను దోచుకోవడానికి కార్పొరేట్ ప్రయోజనాలను ప్రోత్సహించడాన్ని, చివరికి దేశంలో సమాఖ్య వ్యవస్థను నాశనం చేసి, నిరంకుశ ఏకీకృత రాజ్యాన్ని స్థాపించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. గత 15 నెలల్లో వివిధ రాష్ట్రాలలో, ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లో రాజ్యం జరిపిన క్రూరమైన దాడిలో మా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కమాండర్లు, సభ్యులు, సాధారణ ఆదివాసీ ప్రజలతో సహా 400 మందికి పైగా మరణించారు. ఆపరేషన్ కగార్‌లో మరణించిన వారిలో మూడింట ఒక వంతు (1/3) మంది ఆదివాసీలు ఉన్నారు.”

ఆపరేషన్ కగార్ అనేది భారత రాజ్యం ప్రజలపై దాడి చేయడంలో అనుసరిస్తున్నది ‘భూమిని కాల్చివేసే విధానం’ అని స్పష్టంగా తెలుస్తుంది; దీనిలో రాజ్యం విప్లవకర, ప్రజాస్వామిక ఉద్యమాన్ని, నిరాయుధ, సాయుధ ఉద్యమాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. సామ్రాజ్యవాద పాలకవర్గం మార్గదర్శకత్వంలో పెరుగుతున్న సైనికీకరణ ద్వారా కార్పొరేటీకరణను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఇలా చేస్తోంది. మావోయిస్టు పార్టీపైన బస్తర్‌లో జరుగుతున్న అప్రకటిత యుద్ధం ఆ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు,ఆదివాసీలను వారి భూమి నుండి తరిమికొట్టడం, రాజ్యం అమలుచేస్తున్న సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను వ్యతిరేకించే ఏ ప్రతిఘటనైనా సరే అణచివేయడం ద్వారా వారి జీవనోపాధిని, జీవితాలను నాశనం చేయడం అనే ఎజెండాలో వేళ్ళూనుకున్న ఒక జాతి విధ్వంసక కార్యక్రమం. “కలం-తుపాకీల రెండింటి నక్సలిజాన్ని” నిర్మూలించాలి అని అమిత్ షా అన్న 2022 సూరజ్‌కుండ్ విధానపు కొనసాగింపును ఆపరేషన్ కగార్ అనుసరిస్తోంది.

ఫలితంగా,అంటే ప్రజలు కష్టాలపాలవుతున్నారు కాబట్టి మావోయిస్టులు, భారత ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలి. మావోయిస్టులు విధించిన షరతులను అంగీకరించమని భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మావోయిస్టు పార్టీ పౌర సమాజానికి చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, పౌర సమాజం ధైర్యంగా స్పందించింది. శాంతి చర్చలకు ముందుకు వచ్చి, అందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రక్రియను ప్రారంభించాల్సిన బాధ్యత భారత రాజ్యంపైనే ఉన్నదని వారు తమ ప్రకటనలో సరిగ్గా అంచనా వేశారు. అయితే, మావోయిస్టు పార్టీ బలహీనపడుతోంది కాబట్టి  ప్రభుత్వం వారితో శాంతి చర్చలను ప్రారంభించాలనే వారి రాజకీయ విశ్లేషణ సరియైంది కాదు. శాంతి చర్చలు ప్రారంభించాలా వద్దా అనే దాని వెనుక ఉన్న ప్రాథమిక చోదక శక్తి ప్రజలపట్ల ఉన్న ఆందోళన అనీ ప్రత్యర్థి బలహీనత లేదా బలం కాదు అని మనం గుర్తుంచుకోవాలి.

సమాజంలోని ప్రజలు కష్టానష్టాలకు గురవుతున్న భౌతిక పరిస్థితుల కారణంగా ఈ ఉద్యమం వచ్చింది కాబట్టి సంఘర్షణలో ఉన్న పార్టీల బలాబలాలు, చర్చలు చేయగలిగే శక్తితో సంబంధం లేకుండా పాలక వర్గాలు శాంతి చర్చలకు రావాల్సిన అవసరం ఉందనే ఈ తార్కిక ధోరణి శాంతి చర్చలను కేవలం పాలక వర్గాలకు సంబంధించిన ఎత్తుగడగా మాత్రమే వాదించే అనాలోచిత పరిణామాన్నికలిగించవచ్చు.

శాంతి చర్చలకు షరతులు- భారత రాజ్యం ప్రతిస్పందన

శాంతి చర్చలు జరపడానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈ క్రింది షరతులను ప్రతిపాదించింది. మొదటిది, ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి (మహారాష్ట్ర), ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలలో నిర్దిష్ట కాలం వరకు కాల్పుల విరమణ జరపాలి. రెండవది షరతులు లేని చర్చలు చర్చలు జరపాలి.   .     

దీనికి ప్రతిస్పందనగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉండాలని, అయితే ప్రభుత్వం మావోయిస్టులు విధించిన షరతులకు లోబడి ఉండదని అన్నారు. శాంతి చర్చల కోసం ప్రభుత్వం ఎటువంటి కమిటీలను ఏర్పాటు చేయబోదని, మావోయిస్టులు తమకు నచ్చిన ఏ మార్గం ద్వారానైనా దీనిని ప్రారంభించవచ్చని ఆయన పునరుద్ఘాటించారు. “చర్చలు ఎటువంటి షరతులు లేకుండా జరుగుతాయ; మేము ఇప్పటికీ దానికి సిద్ధంగా ఉన్నాము, మా కేంద్ర నాయకత్వం సిద్ధంగా ఉంది, గౌరవనీయులైన [ముఖ్యమంత్రి] విష్ణు దేవ్ సాయి జీ సిద్ధంగా ఉన్నారు, చర్చలతో ఎటువంటి సమస్య లేదు. కానీ ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేయదు. వారు కోరుకుంటే లేదా వారికి నచ్చిన మార్గాన్ని ఉపయోగించి వారే ఒకదాన్ని ఏర్పాటు చేయాలి, మేము సిద్ధంగా ఉన్నాము.” (ది హిందూ, 2025)

ఛత్తీస్‌గఢ్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, నక్సలైట్లను చంపినప్పుడు ఎవరూ సంతోషంగా ఉండరని అన్నాడు. కానీ అది పచ్చి అబద్ధం. మావోయిస్టులను చంపిన తర్వాత పారామిలిటరీ దళాలు నృత్యం చేస్తున్న సందర్భాలు నమోదు కావడమే కాకుండా, రాజ్య అధికారులు కూడా అలా చేయడానికి ప్రేరేపితులయ్యారు. ఎందుకంటే వారు బహుమతులను తమలో తాము పంచుకోగలుగుతున్నారు.  2018 ఏప్రిల్‌లో, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 20 మంది నక్సల్స్ మరణించిన ముఖ్యమైన ఎన్‌కౌంటర్ తర్వాత, C-60 కమాండోలు, సి‌ఆర్‌పి‌ఎఫ్ సిబ్బంది సప్నా చౌదరి నటించిన ప్రసిద్ధ హర్యాన్వి పాటకు నృత్యం చేయడం ద్వారా తమ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అదేవిధంగా, 2024 నవంబర్‌లో, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఆపరేషన్ ఫలితంగా 10 మంది నక్సలైట్ల హత్య జరిగిన తర్వాత, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డి‌ఆర్‌జి) జవాన్లు ఎన్‌కౌంటర్ స్థలం నుండి తిరిగి వచ్చిన తర్వాత స్థానిక జానపద సంగీతానికి నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భాలు నక్సలైట్లను చంపినప్పుడు ఎవరూ సంతోషంగా ఉండరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలకు విరుద్ధంగా, అధికారిక భావాలకు, భద్రతా బలగాల క్షేత్రస్థాయి ప్రతిచర్యలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపాయి. వాస్తవానికి, 2024లో కేవలం ఒక ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే మావోయిస్టుల హత్యలు, లొంగుబాటు కేసులకు 1.4 కోట్ల రూపాయలకు పైగా బహుమతులు లభించాయి. అయితే సమగ్ర ప్రజా రికార్డులు లేకపోవడం వల్ల రాజ్యం సంపాదించిన మొత్తం అస్పష్టంగానే ఉంది. ‘బహుమతిని తీసుకోడానికి కనిపించగానే చంపండి’ అని మావోయిస్టుల పట్ల ఉన్న విధానం చాలా సులభం అని ఇది స్పష్టంగా సూచిస్తుంది.

శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే ముందస్తు పరిస్థితులు గెరిల్లా యుద్ధ రాజకీయాలకు అవసరం. పార్టీ తన కార్యకర్తలను కోల్పోతుందనే వాస్తవం మావోయిస్టు పార్టీ నిర్దేశించిన పరిస్థితులను నడిపించదు. అసమాన యుద్ధంలో (సాధారణంగా యుద్ధంలో) గెరిల్లా ఉద్యమంలో చేరినా లేదా దానికి మద్దతు ఇచ్చినా శాశ్వత గాయం లేదా మరణం సంభవించే అవకాశం ఉందని విప్లవకారులందరికీ, ప్రజలకూ కూడా తెలుసు. వాస్తవానికి, ఆపరేషన్ కగార్ ఫాసిస్ట్ దాడిలో లెక్కలేనంత మంది ఆదివాసీలు అలాగే సామాన్య ప్రజలు బాధపడుతున్నారనే వాస్తవం శాంతి చర్చలకు పిలుపునిస్తోంది. కాబట్టి, ఇక్కడ ప్రశ్న మావోయిస్టులు భారీ నష్టాలను చవిచూస్తున్నారా లేదా అనేది కాకూడదు. ఇక్కడ ప్రశ్నించాల్సినది – ఆపరేషన్ కగార్ కింద ప్రజలపై జాతి విధ్వంసక యుద్ధాన్ని రాజ్యం ఎందుకు పట్టుబడుతోంది? ఇది పాలక వర్గాల పూర్తిగా ఆర్థిక ప్రయోజనాల ద్వారా నడుస్తోంది. ఇటీవలే 2025 మార్చి 26 నాడు బస్తర్‌లో నిరాయుధులుగా ఉన్న రాజ్యం ముగ్గురు మావోయిస్టు నాయకులను(రేణుక, సారయ్యలను అదుపులోకి తీసుకుని హత్య చేసింది.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ(NASSCOM), ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమి కండక్టర్ అసోసియేషన్(IESA),ద ఇండస్ ఎంటర్‌ప్రినియర్స్(TIE)బెంగళూరుతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది, వీటిలో 3,700 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ప్రతిపాదన ఉన్నది. ఈ ప్రతిపాదనలలో సెమీ-కండక్టర్ల అభివృద్ధి కూడా ఉంది.ఈ ప్రాంతంలో భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రతినిధిగా తైవాన్‌తో పోటీ పడాలని, ఈ ప్రాంతంలో తన స్వంత విస్తరణ ఎజెండాను నెరవేర్చాలని కోరుకుంటోంది.

కార్పొరేట్ దోపిడీకి మద్దతుగా విచ్చలవిడిగా అవగాహనా ఒప్పందాలపైన సంతకం చేయడం, దానితో పాటు ఫాసిస్ట్ జాతి విధ్వంస కార్యక్రమాలపై సంతకం చేయడం అనేది కొత్తేమీ కాదు. 2009 సంవత్సరంలో సల్వాజుడుమ్‌తో ప్రారంభమైంది. అరుంధతి రాయ్ గతంలో ఇలా అన్నారు, “ప్రతి కొండ, నది, అటవీ మైదానంపైన ఒక అవగాహనా ఒప్పందం ఉంది.” బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ భారతదేశ రాజ్యం తన యజమానులను సంతోషపెట్టాలని, ఛత్తీస్‌గఢ్‌లో “అభివృద్ధి” ప్రాజెక్టులను సులభతరం చేయాలనే తన దళారీ స్వభావంతో, తన స్వంత పౌరులను, వారి జీవితాలను పట్టించుకోకుండా, మావోయిస్టు పార్టీ ప్రతిపాదనను ఎలా తిరస్కరిస్తుందోననే విషయాన్ని ఇది చూపిస్తుంది. అంతేకాకుండా, అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య రాజ్యం నిర్వహించే ప్రజాస్వామ్యంలో నటన ఉన్నప్పటికీ, మనం కామ్రేడ్ ఆజాద్, జర్నలిస్ట్ హేమ్ చంద్ర పాండేల హత్యను గుర్తుంచుకోవాలి – మావోయిస్టు పార్టీ  భారత రాజ్యం మధ్య శాంతి చర్చలకు సంబంధించిన ప్రయత్నం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆజాద్, అతనితో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళిన జర్నలిస్టు హేమ్ చంద్ర పాండేలను మొదట పట్టుకొని, హింసించి, విచారణ చేసి చివరికి చంపారు.

అందువల్ల, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ రాజ్య వర్గ స్వభావమూ దాని ద్రోహాల చరిత్రల గురించిన నిష్పాక్షిక విశ్లేషణతో జాగ్రత్తపడుతూ, శాంతి చర్చలను ప్రారంభించడానికి ముందస్తు షరతులు ఒప్పుకోవాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేయడం సమర్థనీయమే. ఇది రాజ్యానికున్న చరిత్ర వల్ల మాత్రమే కాకుండా, నక్సలిజాన్ని అంతం చేయాలనే సమర్థనతో రాజ్యం చేపట్టిన రక్తపాత కార్యకలాపాలకు గురవుతున్న తన సొంత పౌరుల పట్ల రాజ్యం వహిస్తున్న స్పష్టమైన నిర్లక్ష్య వైఖరి వల్ల కూడా ఇలా చేయాల్సి వచ్చింది. శాంతి చర్చలకు వచ్చేముందు లొంగిపోవాలనే రాజ్యం డిమాండ్‌కు మావోయిస్టు పార్టీ అంగీకరించినట్లయితే మావోయిస్టు పార్టీ అంతమైపోవడమే కాకుండా, భారత రాజ్యం చేస్తున్న ఫాసిస్ట్ దాడికి వ్యతిరేకంగా ప్రజలు తమ అత్యంత వ్యవస్థీకృత ఆత్మరక్షణా మార్గానొకదాన్ని కోల్పోతారు; అదే సమయంలో పాలనకు, అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండాపోయి సాధారణ ప్రజలే నష్టపోతారు.

శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించడానికి మావోయిస్ట్ పార్టీ నిర్దేశించిన షరతులకు భారత రాజ్యం నెరవేర్చాలి.

ఇంతకుముందు మేం క్లుప్తంగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, భారత రాజ్యం చేసిన ద్రోహాల చరిత్ర నిష్పాక్షిక వర్గ విశ్లేషణ కారణంగానే మావోయిస్టు పార్టీ శాంతి చర్చకు షరతులు పెట్టడంలో సమర్థనీయమైనది.

భారత రాజ్యం చేసిన ద్రోహ చరిత్ర ప్రజల దృష్టి నుండి దాగినది కాదు; వాస్తవానికి ప్రధాన స్రవంతి వార్తా ఛానెల్‌ల ద్వారా కూడా విస్తృతంగా చర్చలు, వాదనలు జరిగాయి. 2004లో పీపుల్స్ వార్ పార్టీతో చర్చల సమయంలో ప్రభుత్వం పార్టీ శ్రేణుల్లో విపరీతంగా కోవర్టులను ప్రవేశపెట్టింది. వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున హత్యలకు పాల్పడింది. ఒకానొక కారణంగా ఆ చర్చలు ఆగిపోయాయి. 2009 లో గ్రీన్ హంట్ ప్రారంభ అయ్యింది. 2005 నాటికి మన్మోహన్ సింగ్ భారతదేశపు అంతర్గత ముప్పుగా నక్సలిజం ను పేర్కొన్నాడు. 2007 లో వచ్చిన ద్రవ్య సంక్షోభం, 2008 లో జరిగినన ముంబై సంఘటన తదితర కారణాలు వల్ల ఇక్కడ ఉద్యమాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇందులో అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం, నిర్దేశకత్వం మొదలయ్యాయి. అలా గ్రీన్ హంట్ మొదలు అయింది. పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకునే ఈ ప్రక్రియలో, భారత రాజ్యం పార్టీ గురించి నిఘా సమాచారాన్ని సేకరించింది; ఉద్యమంలోని అనేక మంది నాయకులను అరెస్టు చేసింది; బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపింది. మరొక సందర్భంలో, భారత రాజ్యం మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాంతి చర్చల ప్రతినిధి కామ్రేడ్ ఆజాద్‌ను, జర్నలిస్ట్ హేమ్ పాండేను బంధించి, హింసించి, హత్య చేసింది. 2011 నవంబర్‌లో, మమత నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు ప్రారంభ సంకేతాలు ఉన్నప్పటికీ, కామ్రేడ్ కిషన్‌జీని బంధించి, హింసించి, హత్య చేసింది.  

అందువల్ల, భారత రాజ్యానికి నిజంగానే శాంతినెలకొల్పాలనే లక్ష్యం ఉంటే, శాంతికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్ధారించుకోవడానికి చొరవ తీసుకోవాలి. అటువంటి వాతావరణం ఏర్పడడానికి మావోయిస్టు పార్టీ నిర్దేశించిన కాల్పుల విరమణ, ఆపరేషన్ కగార్ కింద సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం అనే షరతులు హేతుబద్ధంగా ఉన్నాయి. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న దాడి కొనసాగితే, నక్సలిజాన్ని ఎదుర్కోవడం పేరుతో అమాయక ఆదివాసీలు, నిరాయుధ పోరాట యోధుల హత్యలను సమర్థిస్తున్నంతకాలం శాంతి ఉండదు. ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా దాని కార్పొరేటీకరణ, సైనికీకరణ విధానం కొనసాగుతున్నంత వరకు; ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నంత వరకు శాంతి ఉండదు. శాంతిని కోరుకోవడంలో భారత రాజ్యానికి నిజాయితీ ఉంటే కనక ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి, ఈ ప్రాంతంలోని అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేసి, కొత్త అవగాహన ఒప్పందాలపై సంతకం చేయకుండా, రాష్ట్ర వనరుల లూటీని, దోపిడీని వ్యతిరేకించే రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడం ద్వారా నిరూపించుకోవాలి.

శాంతి- విముక్తి ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కావు: శాంతి చర్చలు దీర్ఘకాలిక పరిష్కారమా?

గతంలో చర్చల సందర్భంలో జరిగిన ద్రోహాల పరంపరను, అలాగే భారతదేశంలో ఉత్పత్తి విధానానికి సంబంధించిన సమస్యను పరిగణనలోకి తీసుకుంటే శాంతి చర్చలు శాశ్వత పరిష్కారానికి దారితీస్తాయని మనం చెప్పగలమా? అనే ప్రాథమిక ప్రశ్నకు దారి తీస్తాయి.

మరో మాటలో చెప్పాలంటే, మావోయిస్టు పార్టీ తన దీర్ఘకాలిక ప్రజా యుద్ధ వ్యూహం, ఆ వ్యూహాన్ని స్వీకరించడానికి భౌతిక పరిస్థితుల్లో ఉన్న వైరుధ్యాలకు శాంతి ప్రక్రియనే  ఒక పరిష్కారమా అని మనం మనల్ని మనం ప్రశ్నించుకోగలమా? తన అర్ధ వలస, అర్ధ భూస్వామ్య స్వభావం నుండి ఉద్భవించే సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను భారతదేశం స్వీకరించింది. ఇది విస్తృత ప్రజానీక దోపిడీ, అణచివేతలపై ఆధారపడిన అభివృద్ధి నమూనా. భారతదేశం అర్ధ వలస, అర్ధ భూస్వామ్య రాజ్యం అని మనం అంటున్నామంటే, భారతదేశం ప్రపంచ సామ్రాజ్యవాద వ్యవస్థ అవసరాలపైన ఆధారపడిన ఉత్పత్తి విధానం కలిగిన దేశం అని, భూస్వామ్య సంబంధాలను కొనసాగించడం ద్వారా మరింత బలోపేతం అయిందని మనం చెబుతున్నాము. బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని జయించడానికి వచ్చినప్పుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాద అవసరాలకు అనుగుణంగా మన దేశంలోని బూర్జువా వర్గం భారతదేశ స్వంత పరిశ్రమల ఆర్థిక అభివృద్ధిని పణంగా పెట్టి నీలిమందును పెంచడానికి అనుకూలంగా స్థానిక చేతివృత్తుల పరిశ్రమలను నాశనం చేసింది.

ఈ ప్రక్రియ భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రమైన, స్వయంపోషక, స్వయం సమృద్ధ నమూనాగా అభివృద్ధి అవగల వృద్ధి సామర్థ్యాన్ని అడ్డుకుంది; తద్వారా పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందకుండా నిర్ధారించింది; – భారతదేశ ఉత్పత్తి శక్తులను అణచివేసి బ్రిటిష్ ప్రయోజనాలకు సేవ చేయడానికి చౌక శ్రమను దోపిడీ చేశారు; ఉత్పత్తి సంబంధాల పెరుగుదల కుంటుపడింది; తద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ వారి వలసగా మార్చింది.

1947లో జరిగిన అధికార బదిలీ భారతదేశ ఉత్పత్తి స్వభావాన్ని గుణాత్మకంగా మార్చలేదు; ఇది భారత పాలక వర్గాలకు (భూస్వామ్య యజమానులు, దళారీ నిరంకుశ పెట్టుబడిదారులు) భారతదేశం ఎవరి కింద సేవ చేయాలో ఎంచుకోవడానికి కొంత స్వేచ్ఛను మాత్రమే ఇచ్చింది. ఒకరి స్థానంలో బహుళ సామ్రాజ్యవాద యజమానులు ఉన్న ప్రత్యక్ష నుండి పరోక్ష ఇది పాలనా రూపంగా మార్చింది.

ఇది భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ సామ్రాజ్యవాద వ్యవస్థ నిర్దేశిస్తుందని చూపిస్తుంది; ఇది సంక్షోభ స్థితిలో ఉంది; పెట్టుబడిదారీ విధానపు అతి సరఫరా పద్ధతి కారణంగా దాని స్వంత పతనం అనివార్యమవుతుంది. దోపిడీ, అణచివేతల తదుపరి వలయాన్ని నిలబెట్టడానికి లాభార్జనను కొనసాగించడానికి, అపరిమిత లాభాలను సంపాదించడానికి మరిన్ని వనరులను, చౌకశ్రమను సేకరించడానికి మరింత దోపిడీ, అణచివేతను చేయాలి. సామ్రాజ్యవాదానికి సేవ చేయడానికి భారత రాజ్యం తన సొంత పౌరులపై యుద్ధం చేస్తున్న బస్తర్ ఇందుకు స్పష్టమైన ఉదాహరణ.

భారత ప్రజలపై చేస్తున్న యుద్ధంలో విచక్షణారహిత కాల్పులు, మరణం, అత్యాచారం, ఎన్‌కౌంటర్, తరువాత హత్యకు గురైన ఆదివాసీలను మావోయిస్టులనడం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక సాధారణ వ్యూహం. భారతదేశంలోని ఆదివాసీ జనాభా శతాబ్దాలుగా తమ జల్-జంగల్-జమీన్‌పై హక్కుల కోసం పోరాడుతోంది. “స్వతంత్ర” భారతదేశ రాజ్యాంగం “షెడ్యూల్డ్ ప్రాంతాలలో” ఉన్న ఆదివాసీలకు వారి పూర్వీకుల జల్-జంగల్-జమీన్ పైన స్వయం పాలనా హక్కును ఇచ్చినప్పటికీ, ఈ హక్కులను రాజ్యయంత్రాంగాలు చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా కూడా హరిస్తున్నాయి.

ఇతర కంపెనీలతో పాటు టాటా, జిందాల్ స్టీల్, పోస్కో వంటి పెద్ద కార్పొరేట్ కంపెనీల ద్వారా మైనింగ్ కార్యకలాపాలకు లేదా పారిశ్రామిక చొరబాటుకు పూర్తిగా అనుకూలమైన భూమిని అందుబాటులోకి తేవాలనే ఆతురతతో, ప్రధానంగా వాటిలో నివసించే ఆదివాసీ సముదాయాలకు చెందిన ఈ భూములను, భారతీయ సంపదను, వనరులను దోచుకునే ఈ కార్పొరేట్ దోపిడీదారులకు చట్టబద్ధంగా అందేలా చేస్తున్నారు.

ఈ దళారీ ఏజెంట్లూ, భారత రాజ్యమూ సామ్రాజ్యవాద ద్రవ్యం కోసం సంపదను కూడబెట్టుకుంటుంటే, ఆదివాసీ, స్థానిక సముదాయాలు ఒక జాతి విధ్వంసక సైనిక చర్యలో బలవంత నిర్వాసిత్వానికి గురవుతున్నాయి. స్థానిక జనాభాకు చెందిన జల్-జంగల్-జమీన్-ఇజ్జత్, అధికార్ (నీరు, అడవులు, భూమి, గౌరవం హక్కులు) పై బలవంతపు దాడిని ఎదుర్కోవడానికి ఆ ప్రాంతంలో ఉద్భవించిన నక్సలైట్ శక్తులు ఎంత దాడికి గురవుతున్నాయో, అమాయక, సాధారణ పౌరులు, రాజ్యాంగ నిరసన మార్గాలను అవలంబిస్తున్న వారు కూడా అంతే దాడికి గురవుతున్నారు.

“శాంతి పరిరక్షణ” అనే ముసుగులో రాజ్యం ప్రారంభించిన ఈ దాడులను బలగాలు సాయుధ మావోయిస్టులపైన మాత్రమే క్రూరమైన భద్రతా కార్యకలాపాలను నిర్వహిస్తాయి, గ్రామస్తులపైన కాదు. అయితే, క్రూరమైన ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్-ప్రహార్, ఇటీవలి ఆపరేషన్ కగార్‌లకు సంబంధించిన నివేదికలు భద్రతా బలగాలు అమలుచేస్తున్న క్రూరత్వాలు, అత్యాచారాలు, హింసలు, హత్యలకు సాధారణ పౌరులు ప్రధాన బాధితులు అని చూపిస్తున్నాయి. అంతేకాకుండా, రాజ్య వ్యతిరేక దళాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న నక్సలైట్లను చంపినప్పుడు కూడా, ఎన్‌కౌంటర్‌లు నిజమైన వాటి కంటే బూటకమైనవిగా ఉంటాయి; నక్సలైట్లను (ఆరోపించిన లేదా ఇతరత్రా) భద్రతా దళాలు ఖైదీలుగా తీసుకున్నట్లు, హింసించినట్లు, అత్యాచారం చేసిన తర్వాత కాల్చి చంపినట్లు ఆధారాలు ఉన్నాయి.

ఇది యుద్ధ చట్టాలకు సంబంధించిన అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలను, పోరాట యోధులు కానివారి హక్కులను, అలాగే దేశ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడం అవుతుంది. ఈ చట్టాలలో భద్రతా బలగాలకు హత్య చేయడానికి, పోరాట యోధులను కానీ లేదా నక్సల్ అని ఆరోపితులైన వారిని కానీ హింసించడానికి హక్కు లేదు. ఇతర భారతీయ పౌరులలాగానే న్యాయ ప్రక్రియకు, ఖైదీల హక్కులకు అర్హత ఉంది. భారత రాజ్యం తన సొంత ప్రజలపై యుద్ధం చేయడానికున్న లక్ష్యం అభివృద్ధి కోసం యుద్ధం కాదు, కార్పొరేట్ దోపిడీ కోసం స్థానిక ఆదివాసీలను క్రూరంగా, సామూహికంగా నిర్వాసితులను చేసి, మారణహోమం చేయడం.

2024 ప్రారంభంలో క్రూరమైన, దుర్భరమైన ఆపరేషన్ కగార్ లేదా “అంతిమ చర్య”ను మొదలుపెట్టారు; ఇది బస్తర్ ఆదివాసీలను దుర్భర యాతనలకు గురిచేసింది. శాంతిని కోరుకుంటున్నామనే నిరంతర వాక్చాతుర్యంతో రాజ్యం దీన్ని చేస్తోంది;  వైచిత్రమేమంటే “మావోయిస్టుల” నిర్మూలన లక్ష్యంగా ఈ చర్యను అమలు చేస్తూనే వారితో శాంతికి అనుకూలంగా ప్రకటనలు చేస్తుంది. కగార్ సాయుధ ప్రతిఘటనతో పాటు బస్తర్‌లో అన్ని ప్రజాస్వామిక, రాజ్యాంగపర ప్రతిఘటనలను నిర్మూలించడాన్ని కూడా చేస్తుంది; వాస్తవానికి ఇది ఆదివాసీ జనాభా అస్థిత్వానికే వ్యతిరేకంగా భారత రాజ్యం ఇస్తున్న మారణహోమ యుద్ధ కేక. మావోయిస్టు పార్టీ భారత రాజ్యాల మధ్య జరిగే శాంతి చర్చలు ఒక పరిష్కారాన్ని లేదా తాత్కాలిక కాల్పుల విరమణను ఇచ్చినప్పటికి ‘శాంతి’కి ఉన్న దుర్బలత్వాన్ని ఇవన్నీ స్పష్టంగా చూపిస్తున్నాయి. అందువల్ల, మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకోసం యిచ్చిన పిలుపును స్వాగతిస్తున్నాం; పూర్తి మద్దతు నిస్తున్నాం. అయితే అదే సమయంలో విముక్తిని శాంతితో పరస్పర మార్పిడి చేయలేరు అని స్పష్టం చేయదలుచుకున్నాం.

శాంతి అనేది పోరాటం నుండి ఉత్పన్నమయ్యే తాత్కాలిక పరిస్థితి కావచ్చు. రెండు వ్యతిరేక లేదా శత్రుపూరితమైన శక్తుల మధ్య కూడా ప్రతిష్టంభన ఏర్పడవచ్చు,  సంఘర్షణలో ఉన్న ఒక పార్టీ మరొకదాని కంటే బలంగా ఉన్నప్పుడు, బలగాలు కోలుకోవడానికి సమయమూ స్థలమూ అవసరమైన స్థితి కావచ్చు. భారీ ఎత్తున జరుగుతున్న దాడిలో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో కూడా శాంతి ఉండవచ్చు. ఇది తాత్కాలికం కావచ్చు, ఇది ఒక ఎత్తుగడగా ఉండవచ్చు, భారత రాజ్యం భారతదేశంలోని ప్రజలపై యుద్ధం కొనసాగించే ముందు ఇది ఒక చిన్న విరామం కావచ్చు.

ఇజ్రాయెల్- రెసిస్టెన్స్ యాక్సిస్ మధ్య మనం చూస్తున్న ఈ రకమైన శాంతి – ఇజ్రాయెల్ తన బలగాలు తేరుకొన్న వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాత్రికి రాత్రే గాజా స్ట్రిప్ అంతటా వందలాది మంది పాలస్తీనియన్లను చంపింది (400 మంది పౌరులు!) – ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు “ఇది ప్రారంభం మాత్రమే” అని ప్రతిజ్ఞ చేశాడు.

అందువల్ల, మనం కాల్పుల విరమణను లేదా శాంతిని విముక్తితో గందరగోళపడకూడదు. విముక్తి అనేది ఉత్పత్తి విధానంలో వచ్చే ఒక గుణాత్మక మార్పు (ఒక విప్లవం). సమాజంలోని వ్యతిరేక వర్గాల మధ్య విరోధం లేనప్పుడు, వర్గాలు రద్దు అయినప్పుడు మాత్రమే వాస్తవంగా శాంతిని సాధించగలం; అన్నిరకాల దోపిడీ, అణచివేతలకు మూలం అంటే వ్యక్తిగత ఆస్తి రద్దు అయినప్పుడు. దీనికి ముందు పాలక వర్గం చేసే శాంతి వాగ్దానం ప్రజలపై దాని దురాగతాలకు స్వల్ప విరామం, ఒక తప్పుడు వాగ్దానం.

భారత పాలకవర్గం వాగ్దానం చేసిన ‘శాంతి’కి ఉన్న మోసపూరిత స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలిమ్ (ఇసాక్-ముయివా) లేదా ఎన్‌ఎస్‌సి‌ఎన్ (ఐఎమ్) తో “శాంతి ప్రక్రియ” జరిగే సమయంలో నాగాలాండ్‌లో జరిగిన ద్రోహాన్ని మనం పరిశీలించాలి. భారత రాజ్యమూ ఎన్‌ఎస్‌సి‌ఎన్ (ఐఎమ్)ల మధ్య జరిగిన 1997 కాల్పుల విరమణ ఒప్పందాన్ని నాగాలు స్వయం నిర్ణయాధికారం కోసం దశాబ్దాలుగా చేసిన విప్లవకర పోరాటం తర్వాత సంభవించిన ఒక చారిత్రాత్మక పురోగతిగా చిత్రీకరించారు. కానీ ప్రారంభం నుండి, ఈ కాల్పుల విరమణ సద్భావనా చర్య కాదు – ఇది జాతీయ విముక్తి పోరాటాన్ని నీరుకార్చడానికి, తన విస్తరణవాద పార్లమెంటరీ చట్రంలోకి చేర్చుకోడానికి భారతరాజ్యం చేసిన ఒక ఉద్దేశ్యపూరిత చర్య.

నాగా ప్రజల “ప్రత్యేక చరిత్ర-స్థానం”కి నోటిమాటల సేవనందించిన  2015 ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని విప్లవోద్యమాన్ని నిరాయుధీకరించడానికి, నీరుకార్చడానికి, దిక్కుతోచని స్థితికి తీసుకురావడానికి ఒక మంచు తెరగా ఉపయోగించారు. – భాగస్వామ్య సార్వభౌమాధికారం, ప్రత్యేక జెండా, రాజ్యాంగం –అనే  నాగా ప్రజల పోరాట ప్రధాన డిమాండ్లను ఆలస్యం, కపటం, దారిమళ్లింపుల ద్వారా పక్కకు పెట్టారు;డొల్ల చేసారు.

ఇది విఫలమైన చర్చల సందర్భం కాదు – ఇది ప్రతిఘాతుక విప్లవానికి ఒక పాఠ్యపుస్తక ఉదాహరణ. ఒప్పందపు స్ఫూర్తిని గౌరవించే బదులు, భారత రాజ్యం చర్చలను నిరవధికంగా పొడిగించడం, విప్లవ శక్తులను విభజించడం, ఉద్యమాన్ని లోపలి నుండి దెబ్బతీయడం లాంటి తిరుగుబాటు నిరోధక చర్యలను ఉపయోగించింది. రాజ్యం వ్యూహాత్మకంగా ఎన్‌ఎస్‌సి‌ఎన్(ఖప్లాంగ్), నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్స్ (ఎన్‌ఎన్‌పి‌జి) వంటి ప్రత్యర్థి వర్గాలతో మాట్లాడి, ప్రధాన విప్లవశక్తి అయిన ఎన్‌ఎస్‌సి‌ఎన్(ఐఎం)ని దాటవేసే సమాంతర ఒప్పందాలను కుదుర్చుకుంది. సామ్రాజ్యవాదులు, వారి దళారీలు చాలా కాలంగా పరిపూర్ణత సాధించిన ఈ విభజించు-పాలించు అనే ఎత్తుగడ నాగా ప్రజలలో గందరగోళాన్ని, అపనమ్మకాన్ని, ముఠాతత్వాన్ని నాటింది. రాజ్యం తనకు విధేయులైన ముఠాలను ఆసరా చేసుకుని, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారి మధ్యనున్న వైరుధ్యాలను ఉపయోగించడంతో సంవత్సరాల తరబడి జరిగిన పోరాటం ద్వారా ఏర్పడిన విప్లవకర ఐక్యత బలహీనపడింది. ఆ తరువాత శాంతి ముసుగులో సైనికీకరించిన శాంతియుత ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా జరిగింది. చర్చలు జరిపినప్పటికీ, భారత రాజ్యం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట (ఎఎఫ్‌ఎస్‌పిఎ) ఉక్కు పాదాన్ని దృఢంగా ఉపయోగించింది;నాగా భూభాగాల్లో శిక్షలేమి, ఆక్రమణ పాలనను కొనసాగించింది. శాంతి చర్చలు నిరంతర అణచివేతకు ఒక ముసుగుగా మారాయి: నిఘా తీవ్రమైంది; కాల్పుల విరమణను పర్యవేక్షించే నెపంతో భారత నిఘా సంస్థలు తమను తాము లోతుగా వేళ్ళూనుకున్నాయి. ప్రతి నాగా గ్రామం నిఘా, అనుమానాల ప్రదేశంగా మారింది;  ప్రతి కార్యకర్తను సంభావ్య “ఉగ్రవాది”గా భావించడం జరిగింది. ఇది శాంతి కాదు – దౌత్య భాషలో చుట్టిన ప్రతీఘాతుక తిరుగుబాటు చర్య.

నాగా ప్రజలపై రాజ్యం చేసిన యుద్ధం కూడా మరింత బహిరంగంగా ఉగ్రవాద రూపాన్ని తీసుకుంది: జాతీయ విముక్తి పోరాట సూత్రాలకు నిబద్ధులై ఉన్న నాయకులు, సిద్ధాంతకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్య చేసింది.డొల్ల శాంతిని తిరస్కరించి సాయుధ పోరాట మార్గాన్ని తిరిగి ప్రారంభించిన ఎస్ఎస్ ఖప్లాంగ్ వంటి వ్యక్తులను వేరు చేసి, ముట్టడించింది. మైఖేల్ కబుయ్ వంటి విప్లవ సిద్ధాంతకర్తలు అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు; వారి మరణాలను నిశ్శబ్దమూ ఊహాగానాలూ కమ్ముకొన్నాయి. చట్టాతీత హత్యలకు ఒక మృదువైన  పేరైన అయిన”ఎన్‌కౌంటర్లలో” నాగాలాండ్, మణిపూర్, అస్సాం రాష్ట్రాలంతటా డజన్ల కొద్దీ మధ్య శ్రేణి కమాండర్లు, కేడర్లు పథకం ప్రకారం హతమయ్యారు. ఈ హత్యలు యాదృచ్ఛికం కాదు; అవి ఉద్యమ సంస్థాగత, సైద్ధాంతిక వెన్నెముకను నాశనం చేయడానికి ఒక క్రమబద్ధమైన ప్రయత్నంలో భాగం.

అదే సమయంలో, భారత రాజ్యం నాగా ప్రజల విప్లవ శక్తిని నిరాయుధీకరించడానికి సహనియామకాన్ని (కో-ఆప్టేషన్‌ని- కో ఆప్టుచేయడం; ఒక సంఘమువారు ఇతరులను తమతో కలిసి పనులు చేయనివ్వడం; అట్లా చేర్చుకొన్నవారికి అసలు సభ్యులతోపాటు సమానాధికారాలు ఉంటాయి) ఒక సాధనంగా ఉపయోగించింది. ఒకప్పుడు తాము వ్యతిరేకించిన రాజ్య నిర్మాణాలలోనే మాజీ అజ్ఞాత నాయకులు కలిసిపోయారు. అభివృద్ధి ప్యాకేజీలు, రాజకీయ నియామకాలు, కాంట్రాక్ట్ ఆధారిత పోషక వ్యవస్థల ద్వారా, దళారీ భారత రాజ్యం ప్రజలకు బదులుగా భారత పాలక వర్గానికి విధేయులైన నాగా ఉన్నత వర్గాల తరగతిని సృష్టించింది. ఈ వ్యక్తులు తమను అణచివేతకు గురిచేసేవారి తరపున ‘శాంతి దళారులుగా మారారు’.సుఖాలు, చిన్న చిన్న అధికార స్థానాల కోసం నాగా ప్రజల విప్లవ ఆకాంక్షలతో వ్యాపారం చేసారు. అభివృద్ధి పేరుతో, అవినీతి వృద్ధి చెందింది; సార్వభౌమాధికారం కోసం సమిష్టి పోరాటాన్ని ఆర్థిక తునకల కోసం పరిపాలనా చర్చలకు కుదించారు. ఆ సమయంలో ప్రజా పునాదిని నీరుకార్చారు. రాజకీయాలు లేకుండా చేసారు. కిందిస్థాయి నుండి విప్లవకర ఉరవడిని పునర్నిర్మించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా తుంచివేయడానికి జర్నలిస్టులు, పౌర సమాజ సభ్యులు, అట్టడుగు స్థాయి నిర్వాహకుకార్యకర్తలపైన నిఘా, అరెస్టులు, వేధింపులు ఉపయోగించారు. సందేశం స్పష్టంగా ఉంది: శాంతి పతాకం కింద కూడా భారత రాజ్యం ఎటువంటి ప్రతిఘటననూ సహించదు. కాల్పుల విరమణ కొత్త భవిష్యత్తును నిర్మించడానికి అవకాశం కాదు; అది విప్లవాన్ని చల్లార్చడానికి ఒక అవకాశం.

వర్గ ఆధిపత్య సాధనంగా పాలకవర్గ ప్రతినిధిగా రాజ్య స్వభావాన్ని నాగాలాండ్‌లో శాంతి ప్రక్రియ బహిర్గతం చేస్తుంది. పాలకవర్గం చేతిలో శాంతి అంటే హింస లేకపోవడం కాదు – ఇతర మార్గాల ద్వారా యుద్ధ కొనసాగింపు. భారత రాజ్యం నాగా ప్రజలతో శాంతిని కోరుకోలేదు; వారి విప్లవకర సామర్థ్యాన్ని రద్దు చేయాలని కోరింది. విచ్ఛిన్నం చేయడానికి, శాంతింపజేయడానికి, అంతిమంగా విప్లవోద్యమాన్ని లేకుండా చేయడానికి చర్చలను ఆయుధంగా ఉపయోగించి కాల్పుల విరమణను తిరుగుబాటు నిరోధక వ్యూహంగా మార్చింది.

నాగాలాండ్‌లో జరిగిన శాంతి చర్చల కేసు ఒక పదునైన హెచ్చరికగా నిలుస్తుంది: శాంతి అనేది వర్గ సమాజాన్ని కూల్చివేయడంతో, వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయడంతో, సామ్రాజ్యవాద, భూస్వామ్య నిర్మాణాలను కూల్చివేయడంతో ముడిపడి లేనప్పుడు, అది అణచివేతకు గురయ్యేవారికి కాకుండా ఎల్లప్పుడూ అణచివేతకు సేవ చేస్తుంది. సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానం, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానాల ప్రభావాల నుండి విముక్తి పొందిన సమాజాన్ని మనం నిర్ధారించుకున్నప్పుడు, ఉత్పత్తి విధానంలో పరివర్తన జరిగినప్పుడు మాత్రమే శాంతిని సాధించవచ్చని ఇవన్నీ స్పష్టంగా చూపిస్తున్నాయి; విభిన్న వ్యక్తుల మధ్య వర్గ వైరుధ్యం ఇకపై ఉనికిలో లేని సమాజంలో;ఎటువంటి వర్గాలు లేని పరిస్థితులలో మాత్రమే నిజమైన శాంతి సాధ్యమవుతుంది. అయితే, ఈ శాంతిని సాధించే ప్రక్రియ అంటే విముక్తి పొందడం అనేది చాలా కాలం పాటు సాగే ప్రక్రియ. విప్లవం అనేది ఒక రోజులో ముగించే విందు కాదు, సమాజాన్ని పరివర్తన చేసే ప్రక్రియలో జరిగే ఓపికతో  కూడిన దీర్ఘకాలిక పోరాటం. అందువల్ల, ఆపరేషన్ కగార్ క్రూరత్వం కింద, శాంతి చర్చలను ప్రారంభించే ప్రక్రియ, కాల్పుల విరమణ ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన, రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన అధికారాలు కలిగిన ప్రజా ప్రతినిధులవడం వల్లనూ, అప్రకటిత యుద్ధంలో తమ సొంత పౌరులపైననే హింస, క్రూరత్వాలన్ని ప్రేరేపిస్తున్నందువల్లనూ ఇక్కడ బాధ్యత ప్రధానంగా భారత రాజ్యంపైననే ఉన్నది.

ముగింపు

కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ప్రజల కోసం శాంతి, న్యాయాల ప్రపంచం కోసమూ యుద్ధం ద్వారా ఉనికిలో ఉండే పెట్టుబడిదారీ – సామ్రాజ్యవాద వ్యవస్థను అంతం చేయడానికి కృషి చేస్తారు. సామ్రాజ్యవాద వ్యవస్థ ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు అది పాత రూపాల్లో అర్ధ-వలసలను, వలసలను దోచుకోలేదు. సంక్షోభాలను తగ్గించడానికి, అది సైనికీకరణ, యుద్ధ ప్రయత్నాల వైపు నెట్టివేస్తుంది. ఇది అర్ధ-వలసలు, వలసలలో ఫాసిజాన్ని ప్రోత్సహిస్తుంది; కార్పొరేట్ దోపిడీని తీవ్రతరం చేయడానికి ఈ దేశాల ప్రజలపై యుద్ధం చేస్తుంది. ఏ పద్ధతులను అవలంబించినప్పటికీ వివిధ ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవకర శక్తులు, యుద్ధాలు లేని సమాజ ఆకాంక్షలోనూ అందరికీ శాంతిని, న్యాయాన్ని నిర్ధారించడంలోనూ ఐక్యంగా ఉన్నారు.

కాబట్టి, భారతదేశంలో జరుగుతున్న ప్రజలపై యుద్ధాన్ని, సైనికీకరణను అంతంచేయాలని  డిమాండ్ చేయడమూ, శాంతి కోసం ముందుకు సాగడమూ మన కర్తవ్యం. మావోయిస్టులూ భారత రాజ్యం మధ్య పరస్పర కాల్పుల విరమణను నిర్ధారించడమూ శాంతి చర్చలను జరపడమూ ఈ ప్రయత్నంలో ఒక ముఖ్యమైన భాగం. అందువల్ల, శాంతికాముకులు, యుద్ధాన్ని వ్యతిరేకించే ప్రజలందరూ దీనిని స్వాగతించాలి.

వల్లిక వర్షశ్రీ , ఎమ్.ఎ విద్యార్థిని

ప్రస్తావనలు

“మావోయిస్టులు షరతులతో కూడిన శాంతి చర్చలను అందిస్తున్నారు; చర్చలకు సిద్ధంగా ఉన్నాం కానీ షరతులను అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ చెబుతోంది.” ది హిందూ , 9 ఏప్రిల్ 2025, www.thehindu.com/news/national/maoists-offer-conditional-peace-talks-ready-for-talks-but-wont-accept-conditions-says-chhattisgarh/article69404416.ece .

సఖుజా, నేహా, సావీ సౌమ్య మిశ్రా. “నక్సలిజం పనిచేస్తుంది.” డౌన్ టు ఎర్త్ , 31 మే 2008, www.downtoearth.org.in/environment/naxalism-works-2517 .

సింగ్, మన్మోహన్. “నక్సలిజంపై ముఖ్యమంత్రి సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం.” భారత ప్రధానమంత్రి – డాక్టర్ మన్మోహన్ సింగ్, 13 ఏప్రిల్ 2006, archivepmo.nic.in/drmanmohansingh/speech-details.php?nodeid=302

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply