రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తుతున్న ఈ వారంలో పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో పాలకులు పధ్నాలుగు మందిని చంపి నెత్తుటి వరదలు పారించారు. వీళ్లలో ఆదివాసులు ఎందరు? అచ్చమైన మావోయిస్టులు ఎందరు? అనే చర్చ ఆసక్తి ఉన్న వాళ్లు తేల్చుకోవచ్చు. ఈ హింసను ఖండిరచడానికి, లేదా మన రాజకీయ వ్యతిరేకతల వల్ల ఉదాసీనంగా ఉండటానికి మృతులను ఎలాగైనా గుర్తించవచ్చు. కానీ వాళ్లు మనుషులు. స్త్రీలూ పురుషులుగా చూడదల్చుకుంటే ఇప్పటికి తెలుస్తున్న వివరాల ప్రకారం తొమ్మిది మంది మహిళలు.

ఆగస్టు 29వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. వీరు వాళ్లు మావోయిస్టు పార్టీ ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీ ప్రజా గెరిల్లా విముక్తి సైన్యం ఐదో కంపెనీ సభ్యులని కూడా చెప్పారు. వాళ్ల పేర్లు ప్రకటించలేదు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ మధ్యాహ్నం సుకుమా జిల్లా కుంట బ్లాక్‌ జేగురుకుంట`సింగవరం వద్ద రాకెట్‌ లాంచర్‌నో, డ్రోన్‌లనో వినియోగించి దాడి చేశారు. ఆ ప్రాంతంలోనే ఇద్దరు ఆదివాసీ యువకులను తీసికెళ్లి కాల్చేశారు. వీళ్లలో ఒకరి పేరు నర్సు అని తెలుస్తోంది. మరొకరి వివరాలు తెలియదు. మూడో తేదీ మధ్యాన్నం దంతెవాడ, బీజాపూర్‌ సరిహద్దుల్లోని లోహగావ్‌ పురంగెల్‌ ఆండ్రి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని 9 మంది మావోయిస్టులు చనిపోయారని అధికారులు ప్రకటించారు. వీళ్లు పశ్చిమ బస్తర్‌ దర్బా డివిజన్‌ పిఎల్‌జిఎ రెండో కంపెనీ సభ్యులని చెప్పారు. వీళ్లలో ఆరుగురు మహిళలు. ఎన్‌కౌంటర్లు జరిగాయని చెప్పబడుతున్న రెండు ఘటనల్లో మృతులు మావోయిస్టు యూనిఫాంలో ఉన్నారని, రాకెట్‌ లాంచర్ల వంటి ఆధునాతన ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ రెండో ఎన్‌కౌంటర్‌ మృతుల పేర్లు తెలియదు. ఈ మూడు ఘటనల మీద మావోయిస్టు పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. యుద్ధం ఎట్లా ఉన్నదో, ఎంత అననుకూల పరిస్థితుల్లో విప్లవోద్యమం నడుస్తున్నదో ఇది సూచిస్తున్నది.

ఆగస్టు 24, 25 తేదీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చత్తీస్‌ఘడ్‌ పర్యటనకు వెళ్లాడు. నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో పాల్గొన్నాడు. విప్లవోద్యమ అణచివేత చర్యను సమీక్షించాడు. ఈ సందర్భంగా ఆయన దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని మార్చి 2026 నాటికి నిర్మూలిస్తామని ప్రకటించాడు. గత సాధారణ ఎన్నికలనాటికి చత్తీస్‌ఘడ్‌లో 295 సైనిక క్యాంపులు ఉన్నాయని, తాజాగా మరో 36 ఏర్పాటు చేస్తామని చెప్పాడు.

2017లో అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆపరేషన్‌ సమాధాన్‌ ప్రారంభించినప్పుడు 2021 జూన్‌ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తామని అన్నారు. సమాధాన్‌ మావోయిస్టు నిర్మూలనలో చిట్ట చివరి ఆపరేషన్‌ అన్నాడు. దాని కోసం హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధ సామాగ్రి, లక్షల సైనికులు, లెక్కలేనన్ని నిధులు కేటాయించాడు. ఆ తర్వాత 2022 చివర్లో సూరజ్‌కుండ్‌ సమావేశంలో 2024 ఎన్నికలు మావోయిస్టు రహిత భారత్‌లో నిర్వహించాలని తీర్మానించారు. దీని కోసం 2024 మొదటి రోజు నుంచే ఆపరేషన్‌ కగార్‌ ఆరంభించారు. ఇక ఇదే అంతిమ యుద్ధమని అన్నారు. ఇప్పుడు తాజాగా కగార్‌లో భాగంగా 2026 మార్చి నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి ప్రకటించాడు.

ఇదంతా సైనిక పరిభాష అనిపిస్తుంది. ఇటు విప్లవోద్యమాన్ని, అటు ఫాసిస్టు హిందుత్వ రాజ్యాన్ని సమదూరంలో నిలబెట్టి చూసే వాళ్లకు మావోయిస్టు ఉద్యమానిది కూడా సైనిక స్వభావమే అనిపించవచ్చు. కానీ ఆరు రోజుల్లో 14 మందిని ఎవరు చంపారో, ఎట్లా చంపారో, దాని అర్థం ఏమిటో సులభంగానే తెలుసుకోవచ్చు. హోం మంత్రి పర్యటన తర్వాత మూడు రోజులకే ఈ హత్యా పరంపర ఆరంభమైంది. అంతక ముందు ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 160 మంది ఆదివాసులను, విప్లవకారులను చంపేశారు. హస్‌దేవ్‌ అడవుల్లో పది లక్షల చెట్లను నరికేసే పని మొదలు పెట్టారు. బహుశా అమిత్‌షా చెప్పిన 36 క్యాంపుల ఏర్పాటు పనులు కూడా మొదలయ్యే ఉంటాయి.

ఈ మనుషులు, చెట్లు, సైనిక క్యాంపులను కేవలం అంకెల్లోనే గుర్తిద్దామా? ఇదంతా మామూలే కదా అనే సాధారణీకరణకు కుదిద్దామా? లేక నిర్దిష్ట విశ్లేషణలోకి విస్తరిద్దామా? అనే సవాల్‌ నిలబడి ఉన్నది. సారాంశంలో దండకారణ్యంలోగాని, మొత్తంగా దేశ వ్యాప్తంగా విప్లవోద్యమ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని ఇది సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యావతూ ఆ పక్క మోహరించి ఉన్నది. ప్రభుత్వమంటే పోలీసులు, సైనికులు, హెలికాప్టర్లు, ప్రజల శ్రమ నుంచి పుట్టిన లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కాదు. వీటన్నిటినీ దోపిడీలో, అణచివేతలో, హింసలో భాగం చేసే నిర్దిష్టమైన వ్యూహం కూడా ఉంటుంది. రాజ్యాన్ని సైనికంగానే చూసే వాళ్లకు..ఆయుధాలు పట్టుకున్నందు వల్ల విప్లవకారుల్లో కూడా రాజ్య లక్షణం కనిపిస్తుంది. కానీ రాజ్యం తన మేలి ముసుగులన్నిటినీ తొలగించుకొని యుద్ధానికి దిగాక రంగంలో సైన్యం మాత్రమే ఉండదు. ఆయుధాలను వాడినంత కర్కశంగా, దుర్మార్గంగా, హీనంగా భావజాలాన్ని కూడా తయారు చేసి ప్రచారంలో పెడుతుంది. అందులో భయం ఉంటుంది. ప్రలోభం ఉంటుంది. మనుషులు మనుషులు కాకుండాపోయే పాశవిక క్రమం ఉంటుంది. సారాంశంలో అనేక రూపాల్లో హింస అమలులోకి వస్తుంది. రక్తపాతం సాధికారత సంపాదించుకుంటుంది.

గత ఇరవై ఏళ్లలో విప్లవోద్యమ నిర్మూలన కోసం రాజ్యం అనుసరించిన పద్ధతుల్లో పెరిగిన హింస అనేక సందిగ్ధతలకు గురి చేసింది. మావోయిస్టుల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఎన్‌కౌంటర్‌ పేరుతో విప్లకారులను చంపేసే హింస గురించి మనమేం మాట్లాడుతాంలే అనే తటస్థత తలెత్తింది. హింసను పరమ భావనగా చూసే ఉదార్త వైఖరి తీసుకొనేవారు పెరిగిపోయారు. విప్లవోద్యమం లోపభూయిష్ట విధానం చేపట్టినందు వల్ల జరుగుతున్న హింసగా ఇది వాళ్లకు కనిపిస్తుంది. దండకారణ్యంలో లక్షలాది సైనిక బలగాల మధ్య, డ్రోన్లు, రాకెట్‌ లాంచర్ల మధ్య, వందల బేస్‌ కేంపుల మధ్య కొనసాగుతున్న హత్యాకాండలో ‘అమాయక ఆదివాసులు’ ఎవరున్నారా? అని వెతకడం మొదలు పెడతారు. తమ సానుభూతి ప్రకటించడానికి, నిరసన తెలపడానికి, ప్రభుత్వం చట్టబద్ధ పాలన చేయడం లేదని ఎత్తి చూపడానికి ‘నేరాలకు పాల్పడని’ వ్యక్తుల శవాలు అక్కడెన్ని ఉన్నాయనే లెక్క మొదలు పెడతారు. హింసపట్ల మన మానవీయ వైఖరికి ఇదొక గీటురాయిగా మారుతుంది. ఇదే ప్రజాస్వామికమవుతుంది. మానవీయం అవుతుంది. మిగతా అంతా అప్రజాస్వామికం, అమానవీయం.

మేధావులు ఇంత ప్రజాస్వామికంగా మారిపోయాక ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వాళ్లందరి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. వంటి మీద యూనిఫారాలు ఉంటాయి. వాళ్లకు తెలిసిందే సత్యమనే విశ్వాసం మనసుల్లో, మెదడులో మేట వేస్తుంది. ఏం జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో, అందులోని సంక్లిష్టత ఏమిటో తెలుసుకొనే అవకాశమే ఉండదు. నిజమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పోయాక ఎవరు దేన్ని నమ్మాలో రాజ్యం సిద్ధం చేసి చేతిలో పెడుతుంది. అందులో అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు ఉంటాయనే కనీస ఎరుకను కోల్పోతారు. మనం సమాన దూరంలో ఉండే వాళ్లం కాబట్టి అక్కడ కూడా నిలబడలేని దుస్థితి ఏర్పడుతుంది. ప్రజల మీద చేసే యుద్ధంలో రాజ్యానికి ఆయుధాలకన్నా ఈ భావజాలమే గొప్పగా ఉపయోగపడుతుంది.

ఇంతగా హింస పెరిగిపోయాక, అదొక యుద్ధ రూపం తీసుకున్నాక అందులోని సత్యాసత్యాలను తెలుసుకోవాలంటే అగ్నిగుండంలో దూకి బైటికి రాగల సాహసాన్ని ప్రదర్శించాలి. ఘటలను, పరిణామాలను విడివిడా కాకుండా కలిపి చూడాలి. కంటికి కనిపించేది కాకుండా ఏది ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోగలగాలి. అది సౌకర్యవంతమైనది కాదు. ఈ ఆరు రోజుల్లోనే పైన ప్రస్తావించిన ఘటనల్లో సగానికిపైగా మహిళలు ఉండటాన్ని ఒక అంకెగానైనా గుర్తిస్తే సుఖంగా ఉండటం ఎవ్వరి వల్లా కాదు. ఇవన్నీ చూస్తూ మేధావులు ప్రశాంతంగా ఉండగలరు. కానీ ఈ వాస్తవాలే రాజ్యానికి ఆందోళన కలిగిస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో దేనికి ఇంత మంది మహిళలు ఉంటున్నారు? దేనికి విప్లవం అత్యవసరమైన పీడిత సమూహాలు ఇంతగా ఆ ఉద్యమంలో భాగమయ్యాయి? వాళ్లే దేనికి ఇంత సాహసోపేతమైన పోరాటాన్ని నడుపుతున్నారు? ఈ ఆందోళన నుంచే రాజ్యం ఏడాదికి వేల సంఖ్యలో హత్యకు పాల్పడుతున్నది.

ఈ వైపు నుంచి చూస్తే ఈ యుద్ధంలో పూర్తిగా ఆయుధాలే మోహరించాయని ఎవ్వరూ అనలేరు. జనాభాలో సగానికి సగం ఉన్న మహిళలను విప్లవోద్యమం సగానికిపైగా తనలో సమీకరించుకున్నది. పైన ప్రస్తావించిన ఘటనల్లో మృతులు ప్రజా గెరిల్లా విముక్తి సైన్యంలోని ఫలానా కంపెనీ సభ్యులని ప్రభుత్వమే చెబుతున్నది. బహుశా మావోయిస్టు రాజకీయ, సైనిక సాంస్కృతిక నిర్మాణాలన్నిటా నాయకత్వంతో సహా సగానికిపైగా మహిళలే ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. విప్లవోద్యమం స్త్రీలకు ఎంత ఆత్మవిశ్వాసం ఇచ్చి ఉండాలి? కుటుంబానికన్నా, ఈ సమాజానికన్నా విప్లవోద్యమమే తమకు పూర్తి రక్షణ అని ఎంత గాఢంగా నమ్మకం కలిగి ఉండాలి? లేకపోతే ఇంత మంది మహిళల భాగస్వామ్యం విప్లవోద్యమానికి ఎట్లా సాధ్యమవుతుంది? జండర్‌తో సంబంధం లేకుండా అందరికందరూ ఆదివాసులు, దళిత బహుజనులు, నిరుపేదలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఘోరమైన నిర్బంధం మధ్య, సైనిక దాడుల మధ్య, చుట్టుముట్టిన యుద్ధం మధ్య కనీసం మూడు దశాబ్దాలుగా ఎంత మానవీయ ప్రక్రియ జరిగి ఉంటే ఇది సాకారమై ఉంటుంది? మధ్యతరగతి సౌకర్యవంత జీవితంలో భాగంగా విప్లవాన్ని ప్రేమించడం, ప్రేమ పోయిందని ప్రకటించడంలాంటి అలవోక విషయం కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఒక పెద్ద సామాజిక సాంస్కృతిక పరివర్తనను అనేక ఆటుపోట్ల మధ్య కొనసాగించకపోతే ఇట్లాంటివన్నీ సుభాషితాల్లాగే మిగలిపోయేవి.

విప్లవకారుల చేతిలో ఆయుధాలు ఉన్నందు వల్లే రాజ్యం ఇంత కన్నెర్ర చేసిందని అమాయకులు అనుకోవచ్చు. కానీ రాజ్యం సగటు మేధావులకంటే చాలా తెలివైనది. ఈ సమాజంలో రూపొందుతూ ఉన్న అన్ని రకాల వైరుధ్యాలను ఎదుర్కోగలిగేలా ప్రజలను తయారు చేసే మానవీయ సాంస్కృతిక ప్రక్రియ మీద దానికి ఆగ్రహం ఉన్నది. దాన్ని ధ్వంసం చేయకపోతే ఆయుధాలతోనే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించలేం అనే స్పష్టతకు ఎప్పుడో వచ్చింది. ఇటీవలి చరిత్రలోనే తన సర్వ శక్తినంతా వెచ్చించి సల్వాజుడుం, గ్రీన్‌హంట్‌, సమాధాన్‌ అనే మూడు అభియాన్లను నడిపాక కూడా తాత్కాలిక విజయాలనే సాధించాననే అంచనా ప్రభుత్వానికి ఉన్నది. ఈ అన్ని సందర్భాల్లో విప్లవోద్యమ మౌలిక భావజాల, సాంస్కృతిక, సామాజిక పునాదిని కూడా నిర్మూలించే ప్రయత్నం చేసింది. అయితే సైనిక రంగంలో సాధించిన విజయాలను కూడా ఈ సామాజిక సాంస్కృతిక కోణంలో రాజ్యం సాధించలేకపోయింది. అయితే ఒక విజయం సాధించింది. మేకుబంది సిద్ధాంతాలను, సూత్రాలను మార్గదర్శకంగా తీసుకొనే మధ్యతరగతి మేధావులల్లో కొందరినైనా అటూ ఇటూ సమదూరంలోకి లాక్కెళ్లగలిగింది. ఘోరమైన హింసకు పాల్పడుతూ హింసా హింసలను చర్చించే తన భావజాలం దగ్గరికి తీసికెళ్లగలిగింది. చట్టాలను తానే గోతిలో పాతిపెడుతూ చట్టబద్ధపాలన గురించిన నిత్యం చేసే తన వల్లింపుల దగ్గరికి వాళ్లనూ లాక్కెళ్లగలిగింది. ఇన్నిటి మధ్య ‘సర్వశక్తివంతమైన’ భారత రాజ్యం మావోయిస్టు నిర్మూలన గురించి ఇటీవలే ఎన్ని ప్రకటనలు చేసిందో గమనిస్తే రావిశాస్త్రిగారన్నట్లు బేడాపరక ప్రజలు ఎంత బలవంతులో తెలుస్తుంది. ఆ ఉద్యమానికి ఉన్న దార్శనిక బలమే దీనికి కారణం. నూరు శాతం అననుకూలతల మధ్య విప్లవోద్యమం ప్రత్యామ్నాయ రాజకీయార్థిక నమూనాతో పాటు మానవ జీవితంలో ఉండవలసిన ఉన్నత విలువల కోసం కొనసాగిస్తున్న సామాజిక సాంస్కృతిక ఆచరణ రాజ్యాన్ని భయపెడుతున్నది. అందువల్ల ఇక అంతిమ యుద్ధం చేయాల్సిందే అని తెగబడిరది. ప్రజాస్వామ్యం, మానవీయత, సమానత, బాధ్యత, పారదర్శకత, నిర్మాణ క్రమశిక్షణ, ఉన్నత కమ్యూనిస్టు విలువల కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని ధ్వంసం చేయడానికి యుద్ధం చేస్తున్నది.

ఇవేవీ తెలియని వాళ్లకు అటూ ఇటూ ఆయుధాలే కనిపిస్తాయి. అజ్ఞాత ఉద్యమం కాబట్టి పారదర్శకత కనిపించదు. అత్యంత పాశవికమైన వ్యవస్థతో, దాన్ని కాపాడుతున్న రాజ్యంతో తలపడుతున్న విప్లవోద్యమంలో కూడా రాజ్య స్వభావం కనిపిస్తుంది. విప్లవాన్ని శాస్త్రీయంగా, సంక్లిష్టమైన ఆచరణ వైపు నుంచి కాకుండా మూఢ నమ్మకంగా భావించేవాళ్లకు ఈ యుద్ధంలోని ఆటుపోట్ల వల్ల విశ్వాసాలు కొడిగట్టి రాలిపోతాయి. రాజ్యం ఈ ప్రయోజనం కూడా కోరుకుంటుంది.

కానీ దేశంలోనే చాలా అరుదుగా విప్లవోద్యమంలో నవయవ్వన తరం పాల్గొని, నాయకత్వం వహిస్తున్నది. విప్లవం అత్యవసరమైన పీడిత సమూహాలూ, అందులోని మహిళలూ ప్రాణత్యాగాలు చేస్తున్నారు. వాళ్లు ఈ యుద్ధం గురించి, రాజ్యం గురించి, భవిష్యత్‌ గురించి ఏమనుకుంటున్నారనేదే మిగతా అందరి అభిప్రాయాలకన్నా విలువైనది. ఈ అంతిమ యుద్ధంలో ఏ విధ్వంసమైనా జరగవచ్చుకాని ఇది మాత్రం నిలిచే ఉంటుంది.

One thought on “ఆరు రోజుల్లో తొమ్మిది మంది మహిళలు

Leave a Reply