భారత్ భయంకరమైన ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థలు బెర్న్‌స్టెయిన్, యుబిఎస్లు హెచ్చరిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన యుద్ధం భారత్‌పై తీవ్ర ప్రతికూలతలను చూపనున్నాయని వెల్లడించాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే భారత్ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తదనుగుణంగానే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో దురాక్రమణ యుద్ధా లు, ఆర్థిక అస్థిరతలు, ఇంధన సంక్షోభాలు పెరుగుతున్న ఈ కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొం టున్న సవాళ్లు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా దేశ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చేసిన హెచ్చరికలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభ ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. జిడిపి తగ్గుదల, ధరల పెరుగుదల, దిగుమతులపై ఆధారపడటం, ప్రభుత్వ అప్పుల భారాలు, రూపాయి విలువ పతనం.. ఇవన్నీ కలిసివచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక బలహీనతలు బయటపడతాయి. ఈ నేపథ్యంలో భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితిని కేవలం తాత్కాలిక సమస్యగా చూడటం సరైంది కాదు.
కనిష్టానికి రూపాయి ఢీలా :
భారత కరెన్సీ విలువ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా డాలర్‌తో పోలిస్తే 100 స్థాయికి పడిపోయే ముప్పు పొంచి ఉందని బెర్న్‌స్టెయిన్ వెల్లడించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టానికి (రూ.95.50) పడిపోయింది. ‘దేశ విదేశీ మారక నిల్వలు కాగితం మీద బలంగా కనిపిస్తున్నప్పటికీ అందులో తక్షణమే వినియోగించగలిగే నగదు ఆస్తులు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నిల్వల్లో ఎక్కువ భాగం బంగారం రూపంలో ఉండటంతో.. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి డాలర్ల లభ్యత తక్కువగా ఉంది. దీనికి తోడు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నిధులు తగ్గడం మరోవైపు పెరిగిన చమురు బిల్లుల వల్ల కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) జిడిపిలో 2.5 శాతానికి చేరనుంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయనుంది’ అని బెర్న్‌స్టెయిన్ హెచ్చరించింది. చమురు, సహజవాయువు, ఎరువులు వంటి కీలక వనరుల విషయంలో భారత్ దిగుమతులపై ఆధారపడటం పెద్ద బలహీనతగా మారింది.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు సరఫరా గొలుసును దెబ్బతీస్తే, దాని ప్రభావం వెంటనే భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగితే మార్కెట్లో ధరలు పెరుగు తాయి. చివరికి ఈ మొత్తం భారాన్ని మోసేది సామాన్య వినియోగదారుడే.
స్టాక్ మార్కెట్‌కు గత ఆర్థిక సంవత్సరం ‘బ్లాక్ ఇయర్’గానే మిగిలిపోయింది. ఒక్కరోజే తొమ్మిది లక్షల కోట్ల సంపద ఆవిరైంది. విదేశీ పెట్టుబడిదారులు గత ఏడాది కాలంలో రూ.1.80 లక్షల కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్లను ఆగాథంలోకి తోసేసింది. మార్చి నెలలోనే రూ.1.1 లక్షల కోట్లు (12 బిలియన్ డాలర్లు)పైగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐలు)ను పెట్టుబడిదారులు ఉపసంహరిం చుకున్నారు. బ్యాంకింగ్, ఐటీ వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతినడంతో, పెట్టుబడిదారుల సంపద స్టాక్ మార్కెట్లో రూ.15 లక్షల కోట్లకు పైగా మార్చి నెలలో తుడిచిపెట్టుకు పోయింది. అయినా విదేశీ పెట్టుబడులు వచ్చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇక 2013లో డాలర్‌తో రూపాయి విలువ 62గా ఉండేది. రూపాయి విలువ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని అప్పట్లో నిర్మలా సీతారామన్, మోడీ విమర్శించారు. ఇప్పుడు అంతా బాగుందని పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి ప్రకటించడం విడ్డూరం. డాలర్ పడిపోతున్న సమయంలో సైతం రూపాయి విలువ దిగజారడం, ఆసియాలోనే అత్యంత అధ్వాన్న స్థితికి చేరుకోవడం కేంద్రం వైఫల్యాన్ని చాటిచెప్పేదే.
కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ :
భారత ఆర్థిక వ్యవస్థ రోజు రోజు దిగజారుతుండటం ఆందోళనకరం. మన ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ఐదు ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంటుందన్న మోడీ సర్కారు ప్రచారం ఉత్తదేనని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 95కి పడిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఆర్థిక సూచీల వృద్ధి మందగించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తన తాజా నివేదికలో ప్రకటించింది. వాస్తవానికి యుద్ధం ప్రారంభానికి ముందే మన ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థితిలో ఉంది. ఎనిమిది ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి సూచీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో వృద్ధి మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. దేశీయ ముడి చమురు పరిశ్రమ గత 24 నెలల్లో 20 నెలలు కుంచించుకుపోయింది. ఏడాదిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నా… కేంద్రం నిర్లిప్తంగా ఉండటమే ప్రస్తుత ఎల్పిజి, పెట్రో ఉత్పత్తుల సంక్షోభానికి, తద్వారా ఆర్థిక రంగానికి ముప్పుగా పరిణమించిందనేది నిర్వివాదాంశం.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెండంకెల స్థాయిలో క్షీణిస్తున్నాయి. ఎగుమతులు గత కొన్ని నెలలుగా 5 శాతం నుండి 7 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో సరుకుల ఎగుమతు లు 0.8 శాతం పతనమై 36.61 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్‌లు భారత తయారీ రంగానికి, ముఖ్యంగా ఐటీ, ఫార్మా ఎగుమతులకు గొడ్డలి పెట్టుగా మారాయి. ఉత్పత్తికి డిమాండ్ తగ్గిపోయిందని ఈ గణాంకాలన్నీ చెబుతూనే ఉన్నాయి. కేంద్రం చెబుతున్నట్టు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశ జిడిపి కనీసం 8 నుండి 9 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేయాలి. ప్రస్తుత వృద్ధి రేటు 6.5 -7 శాతం వద్దే కొట్టుమిట్టాడుతోంది. అది కూడా అంకెల గారడితోనే. వాస్తవంగా 5 శాతానికి మించదనేది నిపుణుల వాదన. జిడిపి లెక్కల్ని ఐఎంఎఫ్ సైతం తప్పుబట్టడం మన గణాంకాలపై ప్రపంచానికి నమ్మకం లేదనడానికి నిదర్శనం.
ఆర్థిక వృద్ధి రేటులో కోత :
“పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అధిక ధరలు, పెరిగిన ముడి సరుకుల వ్యయాల మధ్య ప్రైవేట్ వినియోగం క్షీణించడం, స్థూల స్థిర మూలధన నిర్మాణం బలహీనం కావడం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం దృష్ట్యా 2026-27లో వాస్తవ జిడిపి వృద్ధి రేటు గతంలో 6.8 స్థాయి నుండి తగ్గి 6 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేస్తున్నాం” అని మూడీస్ నివేదిక తెలిపింది. “ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ ఇబ్బందులు ద్రవ్యోల్బణ అంచనాలను పెరుగుదల దిశగా మళ్లించాయి” అని మూడీస్ పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరం లో 2.4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, 2027లో సగటున 4.8 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణ ముప్పు తలెత్తడం, వృద్ధి బలంగా కొనసాగడంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో పాలసీ రేట్లు స్థిరంగా కొనసాగవచ్చు లేదా క్రమంగా పెరగవచ్చు అని పేర్కొంది. యుద్ధం కారణంగా దీర్ఘకాలిక అంతరాయాలు ముఖ్యంగా ఎల్పిజి రవాణా కారణంగా భవిష్యత్తులో గృహాలకు ఎల్పిజి కొరత, అధిక ఇంధన, రవాణా ఖర్చులకు అలాగే దిగుమతి చేసుకున్న ఎరువులపై భారత్ ఆధారపడటంతో ఆహార ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని పేర్కొంది. పెరిగిన చమురు, గ్యాస్, ఎరువుల ధరలు నిర్దేశిత సబ్సిడీపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తాయని, ఫలితంగా బడ్జెట్‌తో పోలిస్తే రాబడి క్షీణతతో పాటు అధిక వ్యయాలకు దారితీయవచ్చని పేర్కొంది.
యుద్ధ సెగతో తయారీ రంగం కుదేలు :
అమెరికా విదిస్తున్న అధిక టారిఫ్‌లు భారత తయారీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోన్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణతో మార్చి నెలలో తయారీ రంగ పిఎంఐ 53.9కి పడిపోయిందని హెచఎస్బిసి ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) వెల్లడించింది. ఇంతక్రితం నెల ఫిబ్రవరిలో 56.9 పాయింట్లుగా ఉండగా.. మార్చినెల నాటికి అది ఒక్కసారిగా 53.9 పాయింట్లకు తగ్గి నాలుగేండ్ల కనిష్టానికి దిగజారింది. జూన్ 2022 తర్వాత నమోదైన అత్యల్ప ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. సాధారణంగా 50 పైన పిఇఎంఐ ఉంటే మెరుగ్గా… దిగువన ఉంటే ప్రతికూలంగా ఉన్నట్లుగా గుర్తిస్తారు. గత రెండేండ్లలో ఎప్పుడూ లేనంతగా కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి సామర్థ్యం మందగించాయి. ముడిసరుకుల ధరలు మూడున్నరేండ్ల గరిష్టానికి చేరడం తయారీదారుల నడ్డి విరుస్తోంది. ఖర్చులు పెరిగినా పోటీ తట్టుకోవడానికి విక్రయ ధరలను పెంచలేకపోవడం వల్ల కంపెనీల లాభాలు ఆవిరవుతున్నాయి. డిమాండ్ తగ్గడం, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి భారత పారిశ్రామిక వేగాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని హెచఎస్బిసి విశ్లేషించింది.
“తీవ్రమైన మార్కెట్ పోటీ, ముడిసరుకుల ధరల పెరుగుదుల, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల కొత్త ఆర్డర్ల ప్రవాహం నెమ్మదించింది. ముఖ్యంగా అల్యూమినియం, రసాయనాలు, ఇంధనం, జనపనార, తోలు, వస్త్రాలు, ఉక్కు వంటి వస్తువుల ధరలు గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. దీనివల్ల తయారీదారులపై పెట్టుబడి భారం పెరిగినప్పటికీ, వినియోగదారులకు చేరే తుది వస్తువుల ధరలను కంపెనీలు ప్రస్తుతానికి నియంత్రణలోనే ఉంచుతున్నాయి” అని హెచఎస్బిసి చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజల్ భండారీ పేర్కొన్నారు. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి సామర్థ్యం 2022 మధ్య కాలం తర్వాత ఎన్నడూ లేనంత నిదానంగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం కారణంగా అంతర్ౙాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడం, మార్కెట్ పరిస్థితులు సవాలుగా మారడంతో డిమాండ్ భారీగా మందగించింది. ముడి ఖర్చులు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, ఉన్న కస్టమర్లను కాపాడుకోవడానికి, కొత్త వారిని ఆకర్షించడానికి కంపెనీలు తమ విక్రయ ధరలను పెంచలేకపోతున్నాయి. దీనివల్ల తయారీదారుల లాభాల మార్టిన్లు కుంచించుకుపోతున్నాయి. అంతిమంగా పెరుగుతున్న వ్యయాలు, తగ్గుతున్న డిమాండ్‌తో భారత పరిశ్రమలు కుదేలవుతున్నాయి.
కరిగిపోతున్న విదేశీ నిల్వలు :
రూపాయి విలువ పడిపోవడంతో పాటు విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో ఫారెక్స్ రిజర్వుల భారీగా పడిపోతున్నాయి. మార్చి నెల చివరి వారంలో ఫారెక్స్ రిజర్వులు 10.28 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. లక్ష కోట్లు) తరిగిపోయి 688.058 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 11.414 బిలియన్ డాలర్లు పడిపోయిన విషయం తెలిసిందే. మొత్తంగా వరుసగా రెండు వారాల్లో రిజర్వులు 22 బిలియన్ డాలర్లు పడిపోయాయి.ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రికార్డు స్థాయి 728.494 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఫారెక్స్ రిజర్వులు గడిచిన నెల రోజుల్లోనే 30 బిలియన్ డాలర్ల స్థాయిలో పతనం చెందాయి. మార్చి 27 నాటికి విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 6.622 బిలియన్ డాలర్లు తగ్గి 551.072 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు సెంట్రల్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. డాలరేతర కరెన్సీలు అయిన యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు తీవ్ర ఆటుపోటులకు గురికావడం వల్లనే విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోయాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అలాగే పసిడి రిజర్వులు మరింత తగ్గాయి. 3.666 బిలియన్ డాలర్లు తగ్గి 113.521 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు వెల్లడిం చింది. అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మాత్రం 17 మిలియన్ డాలర్లు ఎగబాకి 18.649 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఐఎంఎఫ్ వద్ద నిల్వలు 17 మిలియన్ డాలర్లు తగ్గి 4.816 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రూపాయి కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం :
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.2 శాతానికి ఎగిసి 10 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రమాద ఘంటిక. ప్రభుత్వ లెక్కల్లో మొత్తం నిరుద్యోగిత రేటు 3.1 శాతం వద్ద ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎప్ఎస్) ప్రకారం.. దేశంలో పట్టభద్రుల నిరుద్యోగిత రేటు 11.2 శాతంగా ఉంది. గ్రామీణ పట్టభద్రుల్లో ఇది 11.8 శాతానికి చేరడం మరింత ప్రమాదకరం. ఈ ఆర్థిక వ్యవస్థ విద్యావంతులకు సరిపడా ఉద్యోగాలను సృష్టించలేకపోతోంది. ప్రభుత్వ విధానాలు కొన్ని కార్పొరేట్ సంస్థల లాభాలకూ, కుబేరుల సంపద పెరుగుదలకూ ఉపయోగపడుతున్నాయి. అసమానతలు తీవ్రమవుతున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం, చిన్న పరిశ్రమలు కునారిల్లడం ఇందుకు నిదర్శనం. వాస్తవ సమస్యలను గుర్తించి పరిష్కరించినప్పుడే దేశానికి నిజమైన ఆర్థిక పురోగతి సాధ్యం. లేదంటే ప్రభుత్వ గణాంకాల బెలూను పగిలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు.
ముగింపు :
ఆధునిక ప్రపంచ జీవనశైలిలో చమురు ఉత్పత్తి, వినియోగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. మధ్య ప్రాచ్య దేశాలు సహజ చమురు క్షేత్రాలు కల్గి ఉన్నందున ఉత్పత్తి, సరఫరాలో ప్రధాన భాగస్వామ్యం కల్గి ఉన్నా యి. చమురు ఉత్పత్తి, సరఫరాలో సంక్షోభం తలెత్తితే ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఈ సంక్షోభం కారణంగా అధిక ధరలు, పెరిగిన ముడి సరుకుల వ్యయాల మధ్య ప్రైవేట్ వినియోగం క్షీణించడం, స్థూల స్థిర మూలధన నిర్మాణం బలహీనం కావడం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నది. దీంతో 2026-27లో వాస్తవ జిడిపి వృద్ధి రేటు గతంలో 6.8 స్థాయి నుండి తగ్గి 6 శాతానికి పరిమితమవుతుందని అంచనా . యుద్ధం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా నిలిచి పోవడం వల్ల దేశ జిడిపి 1 శాతం పైగా పడిపోయి, ద్రవ్యోల్బణం 1.5 శాతం పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా నిరుద్యోగం, అధిక ధరలతో దేశం అతలాకుతలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.




