ఈ మధ్య ఆదివాసులను పోలీసులు కాల్చేస్తున్న వార్తలు మీరు పత్రికల్లో చదివే ఉంటారు. టీవీల్లో చూసే ఉంటారు. ఒక్కోసారి ఇరవై మందిని, ముప్పై మందిని ఎన్‌కౌంటర్ పేర చంపేస్తున్నారు. ఈ ఘటనలు మన పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, రaార్ఖండ్, మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయి.
ఇంతకూ ఎవరీ ఆదివాసులు? వాళ్లను ఎందుకు ఇట్లా కాల్చేస్తున్నారు? అనే ప్రశ్న మీకు తలెత్తే ఉంటుంది.
ఆదివాసులంటే అడవుల్లో జీవించే జనాలు. మనమంతా ఆదివాసుల నుంచే వచ్చాం. మన మూలాలు ఆదివాసుల్లో ఉన్నాయి. ఏది తినాలో, ఏది తినకూడదో మొదట ఆదివాసులే తెలుసుకున్నారు. ఏ నొప్పికి ఏ ఆకు వాడాలో, ఏ వేరు వాడాలో వాళ్లే కనుక్కున్నారు. పొలాలు ఎట్లా దున్ని పంటలు సాగుచేయాలో ఆదివాసులే మొదట తెలుసుకున్నారు. వాళ్లు మనలాగే ఈ దేశ పౌరులు.
బస్తర్ అనే ప్రాంతం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఏడు జిల్లాల అటవీ డివిజన్. 39,114 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే బస్తర్ మన దేశంలోని కేరళ రాష్ట్రం కన్నా పెద్దది. సింగపూర్ వంటి దేశాలకన్నా పెద్దది. ఇందులో 75 శాతం అడవే. అక్కడ వేల ఏండ్ల నుంచి అనేక తెగల కొండ జనం జీవిస్తున్నారు. భారత ప్రభుత్వ సైనిక బలగాలు, రకరకాల పోలీసు బలగాలు లక్షల మంది సాయుధంగా ఈ అడవిలోకి వెళ్లి అక్కడున్న ఆదివాసులను చంపేస్తున్నాయి.
ఒక లెక్క ప్రకారం మన దేశంలో ఒక లక్ష మంది పౌరులకు 153 మంది పోలీసులు ఉంటారు. కానీ 2023 లెక్కల ప్రకారం బస్తర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సగటున ఒక లక్ష మంది ఆదివాసులకు 12 వేల మంది పోలీసులు, పారా మిలటరీ, మిలటరీ సైనికులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా సైనికులు మోహరించిన ప్రాంతం బస్తర్ అని పరిశీలకులు చెబుతారు.
ఈ సంఖ్య వింటేనే భయం కలుగుతోంది కదూ. మధ్య భారతదేశం అనే ఆరేడు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసుల పోరాటాలను అడ్డుకోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 14 లక్షల సాయుధ బలగాలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఒక్క చత్తీస్‌ఘడ్‌లోనే 400 సైనిక క్యాంపులు ఏర్పాటు చేశారు. సైనికులకు శిక్షణ ఇవ్వడానికి అక్కడే లక్షన్నర ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. దీని కోసం సుమారు వంద ఆదివాసీ గ్రామాలను తుడిచిపెడుతున్నారు. మనం చెల్లించే పన్నులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయుధ బలగాలకు జీతాలు ఇచ్చి అడవుల్లోకి పంపించాయి. అట్లా వెళ్లిన పోలీసులు, సైనికులు 2024 జనవరి నుంచి ఇప్పటికి 400 మందికి పైగా చంపేశారు. మన ప్రభుత్వమే మన ప్రజల మీద యుద్ధం చేస్తోంది.
ఎందుకు ఇట్లా జరుగుతోంది? బస్తర్‌లో, మిగతా మధ్య భారతదేశంలోని అడవుల్లో కోటానుకోట్ల రూపాయల విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఆదివాసుల గూడేల కింద, వాళ్లు సాగు చేసుకుంటున్న పొలాల్లో, కొండల్లో లెక్కలేనంత సంపద ఉన్నది. దాన్ని తొవ్వుకోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదాని, అంబాని, వేదాంత వంటి కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దేశంలోని భూమి, నదులు, సముద్ర తీరాలు అన్నిటినీ వాళ్లు ఆక్రమించుకుంటున్నారు. అడవుల్లోని ఆదివాసుల కాళ్ల కింద ఉన్న సహజ వనరుల మీద కూడా ఈ కార్పొరేట్ల కన్నుపడిరది. వాళ్లు అక్కడికి వెళ్లి గనులు తవ్వుకోడాన్ని ఆదివాసులు ఆడ్డుకుంటున్నారు. అందుకే వాళ్లను ప్రభుత్వం నిర్మూలించాలనుకుంటోంది.
అక్కడున్న ఖనిజాలు, చెట్లు, వాగులు వంకలు ఆదివాసులవే కాదు. మన దేశ ప్రజలందరివీ. అడవిలో ఉన్నప్పటికీ మనందరికంటే అతి తక్కువ ప్రకృతి సంపదను ఆదివాసులు వాడుకుంటారు. అడవులు లేకపోతే పర్యావరణం నాశనమైపోతుంది. మన జీవితం దుర్భరం అవుతుంది. అందుకని వాళ్లు గనుల తొవ్వకాన్ని అడ్డుకుంటున్నారు. మనందరికీ చెందాల్సిన సంపదలకు కాపలాదారులుగా ఉన్నారు. కానీ ప్రభుత్వం అడవి మీద ఆదివాసుల హక్కును తీసేసి అదానికి, అంబానికి ఇవ్వాలనుకుంది. అందుకే ప్రభుత్వం శతృదేశం మీద ఉపయోగించే రాకెట్ లాంచర్లతో, డ్రోన్లతో వాళ్ల మీద యుద్ధం చేస్తోంది.
ఆదివాసులను చంపేస్తే మనకొచ్చిన నష్టం ఏమిటి? అనుకోడానికి లేదు. ఈ భూమిలో ఉన్న సంపదలు, అడవులు అన్నీ గుప్పెడు మంది కాజేశాక మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. మనుషులు, లక్షలాది జీవరాసులు ఉన్న ఈ పర్యావరణం ధ్వంసమైపోతే మన భవిష్యత్ తరాల ఉనికి ఏమవుతుందో ఆలోచించండి. ఇప్పటికే నీళ్లు కొని తాగుతున్నాం. నగరాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు. పర్యావరణం పూర్తిగా నాశనమైతే మనుషుల ఉనికే సంక్షోభంలో పడిపోతుంది.
ఇప్పుడు చెప్పండి..
ఆదివాసులను ప్రభుత్వం మూకుమ్మడిగా చంపేస్తోంటే చూస్తూ ఊరుకుందామా?
మనలాంటి పౌరులైన ఆదివాసులను, అడవులను, సహజ వనరులను కాపాడుకుందామా? లేదా?