జీవించి ఉండగానే మరణానంతర వైభవానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొనే వాళ్లున్న చోట మరణించి జీవించడం మొదలు పెట్టేవాళ్లు దిగ్భ్రాంతికరంగా తయారవుతారు. అలాంటి వాళ్లను  అంగీకరించడానికి మనసు సిద్ధం కాదు. అసలు వాళ్లున్నట్లు కూడా తెలియదనే రక్షణ వలయంలో సేదతీరుతాం. ఒకవేళ తెలిసి ఉంటే వాళ్లను మినహాయింపు అనుకుంటాం. తీసి పక్కన పెట్టేస్తాం. మన నిరాశలకు, నిట్టూర్పులకు, చరిత్రపట్ల పిల్ల చేష్టలకు తగిన దారికి ఇలాంటి వాళ్లు అడ్డం లేకుండా చూసుకుంటాం. సుఖమయ వాదనల విశాల రంగస్థలానికి  ఈ ఏర్పాట్లు అవసరం మరి.

వాదననలను ప్రతిసారీ సత్యాన్వేషణ కోసమే చేస్తామనే గ్యారెంటీ ఏమీ లేదు. ఆసత్యానికి ఆవలి అంచున  మొదలై అటే చెలరేగిపోతాయి. ఆ మాటలు చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. ఉత్సాహాన్ని ఇస్తాయి. మేధావంతంగా ఉంటాయి. ఉదాహరణకు చూడండి. ‘విప్లవంలో దళితులు లేరు..వర్గమనేది పక్కకుపోయి సామాజిక సమస్యలు రంగం మీదికి వచ్చాక విప్లవోద్యమం ఇర్రెలవెంట్‌ అయిపోయింది..ఆర్గానిక్‌ లీడర్‌షిప్‌ను తయారు చేసుకోవడంలో విప్లవోద్యమం విఫలమయ్యాక ఇక దానికి భవిష్యత్తు ఏముంటుంది?’ ఇట్లా ఎన్నో ప్రస్తావించుకోవచ్చు. ఆ మధ్య విరసం సభల్లో మాట్లాడుతూ ఒక ప్రముఖ రచయిత ‘రాజ్యాంగవాదాన్ని వ్యతిరేకిస్తే..విప్లవశిబిరంలో ఉన్న దళితులు కూడా ఖాళీ చేసి వెళ్లిపోతారు’ అన్నారు. అట్లా జరగాలనే కోరిక ఆయనకు లేకపోవచ్చు. అట్లా ఖారీ చేస్తారేమో అవి విప్లవోద్యమాన్ని అప్రమత్తం చేయడం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి అటూ ఇటూ కొన్ని డజన్ల వ్యాఖ్యలను క్రోడీకరించవచ్చు. ఇవన్నీ అతి జాగ్రత్తగా రాజ్యాన్ని, యుద్ధాన్ని పక్కన పెట్టే పరిశీలనలు. వీటిని ఎట్లా విలువ కడతాం? నిజానిజాలు ఎట్లా నిగ్గుదేలుస్తాం? సత్యమేమిటో తెలుసుకోబోతే పోటీగా వచ్చే అసత్యాలనెట్టా ఓడిస్తాం? బహుశా ఇవాళ అతి పెద్ద స్థాయిలో సామాజిక సాంస్కృతిక పరిశోధనలు జరగవలసి ఉన్నది. తర్కబద్ధత మీద, సమాచారం మీద ఆధారపడి వాస్తవాలను గ్రహించడానికి  సిద్ధం కావాల్సి ఉన్నది. 

ప్రస్తుతానికి దీన్నంతా పక్కన పెడదాం. మానవ అనుభవం దగ్గరికి నేరుగా వెళదాం. విప్లవోద్యమం గడిస్తున్న అనుభవ క్రమాలను చూద్దాం. దాని జయాపజయాలను రాజకీయంగా, సిద్ధాంతపరంగా అంచనాలు వేయడం సరే. విప్లవమంటే లక్షలాది కోట్లాది మంది ప్రజల ఉమ్మడి ఆచరణ. ప్రతి ఒక్కరు విడిగానో, బృందాలుగానో, మొత్తంగానో గడిరచే అనుభవం అత్యున్నతమైనది. అది మానవ జీవితం ఎట్లా ఉన్నదో, దాన్ని మార్చే విప్లవోద్యమం ఎట్లా కొనసాగుతున్నదో చెప్పగల సారవంతమైన గని. ఇంత పెద్ద విషయంలోకి వెళ్లడం  కష్టమనిపిస్తే మాచెర్ల ఏసేబు దగ్గరికి వెళ్లండి. మొదట ఆ పేరే అద్భుతమైన సామాజిక సాంస్కృతిక విశ్లేషణకు ప్రారంభ వాక్యంగా మారిపోయింది.  విప్లవోద్యమం ఆరంభంలో నాయకుల పేర్లు ఎట్లా ఉండేవి. ఆ తొలి రోజుల  చరిత్రను ఏసేబు ముందు తరాల వాళ్లే మార్చేశారు. ఆ దారిని చదును చేశారు. చారిత్రకంగా ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించగలవాళ్లే విప్లవోద్యమాన్ని నిర్వహిస్తున్నారు.  ఏసేబు మావోయిస్టుపార్టీ కేంద్ర నాయకుడని ప్రభుత్వం చెబుతోంది. ఆ పార్టీ సైనిక విభాగ ప్రతినిధి అని కూడా చెబుతోంది. కాదు కాదు..వాళ్ల ప్రత్యామ్నాయ ప్రభుత్వంలోని వ్యవసాయశాఖ బాధ్యుడని కూడా అంటోంది. ఇవన్నీ నిజాలే కావచ్చు. కేంద్ర కమిటీ సభ్యుడే కాకపోయినా అంతటి రాజకీయ నిర్మాణ సిద్ధాంత పరిణతి పొందిన ప్రముఖుడై ఉండవచ్చు. సైన్యమో, వ్యవసాయమో.. ఏదైనా సరే.  ఉత్పత్తిదాయకమైన, జ్ఞానదాయకమైన వర్గపోరాటంలో ఆయన తలమునకలుగా ఉన్నాడని చెప్పవచ్చు.

విచిత్రమేమంటే ఆయన ఇంటి దగ్గర ఆయిదో తరగతి వరకే చదువుకున్నాడట. ఆ నిరుపేద దళిత కుటుంబానికి ఈ బ్రాహ్మణీయ భూస్వామ్య వ్యవస్థ అంత వరకే  ‘చదువు’ను ఇచ్చింది. వయసొచ్చే దాకా బతుకుతెరువు కోసం ఏం చేశాడోగాని విప్లవంలోకి వెళ్లాక అసలైన జ్ఞాన సముపార్జనా క్రమాల్లో భాగమయ్యాడు. అత్యున్నతమైన మానవీయ ప్రక్రియలను ముందుండి నడిపించాడు.  క్రైస్తవ మత బోధకుడిగా  ఉంటూ బైబుల్‌ను, భగవంతుడ్ని వదిలి మానవులకు చేరువ అయ్యాడు.  ఒక మనిషిలో జరిగిన ఈ మార్పును ఎట్లా  చూస్తాం? ఈ అనుభవాన్ని ఎట్లా మదింపువేస్తాం.

నిజానికి ఇది ఏసేబు స్వీయానుభవమేనా? ఆదాటున ఆయన అట్లా తయారయ్యాడని అనుకుందామా? జీవితంలో జరిగే అనేకానేక ఘటనల్లో ఇదీ ఒకటి అని పక్కన పెడదామా? మన వాదనలకు లొంగని వాస్తవం కాబట్టి తెలియనట్లు నటిద్దామా? ఏసేబు ఒక్కడే అయితే సరే. కానీ ఈ యుద్ధంలో నేలకొరుగుతున్న ప్రజా వీరులందరూ ఇలాంటి అద్భుత ఉదాహరణలే. దశాబ్దాల కిందటే కాదు. నిన్న మొన్న ఇలాంటి మానవీయ వ్యక్తిత్వాలను సంతరించుకున్నవాళ్లు ఎందరో. విప్లవంలో పాల్గొంటున్న వేలాది, లక్షలాది మందికి ప్రతినిధులుగా మరణానంతరం వీళ్లు మన ముందుకు వచ్చి నిలబడుతున్నారు. ఈ సామూహిక సాంస్కృతిక పరిణామాన్ని ఏసేబులాంటి ఒకానొక వ్యక్తి దగ్గరికి వెళ్లి సూక్ష్మ రూపంలో అధ్యయనం చేస్తేగాని విప్లవం అర్థం కాదు. మనుషుల ప్రత్యేకతల్ని, సమూహాల అస్తిత్వాల్ని  కదిలించి అత్యున్నత సమిష్టిగా ఎట్లా తీర్చిదిద్దుతున్నదో పరిశీలిస్తేగాని విప్లవం ప్రాసంగితక తెలియదు.. దాని అంతర్గత శక్తి అంచనాకు రాదు. ఈనెల మూడో తేదీ దంతెవాడ, బీజాపూర్‌ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన తొమ్మిది మంది మావోయిస్టుల్లో ఒకరైన ఏసేబు ఒక్కడి గురించే కాదు. అందరి గురించీ ఇట్లాగే తెలుసుకోవచ్చు.  మరణించినవారి గురించే కాదు. మనకు విప్లవంపట్లా, జీవితంపట్లా చూపు ఉండాలేగాని, బాధ్యత ఉండాలేగాని విప్లవోద్యమాన్ని అత్యవసరంగా భావించి నిర్వహిస్తున్న వేలు, లక్షల ప్రజలందరూ ఏసేబువంటి వాళ్లే. అందరిలో ఆయన ఒకరు కాదు. వాళ్లందరిలోని సామూహిక మూర్తిమత్వాన్ని విప్లవోద్యమమే అట్లా తీర్చి దిద్దింది. దాన్ని తెలుసుకోడానికి ఏసేబు ఒక ఉదాహరణ మాత్రమే.

Leave a Reply