ఉద్యమకారులు గొప్పగా మాట్లాడతారు, కారణం సామాన్య ప్రజాజీవితాలతో మమేకమై తమ జీవనసరళిని కొనసాగిస్తుంటారు. పేదలకోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వొక యుద్దమే చేస్తుంటారు. ఉద్యమకారులకు గొప్పజీవితాలేమీ ఉండవు. ఎక్కడైనా ఉంటారు. ఏదైనా తింటారు. ఉన్నా లేకున్నా ప్రజలకోసమే పరితపిస్తారు. ఈ క్రమంలో ప్రజాపోరాటాలు చేసే ఓ కమూనిస్టుపార్టీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడం వొక కోణమైతే, మరో కోణంలో మనసుచేసిన సంఘర్షణను, మనసుకు కల్గిన బాధను మదిలో పురుడుబోసుకున్న చైతన్యాక్షరాలను కవిత్వంగా రాయడం అరుదుగా కనబడుతుంది. ఈ కవి చేస్తున్నదీ అదే. ప్రసిద్ద రష్యన్‌ కవి మాయాకోవ్‌స్కీ చెప్పిన మాటొకటి జ్ఞప్తికి వస్తుంది ‘How is poetry to be extracted from popular speech’అన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. ప్రజాదరణ పొందిన ప్రసంగం లోంచి కవిత్వాన్ని ఎలా వెలికి తీయాలి అని ఆయన చెప్తాడు. కానీ ప్రజాదరణ పొందే ప్రసంగం, ప్రజాదరణ పొందిన కవిత్వం మాత్రం ఈయన, ఈ         ఉద్యమకారుడు గొప్పగా రాస్తారు. అందుకే ఈ కాలపు కవిత్వ ఉద్యమస్ఫూర్తి అని, వర్తమాన సాహిత్యసమాజం సృష్టించిన       ఉద్యమకవి అని రెడ్డి శంకరరావును అనాలనిపించింది. ప్రత్యేకంగా ప్రజాసమస్యలపై ఉద్యమాలు నిర్మించి, పాలకుల మెడలు వంచేలా మాట్లాడే ఓ నాయకుడు కవిత్వాన్ని కూడా ఉద్యమానికి ఆయుధంగా తీసుకుని రాస్తున్నాడు. అది ఈ మధ్య నాకందిన కవిత్వం ఆయన రాసిన కాలం ఒడిలో కవిత్వం..బాగా ఆకట్టుకుంది..చదవాలనిపించింది.

కవికి పరిధి ఉండదు. ప్రపంచం నలుమూలలా కవిత్వపు డేగకన్నుతో వీక్షిస్తాడు. ప్రత్యక్షంగా చూసినదైనా కావచ్చు..పరోక్షంగా విన్నదైనా కావచ్చు, కవి గుండెల్లో నాటుకుపోతే అక్షర జలపాతమై సమాజం మీద వర్షిస్తుంది. ‘‘దోపిడోళ్ళ కబంధ హస్తాల్లో ఉన్న/ శ్రమ సౌందర్యం మిముక్తి కానన్నాళ్ళు/ అర్ధాయస్సులు/ చితిమంటల ఆర్తనాదాలు తప్పవు’’ ఈదేశంలో ..ఈ దుర్నీతి రాజ్యంలో మతోన్మాదపాలకులు పాలిస్తున్న ఈ సువిశాల భారతం దోపిడీ, అరాచకాలు, హత్యలు, అత్యాచారాలతో వెలిగిపోతుంది. ఇది దురదృష్టకరపరిణామం. కవి ప్రతీ విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తాడు. తాను దు:ఖితుడై కవిత్వాన్ని కన్నీటిసిరాతో అక్షరాలను లిఖిస్తాడు. వస్తువేదైనా గాఢతగారాయడం ఆయన కవిత్వశైలి. బిజెపీ ప్రభుత్వం సిఏఏ`ఎన్‌ఆర్‌సీ తీసుకురావాలని ప్రయత్నించిన సందర్భంలో ఆయనిలా రాస్తారు..‘‘నా ఆనవాళ్లు/సింధూనాగరికత సిగలో విరభూసిన/మంచు బిందువుల్లో దాగి ఉన్నాయో /ఏ సముద్రపు పచ్చికబయళ్ల కిందో/ దాగిఉన్న ముత్యపు గృహలో/శిలాక్షరాలుగా ఏ మూలనో కనబడతాయో..ఈ పాలకులకు ఇంతకంటే ఆనవాలు ఇంకేం కావాలి. వీళ్ళకు తెలిసిందల్లా దేశాన్ని మతంపేరుతో విభజించడం. దేశాన్ని కార్పోరేట్లకు అవుర్‌ఏక్‌మాల్‌ సరుకులా అమ్మడం అదానీ అంబానీలకు ఈ దేశసంపదను ధారాదత్తం చేయడం మాత్రం బాగాతెలుసు. ఈ కవి లోతైన దృష్టికోణంకలిగి సైద్దాంతిక నిబద్దత కల్గినకవి. అతడి కవిత్వం చదువుతుంటే కొన్నిసార్లు మైమరచిపోతాము. శిల్పాన్ని ఇంత బాగా ఎలా వొడిసిపట్టుకున్నాడనిపిస్తుంది. కవిత్వం చదువుతుంటే దృశ్యం కళ్ళముందు విన్యాసం చేస్తుంది. అతనంటాడు..‘ఒకానొక రోజున../ఎడారి../మా ఊరొచ్చింది./విహరించి వెళ్ళిపోతూ/నదిని తీసుకుపోయింది/ ఇప్పుడు మా ఊరే ఎడారైంది.’ ఎంత గొప్పదృశ్యం. ఎంత గొప్ప హృదయవిదారక సన్నివేశం. పచ్చటిపైరుపై తీతువుపిట్ట అరచినభావచిత్రం మస్తిష్కంలో మెదిలింది. తీతువుపిట్ట అరవడమంటే అది ప్రకృతిధర్మమే అయినా గ్రామీణప్రాంతప్రజలు ఉలిక్కిపడతారు.

కవికి సామాజిక చైతన్యము, కవిత్వమూ ఉండాలంటారు. రెడ్డిశంకరరావుకు సామాజికచైతన్యం వొకనేత్రమైతే, మరోనేత్రం కవిత్వం. ఇది అక్షరసత్యం. ఉద్యమం ఆయన జీవితంలో సామాజిక చైతన్యాన్నిస్తే..కవిత్వం ఆయనకు ఈ సమాజాన్ని మార్చేందుకు అక్షరాయుధాలనిచ్చింది. ఇప్పుడు వాటితోనే నిరంతరం పోరాడుతున్నారు. వందేళ్ళ కమూనిస్టు ఉద్యమ చరిత్రను వొక్కమాటలో ‘చెమటను ప్రేమించే, శ్రమను గౌరవించే ఓ పతాకం’ అంటాడు. ఇంతకంటే ఏంకావాలి కవికి. 

లౌకికవాదులను, ప్రజాస్వామ్యవాదులను, మానవహక్కులకోసం పోరాడే కార్యకర్తలు చేస్తున్న ఉద్యమాలను అణచివేసేందుకు రాజ్యం అనేక చట్టాలతో వాళ్ళను నిర్భంధిస్తుంది. ఇది నిరంతరం మనం చూస్తున్నాం. కానీ ఈ కవి  ఉపా చట్టంలో అరెస్ట్‌ ఆయిన వారికి నిరసనగా ‘పొద్దున్నే జైలుల్లో../మొలకెత్తిన ఆలోచనలు/సంధ్యవేళకి విప్వల నినాదమై/ఊరేగుతాయి..!’ అని చాలా గొప్ప కవిత్వఎత్తుగడలతో ప్రారంభించి ‘ఇప్పుడు నాదేశం..వురికొయ్యలు.. ఉపాచట్టాల/ఇనుప కవచాల మధ్య../రక్తశిక్తమైన శిలలా వుంది’ అంటారు. అన్‌లా ఫుల్‌ యా క్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ (ఉపాచట్టం) సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరించడంతోపాటు, ప్రజల జీవించే హక్కును కాలరాస్తుందని చాలా కాలంగా దీన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలు, విప్లవ పార్టీల సానుభూతి పరులు, అమాయక ఆదివాసీలు, మేధావులు, జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలను దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేలమందని  మందిని ఈ చట్టం కిందనిర్భంధించి, విచారణ లేకుండా  వేధిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి మహిళా, హక్కుల సంఘాల నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులపై సుమారు వంద మందిపై మూడు, నాలుగు కేసులు నమోదు చేశారు. గతంలో ప్రజా ఉద్యమాలను, ప్రజాస్వామిక వాదులను అణచి వేయడానికి టాడా, పోటా లాంటి చట్టాలు తెచ్చారు. దేశ ప్రజలందరూ పోరాడి వాటిని రద్దు చేసుకున్నా ఈ ఉపాచట్టం మాత్రం రద్దుచేసే పోరాటాలు ఉదృతంగా చేయలేకపోతున్నారు. అందుకే ఈ నేపథ్యంలోనే 10.11.2020న వరవరరావును అక్రమంగా నిర్భందించడాన్ని నిరసిస్తూ..జ్వాలాచలనం అనే కవితలో..‘నిరంకుశంగా నీవణచి వేస్తే /నిబ్బరంగా మేమెగిసిపడతాం/ ఉక్కుపాదం నీవెక్కి పెడితే/కొధమ సింగాలై కదలివస్తాం/నియంతృత్వం నీ ఆయుధమైతే/నిప్పు రవ్వలై ఎగిసిపడతాం/లాఠీ… తూటా… నీ వెక్కిపెడితే/ఉగ్రనేత్రులై ఉద్యమిస్తాము/అణచివేత నీ విధానం/న్యాయం మా నినాదం/తొక్కేయడం మీ అవసరం/ తిరుగుబాటు మాకనివార్యం/జూలు విదిల్చిన సింహాలం మేము/రాజ్యం మీ భోజ్యం అయితే/ జ్వాలా చలనమై జ్వలిస్తాం/ వెలుతురు బంధించాలనుకుంటే/లావాలా ఎగసిపడతం/ఇప్పుడే కాదు… ఎప్పటికీ/విజయం వీరులుదే/మేము వీరులం/మేమే విజేతలము’ అంటాడు. అలాగే స్టాన్‌ సామి అనే కవితను 07.07.2021న హక్కుల నేత స్టాన్‌స్వామి రాజ్యహత్యకు నిరసనగా  రాశాడు..ఆ కవిత…‘చీకటి జీవితాల్లో వెలుగులు కోసం/ప్రవాహమే ఎదురొచ్చినా/ప్రభుత్వమే కదిలొచ్చినా/చలించని ధైర్యశాలి/ మళ్ళిన వయస్సు/వేసిన బేడీలు/రాజ్యపు రాక్షసత్వపు సంకెళ్ళు /మండే అగ్నిశిఖ ముందు/దిగ దుడుపే../హిమ పర్వత శ్రేణి/ ఎగిసిపడ్డ లావా/ వుప్పొంగే సంద్రం/ గర్జించే మేఘం /బంధించడం ఎవరి తరం/స్టాన్‌ స్వామి.. ఎప్పటికీ/ తిరుగు బాటు కిరణమై/నింగిలో ప్రకాశిస్తాడు/ పోరు హెరీరై నేలపై ఘోషిస్తాడు/అతడో ఆరని అగ్నికణం/హక్కుల మహెదయం…?’ అంటారు.

రాజ్యం ప్రశ్నించే గొంతుకల్ని ఎలా అక్రమంగా నిర్భంధించి వేధిస్తుందో అందరికీ తెలిసిందే. స్వయంప్రతిపత్తి సంస్థల్ని కూడా తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు ఎలా పాడ్పడుతుందో మనం గత దశాబ్దకాలం పైగా  చూస్తున్నాం. ఒకరకంగా ఈ కాలమంతా మనం చీకట్లో ఉన్నట్టే..అందుకే కవి చాలా గాఢతగా ఈ కవిత్వంలో రాజ్యం మీద విరచుకుపడ్డాడు. ఈ కవి ఈ కాలం ఒడిలో కవిత్వంలో రైతు గూర్చి అలాగే ఢిల్లీ రైతు ఉద్యమానికి సంఫీుభావంగా గొప్ప కవిత్వం రాశాడు. అవి కూడా పరిశీలిద్దాం..ఆయన రాసిన వివిధ కవితల్లో కవితా వాక్యాలిలా ఉన్నాయి..

‘తన చెమటను మెతుకులు చేసి నలుగురు నోళ్ళలో నాలుగు మెతుకులు పెట్టేవాడు రైతుకాక ఏమౌతాడు’

‘తానో అన్నం ముద్దై ప్రపంచాన్ని బతికించినోళ్ళు’

‘మనిషి మెతుకు పెట్టేందుకు తానో సైనికుడై సేద్యంచేస్తాడు’

‘మణులు మాణిక్యాలు మా మడుల నిండా పండుతున్నా మట్టివాసన తప్ప కడుపునిండా తిండిలేనోళ్ళము’

‘రైతే రణరంగానికి సిద్దమైతే ప్రతి మెతుకు ఓ జవానవుతుంది’

మనువాదులను సమాధిచేద్దాం, వరిదుబ్బును జెండాచేసి ఎఱ్ఱకోటపై ఎగరేద్దాం రైతే రాజని తెగేసి చెబుదాం’

‘రెక్కలు విరిగిన రైతును రాజును చేయాలంటే పాడికాపుల పాలనకు పాడికట్టాల్సిందే’

‘ఊరు వలసవెళ్ళింది వలసపక్షై తిరుగుతున్న రైతును వెతుక్కుంటూ..’

‘మనిషికింత మెతుకుపెట్టే మట్టిమనిషి తలపగిలింది.రాబందుల పాలనలో నెత్తుటి మరకలేకుండా పోరు సాగుతుందా..’

ఇలా ప్రతి కవితలో బలమైన అభివ్యక్తితో కూడిన కవితావాక్యాలు కనబడతాయి. వీటిని నినాదకవిత్వమని అందామా..? లేదా చైతన్యాక్షరాల సముదాయమందామా? ఏదన్నా అందాం..కానీ ఈ కవిత్వం సమాజానికి అవసరమైనది..అనివార్యమైనది..చదువదగ్గది… ఢిల్లీ రైతు ఉద్యమానికి సంఫీుభావంగా ఆయన రాసిన కవిత ఒకటి చూస్తే..

అంకుశం శీర్షికతో సాగిన ఈ కవిత.. కలుపు మొక్కలు పీకినోళ్ళం/తప్పుడు చట్టాల్‌ పీకలేమా /పాతాళ గంగను పైకి తెచ్చినోళ్ళము/ వాటర్‌ ఫైర్ను తట్టుకోలేమా/

పిడుగుల ప్రళయం… వడగళ్ల వాన/ ప్రకృతి పరీక్షలే తట్టుకున్నోల్లం/పోలీస్‌ పరీక్ష మాకో లెక్కా/మీరు నీటితో కొడితే/మేము చండ్రనిప్పులు గ్రక్కుతాము…/మీరు లాఠీలకు పనిపెడితే/మేం… తలపాగా చుట్టి సిలకట్టులు బిగిస్తాం../బెడ్డ దుక్కి దున్నీ… దున్ని /గట్టిపడ్డ పాదాలు మావి… /గడ్డి పరకలు పేమి పేమీ/పిడశ గట్టిన చేతులు మావి మోచేతులుతో…./మోకులు చేసి నోళ్ళం మీరు పెట్టే వాతలు…./మాకో… లెక్కా../హక్కుల కోసం నిలబడటం అంటే/అమ్మకోసం నిలబడటమే…/పోరాటం మాకు క్రొత్త కాదు. /మా బ్రతుకే నిత్య పోరాటం/మీరెన్ని చట్టాలు చేసినా/భూమ్మీద రైతు బ్రతికున్నంత వరకు /మా మడిలో మట్టిబెడ్డ కూడా…/తియ్య లేరు…నేలతో మా బంధం తల్లీ బిడ్డ బంధం/అయ్యా… చివరికి ప్రాణం లేని..మీ శరీరం కూడా మా మట్టిలో కలవలసిందే..(ఢిల్లీ లో రైతులపై పోలీస్‌ నిర్బంధాన్ని నిరసిస్తూ…)

ఈ కవిత్వం నిండా దేశం నిండా పరచుకున్న సమస్యలు మనకు కవితలుగా కనబడతాయి. అవి కూడా గొప్ప శిల్పంతో వైవిధ్యంగా కవిత్వీకరించి రాశాడు. ప్రత్యక్ష ఉద్యమకారుడు తన మదిలో ఉప్పొంగిన లావాను కవితలుగా పరిచారు.   పాలకులు చేస్తున్న దుర్మార్గాలన్నీ కవితలయ్యాయి. అవి జార్జిప్లాయిడ్‌ను చంపిన తెల్లపోలీస్‌ దుర్మార్గానిన్న నిరసిస్తూ, ప్రపంచ విప్లవకారుడు ‘చే’ను స్మృతిలోకి తెచ్చుకుంటూ..విశాఖ ఉక్కుప్రయివేటీకరణను నిరసిస్తూ..రైల్వే ప్రయివేటీకరణను నిరసిస్తూ..రాజ్యాంగనిర్మాత అంబేడ్కర్‌ ను తలచుకుంటూ, గిడుగు భాషాఔన్నత్యాన్ని విశదీకరిస్తూ..దేశవ్యాప్త కార్మిక సమ్మెకు సంఫీుభావంగా ..మీడియా మిత్రులపై ప్రభుత్వ నిషేదాన్ని నిరసిస్తూ వారి ఉద్యమానికి సంఫీుభావంగా…యుద్దం వద్దని శాంతి కుసుమాలు విరబూయాలని, అలాగే అమరులైన సాహితీమిత్రులను స్మరిస్తూ కవితలున్నాయి. అంతేకాక ఈకాలంఒడిలో కవిత్వంలో.. గొప్ప స్మృతి కవిత్వం ఇందులో కనబడుతుంది.

ఈ కవి ప్రతిపోరాటానికి బాసటగా నిలిచే కవిత్వం రాశాడు..రాస్తున్నాడు. ఒక వస్తువును, ఒక ఘటనను, భిన్నకోణాల్లో వ్యక్తీకరిస్తూ   రెండు మూడు కవితలుగా రాసే అరుదైన ప్రయత్నం ఈ కవిత్వంలో చేశాడు. వర్తమాన సమాజపోకడల్ని, కారోరేటీకరణ వ్యవస్థను బలంగా వ్యతిరేకించడం, కలమనే ఆయుధంతో ఖండిరచడం చేశాడు. సున్నితమైన మానవసంబంధాలు, విలువలు,  నైతికత పున:స్థాపన, కార్మిక కర్షక రాజ్య ప్రతిష్టాపన వంటి బలమైన దేశాన్ని , అసమానతలు లేని ప్రపంచాన్ని ఈ కవి కలలు కంటున్నాడు. అందుకోసం నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో గొప్ప ఆశయంతో పోరాడుతున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే Another world is possible అనే ఆశావాదదృక్ఫథంతో మరోప్రపంచపు నిర్మాణపు కలలు కంటున్నాడు. ఈ కవి తన కవిత్వం మరింత బలంగా రాయాలి. పాలకుల గుండెల్లో వణుగు పుట్టించాలి. ఒక సందర్భంలో కమ్యూనిస్టు నాయకుడు సాహితీవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యవస్థమార్పుకోసం సమసమాజ నిర్మాణంకోసం కలమే కాదు..అవసరమైతే కవులు ఆయుధం కూడా పట్టి పోరాడాలన్నాడు. ఈ కవి కలలు నిజమవ్వాలని మనమూ కాంక్షిద్దాం..

One thought on “కాలంఒడిలో కవిత్వ ఉద్యమం

  1. కాలం ఒడిలో పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? Online stores lo ledhu

Leave a Reply