(కర్రె గుట్టల దిగ్బంధం మీద క్షేత్రస్థాయి నివేదిక )
ఏప్రిల్ 21 నుండి, హెలికాప్టర్లు గిరగిరా తిరుగుతున్న శబ్దం; భారీ ఫిరంగి కాల్పులు; పెద్ద పేలుళ్ల శబ్దాలు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేశాయి; ఇక్కడ భారత భద్రతా బలలు ప్రారంభించిన అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక సైనిక చర్య జరుగుతోంది.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) శాంతి చర్చలలో పాల్గొనడానికి తన సంసిద్ధతను పదేపదే వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ భద్రతాబలగాలు ఈ సైనిక చర్యను చేపతాయి.
మార్చి 28 నుండి, మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ కోసం నాలుగు ప్రకటనలను విడుదల చేసింది. ఏప్రిల్ 25 నాడు విడుదల చేసిన తాజా ప్రకటనలో సిపిఐ (మావోయిస్టు) అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేంద్ర కమిటీ శాంతి చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించింది.
శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం హింస, అణచివేత ద్వారా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది” అని ప్రకటనలో పేర్కొన్నారు. కొనసాగుతున్న భద్రతా బలగాల సైనిక చర్యను గమనించి “ఈ చర్యను వెంటనే నిలిపివేయాలి. బలగాలను ఉపసంహరించుకోవాలి. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము” అని జోడించారు
అయితే, ప్రభుత్వం మరింత కాల్పులతో ప్రతిస్పందించడాన్ని ఎంచుకుంది. మావోయిస్టు అగ్ర నాయకత్వం దాక్కున్నట్లు అధికారులు భావిస్తున్న కొండలను చుట్టుముట్టడానికి వేలాది మంది కేంద్ర పారామిలిటరీ దళాలను పంపించింది.
సైనికచర్య ప్రారంభమైన రెండు రోజుల తరువాత ఏం జరుగుతోందో గమనించడానికి నేను కొండ దిగువకు వెళ్ళాను. ఏప్రిల్ 23వ తేదీన తెలంగాణలోని పాలం గ్రామానికి సమీపంలో పసుపు రంగు ప్లాస్టిక్ షీట్లతో చుట్టిన మృతదేహాలను మోసుకెళ్లే పెద్ద పికప్ వ్యాన్‌ను చూశాను. బహుశా మావోయిస్టుల మృతదేహాలు కావచ్చు. ఈ వాన్ వెంట 10 మోటారు సైకిళ్లపైన సిఆర్‌పిఎఫ్ సిబ్బంది వెళ్తున్నారు.
తెలంగాణలోని ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఫోన్ చేస్తే ఎటువంటి సమాచారం రాలేదు. “ఇది కేంద్రం చేసిన ప్రత్యేక ఆపరేషన్ కాబట్టి నేను చెప్పడానికి ఏమీ లేదు. “రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేదు”అని ఆయన అన్నారు. ఈ చర్య కోసం దాదాపు 7,000 మంది సిఆర్ పిఎఫ్ సైనికులను మోహరించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చింది.
మర్నాడు ఉదయం, నేను తెలంగాణకు చెందిన ఒక జర్నలిస్టుతో కలిసి మోటార్‌సైకిల్‌పై రాళ్ళమయంగా ఉన్న అటవీ మార్గం గుండా మరింత ముందుకు వెళ్ళాను. సరిహద్దు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించాం, సంఘర్షణ ప్రాంతానికి వీలైనంత దగ్గరగా చేరుకున్నాము.
ధ్వని- కోపావేశం
90 కి.మీ పొడవైన కర్రెగుట్ట కొండలు తెలంగాణను ఛత్తీస్‌గఢ్ నుండి వేరు చేస్తాయి, ఇవి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు నుండి ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలోని తర్లగూడ వరకు విస్తరించి ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్ వైపున, కొండ శ్రేణిలో దుర్గంపాడ్ (దుర్గారాజ్ పహాడ్), నంబి కొండలు, నీలంపాడ్ తదితర కొండలు ఉన్నాయి. కొండ దిగువన కొత్తపల్లి, భీమారం, చిన్న ఉట్లపల్లి, కస్తూర్పాడ్, పూజారి కాంకేర్, ఉసుర్ వంటి గ్రామాలు ఉన్నాయి.
ఏప్రిల్ 24నాడు తెలంగాణలోని చివరి గ్రామం అయిన కొత్తగొప్పును దాటిన రెండు గంటల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నాం. ఇది దుర్గంపాడ్ ఛాయలో ఉంది, ఇది దాదాపు 3,000 అడుగుల ఎత్తులో చదునైన శిఖరంతో నిటారుగా ఉన్న రాతి కొండ. దాని అవతల విస్తరించి ఉన్న కొండలపైన అనేక మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన బెటాలియన్ నంబర్ 1కి చెందిన 350 మంది యోధులు దాక్కున్నారని ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు అంటున్నారు. మడావి హిడ్మా నేతృత్వంలోని ఈ బెటాలియన్‌ను మావోయిస్టుల అత్యుత్తమ పోరాట దళంగా పరిగణిస్తారు.
మేము కొత్తపల్లి గ్రామానికి చేరుకున్న గంటన్నర తర్వాత, మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో, రెండు హెలికాప్టర్లు ఆకాశంలో కనిపించాయి. అవి కొండలపై తిరుగుతూ, దుర్గంపాడ్ వెనుక కర్రెగుట్ట వైపు మాయమయ్యాయి. తరువాతి 20-25 నిముషాల పాటు ఎడతెగని కాల్పుల శబ్దాలు వినిపించాయి.
హెలికాప్టర్లు వెళ్ళిపోయిన తర్వాత, భయానక నిశ్శబ్దం అలుముకుంది. కాల్పులు ఆగిపోయాయి.
భద్రతా సిబ్బంది మొదటిసారిగా వేలాది మంది కొండ దిగువన క్యాంపు ఏర్పాటు చేయడానికి వచ్చినప్పటి నుండి అంటే ఏప్రిల్ 21వ తేదీ నుండి, ఈ పద్ధతి కొనసాగుతోందని గ్రామస్తులు చెప్పారు. ఉదయం 7, 11 గంటలకు మధ్యాహ్నం 3.30, సాయంత్రం 6 గంటలకు రోజుకు నాలుగుసార్లు హెలికాప్టర్లు కనిపించాయని వాటితోపాటు కాల్పులు జరిగాయని గ్రామస్తులు తెలిపారు.
మేము కొత్తపల్లిలో బస చేశాం. అక్కడ సుమారు 45 కుటుంబాలు నివసిస్తున్నాయి.
మరుసటి రోజు సాయంత్రం, ఏప్రిల్ 25న, దుర్గంపాడ్ ముట్టడిలో ఉన్నట్లు కనిపించింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో, కొండ కొద్దిసేపు వెలిగిపోవడం కనిపించింది. ఆ తర్వాత భీమారం గ్రామం ఉన్న చివరి భాగంలో పేలుళ్ల శబ్దం వినిపించింది. కాల్పులు అలా జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 11 గంటల వరకు అంటే దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగాయి. కొద్దిపాటి విరామంతోనే అనేక పేలుళ్లు జరిగాయి. దుర్గంపాడ్ అంచున క్షిపణి పేలుడులా అనిపించింది; మంటలు ఒక సెకనుకు పైగా పైకెగిరి ఆరిపోయాయి.
మందు గుండ్ల వర్షం ముగిసిన తర్వాత కొండలు మళ్ళీ నిశ్శబ్దమైపోయాయి. డ్రోన్ల మందమైన శబ్దం రాత్రంతా వినిపించింది. ఏప్రిల్ 26న తెల్లవారుజామున 3.40 గంటలకు చివరి డ్రోన్‌ను మేం చూసాం.
తెల్లవారుజామున కాల్పులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 5.25 నుండి 7.10 గంటల మధ్య, 2 నిమిషాల నుండి 5 నిమిషాల వ్యవధిలో పేలుళ్ల శబ్దం వినిపించింది. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పామేడ్ ప్రాంతం నుండి రెండు హెలికాప్టర్లు వచ్చాయి. భారీ ఫిరంగి శబ్దాలు మళ్ళీ వాటితో పాటు వచ్చాయి. దాదాపు 25 నిమిషాల తర్వాత వారు వెళ్లిపోయారు.
గ్రామస్తులు చెప్పిన విషయాలు:
మరుసటి రోజు ఉదయం, కొత్తపల్లి గ్రామస్థులు కొందరు గ్రామ బావి దగ్గర, కొందరు చేతిపంపు దగ్గర, మరికొందరు చింత చెట్ల కింద గుమిగూడారు. ఆందోళనగా ఉన్నారు. “మనం ఏమి చేయగలం?” అని ఒక వృద్ధుడు అన్నాడు. “మనం ఎక్కడికీ వెళ్ళలేము.”
తాము సేకరించిన కొద్దిపాటి మహువా పువ్వులను గ్రామస్తులు ఎండబెట్టారు. “ఈ సీజన్‌లో నేను సేకరించగలిగింది ఇదే” అని కొండపైకి కనిపించే ఇల్లు ఉన్న ఒక మహిళ చెప్పింది.
గ్రామాల్లోని ప్రజలు మహువా పూలు, తెండు ఆకులు వంటి అటవీ ఉత్పత్తులను సేకరించే ఆర్థికంగా కీలకమైన సీజన్‌లో సెక్యూరిటీ ఆపరేషన్ జరిగింది. “ఈ సంవత్సరం మంచి పంట వచ్చినా మేము మహువా పూలను సేకరించలేకపోయాము” అని సమీపంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వృద్ధుడు సూర్య అన్నారు. మరో ఐదు రోజుల్లో తెందు ఆకులను కోసే సీజన్ వస్తుంది; కొండలపై జరుగుతున్నది త్వరలోనే అయిపోతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు. “నేను అడవిలోకి వెళ్ళలేక పోతున్నాను” అని బాధ పడ్డారు.
భీమారం గ్రామం దాటి మరింత ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తే, పొదల నుండి బయటకు వచ్చిన భద్రతా సిబ్బంది మమ్మల్ని ఆపారు; మమ్మల్ని తిరిగి వెనక్కు వెళ్ళిపొమ్మన్నారు.
ఒక పెద్ద భద్రతా బలగాల సైనిక చర్య జరుగుతున్నది కాబటి మేం ఆ ప్రాంతం నుండి వెళ్లిపోవాలని ఒక కమాండెంట్ పట్టుబట్టాడు. ఆపరేషన్ ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, “మాకు ఢిల్లీ నుండి ఆదేశాలు వస్తాయి” అని అతను అన్నాడు.
కొండ ప్రాంతాలలోని పలు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. “మేము ఖచ్చితమైన సంఖ్యలను వెల్లడించలేము, కాని మేము గత నాలుగు రోజులుగా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నాము” అని సిఆర్పిఎఫ్ జవాన్ అన్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రత:
ఏప్రిల్ 26 నాటికి, కొత్తపల్లిలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఎండిన రాతి కొండలపై ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువ డిగ్రీలు ఉంటుందని గ్రామస్థులు చెప్పారు.
ఆ రోజు, సౌరశక్తితో నడిచే హ్యాండ్ పంప్ నుండి నీళ్ళు పట్టుకోడానికి అనేక మంది పోలీసులు గ్రామంలోకి వచ్చారు. గ్రామంలో మూడు సౌరశక్తితో నడిచే హ్యాండ్ పంపులు ఉన్నాయి, ఇవి 24 గంటలూ నీటిని సరఫరా చేస్తాయి.
మేము తెలంగాణ సరిహద్దు పట్టణమైన వెంకటాపురంకు తిరిగి వెళ్ళేటప్పుడు, రోడ్డు ద్వారా ట్రక్కుల లోడు నీటి బాటిళ్లను రవాణా చేయడాన్ని చూశాము.
వెంకటాపురం, భద్రాచలంలో జలహీనత (డీ హైడ్రేషన్) చెందిన జవాన్లు ఆసుపత్రిలో చేరినట్లు అనేక వార్తా నివేదికలు వచ్చాయి.
30 పడకల ఆసుపత్రి అయిన వెంకటాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో, ఎనిమిది పడకలలో జవాన్లు ఉన్నారు. జవాన్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి నియమించిన సిఆర్‌పిఎఫ్ డాక్టర్ మాట్లాడుతూ, వారి పరిస్థితిలో తీవ్రత ఏమీ లేదని జలహీనత, బ్యాగులతో ఎక్కువసేపు నడవడం వల్ల భుజాలపై రాపిడి గాయాలు, పొట్టకి సంబంధించిన సమస్యలు వంటి కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
ఐదు రోజుల ఆపరేషన్ ముగింపులో, ముగ్గురు మహిళా మావోయిస్టులను చంపినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదు.
ఏప్రిల్ 29, 2025