ఇటీవలకాలంలో ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్న కొంతమంది కవులు పద్యకావ్యాలతో అభ్యుదయకవిత్వాన్ని రాస్తున్నారు. ప్రజా సమస్యల్ని, ప్రజల బాధల్ని గాథల్ని కవిత్వంగా రాయడం ఈ మధ్య తెలుగుకవిత్వంలో సహజంగా చూస్తుంటాం. కానీ పద్యంలోనూ ఉద్యమాలను రాయడం ఆరదు. అయితే ఈ పద్యకావ్యాలు ప్రాచుర్యంలోకి పెద్దగా రావడం లేదు. వారు ఎక్కడికక్కడే రాసి పుస్తకాలను ముద్రించుకుంటున్నారు. ఏ జిల్లాకాజిల్లాకే వాళ్ళు పరిమితమవుతున్నా, ప్రపంచాన్నంతా కవిత్వంగా రాస్తున్నారు. ఆ కోవలోకి చెందిన కవి కర్నూలులో కనిపించారు. ఆయన రాసేవన్నీ పద్యాలే. అవి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, చెగువేరా..ఇలా మహనీయుల గూర్చి, ప్రజా ఉద్యమాల గూర్చి, సమస్యలగూర్చి రాస్తుంటారు. వాటిని పద్యాల్లో పరిచయం చేస్తుంటారు. ఆయన పేరు డి.పార్వతయ్య. కర్నూలు నగరంలో ఏడు పదులు దాటిన కవి. ఇప్పటి వరకు చరిత్ర రచన, నాటక రచన వచనంలో అందిస్తూనే పద్యకవిత్వాన్ని అందిస్తూ వస్తున్నారు. కర్నూలు సాహిత్యంలో ఆయన వైవిధ్యమైనకవి. కర్నూలు ప్రగతిశీల ఉద్యమాల్లో ప్రత్యక్షంగా ఉన్నకవి. కానీ తనకు వచనంమీద ఎంతో మక్కువ ఉన్నప్పటికీ పద్యాన్ని అమితంగా ప్రేమించడం పద్యంలోనే సామాజికాభ్యుదయాన్ని కాంక్షించడం ఆ కవి ప్రత్యేకత.

ఇటీవల బొమ్మల గాథలు అనే పుస్తకం పద్యకావ్యంగా తీసుకువచ్చారు. తను ఎన్నుకున్న పద్య వస్తువులు చాలా గొప్పవి.. విభిన్నమైనవి. గొడుగు గూర్చి రాస్తూ..ఎండకు ఎండుతు ఎనలేని/ వేడియౌ భానుని భగభగ బారి నుండి/ మానవకోటికి మనుగడ్కె జీవించు..అంటూ సీసంలో గొప్ప వర్ణన చేస్తాడు. వచనంలో ఎంత వర్ణనైనా చేయొచ్చు.కానీ పద్యంలో వర్ణించాలనుకున్నప్పుడు.. ఛందస్సులో ఏ మాత్రము తప్పుదొర్లకూడదు. అలా ఎలాంటి వ్యాకరణ పొరపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా సామాజిక అంశాలను కవిత్వాంశాలుగా రాయగలుగు తున్నాడు. ఇది కవికున్న భాషా ప్రతిభకు నిదర్శనం.
కవిత్వంలోకి వచ్చిన ప్రతివొక్కరూ రైతు గూర్చి రాయకుండా వుండరు. అలా ఈ కవికూడా రైతు గూర్చి అద్భుత పద్యం రాశాడు. అన్నదాతకిపుడు అన్నమే కరువాయె/ హలము పట్టురైతు ఆగమాయె/అన్నపూర్ణభారతామనియందున/ రైతుబాధకాంచు రౌతు లెవరు..అంటూ అన్నదాత జీవితాన్ని ఆటవెలదిలో చెప్తాడు. రైతుగూర్చి భిన్నంగా చెప్పటానికి కారణం డి.పార్వతయ్య గ్రామీణ నేపథ్యం కల్గిన కవి. రైతు బతుకుల్ని కళ్లారా చూసిన కవి. రైతు కష్టాల్ని, కన్నీళ్ళని తన జీవితంలో భాగంగా ఇముడ్చుకున్న కవి. అందుకే అంత బాగా రాయగలిగాడు. కరవు కొందరికి వరమైతే మరికొందరికి శాపం. కరువు కొద్దిమందికి సంపదను సృష్టిస్తే, చాలామందిని బికారులను చేస్తుంది. కరువు ఆర్థ్థికంగా మాత్రమే ప్రభావితం చేయదు. సాంస్కృతిక విలువల్ని కూడా ధ్వంసం చేస్తుంది. అందుకే కరువుబాధల్ని చక్కగా కవి చెప్పాడు.

ఇక రాయలసీమ శోభను తెలియజేస్తూ ఓ తేటగీతి పద్యం రాశాడు. అది..శోభకల్గు రాయలసీమ సుచరితంబు/ తెలుపుచుంటిని తీయని తేటగీతి/పొందుపరచితి పదముల పొందికలను/సీమగొప్పను తెలుపగ సీసమేల.. అంటూ రాయలసీమ వైభవాన్ని చెప్తాడు. ఇలా ఈ పుస్తకం నిండా గొప్ప గొప్ప పద్యాలను రాశాడు. సామాజిక సమస్యల ఇతివృత్తాలను పద్యవస్తువులుగా తీసుకుని నిరంతరం రాస్తున్నాడు. అందులో ముఖ్యంగా టైలర్‌ బతుకులు, ట్రాఫిక్‌ పోలీస్‌ కష్టాలు, మహిళా సమస్యలు, పెరుగుతున్న ధరలు, చిలకజోస్యం వాడి చేతిలో బంధీ అయిన చిలుక, ఆకలి, పేదరికం, వృద్యాప్యం, కరోనా వైరస్‌, బంగారంపై మోజు, బిక్షగాళ్లు, వరకట్నం, మూఢనమ్మకాలు, అమ్మ ప్రేమ, తెలుగుతల్లిపై మమకారం, అవినీతి, మొబైల్‌ వ్యసనం, అధికారకాంక్ష ఇలా సమాజంలోని అనేకానేక వస్తువులు అతని చేతిలో ముఖ్యంగా ఈ పుస్తకం లో పద్యకవిత్వమయ్యాయి. సమస్యలన్ని కవిత్వంగా రాయడంలో ఎంతో ప్రావీణ్యత సాధించారు.

మొదట మనం చెప్పుకున్నట్టు ఉద్యమజీవితంలోనూ, కళా జీవితంలోనూ సహజంగానూ లేదా వివిధ సమస్యలతో అస్తమించిన ఉద్యమకారుల గూర్చి గొప్ప స్మృతి కవిత్వం రాశాడు. స్మృతి ఎంతో గొప్పది..స్మృతి కవిత్వం రాసినవాళ్లు చాలా మంది ఉన్నారు. స్మృతిని పద్యంగా అదీ హృద్యంగా రాసినవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇందులో లెనిన్‌, చెగువేరా, డా.బిఆర్‌ అంబేడ్కర్‌, మల్లు స్వరాజ్యం, కామ్రేడ్‌ సీతారాం ఏచూరి తదితర ప్రముఖులే కాక జిల్లాలో ప్రజాపోరాటాలు నడిపిన వారందరినీ పద్యకవిత్వంగా రాశారు. అలాగే దేశంలో సంచలనం సృష్టిస్తున్న అత్యాచార ఘటనలకు స్పందిస్తూ ఇలా రాస్తారు.
సీ:దిల్లి నగర మందు దిక్కు లేక జరిగె/ కదిలె వాహనమున కామ క్రీడ/పట్ట పగటి వేళ వనితను నిర్భయన్‌ /మానవ మృగములు మట్టుపెట్టె/ హైదరాబాదున అతి దారుణంబుగ /కాల్చి చంపిరి కదా కలికి దిశను/ వైద్య విద్యార్థిని వాటమ్ముగ ఖలులు కలకత్త నగరాన కాటు వేసె.

ఆ.వె:పడతు లైన గాని పసిపాప లైనను/ముసలి వారు నైన మూగ లైన /కాల్చి వేయవారి కామాగ్ని జ్వాలల ఆర్ప నెవరు వారి ఆగడాలు

తే.గీ: మార్పు కోరుతు/ఉద్యమ మహిళమణులు/ పోరుబాటను పట్టిరి/పుడమి నెల్ల తేలి పోవునో/న్యాయమ్ము తెప్పలాగ/నిర్భయ దిశలాగ నిదియు నీరు గారి.. ఇలాంటి అనేక కవితలు ఇందులో కనబడతాయి. ఢిల్లీ, కలకత్తా నగరాల్లో జరిగిన అత్యాచార ఘటనల్ని ప్రపంచం చూసింది. వేలమంది కవులు అత్యాచార ఘటనలకు సంబంధించి కవితలు, కవిత్వా సంపుటాలు తెచ్చారు. ఈ కవి పద్యంలో గొప్ప నిరసన తెలిపారు. పద్యంలో బాధను అక్షరీకరించారు. పద్యాల్లోనూ ప్రజా ఉద్యమాలను రాయడం గొప్ప విషయమని ఈకవి కవిత్వం చూశాక తోస్తున్నది.

పద్యం ఈ కాలంలో ఎవరు చదవుతారనడానికి వీల్లేదు. పద్యాన్ని ప్రేమించే తరం ఇంకా వుంది. పద్యాన్ని ప్రేమించే వొక సాంప్రదాయ వాసనల్ని పద్యం ద్వారా కూడా అభ్యుదయం రాసి వాళ్ళకూ దగ్గరవ్వవచ్చు. ప్రజాభ్యదయాన్ని దగ్గర చేయవచ్చనింపించింది.ఎర్రజండా గూర్చి ఆయన పద్యంలో ఇలా రాస్తారు.

సీ:ఎర్రని కాంతులు వెదజల్లు సూర్యుడు/ఉదయాన ప్రకృతిని పరవశింప/ఎర్రని రక్తంబు వేగమై ప్రవహించు/ బహునరంబుల దేహవృద్ది కొరకు/ ఎర్రని మందారమేపుగా పూయును/ముదితల జడలోన మురియు కొరకు/ఎర్రని వస్త్రంబు నెదురుగా చూపించ/పరుగెత్తు శకటాన్ని బంధి చేయు

తే.గీ:ఎర్ర రంగును కలిగిన ఎర్రజెండ/బడుగు బలహీన బాసటై వాసికెక్కి/ దేశ రాజకీయాలకు దిశను చూపి మెరిసె/శ్రీలంక దేశాన మెరుపులాగ…
ఎర్రజెండా విశిష్టతను ఎంత గొప్పగా ప్రకృతిలో అనుసంధానం చేసి చెప్పారు. అలాగే శ్రీలంకలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఎంతో ఉత్తేజభరితమైన పద్యం తేటగీతిలో రాశారు. ఇలా పద్యం ద్వారా కూడా అందరికీ విప్లవోద్యమాలను పరిచయం చేయడం అరుదైన విషయం.

ఇక మనం మొదట చెప్పుకున్నట్లు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయుల గూర్చి ఆయన ఇలా రాస్తారు. మొదట చెగువేరాను తీసుకుందాం..
తే.గీ.: మహిళ బలహీనురాలని మనసునందు/ భావముండిన మనమింక బయటపడము/ మతపుభావ జాలము నుండి మత్తు వీడి/యనుచు చేగువేరా తెల్పె హర్ష మలర…
మతం పట్ల మహిళల పట్ల చేగువేరా ఆలోచనల్ని పద్యంగా చెబుతారు.మహిళ బలహీనురాలు కాకూడదని, మతం భావనలు వీడాలని చెప్తారు. అలాగే లెనిన్‌ మహాశయుడి గూర్చి రాస్తూ..

తే.గీ: జనులనాయకు వర్ధంతి శతక/మయ్యెవిశ్వ మంతయు జరిపిరి/వీధి సభలు ధైర్య సాహస ములుగల/అమరు డైన ‘‘లెనిను’’ జీవిత గాధను లెస్స గాను…
తే.గీ: పిల్లలందరిపై ప్రేమ వెళ్ళి విరియ/సాంస్కృతిక వేడుకల యందు సృష్టి/జేసె వింత హాస్యపు క్రీడలు వీరి కొరకు/విప్లవాధినేత ‘‘లెనిను’’ వీరశూరు…
తే.గీ:లెనినిజంబను మాటయే లెక్క /లేని అంతరాలను తొలగించు ననవ/రతము నాటి రష్యవిప్లవమేను నేటి/దాక ప్రజల గుండెల ఎర్రటి బాట వేసె…
తేటగీతిలోని ఈ మూడు పద్యాల్లో ఆయన లెనిన్‌ గూర్చి గొప్పగా రాశారు..ఇలా పద్యంలో లెనిన్‌ ఈ ప్రపంచాన్ని ఎంత ప్రభావం చేసినదీ చెప్తారు.ఇవాళ అర్థం పర్థం లేని వాళ్ళను ఆ పేర్లతో ఇజం అంటున్నారు. అది ఇజమేనా? ఏం సాధించారని ఇజం అనాలి.ఈ ప్రపంచానికి ఏం సందేశం ఇచ్చి నడిపించారని వాళ్ళనననాలి. ఇజం అంటే మార్క్సిజం..ఇజం అంటే లెనినిజం. ఇవి కదా ప్రపంచానికి దిక్సూచి.ఇవి కదా ప్రపంచాన్ని నడిపించేవి. నవసమాజాన్ని నిర్మించేవి..ఇక అంబేడ్కర్‌ గూర్చి ఈ కవి..
సీ: అంబేద్కరు జనించె అస్పృశ్య/కులమున మానవతావాది మనదు/ వేల్పు కుళ్ళిపోయిన కులకోరల/ద్రుంచెను భారతీయ సమాజ/ప్రగతి కోరి చదువులెన్నొ చదివి/పదవులెన్నోజేసి రాజ్యాంగ కర్తపై /రాణ కెక్కె భారత రాజ్యాంగ భవితను/ వ్రాసిన బాబసాహెబు గొల్వ పదము లేదు..

తే.గీ: వారు వ్రాసిన రాజ్యాంగ వరుస/మార్చి నేటి పాలకులనువుగా నేలు/చుండ్రు ఓటు ఆయుధమును బటి/్ట ఓడగొట్టి/నిలుపు రాజ్యాంగ రక్షణ నికరముగను…
భారతరాజ్యాంగం గొప్పతనం బాబా సాహెబ్‌ అంబేడ్కరుడి గూర్చి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఇలా అనేకం ఈ పద్య కావ్యంలో కనబడతాయి. పద్యంలో ప్రగతిశీలసాహిత్యాన్ని చదవడం గొప్పగా అనిపించింది. ఈ పుస్తకంలో వారందరి బొమ్మలూ ఉంటాయి. పద్యం బొమ్మలూ ఇలా అన్నీ కలగలసిన పద్యమైనందుకే నేమో ఈ కవిత్వానికి బొమ్మల గాథలు అని శీర్షిక రాశారు. ఇవి గాథలే కాదు..వాస్తవ జీవితాలు. జీవన గమనంలో నిరంతరం ప్రత్యక్షతార్కాణాలు. ఈ పద్యకావ్యం చదువదగ్గది. చదివిస్తున్న పద్యకవిత్వమిది.

Leave a Reply