వర్సైల్స్ ఒడంబడిక* లోని అవమానకరమైన నిబంధనలు జర్మన్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయి. ఈ ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక  స్వాతంత్య్రాన్ని  అంతం చేసింది. వారు విజేతల ముందు తలవంచవలసి వచ్చింది (ట్రిపుల్ అలయన్స్). వర్సైల్స్ ఒప్పందం ప్రకారం, జర్మనీ $33 బిలియన్ డాలర్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది; విలువైన విదేశీ వలసలను వదులుకుంది; ఫ్రాన్స్, పోలాండ్‌లకు తన స్థానిక భూములలో విలువైన భాగాలను అప్పగించింది. జర్మన్ సైన్యం గణనీయంగా తగ్గిపోయింది; జలాంతర్గాములు లేదా వైమానిక దళం నిషేధానికి గురయింది. “మేము జర్మన్ నిమ్మకాయను దాని విత్తనాలు కేకలు వేసే వరకు పిండి పిప్పి చేస్తాం!”1 అని ఒక బ్రిటిష్ అధికారి వివరణనిచ్చాడు.

ఈ ఓటమికి ప్రజాస్వామ్యం, యూదు ప్రజలు కారణమని ఆరోపించారు. 1920ల ప్రారంభంలో గాయపడిన సైనికులు, జర్మనీ మధ్యతరగతి ప్రజలు ఓటమి, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు గెస్టపో లాంటి సంస్థ కోసం మౌలిక ప్రణాళికలు రూపొందాయి. ఇంతలో, అధిక ద్రవ్యోల్బణం ప్రబలమై, 1923లో జర్మన్ కరెన్సీ విలువ తగ్గిపోయింది; ఒక అమెరికన్  డాలర్ విలువ నాలుగు బిలియన్ జర్మన్ మార్కులు. వీమర్ సామ్రాజ్యం చెల్లిస్తున్న పెద్దమొత్తపు నష్టపరిహారాన్ని నాజీ పార్టీ చట్టవిరుద్ధం చేసింది. మొత్తం ఉత్పత్తి నిలిచిపోవడంతో శ్రామిక వర్గాలు తమ జీవితాలను కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య ఆలోచనను వదిలేయడానికి కూడా సిద్ధపడాల్సి వచ్చింది.

అదే సమయంలో, 1919 తర్వాత తాము కోల్పోయిన జర్మనీలో ఆకలిదప్పులు  తీర్చడానికి, గౌరవాన్ని కాపాడుకోవడానికి  ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఎలాంటి పరిష్కారమూ లేదని హిట్లర్ తన మిలిటరీ కమాండర్లు, అసంతృప్త మధ్యతరగతిలో బలమైన ప్రచారం చేశాడు. పార్లమెంటరీ మార్గాల ద్వారా జర్మనీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంక్షోభ పరిస్థితిని హిట్లర్ ఉపయోగించుకొన్నాడు; యూదులను, ఉదారవాద-ప్రజాస్వామ్యవాదులను, కమ్యూనిస్టులను లక్ష్యంగా చేసుకున్నాడు; జర్మనీ ఓటమికి వారే కారణమని బలమైన ప్రచారాన్ని నిర్వహించాడు. 1922 లో మ్యూనిచ్‌లో జరిగిన సమావేశంలో “రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి –  ఆర్యుల విజయం  లేదా ఆర్యుల విధ్వంసం-యూదుల విజయం” అని అన్నాడు. యువకుడైన హిట్లర్ బలమైన జాతి గెలిచే ఒక జాతి పోరాట ప్రక్రియగా చరిత్రను చూసాడు.

హిట్లర్ జర్మన్-ఆర్యన్ ప్రజల దృష్టిలో చరిత్రనుంచి వర్గాన్ని నిర్మూలించి జాతిని చేర్చాడు. చారిత్రాత్మకంగా అదే న్యాయమైనదని సమర్థించాడు. చరిత్రలో, చాలా మంది చరిత్రకారులు హిట్లర్‌ను ఫాసిస్ట్ పాలకుడిగా చిత్రీకరించారు, ఇది నిజం. కానీ మనం అతన్ని బలమైన ఆర్గనైజర్‌గా కూడా చూడాలి. ఆ ఆర్గనైజర్ మొదట ద్రవ్య పెట్టుబడిని సమస్యగా నిందించాడు; ఎందుకంటే అత్యధిక ద్రవ్య పెట్టుబడి యూదుల చేతుల్లో ఉంది కాబట్టి. అంతిమంగా, అతను జర్మన్ కార్మికవర్గ హృదయాలను, ఆలోచనను గెలుచుకున్నాడు.  ఆ తర్వాత, అతను ద్రవ్య పెట్టుబడి మద్దతు పొందాడు.; ‘దేశ ప్రయోజనం కోసం’ పేరుతో న్యాయమైనదిగా చూపిస్తూ కార్మిక సంఘాలు, కార్మికుల హక్కులపైన తిరోగమన పరిమితిని విధించాడు. మొదటి అరెస్టు తర్వాత, హిట్లర్ తన గత పొరపాట్ల నుండి నేర్చుకొని ఎన్నికలలో పోటీ చేశాడు. అతనికి కేవలం 2.8% ఓట్లను మాత్రమే వచ్చాయి. కానీ విశ్వవ్యాప్త కమ్యూనిస్ట్ ఉద్యమం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉద్భవిస్తున్న శ్రామిక వర్గ ఉద్యమ ప్రజా చైతన్యాన్ని సామ్యవాద-ప్రజాస్వామ్యవాదుల నుండి తప్పించి నాజీ పార్టీ వైపుకు మరల్చింది. ఫాసిస్టులు గొర్రెల దుస్తుల్లో వున్న జిత్తులమారి తోడేళ్లని చరిత్ర రుజువు చేసింది. గెస్టపో ఏర్పాటు అనేది కార్మికవర్గం, యూదులు, కమ్యూనిస్టుల సంభావ్య ఆందోళనలను అణిచివేసేందుకు చేపట్టిన ఒక తెలివైన చర్య.

తన శత్రువులు ఎవరో ఫాసిస్ట్ రాజ్యానికి చాలా స్పష్టంగా తెలుసు. రీచ్‌స్టాగ్ ఫైర్ డిక్రీ2 అనేది ఫాసిస్ట్ సమూహం రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునే చివరి చర్య. “కమ్యూనిస్ట్‌లు” (దీనిపై స్పష్టత లేదు) జర్మన్ పార్లమెంట్ హౌస్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటన తరువాత, హిట్లర్ సమకాలీన అధ్యక్షుడు పాల్ వాన్ హిండెన్‌బర్గ్‌ ను ‘ప్రజల, రాజ్య రక్షణ’ కోసం అత్యవసర పరిస్థితిని విధించక తప్పని పరిస్థితిని కల్పించాడు.

జర్మన్ కమాండ్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత, హిట్లర్ 1933లో ప్రష్యా లోని వివిధ రాజకీయ పోలీసు ఏజెన్సీలను ఒకే సంస్థగా కలపడం ద్వారా గెస్టపోను ఏర్పాటు చేశాడు. ఛాన్సలర్ హిట్లర్ ఆదేశాలను అమలు చేయడానికి కేంద్రీకృత ఆదేశం అవసరం. ఈ మొత్తం ప్రణాళిక శిల్పి అయిన హెర్మాన్ గోరింగ్‌ను 1936లో నాజీ పాలకుల క్రింద జర్మన్ పోలీసు చీఫ్‌గా నియమించారు.

రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ-సైద్ధాంతిక అసమ్మతివాదులు, నేర వృత్తికలిగినవారు (అనేక నేరాలు చేసినవారు), కమ్యూనిస్టులు, వికలాంగులు, స్వలింగ సంపర్కులు, అన్నింటికంటే ముఖ్యంగా యూదులపై దృష్టి పెట్టడం ఈ సంస్థ ప్రధాన కార్యకలాపం. 1941 తర్వాత, రహస్య పోలీసులచే విచారణ లేకుండా నిర్బంధించబడిన వారు గెస్టపో కస్టడీలో అదృశ్యమయ్యారని చాలా మంది చరిత్రకారులు పేర్కొన్నారు. 1936 తర్వాత, హిట్లర్ చట్టం ద్వారా గెస్టపోకు అపరిమిత అధికారాన్ని ఇచ్చాడు. చట్టానికి మించి, అంటే న్యాయ సమీక్షకు అతీతంగా వ్యవహరించడానికి అధికారం ఇచ్చాడు. 1935లో,  ప్రష్యన్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ‘గెస్టపో నిర్ణయాలు, చర్యలు న్యాయ సమీక్షకు మించినవి’ అని తీర్పునిచ్చింది. గెస్టపో లీగల్ వ్యవహారాల అధిపతి వెర్నర్ బెస్ట్ ఒకసారి ఇలా అన్నాడు -” నాయకత్వ ఇష్టానుసారం పోలీసులు పాలన సాగిస్తున్నంత కాలం, వారు చట్టబద్ధంగా పనిచేస్తున్నట్లే.”

వెర్నర్ బెస్ట్ చేసిన పై సూచన అర్థం చాలా స్పష్టంగా ఉంది. చట్టబద్ధత నిర్వచనాన్ని ‘రాజ్య సంకల్ప’ ప్రమాణానికి కుదించారు. యుద్ధం తర్వాత, 1945లో, అమెరికా ప్రభుత్వం న్యూరేమ్‌బెర్గ్ విచారణలో ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్‌ని స్థాపించి గెస్టపోపై శాశ్వత నిషేధాన్ని ప్రకటించింది.

2017లో సి‌ఐ‌ఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) “ది గెస్టపో: ది మిత్ అండ్ రియాలిటీ ఆఫ్ హిట్లర్స్ సీక్రెట్ పోలీస్” (గెస్టపో: హిట్లర్ రహస్య పోలీసు కల్పన-వాస్తవాలు) అనే పేపర్‌ను ప్రతిపాదించినప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది.  ఫ్రాంక్ మెక్‌డొనౌ గెస్టపో చేసిన భయంకరమైన చర్యలను తగ్గించి చూపడానికి ప్రయత్నించాడు; రహస్య సంస్థల చిత్తరువులను పునఃసృష్టించడానికి అనేక కారణాలను ఇచ్చాడు. అతను చాలా అస్పష్టమైన ప్రాతిపదికను కూడా నొక్కి చెప్పాడు; సంస్థ చిత్తరువుని రాజ్య బలవత్తర వాతావరణంలో చిత్రీకరించాడు; మరోవిధంగా చెప్పాలంటే  ఒక  చట్టాన్ని అమలు చేసే అంగంగా గెస్టపో చరిత్రను వర్ణించాడు.

అయితే ఈ వాదనలో మనం పరిగణించవలసిన కొన్ని లోపాలు ఉన్నాయి. మొదటిది: గెస్టపో 1933లో స్థాపితమైంది, అదే సంవత్సరం హిట్లర్ ఛాన్సలర్ అయ్యాడు. రెండవది: జర్మన్ రాజ్య జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఒకే నిఘా సంస్థ క్రింద పోలీసు వ్యవస్థ కేంద్రీకరణ. మూడవది: గెస్టపో పరిశోధించిన కేసుల చరిత్రను చూస్తే దాని వాస్తవిక చరిత్ర  ఫాసిస్ట్ రాజ్యానికి ప్రతిరూపం అని తెలుస్తుంది.

26/11 ఉగ్రవాద దాడుల తర్వాత కేంద్ర చట్టం ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఏర్పడింది. ఈ దాడి తర్వాత దేశ స్థాయిలో మన నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలనే డిమాండ్ వచ్చింది. ఎన్‌ఐఎ చట్టాన్ని 2008లో రూపొందించారు; ఈ చట్టం దేశవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలను స్వీయపరిజ్ఞానంతో గుర్తించడానికి ఏజెన్సీకి అధికారం ఇస్తుంది. అయితే, 2019 సవరణ ఏజెన్సీ దర్యాప్తు అధికారాలను పెంచింది. దేశ భద్రత, సమగ్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపే విదేశీ వ్యవహారాలపై దర్యాప్తు చేయడానికి ఈ సవరణ ఏజెన్సీకి మరిన్ని అధికారాలను ఇచ్చింది.

ఇటీవలి కాలంలో, అసమ్మతి స్వరాలను అణిచివేసేందుకు, అధికార బిజెపి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏజెన్సీని ఉపయోగిస్తున్నట్లు కేసుల పరిశీలన సూచిస్తోంది. కొన్ని సమయాల్లో సెర్చ్ వారెంట్ లేకుండానే మొత్తం భవనాన్ని ఏజెన్సీ సోదా చేయవచ్చు. రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న అసమ్మతిని అణిచివేసేందుకు ఏజెన్సీ తీవ్రవాద కార్యకలాపాల నివారణా చట్టంని ఉపయోగించిన సందర్భాలు గతంలో ఉన్నాయి.

2021లో అరెస్టయి, కస్టడీలో ఉండగా మరణించిన ‘ఫాదర్ స్టాన్ స్వామి’ కేసు ఇక్కడ గమనించదగ్గ విషయం. అదనంగా, ఇలాంటి కేసుల్లో అనేక ఇతర పౌర హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులు, విద్యావేత్తలు అరెస్టయ్యారు. ముఖ్యంగా, ఉపా కేసుల్లో ఎన్‌ఐఎ అరెస్టు చేసిన వారిలో కొద్ది శాతం మంది మాత్రమే వాస్తవానికి దోషులుగా నిరూపితమయ్యారు. కానీ అత్యధికులు సుదీర్ఘ చట్టపరమైన ప్రక్రియలను భరించవలసి వచ్చింది; జైలులో వుండాల్సి వచ్చింది.

కెల్సెన్ 1940-50లలో వియన్నా విశ్వవిద్యాలయం, అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌గా పనిచేసిన న్యాయ సిద్ధాంతకర్త. అతను చట్టబద్ధమైన సకారాత్మక ఆలోచనకు పొడిగింపు అయిన ‘స్వచ్ఛమైన చట్ట సిద్ధాంతం’ని రూపొందించాడు. చట్టం అనేది సమాజంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల నుండి విడిగా ఉండాలని స్వచ్ఛమైన చట్ట సిద్ధాంతం చెబుతుంది. ‘చట్టం ఒక మానవ శాస్త్రం, ఏ శాస్త్రమూ విజ్ఞానం కాదు’ అనే అంశాన్ని కెల్సెన్ నొక్కి చెప్పాడు.

 ఏ భావజాలానికి ఆధిపత్యం లేని రాజ్యం అనే కెల్సెన్ ఆలోచన ఒక కాల్పనిక కలలాగా మంచిది. ఏ సిద్ధాంతాన్ని అధికారంగా వ్యవహరించే సిద్ధాంతంగా అనుసరించాల్సిన అవసరం లేని చాలా నిరపాయమైన పరిస్థితిని అందిస్తుంది; వారు ఏమి చేసినా అంతిమంగా చట్టంగా పరిగణించబడుతుంది. మనం ఆధునిక దర్యాప్తు సంస్థల పనితీరును పరిశీలిస్తే కనక  ‘సార్వభౌమాధికారం, సమగ్రతను పరిరక్షించడం’ పేరుతో రాజ్యం కార్యకలాపాల్లో  ‘మినహాయింపులు’ సృష్టిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.

1. (మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ నుండి డిమాండ్ చేసినన భారీ నష్టపరిహారాన్ని సూచిస్తూ ఈ పదం మొదట ముద్రణలో కనిపించింది (“పరిహారం గురించిన సమస్య గురించి మాట్లాడుతూ సర్ ఎరిక్ ఇలా అన్నాడు: ఈ ప్రభుత్వం తిరిగి వస్తే, జర్మన్లు ప్రతి పైసా చెల్లిస్తారు; వారిని నిమ్మకాయను పిండినట్లుగా పిండుతాం – 1918లో)

2.  1919జూన్ 28నాడు వర్సైల్స్ ఒప్పందం జరిగింది.  ఫ్రాన్స్‌లోని ప్యారిస్ వెలుపల ఉన్న వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో సంతకం చేయబడింది మరియు అధికారికంగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ ఒప్పందం జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండు నేతృత్వంలోని గెలిచిన మిత్రరాజ్యాల మధ్య శాంతి పరిస్థితులను వివరించింది. ఒప్పందంలో ఈ క్రింది నిబంధనలు వున్నాయి:

శిక్షాత్మక చర్యలు: జర్మనీ యుద్ధానికి బాధ్యత వహించవలసి వచ్చింది, నిరాయుధీకరణ; మిత్రరాజ్యాలకు ఆర్థిక నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది.

భూభాగం కోల్పోవడం: జర్మనీ భూభాగాన్ని ఫ్రాన్స్, పోలాండ్ వంటి ఇతర దేశాలకు అప్పగించింది; తన విదేశీ కాలనీలన్నింటినీ వదులుకుంది.

సైనిక పరిమితులు: జర్మన్ సైన్యాన్ని, నేవీ పరిమాణాన్ని పరిమితం చేసారు.

యుద్ధ నేరస్థులు: కైజర్ విల్హెల్మ్ II తదితర ఉన్నత స్థాయి జర్మన్ అధికారుల పైన యుద్ధ నేరస్థులుగా విచారణ జరిగింది.

లీగ్ ఆఫ్ నేషన్స్: ఈ ఒప్పందంలో లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రణాళికాబద్ధమైన ఏర్పాటు ఉంది.

3. రీచ్‌స్టాగ్ అగ్నిప్రమాదానికి తక్షణ ప్రతిస్పందనగా 1933 ఫిబ్రవరి 28 నాడు ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్ రీచ్‌స్టాగ్  ఫైర్ డిక్రీని ప్రజల, రాజ్య రక్షణ కోసం జర్మనీ అధ్యక్షుడు పాల్ వాన్ సలహాపై జారీ చేశాడు. ఈ డిక్రీ జర్మన్ పౌరుల అనేక కీలక పౌర హక్కులను రద్దు చేసింది. జర్మన్ ప్రభుత్వంలో నాజీలు శక్తివంతమైన స్థానాల్లో ఉండడం వల్ల , నాజీల ప్రత్యర్థులుగా పరిగణించబడే ఎవరినైనా ఖైదు చేయడానికి, నాజీ ప్రయోజనాలకు  “స్నేహపూర్వకంగా” పరిగణించబడని ప్రచురణలను అణిచివేసేందుకు డిక్రీని చట్టపరమైన ప్రాతిపదికగా ఉపయోగించారు. జర్మనీలో ఒక-పార్టీ నాజీ రాజ్య స్థాపనలో కీలక దశలలో ఒకటిగా చరిత్రకారులు ఈ డిక్రీని పరిగణిస్తారు .

సెప్టెంబర్ 8, 2024

Leave a Reply