హింస ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా, మణిపూర్ సమాజంలోని చీలికలు లోతుగా ఉన్నాయి; సాయుధ బృందాల పహారాలో ఉన్న కందకాలు, బఫర్ జోన్ల ద్వారా విభజితమై ఉన్నాయి.
ఇది మన కుళ్ళిపోయిన సమాజంలోని
నిస్సహాయుల, మూగబోయిన వారి విన్నపం.
ప్రస్తుత పరిస్థితుల వల్ల మన సమాజం
దారుణం నుండి మరింత దారుణస్థితికి మారుతోంది.
భీభత్సం, మారణకాండ, అత్యాచారం, అవినీతిల వల్ల
ప్రజలు ఆనందాన్ని పంచుకోవడం,
తమ జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయారు…
ఈ బాధను అంతం చేయడం ఎలా?
మణిపూర్‌లో హింస ప్రధానమైనదిగా మారడానికి మూడేళ్ల ముందు, 2020లో ‘షూటింగ్ ది సన్’ అనే నాటకం కోసం ఒక మణిపురి కవి దీనిని రాశారు. ఆ ప్రశ్న అలాగే మిగిలి ఉంది: మణిపూర్‌లో నివసిస్తున్న ప్రజల బాధలను అంతం చేయడం ఎలా?
ఈ సంవత్సరం మైతేయీలపై దాడులతో ప్రారంభమైంది, ఆపై భద్రత కల్పించినప్పటికీ ఉఖ్రుల్-ఇంఫాల్ రహదారిపై ప్రయాణించే వ్యక్తులపైన; నాగ గ్రామాలపైన ప్రాణాంతక దాడులకు దారితీసింది. మరోసారి, మణిపూర్ మరో భయంకరమైన హింసాకాండకు సిద్ధమవుతోంది; ఈసారి కూడా భద్రతా బలగాలు తటస్థంగా లేవని, పౌరులను రక్షించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా సరే, వారు ఒక నిర్దిష్ట సమాజానికి చెందిన వారైతే దాటలేని విధంగా మణిపూర్ మండలాల కింద విభజితమైంది. 2023లో ఆయుధగారాలు, పోలీసు స్టేషన్ల నుండి లూటీ చేఅయిన ఆయుధాలలో చాలా వరకు స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నప్పటికీ, ఇక్కడి సముదాయాలు మాత్రం ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి.
కానీ తిరుగుబాటు దారులు, గ్రామ రక్షణ బృందాలు, సాముదాయక మిలీషియాలు, సాయుధ వాలంటీర్లు, నేర ముఠాలు, సాయుధ నిఘా బృందాల (అరంబాయి టెంగ్గోల్, మైతేయ్ లీపున్ వంటివి), వ్యక్తుల చేతుల్లో ఇప్పటికీ అక్రమ ఆయుధాలు ఉన్నాయి.
తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేవారు ఎవరూ లేకపోవడంతో, ప్రజలు రక్షణ కోసం సాయుధ బృందాల వైపు మళ్లుతున్నారు. తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైన పౌరులు బుల్లెట్లకు, వారి ఇళ్లపై విసిరే ఫైర్‌బాంబులకు, రాకెట్ లాంచర్లకు బాధితులుగా మారుతున్నారు. పిల్లలు తమ పాఠశాలలు, కళాశాలలు నెలల తరబడి మూతపడటం చూస్తున్నారు. వేలాది మంది ఉపాధి వెతుక్కుంటూ మణిపూర్ వదిలి వెళ్లారు, వీరిలో ఎక్కువ మంది నగరాలు, పట్టణాలలో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. విచిత్రమేమిటంటే, ఇంటికి దూరంగా ఉన్నప్పుడు వారు ఒకే వసతిని పంచుకుంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, కలిసి భోజనం చేస్తారు, ఎందుకంటే మణిపూర్ వాసులమనే బంధం వారిని కలుపుతుంది.
అన్ని సముదాయాలను నిరాయుధులను చేయాలనే పిలుపులు వస్తున్నాయి, కానీ తమ ప్రాణాలకు లేదా తమ కుటుంబం లేదా సముదాయ ప్రాణాలకు రక్షణ అవసరమైనప్పుడు ఎవరైనా తమ ఆయుధాలను ఎలా వదులుకుంటారు? ఇది ఒక భయంకరమైన విషవలయం.
భద్రతా వ్యవస్థకు సంబంధించి, పెరుగుతున్న హింసను అరికట్టడానికి ఏకైక మార్గం మరింత అణచివేత, ఆయుధాలు; మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడం పేరుతో మరింత సైనికీకరణను చేపట్టడమే.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వివిధ విదేశీ శక్తులు ప్రయోజనం పొందుతున్నాయి. ఇది పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ ప్రమాదాన్ని కూడా ప్రభుత్వం ఒక సంకుచిత రాజకీయ ఎజెండా కోసం ఆయుధంగా వాడుకుంది. చైనా పాత్రను సాకుగా చూపిస్తూ, అమెరికా, పాశ్చాత్య దేశాల జోక్యాన్ని విస్మరించి, మరింత అమెరికా అనుకూల విధానాన్ని సమర్థిస్తున్నారు. విదేశీ చొరబాటుదారులపైన పోరాటం పేరుతో, అసలైన శరణార్థులను రాజ్య అణచివేతకు లక్ష్యంగా మారుస్తున్నారు.
ఇవన్నీ కూడా దశాబ్దాల కాలంగా వివిధ సముదాయాలకు ఉన్న ఫిర్యాదుల నుండి; ఆర్థికంగా, రాజకీయంగా మణిపూర్ పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం నుండి దృష్టిని మళ్లిస్తున్నాయి.
ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వారు ఎవరూ లేరు. పార్లమెంటులో రాష్ట్రానికి ముగ్గురు ఎంపీలు ఉన్నారు, కానీ వారిలో ఎవరూ మణిపూర్‌లోని అన్ని వర్గాల తరపున మాట్లాడలేరు.
మణిపూర్ పట్ల విధానాలను నిర్ణయించడంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అత్యధిక పాత్ర పోషిస్తున్నాయి. వారి వద్ద ఉన్న ప్రధాన ఆయుధం ‘విభజించు-పాలించు’: సాయుధ జాతిపర సంస్థలను చీల్చడంలో వారు విజయం సాధించారు. ఉదాహరణకు, భారత ప్రభుత్వం 1997లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎస్‌ఎన్‌సిఎన్)తో చర్చలు ప్రారంభించింది. ఆ సమయంలో ఎస్‌ఎన్‌సిఎన్ రెండు గ్రూపులుగా విడిపోయింది. 2024 నాటికి, సుమారు 27 నాగాలాండ్ రాజకీయ సంస్థలు (అన్నీ ఎస్‌ఎన్‌సిఎన్ నుండి విడిపోయినవి కావు) ఉన్నాయని అంచనా; వీటిలో ప్రతి ఒక్కటి తామే నాగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్నాయి.
నాగా- కుకీ-జో సముదాయాలు భారత్-మయన్మార్ సరిహద్దుకు ఇరువైపులా విస్తరించి ఉండటంతో, రెండు దేశాలలో నివసించే ఈ సముదాయాల మధ్య సంబంధాలు ఉన్నాయి. దీని అర్థం తిరుగుబాటుదారులకు అంతర్జాతీయ సరిహద్దుల గుండా సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఉండటమే కాకుండా, ఆయుధాల సేకరణ, సాయుధ చర్యలకు కూడా ఆస్కారం ఉంటుంది.
ఇది రాజ్యం సైనిక చర్యలు చేపట్టటానికి దారితీస్తుంది. ఉదాహరణకు, గత ఏడాది మయన్మార్‌లోని నాగా గ్రామాలపైన భారతదేశం వరుసగా డ్రోన్ బాంబు దాడులను చేసింది; అప్పట్లో దేశాన్ని పాలిస్తున్న సైనిక ప్రభుత్వం (జుంటా) అనుమతితోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఇటువంటి సరిహద్దు దాడులు తిరుగుబాటుదారుల సరిహద్దు దాటి చేసే చర్యలను ప్రోత్సహించడం ద్వారా అప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి.
మయన్మార్ నుండి మణిపూర్‌లోకి వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
ఈ ‘విభజించు-పాలించు’ విధానం సముదాయాలను ఒకదానికొకటి వ్యతిరేకంగా విభజించే స్థాయికి విస్తరించింది, కొన్నిసార్లు ఒక సముదాయంలోని చిన్న విభాగాన్ని తీసుకుని ‘మిలీషియా’ను సృష్టిస్తోంది. ఇది లొంగిపోయిన తిరుగుబాటుదారులతో రూపొందించిన నాగా మిలీషియా కావచ్చు లేదా తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన కుకీ కమాండో యూనిట్లు కావచ్చు. అస్థిత్వ రాజకీయాలు తప్ప భవిష్యత్తు గురించి ఎటువంటి స్పష్టమైన దార్శనికత లేకపోవడం వల్ల తిరుగుబాటుదారులను తమ వైపు తిప్పుకోవడం సులభమవుతోంది. ఈ రాజకీయాలు నిష్ప్రయోజనమని నిరూపితమయ్యాయి; ఇవి ఎక్కడికీ దారితీయవు.
మణిపూర్ ప్రజల బాధలకు నేను ప్రత్యక్ష సాక్షిని: 1982లో నేను మొదటిసారిగా తంగ్ఖుల్ నాగాల నివాసమైన, అప్పుడే కొత్తగా ఏర్పాటైన ఉఖ్రుల్ జిల్లాకు వెళ్ళినప్పుడు, ప్రధాన సంఘర్షణ తిరుగుబాటుదారులకు- భారత సాయుధ దళాలకు మధ్య ఉండేది. ఆ సమయంలో, ‘సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం, 1958’ కింద సాయుధ దళాలకు అపరిమితమైన అధికారాలు ఉండటమే తమ బాధలకు కారణమని చాలామంది భావించారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌పైన అప్పట్లో అన్ని సముదాయాలు ఐక్యంగా ఉండేవి.
కానీ అందరినీ ఒకే వేదికపైకి తెచ్చిన ఈ రద్దు డిమాండ్‌ను కూడా ఒక సముదాయం స్వంతం చేసుకున్నది. మణిపూర్‌లోని మానవ హక్కుల ఉద్యమం కూడా ముఖ్యంగా ఐరోమ్ షర్మిల చారిత్రాత్మక నిరసన సమయంలో జాతి ప్రాతిపదికన చీలిపోయింది. (చూడండి: నందిత హక్సర్, షర్మిలాస్ స్ట్రగుల్ అగైన్స్ట్ మిలిటరీ రిప్రెషన్: ఏ క్రిటిక్.)
2023లో, భద్రతా బలగాలు కూడా మతపరమైన ప్రాతిపదికన విడిపోయాయి—పోలీసులు మెయితీలను రక్షిస్తే, అస్సాం రైఫిల్స్ కుకీ-జోలను రక్షించాయి. ఈ విభజన ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
ఆ తర్వాత, ఆయా సముదాయాలు ఒకదానికొకటి మరింత దూరమయ్యాయి; భద్రతా బలగాలతో కాకుండా, ఆ సముదాయాల మధ్యే ఘర్షణలు చెలరేగాయి—అయితే, భద్రతా బలగాలతో ఘర్షణలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.
1988లో, నేను సేనాపతి జిల్లాలోని నాగా గ్రామస్థుల మానవ హక్కుల ఉల్లంఘన కేసును చేపట్టాను. అప్పట్లో నా నాయకత్వంలో మరో ముగ్గురు న్యాయవాదులతో మేము నలుగురం ఒక బృందంగా పనిచేశాము; అందులో టాంగ్‌ఖుల్ నాగా, కోమ్, మెయితీ సముదాయాలకు చెందిన వారు ఉన్నారు. మేము కలిసి బాగా పనిచేసాము.
1988లో మయన్మార్ లో జాతీయ తిరుగుబాటు జరిగింది. 1990లో జరిగిన క్రూరమైన సైనిక అణచివేతలో బర్మా శరణార్థులు మణిపూర్‌కు వెల్లువగా వచ్చినప్పుడు అన్ని సముదాయాలు వారికి స్వాగతం పలికాయి. హైకోర్టు బర్మీయుల పట్ల చాలా సానుభూతితో వ్యవహరించింది.
నేను మణిపూర్‌కు తిరిగి వచ్చినప్పుడు, వివిధ సముదాయాల మధ్య పరస్పర అనుమానాలు పెరిగినప్పటికీ, సామాన్య ప్రజలు కనీసం సంతలోనూ, బహిరంగ ప్రదేశాలలోనూ ఇప్పటికీ ఆప్యాయంగా కలుసుకుంటున్నారని గమనించాను.
కానీ 2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు, బర్మా శరణార్థుల పట్ల తీవ్రమైన శత్రుత్వం కనిపించింది. కుకీలు వారిని రక్షించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యతిరేకతను ప్రదర్శించింది.
ఆ తర్వాత 2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. ఈసారి బర్మీస్ శరణార్థులు వచ్చినప్పుడు, వారికి తీవ్రమైన శత్రుత్వం ఎదురైంది. వారిలో చాలామంది ఒకే జాతికి చెందినవారు కావడంతో, ప్రభుత్వం శత్రుత్వంతో ఉన్నప్పటికీ, కుకీలు వారిని రక్షించారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు బర్మీస్ శరణార్థులను (ఇద్దరు జర్నలిస్టులు, వారి కుటుంబాలు, ముగ్గురు చిన్న పిల్లలతో సహా) భారత్-మయన్మార్ సరిహద్దులోని మోరే నుండి ఇంఫాల్‌కు రావడానికి అనుమతించాలని ఇంఫాల్ హైకోర్టు ఆదేశించినప్పటికీ, శరణార్థులందరినీ వెనక్కి పంపాలని నిశ్చయించుకున్న అస్సాం రైఫిల్స్ జోక్యం నుండి మమ్మల్ని రక్షించడానికి కమాండో యూనిట్ మాకు రక్షణగా వచ్చింది.
బర్మా శరణార్థులు ద్వేషానికి గురయ్యారు; వారిని రాక్షసులుగా చిత్రీకరించారు. మయన్మార్ శరణార్థులలో రోహింగ్యాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
2023లో నేను ఒక వీడియో చూశాను—అది నిశ్శబ్దంగా ఉన్నా చాలా భయంకరంగా ఉంది. ఇంఫాల్‌లోని లాంగోల్ పాదాల వద్ద ఉన్న ఒక ప్రభుత్వ కాలనీని సాధారణ పౌరులు రెండు అంగుళాల మోర్టార్‌తో పేల్చివేస్తున్నారు. ఎన్నో మధుర జ్ఞాపకాలతో నేను నివసించిన ప్రదేశం అది. ప్రజాస్వామిక దేశంలో శాంతి సమయంలో సాధారణ పౌరులు ఆయుధాలతో ఇళ్లను పేల్చివేయడం అత్యంత విషాదకరం.
నేను గోవాలోని నా ఇంట్లో భద్రంగా కూచుని ఒక వీడియో చూస్తున్నాను. మణిపూర్‌లోని ఇతరులు తమ జ్ఞాపకాలు, తమ ఇళ్లు, తమ భవిష్యత్తు నాశనమవ్వడాన్ని చూస్తున్నారు. నేడు, మణిపూర్ సమాజంలోని అగాధాలు లోతుగా ఉన్నాయి, అవి కందకాలు, బఫర్ జోన్ల ద్వారా విభజించబడ్డాయి, వీటిని అత్యంత అధునాతన తుపాకులతో సాయుధ బృందాలు కాపలా కాస్తున్నాయి.
కానీ మీరు గోవాలోని ఒక కేఫ్ లోపలికి వెళితే, అక్కడ ఒక ఉత్తర-తూర్పు భారతీయుల బృందం ఉల్లాసంగా గడపడం, బీరు, ఒక ప్లేట్ పోర్క్ తింటూ, వారికి మాత్రమే అర్థమయ్యే జోకులకు నవ్వుకోవడం; ఆ మెరిసే చిరునవ్వుల వెనుక దాగి ఉన్న ఒక ఉమ్మడి దుఃఖాన్ని మీరు చూసే అవకాశం ఉంది. వారు ఇకపై తుపాకుల పట్ల లేదా తిరుగుబాటుదారుల జీవితం పట్ల ఆకర్షితులు కావట్లేదు; వారు సంపాదించుకుని మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. మెజారిటీ ప్రజలకు, దీని అర్థం కుటుంబమూ, స్నేహితులతో కలిసి రెండు పూటలా భోజనం చేయడం; ఒక చిన్న ఇల్లు, తమ పిల్లల కోసం సురక్షితమైన భవిష్యత్తు. కానీ ఇంటికి దూరంగా తమ అలసిపోయిన తలలను వాల్చినప్పుడు ఈ చిన్న కలలు కూడా అసాధ్యంగా అనిపిస్తాయి, వారికి తమ సొంత ఊర్లలోని దృశ్యాలు గుర్తుకు వస్తాయి, నిస్సహాయత నుండి, గ్రామాల్లో మిగిలిపోయిన తమ ప్రియమైన వారి పట్ల ఆందోళనతో వారు కోపం వస్తుంది; అప్పుడు కన్నీళ్లు నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. వారి దుఃఖానికి, వారి బాధలకు అంతం లేనట్లు కనిపిస్తుంది. ఓదార్పుని లేదా సహాయాన్ని అందించే వారు ఎవరూ లేరు.
నందిత హక్సర్ ‘షూటింగ్ ద సన్: వై మణిపూర్ వాస్ ఎంగుల్ఫ్డ్ బై వైలెన్స్ అండ్ ద గవర్నమెంట్ రిమైన్డ్ సైలెంట్’ (స్పీకింగ్ టైగర్, 2023) పుస్తక రచయిత్రి.
తెలుగు : పద్మ కొండపర్తి
https://scroll.in/article/1092368/how-to-end-the-sufferings-of-the-people-of-manipur




