“శీనుగా టీ తీసుకురా….” వెంకట రెడ్డి కేకేసాడు.

ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు ఆ ఊరి రెడ్డి గారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు.

రెడ్డిగారింట్లో హాల్లో ఎంఆర్ఓ, ఎండిఓ, ఇఒఆర్డి, పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే  పెద్ద కులాల వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది. గుమ్మం బయట తలారి నిలబడి హాల్లోకి తొంగిచూస్తున్నాడు.

 ఎంతైనా రెడ్డిగారు రెడ్డిగారే. ఆఫీసర్ల ఆఫీసర్లే.

జవాను జవానే

ఆఖరికి తలారోడూ తలారోడే.

ఎటొచ్చి శ్రీనివాసులు మాత్రం శ్రీనివాసులు కాకుండా పోయాడు. సర్పంచు సర్పంచు కాకుండా పోయాడు. ఎందుకంటే కారణం చాలా చాలా చిన్నది. అంతే పెద్దది.

అతడు గిరిజనుడు. కులానికి ఎరుకలవాడు.  వాళ్లింట్లో మూడు తరాల్లో ఐదో తరగతి వరకూ  చదువుకుంది అతనొక్కడే.ఊరిబయట కాపురం. వృత్తి పందుల పెంపకం. భార్య ఇద్దరు పిల్లలు, ముసలి తల్లితండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెల్లు, సంసారం పెద్దదే. ఇంట్లో అందరిలోకి శ్రీనివాసులే పెద్దోడు. కాబట్టి మొత్తం కుటుంబమే అతడి పైన ఆధారపడి వుంది. ఎస్టీ కాలనీ మొత్తం కూడా అతడిపైనే ఆధారపడి వుంది.

“ శీనుగా ఎంతసేపు? లేటవుతాండాదిరా ” రెడ్డిగారు గర్జించాడు. అతడికి అదో సరదా.  ఇద్దరే ఉన్నపుడు ఒక రకంగా మాట్లాడతాడు రెడ్డి. అదే మూడో మనిషుంటే మాత్రం శ్రీనివాసులు పైన అధికారం చెలాయిస్తాడు. ఒరే అంటాడు. నీయబ్బ అని అంటాడు. నా కొడకా… అనీ అంటాడు.

“లోపలేం చేస్తాండావురా శీసుగా”

“ వస్తా ఉండా సామీ.. ఇదో… వచ్చేస్తి” వినయం కనపడేటట్లు, వినపడేటట్లు బదులిచ్చాడు.

లోపల అతనేం చేస్తాడు? రెడ్డిగారు ఇంటి మొత్తం శీనుగాడు తిరుగుతాడని, ఆ ఇంట్లో మనిషి మాదిరి అని రెడ్డిగారు గొప్పగా గొప్పలు చెప్పుకుంటూ వుంటాడు పై ఆఫీసర్లతో. అయినా అందులో నిజం లేదని చెప్పేవాళ్లకి తెలుసు, వినేవాళ్లకి తెలుసు. శీను రెడ్డిగారి ఇల్లంతా తిరుగుతాడు. నిజమే, ఇల్లంతా అంటే హాలు, వరండా మాత్రమే.

రెడ్డిగారి భార్య సునందమ్మ శీనుగాడ్ని వంటింటి గుమ్మం తొక్కనీదు. రెడ్డిగారు అతడ్ని తన గదిలోకి అస్సలు రానివ్వడు. పంచాయతీ రికార్డులన్నీ ఆ గదిలోనే వుంటాయి. అదే పంచాయితీ ఆఫీసు. అక్కడ ఆఫీసరైనా, గుమస్తా అయినా, పంచాయతి కార్యదర్శి అయినా, సర్పంచు అయినా అది రెడ్డిగారే.

వంటింటి గుమ్మం ముందు నిలుచుని సునందమ్మ అందిచ్చిన ట్రే పుచ్చుకుని జాగ్రత్తగా అడుగులేస్తూ హాల్లోకి వచ్చాడు శీను. అందరికీ వంగి టీ అందించాడు. రెడ్డిగారు తలాడిస్తూ నవ్వుతున్నాడు. అందరికీ గ్లాసులు చేరాయి.

“నువ్వు తాగేసి రాబోరా” ఆప్యాయత వొలకబోసాడు రెడ్డి.

సరే సామీ.. అనబోయాడు. సునందమ్మ మొహం గుర్తొచ్చి వొద్దు సామీ అందామనుకున్నాడు. కానీ ఆ మాటా గొంతులోనే వుండిపోయింది. అదేకాదు, అప్పుడేకాదు. చాలాసార్లు చాలా చాలా మాటలు అతడి గొంతులోనే వుండిపోతాయి. చప్పుడు చెయ్యకుండా లోపలికి నడిచాడు శీను.

“ఎదవ సంత ఎదవ సంత. ఎవుడు ఊళ్లోకొచ్చినా ఈ కొంపేనా కనపడేది. టీ నీళ్లు కావల్ల, టిఫినీలు కావల్ల,బోజనాలు కావల్ల , నా పిండాకూడు కావల్ల, ఆడికి ఈడ నా ముడ్డికింద పదారు మంది పనోళ్లు వున్నెట్లు…” సునందమ్మ గొణుగుతూనే ఉంది. ఆమె శీనుగాడికి టీ ఇవ్వనూలేదు.తాగాతావా అని అడగనూ లేదు.అలాంటి అలవాటు ఎప్పుడూ ఆ ఇంట్లో లేదు.

అంతకు మించి శీను ఆమెని టీ అడగనూలేదు. టీ తాగుతున్న వాడిలా కాస్సేపు అక్కడే వుండి ఆ తర్వాత చప్పుడు కాకుండా నడుచుకుంటూ వచ్చి హాల్లో నిలబడ్డాడు రెడ్డిగారికి చప్పుడంటే అస్సలు పడదు. చిన్న చప్పుడును కూడా  భరించలేడు, సహించలేడు. శీనునుండి ఏ చప్పుడూ రాకూడదు అని, అది తన చెవుల్లో పడకూడదు అని, పడినా తను  వినకూడదు అని రెడ్డి  అనుకుంటాడు.

“ మనం ఇంకా కొత్తగా చేసేదేముంది. రెడ్డిగారు చెప్పినట్లే చేసేద్దాం. ఎంపిపి తో నేను మాట్లాడుకుంటా. బిల్లు అయినాక మిగతా విషయాలు ఏఈ తో మీరే మట్లాడుకోండి” ఎండిఓ రెడ్డిగారికి ఏదో హామీ ఇచ్చేసాడని మాత్రం అర్థం అయింది శీనుకు. అంతకి మించి అర్థం కాలేదు.

అతడికి అర్ధంకానిది రెడ్డిగారికి అర్థమైంది. రెడ్డిగారికి అర్థమైంది ఎండిఓకి  అర్థమైంది. వాళ్లిద్దరికీ అర్ధమవ్వాల్సింది అర్ధమైనాక ఇక శీనుకు అర్థమైతే ఎంత? అర్థం కాకపోతే ఎంత?

సిగిరెట్లు వెలిగాయి. కబుర్లు మొదలైనాయి, రాజకీయాలు, వ్యాపారాలు, సినిమాలు, కాలేజీలు ఏమిటేమిటో మాట్లాడుకుంటున్నారు పెద్దమనుషులు. అవన్నీ శీను ఎదుట మాట్లాడుకుంటున్నారు కానీ, అసలు విషయం ఏమిటనేది మాత్రం ఎవరూ అతడికి తెలియనివ్వటం లేదు.

తెల్ల కాగితంపైన ఖాళీ రిజిష్టర్ల పైన సంతకాలు పెట్టమంటాడు రెడ్డి. అతడు చెప్పిన చోట శీను సంతకం పెట్టాల్సిందే. ఎందుకూ అని ఇతడు అడగడు. ఎందుకో ఏమిటో ఎప్పుడూ రెడ్డి చెప్పడు.అదే అక్కడ ఆనవాయితీ.

ప్రతి పనికి గ్రామసభ ఆమోదం వుండాలని, టంచనుగా తొంబైరోజులకొక సారైనా పంచాయతి సమావేశం జరపాలని  అంటుంది ప్రభుత్వం.

 పంచాయతిలో ఏపని జరగాలన్నా, నిలిపేయాలన్నా అది రెడ్డిగారిష్టం అంటారు అదే  ప్రభుత్వానికి చెందిన ఆఫీసర్లు. పంచాయతి పరిధిలో ఏం జరిగినా సర్పంచుకు తెలపాలని అంటుంది చట్టం.రెడ్డికి చెపితే చాలంటారు ఆఫీసర్లు. సర్పంచుకు, పంచాయతి ఆఫీస్ కి  వచ్చే తపాలు కూడా రెడ్డి ఇంటికే వస్తుంది.

ఊర్లో తాగటానికి నీళ్లకు కరువు.

వానల్లేవు. చెరువులు బావులు ఎండిపోయాక నీళ్లకు కటకట మొదలైంది.

జనం ఆర్జీలిచ్చారు, ధర్నాలు చేసారు. పేపర్లో వార్తలు, ఫోటోలు యథావిధిగా వచ్చాయి. వారం లో ఇట్లాంటివి వంద వార్తలొస్తాయి, కాబట్టి ఆఫీసర్లూ పట్టించుకోలేదు.

మామూలుగా అయితే ఊర్లో జనం, కాలనీ జనం ఏం కావాల్సివచ్చినా రెడ్డిగారినే అడగటం ఆనవాయితి. ఆ రకంగానే అడిగారు. అయినా పనికాలేదు. బోరు మంజూరు. కాలేదు. జనం రెడ్డిగారిని తిట్టలేక శీనును తిట్టడం మొదలెట్టారు. గౌరవానికి, ఉనికికి, గుర్తింపుకి పనికి రాని సర్పంచు పదవి తిట్లు తినడానికి మాత్రం పనికొచ్చింది.

మండల కేంద్రంలోని దళిత, గిరిజన  సంఘాలు శీనును కలిసాయి. వాళ్ల సలహా ప్రకారం ఎంఆర్డీ ని, ఎండిఓ ని జిల్లా కలెక్టర్ని కలుసుకున్నాడు. కాళ్లావేళ్లా బడ్డాడు. ఆర్జీలు రాయించి ఇచ్చుకున్నాడు. కాళ్లు అరిగినాక, కష్టార్జితం కొంత కరిగినాక పై అధికార్లు కరుణించారు.

బోరు మంజూరైంది.

జియాలజిస్టులు వచ్చారు. సర్వే చేసారు. ఎస్టీ కాలనీలో నీల్లు పడతాయని తేల్చి చెప్పారు. అదే మింగుడు పడలేదు రెడ్డిగారికి, ఊర్లో జనాలకి. ఊర్లో బోరుంటే ఎస్టీ కాలనీ వాళ్లు నీళ్ల కోసం ఊర్లోకి వస్తారు. పెద్ద కులమోళ్లు నీళ్లు పట్టుకున్నాక కాలనీ వాళ్లు పట్టుకోవచ్చు. ఊర్లో కొళాయిలున్నాయి. కానీ కాలనీలోనే ఇప్పడిదాకా ఒక కొళాయిలేదు. రెడ్డి వేయించలేదు. సర్పంచు వేయించుకోలేకపోయాడు.

 కాలనీలో వుండేవాళ్లు ఎవరు? బుట్టలు అల్లేవాళ్లు, పందులు పెంచుకునేవాళ్లు, ఉప్పు, ఎర్రమట్టి, కట్టెలు అమ్ముకునేవాళ్లు, బాతులు మేపేవాళ్లు, పొద్దంతా కష్టపడితే తప్ప పొద్దు గడవని వాళ్లు, అక్కడ కుళాయి కనెక్షనే ఇవ్వటం వొద్దనుకున్న రెడ్డి కాలనీలో బోరువేయటానికి యెట్లా ఒప్పుకుంటాడు ? అస్సలు  వద్దనుకున్నాడు. ఇప్పుడు రెడ్డిగారింట్లో సమావేశం కూడా అదే. కాలనీలో బోరు వేయడం అనివార్యకారణాల వల్ల కుదరనందువల్ల బోరు ఊర్లో వేయించటానికి గానూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని పంచాయితి అమోదించినట్లు శీను… సర్పంచు హోదాలో సంతకం పెట్టాలి.

“శీనుగా తెల్ల కాగితాలు, మినిట్స్ బుక్కు తేరా..” రెడ్డి ఆదేశించాడు గంభీరంగా. హాల్లోంచి కదిలి ఇంట్లోపలికి వస్తూ.. ఆలోచిస్తున్నాడు శీను. సునందమ్మ తెల్ల కాగితాలు, రిజిష్టరు తెచ్చి ఇచ్చింది. ఆలోచిస్తూనే శీను హాల్లోకి వచ్చాడు పంచాయతి కార్యదర్శి ఏదో రాయబోతే రెడ్డి అతడ్ని వారించాడు.

 ” ఏం రామాయణమంతా రాయాల్నా? యాడ సంతకం పెట్టాల్నో గుర్తెట్టు చాలు, శీనుగా సంతకం పెట్రా..”.

శీను మెదడంతా గజిబిజిగా ఉంది.కొత్తగా పరిచయం అయిన జిల్లా దళిత, గిరిజన,కుల విమోచన సంఘాల  నాయకుల మాటలు, ప్రోత్సాహం గుర్తొచ్చాయి. మరచిపోయిన ఆత్మగౌరవం ఏదో గుర్తొస్తున్నట్లే వుంది. కాలనీకి  వూరికి మధ్య ఉన్న దూరం గురించి ఆలోచిస్తూ, తరతరాల అవమానాలు గుర్తుకు వస్తుంటే ,  తదేకంగా తెల్లకాగితాల వైపే చూస్తూ నిలబడ్డాడు.

రెడ్డి శీను వైపు అయోమయంగా చూస్తున్నాడు. శీను తల తిప్పలేదు, కదలలేదు.

ఆ కొన్ని  క్షణాల విరామాన్ని  కూడా రెడ్డి అస్సలు  భరించలేకపోతున్నాడు. అతడికి ఏదో తెలియని  ఇబ్బందిగా కష్టంగా అసౌకర్యంగా  అనిపించింది.

గాలికి కదులుతూ ఖాళీ కాగితాలు చప్పుడు చేస్తున్నాయి.

ఎప్పుడూ లేంది ఆ చప్పుడు,  రెడ్డిని కొత్తగా భయపెడుతోంది.

5 thoughts on “చప్పుడు

  1. బలమైన కథాంశం. ఇప్పటికీ ఊళ్ళలో యిదే పరిస్థితి. వాస్తవికంగా చెప్పుకువచ్చారు ప. బాలాజీ. కథనంలో తగినంత కవితాత్మకత, ఘాటైన వ్యంగ్యం కథను శక్తిమంతం చేసాయి. ముగింపు మెరుపే!

Leave a Reply