ఛత్తీస్‌గఢ్‌లో భారత రాజ్యం చేపట్టిన జాతి విధ్వంసక సైనిక ప్రాజెక్టు ఆపరేషన్ కగార్‌లో ఫిబ్రవరి 9నాడు 31 మంది మావోయిస్టులను హత్యచేసింది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల చట్టాతీత హత్యలను ఖండిస్తూ, సుప్రీంకోర్టు, “రిపబ్లిక్ తన సొంత పిల్లలను తానే చంపుకోవడానికి మేం అనుమతించలేం” అని అన్నది. తన 76వ వార్షికోత్సవ సంవత్సరంలో (2025), ‘మావోయిస్టులపై యుద్ధం’ పేరుతో  మావోయిస్టులని చెబుతూ భారత గణతంత్ర రాజ్యం ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 81 మంది పౌరులను చంపింది. ఫిబ్రవరి 1న, బీజాపూర్‌లో ఎనిమిది మంది ఆదివాసీ గ్రామస్తులను మావోయిస్టులుగా ముద్రవేసి చంపారు.

రెండు రోజుల క్రితమే 2025 ఫిబ్రవరి 9 నాడు ఛత్తీస్‌గఢ్‌లో చంపిన 31 మంది పౌరులలో  20 మంది పురుషులు 11 మంది మహిళలు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లుగా నిర్ధారణ అయిన 2013 ఎడెస్మెట్ట, 2012 సర్కెగూడ ఘటనలు వంటి గత ఉదాహరణలను బట్టి చూస్తే, వారు మావోయిస్టులా లేదా నిరాయుధులైన గ్రామస్తులా? అనేది ఇంకా తెలియదు.

ఎడెస్మెట్టాలో, నలుగురు మైనర్లతో సహా 8 మంది ఆదివాసీలను, సర్కెగూడలో ఆరుగురు మైనర్లతో సహా 17 మంది ఆదివాసీలను మావోయిస్టులని అబద్ధపు ఆరోపణలు చేసి, పథకం ప్రకారం జరిగిన ఎన్‌కౌంటర్లలో చంపేసారు. తరువాత జరిగిన న్యాయ విచారణలో వారు మావోయిస్టులు కాదని,  గ్రామస్తులని నిర్ధారణ అయింది.

2025 ఫిబ్రవరి 9 నాటి ఘటనలో, ఇద్దరు సైనికులు ‘అమరవీరులయ్యారు’ అని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఇదొక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఈ గణతంత్రానికి తన స్వంత సిబ్బందినే హత్యచేసి ఆ విషయాన్ని కప్పిపుచ్చిన చరిత్ర ఉంది.

సర్కెగూడ సంఘటనలో, ప్రభుత్వం మొదట్లో ‘ఎన్‌కౌంటర్’ కథనాన్ని సమర్థించడానికి మావోయిస్టులు ఒక సైనికుడిని చంపారని చెప్పింది. కానీ, తరువాత జరిగిన దర్యాప్తులో ప్రభుత్వ బలగాలు తమలో తాము జరుపుకున్న కాల్పుల్లో ఆ సైనికుడు చనిపోయాడని తేలింది.

ప్రభుత్వ నివేదికల ప్రకారం, గత సంవత్సరం (2024) జరిగిన ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు మరణించారు.

2024లో పోరాటయోధులు కాని కొంతమంది గ్రామస్తులను చంపి మావోయిస్టులుగా ప్రకటించిన తేదీలు ఇలా ఉన్నాయి .

జనవరి 19న ఇద్దరు బాలికలు, ఒక యువకుడు మరణించారు. జనవరి 27న పోలీసు కస్టడీలో ఒక రైతు, ఫిబ్రవరి 25న ముగ్గురు, మార్చి 27న నలుగురు గ్రామస్తులు, మరణించారు. ఏప్రిల్ 2న ఒక చెవిటి, మూగ బాలికతో సహా ఇద్దరు గ్రామస్తులు మరణించారు. మే 11న పన్నెండు మంది, నవంబర్ 8న ఇద్దరు, డిసెంబర్ 11న జరిగిన రెండు వేర్వేరు ఘటనలలో ఆరుగురు, డిసెంబర్ 12న మరో ఆరుగురు గ్రామస్తులు మరణించారు.

219 మందిని చంపినట్లు ప్రభుత్వం అంగీకరించింది, కానీ వాస్తవానికి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువ. జనవరి 1న 6 నెలల పసికందు మంగ్లీ సోడిని, మే నెలలో మోర్టార్ షెల్స్ దాడిలో మరణించిన పిల్లలను ప్రభుత్వం తన లెక్కలో చేర్చలేదు. ఎందుకంటే ప్రభుత్వం తన సొంత బలగాలు చేసిన హత్యలకు మావోయిస్టులపై నిందను మోపింది.

అంతేకాకుండా, మరణించిన వారి గుర్తింపులను నమోదు చేయడంలో అంటే వారు నిరాయుధులైన గ్రామస్తులా లేదా సాయుధులైన మావోయిస్టులా అని ధృవీకరించడంలో మానవ హక్కుల కార్యకర్తలు పరిమితులను ఎదుర్కొంటున్నారు. మావోయిస్టులను చంపినప్పుడు కొందరు మౌనంగా ఉంటారు; గ్రామస్తుల మాదిరిగా కాకుండా, మావోయిస్టులు పోరాటంలో చనిపోయారని వాదిస్తారు.

ఆదివాసీలపై హింసకు పాల్పడే సైనికులు చనిపోతే వారిని అమరవీరులని అంటుంటే మనం ఎవరి కోణం నుండి మాట్లాడుతున్నాం? ఆదివాసీ ప్రాంతాల్లో ఎందుకని సైన్యాన్ని మోహరించారు?

భారత గణతంత్ర రాజ్యం తన స్వంత పిల్లలపై, ముఖ్యంగా ఆదివాసీలపై కార్పొరేట్ ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ యుద్ధం, జాతి నిర్మూలనకు తక్కువ కాదని, ఆదివాసీల ప్రయోజనాల కోసం ఈ ప్రాంతం సైనికీకరించబడలేదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.

మావోయిస్టులను విడిగా చూడలేం. వారు ప్రజా పోరాట ప్రతినిధులు. ప్రజాస్వామిక నిరసనలను అణచివేసి, పసిపిల్లలను చంపే ఫాసిస్ట్ ప్రభుత్వ శక్తులను ప్రతిఘటించే హక్కు ఈ ప్రజలకు లేదా? శాంతియుత మార్గాలు విఫలమైనప్పుడు, వారు ఆయుధాలు చేపట్టాల్సి వస్తుంది. సాయుధ మార్గాన్ని రాజ్యం వారిపై రుద్దుతుంది. కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి రూపొందించిన రాజ్య జాతి విధ్వంసక ఆశయాలకు వారి ప్రతిఘటన మాత్రమే అడ్డుగా నిలుస్తుంది. ఈ దేశభక్తులు ప్రజలను, సహజ వనరులను దోపిడీ నుండి కాపాడుతున్నారు.

రాజ్యాంగాన్ని బుల్లెట్ ప్రూఫ్ లాగా సమర్థించాలని, ‘శాంతియుత నిరసనలు’ అని పిలిచేవాటికి మద్దతు ఇవ్వాలని చెప్పేవారు, రాజ్యాంగాన్ని సమర్థించినందుకు ఆదివాసీ కార్యకర్త సోని సోరి యోనిలో ఆరు అంగుళాల రాయిని చొప్పించారని దయచేసి గుర్తుంచుకోండి.

ప్రజాస్వామ్య నిరసనలను నిర్వహించినందుకు మూల్‌వాసీ బచావో మంచ్‌ను నిషేధించారు. చట్టపరమైన చట్రంలో పనిచేసినందుకు సునీతా పోట్టం, సర్జు టేకం వంటి కార్యకర్తలు జైలులో ఉన్నారు.

2017లో, ఐపీఎస్ అధికారిణి ఇందిరా కళ్యాణ్ ఎలెసెలా నారాయణపూర్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్నప్పుడు మానవ హక్కుల కార్యకర్తలను వాహనాలతో ఢీకొట్టాలని బహిరంగంగా అన్నది.

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఛత్తీస్‌గఢ్‌లో చావుకు గురవ్వాలంటే మీ దగ్గర ఆయుధం ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా సహజ వనరులను తవ్వి, తరలించాలని కోరుకునే కార్పొరేట్‌లకు ఆదివాసీల ఉనికి, వారి ఏ రకమైన క్రియాశీలత అయినా అడ్డంకిగా ఉంది.

Leave a Reply