ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద ( సిఎస్‌పిఎస్ఎ) మూలవాసి బచావో మంచ్ (ఎంబిఎమ్)ని ‘చట్టవ్యతిరేకమైన సంస్థ’గా ప్రకటిస్తూ 2024నవంబర్ 8 నాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది .
చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ)చట్టం (యుఎపిఎ)- 1967 లాగానే, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం భావించే సంస్థలను నిషేధించడానికి సిఎస్‌పిఎస్ఎ ప్రభుత్వానికి అధికారాన్నిస్తుంది.
ఈ చర్య చేపట్టడానికి ఆ నోటిఫికేషన్ రెండు కారణాలను పేర్కొంది: ఒకటి, “మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల “లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మంచ్ వ్యతిరేకిస్తోంది; రెండు, తమ భూముల్లో సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తోంది.
న్యాయస్థానం నిర్ధారణ చేయకుండా, తమపై నిషేధానికి వ్యతిరేకంగా ఎంబిఎమ్‌కు వివరణనిచ్చే అవకాశం లేకుండా, ఒక సంవత్సరం పాటు, ఈ ఏకపక్ష నిషేధం తక్షణమే అమలులోకి వస్తుంది. ఇలా మంచ్‌ను నిషేధించడంలో రాజ్యాంగ చట్టమూ, నేరవిచారణా అనే రెండు ప్రక్రియల హానికరమైన వినాశనం కనిపిస్తుంది. మొదటిది- ప్రజాస్వామిక నిరసన, సమావేశాలని ‘చట్టవ్యతిరేక కార్యకలాపాలతో’ కలుపడం; రెండవది-వివిధ రాష్ట్రాల్లోని యుఎపిఎ, ప్రజా భద్రతా చట్టాల ప్రకారం అపరాధీకరణకు దారి తీయడం.
ఈ చట్టాల ప్రకారం ‘చట్టవ్యతిరేకమైన కార్యకలాపాల’ పరిధిలో ఎంబిఎమ్‌పై నిషేధానికి గల కారణాలను ఈ వ్యాసంలోని మొదటి రెండు భాగాలు విశ్లేషిస్తాయి.
రెండవ హానికరమైన ఉపసంహరణ; న్యాయమైన విచారణ ప్రక్రియ జరిగే హామీ లేకుండా నేర న్యాయ వ్యవస్థ వెలుపల, విచారణల ద్వారా సమావేశాలపై శిక్షాత్మక జరిమానాలు విధించడానికి రాజ్యానికి అనుమతినివ్వడం. ఈ అంశం మూడవ భాగంలో ఉంటుంది.
తమ భూమి, అటవీ హక్కులను ప్రభావితం చేసే విషయాల్లో సమ్మతినిచ్చే, సంప్రదింపులు జరిపే రాజ్యాంగపర, చట్టపరమైన హక్కులను ఐదో షెడ్యూల్ పరిధిలోని ఆదివాసీలు, షెడ్యూల్ తెగలకు ఉంటుంది. ఇటీవలి కాలంలో భూమి, అటవీ చట్టాలకు చేసిన చట్ట సవరణల ద్వారా, ప్రస్తుతం న్యాయపర శూన్యతలో వున్న రక్షణ, భద్రత (పోలీసింగ్, సెక్యూరిటైజేషన్)లకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వీటిని మరింతగా అధిగమించింది.
స్థానిక, అంతర్జాతీయ చట్టాల ప్రకారం తన బాధ్యతలను నిలబెట్టుకోవడానికి, పౌరులతో ప్రజాస్వామిక సంబంధాలను నెరవేర్చడానికి నిరసనలు, ప్రజా సమీకరణలు రాజ్యానికి ఒక ఆహ్వానంలాగా పనిచేస్తాయి.
ఈ సందర్భంలో, సిఎస్‌పిఎస్ఎ కింద ఎంబిఎం ను నిషేధించడం రాష్ట్రంలో ప్రజాస్వామిక నియమాలు, ప్రభుత్వ విధానాల సమస్యాత్మక తొలగింపును సూచిస్తుంది; ఇది నిషేధాన్ని ఉపసంహరించుకోవడానికి మాత్రమే కాకుండా, సిఎస్‌పిఎస్ఎ ని రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి కూడా కారణమవుతుంది.
నిరసన ఒక ప్రజాస్వామిక పద్ధతి
సిఎస్‌పిఎస్ఎ పీఠికలో చెప్పినట్లుగా “వ్యక్తులు, సంస్థల నిర్దిష్ట చట్టవ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా నిరోధించడం” కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని 2005లో అమలులోకి తెచ్చింది.
చట్టవ్యతిరేకమైన కార్యకలాపాన్ని సెక్షన్ 2 (e) లో స్థూలంగా మూడు పట్టికలలో నిర్వచించారు; ప్రజా భద్రతకు ముప్పు; చట్టపరమైన సంస్థలకు అవిధేయత; హింసకు ప్రేరేపించడం. చట్టవ్యతిరేకమైన సంస్థల గురించి సెక్షన్ 2(ఎఫ్) లో నిర్వచించారు – ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది లేదా తన లక్ష్యంగా ప్రకటిస్తుంది.
ఏ విధమైన హింసాత్మక చర్యలలో ఎంబిఎం పాలుపంచుకున్నట్లు లేదా హింసకు ప్రేరేపించినట్లు 2024 నవంబరు 8వ తేదీ నాటి నోటిఫికేషన్‌లో రాయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పనులకు వ్యతిరేకత తెలపడం చట్టవ్యతిరేకమైన చర్య ఎలా అవుతుంది అని మనం ప్రశ్నించాలి. ఈ ‘వ్యతిరేకత’, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందా? లేదా, చట్టపరమైన సంస్థలకు, స్వతహాగా, అవిధేయతగా ఉందా?
విద్య, ఆరోగ్యం, సాముదాయక భూములు, అడవులపై ప్రజల హక్కులను పరిరక్షించే అభివృద్ధి పథకాలను అమలు చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని 2024 నవంబరు 22 నాడు చత్తీస్‌గఢ్ ప్రభుత్వ గృహమంత్రిత్వ శాఖకు ఇచ్చిన విజ్ఞప్తిలో ఎంబిఎం కమిటీ మెంబర్లు నొక్కి చెప్పారు.
రహదారులు, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి మౌలిక సదుపాయాలు రవాణా సదుపాయాలు ప్రజలకు ఉపయోగపడవని, వనరుల వెలికితీత వల్ల, పర్యావరణ విధ్వంసానికి, షెడ్యూల్డ్ తెగల ప్రజలు తమ ఐదవ షెడ్యూల్ భూముల నుండి భారీగా నిర్వాసితులవడానికి దోహదం చేస్తాయి అని వారు వివరిస్తున్నారు.
తమ అటవీ హక్కులను, అభివృద్ధిని ప్రభావితం చేసే విషయాలపై గ్రామసభల సమ్మతి, సంప్రదింపుల హక్కులను నిరంతరం ఉల్లంఘించడాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు.
(షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం-1996 (పెసా); షెడ్యూల్ తెగలు- ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు (హక్కుల గుర్తింపు) చట్టం (ఎఫ్ఆర్ఎ)-2006; భూస్వాధీనం-పునరావాస, పున:స్థిరీకరణ చట్టం-2013 (ఎల్ఎఆర్ఆర్)లో వున్న భూమి కొనుగోలులో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కులు; సుప్రీంకోర్టు 2013 నియంగిరి తీర్పులో భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కింద వున్న ఈ హక్కులను దృఢంగా గుర్తించారు.
చట్టానికి, చట్ట సంస్థల అధికారానికి అవిధేయత చూపడం మాట అటుంచి, రాజ్యాంగం, వివిధ కేంద్ర, రాష్ట్ర చట్టాల్లో పొందుపరిచిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని ఎంబిఎం నిరసన, సమావేశాలు పిలుపునిస్తున్నాయి. ఇక్కడ నిరసన అనేది అభివృద్ధి ప్రాధాన్యతలపై ప్రజాస్వామిక అమలుకు ఆహ్వానం; “పై నుండి” నిర్ణయించిన విధానాల బలవంతపు అమలుకు ప్రతిఘటన.
ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభల సమ్మతి, సంప్రదింపులు, సుస్థిరమైన అభివృద్ధి హక్కులను ఉల్లంఘిస్తోందనేది మాత్రమే కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ, పారిశ్రామిక అభివృద్ధికి అయ్యే దారుణమైన ఖర్చులను ఆదివాసీలకు బదిలీ చేశాయి.
‘మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల’లో జరిగే సంఘర్షణలకు, తిరుగుబాటుకు ఇది మూలకారణమని ప్రభుత్వాలు ఎప్పటినుంచో అంగీకరించిన వాస్తవం. అయితే ఇది హక్కుల ఉల్లంఘనను విమర్శలేకుండా అంగీకరించడం కాదు; ఈ చారిత్రక అన్యాయాలు కాలక్రమేణా ప్రజాస్వామ్య సమీకరణలకు దారితీశాయని, పెసా, అటవీ హక్కుల చట్టం, భూసేకరణ, పునరావాసం, పున:స్థిరీకరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు (ఎల్‌ఎఆర్‌ఆర్) చట్టం-2013లకి సవరణలు చేయడంతో ముగిసాయని గుర్తించడం.
తీవ్రవాద నిరోధక చట్టాల కింద ‘చట్టవ్యతిరేకమైన కార్యకలాపాల’పేరుతో ప్రజాస్వామిక సమీకరణను గందరగోళానికి గురిచేయడం; ఛత్తీస్‌గఢ్‌లో గనుల తవ్వకాల అభివృద్ధి ప్రాజెక్టులను సైనికీకరించడం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
చారిత్రాత్మకంగా, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)లో క్రోడీకరించిన సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం, కుట్ర, చట్టవ్యతిరేకమైన సమావేశాలు మొదలైన వాటికి సంబంధించిన నిబంధనల ద్వారా భారతదేశ రాజ్యం ప్రజాస్వామిక పద్ధతుల్లో సభజరుపుకోవడాన్ని, సంస్థలు ఏర్పరచుకోవడాన్ని నేరంగా పరిగణించింది. ఇప్పుడు, అదే లక్ష్యాన్ని సాధించేందుకు రాజ్యపు కఠినమైన తీవ్రవాద నిరోధక పాలనలో తీవ్రమైన మార్పును చూస్తున్నాం.
2019-20లో పౌరసత్వ హక్కుల కోసం జరిగిన ప్రజాస్వామిక ఉద్యమాలను యుఎపిఎ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలుగా నేరపూరితం చేయడంవల్ల ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్, ఇంకా పలువురు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
2021 జనవరిలో గణతంత్ర దినోత్సవ ర్యాలీల తరువాత రైతుల నిరసనలపైన యుఎపిఎ కింద ఇలాంటి (ఎఫ్ఐఆర్‌లు) నమోదు అయ్యాయి; అయితే ఎవరినీ అరెస్టు చేయలేదు. 2021 ఆగస్టులో పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి ఈ విషయాన్ని నిరాకరించాడు. సంస్థాగత నిషేధాన్ని విధించారు కాబట్టి సిఎస్‌పిఎస్ఎ క్రింద ఎంబిఎమ్ పై విచారణ మరింత తీవ్ర స్థాయిలో ఉంటుంది; చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వ్యక్తులపై కేవలం విచారణ మాత్రమే జరగదు.
ప్రజా అభద్రతా గాథ
ఛత్తీస్‌గఢ్‌లో ఐదో షెడ్యూల్‌లోని భూముల సైనికీకరణ, భద్రతా ఏర్పాట్లు వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఎంబిఎం పై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ చర్యలు సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎంబిఎం ప్రజలను సమీకరించింది అని 2024 నవంబరు 8వ తేదీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిషేధానికి సంబంధించిన రెండో కారణానికి దారితీస్తాయి.
2019 నుండి బస్తర్‌లో 250కి పైగా సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి చెప్పాడుడు; మరో యాభై ఏర్పాటు చేస్తామని 2024 ఫిబ్రవరిలో బస్తర్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రకటించాడు. నిర్దిష్ట లెక్కల ప్రకారం, ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రతి తొమ్మిది మంది పౌరులకు ఒక భద్రతా అధికారి ఉన్నాడు.
2021లో సిలంగేర్‌లో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపినప్పుడు, ముగ్గురు ఆదివాసీ పురుషులు, ఒక మహిళ మరణించడంతో, ప్రజా సమీకరణలు ఊపందుకోవడం ప్రారంభించి సెక్యూరిటీ క్యాంపులకు అక్కడక్కడ ప్రతిఘటన మొదలైంది.
నక్సలిజాన్ని ఎదుర్కోవాలన్న ఉద్దేశ్యంతో ఈ క్యాంపులను ఏర్పాటు చేసినప్పటికీ, ఈ క్యాంపులు ప్రజల్లో అపారమైన అశాంతిని సృష్టించాయని ప్రజలు చెబుతున్నారు. 2024లో విడుదల చేసిన ఒక స్వతంత్ర నిజనిర్ధారణ నివేదిక క్యాంపుల విస్తరణ, డ్రోన్ దాడులు, గ్రెనేడ్ కాల్పులు, చట్టాతీత హత్యల మధ్య వుండే ప్రత్యక్ష సంబంధాన్ని వివరిస్తుంది.
2024 ప్రథమార్థంలోనే 141 ‘ఎన్కౌంటర్లు’ జరిగాయి, ఇవి విజయవంతమైన మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలుగా ప్రముఖ మీడియాలో ప్రసారం చేసారు. ఈ ఆరోపణలు సరియైనవేనని నిర్ధారించడానికి ఎఫ్ఐఆర్‌ల నమోదు లేదా విచారణ కమిషన్‌లను ఏర్పాటు చేయలేదు.
ఈ సెక్యూరిటీ క్యాంపుల స్థాపనకు చట్టపరమైన సమ్మతి వుండాలని ఎంబిఎమ్ చేస్తున్న ప్రజా సమావేశాలు పట్టుబడుతున్నాయి. 1861 పోలీసు చట్టం ప్రకారం, ఇతర క్రిమినల్ చట్టాలతో పాటు ‘వలసకాలపు చట్టాలను మార్చని’ చట్టంలో, పోలీసు బలగాల మోహరింపుకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు సంపూర్ణ అధికారం ఉంటుంది.
నేర విచారణలు, నేర విచారణను నియంత్రించే క్రిమినల్ న్యాయ వ్యవస్థ లాగా కాకుండా, ఈ రకమైన పోలీసు చర్య మేజిస్ట్రేట్‌లు లేదా సెషన్స్ జడ్జీలు వంటి న్యాయపరమైన అధికారులచే ముందస్తు లేదా తరువాతి వాస్తవ సమీక్షకు లోబడి ఉండదు.
ఏదేమైనా, ఈ క్యాంపులు ఆదివాసీల సాంప్రదాయిక భూమి, అడవులలో ఏర్పాటు చేయడం వల్ల, ఐదవ షెడ్యూల్, పెసా, అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ సభ ముందస్తు అనుమతి తీసుకోవాలి లేదా సంప్రదింపులు జరపాలి. భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల కోసం, ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదం ప్రభావిత ప్రాంతాల కోసం అటవీ, పర్యావరణ క్లియరెన్స్ నుండి మినహాయింపులను, అటవీ పరిరక్షణ చట్టానికి, ఇతర పర్యావరణ, అటవీ చట్టాలకు ఇటీవల చేసిన సవరణలతో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ఫలితంగా, ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న సెక్యూరిటీ క్యాంపులకు సంబంధించి భూమి, అడవులు లేదా పర్యావరణానికి సంబంధించిన అన్ని చట్టపరమైన విధానాల ప్రకారం, శాసనసంబంధ, న్యాయపర లేదా ప్రజాస్వామిక పర్యవేక్షణ ఏ మాత్రమూ లేదు.
ఇది రాజ్యాంగ క్రమానికే కాకుండా ఆదివాసుల హక్కులపై ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ (యుఎన్‌డిఆర్‌ఐపి- యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పేపుల్స్) కింద భారతదేశపు అంతర్జాతీయ కట్టుబాట్లకు కూడా ప్రత్యక్ష విరుద్ధం. ఆ డిక్లరేషన్‌లోని ఆర్టికల్ 30 ప్రకారం స్థానిక ప్రజల భూములను సైనికీకరణ చేయకూడదు; భద్రతకు సంబంధించిన కార్యకలాపాల కోసం వారి భూములను ఉపయోగించడం కోసం స్థానిక ప్రజల ప్రాతినిధ్య సంస్థలతో ముందస్తు సంప్రదింపులు జరపాలి అని వుంది.
చట్టవ్యతిరేక చట్టాల దృశ్యం:
ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా పోలీసులు చేపట్టిన ఈ చర్య కథనం సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాకుండా సిఎస్‌పిఎస్ఎ కింద ఎంబిఎంను నిషేధించడంలో కూడా కనబడుతుంది. 2024 నవంబర్ 8న గెజిట్లో అధికారికంగా నోటిఫై చేయడానికి తొమ్మిది రోజుల ముందు, అంటే 2024 నవంబర్ 18న అనధికారిక వాట్సప్ ఛానెల్‌లోనూ; ఎంబిఎం నోటీసు తీసుకోవడానికి 19 రోజుల ముందే, 2024 అక్టోబర్ 30 నాడు నిషేధించే లేఖను ఛత్తీస్‌ఘఢ్ ప్రభుత్వం జారీ చేసింది.
నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి ముందు, ప్రభుత్వం ఏ స్వతంత్ర అధికారానికి లేదా బాధిత వ్యక్తులకు కారణాలను చెప్పలేదు. ఏ న్యాయమూర్తీ కూడా ఆ నిషేధానికి ఆధారాలను సమీక్షించలేదు లేదా అందుకు గల అంశాలను చూడలేదు.
ప్రభావిత సంస్థకు చెందిన ఏ ప్రతినిధికీ నోటీసు ఇవ్వలేదు; తమ సమర్థనకు లేదా నిషేధానికి వ్యతిరేకంగా వివరణనివ్వడానికి కానీ అవకాశం ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ, ఎంబిఎమ్ వెంటనే తన కార్యకలాపాలను నిలిపివేయాలి; సంస్థతో అనుబంధంగా వున్న వారందరూ, సభ్యులయినా, కాకపోయినా, సిఎస్‌పిఎస్ఎ సెక్షన్ 8 ప్రకారం వెంటనే అరెస్టు అవచ్చు, నేర విచారణకు గురి కావచ్చు.
ఇలాంటి ఏకపక్ష, నిరంకుశ చర్యలు తీసుకోవడానికి చట్టమే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. సెక్షన్ 3(1) ప్రకారం, ఒక సంస్థ చట్టవిరుద్ధం అని ప్రభుత్వం ఒక ‘అభిప్రాయాన్ని’ ఏర్పరచుకుంటే చాలు; కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆ విషయాన్ని ప్రకటించవచ్చు.
సెక్షన్ 3(2) ప్రకారం, నోటిఫికేషన్‌లో నిషేధానికి కారణాలు పేర్కొనాలి, కానీ అందుకు ఆధారపడిన (అంశాలు)సామాగ్రి కాదు. ప్రజా ప్రయోజనాలదృష్ట్యా ఆ కారణాలను కూడా దాచవచ్చు. ప్రజా ప్రయోజనాన్ని నిర్వచించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది.
సెక్షన్ 3(3) ప్రకారం ప్రభుత్వం ఆ సంస్థ కార్యనిర్వాహక సభ్యులకు నిషేధించామనే విషయం వ్యక్తిగతంగా తెలియజేయాలి లేదా కనీసం ఒక స్థానిక వార్తాపత్రికలో ప్రచురించాలి. ఈ కేసులో అలా చేశారా లేదా అనేది స్పష్టంగా లేదు; కానీ అలా చేయలేదనే అనిపిస్తోంది.
ఈ విషయంలో, సిఎస్‌పిఎస్ఎ న్యాయ ప్రక్రియ అనే ముసుగుని కూడా వదలేస్తుంది; అధ్యాయం II లోని నిషేధ నిబంధనలను యుఎపిఎ కనీసం సమర్థిస్తున్నట్లు నటిస్తుంది. యుఎపిఎ సెక్షన్ 3 ప్రకారం, అధికారిక గెజిట్ ద్వారా నిషేధాన్ని తెలియజేసే విధానం ఒకేలా ఉంది; హైకోర్టు న్యాయమూర్తితో కూడిన ఏక సభ్యుడి ట్రిబ్యునల్ ధృవీకరించిన తర్వాత మాత్రమే అమలులోకి వస్తుంది.
ఈ ట్రిబ్యునల్ ముందు, ప్రభావిత సంస్థకు తన వాదనలు వినిపించే అవకాశం నామమాత్రంగా ఉంటుంది. ఏ ప్రతినిధి అయినా ప్రాతినిథ్యం వహించడానికి ముందుకు రాగలరా అనేది ఒక అంశమైతే, నిషేధిత సంస్థతో తమ అనుబంధాన్ని పరోక్షంగా అంగీకరిస్తే, నిషేధం నిర్ధారమైతే అరెస్టు అవుతారనేది మరో అంశం.
2001 నుంచి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)ను నిషేధించడంతో పాటు, ఇటీవల 2022లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)ను నిషేధించిన అనుభవాలను చూస్తే, యూఎపిఎకి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలపై ట్రిబ్యునల్‌లు రబ్బర్‌స్టాంపులుగా సమర్థవంతంగా పనిచేస్తాయన్నది వేరే విషయం.
అత్యవసర పరిస్థితుల్లో, ట్రిబ్యునల్ ధ్రువీకరించడానికి ముందే, నిషేధాన్ని తక్షణం అమలులోకి తీసుకురావడానికి యుఎపిఎ ప్రభుత్వానికి అనుమతినిస్తుందనేది కూడా మరో విషయం.
సిఎస్‌పిఎస్ఎ ప్రకారం, నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రభావిత సంస్థ సభ్యులు సలహా మండలి ముందు సమీక్ష కోసం అభ్యర్థించవచ్చు. ఈ సలహా మండలిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరు హైకోర్టు న్యాయమూర్తులు కానవసరం లేదు. పది సంవత్సరాల న్యాయవాదవృత్తి ఆచరణలో ఉన్న వారెవరైనా కావచ్చు.
ఇలాంటి సలహా మండలిని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదు. నోటిఫికేషన్ జారీ, ప్రచారాలను ఆలస్యం చేయడంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చూపించిన చాకచక్యం స్పష్టంగా కనిపిస్తుంది; ఎందుకంటే, ప్రాతినిధ్యం చేయడానికి ఎమ్‌బిఎమ్‌కు కేవలం పదిహేను రోజుల సమయాన్ని మాత్రమే సిఎస్‌పిఎస్ఎ అనుమతిస్తుంది.
అంతేకాకుండా, ప్రభావిత సంస్థకు చెందిన కమిటీ సభ్యులు మాత్రమే ఈ నిషేధాన్ని సవాలు చేయవచ్చు. కానీ నిషేధిత సంస్థకు సభ్యత్వం, మద్దతు ఇవ్వడం అనేది చట్టవ్యతిరేక చర్య; అటువంటి ఎవరిపైనైనా తక్షణమే నేరవిచారణ జరపవచ్చు.
వాస్తవానికి, సవాలు చేసే సామర్థ్యం ఉన్న వారందరిపై నిషేధం ఏ సమయంలోనైనా హాని కలిగించే వేలాడుతున్న కత్తిలాగా పనిచేస్తుంది; చట్టం అందించే ఎలాంటి విధానపరమైన పరిష్కారాలనైనా పనికిరానివిగానూ, అసమర్థమైనవిగానూ చేస్తుంది.
ఈ దృష్టాంతంలో, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ప్రజా భద్రత వంటి భావనలను ప్రశ్నించడం అవసరం; ఇవి స్థానిక, అంతర్జాతీయ చట్టం ప్రకారం తన స్వంత చట్టపరమైన బాధ్యతలను పాటించాలని పిలుపునిచ్చే సంస్థలను, సమీకరణలను నిషేధించడానికి రాజ్యానికి అనుమతినిస్తాయి.
స్పష్టంగా, ఇలాంటి నిషేధ ప్రక్రియలు న్యాయమైన విచారణను నాశనం చేయడమే మాత్రమే కాకుండా, ఆర్టికల్ 21 ప్రకారం అన్యాయమైన, అనుచిత, అసమంజసమైన విధానాలను సూచిస్తాయి.
23 డిసెంబర్ 2024
తెలుగు: పద్మ కొండిపర్తి