మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపేస్తున్నారు. ఆపరేషన్ కగార్ 15 నెలలుగా మధ్యభారతంలో నిరంతరాయంగా కొనసాగుతూ వందల సంఖ్యలో ఆదివాసీల ప్రాణాల్ని హరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీకి మధ్య యుద్ధం సమ ఉజ్జీవుల మధ్య యుద్ధం కాకపోయినప్పటికి దశాబ్దాలుగా త్యాగాలతోనే విప్లవోద్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అశేష ప్రజానీకం మద్దతు సానుభూతి కూడాగట్టడంలో విజయం సాధించారు. అది విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతాంగ శ్రేణుల నుంచి బలం వచ్చి చేకూరింది. అంతేకాక మైదాన ప్రాంతాల్లో వచ్చిన నిర్బంధం దాన్ని ఆ ఉద్యమం అక్కడ నిలదొక్కుకోలేక అటవీ ప్రాంతాలకు ప్రధానంగా దండకారణ్యానికి విస్తరించిన విషయం వాస్తవమే. ఆ స్థితిలో అక్కడున్న ఆదివాసీల హక్కు చట్టాలను అమలు చేయాలని అడవిపై ఆదివాసులకు హక్కు ఉందనే నినాదంతో ఆదివాసీల బలమైన ఉద్యమాలను నిర్మించడంలో విజయం సాధించగలిగారు. అందువల్ల 90 నుంచి ప్రారంభమైనటువంటి నిర్బంధ దాడి అనేక ఆపరేషన్లతో కొనసాగి నేడు ఆపరేషన్ కగార్తో పచ్చి హత్యాకాండ కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివాసీల జీవించే హక్కును పరిరక్షించడం కోసం చర్చల ప్రక్రియను మావోయిస్టు పార్టీ ఎజెండా మీదికి తీసుకువచ్చింది. గతంలో 2004లో అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వైఎస్ఆర్ ప్రభుత్వం దానికి ముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన బూటకపు ఎన్కౌంటర్ల నుండి జీవించే హక్కును రక్షించడం కోసం 1997లో పౌరస్పందన వేదిక ఆవిర్భవించి పని చేయడం ప్రారంభించింది. దానికి భూమికగా ఇప్పుడు ఎలాగైతే మధ్యభారతంలో హత్యాకాండ కొనసాగుతుందో అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమ ప్రాంతాలలో యువతను వేటాడి బూటకపు ఎన్కౌంటర్లలో హత్య చేసే విధానం ప్రధానంగా కొనసాగింది. దాన్ని నిలువరించడం కోసమే ఆనాడు పౌరస్పందన వేదిక దశాబ్ద కాలం క్రీయాశీలంగా పని చేయడం వలననే శాంతి చర్చల ప్రక్రియకు పునాది ఏర్పడిరది. దీనికి ముందు చంద్రబాబునాయుడుపై అలిపిరి దాడి ఘటనను కూడా సాకుగా తీసుకొని ఆరు నెలలకు ముందే ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబును చిత్తుగా ప్రజలు ఓడగొట్టారు. ఎన్నికల్లో పోటీపడిన వైఎస్ఆర్ కూడా శాంతి చర్చలకు సిద్ధం అని ప్రకటించడం ద్వారానే వైఎస్ఆర్ను ప్రజలు ప్రభుత్వంగా ఆహ్వానించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం చర్చలను ఉనికిలోకి తీసుకువచ్చింది. అప్పుడు కూడా ఆయుధాన్ని అడ్డంకిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.కాని అప్పుడున్న ప్రజాఉద్యమాల బలం మూలంగా ఆయుధం అడ్డంకి కాకుండా పోయింది. నేడు కూడా మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటిస్తూ ప్రకటన వెలువరించిన తరువాత చత్తీస్ఘడ్ ప్రభుత్వం ఆయుధాలు అడ్డంకిగా ప్రకటన చేశాయి. కాని ఇదే చత్తీస్ఘడ్ ప్రబుత్వం ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ముఖ్యమంత్రి భూపేష్ బగల్ వలె మేము సైతం చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తూనే కాని ఒక షరతు విధించారు. అది మధ్యభారతంలోని సహజ వనరులను కార్పొరేట్లు తరలించుకు వెళ్ళే విధానానికి మీరెక్కడ కూడా ఆటంకం కలిగించకూడదని ప్రకటించారు. ఆ స్థితిలో షరతులు లేకుండా చర్చలు ప్రారంభించుకున్న తరువాత విషయాలను చర్చిద్దామనే విషయం పూర్తిగా పక్కకు పోయి గతంలో ఎప్పుడూ ఎన్నడూ చూడని తీవ్రమైన సాయుధ అణచివేత, 100ల్లో లొంగుబాటు, ఆదివాసీ యువత మొత్తం క్యాంపులలో నిర్బంధించబడడం, మహిళలపై సామూహిక అత్యాచార కాండ, ఎవరూ ఊహించని విధంగా కొనసాగుతూ ఉంది. చివరికి మధ్యభారత ఆదివాసీ ప్రాంతం భారత దేశానికే కాదు ప్రపంచానికి కూడా నిషేధిత ప్రాంతంగా మారిపోయింది. అక్కడికి ఎవ్వరం వెళ్ళకూడదు, ఏ జర్నలిస్టు వార్తా సేకరణ చేయకూడదు. పోలీసులు ప్రభుత్వాలు ప్రకటించిన హత్యాకాండను మాత్రమే మీడియా ప్రకటించాలి తప్ప ఇంకొక వార్త ఎవరూ కూడా ప్రకటించడానికి వీలులేదు. ఇది చత్తీస్ఘడ్లో కొనసాగుతున్న ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వ నిర్బంధం.

నేడు శాంతి చర్చల ప్రక్రియ అత్యంత అవసరంగా ఉందని పౌరహక్కుల సంఘం భావిస్తుంది. మూడవ గొంతుక ఉండాల్సిన అవసరాన్ని ప్రజాస్వామిక వాదులు, మేధావులు, శాంతి చర్చ కమిటీగా ఏర్పడి కాల్పుల విరమణ పాటించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సభ్యులను, ఆదివాసీలను ఎన్కౌంటర్ పేరుతో నరసంహారం చేస్తున్నారు. మావోయిస్టులు అయినప్పటికి. ఆయుధాన్ని కలిగి ఉన్నప్పటికి వాళ్ళను కాల్చి చంపే అధికారం లేదని న్యాయస్థానాలు పదే పదే మనకు వాస్తవాన్ని చెబుతున్నాయి. రాజ్యాంగం ఎక్కడా కూడా ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు కాల్చి చంపొచ్చని ఎక్కడా కూడా పేర్కొనలేదు. ఎవరైతే ఆయుధంతో హింసకు పాల్పడితే ఆ హింసను నియంత్రించడంలో భాగంగా ప్రాణహాని జరగకుండానే నిరోధించే విధంగా ప్రయత్నించాలని రాజ్యాంగం చెబుతున్నది. కాని నిషేదించబడిన పార్టీ మనుషులను నిర్మూలించడం తప్పు లేదని అమిత్షా పదే పదే ప్రకటిస్తున్నాడు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

కానీ గత 50 ఏళ్ళుగా ఎన్కౌంటర్ హత్యాకాండ ప్రారంభమైన కాలం నుంచి అదే ఎన్కౌంటర్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్ హత్యాకాండ అనేది కొనసాగుతుంది. అందులో వేలాది మంది అమాయకులు, నిర్ధాక్షిణ్యంగా హత్యగావించబడిన స్థితి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాదే దేశ వ్యాప్తంగా ప్రజలు చూడగలిగారు. ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు కావనే విషయం ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది.

చర్చల ప్రక్రియ అనేది ఒక రాజకీయ ప్రక్రియ. ఈ ప్రక్రియకు సంబంధించి 1997 నుండి 2004 వరకు కొనసాగిన క్రమంలో ఆనాటి తెలుగుదేశం పార్టీ ఉంది, ఆనాటి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఒక రాజకీయపార్టీతో ప్రారంభమైన చర్చల ప్రక్రియ మరొక రాజకీయ పార్టీ ఎజెండాలోకి తీసుకోకుండానే చర్చలు ఎందుకు ఆగిపోయాయనే అంశమే లేకుండా ఎన్కౌంటర్ అణచివేత మాత్రం కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలనైతే డబుల్ ఇంజన్ సర్కార్లు మనలాంటి తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా కార్పొరేట్లకు అండగా ఆదివాసీల కాల్చివేతే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న విషయం మనందరి దృష్టిలో ఉంది. మావోయిస్తు పార్టీ ఒక సాకు మాత్రమే.కార్పొరేట్లకు ఖనిజ సంపదను అప్పగించాలన్నదే ప్రధానం.

2004లో చర్చల ప్రక్రియ టేబుల్ ముందుకు రావడానికి ఆనాటి వరకు కొనసాగిన బూటకపు ఎన్కౌంటర్ హత్యాకాండ ప్రజల నుండి ప్రతిపక్ష పార్టీల నుండి అంతేకాకుండా అప్పుడు ఏర్పడిన పౌరస్పందన వేదిక మేదోబలం ముందు తలవంచకుండా ఉండలేని స్థితిలో చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడైనా ఇప్పుడైనా ఏవైతే ఎన్కౌంటర్ పేరుతో ప్రజల హత్యాకాండ కొనసాగుతుందో అప్పుడే బుద్ధిజీవులు మేధావులు ప్రతిపక్ష పార్టీలు శాంతి చర్చల కోసం తాపత్రయ పడతాయి. మిగతా సమయాలల్లో కేవలం మావోయిస్టులకు ప్రభుత్వ బలగాలకు మధ్య నిజమైన ఎన్కౌంటర్లు అయితే అంతగా స్పందన ఉండదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఆయుధాలతోనే ఎదురుబడి ఎన్కౌంటర్లో పాల్గొంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు 99% ఎన్కౌంటర్లన్నీ కూడా మావోయిస్టులు అంటున్నప్పటికి వారి వద్ద ఆయుధాలు ఉండడం లేదని, నిరాయుధులుగా పట్టుబడుతున్నారని, లేదా ఆయుధంతో పట్టుబడ్డా వాళ్ళు తుపాకి కాల్చలేని స్థితిలో దొరుకుతున్నారని ఒకవైపు స్థితి ఉంటే మరొకవైపు నిరాయుధంగా దొరికిన వందలాది ఆదివాసీలను క్యాంపులలో నిర్బంధించి కాల్చి చంపాలనుకున్నప్పుడు ఎన్కౌంటర్ ప్రదేశానికి తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపిన తరువాత పోలీసులే తెచ్చిన యూనిఫారమ్లు తొడిగి తెచ్చిన ఆయుధాలను పక్కన పెట్టి ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్న స్థితి మరొక వైపు ఉంది. ఇట్లా ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరూ పార్లమెంటరీ పార్టీల వెనకనే ర్యాలీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మించిన మార్పును అభివృద్దిని కొన్ని దేశాలల్లో చూడగలిగాం. కానీ అవి తక్కువ కాలమే ఉన్నప్పటికి కూడా బలమైన అభివృద్ధికి పునాది వేసిన స్థితిని గుర్తించి అటువంటిది మన దేశంలో రావాలని కోరుకోవడంలో నేరమేమి కాదు. కనుక విప్లవ పార్టీల వెనుక కూడా ప్రజలు ర్యాలీ కావచ్చు, ఆ పార్టీలకు సానుభూతిపరులుగా మారవచ్చు, ఆ పార్టీలతో మమేకం కూడా కావచ్చు. అది వారి చైతన్యానికి సంబంధించిన అంశంగానే ప్రభుత్వాలు చూడాలి. అలా కాక ఆ పార్టీ సభ్యులవడం కూడా నేరంగా భావించడమనేదే పూర్తి అప్రజాస్వామ్య చిహ్నంగా మనం భావించాలి.

ఇలాంటి స్థితిలో ఆదివాసీల హననం ఎన్కౌంటర్ పేరుతో జరగడాన్ని అది ఆపరేషన్ కగార్ పేరుతో జరగడాన్ని మనందరితో పాటు రాజకీయ పార్టీలన్ని వ్యతిరేకించి ఆదివాసీల జీవించే వారి హక్కు, మావోయిస్టుల జీవించే హక్కుపట్ల కూడా బాధ్యత పడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలను పాలించడానికి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారంలోకి వస్తాయి. కానీ అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు పక్కకు నెట్టి పెట్టుబడిదారుల కార్పొరేట్ల సమస్యలను ముందుకు తెస్తారు. అప్పుడే ప్రజలను ప్రాధాన్యత లేని మనుషులుగా చూస్తూ ప్రజల సమస్యలను, ప్రజలను వెనక్కి నెట్టేస్తారు. ఆ స్థితి నుంచే ప్రజలు ఉద్యమాల వైపు, ఆందోళనల వైపు, నిరాహార దీక్షల వైపు, సమ్మెల వైపు సామూహిక ధర్నాల పైపు వెళ్ళి అవేమి ప్రభావం చూపకపోతేనే తప్పనిసరై హింసాత్మక రూపంలోకి తమ ఉద్యమాలను మల్లిస్తారు. ఇలాంటి స్థితిలో ప్రజలది నేరం కాదు. ప్రజలు ప్రజాస్వామిక ఆందోళనలో ప్రభుత్వాన్ని ముందుకు తెచ్చినప్పుడు పరిష్కరించని ప్రభుత్వాలదే నేరం. కానీ ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ప్రజల తమ సమస్యల పరిష్కారం కోసం హింస చేయగలిగితే అణచివేయడానికి బలమైన కారణం ప్రభుత్వానికి దొరుకుతుందని తను ఆ వైపుకే ఉద్యమాలను నెడుతుంది. ఉద్యమాలలోని హింసను ప్రధానం చేసుకొని పూర్తిగా ఉద్యమాన్నే అణచివేసే ప్రక్రియకు ప్రభుత్వాలు సిద్ధమవుతాయి. గడిచిన చరిత్ర అంతా అదే జరిగింది. అందులో భాగంగానే మావోయిస్టు ఉద్యమంపై జరుగుతున్న అణచివేతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన వేలాది ఎన్కౌంటర్లలో ఏ ఒక్క ఎన్కౌంటర్లో కూడా పోలీసులకు శిక్ష పడలేదు. ఏ ఒక్క లాకప్ డెత్లో కూడా పోలీసులకు శిక్ష పడలేదు. మొత్తంగా ప్రభుత్వం ఒకపైపు ప్రజలు ఒక వైపుగా పాలన సాగుతున్నది. ఆపరేషన్ కగార్ వచ్చే సరికి కార్పొరేట్ల వైపు పాలకవర్గాలు, ఆదివాసీ దళితులు పేదల పక్షాన మావోయిస్టు పార్టీగా విభజనలు జరిగిపోయాయి. ఇది ఈ క్రమంలో స్పష్టమవుతున్నాయి. ప్రజల సమస్యలను ప్రజాస్వామికంగా పరిష్కరించగలిగితే ఉద్యమాల అవసరం ఎప్పుడూ ఉండదు. మౌళిక సమస్యల పరిష్కారం కానప్పుడే ఉద్యమాలు అవసరమై అవి హింసారూపం కూడా తీసుకుంటున్నాయి. కాబట్టి ఉద్యమాలు హింసా రూపం తీసుకోవడానికి ఉద్యమ కారుల తప్పు కాదు, ప్రభుత్వాలదే తప్పుగా భావిస్తూ ఇప్పుడు జరుగుతున్న నరసంహారాన్ని నిలుపుదల చేయాలంటే ఒక శాంతి చర్చల ప్రక్రియ అవసరంగా భావిస్తూ అన్ని రాజకీయ పార్టీలు ప్రజలవైపు నిలబడి చర్చల ప్రక్రియను ప్రజాస్వామిక బద్దంగా నడిపించి ఆదివాసీల జీవించే హక్కులను కాపాడాల్సిన నైతిక బాద్యత రాజకీయ పార్టీలందరిపై ఉంటుందని పౌరహక్కుల సంఘం భావిస్తుంది.

Leave a Reply