ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ భారత పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించటం, తదుపరి కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపడంతో ఇక చివరిగా రాష్ట్రపతి ఆమోదం జరిగిన తర్వాత అది చట్టబద్ధం అయిపోతుంది. ఈ సందర్భంగా పార్లమెంటులోనూ, రాష్ట్రంలోనూ వైసీపీ అధినేతతో పాటుగా ఆ పార్టీ నాయకులు అమరావతిని వ్యతిరేకిస్తూ, అందుకు ప్రతిగా గుంటూరు- విజయవాడ- మచిలీపట్నం కారిడార్ గా “మావిగాన్ “ను రాజధానిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కూడా టిడిపి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లో హైదరాబాదును 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నప్పటికీ, 2014లో అధికారం చేపట్టిన టిడిపి ప్రభుత్వం జూన్- 2015 లోనే అమరావతి ని రాజధానిగా భూమి పూజ నిర్వహించి, అక్టోబరు – 2015 లోనే ప్రధానమంత్రి తో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అమరావతి నిర్మాణం కోసం సి ఆర్ డి ఏ సంస్థను ఏర్పాటు చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా టిడిపి ప్రభుత్వం అమరావతి పరిధిలోని 29 గ్రామాల నుంచి 34 వేల ఎకరాలను 29 వేల రైతుల నుంచి పది సంవత్సరాల కాల పరిమితికి ల్యాండ్ పూలింగ్ క్రింద భూములను తీసుకొని, ఆ భూములను అభివృద్ధి చేసి, అక్కడ శాసనసభ, సచివాలయం, హై కోర్టు, ప్రభుత్వ రాష్ట్ర కార్యాలయాలు నిర్మిస్తూ, బహుళ జాతి కంపెనీలకు ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి కోసం భూమిని లీజుకి ఇవ్వడానికి ప్రతిపాదనలు చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు గాను, పొడి భూమికి ఒక ఎకరం పొలానికి ఒక సంవత్సరానికి 30 వేల రూపాయలు, తడి భూమికి ఒక ఎకరం పొలం కి ఒక సంవత్సరానికి 50 వేల రూపాయలు చెల్లించటానికి, పొడి భూమి రైతులకు 1000 గజాల ఇంటి స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం, తడి భూమి రైతులకు వెయ్యి గజాల ఇంటి స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం అభివృద్ధి చేసి ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వరకు తీసుకొని వెళ్లిందంటే, మొదటి ఫేజు లో 50వేల ఎకరాల సేకరణ వరకు,రెండవ ఫేజ్ లో 40 వేల ఎకరాల వరకు వెరసి మొత్తం 90 వేల ఎకరాల వరకు అంచనా ప్రతిపాదనలు చేశారు. ఇక భూమిలేని వ్యవసాయ కార్మికులకు కుటుంబానికి నెలకు 2500 రూపాయలు పెన్షన్ హామీ ఇచ్చారు. ఈ రైతులు, వ్యవసాయ కార్మికులు కుటుంబాలకు విద్య, వైద్యం ఉద్యోగ సదుపాయాలు కల్పించడానికి కూడా హామీ ఇచ్చారు.
ఇలా ఈ వ్యాపార రాజకీయాలు నడుస్తున్న క్రమంలో 2019 ఎన్నికలలో టిడిపి ఓడిపోయి, వైసిపి అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి, ఈ రెండు పార్టీల మధ్య గల ఆధిపత్య పోరులో వైసిపి 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. ఇందుకు ప్రతిగా అమరావతి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేపట్టారు. వారు న్యాయస్థానాలలో కేసులు వేశారు. వైసిపి పాలన ఐదు సంవత్సరాలు రాజధాని పనులు కుంటుపడ్డాయి. మరలా 2024లో టిడిపి నాయకత్వం లోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత, డబుల్ ఇంజన్ సర్కారు అమరావతి రాజధాని సమస్యను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు పార్లమెంటు ఆమోదంతో అమరావతికి చట్టబద్ధత ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రంలో గల వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత అభివృద్ధి పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లో ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, అనుకున్నంత నిధులు ఈ ప్రాంత జిల్లాలకు కేటాయించబడలేదు. ఈ రెండు వెనుకబడిన ప్రాంతాలలోనే ఏడు ఉమ్మడి జిల్లాలకు సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటే, ఒక్క అమరావతికే టిడిపి ప్రభుత్వ కాలంలో 9 వేల కోట్ల రూపాయలు, వైసిపి కాలంలో 5674 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 7 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి మరో 15 వేల కోట్ల రూపాయలను ఋణం గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించింది. మొత్తం అమరావతి ప్రాజెక్టు అంచనాలు 60 వేల కోట్ల రూపాయలుగా లెక్క వేశారు. ఇందులో తాత్కాలిక శాసన సభ, సచివాలయ, హైకోర్టు భవనాలు, రోడ్లు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలు కోసం గత పది సంవత్సరాల కాలంలో సుమారు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరలా ఇప్పుడేమో 57,821 కోట్ల రూపాయల అంచనాలతో 50943 కోట్ల రూపాయల పనులను శాశ్వత నిర్మాణాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇలా ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన డబ్బులను గత 12 సంవత్సరాలనుంచి అమరావతి, పోలవరం పేరుతో ఖర్చు పెడుతూ, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలను నిరాదరణకు గురి చేస్తున్నారు. ఈ వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఆలస్యం చేయడం, గోదావరి జలాలను అటు రాయలసీమకు, ఇటు విశాఖకు తీసుకు రావడానికి కాలయాపన చేస్తున్నారు. విశాఖ ఉక్కులాంటి ప్రభుత్వ పరిశ్రమలకు సరైన నిధులు కేటాయించకపోవడం వలన దానిని ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు సరైన ఉపాధి అవకాశాలు లేక అక్కడ నుంచి వలసలు ఆగడం లేదు. విద్య, వైద్య రంగాలు కార్పొరేటీకరణ చెంది, సరైన విద్య, వైద్యం ఈ ప్రాంత ప్రజలకు అందడం లేదు. ఈ వెనుకబడిన ప్రాంతాలలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నిర్లక్ష్యం చేసి, కాలుష్య కారక పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. పచ్చటి ఉద్దానం పంట పొలాలలో కార్గో ఎయిర్పోర్టును ప్రతిపాదిస్తున్నారు.
ఇక ముగిసిన రాజధాని కధకు వైసీపీ అధినేత మళ్ళీ మావిగాన్ ప్రతిపాదనతో సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే గత 12 సంవత్సరాల నుంచి రాజధాని పేరుతో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపార రాజకీయాలు తో పాటుగా అనవసర ఖర్చులు, అప్పులు తడిసి మోపెడు కాగా 2029 ఎన్నికలలో వైసిపి ఒకవేళ అధికారంలోనికి వస్తే మరల రాష్ట్ర పరిస్థితి ఏమిటి అన్న చర్చ జరుగుతుంది. కావున టిడిపి, వైసిపి వర్గాల ఆధిపత్య పోరుకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు, ప్రజాసంఘాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకు చట్టబద్ధమైన అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాలని, కర్నూలు, విశాఖ కేంద్రంగా హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుత 28 జిల్లాల దామాషా పద్ధతిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు అధిక నిధులను బడ్జెట్లో కేటాయించి, తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని, వ్యవసా య ఆధారిత పరిశ్రమలు స్థాపించి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉద్యమించినప్పుడే టీడీపీ, వైసిపి వర్గాల అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపార రాజకీయాలకు తెరపడుతుందని ఆశిద్దాం.
—— పేడాడ కృష్ణారావు,
జిల్లా కార్యవర్గ సభ్యులు,
ప్రజా సంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.




