ప్రజా కళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య సభ్యుడు తుర్కపల్లి జహంగీర్ ఏప్రిల్ 2, 2026న గుండెపోటుతో మరణించారు. పీడిత ప్రజల గుండె చప్పుడును సుదీర్ఘకాలం తన గొంతులో ఆయన పలికించారు. జహంగీర్ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాంతంలో పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. బాల్యంలో పేదరికం వలన ప్రాథమిక దశలోనే చదువుకు దూరమయ్యారు. జీవిక కోసం వివిధ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచారు.
తెలుగు నేలను ఆవరించిన ప్రపంచీకరణతో పేద ప్రజల జీవితాలను 90ల దశకంలో మరింతగా సంక్షోభంలోకి నెట్టడం మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పతనమవుతున్న జీవితాలను కళ్ళారా చూసిన జహంగీర్ తనకు పట్టనట్లు వుండలేక పోయారు. తనలో సహజంగా ఉండే కళాత్మక వ్యక్తీకరణ ద్వారా కళ్ల ముందటి సంక్షోభం మీద తన అసమ్మతిని ప్రకటించారు. తనది విప్లవాల ఖిల్లా నల్లగొండ కావడంతో తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న ప్రజా నాట్య మండలిలో ఆయన చేరారు. ఆటపాట లాంటి సృజనాత్మక రూపాలను ఎన్నుకొని పనిచేశారు. ఇదే కాలంలో అస్తిత్వ ఉద్యమాలు ఎజెండా మీదికి వచ్చాయి. ఈ క్రమంలోనే గొల్లకుర్మ డోల్ దెబ్బ అనే సంఘం ఏర్పడింది. ఈ సంఘం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లోకి జహంగీర్ ప్రవేశించారు. అప్పటికే డోల్ దెబ్బ సంస్థలో కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లి లలిత తో ఆయనకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి మద్యపానం, వరకట్నం,గుట్కా ,యాదగిరి గుట్టలో జరిగే వ్యభిచారం వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పనిచేశారు. అక్షర జ్యోతి కార్యక్రమంలో పాల్గొని ఊరూరా చదువు ప్రాధాన్యతను వివరించారు. ఏ ప్రాంతంలో సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వాల్సి వస్తే, ఆ ప్రాంత సమస్యలను జహంగీర్ తెలుసుకొని అప్పటికప్పుడు పాట తయారుచేసి, పాడేవారు. ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి చెప్పేటప్పుడు జహంగీర్ తన పాటతో ప్రజలను కన్నీరు పెట్టించేవారు. సమాజంలోని భూస్వామ్య సంస్కృతిని, అవినీతి, లంచగొండితనాన్ని చెప్పేటప్పుడు పదునైన వ్యంగ్యంతో ప్రజలను నవ్వించే వారు.
1996 లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో జహంగీర్ చురుకుగా పాల్గొన్నారు. సిద్దిపేట కేంద్రంగా మంజీరా రచయితల సంఘం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో జహంగీర్ తన పాటను వినిపించారు. 1998 లో ఏర్పడిన తెలంగాణ జనసభకు అనుబంధంగా రూపొందిన తెలంగాణ కళాసమితికి జహంగీర్ కన్వీనర్ గా ఎన్నికయ్యారు. తెలంగాణ వ్యాపితంగా పదుల సంఖ్యలో కళాకారులను సమీకరించి పాట పాడే, డప్పు కొట్టే, గజ్జెకట్టి ఆడే నైపుణ్యాలను నేర్పించారు. తెలంగాణ భావజాలాన్ని బెల్లి లలితతో పాటు కలిసి ఊరూరా ప్రచారం చేశారు. స్థానిక రాజకీయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల దాకా సరళమైన భాషలో సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించేవారు. తెలంగాణ ఆకాంక్ష ప్రజలలో విస్తృతం కావడాన్ని జీర్ణించుకోలేని ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు తెలంగాణ కళాసమితి మీద తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించాడు. నయీం చేత బెల్లిలలితను హత్య చేయించాడు. నల్గొండ జిల్లా పోలీస్ అధికార్లు జహంగీర్ ను చంపుతామని బెదిరించారు. ఆయన కుటుంబాన్ని ఆందోళనకు గురిచేశారు. ఈ సమయంలో జహంగీర్ తీవ్రమైన నిర్బంధాలకు, అనేకసార్లు పోలీసుల హింసకు గురయ్యారు. పోలీస్ చిత్రహింసల కారణంగా శారీరకంగా అనేక విధాలా అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన తన కార్యాచరణలో కాస్త విరామం తీసుకున్నారు. తిరిగి ప్రజా వెల్లువలో ముందుకు వచ్చిన తెలంగాణ ధూంధాం కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంస్కృతిక సారథి కళాకారుడిగా ఉద్యోగం చేస్తూనే ప్రజానుకూల సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. జహంగీర్ తాను బుద్ధేరిగిన నాటి నుండి ప్రజాపక్షం వహించిన కళాకారుడు. ఆయన మరణం ప్రజా సాహిత్యానికి, కళలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జహంగీర్ కు విప్లవ రచయితల సంఘం జోహార్లు అర్పిస్తోంది.
– అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
– రివేరా, కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం




