పాకిస్తానీ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న ఒక భారీ నిరసన ఉద్యమంపైన 2026 జూన్ 8నాడు పాకిస్తానీ సైన్యం క్రూరమైన అణచివేతకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) మద్దతుతో జరిగిన ఈ నిరసనలు, ఆకాశాన్నంటుతున్న పిండి ధరలు, పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, తీవ్రమవుతున్న ప్రభుత్వ అణచివేత, సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులను నిరంతరం నిరాకరించడానికి నిరసనగా వెలుగులోకి వచ్చాయి. రాబోయే ఎన్నికలలో శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ రిజర్వ్ సీట్ల విధానం పాకిస్తానీ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని దూరం చేస్తుందని వాదిస్తూ, జెఎఎసి చాలా సంవత్సరాలుగా దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాంత నివాసితులను ఈ స్థానాలకు పోటీ చేయకుండా నిషేధించారు. ఇలా చేయడం వల్ల శాసనసభలోని కీలక విభాగాలు స్థానిక ప్రజల ప్రజాస్వామిక నియంత్రణకు అతీతంగా ఉంటాయి.

దీర్ఘకాలంగా సైనిక ఆధిపత్యంలో ఉన్న పాకిస్తానీ ప్రభుత్వం, ఈ ప్రజాస్వామిక డిమాండ్లకు అరెస్టులు, బహిష్కరణలు, హింసతో ప్రతిస్పందించింది. ఇంక్విలాబీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, అవామీ యాక్షన్ కమిటీ గిల్గిత్-బాల్టిస్తాన్ ఛైర్మన్ అయిన కామ్రేడ్ ఎహసాన్ అలీని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించినందుకు ‘ఉగ్రవాది’గా ముద్రవేసి, ఫాసిస్ట్ పాకిస్తానీ ప్రభుత్వం చాలా కాలం పాటు జైలులో నిర్బంధించటం మనం చూశాం. కానీ తీవ్రమైన ప్రజా నిరసనల తర్వాత వారు అతన్ని విడుదల చేయక తప్పలేదు. కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని మరింత తీవ్రతరం చేసింది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, క్షీణిస్తున్న జీవన పరిస్థితులు సామాన్య ప్రజలను పోరాటంలోకి నెట్టాయి.

అదే సమయంలో, బలూచిస్తాన్ వంటి పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలలో ఖనిజాలు, శిలాజ ఇంధనాలను వెలికితీసేందుకు అమెరికా, పోర్చుగల్ తదితర దేశాలకు చెందిన సంస్థలతో పాకిస్థాన్ ప్రభుత్వం వరుస ఒప్పందాలపైన సంతకాలు చేసింది. ఈ ఒప్పందాలు భారీ సహజ సంపదను విదేశీ పెట్టుబడిదారులకు అత్యల్ప ధరలకే కట్టబెడుతుండగా, స్థానిక ప్రజలు మాత్రం సామాజిక, ఆర్థిక, పర్యావరణపరమైన దుష్పరిణామాలను భరించాల్సి వస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ, ప్రజలకు చెందాల్సిన వనరుల దోపిడీని పాకిస్థాన్ అధికారులు సులభతరం చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులు కేవలం ఆర్థికపరమైన ప్రయత్నాలు మాత్రమే కాదు. అవి విస్తృత భౌగోళిక రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ తదితర ప్రాంతాలలో సామ్రాజ్యవాద ప్రభావాన్ని మరింతగా పెంచి, దక్షిణాసియా అంతటా సైనికీకరణను పెంచి, ఉద్రిక్తతలను తీవ్రతరం చేయగలవు. ప్రపంచంలో అత్యంత సైనికీకరణకు గురైన ప్రాంతాలలో కశ్మీర్ ఒకటిగా మిగిలిపోయింది. భారతదేశం, పాకిస్తాన్ విభజనకు చాలా కాలం ముందు నుంచే, కాశ్మీర్ ప్రజలు స్వయం పరిపాలన, రాజకీయ స్వేచ్ఛ కోసం పోరాటాలు చేసారు. స్వయం-నిర్ణయాధికారం కోసం ఉన్న ఆకాంక్ష సరిహద్దుకు ఇరువైపులా రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 47 ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించడానికి ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది; అదే సమయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైనిక ఉనికిని తగ్గించాలని, పౌర స్వేచ్ఛల క్రమబద్ధమైన ఉల్లంఘనలను అంతం చేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు, భారత ప్రభుత్వం ఆర్టికల్ 370, 35Aలను రద్దు చేయడం వల్ల జమ్మూ కశ్మీర్‌కు మిగిలి ఉన్న పరిమిత స్వయంప్రతిపత్తి తొలగిపోయింది. ఆర్టికల్ 35A రద్దుతో, స్థానికేతరులు ఆ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడింది, తద్వారా, గతంలో కశ్మీరీలకు మాత్రమే పరిమితం చేయబడిన భూ యాజమాన్య రక్షణలు ముగిసిపోయాయి. అప్పటి నుండి, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాజెక్టులు, సైనిక మౌలిక సదుపాయాలు, నివాస ప్రాంతాల విస్తరణ కోసం పెద్ద ఎత్తున భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

వీటివల్ల వేలాది మంది స్థానిక ప్రజలు తమ భూములు, ఇళ్ల నుండి నిరాశ్రయులయ్యారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ, కాశ్మీర్‌పై రాజకీయ నియంత్రణను పటిష్టం చేసుకుంటూ, తమ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పథకాన్ని మరింతగా బలోపేతం చేసుకుంది. రాజ్యాంగపరమైన రక్షణలు బలహీనపడటంతో, భారతీయ, విదేశీ సంస్థలు భూములు, సహజ వనరులను సులభంగా పొందగలుగుతున్నాయి. అదే సమయంలో, నిత్య జీవితంపైన నిఘా, ప్రభుత్వ నియంత్రణ కూడా విస్తరిస్తున్నాయి.

కశ్మీర్‌ను నియంత్రించడం, దాని సహజ వనరులు, ఖనిజాలు, అన్నింటికంటే ఎక్కువగా, తమ ప్రజల శ్రమను తమను, తమ సామ్రాజ్యవాద యజమానులను సుసంపన్నం చేయడానికి ఉపయోగించుకోవడం భారతదేశం, పాకిస్తాన్, చైనా దేశాల లక్ష్యం. కాశ్మీర్ ఆక్రమణ అనేది సెటిలర్-కాలనీయల్ ప్రాజెక్ట్. ప్రాథమిక బాధితులు కాశ్మీరీలు, వారి జాతీయ గుర్తింపు వారి స్వయం నిర్ణయాధికారం. సైనిక బలం, రాజ్య అణచివేత లేదా ఆర్థిక దోపిడీ ద్వారా వారి ఆకాంక్షలను అణచివేయలేరు.

కాశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తాం. వారి భవిష్యత్తును నిర్ణయించే వారి ప్రజాస్వామిక హక్కుకు మద్దతునిస్తాం. అదే సమయంలో పాక్ సైన్యం చేపట్టిన ప్రజా వ్యతిరేక చర్యను ఖండిస్తున్నాం. మానవ హక్కుల ఉల్లంఘనలను వ్యతిరేకిస్తూ, ప్రజల డిమాండ్లను అంగీకరించేలా పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య, వామపక్ష సంస్థలకు పిలుపునిస్తున్నాం. స్వయం నిర్ణయాధికారం కోసం కాశ్మీర్ ప్రజల న్యాయమైన డిమాండ్ కోసం నిలబడదాం.

రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్

2026-06-15

Leave a Reply