నువ్వు పుట్టి పురుడోసుకున్నవో లేదో కానీ
ఏ అవ్వ బొడ్డు పేగు కోసి పేరు పెట్టిందో
నీవు నిజంగానే పేదల ఇంటి గుమ్మాల
రంగవల్లి వయ్యి నిలిచావు..!
ఏ అసుర సంధ్యా తీరానా
నువ్వు అడుగులు నేర్చావో కానీ
అవి ఆకలి కడుపుల అన్నార్థుల జాడలు
వెతక పయనమయ్యాయి
ఏ ఇంటి కడుపు పంటవయి పండావో కానీ
కడుకు జనలను సోపతయ్యావు
పల్లెలో అక్షరాలు దిద్దిన నీ చేతి మునివేళ్ళు
పట్టణం బాటలో పయనించి విశ్వవిద్యాలయాలో
మొగ్గతొడిగిన పొలిటికల్ కమీసార్ వయ్యావు
బిగి పిడికిలి జెండా పిలుపులో నువ్వు సాగిన
ఆ కల్లోల ప్రాంతపు అరాచకాలను చూసి
చలించిన నీ మనస్సు
బాల్య వివాహాలను వ్యతిరేకించిన దృశ్యం
నేటి భారతంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది కదా
ఏ ఇందూరు పోరు సమరమో కానీ
అది కత్తుల వంతెనల మీద నడిచి
గుంటూరు పల్నాడుకు చేరిందో
దివిసీమ ప్రజల కన్నీళ్లు తుడిచేయ్యగా
ములుగులో నేల రాలి ఉదయించిన
తొలి పొద్దు వర్ణమో ఆమె
ఈ ధరణిలో విరబూసిన
త్యాగాల కల్పవల్లి
కామ్రేడ్ రంగవల్లి…!
(కామ్రేడ్ రంగవల్లి పాతికేండ్ల అమరత్వానికి పబ్బతి పడుతూ…)
Related
👌
good
Very touching one
======buchireddy gangula