“ దీన్ని టీ అంటారా ? ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది.
పైకి గట్టిగానే అంటున్నట్లున్నా ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి, కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ గొంతులో ఏదో మొహమాటం, బెరుకు.
నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని బెరుగ్గా “ స్టీల్ గ్లాస్ లోనే టీ ఇవ్వు రెడ్డీ , వేడిగా వుంటుందని ఎన్నోసార్లు చెప్పింటా. అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ .. ” అంటున్నాడు నంగి నంగిగా.
గల్లాపెట్టె వద్ద నింపాదిగా కుర్చుని విసనకర్రతో విసురుకుంటున్న హోటలు ఓనరమ్మ వక్కాకు కసాబిసా నములుతూ కొరకొరా చూసింది మొగిలప్ప వైపు. ఆపక్క ఆ కుర్రాడేమో అస్సలు మొగిలప్ప మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. వినడం వరకూ అయితే విన్నాడు కానీ అసలేమీ , విననట్లు, మొగిలప్ప మాటలకు ఎలాంటి స్పందనా లేనట్లు మా చేతుల్లోకి పేపర్ కప్పులు పెట్టేసి తలతిప్పుకుని , ఏదో పాట పాడుకుంటూ , బాయిలర్ లో బొగ్గులు కలబెట్టుకుంటూ ఉండిపోయాడు.
మొగిలప్ప చెప్పింది నిజమే.ఆ టీ టీ లాగా లేదు. టీ వేడిగా లేదు, అట్లాగని చల్లగానూ లేదు, ఎటొచ్చీ నాకు కావలసినంత వేడిగా మాత్రం లేదు.ఆ టీ లో రుచీ లేదు,ఏమీ లేదు. మొగిలప్ప ఏదో అనబోయి, బస్టాండులోకి వెడుతున్న బస్ డ్రైవర్ వేసిన హారన్ సౌండుకి ఆగిపోయాడు. ఆ పేపర్ కప్పులు నిర్జీవంగా వున్నాయి.నిస్తేజంగా వున్నాయి.
బస్టాండు పక్కనే టీ హోటల్. ఎంత మాత్రం రద్దీగా లేదు.
ఎండధాటికి జనం ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయినట్లున్నారు. రోడ్డు పైన రద్దీ అంతగా లేదు. బస్టాండు కూడా దాదాపు నిర్మానుష్యంగానే వుంది.దుఖానాలు అన్నీ నీరసంగా కనిపిస్తున్నాయి.బస్సులు కూడా అయిష్టంగా బద్దకంగా కదులుతున్నాయి. అయినా ఎండను ఎంత మాత్రం లేక్కచేసే అలవాటు లేని వాళ్ళు, లేదా ఎండలకు బాగా అలవాటు పడినవాళ్ళు మాత్రం ఎండను పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ పనుల్లో ఎవరికీ వాళ్ళు హడావిడిగా వున్నారు. రెండు చక్రాల లాగుడుబండి లాగే ఇబ్రహీం ముసలితనాన్ని, అలసటని లెక్క చెయ్యకుండా నిర్లక్ష్యంగా తలను అటు ఇటూ తిప్పుతూ మొహానికి పట్టిన చమటను విదిలించి పారేస్తూ సరుకుల బండిని లాక్కుపోతున్నాడు. బజారు వీధి సందుల్లోకి ఆటోలు లారీలు వెళ్ళలేవు. బస్టాండులో కానీ, లారీ పార్సిల్ ఆఫీసుల వద్దనుండి సరుకులు షాపుల్లోకి పోవల్లంటే ఎడ్లబండి పురుషోత్తం అయినా లేదా లాగుడుబండి ఇబ్రహీం అయినా కదలాల్సిందే. లేదంటే ఆ సరుకులు రోడ్డు దాటి, ఇరుకైన బజారు వీధుల్లోకి పోలేవు. హంగూ ఆర్భాటాలు కొత్తగా ఎన్ని వచ్చినా వూరు మొత్తం మారిపోయినా , వూరి నడిబొడ్లో ఇప్పటికీ మారంది మూడే మూడు. ఆ ఎడ్లబండీ, ఆ లాగుడుబండి, బస్టాండు ముఖద్వారం వద్ద ప్రశాంతంగా నిలుచుని ఒక చెయ్యి పైకి ఎత్తి నవ్వుతూ అభివాదం తెలిపే నెహ్రూ విగ్రహం.
టీ పూర్తయ్యే లోగా సెల్ రింగ్ అయింది . ఈరోజుకు ఒకే నెంబర్ నుండి వచ్చిన పదహారో కాల్ అది .
అవతల వైపు మా పిన్నమ్మ .“ మీ అమ్మ చెప్పిండే పూజ సామన్లు అన్నీ తీసుకున్నారు కదా చిన్నోడా ?” ఆ ప్రశ్నకు జవాబు చెప్పేలోగా ఆమె కొనసాగించింది..
“ మొగిలప్ప నీతో బాటే వున్నాడు కదా. వాడికేమీ తెలియదు. నువ్వే బద్రంగా చూసుకోవల్ల. ఎలాగైనా సరే నా కొడుకు పొలీసు కావల్ల అంతే .వాడికి అన్నీ భయాలే. ఊరికే ఊరికినే నువ్వు చెప్పినావనే హైదరాబాదుకు కోచింగు కోసం అని పంపినా. మా పొలీసు మునిరత్నం అన్న కూడా ఈ రోజు మునిదేవరకు వస్తా వుండాడు కదా. వాడితో కూడా మాట్లాడిపించల్ల. నువ్వేం చెప్తావో, నువ్వేం నేర్పిస్తావో నా కొడుకు మాత్రం పొలీసు కావల్లంతే . అయినా మొగిలప్పకి నువ్వంటే బాగా గురి. నీ మాట బాగా వింటాడు చిన్నోడా . నువ్వేం చెప్తావో నువ్వేం నేర్పిస్తావో నా కొడుకు మాత్రం పొలీసు కావల్లంతే. ” చెప్పిందే రెండుసార్లు చెప్పటం ఆమెకు ముందునుండి అలవాటే. ముఖ్యం అనుకుంటే ఒక్కోసారి చెప్పిందే మూడు నలుగుసార్లు కూడా చెప్పగలదు.
ఆమె ఆగదు, మనమే ఎక్కడో చోట ఆమెను ఆపాలి. “ పిన్నమ్మా నేను మాట్లాడతాలే. నువ్వు బాధ పడొద్దు.” అని చెప్పి ఆమె సమాధానం కోసం ఆగకుండా సెల్ కట్ చేసేశాను.అంత సేపూ మొగిలప్ప నా వైపే చూస్తూ వున్నాడు.వాడి మొహం నిండా నవ్వు. వాడికి సీన్ మొత్తం అర్థం అయిపోయింది.
మా పిన్నమ్మ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చెయ్యకపోయినా మాటలు బయటకే స్పష్టంగా వినిపిస్తాయి. ఆమె గొంతు అంతే. ఎదురుగా నిలబడి నేరుగా మాట్లాడినప్పుడు చూడాలి, చుట్టుపక్కల వీధి మొత్తo అందరికీ వినిపిస్తూ వుంటుంది. దీనికి పూర్తిగా వ్యతిరేఖం మా చిన్నాయన. గొంతు బాగా తగ్గించి మెల్లగా, నింపాదిగా మాట్లాడటం ఆయనకు ముందునుండీ వచ్చిన అలవాటు. కొత్తవాళ్ళు అయన మాట్లాడేది కనుక విన్నారంటే , ఆయనేదో చెప్పకూడని పరమ భయంకరమైన రహస్యం ఏమిటో చెపుతున్నట్లు పొరబడతారు. మామూలు విషయాన్ని కూడా ఏదో రహస్యం అన్నట్లు మాట్లాడతాడు.
చిన్నప్పుడు ఆటలోనే దొంగా పొలీసు అడుకోవల్ల. అంతే కానీ ఎరికిలోడు ఏంది.పొలీసు కావడం ఏంది ? మనోల్లంటే ఆ డిపర్మెంటు లో మర్యాద యాడ వుంటుంది? మీ తిక్క కాక పోతే ? ’’ మా చిన్నాయన ఎప్పుడూ మా పిన్నమ్మ ఆశలపై నీళ్ళు చల్లే మాటే అది. మా పిన్నమ్మకు ఆ మాటలు అస్సలు నచ్చదు. ఎట్లాగైనా వాళ్ళ కొడుకు మొగిలప్పను పోలీసు చెయ్యాలనేది మా పిన్నమ్మకు ఎన్నో ఏళ్ళ తీరని కోరిక.
“ పోయి పోయి ఆ పోలీసు మునిరత్నం గురించి చెప్తా ఉండాది సూడు. ఏ కాలం లోనో ఆయప్ప ఉద్యోగం పోగొట్టుకున్యాడు.ఆ పొలీసు ఉద్యోగం మనకులానికి అచ్చిరాదురా అని మీ నాయన ఎంత చెప్పినా, ఆమాట మీ తమ్ముడు ఏనాడైనా వినింటే కదా. ఆయన మాటలు విని ఇంకేదైనా వేరే ఉద్యోగంలో చేరింటే ఈ పాటికి అయప్ప కూడా అందురిమాదిరి మంచి పొజిషన్లో వుండేవాడు కదా. సంపాదించే రాత రాసి వుంటే కదా . తలపైన రాత బాగాలేనోల్లే కడాకి తలలు చెడుపుకుంటారు.”
మా చిన్నాయన మాటలు ఇంకా పూర్తి కాకముందే, వక్కాకు తుపుక్కన ఉమిసి, మా పిన్నమ్మ అయన మాటలకు గబాలున అడ్డం వచ్చేస్తాది.
“ మా అన్నకి ఇప్పుడేం తక్కువా అని ?ఎట్లైనా మా అన్న డ్యూటీ లో వున్నింటే ఇప్పుడు ఇన్స్పెక్టరు ర్యాంకు కదా. వాని టైం బాగాలేక వాడు బంగారం లాంటి ఉద్యోగాన్ని వద్దనుకుని అట్లా వచ్చేసినాడు కానీ, వాడి మోహంలో వుండే కళ ఈ ఇలాకాలో కానీ, మనోల్లల్లో కానీ ఎవరికీ వుందో సెప్పబ్బా? ఆ దిష్టే తగిలి వుంటుంది. అందుకే కడాకి యెట్లా కాకుండా అయిపోయినాడు మా మునిరత్నం అన్న ”
పొలీసు కావడం అంటే మాటలనుకున్నావా? మన ఇండ్లల్లో యాడ జరుగుతుంది. ఆ మునిరత్నం ఒక్కడే కదా పోలీసు, ఆయప్ప కూడా ఇప్పుడు ఉద్యోగంలో లేడు. ” ఇదీ మా చిన్నాయన గోవిందయ్య వాదన.
“మా అన్న ఏమన్నా కాని పని చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడా ఎంది?ఎంతో పద్దతిగానో కదా ఉద్యోగం చేసినాడు. ఒంటినిండా భయంతోనే కదా నడచుకున్యాడు. కడాకి ఆ భయంతోనే కదా ఉద్యోగం పోగొట్టుకున్న్యాడు. వాడ్ని గానా ఏమన్నా ఒక్కమాట అన్నావంటే బావుండదు. ఒక్క మాట అడ్డంగా మాట్లాడినా నేను వూర్కోను ముందే సెప్తా ఉండాను. ఇంకొక్క మాట అడ్డంగా మాట్లాడినా నేను వూర్కోను ” మొహం తిప్పుకుంటూ కళ్ళు తిప్పుతూ, చేతులు చూపిస్తూ పెద్ద గొంతుతో మా పిన్నమ్మ అలివేలమ్మ అట్లా మా చిన్నాయనను చాలాసార్లు భయపెట్టడం నాకు బాగా గుర్తు వుంది.
అప్పటిదాకా ఎంత సేపు ఏమేం మాట్లాడినా, అట్లా మా పిన్నమ్మ కోపంతో విరుచుకు పడేసరికి మా చిన్నాయన మెత్తగా అయిపోయేవాడు. పైకి ఏమి మాట్లాడే వాడు కాదు కానీ, అక్కడినుండి బయటకు వచ్చి మెల్లగా గొనుక్కునే వాడు.ఇదంతా ఎప్పుడూ ఉండేదే ! అయితే ఈరోజు ప్రత్యేకం ఏమిటి అంటే చాలా కాలంగా నేను వింటూ వుండిన ఆ పోలీసు మునిరత్నం అనే పెద్దమనిషిని ఈరోజు కలవబోవటమే.
హైదరాబాదు నుండి కోచింగ్ పూర్తి చేసుకుని నెలప్పుడు ఇంటికి వచ్చాడు మొగిలప్ప. బాగా చదువుతానని వాడికి నేనంటే చాలా ఇష్టం. గ్రూప్ వన్ ఇంటర్వ్యూ లో పోయినా పట్టు విడవకుండా, చదివి గ్రూప్ టూ జాబ్ కు సెలెక్ట్ అయ్యానని నేనంటే మంచి గౌరవం కూడా.
“ అన్నా పరసువేది చదివినావా , సీక్రెట్ చదివినావా, జోనాధన్ లివింగ్ స్టన్ సీగల్ చదివినావా ? నువ్వు ఏం చదివినావో చెప్పు, నేనూ నీలాగే కాంపిటిషన్ పరిక్షలు పాస్ అయిపోయి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయి ఉద్యోగం సంపాదించల్ల. మా నాయనను, అమ్మను అడవిలోకి పోనీకుండా , కంపా గోడూ తెచ్చే పనిలేకుండా, పందుల్ని మేపే పని చెయ్యనీకుండా బాగా చుసుకోవల్లన్నా. ఎట్లాగైనా గవర్నమెంటు జాబ్ కొట్టాల్లన్నా. నువ్వు చెప్పు యెట్లా చదవాలో,నీ టెక్నిక్ ఏందో చెప్పన్నా.” ఇట్లాగే ఆగకుండా ఎదుటి వాడు మాట్లాడే దానికి అవకాశమే ఇవ్వకుండా వేగంగా మాట్లాడతాడు ఎప్పుడూ మొగిలప్ప. నేను నవ్వేసే వాడిని.
పుస్తకాలు చదివితేనే పరిక్షలు పాస్ అయ్యేట్లుంటే , కొన్ని లక్షల మందికి ఈ పాటికి పెద్ద పెద్ద ఉద్యోగాలే వచ్చి వొడిలో వాలిపోయి ఉండల్ల.కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు. అధ్యయనం ముఖ్యం, సూక్ష్మ పరిశీలన ముఖ్యం, పుస్తకం మనలో ఇంకి పోవల్ల.నేను పక్కాగా నా నోట్స్ నేనే సొంతంగా ప్రిపేర్ చేసుకుంటా.ఇంతకు ముందు నాలాగా పరిక్షలు రాసి పాస్ అయిన వాళ్ళని కలసి వాళ్ళ అనుభవాలు తెలుసుకునే వాడ్ని.మనం ఎవ్వరిలా కావాలని అనుకుంటామో, అలాంటి వాళ్ళని కలసి వాళ్ళు యెట్లా ఈ ఉద్యోగాన్ని ఇష్టపడేవాల్లో, వాళ్ళు యెట్లా సక్సెస్ అయ్యారో తెలుసుకునే వాడ్ని. వాళ్ళ అనుభవాలతో మనకు ఎన్నో మెళకువలు నేర్పుతారు.” అని నేను చెప్పిన మాటల్ని అతడు బాగా గుర్తుపెట్టుకున్నాడు.
చుట్టుపక్కల ఇండ్లల్లోంచి యస్టీ కాలని పిల్లల్ని కొందర్ని గుంపుగా చేర్చి సాయంత్రాలు గుడిసె ముందు నిలబెట్టి పందుల షెడ్ వైపు చెయ్యి చూపిస్తా మొగిలప్ప క్లాస్ చెపుతుంటాడు. మొదట్లో ఒక్క మాట అంటాడు .
“ ఈ జీవితం మారల్ల, మన బ్రతుకులు బాగుపడల్ల అంటే చదువొక్కటే మార్గం.”
అప్పుడప్పుడూ నేను కూడా కొంచెం దూరంగా నిలబడి అతడి మాటల్ని ఆసక్తిగా వింటూ వుంటాను.షెడ్ లో పందులు కూడా గుర్రుమంటూ తలలు ఊపుతూ అతడ్ని వింటున్నట్టే, అయన చెప్పేది అర్థం అవుతా వున్నట్లే తలలు ఆడిస్తా వుంటాయి.
“నిద్రపోతే వచ్చేది కాదు కల అంటే .మీకు నిద్ర లేకుండా రాకుండా చేసేదే మీ అసలైన కల. మీ కలల్ని ముందుగా మీరు చూడగలగాలి .నిద్రలేవగానే రోజూ అద్దం లో మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఎప్పుడైతే మీ మొహం బదులు మీ లక్ష్యం, మీ భవిష్యత్తు మీకు అద్దంలో కనపడతాయో.. ఆప్పుడు మీరు మీ లక్ష్యానికి చేరువలో వున్నారని అర్థం. మీకు కారు కావాలి అంటే మీరు దాన్ని ముందుగానే ఊహించాలి. ఏరకం కారు ఏ మోడల్ కొనాలో, ఏ రంగులో ఎంతలో కొనాలో స్పష్టత వుండాలి. అదే మాదిరి మీరు ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళను కలవాలి. ఆ ఉద్యోగం గురించి ముందుగా తెలుసుకోవాలి. మీ వాళ్ళల్లో అంటే మీ బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ మీరు కోరుకునే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడండి, నేరుగా వాళ్ళను కలవండి. ఉత్తుత్తి బంధుత్వాలు, పరిచయాలు, స్నేహితాలు వేరు. వాళ్ళ వృత్తిలో వాళ్ళ అనుభవాలు మీకు స్ఫూర్తి కలిగిస్తాయి.మీ కలలు త్వరగా సులభంగా నెరవేరుతాయి.” హైదరాబాద్ లో పోటీ పరిక్షల శిక్షణా కేంద్రం లో ఎప్పుడూ వినే మాటలే అతడిలో బలంగా జీర్ణించుకుని పోయాయి. మొత్తానికి అతడి కల, జీవిత లక్ష్యం పొలీసు కావడమే . యస్టీ కాలని మొత్తం ఆ విషయం చిన్న పిల్లాడి వద్దనుండి ముసలివాళ్ళ వరకూ అందరికీ తెలుసు.
అందుకే ఎప్పుడూ పొలీసు మునిరత్నం పేరు కలవరించేవాడు. మన బంధువుల్లో ఒక్క పోలీసు ఉన్నాడు కదన్నా. ఎట్లాగైనా ఆయన్ని కలవాల్సిందే అనేవాడు. ఇప్పుడు అతడికి ఉద్యోగం లేదంట కదా . వేరే వాళ్ళను కలుద్దాం లే అని నేను చెప్పినా, అది కాదన్నా, మనోడైతే మనకు ఏదీ దాచకుండా అన్నీ చెప్తాడు కదా అనేవాడు.
ఏం లేదన్నా. ఆయన ఎందుకు ఉద్యోగం మానేసాడో అ సంగతి కూడా తెలుసుకోవల్ల కదా.ఎంతో కష్టపడితే వచ్చిన ఉద్యోగాన్నే వదులుకున్నాడు అంటే ఏందో బలమైన కారణమే వుంటుంది కదా. అది తెలుసుకోవాలనుకుంటున్నా. ఎవర్ని అడిగినా ఏదేదో చెప్తావుండారు, గానీ ఆయన్నే నేరుగా అడిగేస్తే అసలు కథ ఏందో ఆయనే చెప్పేస్తాడు కదా అనేవాడు. ఆ పోలీసు మునిరత్నం గురించి అస్సలు ఏం జరిగిందో ఎవరికి తెలీదు. పొలీసు కావాలని అనుకునే వాడ్ని కదా .అయన పోలీసు ఉద్యోగం ఎందుకు వద్దనుకున్నాడో, ఎందుకు వదులుకున్నాడో తెలుసుకోవాలని మొగిలప్పకే కాదు నాకూ వుంది. అయితే ఇన్నేళ్ళకు ఈరోజే ఆ అవకాశం వచ్చింది. బజారుకు వెళ్లి ఇంట్లోవాళ్ళు చెప్పిన పూజ సామాన్లు , పూలు, పండ్లు తెస్తూ మధ్యలో బస్టాండు వద్ద ఆగి, టీ తాగుతూ మరోసారి దానిగురించే మాట్లాడుకున్నాం.
వార్తలు కొన్ని అక్కడక్కడా చదువుతా, కొన్ని వార్తలు వదిలేసి , దినపత్రికలని మడిచి అక్కడే పడేసి, టీ తాగడం అయ్యాక అక్కడినుండి కదిలాం.
అప్పటికి సమయం సరిగ్గా పన్నెండు గంటలు.
ముందు మా ఇల్లు చేరి మా అమ్మ అడిగిన వస్తువుల్ని అమ్మకు అప్పకు అప్పగించాక, మా చిన్నాయన వాళ్ళ ఇంటివైపు నడిచాం. యస్టీ కాలనీలో దుర్గమ్మ గుడి ముందు కోలాహలంగా వుంది. గుడికి దగ్గరే మా చిన్నాయన వాళ్ళ ఇల్లు. లౌడ్ స్పీకర్ లోంచి అమ్మ వారి శ్లోకాలు, పాటలు పెద్ద సౌండ్ తో వినిపిస్తున్నాయి. పిన్నమ్మ మేం తెచ్చిన పూజ వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటా వుంటే, మా చిన్నాయన మెల్లగా నోరు విప్పినాడు.
“సూస్తావుండు. ఈ దినం సూడు.. మొత్తం జాతర మాదిరి జనం ఉడ్డ చేరిపోతారు. యాడేడ వుండే వాళ్ళో దూరాభారం అని సూడకుండా వచ్చేస్తారు సూడు.నువ్వు ఎప్పుడూ అడగాతా ఉంటావే, పొలీసు మునిరత్నం ఎవురు ఎవురు అని, ఈ దినం సూపిస్తాలే. మొగిలప్ప డౌట్లు అన్నీ తీరిపోతాయి ఈ దినం ” అన్నాడు మా చిన్నాయన నవ్వుతా తన సహజ ధోరణిలో. ఈ సారి ఎందుకో ఆయన మాటలు ఎంత చిన్నగా మాట్లాడినా, అంత సౌండ్ లోనూ నాకు స్పష్టంగానే వినిపించాయి. అదే ఆశ్చర్యం.
ఆ మాట అనగానే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.ఎన్నాళ్ళ నుండో అడుగుతున్నాను, కానీ నాకు ఆ మునిరత్నం అనే అయన్ను కలుద్దామంటే ఇప్పటిదాకా కుదిరిందే లేదు.ఎప్పుడైనా పండగలు దేవరలు, చావులు, పుట్టిన రోజులు, పెళ్ళిళ్ళు ఇలా అనేక సందర్భాల్లో బంధువులనే వాళ్ళు కలవడం మామూలే కానీ , అయన మా వూరు వచ్చినప్పుడు నేను హాస్టల్లో , లేదా నేను వచ్చిన సందర్భాల్లో అయన రాకుండా పోవడమో, నా చదువులు , పరిక్షలు, డిగ్రీ అయ్యాక గ్రూప్స్ కి కోచిoగ్ కోసం నేను హైదరాబాద్ లో మూడేళ్ళకు పైగా ఉండిపోవడంతో ఆయన్ను కలిసే అవకాశమే నాకు లేకుండా పోయింది. చిన్నప్పుడు, మధ్యమధ్యలో కొన్నిసార్లు ఆయన్ను చూసాను కానీ, అంతగా నేను పట్టించుకుంది లేదు.
నాకంటే ఎక్కువ ఉత్సాహం , కుతూహలం మొగిలప్పలో కనిపిస్తున్నాయి.
“పోలీసు మునిరత్నం అన్న పేరు ఒక్కటే కాదు నాయనా , ఇంకా ముందు ముందు పోలీసు మొగిలప్ప అనే పేరు కూడా మన ఎరికిలోల్లు చెప్పుకోవల్ల. ఈ ఇలాకలో మనోల్లల్లో పోలీసు అనే వాడు లేదు అని ఎవ్వరూ అనుకునే పనే లేకుండా చేస్తాను , చూస్తా వుండు, మాటంటే మాటే. ” మొగిలప్ప గొంతులో అప్పటిదాకా లేని స్పష్టత నాకు ఆశ్చర్యం కలిగించలేదు.ఆ మార్పు నేను ఊహిస్తున్నదే. ప్రతి ఒక్కడికీ లోపల ఏదో సాధించాలి అనే తపన వుంటుంది. కొందరికి అది వెంటనే వెలుగుతుంది. కొందరికి ఎవరో ఒకళ్ళు అగ్నిలాగా దాన్ని వెలిగించాకే కదిలే సందర్భాలు వుంటాయి.
నింపాదిగా అతడి వైపు చూశాను. మంచి పొడగరి, ధీశాలి గా కనిపిస్తాడు మొగిలప్ప.
కురచగా జుట్టు కత్తరించుకుని, పోలీసు క్రాప్ తో ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు.
అతడి కళ్ళల్లో వెలుతురు అతడు తప్పకుండా ఎప్పుడూ తను అనుకున్నది సాధిస్తాడు అనే నమ్మకాన్ని నమ్మకంగా చెపుతోంది.
మునిదేవర పండగ ఇంకా మొదలు కాక ముందే పొలీసు మునిరత్నం నేరుగా గుడి ముందుకు వచ్చేసాడు. మనోళ్ళు నలుగురు ఎప్పుడన్నా యాడన్నా ఉడ్డ చేరినప్పుడు వినిపించాల్సింది దేవుడి పాటలు కాదుకదా అని క్షణాల్లో క్యాసెట్టు మార్పించేసినాడు. ఆయనకి అడ్డు చెప్పే వాళ్ళు అక్కడ ఎవరూ లేరు.
కులనిర్మూలన పాటలు, అంబేద్కర్ పాటలు యస్టీ కాలనీలో.
ఒళ్ళు జలదరించింది నాకైతే.. !
కొన్ని క్యాసెట్లు గుడికి తెచ్చినానని చెపుతూ గుడి పనులు చూసే ప్రకాష్ కి అందించాడు.మనిషిలో వయసు తెలియడం లేదు, చురుగ్గా ఉత్సాహంగా వున్నాడు. అదే అతడి ప్రత్యేకతేమో అనిపించింది నాకు .
మామూలు కుశల ప్రశ్నలు పూర్తి అయ్యాక మా చిన్నాయన వాళ్ళ ఇంట్లో అందరం మాటలకు దిగేసినాం. ఎక్కువ సేపు ఆగలేక మొగిలప్ప అడగనే అడిగేసినాడు .పోలీసు ఉద్యోగం గురించి, రాత్రిపగలు చేసే డ్యూటీల గురించి, సాధకబాధకాల గురించి చెప్పుకొచ్చాడు ఆయన.
ఏ తప్పు చెయ్యని, మనోల్లని తప్పుడు కేసు లేకుండా పోరాడి వాళ్లకి న్యాయం అయితే చేసినా కానీ నాపైన పెద్ద కులపోల్లకి, పై ఆఫీసర్లకి మంట మొదులైపోయింది. ఏందేందో డ్యూటీలు వేసి, ఎక్కడెక్కడో తిప్పతా వున్యారులే. మనకి ఇది సెట్టు కాదని తేల్చుకున్యాక, మనం యునిఫారంలో ఉన్న్యా మనకులపోల్లకే న్యాయం చెయ్యలేమని తెలుసుకున్యాక గట్టిగా ఎదురు తిరిగినాలే… ” అని క్షణం ఆగి కొనసాగించాడు.
“మన ఎరుకల కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకుంటానా? నాలో పోతాఉండేది ఆ రక్తమే కదా కులానికి ఎరుకలోడు అయితే దొంగే అంటావా? ఎవడ్రా దొంగా.. దొంగ నాకొడకా అని యస్ ఐ చొక్కా పట్టుకునేస్తి. ఉద్యోగం అయితే పొయ్యింది కానీ, నా పేరులోంచి పోలీస్ అనే మాటను పికేదానికి ఎవడి తరం కాలే. ఇదంతా చెప్పేది నిన్ను భయపెట్టాలని కాదు. ఒకటికి రెండు సార్లు యోచించుకుని అన్నిటికీ సిద్దపడే ఉద్యోగంలో చేరల్ల అని హెచ్చరించేడానికి మాత్రమే . మన కులం గురించి చెప్పకుండా ఉండలేం. కులాన్ని దాచిపెట్టాల్సిన అవసరం మనకి ఎవరికీ లేదు. ఎవరి కులం వాళ్లకు గొప్ప. ఎప్పుడో ఎవరో ఏ కాలం లోనో దొంగతనాలు చేసినారని మొత్తం మన జాతినే దొంగలంటే యెట్లా ఒప్పుకుంటాం ?ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం. ఉద్యోగం వల్ల వచ్చేదే గౌరవం కాదు. తలపైన టోపీ పోయినా పర్వాలేదు కానీ తల దించుకునే ఖర్మ నాకు వద్దు అనుకున్నాను. పోయిన ఉద్యోగం గురించి నాకు ఎప్పుడూ బాధ లేదు.నేల తల్లిని నమ్మినాను. మట్టికి కులం లేదు, మలినం తెలీదు . నా బ్రతుకేందో నేనే సొంతంగా బ్రతకతా ఉండాను. రోజంతా లేచి లేచి నిలబడి కాలు పైకెత్తి సెల్యూట్ కొట్టేది మానేసి ఇప్పుడు నేలతల్లికి దండం పెట్టుకుండా ఉండాను..”
అయన మాటతీరు స్పష్టంగా వుంది. ప్రశాంతంగా చూస్తూ మెల్లగా మాట్లాడుతున్నాడు.ఎక్కడా తడబాటు లేదు, మొహమాటం కానీ , జరిగిపోయినదాని గురించి బాధ కానీ అతడి మోహంలో కానీ, మాటల్లో కానీ, గొంతులో కానీ కనిపించడం లేదు.
మునిదేవరా పూజ పూర్తి అయ్యింది.మధ్యాహ్నం ఆకలి వేళ. వడ్డనకి ఎవ్వరూ ముందుకు రావడం లేదు, మొహమాట పడుతున్నట్లు వున్నారు.మునిదేవర చేసిన ఇంటి వాళ్ళు కొందరు హడావిడిగా అటూ ఇటూ తారాడుతున్నారు.
ఎండ భీకరంగా వుంది.అందరికీ ఆకలి వేస్తా వుంది. ఇంకా భోజనాలకు పిలుపు రాలేదు. ఏ నిముషంలో అయినా పిలువు రావచ్చు అనే ఆశతో జనం భోజనాల బల్లల వద్ద షామియానా కింద ఆకలి మొహాలతోఅందరూ ఆశగా ఎదురు చూపులు చూస్తూ వున్నారు.
పోలీస్ మునిరత్నం మొహమాటం లేకుండా భోజనాలబల్ల వద్దకు నడిచాడు, మమ్మల్ని కూడా రమ్మన్నట్టు సైగ చేయడం తో మేం కూడా మొహమాట పడుతూనే అతడితో బాటూ ముందుకు నడిచాం.
“ ఈ బెరుకూ మొహమాటాలే కద చిన్నోడా .. కొంపలు ముంచేది.నువ్వు ఏమైనా చెప్పు.. మనోళ్ళకు ఎక్కడికి పోయినా మొహమాటాలు బెరుకూ ఎక్కువ. ధైర్యం తక్కువా. యాడా టకా అని ముందుకు దూసుకుని పోలేరు. కొంచెం ఎదిగినోల్లని చూస్తే మనోళ్ళే అయినా సరే, మనోళ్ళు ముందుకు పోలేరు. మనోల్లే మనోళ్ళతో కలవలేరు. కొంత మంది కొంచెం పైకి వచ్చినాక ఎరికిలోల్లు అనికూడా చెప్పుకోరు. థూ..కులం పేరు కూడా మార్చి చెప్పుకుంటారు బడాయికి . అట్లాంటి ఎధవల్ని కులంలోంచే మనం ముందు వెలేయల్ల చిన్నోడా. రా…. రా… తిండికాడ మొహమాటం వుండకూడదు ” ఆ మాటలు వింటూ అప్పటిదాకా అతడు భోజనాల కోసం వెడుతున్నాడని అనుకున్నాం కానీ, అతడు నేరుగా వడ్డనలోకి దిగిపోయాడు. మమ్మల్ని చూసి ఆ ఇంట్లోంచి ఒక పెద్దాయన , ఇద్దరు కుర్రాళ్ళు, వచ్చిన వాళ్ళలోంచి ఒక కాలేజి అమ్మాయి ముందుకు వచ్చారు.
“ చూడండి ముసలివాళ్ళు, చిన్న పిల్లోల్లు, ఆడోల్లు పని చేసి చేసీ బాగా ఆకలిపైన వుండారు. ఎండకు గాలికి ఇంకా కడుపులో ఆకలి పెరకతా వుంటుంది. ముందు వాళ్ళని కూర్చోమని చెప్పండి. ” అంటూనే చురుగ్గా అతడు కదిలాడు. నిముషాల్లో అక్కడ అంతా సద్దుమనిగింది. కుర్చీలు కొన్ని దూరంగా వేయించడం, చేతులు కడుక్కోవడానికి దూరంగా బకెట్ నిండా ఉప్పునీళ్ళు తెప్పించడం, తినేసిన ఆకులు, ప్లాస్టిక్ గ్లాసులు పడేయటానికి వెదురు గంపలు పెట్టించడం అంతా చకచకా జరిగిపోయింది.
గంటన్నరలో భోజనాలు ముగిసాయి.
ఆఖరి బంతిలో మేం కూర్చునే సరికి మాకు వడ్డించడానికి చాలామంది ఉత్సాహంగా పోటీ పడ్డారు.
అప్పుడు అక్కడ ఎలాంటి మొహమాటాలు లేవు.వాళ్ళు ఎవరెవరో మాకు వరసకి ఏమవుతారో కూడా మాకు తెలియదు. సందడిగా మనుషులు కొందరు ముందుకు వచ్చారు అంతే.!. మనుషులు మనుషుల పట్ల యెట్లా ఎందుకు స్పందిస్తారో అప్పుడు అర్థం అయ్యింది నాకు.
అయన బయలుదేరుతున్నపుడు బస్టాండు వరకూ నేను, మొగిలప్ప తోడుగా వెళ్ళినప్పుడు, అయన మేం వద్దంటున్నా వినకుండా టీ హోటల్ కు తీసుకు వెళ్ళినాం.
టీ హోటలు ఓనరమ్మ విసనకర్రతో మొహానికి అడ్డంగా గాలికోసం విసురుకుంటూ ఉంది. మేం కాస్సేపు నిలబడి చూసాం కానీ, టీ వేసే కుర్రాడు భోజనానికి వెళ్లి ఇంకా వచ్చినట్లు లేదు. చెక్కబెంచి పైన కూర్చుని, అప్పటిదాకా అతడ్ని అడగలనుకుని, అడగలేక పోయిన ప్రశ్నని బయటకు తీసాం.
“ మీరు ఎందుకు పోలీసు ఉద్యోగం వదులుకున్నారు మామా ? ”
ఆయన మా నుండి ఈ ప్రశ్న వస్తుందని ముందుగానే ఊహించినట్లు ఉన్నాడు. మా వైపు చూస్తూ చిన్నగా నవ్వినాడు. హోటల్ ఓనర్ వైపు, రోడ్డు వైపు, బస్టాండు లోకి పోతున్న ఆటో వైపు , రోడ్డుకు అటు వైపుగా నిలుచుని అదే పనిగా తోక ఊపుతున్న కుక్కని చూసాడు.మళ్ళీ మా వైపు తల తిప్పి చూస్తా అదే మాదిరి మెల్లగా పైకి కనపడీ, కనపడకుండా నవ్వినాడు.
“వానలో మోబ్బులో ఆరోజు రాత్రి కదా నాకు ప్రాణం పోయినంత బాధయ్యింది. స్టేషన్ లో డ్యూటీ లో వుండినప్పుడు మనిషి ఎట్లా వుండల్లో తెలుసా…? ” అని క్షణం ఆగి మా వైపు తేరిపారా చూసాడు, చూసి అతడే ఎంత మాత్రం ఆలస్యం లేకుండా జవాబు చెప్పేసాడు.
“ ఎట్లుండాలో తెలుసునా? మనిషి మనిషిగా మాత్రం వుండకూడదు. మనిషి అచ్చు పోలీసులాగే ఉండల్ల. రాయిలాగా గట్టిగా నిలబడల్ల. కళ్ళ ముందర అన్యాయమే జరిగినా, ఘోరమే జరిగినా చూస్తూ నెమ్మదిగా చెవిటి మూగా మాదిరి, గుడ్దోని మాదిరి ఉండల్ల. ఏడుపులు ఎంత మాత్రం వినిపించనంతగా చెవులు మూసుకోవల్ల చిన్నోడా.. కొత్తగా ఉద్యోగంలో చేరినా కదా. అప్పుడు నాకు అదంతా తెలీదు. ఆ గొంతు ఎక్కడో తెలిసినట్లే అనిపించింది. ఆ మొహం సరిగ్గా కనపడలేదు కానీ ఎక్కడో బాగా చూసినట్లే అనిపించింది. మా హెడ్డు అప్పటికే నన్ను దూరంగా లాగతానే వున్యాడు కానీ నాకే అర్థం కాలే….” అని కాస్సేపు ఆగిన్నాడు.
బహుశా ఆయన కళ్ళల్లో కన్నీళ్లు ఇమిరి పోయినట్లున్నాయి.మొహంలో మార్పు కనిపించింది. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు.
ఈ లోగా చాయ్ వచ్చింది.
“ఇంకొంచెం డికాషన్ వేసి ఆకు మార్చి స్ట్రాంగ్ గా ఇవ్వు బాబు” అని గట్టిగా అన్నాడు.
ఆ గొంతు లోని స్థిరత్వం, అజ్ఞాపిస్తున్నట్లు వచ్చిన ఆ మాటల తీవ్రతకి పదునికి ఆ హోటలు కుర్రాడు , ఒనరమ్మే కాదు , మేం కూడా ఉలిక్కిపడ్డాం.
కొన్ని క్షణాల్లోనే అయన తన దుఖపు జ్ఞాపకాల్లోంచి తేరుకోవడం, మామూలుగా అయిపోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది కానీ, అట్లా ఆయన తనను తాను అట్లా క్షణాల్లో నిమిషాల్లో సర్దుకోవటానికి ఎన్ని ఏండ్లు ఎన్ని విధాలుగా తనను తానూ సర్దుకుని ఉంటాడో అని అనిపించింది.
ఏమనుకున్నాడో ఏమో, ఆ టీ హోటలు కుర్రాడు మా ముందున్న గ్లాసుల్ని కూడా మౌనంగా వెనక్కి తీసేసుకున్నాడు. ఏమీ మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు.
పోలీసు మునిరత్నం ఇప్పుడు పోలీసు కాదు.అయినా పోలీసు క్రాప్ అట్లాగే మైంటైన్ చేస్తున్నాడు.ఆయన ఇప్పుడు పొలీసు ఉద్యోగంలో లేకపోవచ్చు. కానీ ఆ గొంతులో ఏదో వుంది. అది కేవలం అధికారానికి సంభందించింది కాదు.కొంచెం ప్రేమా, కొంచెం మార్దవం, కొంచెం అనునయం, ధైర్యం, తెగింపు, నిలదీసి ప్రశ్నించే నిక్కచ్చితనం, అన్నీ కలసిపోయిన గొంతు అది.ఒక్క మాటలో చెప్పాలంటే అతడి గొంతులో, మాటలో ఏదో క్లారిటీ వుంది.కమాండింగ్ వుంది.
ఈసారి గ్లాసులు మారాయి.
ముందు మాకు ఇచ్చిన ప్లాస్టిక్ కప్పులో పేపర్ కప్పులో కావు.
వాటి బదులు స్టీలు గ్లాసులు వచ్చాయి.
టీ ముందులాగా నీళ్ళు నీళ్ళుగా లేదు.
చిక్కగా వుంది. స్ట్రాంగ్ గా వుంది.
టీ టీ లాగే వుంది.రంగు రుచి చిక్కదనం..పరిమళం అన్నీఈ టీలో ఉన్నాయి.
“ చాలసార్లు చెప్పినా కానీ ఇంతవరకూ వీళ్ళు వినిందేలే. ఇప్పుడు సూడు.. దీన్ని కదా టీ అంటారు.” అన్నాడు మొగిలప్ప. సంతోషం నిండిన కళ్ళ నిండా నవ్వుతూ టీని ఇష్టంగా, సంతోషంగా చప్పరిస్తూ…
“ అవునవును ఇది కదా టీ…” అన్నాను నేను కూడా నవ్వుతూ.
హోటల్ ఓనర్ వైపు చూశాం. ఆమె కళ్ళు కొంచెం పెద్దవి చేసి మమ్మల్నే చూస్తా వుంది. ఆమె కళ్ళల్లో విస్మయం,భయం, కంగారు.
“మార్పును చూసి తట్టుకోవడం ఎవరికైనా వెంటనే కష్టమే .కొంచెం టైం పడుతుందిలే ..”
అంటున్నాడు మా పోలీసుకాని పోలీసు మామయ్య మునిరత్నం.ఇంకో మాట కూడా అన్నాడు, మొగిలప్ప భుజం పైన చెయ్యి వేసి..
“ముందు నువ్వు ఒకటే నేర్చుకోవల్ల పిల్లోడా . ఏదైనా సాధించాలి అనుకునే ఎరుకలోడి జీవితంలో అస్సలు భయం వుండకూడదు…ముందు మనిషనే వాడు భయాన్ని నరికేయ్యల్ల. నువ్వు ఏదైనా కల గంటే ముందు నువ్వు దేనికీ భయపడొద్దు . ధైర్యంగా వుండు. అదే అన్నిజబ్బులకి మందు.’’
అప్పుడు చాలాకాలం తర్వాత మొదటిసారి నాకు ఇంకో టీ తాగాలనిపించింది.
వాళ్ళిద్దరి వైపు చూసాను.
వేడి వేడిగా అందరికంటే ముందు ఖాళీ అయిన నా టీ కప్పు వైపు చూస్తా నవ్వుతున్నారు ఇద్దరూ.
ఇబ్రహీం రోడ్డు దాటుతున్నాడు. ముసలితనాన్ని లెక్క చెయ్యకుండా అదే నిర్లక్ష్యంగా తలను అటు ఇటూ తిప్పుతూ మొహానికి పట్టిన చమటను విదిలించి పారేస్తూ,ఎండని, చలిని పట్టించుకోనట్లు,దేనితో, ఎవరితో సంభందమే లేనట్లు, దృష్టి మొత్తం వెడుతున్న దారి మీదే నిలిపి ఇబ్రహీం ఏకాగ్రతతో సరుకుల బండిని లాక్కుపోతున్నాడు.
“ బాబూ ఇంకో స్ట్రాంగ్ టీ.. వేడిగా చిక్కగా.. ” బుల్లెట్లా దూసుకు వచ్చాయి మాటలు.
నిస్సందేహంగా అది మొగిలిప్ప గొంతే!
ఏదో మార్పుకు సూచనగా.. కొత్తగా అనిపించింది.
Katha. Baagundhi. Sir
Prashininchali —gonthu yetthali
Bhayam deniki —yenduku ???
========================
Buchireddy gangula