“ఇదంతా అయ్యేపని కాదులేన్నా” నిష్ఠూరంగా అన్నాడు గోపాల్.

గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్పై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. అతడి తల్లోంచి చెమట కారిపోతోంది. ఎడమచేతికి వున్న వాచీకేసి రోడ్డుకేసి మాటిమాటికి తలతిప్పి చూస్తున్నాడు. అతడి కళ్లు చురుగ్గా వున్నాయి. మొహం ప్రశాంతంగా వుంది.

ఎంఆర్ఓ ఆఫీసు ముందు జనం గుంపు చేరిపోయారు. ఎండ చుర్రుమంటోంది. ఉదయం పదకొండు గంటలవుతున్నా ఎంఆర్ఒ జాడలేదు. ఆఫీసులో సిబ్బంది కూడా పలుచగా ఉన్నారు.కొన్ని సీట్లు ఖాలీగా కనపడుతున్నాయి.ఒక ఉద్యోగి దినపత్రికని తల పైకెత్తకుండా శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అతడి ముందు బిక్క మొహంతో ఒకామె నిలబడి వుంది. ఆమె ఏవో కాగితాల్ని, పట్టాదార్ పాస్ బుక్ ని చేతిలో బధ్రంగా పట్టుకుని అతడి వైపే చూపులు నిలిపి  వుంది.

” ఏమయ్యా నాగమల్లయ్యా ఎంఆర్ఒ సారు ఇంకా ఆఫీసుకు రాలేదు. ఎప్పుడొస్తాడో నీ కన్నా తెలుసా? తెలీదా? ” నవ్వుతూ అటెండర్ను పలకరించాడు రమణ. ఎంఆర్ఒ గది ముందు స్టూలుపైన కూర్చుని  చెవిలో గుబులు తీసుకునే పనిలో బిజీగా వున్న నాగమల్లయ్య విసుగ్గా తలపైకి ఎత్తి చూసాడు. బట్టతలను ఎడంచేత్తో తడుముకుంటూ నోరు తెరిచాడు. మాటకంటే ముందు ఆవులింతే బయటకొచ్చింది. బీడి వాసన గుప్పుమంది.

 ” మా తాసిల్దారు  సారు యాడికి పోయినాడో, ఎప్పుడు వస్తాడో  నాకు తెలీదన్నా. ఆఫీసు లోపల అడిగి చూడు” ఆమాట చెప్పి తన పనిలో మునిగిపోయాడు నాగమల్లయ్య. ఆ మాటతో బాటే రమణ కదిలాడు. ఆఫీసు లోపలికి వెళ్లి  పది నిమిషాల తర్వాత బయటికొచ్చి జనం వైపు కదిలాడు . అతడు ఆఫీసులోకి పోవటం చూసిన నాగమల్లయ్య తలతిప్పి గోపాల్ వైపు చూసి పలకరింపుగా నవ్వాడు.

“నువ్వుకూడా ఆ కులసంఘంలో  వుండావా బాబు. చానా మంది జనం వచ్చిండారే. వీళ్లందరికీ ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు కావల్లంటే ఇదంతా అయ్యే పనేనా అసలు?”

ఆ మాటలతో ఏకీభవిస్తున్నట్లు తలాడించాడు గోపాల్. ” నేను కూడా అదే అనుకుంటున్నా. నేను  గిరిజన సంఘంలో  కొత్తగా చేరినాలే. రమణన్నంటే ఊర్లో అందరికీ బాగా తెలుసు నేను కొత్తకదా, అసలైన పేదోళ్లకి మా యస్టీలకి  పట్టాలు ఈకుండా బినామీ పేర్లతో ఎవురెవురికో పట్టాలు ఇచ్చేసినాడంట కదా మీ ఎం.ఆర్.ఒ. సారు. ఆ పట్టాలన్నీ రద్దు చేసి న్యాయంగా ఇండ్లు లేని  కూలోళ్లకి, కార్మికులకి పట్టాలు ఇయ్యాలనే కదా మేం ధర్నా చేస్తాండేది. మా యస్టీ కాలనీ మొత్తం ఈడ్నే వుండార్లేన్నా” అన్నాడు గోపాల్ గొంతు తగ్గించి రహస్యం చెపుతున్న వాడిలా.

 ” ఏమేం పనులు చేస్తాంటారు వీళ్లంతా. ఐనా ఇంతమందీ మీ సంఘం లో మెంబర్లేనా? ” కుతూహలంగా అడిగాడు నాగమల్లయ్య బట్టతల్లో చెయ్యిపెట్టి చెమట తుడుచుకుంటూ .

గుంపులో ఆడామగా కొందరు వక్కాకు నములుతున్నారు. ఎండకు తాళలేక పసిపిల్లలు తల్లుల్ని సతాయిస్తుంటే వారిని సముదాయించే ప్రయత్నంలో మొగుళ్లని విసుక్కుంటున్నారు కొందరు ఆడవాళ్లు. గుంపుకు దూరంగా కొందరు మొగవాళ్లు బీడీలు వెలిగించి కబుర్లు చెప్పుకుంటున్నారు.

తలతిప్పి జనం వైపు పరిశీలనగా చూస్తూ బదులిచ్చాడు గోపాల్.

“మా రమణన్నకి మిగతా సంఘాల లీడర్ల మాదిరి సభ్యత్వం వుంటేనే వాళ్ల పనులు చెయ్యల్ల అనే రూలేం లేదన్నా. ఊర్లో ఏమూలుండే వాడైనా సరే రమణన్నా నాకు అన్యాయం జరిగిండాది చూడన్నా అంటే చాలు. సొంత పనులు కూడా పక్కలో పెట్టేసి ముందు వాళ్లపని చూసేస్తాడు. వాడు ఎవుడో,  ఏకులమో , ఏ ఏరియానో , యూనియన్లో వుండాడో లేదో  అని  పట్టింపేలేదు ఆయన్నకి. ఈడుండే జనమంతా కూడా మా సంఘమోల్లు మాత్రమే  కాదన్నా” అని ఆగి మళ్లీ కొనసాగించాడు గోపాల్.

“ ఈడుండే వాళ్ళలో బాతులు మేపే వాళ్ళు, పందులు మేపే వాళ్ళు ఉండారు .వెదురు బుట్టలు తట్టలు అల్లే వాళ్ళు వుండారు.  కార్మికులుంటారు. ఎస్టిడి బూతుల్లో, హోటల్లో, సినిమా హాళ్ళల్లో, ఇండ్లల్లో పనిచేసే లేబరోళ్లుండారు. వ్యవసాయ కూలీలుండారు. కాంట్రాక్ట్ ఉద్యోగులూ వుండారు.అయినా  ఏందినా మీ ఆర్ఐ సారు అదేపనిగా  ఆఫీసులోంచి కంగారుపడతా వస్తాపోతానే వుండాడు. జనంకల్లా చూసుకుంటా సెల్ఫోన్లో మాట్లాడతానే వుండాడు. అప్పట్నుంచి చూస్తానే  వుండా ఫోను కిందపెట్టే పనే లే…ఆయన ”

ఆ మాటతో నాగమల్లయ్య తడబడి పడిపోయాడు. మరోసారి బట్టతల గోక్కున్నాడు.”నువ్వు ఆ సార్ని చూస్తాండేది.ఆ  ఆర్ఐ సారు గమనించలేదు కదా. నీతోబాటు నేను మాట్లాడతా వుండేది గానా  చూసినాడంటే. నేనేందో లిటిగేషన్ చేసినట్లు ఎంఆర్ఒ కి రిపోర్ట్ చేసేస్తాడు. అసలే ఆ ఆర్ఐ సార్ కి నేనంటే అస్సలు అయ్యేదిలే. ” బట్టతల గోక్కోవడం ఆపకుండానే స్టూలు పైనుంచి లేచి నిలబడి కంగారుగా అన్నాడు నాగమల్లయ్య. అంటూనే ఆర్ ఐ  కోసం పరిసరాల్లో చూసాడు. కానీ అతడు ఎక్కడా కనిపించకపోవడంతో మళ్ళీ స్టూలుపైన కూర్చుని నిట్టూర్చాడు.

యధాలాపంగా జనంవైపు చూసాడు గోపాల్. అతడికి పాతికేళ్లు వుంటాయి.పొట్టికాదు, పొడవూ కాదు, చామనఛాయ. బలిష్ఠమైన దేహం, నూనె మిల్లులో పని చేస్తున్నాడు. కొత్తగా పెళ్లయ్యింది.

జనం ఎండకు తాళలేక పోతున్నారు. చింతచెట్టు కింద చేరి ఆడుకుంటున్న చిన్న పిల్లలు కొందరు గోపాల్ దృష్టిని ఆకర్షించారు. వాళ్లేం చేస్తున్నారా అని ఆసక్తిగా కొంచెం ముందుకెళ్లి గమనించసాగాడు.

ఐదారేళ్లు వుంటాయేమో వాళ్లకి, మొత్తం నలుగురు పిల్లలు వున్నారు. ఇద్దరు ఆడపిల్లలు.

అక్కడున్న రాతిముక్కలతో, ఎండుపుల్లలతో ఇల్లు కట్టాలని కాబోలు ప్రయత్నిస్తున్నారు. పిల్లలు నిలబెడుతున్న రాళ్లు వెంట వెంటనే పడిపోతున్నాయి. వాళ్ల మొహాల్లోని నిరాశను చూస్తే అయ్యో అనిపించింది గోపాల్ కు .

 “…కామ్రేడ్ గోపాల్ ” రమణ పిలుపుతో గోపాల్ కదిలి వెనుతిరిగి రమణ ముందుకొచ్చి నిలబడి ” ఏం రమణన్నా ఎం.ఆర్.ఒ. కధేమైనా తెల్సిందా. పాపం జనం ఎండకు అల్లల్లాడిపోతాండారు. అయినా ఈ దినం ఈడ ధర్నా చేస్తామని ఆర్జీలు ఇచ్చేదానికి వస్తామని ముందుగానే ఎంఆర్ఒ కు పోలీసోళ్ళకు తెల్సుకదా. ముందుగానే  తెల్సీ యాడికి పోయిండాడో చూడు” అన్నాడు.

తలాడిస్తూనే చేతివేళ్లతో జుట్టు సవరించుకుంటూ  “ ఎన్ని రోజులు దాక్కుంటాడు లే ” అని గోపాల్ కు జవాబు చెపుతూనే ,  గట్టిగా “కామ్రేడ్స్” అన్నాడు రమణ జనాన్ని ఉద్దేశించి పిలుస్తూ. అ ఒక్క మాటతో చెల్లాచెదురుగా ఉన్న జనం అందరూ ముందుకొచ్చి నిలబడ్డారు. వాళ్ల చేతుల్లో అట్టముక్కలు పైకి లేచాయి. నినాదాలు మిన్నంటాయి.

లంచగొండి ఎంఆర్ఒ ను సస్పెండ్ చెయ్యాలి. అర్హులకే ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలి. బినామీ పట్టాల్ని రద్దు చెయ్యాలి. ఎంఆర్ఒ డౌన్ డౌన్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి  అని రాయబడిన అట్టముక్కల వైపు చూసి నిట్టూర్చాడు గోపాల్.

ఎందుకో అతడికి ఈ విషయంలో న్యాయం జరుగుతుందన్న ఆశ లేకపోయింది. ఇదంతా పెద్దపెద్ద వాళ్లకు ఆఫీసర్లకు,రాజకీయ నాయకులకు తెలీకుండా జరిగివుండదని అతడి అభిప్రాయం. రమణ గొంతు సవరించుకుని మాట్లాడ్డం మొదలు పెట్టేసరికి గోపాల్ ఆలోచనల్లోంచి బయటపడ్డాడు.

 ” ప్రియమైన కామ్రేడ్స్ … మూడుపూటలా తిండి దొరకని వాళ్లు ఇక్కడ చాలామంది వున్నారు. రోజు చేస్తున్న పని రేపటికి వుంటుందన్న గ్యారంటీ లేదు. జీతo కానివ్వండి, కూలీ కానివ్వండి, సరిగ్గా చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. ప్రపంచీకరణతో మోసం, దౌర్జన్యం, దుర్మార్గం పెరిగిపోతున్నాయి. కార్మికులకు, శ్రామికులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు నిజమైన అర్హులకు, గిరిజనులకు అందటంలేదు. నిరుపేదలకు అందాల్సినవన్నీ పక్కదారిలో బినామీలకు చేరిపోతున్నాయి. ఇంటిస్థలాలు లేనివాళ్లు, ఇండ్లు లేనివాళ్లు, ఉపాధిలేనివాళ్లు, కోల్పోయినవాళ్లు ఇక్కడున్నారు. మీకు న్యాయంగా కేటాయించిన ఇంటిపట్టాల్ని రద్దుచేసి బినామీలకు అమ్ముకున్న ఎంఆర్ కు, ఆర్ఐ కు వ్యతిరేకంగా మనం చేస్తున్న ఈ పోరాటం న్యాయపోరాటం. అన్యాయానికి, దౌర్జాన్యానికి గురైన మనందరిదీ ఒకటే ప్రాంతం, ఒకటే కులం. మనకెందుకులే ? అన్యాయం జరిగేది మనకు కాదుకదా. ఈ సమస్య మనది కాదుకదా అని అనుకునే వాళ్లూ మనలో వున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఒంటరిగా  ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగడం, చెప్పులు వదిలి చేతులు కట్టుకుని వాళ్ళ ముందర నిలబడి అడుక్కోవడం వేరే. ఒకరికి ఒకరు తోడు వుండి,అందరూ కల్సి ఐకమత్యంతో అందరం పోరాడ్డం వేరు. నీకోసం, నీ చుట్టూ వున్న వాళ్లు పోరాడ్డంలో గొప్ప సాహసం వుంటుంది. తృప్తి వుంటుంది. విజయం వుంటుంది. మీరందరూ ఇక్కడే వుండండి. పని చేయటమే కాదు ఉద్యమించటం కూడా శ్రామికుడి పనే. కార్మికుల ఐక్యతా వర్థిల్లాలి. అర్హులకే…” అని అరిచాడు రమణ

ప్రతిస్పందనగా “ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలి” జనం అరిచారు.

 చప్పట్లతో ఆ స్థలం మార్మోగిపోయింది. మరో సంఘ నాయకుడు ఉపన్యసించే కార్యక్రమం మొదలయ్యాక రమణ పక్కకు వచ్చి విలేకరులతో కరచాలనం చేసాడు. తనతోబాటే వచ్చిన గోపాల్ ను వారికి పరిచయం చేసాడు.

“దొంగపేర్లతో పట్టాలు అమ్ముకుని  గిరిజనుల నోట్లో దుమ్ము కొట్టిన లంచగొండి అధికారులు  ” అని వార్త రాసింది ఈయన్నే గోపాల్” అంటూ పొడవుగా వున్న ఒకతన్ని పరిచయం చేసాడు రమణ. “అవునా, మంచివార్త రాసినారు సార్” అన్నాడు గోపాల్ నవ్వుతూ. నమస్కారం చెపుతున్నట్లు చేతులు జోడించి.

“మేం వార్తలు రాసినంత మాత్రాన ఎక్కడా న్యాయం జరిగిపోదు కదండీ. రమణ లాంటివాళ్లు నిస్వార్థంగా నిర్భయంగా ఉద్యమించినప్పుడే న్యాయం జరుగుతుంది. ఎక్కడైనా పోరాడితేనే కదండీ విజయం వరించేది. మొన్న సబ్ కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేసి పోయినాడులే. ఎంఆర్ ఒ, ఆర్ఐ ల పని అయిపోయినట్లే ” అన్నాడతడు.

 ” యం ఆర్వో ని తన వాళ్లకే  పట్టాలిమ్మని ఓ రాజకీయ నాయకుడు బెదిరించాడని కూడా పేపర్లో రాసినారు కదన్నా, ఆయన కతేమవుతుంది” కుతూహలంగా అడిగాడు గోపాల్.

ఆ విలేకరి మెల్లగా నవ్వి జాలిగా గోపాల్ వైపు చూసాడు. ” రాజకీయ నాయకులు కూడా తప్పు చెయ్యాలంటే భయపడే విధంగా వ్యవస్థ తయారైన రోజు అట్లాంటి నాయకుల కథ కూడా ముగిసిపోతుందండి. అంతవరకూ మీరందరూ అన్యాయానికి వ్యతిరేకంగా భయపడకుండా  పోరాటం చెయ్యాల్సిందే” అన్నాడు నవ్వుతూనే.

“సరేన్నా మీరందరూ పత్రికల్లో ధర్నా గురించి బాగా రాయండన్నా, ఎన్ని రోజులని ఎంఆర్ఒ దాక్కుంటాడో అదీ చూద్దాం. మేం నలుగురు కలెక్టర్ను కలవడానికి చిత్తూరుకి పోతావుండాం. అడవుల్లోంచి వచ్చిన యస్టీలకు సొంత  ఇండ్లు ఎందుకు అంటాడంట  ఆ ఎంఆర్ఒ సార్ .ఆయనకు  పెద్దకులపోడనే గర్వం కూడా ఫుల్ గా ఉందిలే అన్నా . మీకు తెలియంది ఏముంది. ఆయన కులపిచ్చి ఏందో కలెక్టర్ గారినే అడగటానికి  ఎలబారినాం అన్నా  ” అన్నాడు రమణ అక్కడినుంచి కదులుతూ.

 ఎండధాటికి తట్టుకోలేరేమో,  ఎటైనా కదిలి నీడ చాటుకు వెళ్లిపోతారేమో అని గోపాల్ అనుకున్న జనం అక్కడి నుంచి కట్టుకదలడం లేదు. వాళ్ల మొహాలు ఎండలో మెరుస్తున్నాయి. చెమట కారిపోతున్నా ఎండ దబాయించి దౌర్జన్యం చేస్తున్నా కిందా మీదా వేడిసెగ తాకుతున్నా వాళ్లు కదలటం లేదు. ఆర్ఐ దొంగలాగా జనం వైపు తొంగి చూసి,ఆఫీసులోకి వెళ్లిపోయాడు.

అతడికి జనం చేస్తున్నది చాలదు అనిపిస్తోంది. ఇంకేమిటో చెయ్యాలి, ఏమిటో ఎట్లనో తెలియడం లేదు.

అక్కడి నుండి కదిలే ముందు యధాలాపంగా  గోపాల్ చింతచెట్టు వైపు చూసాడు. పిల్లలు కనిపించలేదు, కానీ అక్కడ విడివిడిగా ఉన్న  రాళ్ళు ఒక్కటి చేయబడ్డాయి.

రాళ్ళు రాళ్ళు కలిసి ఒక నిర్మాణం జరిగింది. అక్కడ మట్టిలో పాతిన రాతిఫలకలతో పిల్లలు కట్టిన ఇల్లొకటి గొప్ప సౌందర్యంతో  ఠీవిగా నిలబడి వెలిగిపోతోంది.

Leave a Reply