చాన్నాళ్ళుగా కవి వసీరా గూర్చి అన్వేషిస్తూనే ఉన్నాను. ఇప్పటికి దొరికారు. అప్పుడెప్పుడో ఎక్కడెక్కడో చదివిన కవిత్వం ఇప్పుడు ఒక్కచోట ఇలా వసీరా లోహనది పేరుతో లభించడం కవిత్వప్రేమికులకు…నాకూ ఆనందమే. కవి వసీరా రాసింది మూడంటే మూడు కవిత్వసంపుటాలే. ఎంతలోతుగా రాస్తారు. ఎంతగాఢతగా రాస్తారు. ఇది చదువుతున్నంతసేపూ కవిత్వం కోసమే కవిత్వం రాసిన అనుభూతి కలిగింది. ఆపకుండా చదివించాడీకవి. గుండెకు ప్రకంపనం కలిగింది. కవిత్వం చదువుతున్నంత సేపూ హృదయం లయాత్మక విన్యాసమైంది. ఎనబయ్యోదశకంలోనే ఎంతో గొప్ప కవిత్వం రాశారు. ఇప్పటికది అవసరమని భావించి ఈ కవిత్వం గూర్చి నాల్గుమాటలు రాయాలనిపించింది.
‘అన్నా! నాకు నిరుద్యోగం వచ్చింది’ అని
రైలు కట్టదగ్గర తెగిపడ్డ మొండెం
నిన్ను కౌగిలించుకుని చెప్తే
అది పీడకల కాదు సుమా ముమ్మాటికీ నిజమే(చేదునిజం)
ఈ కవితా వాక్యాలు 1985లో రాశారు. అప్పటికీ ఇప్పటికీ ఏ మారింది దేశం. దేశం నిండా ఆకలి, ఆత్మహత్యలు. ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పన్నికోట్ల ఉద్యోగాలిస్తానంది ఈ ప్రభుత్వం. ఒక్కమాటైనా అమలు చేసిందా? ఈ దేశాన్ని పీడిస్తున్న దీర్ఘకాలిక జ్వరం నిరుద్యోగం. ఉద్యోగాల్లేక ఉపాధిలేక రైలుపట్టాలో లేదంటే ఉరికొయ్యకో ఊపిరితీసుకునే నిరుద్యోగులు ఇప్పటికీ ఉన్నారు. లేరని ఒక్కర్ని చెప్పమనండి. ఉన్నత చదువులు చదివిన వారిని కూడా బతుకుపోరాటంలో కూలీలుగా మార్చింది ఈ ప్రభుత్వాలు కాదా?
ఈ కవిత్వం నిండా కవిత్వముంటుంది. కవిత్వం కానిది కూడా కవిత్వం చలామణి అవుతున్న వర్తమాన సాహిత్యసమాజంలో మనమున్నాం. కానీ ఈ కవి కవిత్వంలో దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. హిరోషిమా నాగసాకిపై అణుబాంబు ప్రయోగం గూర్చి వొక కవిత 1945 ఆగష్టు6 అంటూ ఒక కవిత రాశారు. అందులో..
ఈ రోజు
ఒక్క చావుతప్ప
తక్కిన ప్రపంచమంతా
గిలగిలా తన్నుకు మరణించింది
చావు మరణం రెండు ఒకటే కదా. మరి కవి వసీరా ఎందుకిలా అన్నారు. నిజమే ఇది కవితాత్మక ఆవేధనాభివ్యక్తి. ఇలాంటి కవితావాక్యాలు పాఠకుడి మనోఫలకలపై నిష్క్రమిస్తాయా? ఆ ఘటన కవిని ఎలా వెండాడిరదన్నదే ఇక్కడ ప్రధానం. ఇదే కవితలో ‘ ఆ రోజున దొంగలొచ్చి మాతృగర్భంలో పిండాన్ని దున్ని మృత్యుబీజాలు నాటి, చితుల్ని పండిరచారు’ అంటారు. దొంగలెవరో ఈ ప్రపంచాన్ని ఆ రోజు ఎవరు నాశనం చేయాలనుకున్నారో..ఏ సామ్రాజ్యవాద దురంహంకారంతో ఆ ఘటన జరిగిందో, చరిత్రపుటల్ని తిరగేస్తే అర్థమౌతుంది. నిశ్శబ్దంగా ఊపిరొదిలిన దేహాలైన సమాదానం చెబుతాయి. రిత్విక్ ఘటక్ నాగరిక్ సినిమా చూసొచ్చిన కవి గొప్ప కవితవాక్యాలు రాశారు. ఆ కవితా వాక్యలు చదవడానికి ముందు రిత్విక్ ఘటక్ గూర్చి తెలుసుకుందాం. భారతీయ చలన చిత్రరంగంలో సుప్రసిద్ద దర్శకులు. బెంగాల్ విభజనకు పూర్వం బంగ్లాదేశ్ లో జన్మించారు. ఆనాటి సమాజంలో తన చిత్రాల ద్వారా ప్రగతిశీల సమాజానికి దారులుపరచిన వారు. ఆ్న తీసిన నాగరిక్ సినిమా ఆనాటి భారతీయ సమాజాన్ని మేల్కొలిపింది. ఆలోచనల్ని రేకెత్తించింది. సత్యజిత్‌రే, మృణాల్‌సేన్, తపన్‌సిన్హాల సమకాలీకుడీ దర్శకుడు. కుటుంబమంతా, సాహిత్యకళారంగాల్లో స్థిరపడ్డ వారే. ఉన్నతశిఖరాలధిరోహించినవారే. నాగరిక్ సినిమా చూసొచ్చాక ఈ కవి ఇలా రాస్తారు.
‘ఆ చచ్చేదేదో చేతులు కలిపి నవ్వుతూ చచ్చిపోదాం
ఆ చచ్చేదేదో పిడికిళ్ళు బిగించి అరుస్తూ చచ్చిపోదాం’ ఎవ్వరైనా వొక్కరైనా ఈనాటి సినీమాలు చూసి వొక్క కవితావాక్యమైనా రాయగలుగుతారా? అంగాంగప్రదర్శనలుండే ప్యూర్లీ కమర్షియల్ సినిమాలు తీస్తున్న చిత్రరంగమున్న సమాజమిది. ఆనాటి చిత్రసమాజం ఆనాటి సమాజాన్ని పురోగామి దిశగా నడిపించేది. ఈనాటిసమాజంలో ఎక్కువశాతం సినీమాలు హింసల్ని ప్రేరేపించి విలువల్ని సమాధిచేసే చిత్రాలసమాహారం. వసీరా పాట గూర్చి కవితరాస్తూ ఇలా అంటారు.
‘ఒరేయ్! కోసెయ్యడానికి పాట నాలుక చేసే శబ్దంకాదు
చిలగొట్టడానికి
పెదవులమీద నుంచి జారే చప్పుడుకాదు
చెట్లకు కట్టి కాల్చెయ్యడానికి శరీరమూ కాదు
పాట చెకుముకి రాళ్ళు చేతులెత్తి చప్పట్లు కొట్టడం
గుండెలోంచి గుండెలోకి నిప్పులు ప్రవహించడం’ పాటొక్కటే కాదు కవిత్వమూ నిప్పులా ప్రవహిస్తుందన్నాను. పాట పాలకపక్షాన్ని ప్రశ్నించాలి. ప్రజలపక్షాన నిలబడి దిక్కారస్వరమైన పాటనెవ్వరూ కాల్చలేరు. ఈ వసీరా దృష్టిలో పాట గుండెలోంచి గుండెలోకి నిప్పుల్లా ప్రవహించాలని కోరుకున్నారు.
ఇవాళ పాలకులు ఒకేదేశం ఒకేభాష అంటూ సమైక్యస్ఫూర్తికి భంగం కలగిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఏది ఆచరించాలో ఏది ఆచరించకూడదో ఏది తినాలో ఏది తినకూడదో ప్రజలపై ఆంక్షల్ని విధుస్తున్న రోజుల్ని మనమిప్పుడే చూస్తున్నాం. ఏ ప్రాచీనతా హోదాలేని హిందీని దేశమంతా విస్తరించి ఇతరభాషలను సమాధిచేయజూస్తున్న దుస్థితి ఉంది. 1988లోనే ఈ కవి మాతృభాషపేరుతో కవిత రాశారు.
‘ఈ భూమి మీద ఏ రాజ్యాధికారమూ
జనం మాతృభాషను తుడిచిపెట్టలేదు.’ ఈ కవితావాక్యాలు మనకివాళ ధైర్యాన్ని నూరిపోస్తాయి.ఈ కవితలో భాషపుట్టుకనంతా కవి వసీరా చెబుతారు. సాంప్రదాయవాదులు, ఆధ్యాత్మికవాదులు చెబుతున్నట్లు భాష శివుడి ఢమురుకంలోంచి కాదు, శ్రమజీవుల స్వరాల్లోంచి పుట్టిందంటూ చెబుతారు. ఈ లోహనది కవిత్వం ఇప్పటిది కాదు. 1989లో కె.శివారెడ్డి గారి రaరీ పోయిట్రీ సర్కిల్ ద్వారా వెలుగుచూసింది. ఈ పుస్తకానికి కె.శివారెడ్డి అతని అక్షరం మీద చెవిపెట్టి వినండి అంటూ గొప్ప ముందుమాట రాశారు. ఇటీవల అజు పబ్లికేషన్ పునర్ముద్రణ చేసింది. ఈ పుస్తకం అట్టపై ముగ్గురు లబ్ధప్రతిషులైన కవులు ఈ పుస్తకం గూర్చి ఏమన్నారో చూద్దాం..
మూడుదశాబ్దాల క్రితమే కాదు, ఇప్పటికీ ఎప్పటికీ మనిషి డీహ్యూమనైజ్ అవుతూనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు కార్పొరేట్లతో, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనే కొత్తపేరుతో, రక్తంతో నిండిన సెలైన్ సీసా మనిషి అని ఆనాటి నిజం కనుక్కున్నాననుకున్నాడు వసీరా, ఈ మూడుదశాబ్దాల కాలంలో రక్తంతో నిండిన సెలైన్సీసా మనిషి మాత్రమే కాదురా బాబూ, మొత్తం వ్యవస్థ అని తెలియచెప్పడానికి ఈ లోహనది మళ్లీ కావాలి. ముప్పై సంవత్సరాలుగా నీ జీవితం నీది కాకుండా పోవడానికి ఎవరెవరు కారకులో ఈ తరం తెలుసుకుందుకు లోపానది మళ్లీ మళ్లీ కావాలి.-ముక్కామల చక్రధర్
లోహనది చదివినప్పుడు ఎంతో సౌమ్యంగా కనిపించే మిత్రుడు వసీరా కవిత్వంలో కణకణమండే నిప్పుల్ని చూసి ఆశ్చర్యమేసింది. కొన్ని వాక్యాలయితే మిస్సెయిల్స్ తాకి మన ముసుగుల్ని పేల్చేస్తాయి. ఈడ్చి తలలోపల కొట్టినట్టే వుంటాయి కొన్ని. మరి కొన్నయితే గాలిని తొడుక్కున్న పూలై మెతమెత్త… గా తాకుతాయి. ఇంత భిన్నత్వం చాలా అరుదు. ఇక ఇంతకన్నా కవిత్వపరమార్థమేముంటుంది?-రమణజీవి
వసీరా కవిత్వపు ప్రధానమైన బలం అడుగడుగునా కన్పించే మానవత్వం. మనిషి మనిషిగా ఉండలేకపోవడం గురించి, ఆర్థంగా ఉండలేకపోవడం గురించి, పరాయీకరణకు, పతనానికి గురికావడం గురించి నిత్యం మధనపడి, మళ్లీ మనిషిని మనిషికి కానుకగా ఇవ్వాలని అపారమైన ప్రేమతో ప్రయత్నించే ఒక కవి వసీరాలో కనపడతాడు.-ఎన్. వేణుగోపాల్
ఈ కవిత్వానికి లోహనది అని పేరు పెట్టినప్పుడే కవి పాఠకుల్ని తనవైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించారు. ఈ సంపుటిలో తొలి కవితగా డీహ్యుమనైజేషన్ అనే శీర్షికతో రాశారు. ఇది 1985లో రాసింది. విలువల్లేని తనాన్ని ఈ కవితలో చాలా గాఢతగా చెప్పారు కవి వసీరా. రక్తంతో నిండిన గాజుసీసా మనిషి అంటూ మనిషిని వివరించినపుడే తెలిసింది ఈ అభివ్యక్తి ఎంతగొప్పదో అని. చివరికంటాడు ఈ కవితలో కవి..
‘డీహ్యూమనైజ్డ్! డీహ్యూమనైజ్డ్!
నన్నెవడో ఓట్లకోసం పెంచారు
నన్నెవరో అదనపు విలువలకోసం పెంచారు
డీహ్యూమనైజ్డ్ డీహ్యూమనైజ్డ్
నన్నెవరో ఓట్లకోసమే చంపేశారు
నన్నెవరో అదనపు ఓట్లకోసమే చంపేశారు.’ ఇంతకంటే డీహ్యూమనైజ్డ్! ఇంకేం కావాలి.
ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్య ఘటనలు మనకు కళ్ళముందుకవిత్వంగా కనబడతాయి. ఇదివరకే చెప్పిన హీరోషిమా నాగసాకిలపై జరిగిన అణుప్రయోగం. అలాగే దక్షిణాఫ్రికా కవి బెంజిమిన్ మొలైస్‌ని శ్వేత జాత్యాహంకార ప్రభుత్వం ఉరితీసినపుడు రాసిన కవిత, భగత్‌సింగ్‌కోసం రాసినకవిత ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ కవితను పూర్తిగా పరిచయం చేయకపోతే సముచితం కాదనిపిస్తుంది. శాంతికోసం సేచ్ఛకోసం అంటూ రాసిన కవిత చూద్దాం..
నా గనుల్లోకి నోళ్లు తెరిచి, నా కంచం మీద తుపాకి పాతి, నా అన్నాన్ని నాకే అమ్మి, నా తెగ్గొట్టిన ఎర్రని బొటనవేళ్ళని, సిల్క్ గౌన్లమీదా, గళ్ళకోటుల మీదా, గులాబీలుగా ధరించి, నన్ను హత్య చేసి, నా మాంసం విందుచేసుకుని, అసెంబ్లీలో బ్రేవమని తేన్చుతున్న టెర్రరిస్టుల నోట్లో, బాంబు పేల్చావు, శాంతి కోసం స్వేచ్ఛ కోసం, ఉరికంబం మీద వజ్రనినాదం నాటావు, టెర్రరిస్టు డయ్యర్లు, ఖాకీ బట్టలు కట్టినా, ఖద్దరు బట్టలు కట్టినా, ఏకాలంలో ఏ రూపంలో వచ్చినా, సరైన సమాధానంగా, శాంతికోసం స్వేచ్ఛకోసం, నీ నినాదాన్నే మేవూ నాటుతాం, ఫ్యాక్టరీలో పనిచేసే స్వేచ్ఛాగీతాల మీద, నాట్లునాటే పిల్లగాలుల మీద, ఏ టెర్రరిస్టు తుపాకినీడ పడకుండా ఇంక్విలాబ్ జిందాబాద్ ఎగరేస్తాం, ఇంక్విలాబ్ జిందాబాద్‌తో మట్టిని కడిగి, దున్ని శాంతిని పండిస్తాం, జైలు గోడల్లో ఇంకిన రక్తం మరకల మీద, కుళ్ళిన పోస్టుమార్టం రిపోర్టుల ముఖాలమీద,లాకప్లో చెరచబడ్డ శాంతికపోతాల చెక్కిళ్ళ మీద, ఇంక్విలాబ్ జిందాబాద్ అని రాస్తాం, అడవుల్లో, రేవుల్లో, విద్యాలయాల్లో ఇంక్విలాబ్ జిందాబాద్ నాటుతూ, నేలకొరిగిన అన్నల స్మృతులమీద, తమ్ముళ్ళ కానుకగా నేలకొరిగిన అన్నల స్మృతులమీద మళ్ళీ ఇంక్విలాబ్ జిందాబాద్ నాటుతాం, శాంతి కోసం స్వేచ్ఛ కోసం, మృత్యువునే ఉరితీసి, అగ్ని గుబాళించే నీ, వజ్రనినాదాన్ని, లోహ పవనాల మీద, పదునెక్కిన ఇంక్విలాబ్ జిందాబాద్ ని, ప్రతి అశ్రువు మీదా, పుష్పాలుగా పరుస్తాం (భగత్సింగ్ కోసం, ప్రజాసాహితి ప్రత్యేక సంచికలో అచ్చయినది.)
భగత్‌సింగ్‌పై ప్రాణత్యాగం గూర్చి ఇంతకంటే ఏం చెబుతారు. ఇవాళ మతోన్మాదపాలకులు భగత్‌సింగ్‌ను కూడా తమజాబితాలో చేర్చుకోవడం విడ్డూరంగా వుంది. దేశభక్తి ఉన్న ప్రతివొక్కరూ భగత్‌సింగ్‌ని తమగుండెల్లో పెట్టుకోవచ్చు తప్పులేదు. బ్రిటీష్‌వారికి అమ్ముడుబోయిన వాళ్ళు భగత్‌సింగ్ పేరును ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు.
ఈ కవిత్వంలో పదునైన కవితావాక్యాలున్నాయి.
‘ద్రోహం ప్రపంచవ్యాప్తంగా ఉంది
ద్రోహం అధికార హోదాలో ఉంది’
‘ఇక్కడి ప్రభుత్వాలకు
మానవహక్కులు మహాద్రోహులు’
‘మేం ఒటరులిస్టుకోసమేపుట్టాం
మేం మనుష్యులతో వ్యాపారాలు చేయడానికి పుట్టాం’
‘కాళ్ళు తడవకుండా
మహాసముద్రాల్ని దాటిన మేధావికూడా
కళ్ళు తడవకుండా
జీవితాన్ని దాటలేడు’
‘మాటల్ని చెరిచి వ్యభిచారులుగా మార్చావు
మాటల బ్రోకర్లని మహారచయితలు చేశావు.’
ఈ కవిత్వం గూర్చి ఎంతైనా మాట్లాడాలని వుంది. ఈ కవిత్వం వర్తమాన, వర్ధమానకవులు ఖచ్చితంగా చదువదగ్గది. ఈ కవిత్వం వైవిధ్యమైనది. గొప్పశిల్పంతో పురుడుబోసుకున్నది.