మాడ్వి దేవాల్ (కామ్రేడ్ ఇడుమాల్ గా) విప్లవ కార్య చరణలో పార్టీ, క్యాడర్, ప్రజలకు విశ్వసనీయ, ప్రియమైన  నాయకుడిగా ఎదిగినాడు. మీడియాలో ఆయన పేరు హిడ్మాగా ప్రచారం అయ్యింది. సల్వాజుడుమ్, గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్, ఫాసిస్టు’కగా ర్’ల్లోనూ, ప్రజాఉద్యమ ఆటు-పోటుల్లోనూ ధృడంగా నిలబడి, తన తోటివారిని నిలబెట్టిన, నిబద్దత గల ప్రజా నాయకుడిగా ఎదిగినాడు. ప్రజాయుద్ద సమరంలో బోల్షివిక్ ధృఢ సంకల్పంతో పీడిత వర్గ పక్షాన నిల్చి శత్రువు గుండెల్లో నిదిరించి, ప్రజాఉద్యమాన్ని కాపాడే కమాండర్ గా ఎదిగినాడు. దక్షిణ్ బస్తర్, దండకారణ్యం నుండి భారత  విప్లవోద్యమ వర్గ పోరాటంలో ’మహాన్ భూమ్ కాల్ గుండాదూర్’ వారసుడిగా రూపొందిన నూతన మానవుడు ఇడుమాల్. చివరివరకు వర్గపోరు ఎర్రజండాను ఎత్తి పట్టిన కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడ్ మాడ్వి ఇడుమాల్ (దేవాల్) కు విప్లవ జోహరులర్పిస్తూ కొన్ని నా  జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నాను.  

        కామ్రడ్ ఇడుమాల్ ది దండకారణ్యం లోని ఛత్తిస్ గడ్ రాష్ట్రం, సుకుమా జిల్లా, కుంట తాలూకా, పువ్వారి గ్రామంలో (కోయ భాష లో పువర్తి అంటారు) నిరుపేద మురియా ఆదివాసి రైతు కుటుంబంలో జన్మించాడు. దంతేవాడ, సుకుమా, బీజాపూర్ జిల్లాల వరకు విస్తరించి వున్న బైల్లాదిల్ల (ఎద్దు భుజం ఆకారంలో వున్న) ప్రాంతంలో అపారంగా వున్న ఖనిజ సంపదను పాలక వర్గాలు జపాన్ సామ్రాజ్య వాదులకు కట్టబెట్టడంతో, తరతరాలుగా అక్కడ జీవిస్తూన్న గదెరాజు, కువ్వకోండా, మలింగేర్లతోపాటు 12 గ్రామాల మూలవాసి ప్రజలను  నిర్వాసితులను చేశారు. ఈ కుటుంబాలు  కుంట బ్లాకు (ఆoధ్ర -తెలంగాణా బార్డర్) ప్రాంతానికి వలస వచ్చారు. అందులో ఇడుమాల్ కుటుంబం కూడా ఒకటి. పువ్వారికి వచ్చి  గ్రామపెద్దలు చూయించిన భూమి (అడవి) ని చదును చేసుకొని కోలా(కొర్రల కన్నాచిన్నగా వుండే ‘చిరు’ధాన్యం), కొంత వరి(వర్షాధారం) పంట వేసుకొని, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఆరు నెలలు జీవించడం.  ఖమ్మం జిల్లాలో భూస్వాములు పండించే వ్యాపార పంటలైన పొగాకు, మిరపకాయల కూలీలుగా రెండు, మూడునెలలు కష్టం చేసి ఆ డబ్బుతో బట్టలు కొనుక్కోవడం. ఆ పంటల నూర్పిళ్ళ తరువాత పొలాల్లో మిగిలి పోయిన, పరిగే (పొగాకు, మిరపకాయలు)ను ఏరుకొని తెచ్చుకోవడం, వీటిని సంవత్సరకాలం జాగ్రత్త పరుచుకొని వాడుకోవడం అనేది బస్తర్ ప్రజల పేదరికపు  జీవితాలకు అద్దం పట్టే వాస్తవం.

ఇడుమాల్ తండ్రి  పేరు మాడ్వి బండి, తల్లి పేరు మాడ్వి పొజ్జె. వీరికి 5 గురు సంతానం అబ్బాయులు మాడ్వి నందల్, మాడ్వి అడ్మాల్, దేవాల్ (ఇడుమాల్), అమ్మాయులు మాడ్వి బుద్రి, మాడ్వి దేవేలు. ఇందులో మాడ్వి నందాల్ ను పాలక వర్గాలు చేపట్టిన ‘ఆపరేషన్ సమాధాన్’ ఫాసిస్టు దాడుల్లో డీ.ఆర్.జి గూండాలు, పోలీసులు  బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేశారు. ఆ సందర్బంలో  కా. ఇడుమాల్ బాధపడుతూ “మా అన్నా నేను బాగా వేట చేసే వాళ్ళం. నేనంటే  మా అన్నకు చాలా ప్రేమ. కాని ఎన్నో కుటుంబాలలాగే మా అన్న కూడా, ఏ భూమిని కోల్పోయి ఇక్కడికి వచ్చామో అదే భూమి కోసం, ఈనాడు బస్తర్ ప్రజల్లాగే అన్నా అమరుడయ్యాడు. పోరుతప్ప దారి  లేదనే చరిత్ర మళ్ళీ మళ్ళీ ఋజువు చేస్తున్నది కదా” అన్నాడు.

1970లో ఇడుమాల్ జన్మించాడు. పువ్వారిలో గ్రామ భూస్వామి, పూజారీ  (కోయభాషలో\ పెద్దాల్, గాయతల్ అంటారు) బండి పెద్దాల్ అనుమతితో ఇల్లు కట్టుకొని, చూయించిన భూమి పై  పెద్దలు, పిల్లలు అంతా కష్టపడి వ్వవసాయంలో వచ్చిన కొద్ది పంటను‘విత్తనాలకు’దాచుకొని, మిగిలిన  ధాన్యంతో అర్థాకలితో పెరిగిన పెద్ద, పేద కుటుంబం. తల్లి వండిన అన్నాన్ని కుటుంబ సభ్యులందరికీ దొప్పల్లో పంచి, బెండజొమ్మా(గోంగూరలో కొంత ఉప్పు, కారం వేసి ఉడికించిన నీళ్ళు) పోసి ఇస్తుంది. అది కడుపు నిండదు కనుక అంబలి (కోయలో జావ) తాగుతూ, అన్నం తిని పొట్టనింపు కోవడం అనేది మెజార్టీ బస్తర్ ఆదివాసీ ప్రజల్లో వుంది. అలాగే ఇడుమాల్ కుటంబం కూడా బతుకుతూండేది.

తండ్రి (బండి దాదా)కి వనమూలికల గురించి బాగా తెలుసు. చుట్టు పక్కల వైద్యం అనేది లేక పోవడంతో గ్రామస్తులు, పక్కగ్రామాల్లోని ప్రజలు చాలామంది వచ్చేవాళ్ళు మూలికలతో పాటు ఒడ్డె  (మొరుంగానా\మంత్రాలు వలించడం) పని చేస్తుడేవాడు. బండి దాదా వనమూలికల వైద్యంతో చాలా రకాల జబ్బులు నయం కావడంతో అతనిపై వున్న నమ్మకంతో కోళ్ళు, కల్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇడుమాల్ చిన్న వయస్సులో తండ్రి తో పాటు అడవికి వెళ్ళి వనమూలికలు జమచేసి తేవడం వాటిని దంచి పొడిచేయడం, ఆకుల పసర్లు తయారు చేయడంతో వాటిగురించి అవగాహన చేసుకున్నాడు. తండ్రి పనిలో వుండి అడవికి వెళ్ళలేని సమయాల్లో కొడుకుతో వనమూలికలు తెప్పించేవాడు. తండ్రి ఒడ్డె పనిలో ఎక్కువగా వుండడంతో, తల్లి తోనే  ఇడుమాల్ కు అనుబంధం ఎక్కువగావుండేది. చిన్నకొడుకు కావడంతో గారాబం చేసేది తల్లి. ప్రేమతో అల్లారు ముద్దుగా పాపా (కొయాలో ‘పాపా’ అంటే కొడుకా) అని పిలిచేది. బక్కపలుచని శరీరం, ఛామనఛాయ కొద్దిగా కోలముఖం, మెరిసే కళ్ళతోచురుకుగ్గా వుండేవాడు. తన తల్లితో పాటుగా పొలం పని, ఇంటి పని, అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువులు కాయడం, కట్టెలు తేవడం, చేపలు పట్టడం ఇలా ప్రతి పనిలో చేదోడు-వాదోడుగా వుండేవాడు. కొత్తవిషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహంతో వుండేవాడు. పిట్టల వేట, చేపలు పట్టడంలో తనతోటి పిల్లల కంటే ముందుండేవాడు. ‘ఆదివాసులకు వేట జీవితంలో భాగం’ (ఆదివాసులు పురుషులైనా మహిళలైనా అడవికి, పక్క గ్రామాలకు, సంతకు ఎక్కడికి  వెళ్ళినా  కైయ్యు\చేతిలో తోడు (రక్షణ గా గొడ్డలి లేదా కత్తులను (ఆయుధం) పట్టుకెల్లడం అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం.) ఖాళీ సమయం దొరికితే ఇడుమాల్ వెదురుతో విల్లంబులు, గున్నేల్ (ఒడిసెల) తయారుచేయడం, గొడ్డలి, కత్తులను మెరిసేలా ‘సాన’ పెట్టడం చేసేవాడు.          

గ్రామ పెద్దలు, గాయతల్, ఫారెస్టు రెవిన్యూ అధికారులు శిస్తు\పన్ను ల(పట్టి), భూమీ పన్ను, ఇంటి పన్నుల వస్సుళ్ళ కోసం పట్వారీ, గ్రామసేవక్, ఫారెస్టు గార్డ్స్ ప్రజలను వేధించి, బెదిరించి కష్టoతో  సంపాదించుకొన్న డబ్బూ, పెంచుకున్న మేకలు, కోళ్ళు, ఇప్పపూల కల్లును బలవంతంగా తీసుకెళ్లడం ఎదిరించిన వారిని, ఇవ్వలేని వారిని కేసుల పేరుతో పట్టుకెళ్లడం, కొట్టడం ఇడుమాల్  చిన్న వయస్సులోనే కళ్ళారా చూసి, మాకే తినడానికి లేక కష్టం చేసుకుంటున్నాము.  మాపై  ఇలా దౌర్జన్యం చేసే వీళ్ళేవరు అనేది అర్దం కాక ఘర్షణ పడేవాడు ఇడుమాల్.

అప్పుడప్పుడే దండకారణ్యానికి విస్తరించిన ఉద్యమం,  ప్రజల సమస్యలను  తెలుసుకుంటూ, ప్రజలతో కల్సిపోతూ వారి సంస్కృతిని అధ్యయనం చేస్తూ యువతీ యువకులతో కల్సి రాత్రి సమయాల్లో వారి ఆటా-పాటల్లో దళం అంతా కల్సి పోయేది. దానితో పాటు ప్రజలను పీడించే ఫారెస్టు రేంజర్లను, గార్డులను గ్రామ ప్రజల ముందే నిలదీసి “ఈ అడవి పై ఆదివాసులకే హక్కు వుంది. మీరెవరు? ఇక్కడకు వచ్చి వేధించడం, మేకలు, కోళ్ళు, డబ్బులు వసూలు చేయడం తప్పు, ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి, వాళ్ళకు నష్టపరిహరం చెల్లించాలి” అని గట్టిగా మాట్లాడి మరోసారి ఇలా చేయము అని  ప్రజలకు క్షమాపణ చెప్పించడం, కొందరిని తన్ని తరమడంతో, ఇన్నాళ్ళు వాళ్లను చూసి ‘పెద్దపులిని చూసి భయపడి నట్లు భయపడే ప్రజలకు ఈ రోజు వారికోసం కాలు కాలిన పిల్లుల్లా ఎదురుచూసే’లా మారిపోయున దృశ్యం ఇడుమాల్ తో పాటూ ఎన్నో కుటుంబాలకు, యువతకు మరపు రాని ఘట్టం. ఉద్యమం మాకోసం వచ్చింది, వీళ్ళు మావాళ్లు అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చింది. ఇలా గ్రామ పెద్దమనుషులను కంట్రోల్ చేసి పేద కుటుంబాల పక్షాన, వర్గ ప్రతిపాదికపై విప్లవోద్యమం పనిచేస్తూ, ప్రజాసంఘాల నిర్మాణం చేస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే బాసగుడా దళ కమాండర్ గావున్న కామ్రడ్ భద్రన్న, ఇడుమాల్ ను 13సంవత్సరాల వయస్సులో బాలల సంఘంలో చేర్చాడు.  

గ్రామాల్లో విప్లవోద్యమం  రాకముందు  గ్రామ పెద్దమనుషులు పంచయితీలు చెప్పి దండుగలు వసులు చేసేవారు. ఉద్యమం వూర్లోకి వచ్చి ప్రజల మధ్య సమస్యలను  సామరస్యంగా పరిష్కరించడంతో పాటు, పిల్లలు చదువుకోవాలని, వారికి గ్రామంలో రాత్రి పాఠశాల ఏర్పటు చేస్తూన్నామనీ చెప్పింది. “మీ పిల్లలు పగలు మీతోపాటుగా పనుల్లో పాల్గొంటారు. రాత్రి రెండు గంటలు చదువు కుంటారు” అని,  పెద్దవాళ్లకు అర్ధం చేయుంచి, పిల్లలను ప్రోత్సహించింది. అందుబాటులో వున్న టీచర్లతో చర్చించి వారికి వేతనాలు ఇచ్చి, పదుల సంఖ్యలో స్కూల్స్ నడిపించింది. అందులోనే ఇడుమాల్ కూడా ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఉత్సాహంగా వుంటూ, చదువు నేర్చుకోవడం, కొత్త విషయాలను గ్రహించడం, వేటలో పాల్గోవడం తనకు ప్రియమైన పని. ఐతే సిగ్గరి. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. దళం పాడే పాటలంటే ఇష్టం, కాని పాడేవాడు కాదు.   

విప్లవోద్యమం ఇచ్చే సందేశాలను అర్దం చేసుకోవడం, ఉద్యమం వచ్చాకా ఫారెస్టు వాళ్ళు పెట్టే  బాధలు తగ్గడం, గ్రామ పెద్దలు గతంలో లాగా వెట్టిచాకిరీ (విట్టేకామ్) చేయించుకోవడం బందు కావడం లాంటి మార్పులను అర్దం చేసుకొన్నాడు. వర్షాలు లేక 1987 లో బస్తర్ ప్రాంతంలో ప్రజలకు తాగునీటి, (పశువులకు, పంటలకు) కరువు సమస్య తీవ్రంగా ముందుకు వచ్చింది. నీటిమట్టాన్ని పెంచాలి. అది పెంచాలి అంటే ప్రజల్ని కదిలించాలి. ఎన్నో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు దరకాస్తులు ఇచ్చినా స్పందనలేదు. ప్రజలకు తిండి-నీళ్ళు లేవు. ఈ కరువు సమస్యను పరిస్కరించాలి. పరిష్కరించేందుకు విప్లవ నిర్మాణం ప్రజల వద్దకే వెళ్ళాలి అనుకుంది. ఈ సమస్య పై ఒక క్యాంపేయిన్ చేపట్టింది. ప్రజల నుండే వచ్చిన అభిప్రాయంతో జిల్లా స్థాయిలో ఉన్న షావుకార్ల దగ్గర కరువు సహాయంగా బియ్యం, కొంత డబ్బు సేకరించి డబ్బుతో గునపాలు, సలికెపారలు కొని బాసగూడ ప్రాంతం (ఇప్పుడు బీజాపూర్ జిల్లా) లో లింగగిరి గ్రామ సమీపంలో కోటేరు(కోటచెరు)వు పోయాలనుకున్నది. (ఈ చెరువు కాకతీయుల కాలంలో రాజులు పోయించినది.) ప్రజలకు విశ్వాసం వున్న పెద్దమనుషులతో ఉద్యమం ‘కరువు సహాయక కమిటీని’ ఏర్పరిచింది. ఈ చెరువు ద్వారా 9 గ్రామాల పొలాలకు నీళ్ళు పారుతాయు. అలాగే చెరువు వల్ల చాలా గ్రామాల్లో నీటి మట్టం పెరుగుతుంది. 25, 30 గ్రామాల పశువులకు నీళ్ళు దొరుకుతాయి. పువ్వారి గ్రామంతోపాటు, 40, 5౦ గ్రామాల నుండి వందలాది ప్రజలు వయసుతో నిమిత్తం లేకుండా, నెలకు పైగా సమిష్టి శ్రమలో పాల్గొన్నారు. పనిలో పాల్గొన్న  ప్రతి ఒక్కరికీ ఈ కరువు సహాయక కమిటీ (చిన్నవయస్సులోవున్న ఇడుమాల్ లాంటి పిల్లలు కూడా శ్రమలో పాల్గొనక తప్పని కరువు పరిస్థితి అది.) ఒక గ్లాసు బియ్యం ఇచ్చింది.

ఏళ్ళ తరబడి ఇలా విప్లవ నిర్మాణం  దండకారణ్యంలోని ఆదివాసి, ఆదివాసేతర ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరిస్తూవారి జీవితాల్లో దోపిడి, అణిచివేతలను తామే ఎదిరించేలా చేసింది. ఐతే బస్తర్ ప్రాంతంలో మహేంద్రకర్మలాంటి భూస్వాములు, గ్రామ పెత్తందార్లు అధికారం, మూఢనమ్మకాల పేరుతో చేసే దోపిడిని, వెట్టిచాకిరీ చేయుంచు కోవడానికి ఉద్యమ నిర్మాణం అడ్డుగా వుందని, తాము ఆచారం పేరుతో పాత కట్టుబాట్లు నడుపు కోలేమనే దానితో ఉద్యమం  నిలదొక్కుకోరాదనే దురుద్దేశంతో, మహేంద్రకర్మ నాయకత్వంలో రెండు సార్లు జనజాగరణ నడిపించాడు. కాని వాస్తవాలను గ్రహించిన యువతీ యువకులు విప్లవ నిర్మాణంలోకి రావడం  మొదలైయ్యింది. అందులో తొలితరంలో  కామ్రేడ్ బద్రన్న, అమరుడు విజయ్ దాదా(కరుంగాడ్ గ్రామం/ దక్షిణ్ బస్తర్ డివిజన్ సెక్రెటరీ), కామ్రేడ్ భీమన్న(బూటకపు ఎన్ కౌంటర్లో, డీఆర్జి గూండాలు హత్యా చేశారు), కామ్రేడ్ రాధక్క, కామ్రడ్ కమలక్క (అమరులు) లాంటి వాళ్ళు వచ్చి వర్గ పోరాటపు రాజకీయాలతో, ప్రజాపునాదిని పెంచడమేకాదు “ ఉద్యమం అంటే వీళ్ళు-వీళ్ళు అంటే మేము” అనేలా స్థానికులే నాయకులుగా  బాద్యతలు చేపట్టి పనిచేయడంతో ప్రజల్లో ఇది చాలా ప్రభావం వేసింది. విప్లవోద్యమాన్ని తమ సొంతం చేసుకున్నారు. బాసగూడ కమాండర్ గా వున్నాకామ్రేడ్ భద్రన్న 1991లో ఇడుమాల్ ను బాలల సంగం నుండి  ఉద్యమంలోకి తీసుకున్నాడు.

 నిర్మాణంలోకి వచ్చాకా దేవాల్ ‘ఇడుమాల్’ గా పేరు మార్చుకొన్నాడు. తను ఇంటి దగ్గర వున్నప్పుడు  రాత్రి బడిలో నేర్చుకున్న చదువుపై ఇంకా శ్రద్ద పెట్టి రాయడం, పుస్తకాలు చదువుతూ తెలుగు, హిందీ భాషలను బాగా నేర్చుకోవాలనే పట్టుదలతో కృషి చేసేవాడు. అలాగే మందుల పేర్లు తెలుసు కునేందుకు ఏ‌బి‌సి‌డి లు నేర్చుకునే ప్రయత్నం చేసేవాడు. 1997 లో ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రోగ్రాం తీసుకున్నది. అప్పుడు యాక్టివ్ గా, మిలిటెంట్ గా వున్న ఇడుమాల్ ను దక్షిణ్ బస్తర్ డివిజన్ కమిటీ బాలాఘాట్ కు బదిలి చేసింది. విలాస్ పేరుతో అక్కడికి వెళుతున్న టైమ్ లో కింద పడి, కాలుకు దెబ్బ తగలడంతో బయటకు పంపి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధ పడ్డాడు. ఉద్యమం తన పై నమ్మకంతో పంపుతున్నది, కానీ ఇక తను మిలటరీ రంగానికి పని రాడేమో, అని బాధను  వ్యక్త పరిచే వాడు. రెస్టు తీసుకోవడము కోసం టెక్నికల్ డిపార్టు మెంట్ వద్ద కొంతకాలం (కామ్రేడ్ దేవేందర్ రెడ్డి/మాస దాదా) దగ్గర వున్నాడు. అక్కడే తుపాకుల తయారీ, గ్రెనేడ్సు తయారి, తుపాకుల రిపేరింగ్ గురించి తెల్సుకున్నాడు. ముందునుండి కూడా ఆదివాసులకు వేట- ఆయుధాలతోవున్న అనుబందం కూడా విడదీయరానిది. తయారీలో చొరవతో పాల్గొని కొత్త పద్దతులను నేర్చుకునేవాడు.     

 ఆ తరువాత మళ్ళీ బస్తర్ కు వచ్చాక 2002 నుండి సుకుమా జిల్లా (కుంట తాలూకా)కుంట ఏరియా లో ఆర్గనైజర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. కుంట ప్రాంతము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో వుంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలు, భూస్వామ్య, తెగ పెద్దలకు పట్టున్న ప్రాంతం. అందుకే అక్కడ వర్గ పోరాటం, నిర్బంధమూ కూడా తీవ్రస్థాయిలోనే ఉండి, “కుంటా అంటే? మిరపకాయాల మంటా”అనే నానుడి వాడుకలోకి వచ్చింది. కామ్రేడ్ ఇడుమాల్ కొంతకాలం ఏరియా కమీటీ సభ్యుడిగా, కమాండర్ గా ఆ తరువాత ఏరియ సెక్రెటరీ గా పనిచేశాడు. 

 ఇడుమాల్ తన అభిప్రాయాలను కమిటీలో చర్చిండం, సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి పనిచేయడం అనే క్రమశిక్షణతో పాటూ, ఒక్కొక్క సారి మంకుపట్టు తనంతో వ్యవహరించేవాడు. (ఇది తన ప్రాణాలను త్యాగం చేసేవరకు వెళ్ళిన ఒక పూడ్చు కోలేని  విషాదఘటన) చెంఘీజ్ కాన్, ఉమర్ ముక్తార్, చేగువేర, మావో యుద్ద ఎత్తుగడలు, పార్టీ పాలసీలను  లోతుగా అధ్యయనం చేయడం చర్చించడం, తోటి కమిటీ సభ్యులతో చదివించడం చేసేవాడు. ఒక ప్రోగ్రాంను అనుకున్న తరువాత దాన్ని పూర్తి చేసే వరకు ఎంత కష్టమైనా, శ్రమచేయడం-సాధించడం అనే స్పిరిట్ తో ఎలా చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికీ కామ్రేడ్ ఇడుమాల్ ఆచరణ, ప్రతిఘటనలకు అదర్శంగా నిలుస్తుంది.

చిన్నతనంలోనే కష్టం తెల్సిన నిరుపేద కుటుంబం నుండి వచ్చిన కామ్రేడ్ ఇడుమాల్ కు విప్లవ నిర్మాణం ఇచ్చిన వర్గపోరాట రాజకీయ చైతన్యం కల్సి, ప్రజలకు ప్రతివిషయం అర్దం చేయించడం. వారిని చర్చల్లోకి దించి వారి మనషుల్లోని  భావాలను తెల్సుకోవడం. ఉద్యమ కార్యక్రమాలను, వారి భావాలతో వున్న సంబంధాన్ని జోడించి ప్రజల ఆమోదంతో, వేలాది ప్రజలను సామూహిక శ్రమతో సల్వాజుడుమ్ కాలంలో కాల్చిన, కూల్చి వేసిన ఇళ్లను, పొలాలను చదును చేసుకునేలా తయారు చేశాడు. అలాగే ప్రజలపై చేస్తున్న దాడులను ప్రతిఘటన ద్వారానే అడ్డుకోగలమని, ప్రజలు అందులో భాగస్వాములు అవ్వాలని కొమురంభీమ్, గుండాదుర్, అల్లూరి సీతారామరాజుల్లా మనం అందరం తయారు కావాలని యువతి -యువకులను ప్రోత్సహించేవాడు. అలాగే ప్రజల కున్న భూమి-నీళ్ళ సమస్యను తీర్చుకునేలా ప్రజల్ని సంఘటితం చేస్తు, పార్టీ తీసుకున్న ప్రోగ్రామును ప్రజల్లోకి తీసుకెళ్లడం. వారి కుటుంబము లోని  సాధక -బాధకాలు గురిoచి తెల్సుకొని పరిస్కరిoచడం. విద్యా-వైద్యం విషయాలు పట్టించుకోవడం చేసేవాడు.

పోలీసు దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన లేదా గాయపడ్డ ప్రజలను, క్యాడర్లకు అన్నిరకాలుగా వైద్యం (మందులు, తిండి) అందించడం, ప్రత్యేక ప్రొటెక్షన్ ఏర్పాట్లు చేయడం. వాళ్ళు కోలుకొని మళ్ళీ యుద్ద భూమిలో పాల్గొనేలా శారీరకంగా, రాజకీయంగా నిలబెట్టే విధానం మంచిగ వుండేది. బెటాలియన్ లో ప్రతిఘటనలో పాల్గొనే సమయంలో ఇచ్చే ప్రేరణను ప్రతిఘటన సమయంలో మాత్రమే కాకుండా ఆ తరువాత కూడా తోటి కామ్రేడ్స్ తో ప్రజలతో కల్సి సమన్వయంగా అమలు చేసేవాడు. ఒక మావోయిస్టు కార్యకర్తగా కామ్రేడ్  ఇడుమాల్, తన తోటి సహచర కామ్రేడ్సుతో కల్సివుండే విధానం బాగుండేది.

క్యాడర్ తో కలిసిపోవడం వారి పనిపద్దతులను పరిశీలించడం. వ్యక్తిగత-కుటుంబ సమస్యలను పరిష్కరిచడంతో పాటుగా వారిని రాజకీయ నిర్మాణ పరంగా ఎదిగించుకోడానికి ప్రయత్నించేవాడు. వారి అనారోగ్య సమస్యలను తనకు తెల్సిన చెట్ల మందులతో, హోమియో మెడిసిన్ తో శ్రద్దతీసుకొని వైద్యంచేసేవాడు. లేదా ఇతరులతో చేయించేవాడు. ఇలా క్యాడర్ లో విశ్వసనీయ కార్మిక వర్గ విప్లవ నాయకుడిగా ఎదిగినాడు. నేడు శత్రువు పన్నిన వలలో చిక్కి, నమ్మకద్రోహనికి గురై మారేడుమిల్లి అడవుల్లో పాలక వర్గాల చేతిలో హత్యకు గురైనా ఆదివాసుల జీవనాధారమైనా జల్, జంగల్, జమీన్ కోసం “మహాన్ భూమ్ కాల్ గూoడాదూర్ పోరాట వారసుడుగా” చరిత్రను పునారావృతం చేసిన అమరవీరుడు. నాలుగు దశాబ్దల అనుభవం కల్గి, కేంద్రకమిటి స్థాయి వరకు ఎదిగిన ప్రజా నాయకుడు మాడ్వి ఇడుమాల్

కామ్రేడ్ రాజే తో పెళ్లి:  కామ్రేడ్ రాజే సుకుమా జిల్లా, (గతంలో దంతేవాడ జిల్లా,) కుంట తాలూకా వీరపురం గ్రామంలో పుట్టింది. రాజే కుటుంబం మురియా ఆదివాసి  మడ్ కామ్ కుటుంబం, మధ్యతరగతి వర్గానికి చెందింది. మహిళలకు బలవంతపు పెళ్లిళ్ళు చేయరాదని, స్త్రీ-పురుషులను సమానంగా చూడాలని, వారి అభిప్రాయాలను తెల్సుకొని పెళిళ్ళు చేయాలని, తరతరాలుగా మేనరికం సరైంది కాదని, మహిళలు సంఘంలో వుండి వారు ఎదుర్కొంటున్న సమస్యల పైనా పితృస్వామ్య భావాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని ఉద్యమం ప్రచారం చేసింది. ప్రచారమే కాక మహిళల సమస్యలను పరిష్కరిస్తుండడము, ప్రజల్లో విప్లవ  రాజకీయాల ప్రభావం, నమ్మకంతో మడకం రాజే, ‘2000లో కిస్టారం నిర్మాణంలోకి  వచ్చింది. కుంట-కిస్టారం కమిటీ నిర్మాణాలు  రెగ్యులర్ గా కలవడంతో కామ్రేడ్ ఇడుమాల్ కు కామ్రేడ్ రాజేకు పరిచయం అయ్యుంది. అలా ఇద్దరు ఇష్టపడి విప్లవోద్యమానికి తమ పెళ్ళి ప్రపోజల్ ను తెలియచేశారు. దీన్ని కమిటీ ఒప్పుకొని, వీరిద్దరికి 2002 లో పెళ్లిచేసింది. కామ్రేడ్ రాజే గొల్లపల్లి లోకల్  ఏరియాలో ఆర్గనైజర్ గా పనిచేస్తుండేది. కామ్రేడ్ రాజే లో వున్న మిలీటెన్స్సీని చూసి, విప్లవ నిర్మాణం కామ్రేడ్ రాజేకు పై  బాధ్యతలు ఇచ్చింది. కామ్రేడ్ ఇడుమాల్ 3వ కంపెనీ కి బదిలి అయినప్పటి నుండి కామ్రేడ్ రాజే కూడా 3వ కంపెనీకి బదిలీ అయ్యిoది.

Leave a Reply