న్యాయవ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్ బలమైన పట్టు భారత రాజ్యాన్ని బలహీనపరచడం ద్వారా హిందూ-రాష్ట్రాన్ని సృష్టించే వారి అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో వారికి ఎలా సహాయపడుతుంది అనే అంశంపై వివిధ పత్రికలు, సర్వేల నుండి వచ్చిన నివేదికలు వివరణాత్మక విశ్లేషణ చేసాయి. ఈ కథనం వివిధ వేదికలలో ప్రచురితమైన నివేదికలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందింది. న్యాయ వ్యవస్థలోని అన్ని రంగాలపై ఎబివిపి, ఇతర హిందూత్వ సంస్థలు, ముఖ్యంగా అఖిల భారతీయ న్యాయవాది పరిషత్ (ఎబిఎపి)ల ఆధిపత్యం గురించిన వాస్తవాలను వ్యాసం విశ్లేషిస్తుంది. న్యాయవ్యవస్థ అనేది రాజ్యానికి ఒక సైద్ధాంతిక సాధనం; ఇది ప్రజాస్వామ్య ఆకాంక్షలకు సంబంధించి దృఢంగా ఉండాలి. అయితే ఒక సామాన్యుడు న్యాయవ్యవస్థను ఎలా చూస్తాడు? గౌరవ న్యాయస్థానం తీర్పు ఇస్తోందంటే ‘అది సరైనది, సమాజానికి మేలు’ అని అనుకుంటాడు.
ప్రజాస్వామిక స్పృహ లేకపోవడం, ఎటువంటి విమర్శనాత్మక విధానం లేకుండా ఉన్నత అధికారాన్ని అనుసరించడంలో బలమైన విశ్వాసాన్ని (ఇది ఫ్యూడల్ స్పృహలో భాగం, ఇక్కడ ప్రజలు సోపానక్రమంలో అతని స్థానం ఆధారంగా విలువనిస్తారు) కలిగి వుండడం అనేవి న్యాయ వ్యవస్థకు ప్రాణాంతకమైన కలయిక. ప్రజల రాజకీయ స్పృహను ఉన్నతాధికారులు తమ కథనాల ద్వారా సులభంగా మలచవచ్చు. తిరోగమన ఆలోచనలను, మరింత ఖచ్చితంగా భూస్వామ్య నైతికత, సామాజిక క్రమాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ప్రోత్సహిస్తోంది. ఉత్తర భారత బ్రాహ్మణీయ సమాజం అతని సమాజ కల్పనకు ఆధారంగా ఉంది. చాలా మంది వ్యక్తులు అదే విధమైన సామాజిక అవగాహనను కలిగి ఉంటారు కాబట్టి, మనువాద న్యాయవ్యవస్థ చట్రం ప్రకారం ప్రజలను ఒప్పించడం ఆర్‌ఎస్‌ఎస్ -నియంత్రిత న్యాయవ్యవస్థకు సులభం అవుతుంది.
ఈ కార్యక్రమాన్ని 1992లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ న్యాయవాదుల సంస్థగా స్థాపించిన అఖిల భారతీయ న్యాయవాది పరిషత్ నిర్వహించింది. నేడు, ఎబిఎపి భారతదేశం మొత్తంలో న్యాయవాదుల అతిపెద్ద సంస్థగా మారింది. గత మూడు సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాజకీయ విభాగం అయిన భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం కారణంగా గత దశాబ్దంలో సంస్థ కార్యకలాపాలు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో, ఆర్‌ఎస్‌ఎస్ తన చిరకాల కలలు వాస్తవమవడం చూసింది. ఎబిఎపి ఆరంభమైన సంవత్సరం లోనే హిందూత్వ మూక ధ్వంసం చేసిన అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణం కావచ్చు; లేదా జమ్మూ- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు కావచ్చు.
సంఘ్ సాధించిన అనేక విజయాలకు అనువైన న్యాయవ్యవస్థ దోహదపడింది. హై సొసైటీలో, దేశవ్యాప్తంగా వేలాది జిల్లాలు, ట్రయల్ కోర్టులలో, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న స్టడీ సర్కిల్‌ల నెట్‌వర్క్, వ్యూహాత్మక వ్యాజ్యాలు, వ్యక్తిగత పరిచయాల ద్వారా ఎబిఎపి హిందూ మితవాదపు అత్యంత అప్రమత్తతకలిగిన, వ్యూహాత్మక విస్తరణలలో ఒకటిగా ఉద్భవించింది.
ఆల్ ఇండియా అడ్వకేట్స్ కౌన్సిల్ (అఖిల భారతీయ అధివక్తా పరిషత్)నిర్వహించిన సమావేశంలో, హోం మంత్రిత్వ శాఖ అనేక సూచనలను సవరించినప్పటికీ, కొత్త కోడ్‌ను రూపొందించిన సంస్కరణ కమిటీలో తాను భాగమని జైట్లీ వెల్లడించాడు. “నిజానికి, నేను చెప్పగలిగినది ఏమిటంటే, ఇది మానవ హక్కులపై దృష్టి సారించిన పత్రం; దాన్ని బలహీనపరిచారు. బదులుగా, ‘రాజ్యభద్రతకు సంబంధించిన అనేక నిబంధనలకు ప్రాధాన్యతనిచ్చారు; మానవ హక్కులను కాస్త వెనక్కు నేట్టారు; మొత్తంమీద, కొత్త చట్టాలు అవసరం మాత్రమే కాదు, వలస గతం నుండి మార్పు కూడా.”
వారు దిగువ కోర్టులలోని యువ న్యాయవాదులు, భారతదేశంలోని న్యాయ పాఠశాలల విద్యార్థుల ఆకాంక్షలు, ఆదర్శాలను రూపొందిస్తున్నారు. వారు ప్రస్తుత హిందూ ఛాందసవాద వాస్తవికతను రూపొందించడం, సమర్థించడం, వాదించడం మాత్రమే కాకుండా, రాజ్యాంగ అధికారాన్ని సవాలు చేయడానికి ఒక లోతైన ఉద్యమ అంశంగా కూడా చేస్తున్నారు. చాలా మంది సంఘ్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయకుండానే ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ఈ ఎత్తులకు చేరుకున్నారు; అయితే వారు ఎబిఎపితో తమ అనుబంధాన్ని ఆర్ఎస్ఎస్ మాదిరిగానే రాజకీయేతర, మానవతావాదంగా ప్రదర్శిస్తారు.
భారతీయ తత్వానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలనే తన ఆకాంక్షను సాధించడానికి ఒక అడుగు వేసిందనే ధ్వనిని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ దత్తోపంత్ థెంగ్డీ ఎబిఎపి స్థాపన సందర్భంగా అన్న మాటలు ప్రతిధ్వనించాయి. తేంగడి “స్వాతంత్ర్యం తరువాత భారతదేశ భాగ్యానికి బాధ్యత వహించిన వారు వలసవాదుల గుడ్డి అనుచరులు; వారి వ్యవస్థలను అనుసరిస్తున్నారు. వారికి భారతీయ నైతికత, దాని క్రింద అభివృద్ధి చెందిన వ్యవస్థల గురించి తెలియదు.”
“ప్రపంచంలోని అన్ని దేశాలలో (రాజ్యాంగం) అత్యంత పవిత్రమైన లేదా ప్రాథమిక ప్రజా పత్రంగా గుర్తించబడుతుందనే భావన వాస్తవాలపై ఆధారపడి ఉండదు” అని ఆయన వాదించారు. రాజ్యాంగం పట్ల ప్రేక్షకులకు ఉన్న గౌరవాన్ని పరిమితం చేయాలని ఆయన కోరారు. ఎబిఎపి స్థాపితమైన నెలల కాలంలోనే, దాని న్యాయవాదుల బృందం థెంగ్డీ కార్యాచరణ ప్రణాళికను కోర్టులకు తీసుకెళ్లడం ప్రారంభించింది.
మోదీ రెండో పర్యాయం రాజస్థాన్‌లో అడిషనల్ అడ్వొకేట్ జనరల్ నియామకంపై ఇటీవల జరిగిన వివాదాన్ని మనం గుర్తుంచుకోవాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పికె మిశ్రా కుమారుడు పద్మేష్ మిశ్రాను ఎఎజిగా నియమించారు; అందుకోసం మొత్తం నియామక నిబంధనలను రాత్రికి రాత్రే మార్చారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి నియమితులైన తర్వాత న్యాయవ్యవస్థ వైఖరిలో వచ్చిన మార్పుపై ఈ తాజా వివాదం మన దృష్టిని ఆకర్షిస్తోంది.
2019లో నరేంద్ర మోడీ రెండవసారి అధికారం చేపట్టిన వెంటనే, రామజన్మభూమి కేసుపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఏకగ్రీవ తీర్పును వెలువరించింది; వివాదాస్పదమైన మొత్తం భాగంలో ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది; మసీదు సముదాయాన్ని కలిగి ఉన్న భూమికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది; తన నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన 18 పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు వేగంగా తిరస్కరించింది. 2020లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రత్యేక కోర్టు ఎల్‌కె అద్వానీతో సహా మొత్తం 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది; కూల్చివేత దాడులు ముందస్తు ప్రణాళిక కాదని అంగీకరించింది.
ఎబిఎపి, ఒడిశా చాప్టర్ సహ-సంస్థాపకుడు, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన అనూప్ బోస్ తన ప్రసంగంలో హిందువులు మైనారిటీగా వుండి వుంటే భారతదేశం ఎప్పటికీ లౌకిక దేశంగా మారదని అన్నాడు. అతను, “వాస్తవానికి, ఇది ముస్లింల తప్పు కాదు. వారి మతంలోని హింస, ఆకలి ఖురాన్‌లో పొందుపరచబడింది. ఖురాన్, హదీసులు (ఖురాన్ వివరణలు), షరియత్ (ఇస్లాం ధార్మిక చట్టం) చదవండి; మనం ఏమి కోరుకుంటున్నామో ఎందుకు కోరుకుంటున్నామో మీరు అర్థం చేసుకుంటారు సుప్రీంకోర్టు ఒకవేళ ఇలాంటి నిర్ణయాలను తీసుకోకుండా వుంటే, చాలా మార్పులు చేయవచ్చు. “బహుశా మన రాజ్యాంగం, ‘భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తున్నాం’ అని చెప్పవచ్చు” అని అన్నాడు .
మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో, భారతదేశంలోని లక్షలాది మంది అట్టడుగు ప్రజల జీవితాలను నిర్ణయించే ప్రభుత్వ విధానాలను నిర్వచించారు; లేదా న్యాయస్థానాలు రాజకీయంగా ముఖ్యమైన కేసులను పరిష్కరించాయి. ఆయన పట్ల విధేయతకు ప్రతిఫలంగా దేశంలోని ముఖ్యమైన పదవుల్లో తరచూ నియామకాలు జరిగాయి. మోదీ హయాంలో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన ఆదర్శ్ గోయల్ 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యాడు. అతను ఉదయ్ లలిత్‌తో కలిసి. 1989 షెడ్యూల్డ్ కులాలు-షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలను బలహీనపరిచే కుఖ్యాత 2018 ఉత్తర్వుతో సహా అత్యంత వివాదాస్పదమైన తీర్పులను ఇచ్చాడు. ఈ చర్యనుదేశవ్యాప్తంగా దళిత, ఆదివాసీ సంఘాలు విమర్శించాయి.
ఆ సంవత్సరం జులైలో తన పదవీ విరమణ ప్రసంగంలో, న్యాయమూర్తి గోయల్ ఆర్డర్‌కు మద్దతుగా కనిపించాడు; ఈ ఉత్తర్వును వ్రాసేటప్పుడు, ఇందిరా గాంధీ హయాంలో జరిగిన “ఎమర్జెన్సీ- మౌలిక అధికారాల తాత్కాలిక తొలగింపు” గురించి తాను ఆలోచిస్తున్నానని చెప్పాడు. పోలీసులకు ఇచ్చిన అపరిమిత అధికారాల వల్ల కలిగే నష్టాల గురించి కూడా ఆలోచిస్తున్నాను అన్నాడు. పదవీ విరమణ తర్వాత, మోడీ ప్రభుత్వం అతన్ని పారిశ్రామిక, ప్రభుత్వ ప్రమాదాల వల్ల నష్టపోయిన అట్టడుగు వర్గాలు, అటవీ నివాసితులకు న్యాయం కలిగించే చివరి కోటగా పరిగణించబడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధిపతిగా నియమించింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో గోయల్ పదవీకాలం గురించి ప్రముఖ పర్యావరణ న్యాయవాది రిత్విక్ దత్తా మాట్లాడుతూ “కేసులను త్వరగా పరిష్కరించాలనే అభిరుచి ఉంది. “జటిలమైన కేసులు వస్తాయి, కానీ అతను వాటిగురించి పెద్దగా ఆలోచించడు.” దత్తా ప్రకారం, గోయల్ నిర్ణయాలలో “తీవ్రమైన అంచనాలు లేవు, వ్యక్తిగత తర్కం కనపడదు. ఈ కేసుల్లో అంతిమ లక్ష్యంగా సహజ న్యాయం ఉండాలి తప్ప, త్వరగా తేల్చేయడం కాదు. అతను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ అధికార పరిధిని భారతదేశం మొత్తానికి విస్తరించడం ప్రారంభించాడు; ఇది అంతకుముందు ఉత్తర భారతీయ కేసులను మాత్రమే పరిష్కరించేది. “చాలా ముఖ్యమైన పారిశ్రామిక ప్రాజెక్టులు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో మాత్రమే జరుగుతున్నాయి; గనులు, క్వారీల తవ్వకాల వివాదాలు ఎక్కువగా మధ్య, తూర్పు ప్రాంతంలో వస్తాయి” అని దత్తా అన్నాడు. ప్రిన్సిపల్ బెంచ్ దగ్గర రాజకీయంగా ముఖ్యమైన పారిశ్రామిక ప్రాజెక్టులు లేవు.
ఒక నిరంకుశ పాలకుడు ప్రజల మధ్య విభేదాలను నియంత్రించాలంటే అభిప్రాయాలను సృష్టించడం చాలా అవసరం. ప్రస్తుతం పాలకవర్గం మతం, కులం, ప్రాంతీయ రాజకీయాలు, భాష, జాతీయతతో కూడిన ‘చీలికల’పై చాలా శ్రద్ధ చూపుతోంది. పాలకవర్గ ప్రస్తుత వ్యూహాన్ని మనం ప్రజల శ్రేయస్సు కోణం నుండి చూడాలి; దేశం నుండి కాదు. ఒక దేశ అభివృద్ధి ప్రజల శ్రేయస్సులో సానుకూల మార్పులను ప్రతిబింబించదు.
అక్టోబర్ 5, 2024
(రచయిత ఢిల్లీ యూనివర్సిటీలో లా విద్యార్థి)
తెలుగు : పద్మ కొండిపర్తి