నిజామాబాద్ జిల్లాలోనేగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా న్యాయవాదిగా, మానవహక్కుల నాయకుడిగా, విప్లవాభిమానిగా గుర్తింపు ఉన్న గొర్రెపాటి మాధవరావు డిసెంబర్ 28న మృతి చెందారు. నేరమే అధికారమైపోయిన ఫాసిస్టు సందర్భంలో నిరపరాధులు, బలహీనులు, న్యాయం కోసం నిలబడినవాళ్లు ‘నేరస్తులుగా’ వేధింపులకు గురవుతున్న కాలంలో హక్కుల కార్యకర్తగా, న్యాయవాదిగా మాధవరావు అర్ధాంతరంగా వెళ్లిపోవడం చాలా పెద్ద నష్టం.
ఆయన విప్లవ విద్యార్థి ఉద్యమాల చైతన్యంతో సామాజిక, రాజకీయ జీవితంలో ప్రవేశించారు. అందుకే విప్లవ విద్యార్థి ఉద్యమంలో సదా నిలిచి ఉండే జంపాల చంద్రశేఖర్ మెమోరియల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దాని ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాడు విప్లవోద్యమం అందించిన ప్రజాస్వామిక విలువలను మాధవరావు జీవితమంతా నిలబెట్టుకున్నారు. వాటి సాధన కోసం హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు. మొదట పౌరహక్కుల ఉద్యమంలో, ఆ తర్వాత మానవహక్కుల ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజామాబాదు జిల్లాలో న్యాయవాదిగా, హక్కుల ఉద్యమ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండేవారు.
న్యాయవాదిగా బిజీగా ఉంటూనే అనువాద రంగంలో కూడా ఆయన కృషి చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రను, కొసంబి వ్యాసాలను చక్కటి తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ప్రజాస్వామిక ఉద్యమాలు తీవ్రమైన అణచివేతను, ఒత్తిడిని అనుభవిస్తున్న కాలంలో కూడా ఆయన తన విద్యార్థి దశలో అలవరుచుకున్న ప్రజాపక్షపాతానికి దృఢంగా నిలబడ్డాడు. ప్రజా పోరాటాలు నిర్మించుకున్న గంభీరమైన వ్యక్తిత్వాల్లో ఆయన ఒకరు. ఆయన మృతికి వసంతమేఘం నివాళి ప్రకటిస్తోంది.