మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో వేగవంతమవుతున్న రాజ్య అణచివేత సంక్షోభాన్ని ఎత్తి చూపడానికి 2025 మే 6న, ఇండియా జస్టిస్ ప్రాజెక్ట్ (జర్మనీ), ఫౌండేషన్ ది లండన్ స్టోరీ (నెదర్లాండ్స్), లండన్ మైనింగ్ నెట్‌వర్క్ (యుకె), ఇండియన్ అలయన్స్ పారిస్‌లతో కలిసి ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకడమిక్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా (ఇన్‌సాఫ్ ఇండియా) అంతర్జాతీయ వీడియో సమావేశాన్ని నిర్వహించింది.

భారత రాజ్యం అమలుచేస్తున్న తిరుగుబాటు నిరోధక ప్రచారం అయిన “ఆపరేషన్ కగార్” కింద అనేక స్వదేశీ ఆదివాసీ సమాజాలకు నిలయంగానూ ఖనిజాలతోనూ సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం ఇంతకుముందెన్నడూ లేనంతగా సైనికీకరణను చూస్తోంది. భారత రాజ్యం చేస్తున్న సైనికీకరణకు తిరుగుబాటు నిరోధకంగా సమర్థన లభిస్తోంది అని, కార్పొరేట్ భూ కబ్జాలకు ఒక ముసుగుగా మారిందని, ఇది సామూహిక మానవ హక్కుల ఉల్లంఘనలకు, పర్యావరణ వినాశనానికి దారితీస్తుందని తమకు ఉన్న ప్రత్యక్ష అనుభవమూ చట్టపరమైన నిపుణతల రీత్యా వక్తలు హెచ్చరించారు.

బస్తర్‌లో నివసించే మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది బేలా భాటియా, భూమి హక్కుల కోసం ఒక స్వదేశీ యువత ఉద్యమమైన మూలవాసి బచావో మంచ్‌పై విధించిన అన్యాయమైన నిషేధం గురించి మాట్లాడారు. గత రెండు సంవత్సరాలలో కనీసం ముప్ఫయి మంది మూలవాసి బచావో మంచ్ సభ్యులను తప్పుడు ఆరోపణలతో జైలులో పెట్టారు. ఇప్పుడు బస్తర్ అంతటా 250 కి పైగా భద్రతా శిబిరాలు స్థాపితమయ్యాయీ; దాదాపు లక్ష మంది లేదా బహుశా అంతకంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించారు;. ప్రతి 2-3 కి.మీ.కు ఒక క్యాంపు ఏర్పాటు చేయడం వల్ల  ప్రతి తొమ్మిది మంది పౌరులకు ఒక భద్రతా సిబ్బంది ఉన్నారు; బస్తర్ అటవీ భూముల ద్వారా వేగంగా విస్తరిస్తున్న రోడ్ల నెట్‌వర్క్ ద్వారా పెద్ద ఎత్తున సైనికీకరణ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి అని ఆపరేషన్ కగార్ స్థాయిని వివరించారు బేలా భాటియా. డ్రోన్‌లు, హెలికాప్టర్లు, ఇజ్రాయెల్ ఆయుధాలు, నిఘా సాంకేతికతలను రాజ్యం ఉపయోగిస్తోందని, ఐడిఎఫ్ సిబ్బంది భారత దళాలకు శిక్షణ ఇస్తున్నట్లు నివేదికలు ఉన్నాయని బేలా చెప్పారు. మావోయిస్టులను చంపినందుకు పోలీసులు ఆర్థిక పరిహారాన్ని పొందే, చట్టాతీత హత్యలను ప్రోత్సహించే రివార్డ్-ఫర్-కిల్ (చంపితే బహుమానం)వ్యవస్థను ఆమె బహిర్గతం చేసారు. ముత్వెండి గ్రామంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్, ఆరు నెలల పసికందు హత్య వంటి ఘటనలను ఉదహరించారు. “మావోయిస్టుల పేరుతో సైనికీకరణను సమర్థిస్తున్నారు, కానీ వాస్తవానికి ఇది కార్పొరేట్ ప్రయోజనాలను సులభతరం చేయడానికి జరుగుతోంది” అని ఆమె అన్నారు.

బస్తర్‌లో జరుగుతున్న అణచివేతను భారత రాజ్యం అవలంబించిన దీర్ఘకాలిక నూతన ఉదారవాద నమూనా అభివృద్ధి పరాకాష్టగా శాంతి చర్చల కమిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభివర్ణించారు. ఆదివాసీల ప్రతిఘటన మూలాలను వలసవాద వ్యతిరేక ఉద్యమాలలో గుర్తించారు, వారి భూ హక్కుల పోరాటాలు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి సమాంతరంగా ఉన్నాయని నొక్కి చెప్పారు.

“భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ V ఆదివాసీ స్వయం పాలనకు హామీ ఇచ్చినప్పటికీ, రాజ్య నేతృత్వంలో జరుగుతున్న గనుల తవ్వకాలు, సైనికీకరణల వల్ల ఆ షెడ్యూలు ఇవ్వాల్సిన రక్షణలు  క్షీణించాయి. ఒకవైపు అటవీ హక్కుల చట్టం 2006 వంటి ప్రగతిశీల చట్టాలను ఆమోదించి మరోవైపు తమ  హక్కులగురించి చెప్పేవారిని హింసాత్మకంగా అణచివేస్తూ రాజ్యం ‘బహుమతి- శిక్ష’ (క్యారెట్-అండ్-స్టిక్) అనే ద్వంద్వ  విధానాన్ని ఉపయోగిస్తుంది” అని ఆయన అన్నారు. ముగ్గురు మావోయిస్టు నాయకులను రాజ్యం చంపిన తర్వాత 2004 శాంతి చర్చల ప్రయత్నాలు ఎలా విఫలమయ్యాయో ఆయన గుర్తు చేసుకున్నారు. మావోయిస్టు నాయకులు భూ సంస్కరణల డిమాండ్లను లేవనెత్తినప్పుడు, కొత్త రాష్ట్ర ప్రభుత్వం భూస్వాముల, గనితవ్వకాల దిగ్గజాల ఒత్తిడితో ఉపసంహరించుకుంది. పౌర సమాజం, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు సమీకరిస్తున్నందువల్ల, ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదనలను పరిగణించాల్సి రావచ్చు. “శాంతి గురించి ఆలోచించడం అంటే, మొదటగా ‘అడగడం’ అనేది వస్తుంది: ప్రతిఘటన ఎందుకు జరుగుతుంది?” అని తన ప్రసంగం ముగింపులో, ప్రొఫెసర్ హరగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బస్తర్ పైన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా చేసి, అవసరమైన చర్యలను చేపట్టాలని ఐక్యరాజ్యసమితికి చెందిన స్వదేశీ ప్రజల హక్కులపై నిపుణుల కమిటీ  (ఎక్స్‌‌పర్ట్ మెకానిజం ఆన్ ది రైట్స్ ఆఫ్ ఇండిజీనస్ పీపుల్స్ –ఇఎం‌ఆర్‌ఐ‌పి) సభ్యులు బినోటా మోయ్ ధమై పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి సభ్యదేశంగా భారతదేశం ఐక్యరాజ్యసమితి చార్టర్ & స్వదేశీ ప్రజల హక్కుల ప్రకటన (డిక్లరేషన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ఇండిజీనస్ పీపుల్స్- (యు‌ఎన్‌డి‌ఆర్‌ఐ‌పి) కు కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ఈ ప్రకటనను స్వదేశీ ప్రజల స్వయంప్రతిపత్తి, సాంస్కృతిక సమగ్రత, స్వేచ్ఛాయుత, ముందస్తు, సమాచార సమ్మతి (ఎఫ్‌పి‌ఐ‌సి) హక్కులతో అభివృద్ధి చేసారు.

సాంప్రదాయక స్వపరిపాలన వ్యవస్థలతో సహా ఈ హక్కులు బస్తర్‌లో ఒక క్రమపద్ధతిలో ఉల్లంఘనకు గురవుతున్నాయి. “వారు స్వదేశీ ప్రజల హక్కుల గురించి కాదు, అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతారు” అని బినోటా అన్నారు. పౌరులకు ఉన్న అవకాశాలు క్షీణించడం, ముందస్తు సమాచారాన్ని ఇచ్చి స్వేచ్ఛాయుత సమ్మతిని పొందడంతో సహా (ఎఫ్‌పి‌ఐ‌సి) అంతర్జాతీయ బాధ్యతలను గౌరవించడంలో ప్రభుత్వాలు విస్తృతంగా విఫలమవడాన్ని ఎత్తి చూపారు. మానవ హక్కుల చట్రాలను అమలు చేస్తే అనేక ఘర్షణలు పరిష్కారమవుతాయని, స్వదేశీ ప్రజల హక్కులు రక్షణ జరుగుతుందని నొక్కి చెప్పారు. సరిహద్దుల మధ్య స్వదేశీ సంఘీభావాన్ని, పౌర సమాజ సంఘీభావాన్ని విస్తరించడం వంటి బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. 1920ల ప్రారంభంలో అట్టడుగు స్థాయి నుండి ప్రారంభమై ప్రపంచ స్థాయి వరకు విస్తరించిన స్వదేశీ ప్రజల రాజకీయ ఉద్యమం ఐక్యరాజ్యసమితిలోనూ కొన్ని సభ్య దేశాలలోనూ స్వదేశీ హక్కులను ఎలా గుర్తించిందో ఉదాహరించారు. ‘ఉద్యమాలు చేసే వరకు రాజ్యాలు చర్య తీసుకోవు’ అని అంటూ ముగించారు.

పెట్టుబడిదారీ గనుల తవ్వకాల ప్రయోజనాల కోసం నడుపుతున్న పౌర సంఘర్షణలను ఎదుర్కొంటున్న బస్తర్, ఫిలిప్పీన్స్‌‌లలో అమలవుతున్న రాజ్య అణచివేతల మధ్య ఉన్న బలమైన సమాంతరాలను ‘యస్ టు లైఫ్, నో టు మైనింగ్ నెట్‌వర్క్’ సంస్థలో ఆగ్నేయాసియా ప్రాంతీయ కాంటాక్ట్ పాయింట్‌కు చెందిన, ఫిలిప్పీన్స్‌‌లో నివాసమున్న పర్యావరణ ప్రచారకర్త అనా సెలెస్టియల్ చూపించారు. బస్తర్‌లో సైనికీకరణ ద్వారా జరుగుతున్న అణచివేత  ప్రపంచ నమూనాను ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు. “బస్తర్ అనేది రాజ్య-కార్పొరేట్ కుమ్మక్కు, సైనికీకరణ, నేర పూరితం చేయడం, ఖనిజ వెలికితీతల సూక్ష్మరూపం” అని ఆమె అన్నారు. సాయుధ దళాలు, క్రూరమైన చట్టాలు, చట్టవిరుద్ధ హత్యలను ఉపయోగించి ప్రభుత్వాలు, బహుళజాతి సంస్థలు ప్రతిఘటనను అణిచివేసేందుకు కుమ్మక్కవుతాయి.  తమ భూమికి, జీవితానికి తామే అసలు రక్షకులు అయినప్పటికీ గనుల తవ్వకం స్వదేశీ ప్రజల సాంస్కృతిక నిర్మూలనకు దారితీస్తుంది” అని ఆమె హెచ్చరించారు. ప్రభావిత సముదాయాల నేతృత్వంలో ప్రపంచ సంఘీభావం కోసం ఆమె పిలుపునిచ్చారు; ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసారు. “బస్తర్ పోరాటం కేవలం స్థానికం మాత్రమే కాదు పర్యావరణ న్యాయం, స్వదేశీ సార్వభౌమాధికారం, మానవ హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలలో ప్రతిచోటా ముందు వరుసలో ఉంది. నిశ్శబ్దంగా ఉంటే సహకరించినట్లే”అని అన్నారు. భారతదేశం నుండి పాలస్తీనా నుండి ఫిలిప్పీన్స్‌ల వరకు సైనికీకరణను అంతం చేయాలని, సమ్మతి లేకుండా వెలికితీసే ప్రాజెక్టులను నిలిపివేయాలని, స్వదేశీ హక్కులు, మానవతా చట్టాలను సమర్థించాలని, సంఘర్షణకు మూల కారణాలైన అసమానత, అన్యాయం, వలసవాదం, సామ్రాజ్యవాదం, దోపిడీలను పరిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.

ముఖ్యంగా దేశాలు “స్వదేశీ” అనే పదాన్ని గుర్తించడానికి నిరాకరించి “ఆదివాసీ” వర్గీకరణలను అంగీకరించినప్పుడు ఐఎల్‌ఒ  కన్వెన్షన్ 169ని ఒక ముఖ్యమైన సాధనంగా టార్సిలా రివెరా-జియా ఎత్తి చూపారు.  [టార్సిలా రివెరా-జియా ‘స్వదేశీ సంస్కృతుల కేంద్రం, పెరూ’ (సెంటర్ ఫర్ ఇండీజీనస్ కల్చర్స్ ఆఫ్ పెరు సి‌హెచ్‌ఐ‌ఆర్‌ఎపి‌ఎక్యు) వ్యవస్థాపకురాలు; అధ్యక్షురాలు; కాంటినెంటల్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండిజినస్ ఉమెన్ ఆఫ్ ది అమెరికాస్ (ఇసిఐ‌‌ఎం‌ఐ‌ఎ) వ్యవస్థాపకురాలు; యుఎన్‌ పర్మనెంట్ ఫోరమ్ ఆన్ ఇండిజినస్ ఇష్యూస్ పూర్వ నిపుణ సభ్యురాలు] స్వదేశీ మహిళలు, అట్టడుగు వర్గాల ప్రపంచ పొత్తులను బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బస్తర్‌కు నిరంతర మద్దతును ప్రకటించారు. స్వదేశీ భూభాగాల రక్షణ ప్రపంచవ్యాప్తంగా అనుసంధానించబడి ఉండాలని బలోపేతం చేస్తూ ముగించారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌సాఫ్ ఇండియా, దాని సహకార సంస్థ (జతచేయబడిన) ప్రారంభించిన, ప్రపంచవ్యాప్తంగా 50 కి పైగా మానవ హక్కులు, పర్యావరణ న్యాయ, పౌర సమాజ సంస్థలు, 130 మంది వ్యక్తులు సంతకం చేసిన ఒక ప్రకటన విడుదలైంది. బస్తర్‌లో సైనికీకరణను తొలగించడం ద్వారా రాజ్య హింసను వెంటనే ఆపివేయాలని, ఆదివాసీ సముదాయాలకు రాజ్యాంగ రక్షణలను అమలు చేయాలని, స్వేచ్ఛాయుత, ముందస్తు సమాచారం ఇచ్చి సమ్మతి తీసుకోని (ఎఫ్‌పి‌ఐ‌సి) అన్ని భూసేకరణలను నిలిపివేయాలని, స్వదేశీ మానవ హక్కుల కార్యకర్తల రక్షణ, అన్ని మానవ హక్కుల ఉల్లంఘనలకు, అంతర్జాతీయ చట్టాలకు జవాబుదారీతనం వహించాలి వంటి డిమాండ్లను పునరుద్ఘాటించింది.

Media Contact / RSVP: insafindia@protonmail.com

One thought on “బస్తర్ ఆదివాసులకు ఆంతర్జాతీయ సంఘీభావం

  1. ఆదివాసీ కి అండగా! అతనూ మనిషేనని గ్రహించని మైదానం మనిషి
    అంతర్జాతీయ స్థాయిలో అండ శ్లాఘించ దగినది

Leave a Reply