2024లో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల బలమైన కోట అయిన బస్తర్‌లో 287 మంది మావోయిస్టులను లేదా అంతకుముందు సంవత్సరం కంటే 10 రెట్లు ఎక్కువ మందిని తాము చంపినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఫిబ్రవరి 9నాడు హత్య చేసిన 31 మందితో సహా 2025 ఫిబ్రవరి 10 వరకు కనీసం 80 మంది మావోయిస్టులను కాల్చి చంపారు.
మధ్య భారతదేశంలోని అడవులు, గ్రామాలలో యుద్ధం ఉధృతంగా జరుగుతోంది; దౌర్జన్యాలు, చట్టాతీత హత్యల ఆరోపణలు, ఆత్మీయుల మరణాలకు కావలసింది పరిహారం కాదనీ న్యాయం అనీ డిమాండ్ చేస్తున్న; తమ స్వంత గ్రామాలలోనే జరిగే హింస, మరణాలకు భయపడుతున్న ఆదివాసీలను వెతకడానికి మేం నాలుగు ‘ఎన్‌కౌంటర్’ జరిగిన ప్రదేశాలకు వెళ్ళాం.
బీజాపూర్, నారాయణపూర్, ఛత్తీస్‌గఢ్: 2025 జనవరిలో ఒక చల్లని ఉదయం, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోని టాడోపోల్ గ్రామానికి వెళ్లే దారిలో విశాలమైన ఇంద్రావతి నదిపైన చంద్రవంక ఆకారంలో చెక్కతో, చేతితో తయారు చేసిన నావ ఊయలలూగుతూ సాగుతోంది. ఈ ఊరు రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు నైరుతి దిశలో దాదాపు 400 కి.మీ. దూరంలో ఉంది.
In the village, on a clear patch of land, is a four-tiered mint coloured structure that looks like a wedding cake. It is a memorial built for Ramesh Oyam, a subsistence millet farmer from the neighbouring Bodga village, who was killed by security forces on 29 January 2024.
గ్రామంలో ఉన్న ఖాళీ మైదానంలో, పుదీనా రంగులో ఉన్న నాలుగు అంతస్థుల నిర్మాణం ఉంది. 2024 జనవరి 29నాడు భద్రతా బలగాలు చంపిన, పొరుగున ఉన్న బోడ్గా గ్రామానికి చెందిన చిరుధాన్యాలు పండించే రైతు రమేష్ ఓయం కోసం నిర్మించిన స్మారక చిహ్నం ఇది.
మరణించినప్పుడు ఓయంకు దాదాపు 24 సంవత్సరాల వయస్సు, కుటుంబంలో ఏకైక సంపాదనాపరుడు; నాలుగు రోజుల పసికందుకు తండ్రి.
అర్ధ శతాబ్దానికి పైగా జరిగిన సంఘర్షణలో మరణించిన దాదాపు 10,000 మంది పౌరులు, భద్రతా దళాలు, వామపక్ష గెరిల్లాలలో ఓయం ఒకరు. ఆయన హత్య జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఈ జనవరి నెలలో స్మారక చిహ్నం దగ్గర ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు సమావేశమవాలనుకున్నారు; కానీ భద్రతా దళాలు లేదా మావోయిస్టుల నుండి దాడులు జరుగుతాయనే భయంతో అలా చేయలేకపోయారు.
“బస్తర్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు చురుకైన యుద్ధ ప్రాంతంగా మారాయి” అని దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ అన్నాడు.
భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న తిరుగుబాటులో వామపక్ష గెరిల్లాలపై భద్రతా బలగాలు తమ దాడిని ముమ్మరం చేయడంతో రికార్డు స్థాయిలో నష్టపోయినప్పటికీ మావోయిస్టులు తిరిగి పోరాడుతూనే ఉన్నారు; నాలుగు ‘ఎన్‌కౌంటర్’లు జరిగిన ప్రదేశాల చుట్టుపక్కల నివసిస్తున్న ఆదివాసులు తమ గ్రామాల్లో తాము సురక్షితంగా లేమని అన్నారు.
అర్ధ శతాబ్దానికి పైగా సాయుధ గెరిల్లాలతో భారత రాజ్యం పోరాడుతోంది.
2009 జూన్‌లో నిషేధానికి గురైన మావోయిస్టు పార్టీ, దాని సైనిక విభాగం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, భారతదేశ గణతంత్రాన్ని కూలదోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి; ఇది “అర్ధ-వలసవాద, అర్ధ-భూస్వామ్య వ్యవస్థ” అని వారు 2004 అక్టోబర్‌లో ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
గెరిల్లాలలో అనేక గ్రూపులు ఉన్నప్పటికీ, రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన గ్రూపులు 2004లో చేతులు కలిపాయి; వారిని మావోయిస్టులు అని పిలుస్తారు.
కొండగావ్, కాంకేర్, బస్తర్, దంతేవాడ, సుఖ్మా, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలతో కూడిన దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం మావోయిస్టు తిరుగుబాటుకు ముఖ్యంగా తీవ్రతరమైన యుద్ధభూమిగా ఉంది. 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, ఢిల్లీ కంటే రెండింతలు పెద్దదిగా ఉన్న అబూజ్‌మాడ్ అనే ప్రాంతంలోని అటవీ కొండలలో తిరుగుబాటుదారులు చిక్కుకుపోయారు. ఈ ప్రాంతాన్ని ఇతర ప్రాంతం నుండి ఇంద్రావతి నది వేరు చేస్తుంది.
కేరళ రాష్ట్రం కంటే కొంచెం పెద్దదైన బస్తర్‌లోని ఏడు జిల్లాల జనాభాలో దాదాపు 70% ఆదివాసీ సముదాయం ఉంది.
కొత్త గడువు
2000ల సంవత్సరం మధ్యలో, పూర్వ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మావోయిస్టు తిరుగుబాటును భారతదేశం ఎదుర్కొంటున్న “ఏకైక అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలు” అని అన్నాడు. వారి ప్రభావం ఒకప్పుడు భారతదేశంలోని మూడవ వంతు వరకు విస్తరించింది.
వారి సైద్ధాంతిక ప్రభావంలో ఉన్న మరో 106 జిల్లాలతో పాటు దేశంలోని 76 జిల్లాలు “వామపక్ష తీవ్రవాదం బారిన పడ్డాయి” అని ప్రభుత్వం 2013లో తెలిపింది.
అప్పటి నుండి, భద్రతా బలగాలు మావోయిస్టులను వెనక్కి నెట్టి, వారి ప్రభావాన్ని ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, బీహార్‌లోని కొన్ని జిల్లాలకు పరిమితం చేశాయి. 2023 అక్టోబర్ 6న, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, రెండేళ్లలోపు మావోయిస్టు తిరుగుబాటును అంతం చేయాలని తమ ప్రభుత్వం నిశ్చయించుకుందని అన్నాడు.
2025 ఫిబ్రవరి 9 న “నక్సలిజం మానవాళికి శాపం, దానిని అన్ని రూపాల్లోనూ నిర్మూలించాలని మేము నిశ్చయించుకున్నాము” అని అన్న షా, ఆ గడువును 2026కి మార్చి 31కి పొడిగించాడు.
ఆర్టికల్ 14 వెబ్ సైట్ సంకలనం చేసిన డేటా ప్రకారం, 2018-2022 మధ్య, భద్రతా సిబ్బంది (168), మావోయిస్టులు (327) కంటే ఎక్కువ మంది పౌరులు (335) మరణించారు.
డ్రోన్‌లు, ఐఇడిలు, ఒంటరితనం:
ఈ రిపోర్టర్ అటవీ గ్రామాలను పర్యవేక్షించడానికి అబూజ్‌మాడ్ అడవుల్లో నడిచిన ఆ రెండు రోజులలోనూ డ్రోన్‌లు తలపైన సందడి చేసాయి.
ఈ గెరిల్లా యుద్ధంలో, తిరుగుబాటుదారులు తమకు అతిపెద్ద ప్రయోజనాన్ని కలిగించే దూరం నుండి ప్రేరేపించగల అధునాతన పేలుడు పరికరాల (ఐఇడిలు)ఆయుధాన్ని ఉపయోగిస్తారు:
తమ గ్రామాల చుట్టూ తిరుగుబాటుదారులు ఎక్కడెక్కడ ఐఇడిలను అమర్చారో తమకు తెలియదని అబూజ్‌మాడ్‌లోని బోడ్గా, రేకవాయ, కుమ్మం గ్రామాల నివాసితులు చెప్పారు.
ఈ ప్రాంతంలోని చాలా గ్రామాలు ఏకాంతంగా ఉంటాయి; రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి నడిచి వెళ్ళాలి; అలాంటప్పుడు ఐఇడి పేలుళ్లకు గురయ్యే అవకాశం ఉంటుంది.
చోటే డొంగర్ లో ఉన్న ఆందాయ్ గనుల తవ్వకాన్ని వ్యతిరేకిస్తూ అమర్చిన ఒక ఐఇడి పేలుడులో 2025 ఫిబ్రవరి 4 న రాజ్‌మన్ సలాం అనే ఒక గని కార్మికుడు గాయపడ్డాడు. దాదాపు ఒక నెల ముందు, 2025 జనవరి 6 న బీజాపూర్‌లో జరిగిన ఇలాంటి పేలుడులో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించారు.
అబూజ్‌మాడ్ జనాభాలో ఎక్కువ మంది అబూజ్‌మాడియా తెగకు చెందినవారు ఉంటారు. 75 పివిటిజి ఆదివాసీ సముదాయాలలో ఇది ఒకటి – ఆహార సేకరణ, వ్యవసాయం రాక ముందు వుండిన సాంకేతికత, అసలు లేని లేదా ప్రతికూల జనాభా పెరుగుదల, చాలా తక్కువ అక్షరాస్యత ఉన్న సముదాయాలకు ఇది ఒక అధికారిక పదం.
అబూజ్‌మాడ్‌లోని ఆదివాసీ సమూదాయాలు ప్రధానంగా అటవీ ఉత్పత్తులను సేకరిస్తాయి; చాలా తక్కువ కుటుంబాలకు ట్రాక్టర్లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, బస్తర్ ప్రాంతంలో సగటు అక్షరాస్యత రేటు 54.40%; జాతీయ రేటు 72.98%.
‘యుద్ధం చివరి దశ’:
మావోయిస్టులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం 2024లో వేలాది అదనపు భద్రతా బలగాలను పంపింది. బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ పట్టిలింగం దీనిని “యుద్ధం చివరి దశ” అని పిలిచాడు.
“2024 సంవత్సరం మాకు చాలా మంచిగా ఉండింది. ఈ సంవత్సరం కూడా చాలా బాగా ఆరంభమైంది” అని పట్టిలింగం చెప్పారు. 2025లో ఫిబ్రవరి 10 నాటికి 80 మందికి పైగా మావోయిస్టులు మరణించారు; వారిలో ఎక్కువ మంది బస్తర్ ప్రాంతంవారు.
2024 డిసెంబర్ 15న, రాష్ట్రంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, గెరిల్లాలకు వ్యతిరేకంగా చేసిన కృషిని ప్రశంసిస్తూ ఛత్తీస్‌గఢ్ పోలీసులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవార్డులు అందజేసాడు.
భద్రతా దళాలు 287 మందిని చంపాయని, 1,000 మందిని అరెస్టు చేశాయని, 837 మంది నక్సలైట్లు లొంగిపోవడానికి దోహదపడ్డాయని చెప్పాడు. బస్తర్‌లో అమాయకుల మరణాలను గురించి షా ప్రస్తావించలేదు.
బీజాపూర్, దక్షిణ ఛత్తీస్‌గఢ్ జిల్లాలోని గంగలూర్‌లో ఉన్న కోర్చోలి, తోడ్కా గ్రామాలలో 2025 ఫిబ్రవరి 1నాడు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ 202 బెటాలియన్ – సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్ – 222వ బెటాలియన్‌లు సంయుక్తంగా సైనిక చర్యలను నిర్వహించాయి. భౌగోళిక ప్రాంతం, భాష, మావోయిస్టు పార్టీలో ఉన్న నిచ్చెనమెట్ల నాయకత్వ క్రమం తెలియడం వల్ల ఆదివాసీలను, మాజీ మావోయిస్టులను డిఆర్‌జిలో నియమిస్తారు.
మావోయిస్టులతో జరిగిన సాయుధ ఎన్‌కౌంటర్‌లో ఆయుధాలతో పాటు ఎనిమిది మృతదేహాలు లభించాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే, మరణించిన వారిలో ఏడుగురు మావోయిస్టులు కాదని క్యాంపెయిన్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇన్ ఛత్తీస్‌గఢ్ (సిపిజెసి-ఛత్తీస్ ఘడ్ లో శాంతి న్యాయాల కోసం ప్రచారోద్యమం) పేర్కొంది.
“మరణించిన వారిలో ఒకరైన లచ్చు పోట్టంకు చెందిన ఓటరు ఐడి కార్డు, అతను తిరుగుబాటుదారుడు కాదని, స్థానిక నివాసి అని రుజువు చేస్తుంది” అని ఫిబ్రవరి 3న సిపిజెసి పత్రికా ప్రకటనలో తెలిపింది.
తిరుగుబాటుదారులు అడవుల్లో నివసిస్తారు కాబట్టి, వారికి సామాగ్రిని తీసుకురావడానికి, వారు స్థానికంగా తిరగడానికి లేదా కొన్నిసార్లు ఆశ్రయం కల్పించడానికి గ్రామస్తుల సహాయం అవసరమవుతుందని పట్టిలింగం చెప్పాడు.
తిరుగుబాటుదారులకు సహాయం చేసే చాలా మంది గ్రామస్తులను మొదట ‘మిలిషియా’గా నియమిస్తారు. మావోయిస్టు సోపానక్రమంలో, మిలీషియా దిగువన వుంటుంది. వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.
వారు తిరుగుబాటుదారులకు, బయటి ప్రపంచానికి మధ్య వారధులుగా వ్యవహరిస్తారు. అందువల్ల, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డు ఉన్న వ్యక్తి తిరుగుబాటుదారుడు కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదని పట్టిలింగం అన్నాడు.
తన ప్రాణాలకు ప్రమాదం వుందని, తన పేరును బయటపెట్టకూడదని చెప్పిన గంగలూరుకు చెందిన ఒక గ్రామస్తుడు గత సంవత్సరం నుండి పరిస్థితులు మారిపోయాయని అన్నాడు.
మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్న గ్రామాల గురించి భద్రతా దళాలకు మునుపటి కంటే ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ, ఆ గ్రామాలకు చేరుకున్న తర్వాత వారు ఎవరిని చంపారనే దానిపై విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు.
సున్నితమైన విషయం కావడంతో తన పేరును బయట పెట్టవద్దు అని చెప్పిన బస్తర్‌లోని ఒక సీనియర్ పోలీసు ఆఫీసర్ అమాయక పౌరులను మావోయిస్టుల నుండి వేరు చేయడం కష్టమని అంగీకరించాడు. “మా పరిస్థితి మెరుగయింది. కానీ కొన్నిసార్లు ఇప్పటికీ చాలా కఠినంగా ఉంటుంది” అని ఆయన అన్నాడు. డిఆర్‌జి వల్ల భద్రతా దళాలకు గతంలో కంటే ఎక్కువ ఖచ్చితమైన సమాచారం ఉందని ఎస్‌పి రాయ్ అన్నాడు. గతంలో మావోయిస్టులుగా ఉన్న అనేక మంది డిఆర్‌జి సభ్యులు తరచుగా తమ పూర్వ సహచరులను గుర్తిస్తారు.
“కొన్నిసార్లు, మా గ్రామాలకు దగ్గరగా లేని ప్రాంతాల్లో మేము సైనిక చర్యలను చేపట్టినప్పుడు, ఎవరు ఎవరో మాకు తెలియదు” అని పోలీసు దర్యాప్తు అధికారికి సమానమైన హోదా కలిగిన డిఆర్‌జి అధికారి సంజు మడ్కంఅన్నారు. “కానీ, మేము ఎప్పుడూ విచక్షణారహితంగా దాడి చేయము.”
‘ఇన్ఫార్మర్లు –మావోయిస్టులు’:
తమ ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాల ఉనికి పెరిగిందని బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, సుక్మా, దంతేవాడ జిల్లాల్లోని అబూజ్‌మాడ్ అడవులలోనూ చుట్టుపక్కలా నివసించే ప్రజలు చెప్పారు. కొంతమంది గ్రామస్తులను పోలీసు ఇన్ఫార్మర్లు లేదా ముఖ్‌బీర్లు అని మావోయిస్టులు అనుమానిస్తారు.
2025 జనవరి 27నాడు మావోయిస్టు కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం తెలియ చేశాడనే ఆరోపణలతో బీజాపూర్‌లోని కేశముండి గ్రామంలోని 41 ఏళ్ల భద్రు సోధి ఇంటిపై మావోయిస్టులు దాడి చేసి గొడ్డలితో చంపారని ఆరోపించారు.
సోధిని “దేశద్రోహి” అని ఆరోపిస్తూ మావోయిస్టులు జారీ చేసిన ఒక కరపత్రం సంఘటనా స్థలంలో లభించిందని పోలీసులు తెలిపారు.
హింసలో భాగం కావడానికి ఇష్టపడని వారు గ్రామంలో నివసించడం చాలా కష్టంగా మారిందని లాలూ ఓయం అన్నారు.
“మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్ అని భావించే వ్యక్తిని చంపుతారు; కానీ భద్రతా బలగాలు కొన్నిసార్లు విస్తృతంగా వల వేస్తాయి” అని బైరమ్‌గఢ్ జిల్లాలోని ఉస్పారి గ్రామానికి చెందిన ఒక గ్రామస్తుడు అన్నాడు; లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో తన పేరు బయటకు చెప్పవద్దని కోరాడు.
“ఒక సైనిక చర్య జరుపుతున్నప్పుడు కేవలం సమాచారం అందించేవారిని మాత్రమే అని కాదు, తిరుగుబాటుదారులకు సహాయం చేస్తున్నారనే అనుమానంతో కూడా గ్రామస్తులను చంపుతారు,” అని 32 ఏళ్ల వ్యక్తి అన్నారు.
టాడోపోట్ గ్రామంలో స్మారక చిహ్నం ఉన్న రమేష్ ఓయంను, ఇంద్రావతి నదికి ఒక చిన్న గట్టుపైకి స్నానం చేయడానికి తన బావమరిదితో కలిసి వెళుతున్నప్పుడు చంపేసారని అతని తల్లి సుక్లి ఓయం తెలిపారు.
తన కొడుకుకు తిరుగుబాటుదారులతో ఎటువంటి సంబంధం లేదని, ఎప్పుడూ తుపాకీ పట్టలేదని లేదా మావోయిస్టు గ్రూపుల ఆలివ్ గ్రీన్ యూనిఫాం ధరించలేదని ఓయం తల్లి చెప్పింది.
“సంఘర్షణ ప్రాంతాలలో కూడా, రాజ్యం రాజ్యాంగానికి, అంతర్జాతీయ చట్టపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి” అని సిపిజేసి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. “జాతీయ భద్రత అనే నెపంతో రాజ్యం తన నేతృత్వంలోనే పౌరులను భయోత్పాతానికి గురిచేస్తున్నప్పుడు ప్రజలను సంరక్షిస్తున్నాను అని ప్రభుత్వం చెప్పడానికి లేదు.”
రోడ్లు ఎందుకు యుద్ధభూములు అవుతున్నాయి?
గత మూడు దశాబ్దాలుగా, బస్తర్‌లో మావోయిస్టులు రోడ్డు నిర్మాణాలకు అంతరాయం కలిగిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన రోడ్లు ప్రధానంగా బొగ్గు, ఇనుప ఖనిజం వంటి ఖనిజాలను ఈ ప్రాంతం నుండి బయటకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన పెద్ద ట్రక్కులకు అనుకూలంగా ఉంటాయని వారు అంటున్నారు. ఆ విషయాన్నికొంతమంది గ్రామస్తులు అంగీకరించారు.
రోడ్లు నిర్మించిన తర్వాత, భద్రతా దళాలు వస్తాయి.
“అభివృద్ధిజరగాలంటే ముందు వచ్చేవి రోడ్లు” అని ఐజిపి పట్టిలింగం అన్నారు. అయితే ను నిర్మించిన తర్వాత పోలీసు క్యాంపులు ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఆయన అంగీకరించారు.
ఈ క్యాంపులు ప్రాథమిక స్థాయిలో ఉంటాయి- పట్టణాల్లోనయితే కాంక్రీట్ బ్యారక్‌లు వుంటాయి; అడవుల్లో టెంట్‌లు – సాధారణ మరుగుదొడ్లు, క్యాంటీన్లు, మధ్యలో బహిరంగ ప్రదేశం ఉంటుంది.
ఒక్క 2024 సంవత్సరంలోనే బస్తర్ అంతటా 30 కొత్త క్యాంపులను నిర్మించామని, మొత్తం 250 కి పైగా ఉన్నాయని పట్టిలింగం చెప్పారు. కొత్త క్యాంపుల్లో తొమ్మిది అబూజ్‌మాడ్‌లో ఏర్పాటు చేశారు; 9వది ఫిబ్రవరి 8న పనిచేయడం ప్రారంభించింది. గత రెండు దశాబ్దాలలో, అబూజ్‌మాడ్‌లో కేవలం నాలుగు క్యాంపులు మాత్రమే ఉండినాయి.
క్యాంపు ఏర్పాటు చేసిన ప్రతిసారీ క్యాంపు చుట్టూతా 50-60 కి.మీ. ప్రాంతం మావోయిస్టులకు నిషిద్ధ ప్రాంతంగా అవుతుంది; ఇలా ఉండడం వల్ల గ్రామాల్లో సమావేశాలు నిర్వహించకుండా సమర్థవంతంగా మావోయిస్టులను ఆపగలమని ఐజిపి పట్టిలింగం అన్నారు. “వారు క్యాంపుల చుట్టు పక్కల సమావేశాలు నిర్వహించలేరు లేదా బహిరంగంగా రిక్రూట్‌మెంట్ చేయలేరు.”
క్యాంపులు ఏర్పాటు అయ్యాక పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయని పట్టిలింగం అన్నారు.
అభివృద్ధి పట్ల సందిగ్ధావస్థ :
భైరమ్‌గఢ్‌లో కొత్తగా పునరుద్ధరించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో, 63 ఏళ్ల స్థానికురాలు సోనీ సోరి ఆసుపత్రి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చూపిస్తూ, “కొద్ది కాలం క్రితం వరకు” ఆ భూమి అడవిగా ఉండేదని అన్నారు. 40 కి.మీ తూర్పున ఉన్న వాణిజ్య కేంద్రమైన గీదంకు భైరమ్‌గఢ్‌కు రోడ్డు లేని కాలాన్ని గుర్తు చేసుకున్నారు.
“భైరమ్‌గఢ్‌ను గీదంకు అనుసంధానించే రహదారికి వ్యతిరేకంగా నేను నిరసన వ్యక్తం చేసినట్లు నాకు గుర్తుంది” అని అన్నారు.
రోడ్డు మార్గం లేకుంటే, తన వెన్నునొప్పి, అధిక రక్తపోటుకు ఆరోగ్య సంరక్షణ దొరకదని అంగీకరించిన సోనీ సోరి, తన పూర్వీకులు రక్షించిన సహజ వనరులపై యాజమాన్యం ఉండడమే తనకు అంతకంటే ముఖ్యమైనదని అన్నారు.
సోను సోరి భావన కొత్తది కాదని, “వలసవాద పూర్వ ఆదివాసీలు తమ నీరు, అడవి, భూమిపై పై సార్వభౌమత్వాన్ని పొందేందుకు సాగుతున్న ఘర్షణ కొనసాగింపే” మావోయిస్టులతో జరుగుతున్న ఘర్షణ అని భావిస్తుంది అని దంతెవాడకు చెందిన న్యాయవాది బేలా భాటియా అన్నారు.
ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి జాతీయ రహదారి 130D, ఇది అబూజ్‌మాడ్ అడవులను విభజిస్తుంది; ఛత్తీస్‌గఢ్‌ను మహారాష్ట్రకు అనుసంధానిస్తుంది.
2024 నవంబర్‌లో, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రోడ్డు నిర్మాణ సంస్థ అయిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దక్షిణ బస్తర్‌లోని రెండు ప్రధాన రహదారుల నిర్మాణ పనిని ప్రారంభించింది; ఇవి “మావోయిస్టులతో పోరాడటానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి”.
ఈ రోడ్లు “పెద్ద ఎత్తున అటవీ నిర్మూలనకు” కూడా కారణమవుతాయని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ లెనినిస్ట్) లిబరేషన్ సీనియర్ సభ్యుడు బ్రిజేంద్ర తివారీ అన్నారు.
ఆదివాసీల ప్రతిఘటన పంచాయతీల నిబంధనలు (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం-1996 (పెసా) కింద తమ హక్కుల కోసం పోరాడటానికి 2021లో ఆదివాసీల సమూహం, వారిలో చాలా మంది యువత, ఒక సంస్థను ఏర్పాటు చేసింది; ఇది రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 (ఆదివాసీలు అత్యధికంగా వున్న ప్రాంతాలు) కింద ఉన్న ప్రాంతాలకు తమ ప్రాంతంలో పాలనపై స్వయంప్రతిపత్తిని ఇస్తుంది.
నిర్ణయాలను తీసుకోవడంలో ఆదివాసీ సముదాయాలను చేర్చాలని రాజ్యాన్ని డిమాండ్ చేయడంలో మూలవాసీ బచావో మంచ్ నాయకత్వం వహించింది; అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది; ఈ చట్టం ప్రకారం భూమితో సహా అటవీ వనరులను ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకోవడానికి అటవీ సముదాయాలు గ్రామసభలు లేదా గ్రామ స్థాయి శాసనసభలను నిర్వహించే స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం, 2005 కింద మాడ్ బచావో మంచ్‌ను 2024 అక్టోబర్ 30 నాడు ప్రభుత్వం నిషేధించింది.
“వారి అడవులను నరికివేసి, వారి భూమిపైన రాత్రికి రాత్రే సెక్యూరిటీ క్యాంపులను ఏర్పాటు చేయడాన్నినిరసిస్తూ పెసా చట్టంను అమలుచేయమంటున్నారు. అది ఎలా చట్టవిరుద్ధం అవుతుంది?” అని ది బర్నింగ్ ఫారెస్ట్: ఇండియాస్ వార్ ఇన్ బస్తర్ (మండుతున్న అడవి: బస్తర్‌లో యుద్ధం చేస్తున్న భారత దేశం)పుస్తక రచయిత నందిని సుందర్ 2024 నవంబర్ 18న X పోస్ట్‌లో అడిగారు.
“మాడ్ బచావో మంచ్ ఉపయోగించే భాష మావోయిస్టులు ఉపయోగించే భాష, జల్ జంగల్ జమీన్ భాషతో సమానంగా ఉంది; కానీ వారు ప్రశ్నలు లేవనెత్తడానికి, నిరసన తెలిపేందుకు తమకు ఉన్న రాజ్యాంగ హక్కును ఉపయోగిస్తున్నారు” అని యువ నాయకుడు వినేష్ పోడియం అన్నారు. ” రాజ్యాన్ని పడగొట్టడానికి ఆయుధాలు చేపట్టడం లేదు.”
మాడ్ బచావో మంచ్‌లోని కొంతమంది సభ్యులు మావోయిస్టులకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారని సూచించే ఆధారాలు పోలీసులకు దొరికాయని, అందుకే ఆ సంస్థను నిషేధించాల్సి వచ్చిందని ఐజిపి పట్టిలింగం అన్నారు. అయితే ఆ ఆధారాలు ఏమిటో అతను చెప్పలేదు.
రాజ్య దౌర్జన్యం పట్ల ఆరోపణలు:
కేంద్ర ప్రభుత్వం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో రోడ్లు, సెక్యూరిటీ క్యాంపులు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడాన్ని కొంతమంది ఆదివాసీలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
2024 డిసెంబర్ 12నాడు ఇంద్రావతి నది ఒడ్డున దాదాపు ఐదు నుండి ఆరు గంటల నడక దూరంలో ఉన్న నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న కల్హాజా-దొండెర్బెడ అడవులలో మావోయిస్టులతో కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి.
ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని అంటున్నారు. రూ. 25 లక్షల రివార్డును ప్రకటించిన ఒడిశా రాష్ట్ర మావోయిస్టుల కమిటీ సభ్యుడు రామచంద్ర, అలియాస్ కార్తీక్, అలియాస్ దస్రు మరణించిన వారిలో ఒకరని పోలీసులు పేర్కొన్నారు.
ఒక రోజు తర్వాత మావోయిస్టులు ఒక ప్రకటనలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు 62 ఏళ్ల కార్తీక్ అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. అతనికి సహాయంగా ఉండడానికి రామ్లి మడ్కం అనే మహిళా సభ్యురాలిని నియమించామని, ఆమె కూడా మరణించిందని తెలిపారు. మిగిలిన ఐదుగురికి తిరుగుబాటుదారులతో సంబంధం లేదని ఆ ప్రకటన పేర్కొంది.
మరణించిన వారిలో నలుగురు తమ గ్రామం చుట్టు పక్కల ఉన్న పొలాల్లో పనిచేస్తున్నారని, తిరుగుబాటుదారులతో వారికి ఎటువంటి సంబంధం లేదని అధికారిక ఎన్‌కౌంటర్ స్థలం నుండి రెండు గంటల దూరంలో ఉన్న కుమ్మం గ్రామస్తులుచెప్పారు. కుమ్మం గ్రామం అబూజ్‌మాడ్ అడవుల్లోని నారాయణపూర్‌లోని ఓర్చా బ్లాక్‌లోని రేకవాయ పంచాయతీలో భాగం.
అయితే, కుమ్మం గ్రామంలోనూ చుట్టుపక్కలా తిరుగుబాటుదారులతో ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.
2024 డిసెంబర్ 11 నాడు పొద్దుగూకాక భద్రతా బలగాలు కొండపైకి పరిగెత్తుతున్న శబ్దం విన్నానని స్థానిక ఉపాధ్యాయుడైన సునీల్ కుమార్ కశ్యప్ చెప్పాడు. అతను కుమ్మం నుండి దిగువన ఉన్న రేకవాయ గ్రామంలో నివసిస్తున్నాడు. “దళాలు సమీపంలో ఉన్నాయని నాకు తెలుసు” అని అన్నాడు.
భయం – మనోవేదన:
ఆ రోజు జరిగిన ఘటనలను వివరించడానికి చింత చెట్టు కింద కూర్చున్నాం. కేవలం 13 కుటుంబాలు మాత్రమే ఉన్న కుమ్మం గ్రామానికి చెందిన 19 ఏళ్ల మనీష్ ఓయం, దాదాపు ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయామని చెప్పాడు. సముదాయం తీవ్ర మనోవేదనకు గురైందని అన్నాడు.
గ్రామస్తులలో అత్యంత తీవ్రంగా గాయపడిన వ్యక్తి పాక్లి ఓయం, ఆమె వయస్సు దాదాపు 16 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. ” కోళ్ళలాగా ప్రతి ఒక్కరూ అటూ ఇటూ పారిపోయారు” అని కాల్పులు జరిగిన రోజు గురించి ఆమె చెప్పింది. పటేల్ లేదా గ్రామ పెద్ద అయిన ఆమె తండ్రి గుడ్సా ఓయం, పోలీసు కాల్పులు విన్నప్పుడు ఇతరులతో పాటు అడవుల్లోకి పారిపోయాడు. ఒక రోజు తర్వాత అతను చనిపోయాడు.
ఆమె సోదరుడు నెవ్రు ఓయం మృతదేహం ఒక వారం తర్వాత గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న పొదల్లో కనిపించింది.
“గ్రామంలో ఉన్న ఎవరినీ ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోము” అని దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ (ఆపరేషన్స్) స్మృతిక్ రాజనాల అన్నాడు; 2024లో జరిగిన అన్ని ప్రధాన చర్యలలో అతను పాల్గొన్నాడు.
“వారు అడవుల్లోకి తప్ప మరెక్కడికి పారిపోతారు?” అని పక్లి ఓయం అన్నది. మగవాళ్ళు గ్రామంలో లేరు. తమ ఇంటి నుండి రెండు గంటల నడక దూరంలో వున్న పొలంలో ఉన్నారు.
ఈ ప్రాంతంలోని ఆదివాసీలు పెండా ఖేటి అని పిలిచే పోడు సాగు పద్ధతిని అనుసరిస్తారు, ఇందులో చిరుధాన్యాలను పండించడానికి కొంత అటవీ భూమిని ఉపయోగించి కొన్ని సంవత్సరాల తర్వాత సారహీనమైన ఆ భూమిని వదిలేసి వేరే భూమిని సాగుచేస్తారు.
తాను గ్రామంలోనే ఉన్నానని, కానీ పోలీసుల కాల్పుల శబ్దం విని మరో ముగ్గురు బాలికలు సుద్రి ఓయం, సునీల ఓయం, తులసి ఓయంతో కలిసి పారిపోయానని 17 ఏళ్ల రామ్లి ఓయం చెప్పింది.
మిగతా ముగ్గురు గాయాల నుండి తప్పించుకోగా, రామ్లి తల వెనుక భాగంలో బుల్లెట్ గాయమైంది.
గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు రామ్లిని వెదురు చాపపై పడుకోబెట్టి నది దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను అంబులెన్స్‌లో మొదట జగదల్‌పూర్‌లోని ఆసుపత్రికి, ఆ తరువాత ప్రత్యేక సంరక్షణ అవసరం కాబట్టి, రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని పెద్ద ఆసుపత్రికి తరలించారు.
కాల్పులు జరిగినప్పటి నుండి, తనకు నిద్రపట్టడం లేదని, “నేను ఏ ఆలోచనా లేకుండా అలా మేల్కొని ఉంటున్నాను” అని రామ్లి చెప్పింది.
కాల్పుల్లో చనిపోయిన 18 ఏళ్ల సోమారి ఓయం తల్లి ఆయ్తు (35 సం) ఓయం గ్రామంలో ఉన్న 13 కుటుంబాలూ ఒకే గుడిసెలో పడుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది.
కాల్పులు జరిగినప్పటి నుండి, గ్రామస్తులు తమ పొలాల్లో పని చేసుకోలేకపోతున్నారని, ఆ రోజు గాయపడకుండా తప్పించుకున్న మనీష్ ఓయం అన్నారు.
“అంటే మేం ఆహారం కోసం ఇతర గ్రామస్తులు లేదా ప్రభుత్వంపైన ఆధారపడాల్సి వస్తుంది” అని అన్నారు.
రాంలీ తండ్రి విజ్జ ఓయం మాట్లాడుతూ, తమ సముదాయ సభ్యులను హత్య చేసినందుకు గ్రామస్తులు న్యాయం కోరుతున్నారని అన్నారు. “నిర్దాక్షిణ్యంగా మాపై కాల్పులు జరిపిన వారిని శిక్షించాలని మేము అడుగుతున్నాము” అన్నారు.
శిక్ష విధించాలి; పరిహారం ఇవ్వడం కాదు:
మేము వెళ్ళిన గ్రామాలన్నింటిలో కూడా, దోషులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు.
ఉదాహరణకు, 2024 జనవరి 1నాడు బీజాపూర్ జిల్లాలోని ముత్వేండి గ్రామస్థులపై పోలీసులు కాల్పులు జరిపి ఆరు నెలల పసికందును చంపారని ఆరోపించారు. మావోయిస్టులతో జరిగిన “ఎదురు కాల్పుల్లో” ఆ బిడ్డ మరణించిందని భద్రతా దళాలు తెలిపాయి. పోలీసులు మాత్రమే కాల్పులు జరుపుతున్నారని గ్రామస్తులు చెప్పారు.
2024 ఫిబ్రవరిలో ‘ఆర్టికల్ 14’ వెబ్ సైట్ రిపోర్టు చేసినట్లు, పరిపాలనాయంత్రాంగం ఈ కేసులోనూ ఇతర కేసులలోనూ పరిహారాన్ని ఇచ్చింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రమే ఆ పరిహారాన్ని తీసుకోవడానికి అంగీకరించాయని పోడియం చెప్పారు.
బీజాపూర్ జిల్లాలోని బోడ్గా గ్రామానికి చెందిన, సుమారు అరవై సంవత్సరాల వయసు ఉన్న రాజే ఓయం, 2024 మార్చిలో పోలీసులు తనపై కాల్పులు జరిపారని చెప్పింది.
ఇరుగు పొరుగు ఆమెను అనేక కిలోమీటర్లు మోసుకెళ్లి భైరమ్‌గఢ్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్లారు, అప్పటికి ఆమె చాలా రక్తం కోల్పోయింది.
భద్రతా బలగాల సిబ్బంది రక్తదానం చేసి ఆమె కోలుకోవడానికి సహాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి మీడియాకు తెలిపాడు.
ఒకవేళ ఆమెకు పరిహారం ఇస్తాము అని అన్నా, మూడు గంటల నడక దూరంలో ఉన్న తహసీల్ ప్రధాన కార్యాలయం లేదా జిల్లా సబ్-డివిజన్ అయిన భైరామ్‌గఢ్‌కు నడిచి వెళ్లలేదు.
ఒక కిలోమీటరు దూరంలో, తన మనవరాలిని చూసుకుంటున్న, రమేష్ ఓయం తల్లి సుక్లి ఓయం కూడా తన కొడుకు మరణానికి ఐదు లక్షల పరిహారాన్ని తాను అడగలేదని చెప్పింది.
వినియోగ ఆర్థిక వ్యవస్థలో జీవించడం
అబూజ్‌మాడ్ గ్రామాల మాదిరిగా కాకుండా, భైరమ్‌గఢ్ జీవనాధార ఆర్థిక వ్యవస్థ నుండి వినియోగ ఆర్థిక వ్యవస్థకు మారుతున్న ఒక చిన్న పట్టణంలా కనిపిస్తోంది; ఇక్కడ కరెన్సీ విలువ సహజ ఉత్పత్తుల విలువ కంటే ఎక్కువగా ఉంటుంది.
వర్ష కుమారి కశ్యప్ ఐదు సంవత్సరాల క్రితం వరకు చిరుధాన్యాలు పండించేది; అటవీ ఉత్పత్తులను సేకరించేది; టోకు మార్కెట్లలో బీడీ ఆకులను అమ్మేది. “మా పట్టణంలో ఇప్పుడు పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి” అని అంటోంది.
అయితే తన పిల్లలను మెరుగైన పాఠశాలలో చేర్చడానికి, ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి, మార్కెట్లో సరుకులు కొనుక్కోవడానికి ఇంకా ఎక్కువ ప్రయాసపడాల్సి వచ్చింది. ఆమె ఇప్పుడు రోడ్డు పక్కన, టార్పాలిన్ షీట్ కింద, పొయ్యి మీద దోసెలు వేసి అమ్ముతుంది.
కశ్యప్ లాంటి చాలా మంది తమ చుట్టూ విస్తరిస్తున్న వినియోగ ఆర్థిక వ్యవస్థలో భాగం కావడానికి ప్రయత్నించడంలో తమ సాంప్రదాయ జీవనశైలి, ఇల్లు, భాషాపర సంబంధాలను కూడా మార్చుకోవలసి వచ్చింది.
రచయిత రక్షా కుమార్ జర్నలిస్టు; మానవ హక్కులు సామాజిక న్యాయ అంశాల మీద కేంద్రీకరిస్తున్నారు.
2025 ఫిబ్రవరి 12
తెలుగు – పద్మ కొండిపర్తి