అటవీ భూములను మైనింగ్‌ అవసరాల కోసం మళ్లించేందుకు వేదాంత కంపెనీ అధికారులు, జిల్లా యంత్రాంగం బూటకపు గ్రామసభలు నిర్వహించడంపై నేరపూరిత, చట్టవిరుద్ధమైన ప్రయత్నాలపై మా మాటి మలి సురాఖ్య మంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒడిశాలోని తిజిమాలి, కుట్రుమాలి, మజ్‌హింగ్‌మాలి కొండలపై ఉన్న బాక్సైట్ మైనింగ్ లీజులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూంది. 

 తిజిమాలి కొండల చుట్టూ నివసించే ప్రజల సమ్మతి లేకుండా తిజిమాలి (ప్రభుత్వ రికార్డులలో సిజిమాలి అని వుంది)లో బాక్సైట్ తవ్వడానికి ఒడిశా ప్రభుత్వం వేదాంత లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2023 మార్చి 1 న, వేదాంతను ప్రాధాన్య వేలందారుడిగా ప్రకటించారు. 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వఉన్నాయనే అంచనా వున్న సిజిమాలి బ్లాక్‌ను కేటాయించింది. సిజిమాలిలో 1549.02 హెక్టార్లలో సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల బాక్సైట్ తవ్వకాన్ని వేదాంత కంపెనీ ప్రతిపాదించింది.

 సిజిమాలి మైనింగ్ ప్రాజెక్టు వల్ల 18 గ్రామాలకు చెందిన 100 కుటుంబాలు నిర్వాసితులవడంతో పాటు అదనంగా మరో 500 కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతోంది. ప్రాజెక్ట్ కోసం పర్యావరణ శాఖ అనుమతితో పాటు, మైనింగ్ లీజు ప్రాంతంలో 699.7 హెక్టార్ల అటవీ భూమి ఉన్నందున వేదాంత అటవీశాఖ అనుమతిని కూడా పొందవలసి ఉంటుంది. అలాగే, కర్లపట్ వన్యప్రాణుల అభయారణ్యంలోని నోటిఫైడ్ ఎకో-సెన్సిటివ్ జోన్‌లో (ప్రకటిత పర్యావరణపర సున్నితమైన ప్రాంతం) ప్రాజెక్టువల్ల ప్రభావితమయ్యే రెండు గ్రామాలు ఉన్నాయి.

 ఆదివాసీ జనాభా ప్రాబల్యం కారణంగా రాజ్యాంగంలోని షెడ్యూల్ ఐదు (V)  కింద వర్గీకరించిన జిల్లాల్లోని గ్రామాలలో మైనింగ్ ప్రాంతం విస్తరించి ఉంది కాబట్టి, వారి సహజ వనరులను దోపిడీ చేయాలంటే మొదట గ్రామసభల ద్వారా ఈ గ్రామాలకు చెందిన మొత్తం వయోజన జనాభా సమ్మతిని తీసుకోవడం తప్పనిసరి. తిజిమాలి ప్రజలు మా మాటి మాలి సురక్షా మంచ్ బ్యానర్ క్రింద సంఘటితమై, తమ పవిత్రమైన తిజిమాలి కొండలపై గనుల తవ్వకాలను నిరసిస్తున్నారు. గత ఒకటిన్నర సంవత్సరాల నుండి ప్రజలు క్రూరమైన పోలీసు అణచివేతను ఎదుర్కొంటున్నారు; వారిపై అబద్ధపు నేరారోపణలు మోపుతున్నారు; పోలీసులు, కంపెనీ కిరాయి గూండాల నుండి నిరంతరం బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ భూములు, అడవులు, వాగులపై వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్ వలన కలిగే పర్యావరణ ప్రభావాలను ప్రశ్నించినందుకు ఆదివాసీ సముదాయానికి చెందిన అనేక నాయకులు జైలు శిక్షను ఎదుర్కొన్నారు.

మైనింగ్ ప్రయోజనాల కోసం అటవీ భూములను మళ్లించడానికి సమ్మతి పొందేందుకు గ్రామసభలను నిర్వహించడానికి 2023 డిసెంబర్‌లో వేదాంతకు చెందిన మైన్స్ డెవలపింగ్ ఏజెన్సీ మైత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, పోలీసు అధికారులతో కలసి  ప్రయత్నించినప్పటికీ ప్రజల సమ్మతిని పొందలేకపోయింది. అందువల్ల తమ సంతకాలు ఇవ్వమని ప్రజలను బలవంతం చేయడానికి పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని భారీగా మోహరించారు. కొన్ని గ్రామాల్లో మైనింగ్ ప్రాజెక్టు కోసం తమ భూములు, అటవీ ప్రాంతాలు ఇచ్చేందుకు సమ్మతిస్తున్నట్లు తీర్మానాలపై సంతకాలు చేయించారు.

పత్రికా ప్రకటన

25-10-2024; భవానీపట్న

తిజిమాలి కొండ ప్రాంత పరిసరాల్లో నివసించే ప్రజల సమ్మతి లేకుండా తిజిమాలి (ప్రభుత్వ రికార్డులలో సిజిమాలి) కొండల్లో బాక్సైట్ తవ్వడానికి ఒడిశా ప్రభుత్వం వేదాంత లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుండి, బాక్సైట్ తవ్వకాల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అనేక ముఖ్యమైన, క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తాము. మా మాటి మాలి సురక్షా మంచ్ (తల్లి, భూమి, కొండల సురక్షా వేదిక) ద్వారా, తిజిమాలి ప్రజలు మన పవిత్రమైన తిజ్మాలి కొండలపై జరగబోయే మైనింగ్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్నారు.

గత ఒకటిన్నర సంవత్సరాల నుండి, మన ప్రజలు క్రూరమైన పోలీసుల అణచివేతను, అబద్ధపు నేరారోపణలను, పోలీసులు, కంపెనీ గూండాల నుండి నిరంతరం బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్‌ను న్యాయబద్ధంగా  ప్రశ్నించినందుకు మన సంఘ నాయకులు చాలా మంది జైలు శిక్షను అనుభవించారు, అనుభవిస్తున్నారు. 2023 ఆగస్ట్‌లో,  పర్యావరణ, అటవీ, వాతావారణ శాఖ (ఎమ్‌ఒఇఎఫ్‌సి‌సి) ద్వారా పర్యావరణ అనుమతి కోసం మైనింగ్ ప్రతిపాదన వచ్చినప్పుడు, మైనింగ్‌ను వ్యతిరేకించినందుకు మా నాయకులలో చాలా మందిని (వారిలో దాదాపు 24 మంది) క్రూరంగా కొట్టారు, అక్రమ నిర్బంధానికి లోనయ్యారు. తప్పుడు నేరారోపణలతో జైలు పాలయ్యారు. మన వ్యవసాయ భూములు, అడవులు, వాగులపై మైనింగ్ పర్యావరణ ప్రభావాలను ప్రశ్నించినప్పటి నుంచి  కంపెనీ గూండాల, పోలీసుల వేధింపులు, బెదిరింపులు ఆగలేదు; మా రోజువారీ పోరాటాలలో భాగంగా మారాయి.

2023 డిసెంబర్ 8 నాడు వేదాంతకు చెందిన గనుల అభివృద్ధి ఏజెన్సీ మైత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రాయగడ, కలహండి పోలీసు అధికారులతో కలిసి తిజిమాలి కొండ ప్రాంతంలో(రాయగడ జిల్లాలో ఆరు గ్రామాలు; రెండు రెవెన్యూ గ్రామాలు; కలహండి జిల్లాలోని రెండు గ్రామాలు) అటవీ భూములను మైనింగ్ ప్రయోజనాల కోసం మళ్లించడానికి సమ్మతి కోసం గ్రామసభలను నిర్వహించడానికి ప్రయత్నించారు.

అయితే, ఈ గ్రామాలలో ఏ ఒక్కదానిలో కూడా, ప్రజల సమ్మతిని కంపెనీ పొందలేకపోయింది. అందువల్ల వారు సంతకాలు చేయమని ప్రజలను బలవంతం చేయడానికి పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని భారీగా మోహరించారు. చాలా గ్రామాలలో కంపెనీ గ్రామంలోకి ప్రవేశించలేకపోయింది; మరికొన్ని గ్రామాల్లో మైనింగ్ ప్రాజెక్ట్ కోసం తమ భూములు, అటవీ ప్రాంతాలను ఇవ్వడానికి అంగీకరించినట్లు తీర్మానాలపై బలవంతంగా సంతకాలు చేయించారు.

మైత్రీ కంపెనీ పనస్‌గూడ గ్రామంలోని (తిజిమాలిలో భాగం కాదు) రోజువారీ కూలీ కార్మికులను కూడా నియమించుకుంది. గ్రామసభ సభ్యులుగా నటించమని చెప్పి వారిని డిసెంబర్ 8న కొన్ని గ్రామాలకు తీసుకువచ్చి గ్రామసభకు హాజరైనట్లుగా వారి ఫోటోలను తీసింది. తహశీల్దార్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులు, కలెక్టరేట్‌ల సిబ్బంది హాజరుకావడంతో రాయగడ, కలహండి జిల్లాల పాలనాధికారుల ప్రమేయంతో ఇదంతా జరిగింది.

మా భూములు, అడవులు, తిజిమాలి కొండలను దొంగిలించడానికి గ్రామసభలను బలవంతం చేయడానికి కంపెనీ అధికారులు, జిల్లా యంత్రాంగం చేస్తున్న ఈ రహస్య ప్రయత్నం పట్ల  మేం పూర్తి ఆగ్రహంతో వున్నాం. సమాచార హక్కు దరఖాస్తుల ద్వారా మా హక్కులను తుంగలో తొక్కినా, ఈ నేరపూరిత, చట్టవిరుద్ధమైన ప్రయత్నాన్ని మేము తెలుసుకున్నాము. ఇది అటవీ హక్కుల చట్టం, 2006; పెసా చట్టం, 1996 ఉల్లంఘన. కాశీపూర్, తువాముల్ రాంపూర్‌లోని పోలీసులు, ఇటువంటి చట్టవిరుద్ధమైన ప్రవర్తనకు పాల్పడిన సంబంధిత అధికారులపైన ఎస్‌టి & ఎస్‌టి అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.  ఇది మా హక్కుల తీవ్రమైన ఉల్లంఘన.

మన రాజ్యాంగ హక్కులను నిలబెట్టుకోవడంలో భాగంగా, రాయగడ (కాశీపూర్ బ్లాక్)లోని కాంతమాల్, బంతేజీ (పెలనకానా), సుంగేర్ (కాటిభట), డుమెర్‌పదర్, అలిగున, బుండెల్, మలిపాడు మరియు సాగబరి గ్రామస్తులు & కలహండి (తుయాముల్ రాంపూర్ బ్లాక్)లోని తిజిమాలి మరియు చుల్బాడి అటవీ హక్కుల చట్టం, 2006, ఒడిశా ప్రభుత్వ ‘మో జంగల్ జామీ యోజన’ అమలు కోసం డిమాండ్ చేస్తూ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4, 2024 వరకు ప్రత్యేక గ్రామసభలను నిర్వహించింది. (మో జంగిల్ జామి యోజన అనేది భారతదేశంలోని ఒడిషాలోని ఒక రాష్ట్ర పథకం; ఇది అటవీ నివాసుల హక్కులను గుర్తించడం, వారి జీవనోపాధి, ఆహార భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006పై ఆధారపడి ఉంది; దీనిని అటవీ హక్కుల చట్టం అని కూడా పిలుస్తారు.)

2023 డిసెంబరు 8న జరిగిన సమావేశాలు తప్పుడు పద్దతుల్లో, బలవంతంగా జరిగాయని, ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా, వందలాది సంతకాల ఫోర్జరీ చేశారని పది గ్రామాల గ్రామసభలు తీర్మానాలు చేశాయి. బూటకపు గ్రామసభలపై స్వతంత్ర విచారణ జరిపించాలని, ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, కంపెనీ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని గ్రామసభలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ప్రజల గ్రామసభల వల్ల విసిగిపోయిన కంపెనీ అధికారులు తిజిమాలి కొండలను రక్షించే పోరాటంలో ముందున్న మనందరిపై కల్పిత నేరారోపణలు చేస్తున్నారు. కలగావ్, కాంతమాల్ గ్రామాల్లో పలువురు మహిళా నేతలను కూడా ఈ తప్పుడు కేసుల్లోకి లాగారు. మా మాటి మాలి సురక్షా మంచ్‌కి చెందిన యువనేతల్లో ఒకరైన కార్తీక్ నాయక్‌ను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తప్పుడు నేరారోపణలు చేసి రాయగడ జైలుకు పంపారు.

1. తిజిమాలి, కుట్రుమాలి, మజ్‌హింగ్‌మాలి కొండలపై బాక్సైట్ మైనింగ్ లీజులను వెంటనే రద్దు చేయాలి.

2. 2024 ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించిన మా ప్రామాణిక గ్రామసభలలో ఆమోదించిన తీర్మానాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. (ఈ ప్రామాణిక గ్రామసభలలో ఆమోదించిన తీర్మానాల కాపీలు గౌరవనీయమైన గవర్నర్‌కు, రాయగడ, కలహండి జిల్లాల కలెక్టర్లకు పంపాము. )

3. కార్తిక నాయక్‌పైన, ఇలాంటి అభియోగాలను ఎదుర్కొంటున్న మా సంఘం నాయకులందరిపైనా పెట్టిన అన్ని కల్పిత అభియోగాలను ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలి.

4. మా ప్రామాణిక గ్రామసభ తీర్మానాల ప్రకారం, కాశీపూర్, థువాముల్ రాంపూర్ పోలీసులు వారికి సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా వెంటనే ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయాలని; బలవంతంగా గ్రామసభలు నిర్వహించడం; ప్రజల సంతకాలను ఫోర్జరీ చేయడం వంటి నేరపూరిత చర్యపై దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం.

 (అక్టోబర్ 28, 2024)

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply