బి. విజయ భారతి సెప్టెంబర్ 28 ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ప్రజల ఆధునిక సాహిత్య సాంస్కృతిక, మేధో ఉద్యమంలో ఆమె స్థానం చిరస్మరణీయమైనది. బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలానికి, సంస్కృతికి వ్యతిరేకంగా వందల, వేల ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని విజయభారతి తన రచనలతో చాలా విశాలం చేశారు. ముందుకు తీసికెళ్లారు. దీన్ని ఆమె ప్రధానంగా రెండు మార్గాల్లో కొనసాగించారు. ఒకటి: కుల వ్యవస్థ, సనాతన ధర్మం, పితృస్వామ్యం.. సామాజికంగా వ్యవస్థీకృతం కావడానికి, భావజాలపరంగా, సాంస్కృతికంగా నిరంతరం పునరుత్పత్తి కావడానికి సాధనంగా పని చేస్తున్న పురాణాలను ఆధునిక, బ్రాహ్మణీయ వ్యతిరేక దృక్పథంతో విమర్శనాత్మకంగా చూసి విశ్లేషించడం. రెండు: కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే, అంబేద్కర్‌ల కృషిని, జీవితాలను, భావజాలాలను బ్రాహ్మణీయ సంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా తెలుగు ప్రజలకు పరిచయం చేయడం.
ఈ రెండు పనులను ఆమె చాలా దీక్షగా జీవితమంతా కొనసాగించారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో మేధో రంగంలో, సాంస్కృతిక భావజాల రంగంలో బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని ఎదుర్కోడానికి రచనలు చేశారు. అనువాద కృషి చేశారు. పురాణాలను చారిత్రక, సామాజిక దృష్టితో విజయ భారతిగారికంటే ముందు నుంచే విమర్శనాత్మకంగా చూసి రచనలు చేసిన వాళ్లు ఎందరో ఉన్నప్పటికీ ఆమె ఆ పనిని చాలా ముందుకు తీసికెళ్లారు. పౌరాణిక కథనాలకు ఉండే చారిత్రక పాత్రను విశ్లేషించే ప్రయత్నం చేశారు. భారతదేశంలో పటిష్టమైన సామాజిక సంబంధాల వ్యవస్థగా కులవ్యవస్థ కొనసాగడానికి పురాణాలు అనేక రూపాల్లో భౌతిక, భావజాల రూపాల్లో ఎట్లా పని చేస్తున్నదీ ఆమె వివరించారు. దీనికి ఉదాహరణ ‘వ్యవస్థను కాపాడుతున్న రాముడు’ అనే పుస్తకం.
ఈ పుస్తకంలో ఆమె రాముడిని అనేక వైపుల నుంచి వివరించారు. భారతీయ సామాజిక చరిత్రలో రాముడి పాత్రను అద్భుతంగా విప్పి చెప్పారు. రాముడు కేవలం ఆధిపత్య భావజాల ప్రతినిధి మాత్రమే కాదని, ఆధిపత్య, అసమాన, అమానవీయ వ్యవస్థను కాపాడుతున్నాడని చెప్పడం ఈ పుస్తకం ఉద్దేశం. భారతదేశంలో విప్లవాత్మక మార్పులు రాకుండా అడ్డుకుంటున్న సామాజిక సంబంధాలను రాముడి వైపు నుంచి చూసే ప్రయత్నం చేశారు. ఈ దృష్టి కోణంతో ఆమె భారత సామాజికతను కొత్తగా పరిశీలించడానికి తలుపులు తెరిచారు. తద్వారా ‘పురాణాలు`మరో చూపు’ను సమాజానికి ఇచ్చారు. పురాణలు`కులవ్యవస్థ పేరుతో ఆమె ప్రచురించిన పుస్తకాలు చాలా సరళంగా, లోతుగా అనేక పాఠకులను ఆకట్టుకున్నాయి.
భారతీయ జ్ఞాన వికాసంలో శిఖరాయమానమైన మహాత్మా ఫూలే జీవిత చరిత్రను తెలుగువారికి అందివ్వడం ద్వారా విజయభారతి మన సాంస్కృతికోద్యమానికి కొత్త శక్తిని అందించారు. వేలాది మంది ఆ పుస్తకం చదివారు. ఆ పుస్తకం ఫూలే జీవిత విశేషాల కథనం మాత్రమే కాదు. భారత సమాజం చాలా సంక్లిష్టమైన మార్గంలో ఆధునిక హేతు చింతనను అందుకోడానికి వెనుక జరిగిన సంఘర్షణ కూడా అందులో కనిపిస్తుంది.
భారత సమాజపు అట్టడుగు పొరల నుంచి కొనసాగుతున్న సాంస్కృతిక వికాసం ఫూలే అనే వ్యక్తి జీవించి పోరాడిన చారిత్రక, సామాజిక సందర్భంలో ఒక విస్తృత రూపం తీసుకున్నది. ఒక పెద్ద మూల మలుపు తిరిగింది. అంతక ముందటికంటే పూర్తి భిన్నమైన ఆధునిక ప్రాతిపదిక మీద బ్రాహ్మణిజాన్ని ఫూలే వ్యతిరేకించాడు. అలాంటి వ్యక్తిని ఒక మహత్తరమైన ఉద్యమంగా, చారిత్రకమైన కొనసాగింపుగా అర్థం చేసుకోడానికి విజయ భారతి రాసిన ఫూలే జీవిత చరిత్ర దోహదం చేసింది. తన ఆధునిక, హేతుబద్ధ చింతన ద్వారా ఫూలే సాంస్కృతిక, సాహిత్య, మేథో రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చాడు. విజయ భారతి పుస్తకం ఈ వైపు నుంచి తెలుగు పాఠకుల దృక్పథంలో ముఖ్యమైన మార్పు తీసుకొచ్చారు.
ఫూలేకు కొనసాగింపుగా వచ్చిన అంబేద్కర్ జీవిత చరిత్రను కూడా విజయ భారతి రాశారు. అంబేద్కర్ రచనల అనువాదంలో తన సహచరుడు బొజ్జా తారకంగారితో కలిసి పని చేయడమేగాక అంబేద్కర్ చరిత్రను రాసి, ఆయన ఆలోచనలను తెలుగువారికి అందించడంలో ఆమె చాలా ప్రభావశీలంగా పని చేశారు. అంబేద్కర్ మీద ఆ పుస్తకం సాధికార రచనగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రగతిశీల, దళిత బహుజన ఉద్యమాల నేపథ్యంలో పాఠకులు ఆ రచనను విరివిగా చదివారు.
సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ, సాంఘిక విముక్తి అనే భావనలు కేంద్రంగా ఫూలే, అంబేద్కర్ ఆలోచనలను అధ్యయనం చేసి తెలుగువారికి పరిచయం చేయడంలో విజయ భారతి చాలా గంభీరమైన కృషి చేశారు. బ్రాహ్మణీయ పౌరాణిక భావజాలం నుంచి, సంస్కృతి నుంచి బైటపడనిదే మన సమాజం ముందుకుపోదనే లోతైన అవగాహన ఆమెను నడిపించింది. దాని చుట్టూ విజయ భారతి తన సాహిత్య, మేధో కృషిని కొనసాగించారు. ఆధునిక చింతనను అలవర్చుకోడానికి కులవ్యవస్థను, సనాతన ధర్మాన్ని వాటి మూలాల నుంచి వ్యతిరేకించాలనే దృక్పథాన్ని ఆమె ఎన్నటికీ చెరగని విధంగా అందించారు.
ఆమె తన పుస్తకాలన్నిటినీ చాలా సరళమైన వచనంలో రాశారు. తన పాఠకులు ఎవరో ఆమెకు చాలా స్పష్టంగా తెలుసు. వారికి అవసరమైన పద్ధతిలో రాశారు. కుల మత పితృస్వామ్య అసమానతలు, ఆధిక్యతలు రద్దయ్యే దాకా ఈ సమాజం చేయాల్సిన సుదీర్ఘ ప్రయాణంలో విజయ భారతి రచనలు మనకు ప్రేరణ ఇస్తూనే ఉంటాయి.
– వసంతమేఘం టీం