దేశ ఆర్థిక వ్యవస్థపై అతిగా ప్రచారం చేస్తున్న ప్రధాని మాటలని నమ్మని పెట్టుబడిదారులు విశ్లేషకులు. దేశ ఆర్థిక వ్యవస్థపై మోడీ సర్కారు గతంలో ఎన్నడూ లేని హైప్‌ను సృష్టిస్తున్నది. తమ పాలనలో భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకుంటున్నది. ఇదంతా తమ పాలనలో తీసుకున్న విధాన నిర్నయాల కారణంగానేనని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ నుంచి ఆ పార్టీ కీలక నాయకుల వరకు ఇదే మాటలు చెప్తున్నారు. టివీ డిబేట్లలో, సోషల్ మీడియాలో తమ, తమ అనుబంధ గోడీ మీడియా ద్వారా ఆర్థిక వ్యవస్థపై హైప్‌ను బిజెపి ఊదరగొడుతున్నది. అయితే, పెట్టుబడిదారుల్లో మాత్రం ఈ వాదనపై నమ్మకం కుదరటం లేదని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా భ్రమలో ఉన్నట్టు కనిపించే మరొక విషయం భారత ఎగుమతుల పోటీతత్వం. భారత్ ప్రపంచంలోనే ప్రముఖ ఎగుమతి కేంద్రంగా ఉన్నదని కేంద్రం చెప్తున్నది. అయితే, ప్రపంచ వస్తువుల ఎగుమతుల్లో మన వాటా మూడు శాతం కంటే తక్కువగా ఉన్నది. అది కూడా తగ్గిపోతుండటం గమనార్హం. ఉత్పత్తుల వాణిజ్యంలో మనం ఆధిపత్యం చెలాయించాలనుకుంటే, మనం చైనా వంటి దేశాలతో పోటీ పడవలసి ఉంటుంది.
ఆర్థిక వృద్ధి..అభివృద్ధి ఒకటి కాదు :
బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం జిడిపిలో వృద్ధి రేటు, తలసరి ఆదాయం పెరుగుదల ఆయా దేశాల ఆర్థిక అభివృద్ధికి కొలమానంగా భావించడం జరుగుతున్నది. దేశం ఆర్థికంగా బలోపేతమైనంత మాత్రాన ప్రజలంతా ఆర్థికంగా ఎదిగినట్టుగా ఊహించుకోవడం సరి కాదని సామాజిక శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు. దేశ సగటు ఆదాయం వ్యక్తుల నిజమైన ఆదాయం కాదని, ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రజలందరి ఆదాయం వాస్తవంగా పెరగాలి. ఆర్థిక అంతరాలు కనీస స్థాయికి తగ్గాలి. దేశంలో పేదరికం పోవాలి. అందరికీ ఉపాధి అవకాశాలు లభించాలి. పరిశుభ్రమైన త్రాగునీరు, పౌష్టికాహారం లభించాలి. ప్రజల ఆరోగ్యం మీద దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్న విషయం మరువరాదు. ప్రజలను వేధిస్తున్న మరో సమస్య నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, అన్ని వ్యవస్థల్లో కేన్సర్‌లా ప్రబలిపోయిన అవినీతిని పారద్రోలాలి. ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని పెంచాలి. విచ్చలవిడిగా పెరుగుతున్న అవినీతి అభివృద్ధి ఫలాలను ప్రజలకు దూరం చేస్తున్నది. కొంతమంది వ్యక్తులు ఆర్థికంగా బలపడినంత మాత్రాన అది అభివృద్ధి కాబోదు. దేశ జిడిపి పెరుగుదలలో అవినీతి పరుల భాగస్వామ్యాన్ని, అడ్డదిడ్డంగా పెరుగుతున్న కార్పొరేట్ దిగ్గజాల సంపదను వ్యవకలనం చేస్తే నిజమైన దేశ ఆర్థిక స్వరూపం నిర్ధారణ అవుతుంది.
గృహ వినియోగ వ్యయంలో వ్యత్యాసాలు :
దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమాతనలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య, వివిధ సామాజిక వర్గాల మధ్య వినియోగ వ్యయంలో వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఇందుకు సంబంధించి ‘జాతీయ నమూనా సర్వే కార్యాలయం’ ఇటీవల విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ నివేదికతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో వివిధ సామాజిక వర్గాల వినియోగ వ్యయాల మధ్య వ్యత్యాసాలు ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ స్వయం ఉపాధి కూలీ (రూ.3702), వ్యవసాయేతర స్వయం ఉపాధి కూలీ (రూ.4074), వ్యవసాయ కూలీ (రూ.3597), వ్యవసాయేతర కూలీ (రూ.4533)ల నెలసరి సగటు వ్యయాలు వేర్వేరుగా ఉంటున్నాయని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే విశ్లేషించింది. పట్టణాల్లోనూ వివిధ సామాజిక వర్గాలు చేస్తున్న ఖర్చులో ఇటువంటి అసమానతలే కనిపిస్తున్నాయి. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ బిసి, మైనారిటీ వర్గాల వినియోగ వ్యయాలు ఇతరుల కంటే చాలా తక్కువగా ఉంటున్నాయని సర్వే వివరించింది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలతో దేశ ప్రజల కొనుగోలు శక్తి క్రమేపీ క్షీణిస్తూ మొత్తం ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతోంది. మోడీ మాటలకు ప్రజల వాస్తవ జీవితాలకు పొంతన లేదని గృహ వినియోగ సర్వే తేల్చి చెప్పింది.
వినియోగ వ్యయాల గృహ సర్వే ప్రకారం, పట్టణ ప్రాంతాల్లోని అయిదు శాతం అత్యంత సంపన్న కుటుంబాల నెలసరి సగటు వ్యయం రూ.20,824 కాగా, నెలనెలా గ్రామీణుల తలసరి సగటు వినియోగ వ్యయాన్ని రూ.3,773గా, పట్టణ సగటు వినియోగ వ్యయాన్ని రూ.6459గా సర్వే పేర్కొంది. గ్రామీణులు, పట్టణవాసులు చేస్తున్న ఖర్చులు జాతీయస్థాయిలో జరుగుతున్న వాస్తవ వినియోగ సగటు వ్యయంకన్నా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంటే, దేశంలో కొద్ది సంఖ్యలో ఉండే సంపన్న కుటుంబాల వ్యయాలు చాలా అధికస్థాయిలో ఉంటున్నాయన్న మాట. గ్రామీణ ప్రాంతాల్లోని అయిదు శాతం సంపన్నులు, పట్టణాల్లోని పదిశాతం సంపన్నుల సగటు తలసరి వినియోగ వ్యయం చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం కార్మికుల సగటు వేతనాన్ని రూ.16,000గా నిర్ణయించింది. కుటుంబంలో ఒకరే సంపాదించి, నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలు దేశంలో పెద్దసంఖ్యలో ఉన్నాయి. అంటే వారి సగటు నెలసరి ఆదాయం రూ.4,000. ఇంటి అద్దె, ఆహారం, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, దుస్తులు వంటి ఖర్చులకు అది ఏమాత్రం సరిపోవడం లేదు.
ప్రజల వ్యయమే దేశాభివృద్ధికి మూలం :
వినియోగ వ్యయానికి, దేశాభివృద్ధికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ప్రజల వినియోగ వ్యయాలు ఎంత ఎక్కువగా పెరిగితే అభివృద్ధి అంతగా ఊపందుకుంటుంది. వినియోగం పెరగడమనేది వస్తుసేవల ఉత్పత్తి విస్తృతం కావడానికి దోహదపడుతుంది. దాంతో పరిశ్రమలు కార్మికశక్తిని పెంచుకోవాల్సి వస్తుంది. తద్వారా వారి ఆదాయాలు పెరిగి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఫలితంగా స్తూల దేశీయోత్పత్తి (జిడిపి) ఎగబాకుతుంది. ఇదంతా ఒక చక్రంలా దేశాభివృద్ధికి బాటలు పరుస్తుంది. ఈ చక్రం ఎంత వేగంగా తిరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా ఊపందుకొంటుంది. కానీ నేడు ఇండియా అభివృద్ధి ప్రజల వినియోగం వ్యయాల పెరుగుదలపై కాకుండా కార్పొరేట్ల సంపద పెరగడం పైనే ఆధారపడి ఉంటోంది. దేశంలో ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు కుంచించుకుపోతున్నాయి. వారి కొనుగోలు శక్తి తగ్గిపోవడం పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక రంగం మందగతిలోకి జారిపోవడం జిడిపి వృద్ధిరేటు క్షీణతకు కారణమవుతోంది. ఈ వృద్ధిరేటు క్షీణత తిరిగి ప్రజల ఆదాయాలను దెబ్బతీస్తుంది. దేశంలో 15 సంవత్సరాలు పైబడిన యువత 96 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 57.8 కోట్ల మంది పనిచేయగలిగే శ్రామికులుగా ఉన్నారు. వీరిలో 18 కోట్ల మంది నిరుద్యోగులు, ముప్పై రెండున్నర కోట్ల మంది స్వయం ఉపాధి పొందుతున్నవారు. 11 కోట్ల మంది కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులు, కేవలం 9 శాతం మంది మాత్రమే రెగ్యులర్ వేతనాలు పొందుతున్నవారు. మన పక్కన ఉన్న బంగ్లాదేశ్‌లో 42 శాతం మంది రెగ్యులర్ వేతనాలు పొందుతున్నారని బ్లూ వెంచర్ నివేదిక తెలిపింది. ఇండియా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ విషవలయంలోనే చిక్కుకుపోయింది.
రూపాయి పతనంలో ఆర్థిక వ్యవస్థ కుదేలు :
రూపాయి విలువ తగ్గిపోయేందుకు కారణాల్లో ముఖ్యమైనది అమెరికన్ డాలర్ బలపడుతూ ఉండటమని చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కొన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో డాలర్ విలువ పెరుగుతోంది. అంతేకాకుండా… ఆర్థిక అనిశ్చితి అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో చాలామంది డాలర్‌ను సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తూండటం కూడా దాని విలువ పెరిగేందుకు కారణమవుతోంది. డాలర్ విలువ పెరగడం బంగారం, చమురు, రక్షణ వస్తువులు వంటి కమాడిటీ ధరలపై కూడా ప్రభావం చూపుతుంది. డాలర్ బలపడిన కొద్దీ బంగారం ధరలూ పెరిగిపోతాయి. భారత్ లాంటి బలహీన కరెన్సీ ఉన్న దేశంలో ఇది మరికొంచెం ఎక్కువగా ఉంటుంది. రూపాయి మారకం విలువ తగ్గిపోవడం వాణిజ్య లోటు పెరిగిపోయేందుకు కారణమవుతుంది. రూపాయి మారకం విలువ తగ్గిపోవడం సామాన్యుడిపై నేరుగా ప్రభావం చూపుతుందన్నది తెలిసిందే. దేశ ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఇంధన ధరలు లీటర్‌కు వంద రూపాయలు దాటిపోయాయి. దీనివల్ల వస్తు సేవల ధరలు కూడా ఎక్కువవుతాయి. 2024 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరుకుంది. నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్ మాన్ చెప్పినట్లు.. ‘కరెన్సీ బలహీన పడినప్పుడు ద్రవ్యోల్భణం పెరిగిపోయి సమాజంలో అట్టడుగున ఉన్నవారు తీవ్రంగా ప్రభావితమవుతారు’ అన్నది ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది.
భారత్‌కు ఐఎంఎఫ్ హెచ్చరిక :
గత సంవత్సర కాలంగా భారత్ నుండి పెట్టుబడులు దేశం విడచి వెళ్లిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రైవేటు పెట్టుబడుల వృద్ధి మందకొడిగా సాగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) బలమైన విమర్శలు చేసింది. ప్రస్తుతం ఎదురైన ఆర్థిక మాంద్యం సమస్య నుండి బయటపడాలంటే వినియోగానికి బాగా ప్రోత్సాహం ఇవ్వాలని, సక్రమ పద్ధతులతో కూడిన విధానపరమైన ముందస్తు అంచనాలను పెంచాలని, వాణిజ్య విధానాన్ని హేతుబద్ధీకరించాలని ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన వార్షిక సంప్రదింపుల నివేదిక నాలుగో అధ్యాయంలో ఒక విభాగం పూర్తిగా భారత్‌లో ప్రైవేటు పెట్టుబడులకు తిరిగి జీవం పోయాల్సిన విషయానికే కేటాయించింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో 2022-23లో 21శాతంగా ఉన్న సాధారణ పెట్టుబడుల వృద్ధి 2023-24 సంవత్సరానికి 13 శాతానికి, 2024-25 సంవత్సరానికి 9 శాతానికి క్షీణించిపోవడం చూస్తే పరిస్థితి దారుణంగా క్షీణించిందని పేర్కొంది. వినియోగదారుల చేతుల్లో తగినంత డబ్బు లేకుండా వారు ఉత్పత్తుల కొనుగోళ్లు చేయలేరని, కొన్ని వస్తువులకు మాత్రమే గిరాకీ తీసుకు రాగలుగుతారనీ, తయారీ సంస్థలు తమవద్ద ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాయని, అందువల్ల తదుపరి వృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి వారికి ఎలాంటి ఆసక్తి కనిపించడంలేదని తెలిపింది. దీన్ని సాధించాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు గలగల లాడాలి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ వ్యయం పెరగాల్సి ఉంటుంది.
ముగింపు :
దేశంలో మోడీ పాలనలో అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరకపోవడంతో 10 శాతం సంపన్నుల వద్ద 77 శాతం సంపద కేంద్రీకృతం కావడంతో దేశంలో జరుగుతున్న ఆర్థిక వృద్ధి ప్రజల అభివృద్ధి ఏ మాత్రం కాదని విధితమవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కనీసం 7శాతం వృద్ధిని కూడా సాధించలేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ పనితీరు, ప్రగతిపై ప్రపంచ రేటింగ్ సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాకు సరిపడ ఉద్యోగాల సృష్టి జరగాలంటే కనీసం 9 శాతం వృద్ధి ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అధిక ధరలతో దేశంలో సామాన్యుల కొనుగోలు శక్తి తరిగిపోతుంటే… ధనిక వర్గం సంపాదనలో రికార్డ్‌లను సృష్టిస్తోంది. ఒక్క అంకెకు పరిమితమైన కుబేరుల సంఖ్య సైతం 2024 డిసెంబర్ నాటికి 191కి చేరింది. ఈ జాబితాలో గడిచిన ఏడాదిలో 12 శాతం పెరుగుదలతో కొత్తగా 26 మంది చేరారు. ఒక బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8600 కోట్లు) కంటే ఎక్కువ సంపద కలిగిన వారిని బిలియనీర్లుగా వ్యవహరిస్తారు. భారత్‌లోని బిలియనీర్ల సంపద మొత్తం విలువ 950 బిలియన్ డాలర్లతో (దాదాపు రూ.82 లక్షల కోట్లు) సమానమని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. ప్రపంచంలోనే భారత్ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ సర్కార్ ప్రచార ఆర్భాటాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ అసమానతలను పరిష్కరించకుండా దేశాభివృద్ధి గురించి మాట్లాడమంటే పది శాతంగా ఉన్న సంపన్నుల గురించి మాట్లాడటమే. ఉన్నత మధ్య తరగతికి చెందిన 30 కోట్ల మంది ఆందోళనతో జీవిస్తుండడం, మిగిలిన వంద కోట్ల మందికి కొనుగోలు లేకపోవడం నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. ఈ సవాళ్లను పరిష్కరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈ ఆర్థిక, సామాజిక అసమానతల అంతం కోసం విశాల ప్రజా ఉద్యమాలే అంతిమ పరిష్కారం.