కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి లక్ష్యాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ కేవలం మాటల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని గత పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా చూశాం. మరోవైపు మోడీ ప్రచారానికి భిన్నమైన వాస్తవ దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. వర్తమాన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేదీ చేదు నిజం. వాస్తవానికి ‘ఆర్థిక వినాశనం’ అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుంది. అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చులు తగ్గిపోవడం జిడిపి పతనానికి సంకేతమేనా? ధరల కట్టడి కష్టతరమైపోయిందా? కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్… అటు జిడిపి, ఇటు ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. గతంతో పోల్చితే ఈసారి జిడిపి గణాంకాలు తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేథ్ అన్నారు.
భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి గత ఆర్థిక సంవత్సరం 2023-24 రెండో త్రైమాసికంలో 8.1 శాతంగా నమోదైంది. కానీ, ఈసారి అది 5.4 శాతానికి పడిపోయింది! జిడిపి వృద్ధి ఈ స్థాయికి తగ్గడానికి తయారీ రంగంలో మందగమనం, వినియోగం నీరసించడమే ప్రధాన కారణం. అయితే వ్యవసాయం, అనుబంధ రంగాలు సాధించిన వృద్ధి కొంత ఊరటనిచ్చింది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా పెద్దయెత్తున పిఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకాన్ని పలు రంగాలకు వర్తింపజేస్తోంది. అయినా సరే, తయారీ రంగ వృద్ధిరేటు నేలచూపులు చూస్తోంది. ‘భారత్‌లో తయారీ’ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో కొనసాగుతున్న మందగమనాన్ని పూర్తిస్థాయిలో అడ్డులేకపోతోంది. తయారీ రంగ వృద్ధిరేటు 14.3 శాతం నుంచి ఏకంగా 2.2 శాతానికి దిగజారడం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30న అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశ వృద్ధి రేటు 6.4 శాతంగా నమోదవ్వచ్చని ప్రభుత్వ ముందస్తు అంచనా గణాంకాలు చెబుతున్నాయి. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి. తయారీ, సేవల రంగాల పేలవ ప్రదర్శన ఇందుకు కారణం.
తగ్గిన వృద్ధిరేట్ అంచనాలు :
గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌లో బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, ఎరువులు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ వంటి కీలక రంగాల వృద్ధిరేటు 12.7 శాతంగా నమోదైంది. ఈ అక్టోబర్ నాటికి అది 3.1 శాతానికి పడిపోయింది. ఓవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు వాస్తవ వేతనాల పెరుగుదల బలహీనపడటం పట్టణ వినియోగానికి భారీగా గండి కొట్టాయి. మొత్తం మీద రెండో త్రైమాసికంలో జిడిపి వృద్ధి 21 నెలల కనిష్ఠ స్థాయికి దిగజారడంతో అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బిఐ ఆర్థిక, ద్రవ్య విధానపరమైన చర్యలు చేపట్టడానికి సమాయత్తమవుతున్నాయి. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల పనితీరు మందగించడం వల్ల 7.6 శాతంగా ఉన్న భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి 6 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్‌ఎ అంచనా వేసింది. అలాగే స్థూల విలువ జోడిరపు గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో 7.4 శాతం ఉండగా, 2024 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అది 6 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు. పారిశ్రామిక రంగంలో తక్కువ స్థాయిలో వృద్ధి, ప్రభుత్వ వ్యయంలో మందగమనం, రుతుపవనాల ఎఫెక్ట్ వంటి అంశాలు జిడిపి వృద్ధిని తగ్గించాయని పెట్టుబడి సమాచారం అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఐసిఆర్‌ఎ) చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అన్నారు.
తగ్గుతున్న మూలధన వ్యయం :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి కనీసం 6.5 శాతానికి చేరువలో ఉండాలంటే ప్రభుత్వ మూలధన వ్యయం పెద్దయెత్తున పెరగడం చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వ మూలధన వ్యయం, ప్రైవేటు పెట్టుబడులు రెండూ జిడిపి వృద్ధికి ప్రధాన చోదకాలు. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మూలధన వ్యయంగా రూ.11.11 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్షించింది. అయితే, ప్రథమార్థంలో మొత్తం బడ్జెట్‌లో కేవలం 37 శాతమే ఖర్చు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మందగమనం పరిణామాలు ప్రభుత్వ రంగ సంస్థల మూలధన వ్యయాలపైనా పడుతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్థలు తమ మూలధన వ్యయాలను భారీగా తగ్గిస్తున్నాయని జాతీయ మీడియాల్లో రిపోర్టులు వస్తోన్నాయి. జిడిపిలో పెట్టుబడుల వ్యయం ఐదేండ్ల గరిష్ట స్థాయి 5.87 శాతం నుంచి పడిపోయే అవకాశం ఉందని అంచనా. దీంతో వృద్ధి మందగింపు సంకేతాలు వస్తున్నాయి. పెట్టుబడులు మందగించడం ద్వారా ప్రధానంగా ఉపాధి కల్పన దెబ్బతిననుంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు మరింత పెరగనున్నాయి.
స్తంభించిన ఆర్థిక సామాజిక పురోగతి :
1947 ముందు ఆంగ్లం నేర్చి విద్యావంతులైన ఓ చిన్న వర్గం భారత్‌లో మొట్టమొదటి మధ్యతరగతి వర్గంగా ఆవిర్భవించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్షరాస్యత పెరిగి, కొత్త వృత్తి ఉపాధులు, ఆర్థిక కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్నవారు క్రమంగా మధ్యతరగతిగా ఎదిగారు. గడచిన ఏడు దశాబ్దాలలో అల్పాదాయ వర్గాలలో చాలామంది మధ్యతరగతి వర్గంలోకి పరిణామం చెందారు. దీన్నే ఆర్థిక, సామాజిక పురోగతిగా పరిగణిస్తున్నాం. తొలితరం మధ్యతరగతిలో సంప్రదాయ వృత్తులు, కుటుంబ వ్యాపారాలు చేసుకునేవారే అధికం. ఆధునిక చదువులు, శిక్షణతో వృత్తి వ్యాపారాల్లో ఎదిగినవారు నవతరం మధ్యతరగతి కిందకు వస్తారు. భారత్‌లో వ్యవసాయం, అనుబంధ వృత్తుల్లో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 25 ఏళ్లలో ఈ తగ్గుదల 14.4 శాతంగా ఉంది. పరిశ్రమలు, సర్వీసు రంగాల్లోకి మారినవారు 6.6 శాతంగా ఉన్నారు. వ్యవసాయేతర వృత్తుల్లోకి మారినవారి ఆదాయాలు మెరుగుపడి మధ్యతరగతి జనాభా పెరిగింది. తదనంతర కాలంలో రుణభారం, ప్రకృతి ఉత్పాతాలు, ఆరోగ్య సమస్య వల్ల మధ్యతరగతి నుంచి తిరిగి అల్పాదాయ వర్గంలోకి పడిపోయినవారు చాలామంది ఉన్నారు. అలాంటివారి గురించి కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు.
కుటుంబంలో సంపాదనపరుడు ఏ కారణం వల్లనైనా మరణిస్తే ఆ కుటుంబం పేదరికంలోకి జారిపోతుంది. మరికొంతమంది తమ స్తోమతకు మించి ఖర్చులు చేసి అప్పులపాలై అల్పాదాయ వర్గంలోకి మారిపోతున్నారు. ఏ దేశంలోనైనా వస్తు సేవల వినియోగంలో మధ్య తరగతిదే ప్రధాన పాత్ర. వారి నుంచి వచ్చే గిరాకీని తీర్చడానికి అన్ని రంగాల్లో ఉత్పత్తి, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మధ్య తరగతి జనాభా తగ్గితే వినియోగం, ఉత్పత్తి పడిపోతాయి. వృత్తి ఉపాధులు, వ్యాపారాలు దెబ్బతింటాయి. ఈ క్రమంలో భారత్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యాదాయ దేశంగా అభివర్ణిస్తూనే, అధిక రుణభారంతో సతమతమవుతున్న దేశంగా కూడా ప్రపంచ అభివృద్ధి నివేదిక (2024) వర్గీకరించింది. మధ్యతరగతి క్షీణిస్తే దేశ ఆర్థికాభివృద్ధిలో ఎదుగూబొదుగూ కొరవడుతుంది. అధికాదాయ దేశంగా ఎదగలేక, మధ్యాదాయ దేశంగానే మిగిలిపోతుంది. భారత్‌ను ప్రస్తుతం మధ్యాదాయ దేశాల్లో దిగువ అంచెకు చెందినదిగా పరిగణిస్తున్నారు. భారత్ మధ్యాదాయ చెర నుంచి బయటపడి అధికాదాయ దేశంగా ఎదగాలంటే మధ్యతరగతి సవాళ్లను పరిష్కరించాలి. వారి ఆదాయాలు పెరగాలి. ముఖ్యంగా పట్టణ జనాభా వినియోగం పెరుగాలి.
అప్పుల ఊబిలో మధ్యతరగతి … :
మధ్యతరగతిలో దాదాపు ప్రతి కుటుంబం ఎంతోకొంత అప్పు చేసి దాని మీద వడ్డీ కడుతూ ఉంటుంది. అసంఘటిత రంగంలోని వారైతే అధిక రేట్లకు వడ్డీ వ్యాపారుల నుంచి, బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థల నుంచీ అప్పులు తీసుకుంటూ ఊబిలో కూరుకుపోతున్నారు. మధ్యతరగతిలో మధ్యాదాయ, అల్పాదాయ వర్గాల సంపాదనలో పెద్ద భాగకం వడ్డీ కట్టడానికే సరిపోతోంది. పెరిగిపోతున్న జీవన వ్యయానికి తగ్గట్లు ఆదాయం పెరగకపోవడం వల్ల అత్యధికులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, తాహతుకు మించి వెచ్చిస్తూ మరికొందరు కష్టనష్టాల పాలవుతున్నారు. దుబారా ఖర్చులు పెట్టకపోయినా.. అద్దెలు, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతూ రుణ ఊబికి కారణమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఆదాయ వ్యత్యాసాలు మరింతగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు పేదరికంలో జారిపోతున్నమాట నిజమే అయినా, కొంతమంది అక్కడి నుంచి సంపన్న వర్గకంలోకి ఎదుగుతున్నారన్నదీ అంతే వాస్తవమనే వాదన కూడా వినిపిస్తంది. అయితే, మధ్యతరగతి నుంచి సంపన్న శ్రేణిలోకి వెళ్లినవారికన్నా, పేదరికంలోకి జారిపోయినవారే ఎక్కువనడంలో సందేహం లేదు.
భారత్‌లోని మధ్యతరగతి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇవి వారి వినియోగంపై తీవ్రంగా ప్రభావితం చూపుతున్నాయి. బూర్జువా ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి ప్రధాన వినియోగదారులుగా ఉంటారు. మధ్యతరగతి ఇబ్బందులకు ప్రాథమికతంగా మూడు అంశాలు కీలకంగా ఉన్నాయని మార్సెలస్ ఇన్వెస్ట్‌మెంట్ నివేదిక పేర్కొంది. యాంత్రీకరణ, అవుట్‌సోర్సింగ్ కారణంగా సూపర్‌వైజర్ ఉద్యోగాలు అదృశ్యమయ్యాయని పిసి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ మాజీ చైర్మన్ మోహసన్ పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) విఘాతం కలిగిస్తుందని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ గతంలో పేర్కొన్న అంశాన్ని ఆయన ఉద్ఘాటించారు. కొన్ని ఉద్యోగాలు ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలు అదృశ్యం కాబోతున్నాయని వెల్లడిరచారు. ఆర్‌బిఐ డేటా ప్రకారం జిడిపిలో నికర గృహ పొదుపులు దాదాపు 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి.
ప్రమాధకర స్థాయికి భారత అప్పులు :
మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా చేస్తున్న ఇబ్బడిముబ్బడి అప్పులపై ఐఎంఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. భారత అప్పులు ప్రమాధకర స్థాయికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. త్వరలో భారత అప్పు జిడిపిలో 100 శాతానికి మించవచ్చని హెచ్చరించింది. మార్చి 2014 నాటికి భారత అప్పు రూ.55 లక్షల కోట్లు కాగా అది 2025 మార్చి నాటికి రూ.181 లక్షల కోట్లకు చేరనుంది. అంటే గత పది ఏండ్లలో రుణం మూడు రేట్లకు పైగా పెరిగి జిడిపిలో 70 శాతం దాటింది. 2014లో జిడిపి రూ.113 లక్షల కోట్లు కాగా 2024 మార్చి నాటికి రూ.280 లక్షల కోట్లకు పెరిగింది. అప్పు 300 శాతం పెరుగగా జిడిపి 150 శాతం మాత్రమే పెరిగింది. ప్రతి యేటా బడ్జెట్‌లో 20 శాతం అసలు, వడ్డీ చెల్లింపులకే పోతుంది.
కరిగిపోతున్న విదేశీ మారకం నిల్వలు :
ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడంతో భారత విదేశీ మారకం నిల్వలు కర్పూరంలా కరిగిపోతోన్నాయి. ప్రస్తుత ఏడాది డిసెంబర్ 20తో ముగిసిన వారంలో మారకం నిల్వలు 8.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.71 వేల కోట్లు విలువ) తరిగిపోయి 644.391 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో కరిగిపోతున్న ఏడు నెలల కనిష్టానికి పడిపోయినట్లయ్యిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఓ రిపోర్ట్‌లో తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి బారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల భారీగా తరలిపోవడంతో పాటుగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జిడిపి వృద్ధి దాదాపు రెండేండ్ల కనిష్టానికి దిగజారడం, రూపాయి విలువ పడిపోవడం విదేశీ మారకం నిల్వలు కరిగిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. బంగారం రిజర్వులు 2.33 బిలియన్ డాలర్లు పతనమైన 65.726 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ రిజర్వ్ నిల్వలు 23 మిలియన్ల డాలర్లు తగ్గి 4,217 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆర్‌బిఐ వద్ద విదేశీ మారకం నిల్వలు భారీగా క్షీణించనున్నాయి. మన దిగుమతుల్లో చమురు, బంగారం, రక్షణ సామాగ్రి అత్యధిక భాగం ఆక్రమిస్తుంది. అందువలన భారతదేశం బంగారం నిల్వలను పెంచుకుంటోంది. నవంబర్‌లో ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) ఎనిమిది టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2024 సంవత్సరం నుంచి రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలను పెంచడం కొనసాగిస్తోంది. మొత్తం మీద జనవరి 2024 నుండి నవంబర్ 2024 వరకు ఆర్‌బిఐ 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ విధంగా బంగారం కొనుగోళ్లలో ఆర్‌బిఐ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. దీంతో విదేశీ రుణాలు, వాణిజ్య చెల్లింపులకు కటకట ఏర్పాడనుంది.
పెరుగుతున్న అసమానతలు :
నరేంద్ర మోడీ పాలనలో సంఘటిత రంగంలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 2014-2024 మధ్యకాలంలో… అంటే తొలి పది సంవత్సరాల మోడీ హయాంలో సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులని కాంట్రాక్ట్ బతుకులయ్యాయి. ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. వేతనాలు పెరగడం మాట అటుంచి తగ్గిపోయాయి. 2014లో దేశ జనాభాలో అత్యంత సంపన్నులైన పది శాతం మంది చేతిలో 56.1 శాతం సంపద ఉంటే 2022లో అది 57.7 శాతానికి పెరిగింది. అదే కాలంలో వారి ఆదాయం వాటా 62.6 శాతం నుంచి 65 శాతానికి పెరిగింది. మోడీ హయాంలో మిగిలిన జనాభాలో ఆదాయం, సంపద…ఈ రెండిరటి వాటా పడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని బిలియనీర్లు, మల్టీ బిలియనీర్ల చేతిలోనే దేశ సంపద, ఆదాయం పోగుపడిరది. 2014 నుంచి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల పరిస్థితి దారుణంగా ఉంది. అది ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపింది. వ్యవస్థీకృత ఉత్పత్తి రంగంలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతోంది. 2013లో 104.4 లక్షలుగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య 2023 నాటికి 136.1 లక్షలకు చేరింది. అయినప్పటికీ వారి ఉపాధి పరిస్థితులలో ఎలాంటి మెరుగుదల కన్పించడం లేదు. ఉత్పత్తి రంగంలో 2013లో కాంట్రాక్ట్ కార్మికుల వాటా 6.6 శాతం ఉంటే 2013 నాటికి 33.6 శాతానికి 2022 నాటికి 40.2 శాతానికి పెరిగింది.
పెరుగుత్ను నిరుద్యోగం :
మోడీ హయాంలో ఉపాధి రేటు 42.8 శాతం నుండి 37.4 శాతానికి పడిపోయింది. యువతలో నిరుద్యోగ రేటు 2016-17లో 29 శాతం ఉంటే 2022-23లో 45.4 శాతం ఉంది. మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయాయి. యూపిఎ-2 పాలనలో 2013లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సిపిఎస్‌తీ) 17.3 లక్షలు, 2014లో 16.9 లక్షల మంది పనిచేస్తే మోడీ పాలనలో ఆ సంఖ్య 2019లో 15.1 లక్షలు, 2020లో 14.7 లక్షలు, 2021లో 13.7 లక్షలకు పడిపోయింది. 2022లో 14.6 లక్షలకు పెరిగినా ఇప్పటికీ కోవిడ్‌కు ముందున్న స్థాయి కంటే తక్కువగానే ఉంది. అదే సమయంలో సిపిఎస్‌ఇలలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతోంది. 2013లో 16.8 శాతం, 2014లో 18.3 శాతంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు 2020, 2021, 2022లో వరుసగా 34 శాతం, 35 శాతం, 35.6 శాతానికి పెరిగారు. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య తొమ్మిదేండ్లలో రెట్టింపు అయింది. సిపిఎస్‌ఇలలో దినసరి వేతన కార్మికుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ ధోరణి కార్మికుల కొనుగోలు శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
దేశం విడిపోతున్న ఎఫ్‌డిఐలు :
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక తగ్గిపోతోంది. అదే సమయంలో విదేశీ సంస్థలు తమ వద్ద ఉన్న నిధులను స్వదేశాలకు తరలించడం, పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పెరుగుతోంది. దేశీయ కంపెనీలు సైతం ఎక్కువగా విదేశాల్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ భారతీయ కంపెనీలు విదేశాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయని ఆర్‌బిఐ గణాంకాలు చెబుతున్నాయి. ‘ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అమెరికా ఎన్నికల ఫలితాల కారణంగా పెట్టుబడిదారుల వైఖరిలో మార్పు వచ్చింది. ఫలితంగా దేశంలోని సొమ్ము డాలర్ల రూపంలో ఆస్తులుగా మారిపోతోంది’ అని న్యూఢల్లీిలోని గ్రాంట్ థ్రాన్‌టన్ భారత్ సంస్థ భాగస్వామి రిషి షా తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎప్‌పిఐలు…. ఒక దేశానికి చెందిన పెట్టుబడిదారు మరో దేశంలో స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే అతనిని ఎఫ్‌పిఐ అంటారు) గత సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో భారతీయ మార్కెట్ల నుండి రూ.2.5 లక్షల కోట్లను తరలించారు. పులి మీద పుట్రలా భారతీయ కంపెనీలు కూడా పక్క చూపులు చూస్తున్నాయి. 2011-12 ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో భారతీయ కంపెనీలు విదేశాల్లో 6.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదేకాలంలో 12.4 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయి. 2011-12 తర్వాత ఈ స్థాయిలో భారతీయ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య దేశీయ కంపెనీలు విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు ఎనిమిది బిలియన్ డాలర్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే కాలంలో అవి ఏకంగా 55 శాతం పెరిగాయి.
ఆగని రూపాయి పతనం :
ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే ఆందోళనల మధ్య బలమైన అమెరికా డాలర్, బలహీమైన మూలధన ప్రవాహం కారణంగా జనవరి 14న రూపాయి విలువ గతంలో ఎన్నడూలేని కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 86.56కి పడిపోయింది. సంపన్న భారతీయులు ప్రతి సంవత్సరం బంగారం దిగుమతులు కూడా దేశీయ కరెన్సీ విలువ తగ్గేందుకు మరో ప్రధాన కారణం. 2022-23లో భారతీయులు 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, 5.29 బిలియన్ డాలర్ల వెండి దిగుమతి చేసుకున్నారు. ఇదే కాలంలో దేశీయ వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ వాణిజ్య లోటు పెరుగుదలకు దేశీయ కరెన్సీ విలువ మరింత తగ్గేందుకు దోహదపడిరది. 2022-23లో, దేశీయ వ్యవసాయ ఎగుమతులు విలువ 53.2 బిలియన్ డాలర్లు. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు గత సంవత్సరం రికార్డు స్థాయిలో డాలర్లను స్వదేశానికి పంపారు. ప్రపంచ బ్యాంక్ మైగ్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక ప్రకారం దేశీయ రెమిటెన్స్ 2022లో రికార్డు స్థాయిలో 111 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది. భారత్ 2023లో కేవలం 0.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. నిరంతరం రూపాయి క్షీణతకు దోహదపడే అంశాలు చాలానే ఉన్నాయి. దేశీయ ధనికులు విదేశీ మారకద్రవ్యాన్ని విపరీతంగా ఖర్చు చేయడం, ద్రవ్యోల్బణం, వడ్డీరేటు పెరుగుదల, అంతర్జాతీయ వాణిజ్యలోటు, చెల్లింపులు, విదేశీ రుణాలు, ఆర్థిక లోటు, ప్రభుత్వ రుణాలు విదేశీ మారకపు రేట్లు దేశీయ కరెన్సీ విలువ తగ్గుదలకు ప్రధాన కారణం.
పెరుగుతున్న ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి విదేశీ మారక ద్రవ్యం అవసరం ఉంటుంది. విదేశీ కరెన్సీ అవసరం కూడా దేశీయ కరెన్సీ మారకపు రేటును తగ్గిస్తుంది. అయితే రూపాయి విలువను కాపాడేందుకు ప్రభుత్వం ఏ మాత్రం చొరవ తీసుకోవడంలేదనేది స్పష్టం. కస్టోడియల్ క్లయింట్ల తరపున పనిచేస్తున్న విదేశీ బ్యాంకుల నుండి డాలర్ డిమాండ్ పెరగటం కారణంగా రూపాయి క్షీణత మరింత తీవ్రమైంది. బెంచ్‌మార్క్ బిఎస్‌ఇ సెన్సెక్స్, నిప్టీ 50 సూచీలు ఒక్కొక్కటి 1.6 శాతం నష్టపోవటం ద్వారా కరెన్సీ కష్టాలకు ఈక్విటీ మార్కెట్లు అద్దం పట్టాయి. స్టాక్ డిపాజిటరీ డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఈ నెలలో ఇప్పటివరకు నికర ప్రాతిపదికన 1.1 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ స్టాక్‌లు, బాండ్లను అమ్మివేశారు. రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకున్నా రూపాయి పతనం ఆగడం లేదు.
ముగింపు :
ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతిరోజూ చెడు వార్తలే వినాల్సి వస్తున్నది. నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టానికి, ద్రవ్యోల్బణం 15 సంవత్సరాల గరిష్టానికి పెరిగినందున ప్రజలు అప్పుల పాలయినారు. పెరుగుతున్న అప్పులు తరుగుతున్న ఉపాధి వల్ల ప్రజల జీవన పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో అగ్రశ్రేణి 1 శాతం మంది వద్ద 40 శాతం సంపద ఉండగా దిగువ 50 శాతం మంది దగ్గర 3 శాతం సంపద మాత్రమే ఉంది. ద్రవ్య పెట్టుబడి చోదిత ఆర్థిక విధానాల సామాజికార్థిక సంక్షోబాలకు దారీ తీస్తున్నాయి. నేటి సంక్షోభం ద్రవ్య పెట్టుబడి విధానాల వైఫల్యాన్ని చూపడమే కాదు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల తక్షణావశ్యకతను కూడ తెలియజెబుతున్నది. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ల ప్రయోజనాలనే కాపాడుతుంది. ప్రజల కనీస జీవన అవసరాలను కూడ సమకూర్చలేకపోతున్నది. అదానీ, అంబానీ వంటి కొద్దిమంది కార్పొరేట్లకు మేలు చేసే ఆర్థిక విధానాలే ఈ ఆర్థిక మందగమనానికి ప్రధాన కారణం.
విశేషమేమిటంటే ఆర్థిక మాంద్యం వచ్చినా కార్పొరేట్ల సంపద పెరుగతూనే ఉంది. సంక్షోభ భారాలన్నీ ప్రజల మీదనే పడుతున్నాయి. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు అమలులో ఉన్నంత కాలం పరిస్థితిని చక్కదిద్దడం సాధ్యం కాదు. ఎందువల్లనంటే సమాజంలో ప్రతి విషయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆదాయాన్ని సంపాదించే మార్గాలు ఉన్నప్పుడే, డబ్బు ఉంటుంది. ప్రజల చేతిలో డబ్బుంటేనే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఉద్యోగ లేదా స్వయం ఉపాధి కల్పనే ఆదాయాలను పెంచడానికి సులువైన మార్గం. సూక్ష్మంగా చెప్పాలంటే, ఆర్థిక అసమానతలను తగ్గించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా నిర్ణయాలు ఉండాలి. గత పదేళ్లుగా అనుసరిస్తున్న విధానాలను కొనసాగిస్తే మాత్రం, లక్ష్యాలను సాధించే మాట ఎలా ఉన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ధనిక, పేద అంతరం పెరుగుతుంది. అంతర్యుద్ధాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది.