మే 27న, మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు మృతదేహం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో పోలీసు వలయం చుట్టుముట్టిన ఆదివాసీల శ్మశానవాటికలో దహనం అవుతుంటే, అతని తమ్ముడు నంబాళ్ళ రాంప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్ వెలుపల తీవ్ర ఆగ్రహంతో నిలబడివున్నాడు.
“మరణించిన తర్వాత, మృతుడి మృతదేహం కుటుంబానికి చెందుతుంది” అని ఆయన అన్నారు. “ఛత్తీస్‌గఢ్ పోలీసులు చేసింది చాలా తప్పు; ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదు.”
నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) అగ్ర నాయకుడు బసవరాజుగా ప్రసిద్ధి చెందిన 72 ఏళ్ల కేశవరావును, మరో 26 మందిని భద్రతా చర్యలో రాష్ట్ర పోలీసులు చంపారనే వార్తలు వచ్చిన ఒక రోజు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో నివసించే రాంప్రసాద్ మే 22న ఛత్తీస్‌గఢ్‌కు వెళ్ళారు.
పోస్ట్‌మార్టం చేసిన తర్వాత హత్యకు గురైన వారి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలని ఆదేశిస్తూ రాంప్రసాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు.
అయినప్పటికీ రావు మృతదేహాన్ని అతని తమ్ముడికి అప్పగించడానికి బదులుగా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు అతనిని, మరో ఏడుగురిని దహనం చేసారు; మరణించిన వారికి “స్పష్టమైన, చట్టపరమైన హక్కుదారులు” లేరని ప్రకటించారు.
మంగళవారం దహన సంస్కారాల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో, రావు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని కోమట్‌పల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు క్యాడర్ కోసి అలియాస్ ఉంగి తప్ప దహనం చేసిన మిగిలిన వారి పేర్లు చెప్పకపోవడంతో బంధువులు చాలా ఆందోళనపడ్డారు.
మృతదేహాలను తీసుకెళ్లడానికి డీప్ ఫ్రీజ్ కంటైనర్లు ఉన్న మూడు అంబులెన్స్‌లను వెంట తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐదుగురు మరణించిన మావోయిస్టుల బంధువులు మే 22 నుండి నారాయణపూర్ జిల్లాలో ఎదురు చూస్తున్నారు. “ఎవరి మృతదేహాలను దహనం చేశారో మాకు తెలియదు, ఎందుకంటే మృతదేహాలను మాకు చూపించలేదు – కనీసం ఆఖరి చూపు కూడా దక్కలేదులేదు” అని తెలంగాణలోని హన్మకొండ జిల్లాకు చెందిన మరో సీనియర్ మావోయిస్టు నాయకుడు రాకేష్ అలియాస్ వివేక్ మామ దారా సారయ్య అన్నారు.
అధికారికంగా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు తమ ప్రకటన ద్వారా దహనం చేసిన ఎనిమిది మృతదేహాలలో ఏడింటికి “చట్టపరమైన హక్కుదారులు ఎవరూ లేరు” అని పేర్కొన్నారు. కానీ, కొన్ని మీడియా నివేదికల ప్రకారం, మావోయిస్టుల అంత్యక్రియలను “వారి ప్రచారాన్ని కీర్తించడానికి” ఉపయోగించే బహిరంగ కార్యక్రమాలుగా మార్చవచ్చని సీనియర్ అధికారులు భయపడ్డారు; అందువల్ల అలాంటి అవకాశాలను నివారించడానికి చర్యలు తీసుకున్నారు.
తన తన అన్న చితాభస్మాన్ని అయినా తనకు ఇవ్వాలని అభ్యర్థించడానికి నంబాళ్ళ రాంప్రసాద్ మరుసటి రోజు ఉదయం నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ “మరణించిన వ్యక్తితో తమకు గల సంబంధాన్ని చూపించడానికి చట్టపరమైన పత్రాలను ఇవ్వలేకపోయామని; శరీరం కుళ్ళిపోయి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి నారాయణపూర్‌లో మృతదేహాన్ని దహనం చేయడానికి పోలీసులు, పరిపాలనా యంత్రాంగానికి అనుమతినిస్తున్నాం” అని రాసి ఉన్న ఒక ప్రకటనపై సంతకం చేయమన్నారు.
రాంప్రసాద్ ప్రకటనపై ఆ సంతకం చేయడానికి నిరాకరించి ఖాళీ అంబులెన్స్‌తో శ్రీకాకుళంకు బయలుదేరారు.
కోర్టుకు వెళ్ళారు
మే 21న, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో జరిగిన భద్రతా సైనికచర్యలో తన అన్న మరణించాడనే వార్త విన్న వెంటనే, 61 ఏళ్ల నంబాళ్ళ రాంప్రసాద్ శ్రీకాకుళం జిల్లాలోని స్థానిక కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అతని అన్న మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్ళమని చెప్పారు.
మర్నాడు, బస్తర్ ప్రాంత ప్రాంతీయ ప్రధాన కార్యాలయం అయిన జగదల్‌పూర్ చేరుకున్నప్పుడు, శ్రీకాకుళం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనలను ఉటంకిస్తూ మృతదేహాన్ని తిరిగి జిల్లాకు తీసుకురావద్దని తనకు చెప్పారని రావు చెప్పారు. వాహనం డ్రైవర్‌తో సహా రావుతో పాటు ప్రయాణిస్తున్న మరో నలుగురు వ్యక్తులను వారి స్థానిక గ్రామ కౌన్సిలర్ల ద్వారా బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు.
ఇబ్బంది పెట్టవచ్చు అని అనుకున్న రాంప్రసాద్ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చాడు. అతని అన్నయ్య నంబాళ్ళ ఢిల్లేశ్వరరావు అమరావతిలోని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడి మృతదేహాన్ని, ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మావోయిస్టు క్యాడర్ సజ్జా వెంకట నాగేశ్వరరావు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆ పిటీషన్‌లో ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్, ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్ ఈ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మృతదేహాలు ఛత్తీస్‌గఢ్‌లోని అధికారుల కస్టడీలో ఉన్నందున పిటిషనర్లు ఆ రాష్ట్రంలోని హైకోర్టును ఆశ్రయించాలని వాదించారు.
ఈ విషయంలో బలగాలకు ఎటువంటి పాత్ర లేదనీ “అంతిమ కర్మలు నిర్వహించే ముసుగులో” తలెత్తే శాంతిభద్రతల పరిస్థితిని నివారించడమే మృతదేహాలను అప్పగించకపోవడానికి కారణమనీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తరపున హాజరైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదించారు.
అయినప్పటికీ, పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత “మృతుదేహాలను మృతుల బంధువులకు అప్పగిస్తాము” అని ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు.
“మృతదేహాల పోస్టుమార్టం ఈరోజు పూర్తవుతుందని, ఆ తరువాతి ప్రక్రియ అంతిమ
సంస్కారాలు నిర్వహించడానికి మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించడం” అనే వాదనలను నమోదు చేస్తూ మే 24న హైకోర్టు రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది.
నంబాళ్ళ కేశవరావు, సజ్జా వెంకట నాగేశ్వరరావు కాకుండా మరణించిన మరో మావోయిస్టు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కర్నూలు జిల్లాకు చెందిన 35 ఏళ్ల సంగీత సాయిపోగు. మరణించిన మరో ఇద్దరు మావోయిస్టులు తెలంగాణకు చెందినవారు – రంగారెడ్డి జిల్లాకు చెందిన 35 ఏళ్ల భూమిక అలియాస్; హన్మకొండ జిల్లాకు చెందిన 30 ఏళ్ల రాకేష్ అలియాస్ నవీన్.
దీర్ఘకాల నిరీక్షణ:
ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న మృతదేహాలను చేరుకోవడానికి బంధువులు నానా తిప్పలు పడ్డారు.
“మమ్మల్ని ఆసుపత్రి, పోలీసు స్టేషన్ల మధ్య తిప్పారు; పత్రాలు, కుటుంబ ఫోటోలను చూపించమని అడిగారు” అని దారా సారయ్య అన్నారు. తన మేనల్లుడు రాకేష్ 2016లో ఉద్యమంలో చేరడానికి ఇల్లు వదిలి వెళ్ళాడని, “కాబట్టి మా దగ్గర కుటుంబ ఛాయాచిత్రం లేదు” అని ఆయన అన్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్ ఆమోదించిన అధికార లేఖలను చూపిస్తూ రాంప్రసాద్ ఇలా అన్నాడు: “మేము మరణించిన వ్యక్తి రక్త సంబంధీకులమని నిరూపించడానికి అవసరమైన, స్థానిక అధికారుల నుండి తీసుకువచ్చిన అన్ని పత్రాలు మా దగ్గర ఉన్నాయి. … గత 45 సంవత్సరాలుగా నేను నా అన్నని కలవలేదు. కుటుంబ ఫోటో ఎలా ఉంటుంది?”
ఐదు రోజులుగా, కుటుంబాలు వేచి ఉన్నాయి కానీ మృతదేహాలను వారికి ఎందుకు అప్పగించడం లేదో వివరించడానికి ఏ సీనియర్ పోలీసు అధికారీ ముందుకు రాలేదు. కాణీ తమ గుర్తింపుగా ఆధార్ కార్డును చూపించిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరణించిన మావోయిస్టు కార్యకర్తలలో చాలా మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు; బీజాపూర్‌కు చెందిన కోసి అలియాస్ ఉంగి మృతదేహం కుళ్ళిపోవడం వల్ల నారాయణపూర్‌లో దహనం చేయాలని అతని కుటుంబానికి పోలీసులు చెప్పారు.
“వారు అలా అన్నారు, కానీ వారు మాకు మృతదేహాన్ని చూపించలేదు” అని ఉంగి బంధువైన ఒక యువకుడు అన్నారు. నారాయణపూర్‌లో మృతదేహాన్ని దహనం చేయడానికి కుటుంబం అంగీకరిస్తుందా అని అడిగినప్పుడు, బంధువు, “ఇప్పుడు మేం ఏమి చెప్పగలం?” (అబ్ హమ్ క్యా బోల్ సక్తే హైన్) అని అన్నాడు.
హడావుడిగా దహన సంస్కారం:
చనిపోయిన మావోయిస్టుల బంధువులు నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద మే 26 ఉదయం గుమిగూడారు; కానీ ఆయన వారిని కలవలేదు. మధ్యాహ్నం సమయంలో నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళమన్నారు. వారు అంబులెన్స్‌లతో పాటు అక్కడికి చేరుకున్నారు; జర్నలిస్టులు కూడా వెంటవెళ్ళారు; కానీ వారిని ఎదురుచూడమన్నారు అంతే.
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో, భారీ వర్షం కురుస్తున్నప్పుడు మృతదేహాలను ఆదివాసీ శ్మశానవాటికకు తీసుకెళ్తున్నారనే వార్త తెలిసిన కాస్సేపటికే శ్మశాన వాటిక వైపు వాహనాలు దూసుకుపోయాయి. దుర్వాసన వస్తున్న కారణంగా మృతదేహాలను ఉన్నాయనుకున్న మూసేసి ఉన్న పోలీసు వ్యాన్ లాంటి ఒక పెద్ద వాహనం లోపలికి వెళ్లింది; దాని వెనుక పెట్రోల్ డబ్బాలు, కట్టెల దుంగలతో నిండిన రెండు ట్రాక్టర్లు వెళ్ళాయి. చెత్త డంప్‌యార్డ్ దాటి, పోలీసు సిబ్బందితో భారీగా కాపలా ఉన్న ఆదివాసీ శ్మశానవాటిక దగ్గరకు చేరుకున్నారు. కొంతమంది జర్నలిస్టులను తప్ప మరెవరినీ ఆ ప్రాంతానికి దగ్గరగా అనుమతించలేదు.
సాయంత్రం 5 గంటల నాటికి, శ్మశానవాటికలో అనేక చోట్ల మంటలు చెలరేగడం కనిపించింది.
సంఘటనా స్థలంలో ఉన్న వారిలో ఆదివాసీ జర్నలిస్ట్ బిందేష్ పాత్ర్ కూడా ఉన్నారు. పోలీసులు ఆదివాసీ సమాజం శ్మశాన వాటికలోకి చొరబడి దహన సంస్కారాలు చేయడానికి ఉపయోగించడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
“ఇది మన ఆదివాసీ సంస్కృతికి అవమానం,” అని ఆయన బాధతో అన్నారు. కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లను సంప్రదించడానికి ప్రయత్నించారు, కానీ అది ఫలించలేదు. నారాయణపూర్ ఠాణా స్టేషన్ హెడ్ ఆఫీసర్ అతన్ని లోపలికి అనుమతించడానికి నిరాకరించారు.
ఆదేశాల ఉల్లంఘన:
ప్రధాన నగరం నుండి 2 కి.మీ దూరంలో జరిగిన దహన సంస్కారాలలో పాల్గొనడానికి నిరాకరించి, మరణించిన మావోయిస్టుల బంధువులు స్థానిక మీడియాను ఉద్దేశించి మాట్లాడటానికి నారాయణపూర్ పోలీస్ స్టేషన్ వెలుపల నిలబడ్డారు.
“మమ్మల్ని మధ్యాహ్నమంతా బందీలుగా ఉంచారు; మృతదేహాలను దహనం చేయడానికి అంగీకరించమని మమ్మల్ని అడిగారు, కానీ అన్నీ కుటుంబాల వాళ్ళమూ నిరాకరించాం” అని నంబాళ్ళ రాంప్రసాద్ అన్నారు. ఉదయం 11 గంటల నుండి పోలీస్ స్టేషన్ లోపల ఉన్న కుటుంబ సభ్యులు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు.
“పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా, మానవ మృతదేహాన్ని మానవ గౌరవంతో భద్రపరచి అంతిమ సంస్కారం చేయాలని రాజ్యాన్ని నిర్దేశించే జాతీయ, అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించడం అవుతుంది” అని మృతదేహాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో కుటుంబాలకు సహాయం చేస్తున్న న్యాయవాది, కార్యకర్త బేలా భాటియా అన్నారు.
దహన సంస్కారాలు జరగడానికి కొన్ని గంటల ముందు, నంబాళ్ళ రాంప్రసాద్ తన న్యాయవాది ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బస్తర్ ప్రాంత పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సహా ఛత్తీస్‌గఢ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. “బహుశా కోర్టు మృతదేహాలను అప్పగించమని బలవంతం చేస్తుందని భయపడి, పోలీసులు మృతదేహాలను దహనం చేయడం ద్వారా న్యాయాన్ని మరింత అపహాస్యం చేశారు; ఇది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని, పోలీసులను మరింత దిగజార్చింది” అని రాంప్రసాద్ తరపున వాదించిన న్యాయవాది చిలకా చంద్రశేఖర్ అన్నారు.
“ఈరోజు పోలీసులు చేసింది చాలా అవమానకరం, కానీ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తుందని న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది” ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరే ముందు రాంప్రసాద్ అన్నారు.
29 మే 2025
తెలుగు: పద్మ కొండిపర్తి