బికె -16 కేసులో కటకటాల వెనుక ఉన్న కార్యకర్త రోనా విల్సన్ క్రియాశీలత ఫాసిస్టు రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకొంది. కేరళలోని కొల్లంలో పెరిగి, 1990 ల ప్రారంభంలో న్యూఢిల్లీకి వెళ్ళిన రోనా తన అరెస్టు వరకు తన జీవితాన్ని అక్కడే గడిపాడు. దక్షిణ ఢిల్లీలోని మునీర్కా గ్రామంలో అద్దెకు తీసుకున్న ఒక గదిలో పూనే, ఢిల్లీ పోలీసుల సంయుక్త చర్యలో రోనాను అరెస్టు చేశారు. జంతుశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పొందిన తరువాత, రోనా తాను కృషి చేయాల్సింది ఆ రంగం కాదని గ్రహించి, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌లో తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేయడానికి జేఎన్‌యులో అడుగుపెట్టాడు. అక్కడ అతను డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (డిఎస్‌యు) లో సభ్యుడుగా వున్నాడు.
విద్యా సంబంధిత కృషి – క్రియాశీలత
భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థ, ముస్లింల అణచివేత, రాజకీయ ఖైదీలను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాద నిరోధక చట్టాలను ఉపయోగించడం వంటి అనేక అంశాలపై రోనా గణనీయమైన రచనలు చేశాడు. తన రచనలలో అణచివేతకు గురయ్యే వర్గాల పోరాటాలు, హక్కుల కోసం వాదించడం మొదలైనవాటి ద్వారా ప్రజల సమస్యలపై కేంద్రీకరించిన విధానంలో అతని కృషి ప్రాముఖ్యత ఉంది.
తన అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి అయిన “మాన్యుఫ్యాక్చరింగ్ ఇంపీరియలిజం: ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఎస్ఇజెడ్”లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మద్దతుతో పారిశ్రామికీకరణ ద్వారా అభివృద్ధి చెందాలనే ఆలోచన ప్రాతిపదికను ప్రశ్నించాడు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల ఆదేశాల ద్వారా సామ్రాజ్యవాద పెట్టుబడి ఆక్రమణ తరువాత, భారతదేశంలోకి స్వాగతించిన లిబరలైజేషన్-ప్రైవేటీకరణ-గ్లోబలైజేషన్ (ఎల్పిజి) నమూనా ద్వారా జరిగిన విధాన మార్పుపై తీవ్ర విమర్శలు చేసాడు.
ఈ నమూనా ప్రజల వ్యతిరేక ప్రభావాల సంబంధిత అంశాలను విస్మరించే విధంగా తనను తాను నిలబెట్టుకోవడం ద్వారా అభివృద్ధి సమస్యనే అస్పష్టం చేస్తుంది. అభివృద్ధిలో నిర్వాసిత్వం అనివార్యం అనేది ఈ నమూనా ఆధారాంశం. ఆదివాసీల, రైతాంగ, కార్మికుల క్రూరమైన నిర్వాసిత్వం, విధ్వంసం, పేదరికం, మరణం, అత్యాచారాలని సమర్థించే భ్రష్టుపట్టిన “అభివృద్ధి” నమూనా పట్ల ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉపయోగించే ఒక వాదన ఈ నమూనా.
విదేశీ శక్తుల కోసం వనరులను వెలికితీసే ప్రయత్నంలో, పేద ప్రజల రూపంలో చవక శ్రామిక శక్తిని అందించడానికి ఈ అభివృద్ధి క్రూరమైన రాజ్య అణచివేత, భూ స్వాధీనం, పర్యావరణాల విధ్వంసంపై ఆధారపడింది. “ప్రజలపై ఏ రూపంలోనూ హింస, నిర్వాసిత్వం లేకుండా అభివృద్ధి సాధ్యమేనా? ” అనే ఒక సాధారణ ప్రశ్న చుట్టూ ఆయన పరిశోధన కేంద్రీకృతమైంది. భారతదేశ అర్ధ – వలస, అర్ధ- భూస్వామ్య పరిస్థితులలో స్వతంత్ర పెట్టుబడి అభివృద్ధి జరగలేదు అనేది రోనా వివరణ వెనుక ఉన్న ప్రాథమిక వాదన. పెట్టుబడి అభివృద్ధి లేకపోవడం వల్ల, అభివృద్ధి చెందిన పరిశ్రమలు వ్యవసాయం నుండి నిర్వాసితులైన కార్మికులను తమలో చేర్చుకోలేకపోయాయి అని అంటాడు.
పెట్టుబడి విస్తరణా స్వభావం అంటే మరింత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు (ఉదాహరణకు గ్రీన్ రివల్యూషన్ సమయంలో యుఎస్ వంటివి) తమ పెట్టుబడిని బడా బూర్జువా-భూస్వామ్య-బ్యూరోక్రసీ కుమ్మక్కు ద్వారా భారతదేశం వంటి అణచివేతకు గురైన దేశాలకు ఎగుమతి చేశాయి. ఇవి సామ్రాజ్యవాద మూలధనానికి ఏజెంట్లుగా పనిచేస్తాయి, తద్వారా భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలు ప్రస్తుత “స్వతంత్ర భారతదేశం” పై ఆధిపత్యం కొనసాగేలా నిర్ధారిస్తాయి. భూస్వామ్య సంబంధాల ఆధిపత్యం స్వతంత్ర పెట్టుబడిదారీ అభివృద్ధిని అడ్డుకుంటుంది, తద్వారా భారతదేశాన్ని విదేశీ సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల దిగుమతులపై ఆధారపడేలా చేస్తుంది. అంటే భారతదేశ ప్రయోజనాలు సామ్రాజ్యవాదానికి అనుగుణంగానే ఉంటాయి. భారతీయ దళారీ నిరంకుశ బూర్జువా ద్వారా దాడి చేసి, భారతదేశం నుండి మిగులును వెలికితీసేందుకు ప్రజావ్యతిరేక అభివృద్ధి నమూనాలను ప్రారంభిస్తుంది.
రోనా ఈ నమూనాను విమర్శించడంతో ఆగకుండా అందుకు ఒక పరిష్కారాన్ని కూడా చెప్తాడు. ఈ పరాన్నజీవి వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయం గురించి రాసాడు. ఇది “ప్రస్తుత స్థితి ప్రతిరూపం, ఇక్కడ డబ్బు రుణదాత-వ్యాపారి-భూస్వామ్య బంధం రాజకీయాధికారాన్ని కలిగి ఉంటుంది, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన మిగులు ప్రయోజనాలను సామ్రాజ్యవాదంతో పంచుకుంటుంది”. ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి నమూనా, “భూమి పునఃపంపిణీ, శ్రామికుల ప్రయోజనాల కోసం రాజకీయాధికారంలో తీవ్రమైన మార్పుతో ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు వైపు వెళ్తుంది. ఈ నమూనా సామూహిక భాగస్వామ్యాన్ని, సామూహిక అవసరాలను ప్రేరేపించే కారకాన్ని రూపొందిస్తుంది; పరిశ్రమలకు దిశను ఇస్తుంది, తత్ఫలితంగా ప్రజల రోజువారీ జీవితానికి ఉపయోగపడే వస్తువుల ఉత్పత్తి, గౌరవప్రదమైన అర్ధవంతమైన జీవితం గడపగలరు. ఇందుకోసం ఆర్థిక వ్యవస్థ వనరుల ఆధారం, స్థానిక సాంకేతికతలకు సంబంధించిన పెట్టుబడి ఎంపిక అవసరమయ్యేట్లుగా చేస్తుంది.
సామ్రాజ్యవాదం చొరబడినచోట, విదేశీ ఆర్థిక పెట్టుబడి ప్రయోజనాలను కాపాడటానికి ఫాసిజం పెరుగుతుంది. అందువల్లనే భారతదేశంలో సామ్రాజ్యవాద దోపిడీకి బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు పాలక వర్గ భావజాలం మద్దతు ఇస్తుంది. భారతదేశంలో ఫాసిజం స్వభావం గురించి, అదే సమయంలో రాజకీయ ఖైదీల హక్కుల కోసం, అణచివేతకు గురవుతున్న ప్రజాలపై జరుగుతున్న దాడులకి వ్యతిరేకంగా రోనా రాశాడు. తాను కార్యకర్తగా పని చేసిన ఉద్యమాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసిన రోనా, “ముస్లిం అన్యత్వం”పై తీవ్ర విమర్శలు చేశారు.
తన పీహెచ్‌డి పరిశోధనా వ్యాసంలో, “దేశం” (హిందూ రాష్ట్ర) శత్రువులుగా భావించే ముస్లింలపై హింసాత్మక చర్యల తీవ్రత గురించి రాస్తూ హిందూత్వ రాజకీయాలను ఏకీకృతం చేయడానికి ఇస్లామోఫోబియాను భారతదేశంలో పాలకవర్గం ఒక భావజాలంగా ఎలా ఉపయోగించిందనే విషయాన్ని నొక్కి చెప్పారు. ముస్లింలపై జాతివివక్ష, అక్రమ నిర్బంధం, ముస్లిం సంస్థలను నిషేధించడం, ముస్లింలను ఒక మూలకు నెట్టేయడం (ghettoization- సమాజంలోని ఒక నిర్దిష్ట సమూహాన్ని సమాజంలోని ఇతర సెక్షన్ల నుండి భిన్నంగా ఉన్నట్లుగా, వారి కార్యకలాపాలు, ఆసక్తులు ఇతర వ్యక్తులకు ముఖ్యమైనవి కాదని భావించడం): మొదలైన వాటి ద్వారా ముస్లింలపై జరుగుతున్న దాడుల స్వభావాన్ని ఎత్తి చూపాడు.
రాజ్య యంత్రాంగం ముస్లిం పురుషులను “ఉగ్రవాద ముస్లిం మగతనం” మద్దతు యిచ్చే ఒక మిలిటెంట్ ముస్లిం వ్యక్తి చట్టపరమైన కల్పన”సామాజిక-సాంస్కృతిక జాతీయ దృష్టికి ఒక వస్తువుగా చేస్తుంది; దీనిలో విషయం అతని శరీరంలో ఎల్లప్పుడూ ఒక ఉగ్రవాదిని ఆశిస్తుంది” అని రోనా ఈ థీసిస్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ ‘ముస్లిం అన్యత్వం’ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాపించింది (రాజ్య యంత్రాంగ సైద్ధాంతిక సాధనం) ముస్లింలను యితర పౌరులనుంచి “ఇతరులు” గా దూరం చేయడానికి, అదే సమయంలో ఈ ముస్లిం మహిళలను రక్షణ అవసరమయ్యే “చెప్పినట్లు వినే శరీరాలు” గా చిత్రీకరించడానికి ఈ వివరణను ఉపయోగించాయి. (ఇస్లామిక్ పురుషుల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా).
5 ఏళ్ల అక్రమ నిర్బంధం కూడా రోనా విప్లవ స్ఫూర్తిని అణచివేయలేకపోయింది. తన జైలు సెల్ నుంచే ‘నూతన భారతదేశం’పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టాడు. “నవ భారత్”ను ప్రధాన మంత్రి ‘అమృత కాల్’ గా అభివర్ణించాడు. బిల్‌కిస్ బానో పై అత్యాచారం చేసిన వాళ్ళని విడుదల చేసిన నేపథ్యంలో “బ్రాహ్మణులు, బ్రాహ్మణులకు మంచి సంస్కారం (సంస్కృతి) ఉంటుందని, జైలులో వారి ప్రవర్తన బాగుందని”” బిజెపి శాసనసభ్యుడు సి.కె. రౌల్జీ ఆ నిర్ణయాన్ని సమర్థించిన సందర్భంలో , ‘న్యూ ఇండియా’ అనే పదం ‘అపప్రయోగం’ అని అంటూ రోనా ప్రజాస్వామ్య ప్రహసనాన్ని ప్రశ్నించాడు. కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోడీ , భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించడంతో ప్రధాని అమెరికా పర్యటనపై నెలకొన్న ఆసక్తిని ఉటంకించాడు.
ఈ ఉత్సుకత తప్పు కాదు, ఎందుకంటే 2014 తర్వాత “నూతన భారతదేశంలో” లో ప్రజల ప్రాథమిక స్వేచ్ఛలపై దాడులు పెరుగుతున్నాయి. సామాన్య పౌరుల రోజువారీ జీవితంలో అతి తక్కువ ప్రాముఖ్యత కలిగిన విషయాలు – ఏమి తింటారు, త్రాగుతారు, ఎలాంటి దుస్తులు వేసుకుంటారు, ఎవరితో మాట్లాడుతారు, ఎవరితో తిరుగుతారు, ఎక్కడికి వెళతారు, ప్రార్థనలు ఎలా చేస్తారు, ఎక్కడ ఉంటారు, మీ రోజువారీ వస్తువులను ఎక్కడ కొంటారు లాంటివి – అకస్మాత్తుగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
భారత ప్రజాస్వామ్యం స్వభావాన్ని ప్రశ్నించడం రోనాకు కొత్తేమీ కాదు. రాజకీయ ఖైదీలకు సంబంధించి ఆయన చేస్తున్న ఉద్యమం భారతదేశంలో ఉగ్రవాద నిరోధక చట్టానికి వున్న ప్రజాస్వామ్యరాహిత్య స్వభావం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పిపి) లో రోనా ఒక వ్యవస్థాపక సభ్యుడు. 1990 ల ఆరంభంలో ఇద్దరూ ఢిల్లీలో రోనా, ఎస్.ఎ.ఆర్. గిలానీలు విద్యార్థులుగా ఉన్నప్పటి పరిచయంలో ఈ సంస్థకు బీజాలు పడ్డాయి.
“అప్పటి నుండి, . . . మానవ హక్కుల కోసం కలిసి పనిచేశాం… 2001లో నేను అరెస్టు అయినప్పుడు, నేను కోర్టులో ఎప్పుడూ చూసే వ్యక్తులలో రోనా ఒకరు. నేను కోర్టులోకి ప్రవేశించినప్పుడల్లా అతని నవ్వు ముఖం నన్ను శాంతపరిచేది” అని గిలానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ అనుభవం 2007 లో సిఆర్‌పిపి ఏర్పాటుకు దారితీసింది.
సమాజంలోని అణచివేతకు గురయ్యే సెక్షన్ల ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే సంస్థ సిఆర్‌పిపి. ఐక్యరాజ్యసమితి ఖైదీల కన్వెన్షన్ను అమలు చేయడం, న్యాయ విచారణలో ప్రయోజనం పొందలేని లేదా వివక్షకు గురైన ఖైదీలకు న్యాయ సహాయం అందించడం వంటివి సిఆర్‌పిపి లక్ష్యాలలో ఉన్నాయి. ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, జమ్మూకాశ్మీర్, మణిపూర్ వంటి అణచివేతకు గురైన జాతుల ప్రజలను కేవలం, వారి రాజకీయ సిద్ధాంతం కారణంగా రాజ్యం విచారణ జరిపే వ్యక్తుల స్వేచ్ఛను కోరుకుంటున్నాం అని ఆ సంస్థ అంటుంది.
సిఆర్‌పిపి ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది “రాజకీయ ఖైదీ” పరిధిని నిర్వచిస్తుంది. ఏ రూపంలోనైనా దోపిడీకి గురైన వర్గాల, అణచివేతకు గురైన కులాల/సమాజాల తరఫున రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన పోరాటాలలో పాల్గొన్నందుకు, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, నిర్దిష్ట రాజకీయ అభిప్రాయాలు లేదా సిద్ధాంతాల మార్గదర్శకత్వాన్ని కలిగివున్నందుకు, అరెస్టు చేసిన లేదా అదుపులోకి తీసుకున్న వ్యక్తులను, రాజ్యం వారిపై వేసిన ఆరోపణలతో సంబంధం లేకుండా, రాజకీయ ఖైదీలుగా పరిగణించాలి అని వివరిస్తుంది.
అయితే, రాజ్య ప్రాయోజిత సాయుధ గ్రూపుల సభ్యులను రాజకీయ ఖైదీలుగా పరిగణించదు. బీహార్ ప్రైవేటు సైన్యాలు, ఛత్తీస్‌గఢ్ సల్వాజుడుమ్, అస్సాం ఎస్‌యూఎల్‌ఎఫ్‌ఏ, జమ్ముకశ్మీర్, ఇతర రాష్ట్రాల్లోని గ్రూపులు మొదలైనవి రాజ్యం/పాలక పార్టీల పోషకత్వంలో పనిచేస్తుంటే వాటిని రాష్ట్ర ప్రాయోజిత సాయుధ గ్రూపులుగా పరిగణించాలి. అంతేకాకుండా, జాతి నిర్మూలన, అత్యాచారం, సామూహిక హత్యలలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తులు లేదా రాజ్యంతో కుమ్మక్కైన వ్యక్తులను కూడా రాజకీయ ఖైదీలుగా పరిగణించకూడదు.
యుఎపిఎ వంటి వివిధ కఠినమైన చట్టాలతో ముస్లింలను నిరంతరం లక్ష్యంగా చేసుకోడానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాలను నిర్వహించడంలో సిఆర్‌పిపిలో తన పని ద్వారా, రోనా విల్సన్ పాల్గొన్నాడు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్‌గురుతో పాటు అక్రమంగా అరెస్టు అయిన ఎస్ఏఆర్ గీలానీని విడుదల చేయాలన్న ప్రచారంలో అత్యంత చురుగ్గా పాల్గొన్న వారిలో ఒకడు. అదేవిధంగా, రాజకీయ కార్యకర్తలు లేదా భావజాలం కారణంగా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తుల కోసం ప్రచారం చేసాడు. మధ్య భారతదేశంలో భారత రాజ్యం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అరెస్టు అయిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా తదితరుల విడుదల కోసం ప్రచారం చేశాడు.
రోనా చేసిన ఒక శక్తిమంతమైన ప్రసంగంలో భారతదేశంలో క్రిమినల్ చట్టాలను చారిత్రాత్మకం చేశాడు. జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) లాంటి సంస్థలను ఏర్పాటు చేయకూడదని, భారత రాజ్యం తనను తాను నిలబెట్టుకోవడానికి అణచివేతను ఉపయోగించడం తప్పనిసరి” అని యన వాదించాడు. ఈ హెచ్చరిక నేటి కాలంలో న్యాయబద్ధతను పొందింది. దీనిలో తన అణచివేత, ప్రజల దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం చేసిన వారందరినీ నిశ్శబ్దం చేయడానికి ఎన్ఐఏ రాజ్య పెంపుడు కుక్క లాగా వుండడాన్ని మనం చూస్తున్నాము – కైమూర్ ముక్తి మోర్చా అణచివేత, న్యూస్ క్లిక్ పై దాడులు మొదలైనవి దీనికి ఉదాహరణలు.
“ఈ అమలు సంస్థల ద్వారా యుఎపిఎ, ఏఎఫ్‌ఎస్‌పిఏ, టాడా, పోటా వంటి కొన్ని కఠినమైన చట్టాలను అమలు చేస్తారు. ఈ చట్టాలను పాలక వర్గాల అజెండాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఏఎఫ్‌ఎస్‌పిఏ వంటి చట్టాలను ఈశాన్య ప్రాంతాలలో జాతీయ విముక్తి పోరాటాలను అణగదొక్కడానికి, ఉద్యమాలను, ప్రజల స్వయంప్రతిపత్తి, జాతీయత కోసం చేసే డిమాండ్లను అరికట్టడానికి రాజ్యం ఉపయోగించింది (ఉదాహరణకు, నాగాలాండ్ 1947కి ముందే తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది). కశ్మీర్‌లో కూడా ఈ దృశ్యం కనిపిస్తోంది. ఈ ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ద్వారా, “అంతర్గత భద్రత” పేరుతో ఆయా ప్రాంతాలలో సైనికీకరణ పెరిగింది. ఆదివాసీలు, దళితులను “నక్సల్స్” అని ముద్ర వేయడం ద్వారా వివక్షారహిత హత్యలు, అత్యాచారాలు, నిర్వాసిత్వాలకు పరదాగా ఉపయోగిస్తుంది. ఉగ్రవాద నిరోధక చట్టాలు దర్యాప్తు సంస్థలకు దర్యాప్తు, అరెస్టు చేయడం కోసమే కాకుండా, రాజ్య ప్రయోజనాలకు అనుగుణంగా లేనివారిని ఉరి తీయడానికి కూడా ఎలా దోహదపడుతున్నాయో వివరించాడు. ఉగ్రవాదం నిర్వచనాన్ని ఉపా వంటి చట్టాలలో సాధ్యమైనంతవరకు అస్పష్టంగా ఉంచారు.
“యుఎపిఎ కేసుల స్వభావానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో, యుఎపిఎలో జైలు నియమం- బెయిల్ మినహాయింపు అని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ తీర్పు వల్ల అమాయకులపై యుఎపిఎను విధించేందుకు, “చట్టవిరుద్ధంగా సమర్థించబడిన న్యాయశాస్త్రం” కింద ప్రజలను కటకటాల వెనుక పెట్టడానికి ప్రభుత్వానికి మరింత శిక్షలేమి లభిస్తుంది.
“ఈ ప్రాంతాలలో ప్రభుత్వ పెట్టుబడులతో జైళ్ల వంటి నిర్మాణాల ద్వారా “భద్రతా పరిశ్రమ”ను సృష్టిస్తోంది. కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్ వంటి ప్రాంతాలలో “యుద్ధ సమయ ఆర్థిక వ్యవస్థ”ను సృష్టించడానికి నోడల్ రంగాలను అభివృద్ధి చేస్తుంది. ఈ విధంగా రాజ్యం ఆ ప్రాంతంలో పెట్టుబడిని ఉపయోగించి అత్యవసర పరిస్థితిని సృష్టిస్తుంది. ఈ విధంగా డబ్బులు పంపిణీ అయి, తద్వారా అత్యవసర పరిస్థితి నుండి లాభపడే ఒక “బఫర్ విభాగం”ను సృష్టించడం జరుగుతుంది. ఈ యుద్ధంలాంటి పరిస్థితి ప్రైవేట్ కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టడానికి, అదనపు లాభాలను పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ఆచూకీదారుల (ఇన్‌ఫార్మర్)ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుంది. దీనివలన రాజ్యం ఆర్థికంగా లాభపడటమే కాకుండా ఈ “ఘర్షణ ప్రాంతాలు”లో తన పౌరులను మెరుగ్గా పర్యవేక్షించగలదు. రాజకీయ ఖైదీల కోసం ప్రజాస్వామ్య హక్కులు నిర్ధారించడంలో సిఆర్‌పిపి పాత్ర చాలా ముఖ్యమైనదని, మీడియా ట్రయల్స్ ద్వారా ఇప్పటికే దోషిగా ప్రకటించబడిన వారి హక్కులను కాపాడటానికి మీడియాలోని ప్రచారానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం అవసరమని” అన్నాడు.
ప్రఖ్యాత రచయిత్రి-కార్యకర్త అరుంధతి రాయ్‌తో పాటు, రోనా కూడా జిఎన్ సాయిబాబా మద్దతు- విడుదల కమిటీలో (కమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీస్ ఆఫ్ ప్రొఫెసర్ సాయిబాబా) సభ్యుడిగా ఉన్నాడు. 2000వ దశకం ప్రారంభం నుండి రాజకీయఖైదీల సమస్యపై పని చేస్తున్నాడు. సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మే నెలలో అరెస్ట్ చేసారు. సాయిబాబా తీవ్రమైన దివ్యాంగుడు, వీల్‌చైర్‌లో ఉంటారు. 2017 మార్చిలో, ఆయనకి జీవిత ఖైదు విధించారు (పది సంవత్సరాల తరువాత ఇటీవల నిర్దోషిగా విడుదల అయ్యారు.) రోనాను జైల్లో పెట్టడం, ఆయన పోరాడిన రాజకీయ ఖైదీల హక్కులకు పెద్ద దెబ్బ అని అరుంధతి అన్నారు. “ఒకరినైనా చట్టపరంగా కాపాడటం ఒక గొప్ప పనిగా ఉంటుంది. రోనా నిరంతరం జైళ్లను సందర్శిస్తూ, ఖైదీల కుటుంబాల బాధలను పట్టించుకోవడం … ఉచితంగా సేవలు అందించే న్యాయవాదులతో ఖైదీల గురించి వ్యవహరించేవాడు. అతను నిగర్వి. కాస్త మొహమాటమూ, సిగ్గుపడుతున్నట్లు వుండే చిరునవ్వుతో అందరితో కలిసి పని చేయడానికి ప్రయత్నించేవాడు” అని ఆమె అన్నారు.
ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను విచారణకు గురిచేసే రాజ్య సందేహాస్పద అజెండా
అన్యాయ, అక్రమ అరెస్టుకుముందు, రోనా పని సాధారణమైంది, ప్రజాస్వామ్యయుతమైనది. అన్ని చట్టపరమైన సరిహద్దుల్లో ఉంటుంది. భిన్నాభిప్రాయాన్ని కలిగివున్నందుకు లక్షంగా చేసుకోవడంలో రాజ్య ఫాసిస్టు స్వభావం బహిర్గతమౌతూంది. రాజకీయ ఖైదీలకు న్యాయ సహాయాన్ని సమకూర్చడానికి, రాజకీయ ఖైదీల పనిపై అవగాహన పెంచడానికి, అబద్ధాలు, ప్రచారాన్ని సరిదిద్దడానికి, అలాగే ఆధిపత్య అభివృద్ధి సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం నిర్మించడానికి పనిచేశాడు.
కాబట్టి, రోనా విల్సన్ ఒక కార్యకర్త అని, రాజ్యం అతనంటే చచ్చేంత భయపడుతున్నదనే అంశాన్ని నిర్ద్వందంగా చెప్పవచ్చు. రోనా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం సృష్టించడంలో కీలకపాత్ర పోషించడమే కాదు దోపిడీ, అణచివేతలు లేని సమాజం కోసం పోరాట నిబద్ధత కలిగినవాడు. అతని కాలేజీ రోజులలో తనకున్న పరిచయం నుండి ప్రొఫెసర్ హరగోపాల్, రోనా విల్సన్‌ను విలువల పట్ల అతనికున్న నిబద్ధత అనిర్వచనీయమైనది, ఆ చైతన్యవంతుడి మౌలిక ప్రామాణికత “పేదల విస్తృత సమస్యలు, ఖైదీల సమస్యలు, ఆదివాసీల సమస్యలు” వంటి వాటి మీద ఆధారపడి ఉంటుందని మెచ్చుకున్నారు. రోనాతో తన చర్చలు “రాజ్య స్వభావం, పాలన, భారతదేశ భవిష్యత్తు, పోరాటాల భవిష్యత్త్తు” వంటి అంశాల మీదే కేంద్రీకృతమై ఉండేవని అన్నారు.
రోనాను ఢిల్లీలోని తన ఇంటి నుండి 2018 జూన్ 6న అరెస్టు చేశారు, అదే రోజు మరో నలుగురు కార్యకర్తలు సుధీర్ ధావ్లే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రావత్, షోమా సేన్‌లను కూడా అరెస్టు చేశారు. ఐదుగురికీ నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) తో సంబంధాలున్నారని ఆరోపించారు. ఉపాలోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. అయితే, రాజ్యం ప్రత్యేకంగా రోనాను లక్ష్యం చేసుకుంది. రాజ్యం తనను ఎల్లప్పుడూ గమనిస్తూందని అతనికి తెలిసేది. ఫోన్‌లో మాట్లాడడం లేదా మెసేజ్ పంపడం చేసేవాడు కాదని రహస్యమైన ప్రదేశాలలో వ్యక్తులను కలుసేవాడని రోనా తీసుకునే జాగ్రత్తల గురించి మీనా కందసామి వివరిస్తుంది.
భీమా కోరేగావ్ కేసులో ఒంటరిగా ఉన్న రోనాను రాజ్యం ఏ స్థాయిలో వెంటాడేదో దీన్నిబట్టి తెలుస్తోంది. నిజానికి, ఫాసిస్ట్ భారత రాజ్యానికి, ప్రజానీకం స్వరాలకు ప్రాతినిధ్యం వహించే వారి భిన్నాభిప్రాయాన్ని, దోపిడీ బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ రాజ్య ఆధిపత్యాన్ని సవాలు చేసేవారిని అణిచివేసేందుకు భీమా కోరేగావ్ కేసు అనేది ఒక సాకు తప్ప మరొకటి కాదు. బికె-16 అరెస్టులు తమ చర్యల ద్వారా భారత రాజ్య స్వభావంపై విప్లవకర విమర్శలను చేసే, ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించే వారిని అరెస్టు చేయడానికి ఒక సాకు తప్ప మరొకటి కాదు
రోనా దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలలో దళితులు, ముస్లింల లాంటి అణచివేయబడిన సముదాయాలు సంఘటితమై ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన ఏర్పరచుకోవాలిలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసాడని ఎన్‌ఐఏ ఆరోపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయాలనే కుట్రలో భాగంగా చూపించేందుకు ఒక లేఖను అతని వస్తువుల్లో కనుగొన్నట్టు చెప్పి పోలీసులు రోనాను టార్గెట్ చేశారు – పూణే పోలీసులు ఈ లేఖ రోనా లాప్‌టాప్‌లో వున్నదని, అది “కామ్రేడ్ ప్రకాష్” కి పంపాడని తెలిపారు.
“వారు రోనా విల్సన్‌ను, షోమా సేన్‌ను కేసులో ఇరికించాలనుకున్నారు. ఇది రాజ్య వైఖరికి వ్యతిరేకంగా వుంది. మావోయిస్టు ఉద్యమం రహస్య పద్ధతుల్లో నిర్వహించే ఉద్యమం, ప్రతి పనీ రహస్యంగా చేస్తారు, తమ అసలు పేర్లను ఉపయోగించరు అని చెబుతూ మరోవైపు ఈ-మెయిల్ ని సాక్ష్యంగా చూపించడం వైచిత్రమూ, హాస్యాస్పదమూ అని రోనా న్యాయవాది రోహన్ నహార్ ఒక జర్నలిస్ట్‌తో అన్నారు. అందులోనూ ముఖ్యంగా ఈ లేఖ ప్రామాణికతను నిర్ధారించలేకపోవడంతో “ప్రాసిక్యూషన్ మొత్తం విధానం చాలా సమస్యలతో కూడి ఉంది” అని అన్నారు. మరింత వైచిత్రమైన విషయమేమంటే, పూనే పోలీసులు రోనాను 2018 ఏప్రిల్ 17 న అరెస్టు చేయడానికి ముందు కొన్ని నెలల కిందట రోనా ఇంటిపై దాడి చేసి, ఆయన లాప్‌టాప్, ఫోన్, ఇతర లిఖిత పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు, పాస్‌వర్డ్‌లు అన్నింటినీ తెలుసుకొన్నారు. దాడిచేయడంతో పాటు, డిసిపి ప్రవీణ్ ముండే, విచారణ అధికారి శివాజీ పవార్ నేతృత్వంలోని పూణే పోలీసుల బృందం రోనా విల్సన్ నివాసాన్ని ఢిల్లీలో తనిఖీ చేసి అతన్ని ఐపీసీ సెక్షన్స్ 153 ఎ, 117, 505 1 (బి), 34 కింద అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేశారు.
కోర్టులో సాక్ష్యంగా ఈ “లేఖ” ను పోలీసులు ఫైలు చేసినప్పుడు, కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఎఎన్‌ఐ వార్తా సంస్థతో “ఇది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రధాని మోడీ పాత వ్యూహం. ఆయన ప్రజాదరణ తగ్గినప్పుడు, హత్యా కుట్ర వార్తలు వదులుతాడు. అందువల్ల, ఇందులో ఎంత నిజం ఉందో పరిశీలించాలి” అని అన్నాడు. అక్రమ అరెస్టు అయిన కొన్ని సంవత్సరాల తరువాత, డిఫెన్స్ టీమ్ అభ్యర్థనతో అర్సెనల్ కన్సల్టింగ్ సహ నిందితులైన రోనా, సురేంద్రల కంప్యూటర్‌ల ఎలక్ట్రానిక్ ప్రతులను విశ్లేషించింది. అర్సెనల్ కన్సల్టింగ్ (మాసాచుసెట్స్‌లో ఉన్న డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ) మాల్వేర్‌ను ఉపయోగించి విల్సన్ ల్యాప్‌టాప్‌లోకి ప్రవేశించిన వ్యక్తి కనీసం పదిమంది నిందితుల లేఖలను అందులో చేర్చాడని పేర్కొంది. వీటిలో తుపాకులు, మందుగుండు సామగ్రి అవసరం గురించి, నిషేధిత గ్రూప్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయాలని కోరుతూ మావోయిస్టు మిలిటెంట్‌కు రాసిన లేఖ కూడా ఉంది.
రోనా అరెస్టుకు ముందు రెండు వేరే హ్యాకర్ సమూహాలు టార్గెట్ చేశాయని ఒక సంవత్సరం తరువాత, వాషింగ్టన్ పోస్ట్ ఒక రిపోర్టు విడుదల చేసింది. హ్యాకింగ్ చేసిన సమూహాల్లో ఒకటి, మోడిఫైడ్‌ఎలిఫెంట్ అని సెంటినల్‌వన్ పిలిచిన ఈ గ్రూప్, రోనా కంప్యూటర్‌లో పత్రాలను పెట్టిందని రిపోర్టులో పేర్కొంది. ప్రధాన హ్యాకర్ అయిన మోడిఫైడ్‌ఎలిఫెంట్, బాధితుడి ఆసక్తులకు అనుగుణంగా ఉన్న డాక్యుమెంట్స్ లేదా అటాచ్‌మెంట్‌లతో మెయిల్‌లు పంపింది. వీటిలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నెట్‌వైర్, డార్క్‌కోమెట్ వంటి మాల్వేర్‌లు ఉన్నాయి. బాధితుల అభిరుచులకు అనుగుణంగా తయారుచేసి వారికి పరిచయంవున్న అనేక మందికి పంపుతారు అని సెంటినల్‌వన్ చెప్పింది. రోనాకు కనీసం 32 మెయిల్‌లు మోడిఫైడ్‌ఎలిఫెంట్ నుండి వచ్చాయి. ఈ గ్రూప్ నుండి గాడ్లింగ్‌కు ఇలాంటి 40 మెయిల్‌లు వచ్చాయి.
సెంటినల్‌వన్ రోనాని లక్ష్యంగా చేసుకున్న మరో హ్యాకింగ్ గ్రూప్‌ని సైడ్‌వైండర్‌గా గుర్తించింది. అంతర్జాతీయ సైబర్ భద్రతా నిపుణులు పాకిస్తాన్, చైనాలో ఈ సైడ్‌వైండర్ కార్యకలాపాలను ట్రాక్ చేశారు. రోనా విల్సన్‌కు కంప్యూటర్లోకి చొరబడడానికి ఉద్దేశించిన మాల్‌వేర్‌ను కలిగి ఉన్న అనేక ఇమెయిల్‌లు వచ్చాయి. వాటిలో కొన్ని ఇతర ఉద్యమకారుల నుండి, కొన్ని వార్తా వ్యాసాల రూపంలో వున్నాయి. ది పోస్ట్ అభ్యర్థనపైన సెంటినల్‌వన్ రిపోర్టును సమీక్షించిన అమెరికా, యూరోప్‌లోని మూడు స్వతంత్ర నిపుణులు దాని తుది నిర్ణయాలతో ఏకీభవించారు. రోనా విల్సన్‌పై ఇమెయిల్ దాడులు 2014లో తీవ్రతరమై కనీసం 2016 వరకు కొనసాగినా, మొదటి దాడి దశాబ్దం క్రితమే జరిగి వుండవచ్చని వారు అన్నారు.
2013లో హ్యాంగోవర్‌పై రాసిన నివేదికకు సహరచయితగా ఉన్న నార్వేజియన్ సైబర్‌సెక్యూరిటీ పరిశోధకుడు స్నోరే ఫాగర్లాండ్, విల్సన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం గురించిన తాజా వివరాలు భారతదేశంలో పనిచేస్తున్న దాడి చేసేవారి మధ్య ఉన్న సంబంధాలను, విదేశీ శత్రువులను, స్థానిక విప్లవకారులను ఒకే రకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న విషయంపైన మెరుగైన అవగాహనను అందిస్తున్నాయని అన్నారు. “కేవలం పద్ధతుల గురించే కాక, లక్ష్యంగా చేసుకోవడం, భారతదేశంలో ఆధునికమైన నిరంతర బెదిరింపు పరిసరాలు ఎలా పనిచేస్తున్నాయనే విషయానికి సంబంధించి కూడా గత దశాబ్దంలో మేము చాలా విషయాలను నేర్చుకున్నాం అనడం సరిగా వుంటుంది” అని ఆయన అన్నారు.
భారతదేశం నుండి వందల కొద్ది ఫోన్ నంబర్లు గ్లోబల్ జాబితాలో కనిపించాయి అని ఈ నివేదిక వెలుగులోకి రావడానికి ముందు సంవత్సరంలో ‘ది పోస్ట్’ సహా ఒక గ్లోబల్ కన్సార్టియం జరిపిన ఒక పరిశోధన తెలియచేసింది. ఈ జాబితాలో కొన్ని నంబర్లు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ పెగాసస్ టూల్ ఉపయోగించి తమ క్లయింట్లు పర్యవేక్షణ కోసం ఎంచుకున్నది. కేవలం ప్రభుత్వ సంస్థలకు యివ్వడానికి మాత్రమే పెగసస్‌కు లైసెన్స్ వుంది. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఒక విస్తృత నివేదికలో, ఆర్సెనల్ కన్సల్టింగ్, ఆమ్నెస్టీ టెక్ సెక్యూరిటీ లాబ్, ప్రధాన నిందితులలో ఒకరైన రోనా విల్సన్ ఐఫోన్ పలు మార్లు పెగాసస్ స్పైవేర్ దాడికి గురైందని నిర్ధారించాయి.
తన అరెస్టు అనివార్యమని అని తెలిసినా, విప్లవం పట్ల అభిరుచి, భారతదేశంలో సామ్రాజ్యవాదం, దాని తాబేదారులు మద్దతు ఇచ్చిన బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం అన్యాయాలను గుర్తించడం ద్వారా రోనా రాజ్యానికి వ్యతిరేకంగా దృఢంగా పోరాడాడు. రాజ్యం తనను గమనిస్తోందని రోనాకు తెలుసునని, “అతను తన కెరీర్ (వృత్తి) పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వున్నాడని, మరింత చదువుకోవాలనుకున్నాడు” అని పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు.
రోనా విల్సన్ కేసులో చట్టపరమైన లేదా తార్కిక ఆధారం లేదు అనే ప్రాధమిక లోపాన్ని ఈ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇది ప్రగతిశీల, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, పీడిత, శోషితవర్గాల హక్కులను సమర్థించే వ్యక్తులను మాట్లాడకుండా చేయడానికి మానసిక యుద్ధ పద్ధతిగా భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించిన అబద్ధపు కేసు. రోనా తన అనుభవాన్ని ఇలా సంక్షిప్తం చేశాడు: “భారత శిక్షాస్మృతిలోని అత్యంత కఠినమైన చట్టాల కింద ఆరోపణల కింద ఐదు సంవత్సరాలకుపైగా జైలులో గడిపిన తరువాత, మీరు, మీ సహనిందితులు చేసిన ఏకైక ‘నేరం’ అధికారంలో వున్నవారి గురించి నిజం చెప్పడమే అనే సంపూర్ణ అవగాహన కలగటం అనేది ఒక అధివాస్తవిక అనుభవం. జైల్లో అలాంటి రోజువారీ జీవితం మీ ఎదుట ఒక పీడకలలా వుంటుంది. అయినప్పటికీ ధైర్యంగా వుండడం తప్ప వేరే మార్గం లేదు. ఆ స్థితిని ఎదుర్కోవడం పదాల ద్వారానే సాధ్యం అవుతుంది… చెప్పండి”
రోనా విల్సన్‌ను వెంటనే విడుదల చేయాలి!
రోనా విల్సన్ ఇంటిపై దాడికి వ్యతిరేకంగా సిఆర్‌పిపి తన ప్రకటనలో భీమా కొరేగావ్ కుట్ర కేసును చక్కగా సంగ్రహించింది: రాజ్య ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దళితుల ప్రతిఘటనా స్వరాలు ఉప్పెనగా మారుతున్న సమయంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా, హిందూత్వ ఫాసిస్టు శక్తుల సహాయంతో సామ్రాజ్యవాద పెట్టుబడి చేస్తున్న అపరిమిత దోపిడీ, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా తలెత్తిన దళితవర్గవెల్లువపై రాజ్యం నిర్లజ్జగా ప్రతీకారం తీర్చుకుంటూంది. కార్యకర్తలను, న్యాయవాదులను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ఖైదీల రక్షణ కోసం మాట్లాడే స్వరాన్ని కూడా తొలగించాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భీమా కోరేగావ్‌లో జరిగిన హింసాకాండను పాలకవర్గాలు ప్రజల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను, న్యాయవాదులను మట్టుబెట్టడానికి అలిబిగా ఉపయోగించుకుంటున్నాయని అర్థం చేసుకోవాలి. ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ఈ ముందస్తు దాడులు పెరుగుతున్న పోలీసు రాజ్య నిరాశను ప్రతిబింబిస్తాయి. కార్యకర్తలను, న్యాయవాదులను తప్పుడు ఆరోపణల కింద ఇరికించి, సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచాలనే పాలనాయంత్రాంగంలో పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తుంది. అరెస్టు సమయంలో, రోనా తన చదువు పూర్తి చేయడానికి విదేశాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఆయన నుండి లాక్కున్నారు, ఆయన సమర్థత, వ్యక్తిత్వాలను రాజ్య దుర్మార్గపు ఎజెండా అణచివేసింది. రోనా మంచి విద్యార్థి. “అతను ఈ దేశానికి చెందిన ప్రముఖ మేధావులలో ఒకరిగా తనను తాను రూపొందించుకుంటాడని నేను అనుకున్నాను” అని హరగోపాల్ భావించారు.
రోనా తన విలువల కోసం రాజీపడబోడని ఆయన అన్నారు. “జైలులో జీవితం, నిర్బంధంలో, విషయాలు వేరే వెలుగులో చూడటానికి మీకు తగినంత అవకాశం ఇస్తుంది. ఒక మానవ హక్కుల కార్యకర్త, సమర్ధించేవాడిగా, కటకటాల అవతల నిలబడి గత 15 సంవత్సరాలుగా నేను రాసిన, నిలబడిన విషయాలను మరొక వైపు నుండి చూడటానికి ఇది నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది” అని రోనా జైలుకు వెళ్ళాక తన కుటుంబానికి రాసిన లేఖలో అన్నాడు.
రోనా విల్సన్ ఒక సాధారణ వ్యక్తి, సామ్రాజ్యవాద దోపిడీ, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం అనే అవినీతి, అధోగతి వ్యవస్థకు వ్యతిరేకంగా అసాధారణ పోరాటం చేస్తున్నాడు. రోనా ఒక విద్యావంతుడు, ఒక కార్యకర్త, విప్లవ అవసరాల రీత్యా నడిచే వ్యక్తి. అతను మార్క్సిస్ట్. కానీ నేరస్తుడు కాదు. అతను భిన్నాభిప్రాయాలు కలవాడు కానీ ఒక తీవ్రవాది కాదు. అన్యాయానికి వ్యతిరేకంగా, విశ్వాసం కోసం పోరాడుతున్న వారిని ఉగ్రవాదులుగా, దేశ వ్యతిరేకులగా చిత్రీకరించినట్లే, రాజ్యం అతన్ని కూడా చిత్రీకరించింది.
ఇది ఎవరి దేశం? అనే ప్రశ్న మిగిలి ఉంది. జాతీయతలకు జైలుగా ఉన్న దేశంలో, హిందూ రాష్ట్ర స్థాపన అనే రాష్ట్ర ఎజెండాను మనం అంగీకరించాలా?ముస్లింలు, ఆదివాసీలు, అణగారిన కులాలు, మహిళలు, ఇతర అణగారిన వర్గాల రక్తంతో నిర్మించిన “దేశాన్ని” మనం అంగీకరించాలా? ప్రజలతో మాట్లాడే వారి డిమాండ్ల గురించి మాట్లాడే స్వరాన్ని కలిగివున్నందుకు దేశభక్తిగల, దేశాన్ని ప్రేమించే ప్రజలను జైళ్లకు పంపే పాలనను అంగీకరించాలా? రాజ్య దురహంకార, ప్రతీఘాతుక ఎజెండాను అంగీకరించాలా?
లేదు, మనం దీనిని ఒక దేశంగా అంగీకరించలేము. మన కోసం నిస్వార్థంగా పోరాడుతున్న రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయడాన్ని తప్ప మరింకేమీ అంగీకరించలేము.
27 ఫిబ్రవరి 2024
వల్ (Val), ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో విద్యార్థి
తెలుగు: పద్మ కొండిపర్తి