(డిసెంబర్లో విరసం ప్రచురించిన మిడ్కో కథల సంపుటి *మెట్లమీద *కు రాసిన ముందుమాట ఇది . అమర యోధ రేణుక స్మృతిలో పాఠకుల కోసం .. వసంతమేఘం టీం )
ముందుమాట కోసం పోస్టులో వచ్చిన పద్దెనిమిది కథలు గత అయిదు నెలలుగా చదువుతూ ఆలోచిస్తున్నాను. ఈ కథలు చదువుతూ ఉంటే మేము ఇదివరకు యువ రచయితలకు నిర్వహించిన పాఠశాలలు ముఖ్యంగా 1997 వేసవికాలంలో అరకులోయలో శ్రీ కాళీపట్నం రామారావు, ఆర్.యస్. రావుగారి లాంటివారు విచ్చేసి పదిరోజులు నడిపిన పాఠశాల గుర్తొచ్చింది. రాష్ట్రం మొత్తం నుండి వచ్చిన యువ రచయితలు, రచయిత్రులు (అర్ధ రాత్రుల దాకా చదివిన కథలు) గుర్తొచ్చారు. బస్సులో తిరుగు ప్రయాణంలో వాళ్లు గొంతెత్తి పాటలు పాడారు. నాకప్పుడు వీళ్లంతా ‘మనకాలపు వీరుడు’ నవలల్లోని పాత్రల్లాగా అన్పించారు.
ఈ కథలు నేను చాలావరకు అంతకు ముందు చదివినవే. అందరిలాగే ఈ కథల్లోని పాత్రలు నా జీవితంలో ప్రవేశించి నాలో నిలిచిపోయినవే. ముఖ్యంగా ‘మెట్లమీద’ కథలోని అన్ని పాత్రలు నాకు అంతటా ఎదురుపడుతూనే ఉంటాయి. లోలోపల గత ముఫ్ఫై అయిదు సంవత్సరాలుగా ముఖ్యంగా నేను బతికే పల్లెల్లో, పట్నాలల్లో ఈ కథలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కథలు చదువుతున్నంతసేపు అక్షరాలు అలుక్కుపోయి – వాక్యాలు సాగిసాగి- తొవ్వలై- అలాంటి నిరుపేద పల్లెల్లోకో – నిరుపేద మనుషుల దగ్గరికో చేరుకుంటాయి. అక్కడ ఏముంటుంది? ఈ కథల వాక్యాల మధ్య పొగచూరుతున్న అనేక తెలంగాణ ముఖ్యంగా వరంగల్ గ్రామ సీమలు కళ్లకు కడుతాయి. ఈ అతలాకుతలంలో, వ్యవస్థతో రాజీపడినవాళ్లు లౌక్యులు – లోలోపల వెయ్యిముక్కలై విధ్వంసమై కూడా లోకం ద•ష్టిలో బాగుపడ్డ వాళ్లయ్యారు. కాని జీవితాకర్షణకు లోనైన వారు మంచి జీవితం గురించి కలగన్నారు. ఆ కలల కోసం అనివార్యంగా పోరాటంలోకి ప్రవహించారు. ప్రభుత్వాల నిర్బంధాల వల్ల అడవులుబట్టారు. అలాంటి నేపథ్యాన్ని, మహాద్భుతమైన, మానవీయ జీవితపు అనుబంధాలను, రూపొందుతూ ఉన్న కలలను, దానికోసం పోరాడుతున్న ప్రజల అనుభవాలు – గాయాలు ఇంకా పోలీసుల పదఘట్టనల వల్ల దుమ్ము రేగుతున్న చెల్లాచెదరైన గ్రామాలు…. ఇవ్వడం తప్ప, తీసుకోవడం తెలియని మనుషులు, భూమిని దున్ని బువ్వ – సకల వస్తువులు స•ష్టించి ఇవ్వడం తప్ప – నాశనం చెయ్యడం తెలియని మనుషులు…. ఆ అనుబంధాలు నాలోకి ప్రవహించి ముద్దైపోయి – కంఠం రుద్దమైపోయి, మరిక ముందుకు సాగదు. లోలోపలికి ఇంకా లోపలికి ఆలోచనలు సాగుతాయి. ఇక్కడ రాయవీలుకాని జ్ఞాపకాలేవో చుట్టుముడుతాయి.
ఇంకా కొనసాగుతున్న ఒక సుదీర్ఘ మనకాలపు యుద్ధంలోంచి నడిచి వచ్చిన ఈ కథల నిండా ‘త్యాగం’ కథా వస్తువు. అంతకంతకూ ప్రపంచ వ్యాపితంగా ఒక విష క్రిమిలాగా వ్యాపిస్తూ – ప్రపంచ ప్రజల సంస్క•తిని, సంపదను కొల్లగొట్టే – ‘స్వార్థం’ తప్ప మరే విలువలేని ప్రపంచీకరణ సందర్భంలో… ప్రపంచం నిండా ఈ కథల్లోని పాత్రల లాంటి యుద్ధవీరులు సమీక•తమౌతూనే వున్నారు. ఎడారులల్లో, మైదానాలల్లో, నగరాలల్లో, పంట భూముల్లో, దట్టమైన అడవుల్లో ప్రపంచమంతటా ప్రవహిస్తూనే ఉన్నారు. ఈ కథల్లోని మనుషుల్లాగే మానవీయ విలువల కోసం ఎంతటి మూల్యాన్నైనా చెల్లించి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.
ఇలాంటి ఉద్విగ్న స్థితిలో – సందర్భంలో ఇలాంటి కలలుకనే కథల గురించి నేనేం పరిచయం చెయ్యాలో తెలియక…. బహుశా తెలిసినా పూర్తిగా చెప్పడం వీలుగాక, చేతగాక… సందేహంలో రాయడం ఆలస్యమౌతున్నకొద్దీ… ఈ కథలు సలుపుతూనే ఉన్నాయి.
నా కందిన కథల్లో పదకొండు కథలు ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలల్లోని వివక్షతను మన కాలంలోని, మన ప్రాంతంలోని సామాజిక నేపథ్యంతో అది సూక్ష్మ పరిశీలనతో చిత్రించారు. రాధా, వాణి, లక్ష్మి, హిమ, రమ, ఉమ లాంటి పాత్రలు మానవ ప్రవర్తనలోని అతి చిన్న అమానవీయ చర్యను కూడా ఎత్తి చూపి ఎదిరిస్తారు. సంఘర్షిస్తారు. సాంప్రదాయిక బండ జీవితానికి చైతన్యవంతమైన సామాజిక కొత్త జీవితానికి మధ్య సాగే సంకుల సమరాన్ని, క్రమాన్ని – ఈ కథలు చిత్రించాయి.
ఇక మిగతా ఏడు కథలు విప్లవ జీవితాచరణకు సంబంధించిన కథలు…..
ప్రవాహం హోరు మీరెప్పుడైనా విన్నారా? మీలో లోపలి ప్రవాహం లబ్ డబ్. రెండు ప్రపంచాలు నీటి కత్తి అంచుమీద విడిపోవడం. అది అనుభవిస్తే తప్ప తెలియనంత పదునైన గుండెకోత. యుద్ధరంగంలో ఎదురుబొదురుగా నిలబడి పోరాడడం కన్న – ఇక్కడ నిలబడటం, తడబడకుండా నిలబడడం తలపడటం ఓహ్ మంచుకోత కన్నా తీవ్రమైన కోత.
సామాజిక కథా రచనలో, అదీ ముఖ్యంగా సమకాలీన విప్లవ కథలు రాయడానికి సంబంధించి యువ రచయితలు నేర్చుకోవాల్సింది చాలా వున్నది. ముఖ్యంగా కథాంశం కథా నిర్మాణం – సన్నివేశాలు సంఘటనల వంటి వాటి విషయంలో మన అధ్యయనం, క•షి ఇంకా పెరగవలసి వున్నది. కొంచెం వివరంగా చెప్పాలంటే, వాస్తవం పేరిట కథనాలను, వార్తలను మనం కథాంశాలుగా చిత్రిస్తూ వుంటాము. పాత్రలు సంఘటనలు – సన్నివేశాల కల్పనలో వైరుధ్యాలను పట్టించుకోకుండా, స్థల కాలాల ప్రమేయం లేకుండా చిత్రిస్తూ వుంటాం. కథకు సంబంధించిన వాతావరణాన్ని, స్థలాన్ని భిన్న స్థలాల్లో నిర్వహించడం మీద మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఏక పక్షంగా కథను నడపడం పాత్రలు వాటి వాటి ప్రత్యేకతలతో, వయసు బేధాలతో రూపు కట్టించడంలో తగినంత శ్రద్ధ చూపెట్టలేం. కనుక అన్ని కథల్లోని పాత్రలు ఒకే తీరుగ కట్టే ప్రమాదం నుండి బయట పడలేకపోతున్నాం.
కథలు ఎవరికోసం రాయాలో – ఎందుకోసం రాయాలో – మంచి అంటే ఏమిటో, చెడు అంటే ఏమిటో మన కాలపు యువ రచయితలకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కాని కథలను పకడ్బందీగా రాసే విషయంలో మాత్రం మనవాళ్లు ప్రపంచంలోని ఉత్తమోత్తమ కథా రచయితలను – వారి కథా నిర్మాణ పద్ధతులను అధ్యయనం చెయ్యవలసి వుంది.
మంచిర్యాల,
డిసెంబర్ 12, 2007