ఈసారి సాహిత్య పాఠశాల ఇతివృత్తం ‘సంక్షోభ కాలంలో సాహిత్యకారులు’. ఇటీవలే మనకు దూరమైన ప్రియతమ కామ్రేడ్, కవి , విప్లవ మేధావి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తన జీవితంతో, మరణంతో రగిలించిన ఉత్తేజమూ, సమాజంపైకి సంధించిన చురుకైన ప్రశ్నలూ ఒక కొత్త సందర్భాన్ని మన ముందుకు తీసుకొచ్చాయి. సంకెళ్లలోనే స్వేచ్ఛాగానం చేయడం, చీకటిలో వెలుగును కలగనడం, అణచివేస్తే విముక్తిని ప్రకటించుకోవడం, అంతిమంగా మృత్యువులో కూడా చావును నిరాకరించడం అనేవి ఇంకెంత మాత్రం రొమాంటిక్ వ్యక్తీకరణలు కాదని ఆయన నిరూపించారు.
ఆయనకంటే ముందు అత్యంత దుర్భర స్థితిలో, వైద్యం అందక జైలులో మరణించిన మావోయిస్టు రచయిత్రి నర్మద(ఉప్పుగంటి నిర్మల) కూడా ఇలాంటి ఒరవడిలో భాగం. ఇది అలాంటి ఒకరిద్దరికే పరిమితమైన సృజనాత్మక సాహసిక ఆచరణ కాదని చాటిచెప్పే సందర్భం ఇది. విచారపడిరది చాలు..కన్నీళ్లు ఒత్తుకున్నది చాలు.. ఈ కాలం విసురుతున్న సవాళ్లను గుర్తించమని, ఎదుర్కోడానికి తగిన వ్యూహం సిద్ధం చేసుకోమని, ఆచరణలోకి దిగమని చరిత్ర ఒత్తిడి చేస్తున్న సందర్భం ఇది.
సంక్షోభకాలంలో ప్రొ. సాయిబాబా సందర్భం అంటున్నామంటేనే, ఇది ఫాసిస్టు సందర్భం అని అర్థం. ఫాసిజానికి సాయిబాబా, నర్మద, స్టాన్‌స్వామి వంటివారు బలైపోయారని విషాదంగా అనుకొని, నిర్లిప్తంగా ఉండిపోతే ఈ సందర్భాన్ని సరిగా అర్థం చేసుకున్నట్లు కాదు. కార్పొరేట్ హిందుత్వ ఫాసిజంతో వీరందరూ అలుపెరుగని పోరాటం చేశారు. దాని ఆనుపానులు గ్రహించారు. దాన్ని తుదముట్టించడానికి జీవితాన్ని ప్రయోగం చేశారు. ముప్పై ఏళ్లుగా అజ్ఞాత విప్లవోద్యమ నాయకురాలైనందు వల్ల నర్మద రచనలేగాని, ఆమె జీవిత విశేషాలు మనకు అంతగా తెలియకపోవచ్చు. కానీ మన మధ్యనే జీవించిన సాయి తీవ్ర అనారోగ్యంతో కూడా ఈ వ్యాధిగ్రస్థ వ్యవస్థను చివరి దాకా ఎట్లా ఎదుర్కొన్నదీ మనందరికీ తెలుసు. ఫాసిజం విజృంభించిన ఈ కాలంలో సాయి విప్లవ జీవితం విస్తారమైన సార్వజనీనతను పొందింది.
ఫాసిజం ఈనాడు ఎన్నో తావుల నుంచీ, వ్యక్తిగత, సామాజిక, నైతిక తలాలనుంచీ తన అమానవీయ, విధ్వంసకర, క్రూరమైన ముఖాలను ప్రకటించుకుంటోంది. దాని మీది పోరాటం అంతకంటే విస్తారంగా, అద్భుతంగా సార్వత్రిక రూపం సంతరించుకుంటున్నది. ఇది ఎంత సంక్షోభ కాలం అయినా, మనం మరీ దిక్కూమొక్కు లేనివాళ్లంగా మాత్రం లేం. ఇది మన మీదికి కేవలం నిరాశను, దుఃఖాన్ని, భవిష్యత్తు పట్ల వ్యక్తావ్యక్త భయాలను మాత్రమే తోసి ఊరుకోలేదు.
అంతకుమించి.. గొప్ప ఆశను కలిగిస్తూ ఉంది. అద్భుతమైన ధిక్కార, నిర్మాణాత్మక వ్యక్తీకరణలను వేదికగా మారింది. మానవులు ఈ హింసను, ఒత్తిడిని, దోపిడీని అంగీకరించరనే చారిత్రక స్వరానికి బంగ్లాదేశ్, శ్రీలంక, సిరియా.. బిగ్గరగా వంత పాడటం కూడా వింటున్నాం. అయితే, ప్రశ్నలు చాలా మిగిలే ఉన్నాయి.
మన దేశంలో ఫాసిజం పుట్టుక, పెరుగుదల, దాని ప్రత్యేకతలు పరిశీలించకపోతే ఈ సంక్షోభం మనకు అర్థం కాదు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఏదో ఒక వైపు నుంచి, ఒకానొక రంగం నుంచి విరుచుకపడిరది కాదు. ప్రపంచమంతా కూరుకపోయిన సంక్షోభంలో భాగంగా భారతదేశం కార్పొరేట్ హిందుత్వ ఫాసిజాన్ని ఎదుర్కొంటున్నది. నిజానికి, సంక్షోభాలు మనకు కొత్త కాదు. గత చరిత్రకు కొనసాగింపే కావచ్చు. ఒక ఘటన జరగగానే గతంలో అలాంటి ఘటనలు చాలా జరిగాయని అంటాం. లేదంటే, ఇది విడి ఘటన కాదు, ఒక క్రమంలో భాగంగా ఈ నిర్దిష్ట కాలానికి, సందర్భానికి సంబంధించినది అని విశ్లేషిస్తుంటాం. ఈ రెండు ప్రతిస్పందనలూ స్థూలంగా సరైనవే. అలాంటి సాధారణ అర్థంలోనే హిట్లర్, ముస్సోలినీలోని ఫాసిజాన్ని ఇందిరాగాంధీలోను, ఎన్టీఆర్‌లోను, చంద్రబాబులోనూ, మమతాబెనర్జీలోనూ చూసి, వారిది ఫాసిస్టు పాలన అన్నాం. రాజకీయ, పాలనా నిరంకుశత్వంలో ఈ పోలిక సరిపోయేదే. ఇదే అర్థంలో మోదీ, షాల పాలనను కూడా అర్థం చేసుకోడానికి లేదు. మతతత్వాన్ని ఆసరా చేసుకొని ప్రజలను ఒకరి మీదికి ఒకరిని ఉసిగొల్పి అధికారాన్ని సుస్థిరం చేసుకొనే వ్యూహం అని సరిపెట్టుకోడానికి లేదు. ఇది బూర్జువా నియంతృత్వం మాత్రమే కాదు.
మానవ చరిత్రలోకి పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి, అది సామ్రాజ్యవాదంగా మారినప్పటి నుంచి సంక్షోభాలతో కునారిల్లుతున్నది. నిరంతర సంక్షోభం దాని సహజ లక్షణం. రానురాను అది ద్రవ్య పెట్టుబడి రూపంలో మరింత జటిలంగా, తీవ్రంగా తయారైంది. స్థానిక సామాజిక సాంస్కృతిక, భావజాల వ్యవస్థలతో, వాటిలో జరిగిన మార్పులతో సహా భారత దళారీ పెట్టుబడి కలిసి ఫాసిజం కొనసాగుతున్నది.
ఈ శతాబ్దపు సామ్రాజ్యవాద సంక్షోభాలతో ముడిపడి మన దేశంలో హిందుత్వ ఫాసిజం విజృంభించింది. సనాతన ధర్మం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, కార్పొరేటీకరణ పెనవేసుకున్న ఫాసిజం ప్రగతిశీల పరిణమాలను తావు లేకుండా చేస్తున్నది. ఇప్పటి దాకా భారత ప్రజలు సాధించుకున్న నాగరితా విలువలను, ప్రజాస్వామిక జీవన రీతులను ధ్వంసం చేసి సాంస్కృతిక చరిత్రను వెనక్కి నడపాలని చూస్తున్నది. అంత మాత్రాన దీన్ని మతతత్వం, ఆగ్రకులతత్వం, సాంస్కృతిక తిరోగమనం అనే కొన్ని కోణాల్లోనే చూడ్డానికి లేదు. భారత సమాజ పురోగమంలో ఈ చారిత్రక యుగం ఎదుర్కొంటున్న సంక్షోభంగా దీన్ని లోతుగా, విస్తారంగా చూడాలి. చిట్ట చివరికి ఇది మానవుల నైతిక సంక్షోభంగా కూడా మారిపోయిందని గ్రహించాలి.
సారాంశంలో ఇండియాలోని హిందుత్వ కార్పొరేట్ ఫాసిజానికి ఇరవయ్యో శతాబ్దపు ఫాసిజంకంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అనేక చారిత్రక కారణాలతో, వర్తమాన ఆర్థిక పరిణామాలతో, సామ్రాజ్యవాద పెట్టుబడితో కలిపి, ఈ యుగపు సంక్షోభంలో భాగంగా హిందుత్వ ఫాసిజాన్ని చూడవలసి ఉన్నది. సరికొత్త అన్వేషణలకు సిద్ధం కావాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న విప్లవ, ప్రజా పోరాటాల అనుభవాల వైపు నుంచి ఆచరణాత్మక వైఖరులకు రావాలి.
నిన్నటి దాకా ఒక గుజరాత్, ఢల్లీి మాత్రమే.. మరి ఇప్పుడు దేశమే ఫాసిస్టు మంటల్లో కాలిపోతోంది. మణిపూర్ రెండేళ్లుగా ఆరకుండా రగులుతూనే ఉంది. కశ్మీరును బందిఖానాలో పెట్టి ఐదేళ్లు దాటిపోయింది. మధ్యభారతంలో ఆదివాసీల కాళ్ల కింద ఖనిజాల కోసం భారత పాలక వర్గాలు నిర్భీతిగా అంతిమ యుద్ధం ప్రకటించాయి. ఇది మొదలయి కూడా ఇరవై ఏళ్లు దాటిపోయింది. సంక్షోభం అనేక తలాల్లో, రంగాల్లో విరుచుకపడుతున్న కొద్దీ ఆ అన్ని తావుల నుంచి తిరుగుబాట్లు, ప్రతిఘటనలు ఉధృతమవుతున్నాయి. అందు వల్ల ఇది సంక్షోభ కాలమే కాదు. పరిష్కారాల కాలం కూడా.
ఇలాంటి సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర గురించి, అదీ సాయిబాబా సందర్భంలో మాట్లాడుకోవడమంటే ఇదేదో విప్లవ సాహిత్యోద్యమం తన సొంత గొడవ వెళ్లబోసుకోవడం కాదు. సాహిత్యం నిర్వహించే పాత్రను, సాహిత్యకారుల సామాజిక ఆచరణను మరోసారి మాట్లాడుకోవడమే. ఫాసిజం సాహిత్య కళా మేధో రంగాల ముందుకు తీసుకొచ్చిన అనేక సంక్లిష్ట సవాళ్లను చూడాలి. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకపోవడానికి వాటితో సవ్యంగా వ్యవహరించాలి. అవి సాహిత్యంలోని సృజనాత్మక తలానికేగాక సిద్ధాంత తలానికి సంబంధించినవి కూడా.
సమస్త కళా సాహిత్యాల ప్రాథమిక షరతు మనుషుల్నీ, సమాజాన్నీ సెన్సిటైజ్ చేయడమే. దానితోపాటు రచయితలు, బుద్ధిజీవులు వ్యక్తులుగా, ఒక సమూహంగా ప్రజా జీవితంలో ఎక్కడ నిలబడతారు? తమ విలువలతో, ఆచరణతో సంక్షుభితభరితమైన సమాజంలో ఏ వైఖరులు తీసుకుంటారు? అనేవి అంతకంటే ముఖ్యం. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు సంధించిన ‘రచయితలారా! మీరు ఎటు వైపు?’ అనే ప్రశ్నలోంచి విరసం ఆవిర్భవించి, అనేక ఉద్యమ, సంక్షోభ కాలాలకు తగిన రచన, ఆచరణలతో తన దారిని విశాలం చేసుకుంటున్నది.
నిజానికి విరసం ఆవిర్భావ కాలంలో కంటే ఇవాళ అనేక సంక్షోభాలు ప్రజల్ని చుట్టుముట్టాయి. పీడిత సమూహాల సమస్యల పరిష్కారానికి అనేక ప్రజాస్వామిక చైతన్యాలు, పోరాటాలు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం బలపడుతున్న ఈ సంక్షోభ కాలంలో రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు తమ సామాజిక, రాజకీయ ఆచరణను తాజాగా పునర్నిర్వచించుకోవాల్సి ఉంది. రాజకీయార్థిక, సాంస్కృతిక, సైనిక, నైతిక తలాల్లో కార్పొరేట్ల కోసం, హిందుత్వ రాష్ట్ర కోసం ఫాసిస్టులు చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా సాహిత్య కళా మేధో రంగాల నుంచి ప్రజలను కూడగట్టవలసిన ఉన్నది. ముఖ్యంగా మెజారిటీ మత ప్రజలపై ఫాసిస్టు భావజాల ప్రభావం తీవ్రమవుతున్న సమయంలో గెలుచుకోవాల్సిన ప్రజా సమూహాలు పెరిగిపోతున్నాయి. హేతుబద్ధ వాదనతో గతాన్ని సరికొత్తగా చూసి, ప్రగతిదాయకమైన భవిష్యత్తు మీద ఆశ పెంచవలసి ఉన్నది. దీనికి రచన, పరిశోధన అనే ముఖ్యమైన ఆచరణ రూపాలతోపాటు రాజకీయ, సామాజిక ఆచరణను రచయితలు నిర్భీతిగా, మరింత నిబద్ధతతో ఎంచుకోవాల్సి ఉన్నది. తెలుగు సాహిత్యానికి ఉన్న అద్భుతమైన సాంస్కృతిక, రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకపోవలసిన అతి ముఖ్యమైన సంక్షుభిత సందర్భంలో రచయితలు, కళాకారులు, మేధావులు ఇవాళ నిలబడి ఉన్నారు.
ఇప్పటి దాకా నమోదు కాని, గుర్తింపు పొందని వందల వేల పీడిత జన జీవితాలు ఇటీవల సాహిత్యంలోకి వస్తున్నాయి. లిఖిత సాహిత్యంలోకి రాని సమూహాల నుంచి రచయితలు, మేధావులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఫాసిస్టు కార్పొరేట్ ఉన్మాదానికి వ్యతిరేకంగా మానవీయ స్పందనలు వినిపిస్తున్నారు. ఇంకో పక్క ఏ రాజకీయ, సామాజిక స్పర్శ లేని సాహిత్యం తిరిగి విజృంభిస్తున్నది. దాన్ని ప్రోత్సహించే ప్రచురణ సంస్థలు పెరిగిపోతున్నాయి. సామూహిక అనుభవం, సామాజిక సంక్షోభం అప్రధానమైన వ్యక్తిగత పోకడలు ప్రధానమవుతున్నాయి. బైటికి చూడ్డానికి అంతా మంచి సాహిత్యంగానే కనిపించే ధోరణులు తీవ్రమవుతున్నాయి. మానవతను, మనుషుల ఉనికిని రద్దు చేస్తూ చుట్టుముడుతున్న ప్రమాదాల గురించి, అంతర్యుద్ధాల గురించి గొంతెత్తి మాట్లాడలేని మౌన బృందాలు సాహిత్యరంగంలో బలపడుతున్నాయి.
సమాజం మొద్దుబారిపోతున్నదని, ఏ స్పందనలు లేవని కొందరు చేసే వాదనలకు సాహిత్యరంగంలో ఉదాహరణలు వెతుక్కోవాల్సిన పని లేదు. సృజనాత్మకత ఉండీ, జీవితాన్ని రచించడం తెలిసీ నోరుండి కూడా ఏమీ పట్టనట్టు జాగ్రత్తలు తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. గట్టి పలుకున్న యువకవులు, రచయితలు నాలుగు రోజులకే శాలువాల్లోకి వొదిగిపోతున్నారు. అవార్డులు, సత్కారాల కోసం తాపత్రయపడుతున్నారు. ఇదేదో చాలప్యం అనుకోడానికి లేదు. ఇదొక సామాజిక సాంస్కృతిక వైఖరి. ఇది కొందరి గొడవ అయితే పట్టించుకోనవసరం లేదు. నానాటికి పెరిగిపోతున్న ఈ ధోరణితో సమాజాన్ని ధ్వంసం చేస్తున్న సంక్షోభాన్ని ఎదుర్కోగలరా? దానికి తగిన రచన చేయగలరా? రాజకీయ నిరాకరణ నుంచి బైటపడి రచయితలుగా, బుద్ధిజీవులుగా సామాజిక ఆచరణను ఎన్నుకోగలరా? ఇవీ సాయిబాబ అమరత్వ సందర్భంలో రచయితల ముందున్న ప్రశ్నలు.
ఇవాళ మనం అనుభవిస్తున్న సంక్షోభాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అనేదాన్నిబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇందులో కొత్తగా అన్వేషించాల్సినవి ఉన్నప్పటికీ గత చరిత్రలో ఎందరో సాహిత్యకారులు తమ రచనతో, జీవితాచరణతో ఆ కాలానికి తగిన సమాధానాలు చెప్పి వెళ్లిపోయారు. చరిత్రలోని ప్రతి సంక్షోభాన్నీ ఎదుర్కొనేలా జీవించి, రచించిన అద్భుతమైన కళాకారులు ఉదాహరణగా నిలిచారు. రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో ఫాసిస్టు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు కొమింటర్న్ రాజకీయ మార్గదర్శకత్వాన్ని కళా సాహిత్య రంగాల్లో చార్లీ చాప్లిన్ అందుకున్నాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్న హిట్లర్‌ను ఎదుర్కొనే తెగువను ప్రదర్శించాడు. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీష్ ఊచకోతలను ఢల్లీిలో చూసిన కవి మీర్జా గాలీబ్ విజేతల పక్షం తీసుకోలేదు. ఓడిపోతున్నారని తెలిసినా.. వీర, అమర సిపాయిల కోసం కన్నీరు పెట్టుకున్నాడు. 1905లో బెంగాల్ విభజనకు నిరసనగా ఎక్కడో యూపీలో ఉన్న మున్షీ ప్రేమ్ చంద్ ఒక కథ రాశారు. ఆ కథను అధికారులు నిషేధించారు. ఇకపై రచనలు చేయొద్దని ఆదేశించారు. అప్పటిదాకా ధన్‌పత్‌రాయ్ శ్రీవాస్తవ అనే అసలు పేరుతో ఉర్దూలో ఆయన కథలు రాసేవారు. అధికారుల ఆజ్ఞలను ధిక్కరిస్తూ మున్షీ ప్రేమ్‌చంద్‌గా పేరు మార్చుకుని హిందీలో కథలు రాయడం మొదలుపెట్టారు. ఆయన నాయత్వంలోనే 1936లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిరది. ఒక రాజు కొలువులో మరో రాజును స్తుతిస్తే తల ఉండదని తెలిసినా.. మొఘల్ సామ్రాట్ ఔరంగజేబు ఎదుట శివాజీ వీర గానం చేసిన కవి కంఠస్వరం మనకు ఇంకా వినిపిస్తూనే ఉన్నది.
రచయితల వ్యక్తిగత జీవన వైఖరి, సామాజిక రాజకీయ ఆచరణ వాళ్ల రచనను అనేక రెట్లు ప్రభావశీలం చేస్తాయి. రచన, రచయిత విడదీయలేని ద్వంద్వంగా ప్రజా జీవితంలో భాగమవుతుంది. గత సంక్షోభాల కంటే పూర్తి భిన్నమైన సందర్భంలో మన ముందు సాయిబాబ, నర్మద, స్టాన్‌స్వామి వంటి అమర సృజనకారులు, బుద్ధిజీవులు ఉన్నారు. సాయిబాబను సమాజం, సాహిత్య లోకం ఇంతగా స్వీకరించడానికి కేవలం ఆయన కవిత్వమే కారణం కాదు. నిస్సందేహంగా ఆయన కవిత్వం అత్యంత ప్రభావశీలమైనది. దానికి తోడు కవిగా, బుద్ధిజీవిగా, అధ్యాపకుడిగా ఆయన కొనసాగించిన రాజకీయ సాంస్కృతిక ఆచరణ వల్ల సమాజం ఆయనను తన చైతన్యంలో భాగం చేసుకున్నది. ఇవాళ ప్రపంచమంతా యుద్ధాలతో, మనదేశం మావోయిస్టు రహిత భారత్ అనే అంతర్యుద్ధంతో తల్లడిల్లిపోతున్న సమయంలో బుద్ధిజీవులకు ఒక అత్యద్భుతమైన సమూనాగా సాయిబాబా నిలిచాడు. కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం వల్ల సంక్షోభంలో కూరుకపోయిన మన దేశం విముక్తం కావడానికి మేధో రంగం చేయాల్సిన కృషికి ఆయన ఒక సందర్భంగా మారిపోయాడు.
రచన వ్యక్తిగత అనుభవాలను దాటి సంక్షుభిత సామాజిక అనుభవంలోకి, గతాన్ని అధిగమించి భవిష్యత్ దార్శనికతలోకి, సకల మానవ ఉద్వేగాల సారమైన చారిత్రక వాస్తవికతలోకి చేరుకోడానికి రచయితలు, బుద్ధిజీవులు వీలైనన్ని ఆచరణ రూపాలను ఎన్నుకోవలసి ఉన్నది. సామాజిక చైతన్య ప్రతిఫలనంగానేగాక ఈ సంక్షోభ మూలాలను ఎత్తి చూపుతూ, పరిష్కారానికి ఉన్న అవకాశాలను సాహిత్యంలోకి తీసుకరావాలి. రచన చేయడంతోపాటు సమాజాన్ని కాపు కాయాల్సిన బాధ్యత సాహిత్యకారులదే. ప్రత్యామ్నాయ నిర్మాణాల కోసం ప్రజలు చేస్తున్న పోరాటాలకు అండగా నిలబడాల్సింది రచయితలే. కార్పొరేట్ హిందూ రాష్ట్రకు, సనాతన మానసికతకు భిన్నమైన వ్యక్తులను, వ్యక్తీకరణలను, రాజకీయ ప్రజా నిర్మాణాలను తుదముట్టించేందుకు ఫాసిస్టులు చేస్తున్న ఈ అంతర్యుద్ధంలో రచయితలకంటే, బుద్ధిజీవులకంటే కీలక పాత్ర నిర్వహించగలవారు ఎవరున్నారు? ఫాదర్ స్టాన్‌స్వామి, నర్మద, ప్రొ. సాయిబాబ ఈ పోరాటంలో అద్భుతమైన నమూనాలను అందించి వెళ్లిపోయారు. అలాంటి వేల మంది ప్రజలు హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ప్రాణత్యాగాలు చేశారు. వేలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు. అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ఫాసిస్టు వ్యతిరేకంగా రచన, ప్రసంగం, ప్రచురణ, ప్రచారం చేసి ఎందరో నిత్యం బెదిరింపులను అనుభవిస్తున్నారు.
ఈ ఫాసిస్టు అణచివేతకు, దోపిడీకి, కుట్రలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగు సాహిత్య, మేధోరంగాలను మరింత సమాయత్తం చేయమని, మిలిటెన్సీ పెంచమని సాయిబాబ స్ఫూర్తి మనందరినీ ప్రేరేపిస్తున్నది. అందులో భాగమే ఈ సాహిత్య పాఠశాల. అందరికీ ఇదే ఆహ్వానం.
విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల
సంక్షోభకాలంలో సాహిత్యకారుల పాత్ర
కా. సాయిబాబ సందర్భం
8,9 ఫిబ్రవరి 2025
కా. సాయిబాబా ప్రాంగణం(వెంకటేశ్వర కళ్యాణ మంటపం, వెంకటాద్రి నగర్, గుత్తి పెట్రోల్‌బంక్ పక్కన)
కర్నూలు
కార్యక్రమం
8.2.2025 ఉదయం 10.30 గంటలకు పతాకావిష్కరణ
11.00 గంటలకు తొలి సమావేశం
ఆహ్వానం: అరుణ్
అధ్యక్షత: అరసవిల్లి కృష్ణ
ప్రారంభోపన్యాసం: వసంతకుమారి(అమరుడు సాయిబాబా సహచరి)
కీ నోట్: రివేరా
1.80కి భోజన విరామం
2.30 గంటలకు
అంశం: మేధో సృజనరంగాలపై ఫాసిస్టుల దాడి-కార్పొరేట్ ప్రయోజనాలు
వక్త: అల్లం రాజయ్య
అధ్యక్షత: శివరాత్రి సుధాకర్
4.00 గంటలకు పుస్తకావిష్కరణ
నిర్వహణ: నాగేశ్వర్, కళావతి
5. 80 గంటలకు నాటిక
6.00 గంటలకు కవి గాయక సభ
నిర్వహణ: సూర్యచంద్ర, ఉదయ్ కిరణ్
7.00 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రజాకళా మండలి , అరుణోదయ , విరసం
9. 2.225 ఉదయం 10 గంటలకు
అంశం: తెలుగు సాహిత్యంలో వెలుగు నీడలు
వక్త: అరసవిల్లి కృష్ణ
అధ్యక్షత: వరలక్ష్మి
11.30 గంటలకు
అంశం: విప్లవోద్యమంపై ఫాసిస్టు యుద్ధం-రచయితలు, బుద్ధిజీవుల పాత్ర
వక్త: పాణి, అధ్యక్షత: సాగర్
1.80 గంటలకు భోజన విరామం
2.30 గంటలకు
అంశం: సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రచయితల దృక్పథాలు, వైఖరులు
నిర్వహణ: ఉజ్వల్, సిఎస్‌ఆర్ ప్రసాద్
పాల్గొనేవారు: కెంగార మోహన్(సాహితీ (ప్రవంతి), రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి (అరసం), యాకూబ్(కవి), స్కైబాబ(కవి,
కథకుడు), మెర్సీ మార్గెరెట్(కవి), సుభాషిణి(కథకురాలు), వనపట్ల సుబ్బయ్య(కవి)
గుడిపల్లి నిరంజన్(కవి), మహమూద్(కవి), వేంపల్లి షరీఫ్(కథకుడు),ఏకె ప్రభాకర్(సమూహ)
వైష్ణవిశ్రీ(కవి)
4.30 గంటలకు ఊరేగింపు
5. 30 గంటలకు బహిరంగసభ
అధ్యక్షత: కె. నాగేశ్వరాచారి
వక్తలు: జి. కళ్యాణరావు, శశికళ, ప్రొ. హరగోపాల్, బొజ్జ దశరథరామిరెడ్డి (రాయలసీమ సాగునీటి సాధన సమితి)