ఈ కథ ఇప్పుడు మరోమారు చదివా.  అప్పుడెప్పుడో రాంగూడా హత్యాకాండ సమయంలో రాసినా ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న హత్యాకాండల నెత్తుటి తడి మనకు తగులుతుంది. ఒకసారి కథలివి వెళితే ..

 .

ఇప్పుడు అమ్మలేదు. ఆమె జ్ఞాపకాలు తప్ప.

అమ్మ అరుణ.

అమ్మ డైరీలో భద్రపర్చుకున్న జ్ఞాపకాలను తనలోకి ఒంపుకుంటుంది వెన్నెల.

అమ్మా – వసంత్

అమ్మ అరుణ.మరి వసంత్ ఎవరు?

అమ్మ జీవితంలోకి వసంతే వచ్చాడో! వసంత్ జీవితంలోకి అమ్మే వెళ్ళిందో కానీ, ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయారు.

అమ్మ ‘కుటుంబం’గదిలో ఇరుక్కుపోయింది.

వసంత్, అడవిలో వసంతమై విరబూసిండు.

ఆదివాసిని అంతం చేసి …అడవిని ఆక్రమించి …సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పే పని పెట్టుకున్న పాలకులు దేశవ్యాప్తంగా ముఖ్యంగా దండకారణ్యం మీద యుద్ధం ప్రకటించారు. ఆదివాసీల ఆరాట పోరాటాలకు అండగా ఉంటున్న మావోయిస్టులను డెడ్ లైన్లు పెట్టి మరీ హత్యచేస్తున్నారు.

 నాటి సల్వాజుడుం మొదలు నేటి  కగార్ పాలక అంతిమ యుద్దాలు ఆదివాసీ హననానికి పాల్పడుతున్నాయి. అట్లాంటి యుద్ధ హింసని ఎదుర్కోడానికి ప్రతిహింసకు దిగాడు వసంత్.

అధర్మ యుద్ధం మీద ధర్మ యుద్ధం ప్రకటించాడు వసంత్. అమ్మ స్నేహితుడు వసంత్

అమ్మ అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకున్న వసంత్ రా మగూడ “ఎన్కౌంటర్”లో హత్యచేయబడ్డాడు. వసంత్ నిర్జీవ దేహాన్ని చూసి అమ్మ మనసూ నేలకూలినట్లయ్యింది.

ఇప్పుడు , అమ్మ లేదు

తన జ్ఞాపకాల పొట్లం డైరీ ఉంది.

ఆ జ్ఞాపకాల్లో తడుస్తూ వెన్నెల బయలుదేరింది.

ఇప్పుడు,

ఊరిలో లేదు…

యూనివర్సిటీలో లేదు…

వెన్నెల మాత్రం విరబూస్తూనే ఉంది.

* *  *

అది వానకాలపు రాత్రి. సమయం 10గంటలు. ఉస్మానియా యూనివర్సిటీ వుమన్స్‌ హాస్టల్‌. కాలేజీలో చేరినప్పటి నుంచీ వెన్నెల ఎందుకో దిగులుగా ఉంటాంది. దోస్తులెవర్తోనూ సరిగ్గ మాట్లాడ్తలేదు. ఎప్పుడూ ఏదో రాయడం, చదవడం… తన లోకం తనది. అమ్మ చనిపోయి అప్పటికి రెండు నెలలు. ప్రతీక్షణం అమ్మ గుర్తొచ్చి కుమిలి కుమిలి ఏడ్చేది. అమ్మలేని తనం తనను ఎప్పుడూ బాధించేది. ఇంటి దగ్గర్నించి హాస్టల్‌కు వచ్చేటపుడు అమ్మ జ్ఞాపకాలను కూడా వెంటతెచ్చుకుంది వెన్నెల. అమ్మ రాసిన డైరీలూ, కవితలు రాసుకున్న నోటుపుస్తకాలు… అన్నీ తెచ్చుకుంది.

ఆ రాత్రి బయట ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన. వెన్నెల లోపలంతా గూడుకట్టుకున్న దుఃఖం. 1985లో అమ్మ రాసుకున్న డైరీని తెరిచింది వెన్నెల. ఒక్కసారిగా అమ్మ వచ్చి తనను అలుముకున్నట్టన్పించింది.

డైరీ మొదటి పేజీలో… ‘మానని గాయాలు, తీరని వలపోత… చేరని గమ్యాలు…’ వణికే గుండెల్తో చదవడం మొదలుపెట్టింది వెన్నెల.

(వెన్నెల వాళ్ల అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఎలాంటి మార్పు లేకుండా…)

– 1985 నవంబర్‌ 16

‘‘పొద్దున్నే కరీంనగర్‌ పోతాన్కి రెడీ ఐతున్నం. మబ్బుల్లనే లేసి అన్నీ సర్దుకున్నం. బయిటి తలుపు తీసిన. వాకిట్ల వార్తా పత్రిక. తెగిన పక్షి రెక్కోల్గె పడివున్నది. తీస్కొని హాల్లకు పోయి పేపర్‌ తెరిసిన. షాకింగ్‌ న్యూస్‌…! ఎమ్మటే నా కండ్లు బైర్లు కమ్మినయ్‌. కాళ్ల కింది నేల కంపించిపోతాంది. గుండె దడదడ కొట్టుకుంటాంది. నిలువెల్లా వణికిపోయిన. మల్లా పేపర్‌ జూష్న.

‘వసంత్‌ ఎన్‌కౌంటర్‌’

నా కన్నీళ్లతోని బ్యానర్‌ వార్త తడిసిపోయింది. ఒక్కసారిగ నేలకూలిన.

కండ్లు తెరిసే సరికి దవాఖానలున్న. చేతికి సెలైన్‌. ముక్కుకు ఆక్సీజన్‌. ఒక్కసారిగ నా జ్ఞాపకాలు గతంలకు అలల్లెక్క ఉరికినయ్‌.

హో హో హో

వసంత్‌… ఇరవై ఏండ్ల కిందటి పరిచయం. ఉస్మానియా యూనివర్సిటీల ఎంఏ తెలుగు క్లాస్‌మేట్‌. సున్నిత మనస్కుడు. ప్రేమాస్పదుడు. కథలు, కవిత్వం రాయడం, పెయింటింగ్‌, పాటలు, అనువాదం అతనికిష్టం. ఎప్పుడూ ఏదో కోల్పోయి నట్టుండేటోడు. ఒంటరిగున్నపుడు పెయింటింగ్‌లో సంతోషాన్ని వెతుక్కొనేది.

వసంత్‌ రాసిన కవిత యూనివర్సిటీ మ్యాగజీన్‌లో అచ్చయింది. స్త్రీలు ఎదుర్కొంటున్న అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, గుండె కోతను చిత్రించిన కవిత్వమది. మ్యాగజీన్‌ చూడంగనె నా కవిత పక్కనే ప్రింటయిన ఆ కవిత నన్ను ఆకర్షించింది. చదివిన. చాలా చాలా నచ్చింది. ఆ సంతోషాన్ని తట్టుకోవడం నావల్ల కాలేదు. నేనే వెళ్లి పరిచయం చేసుకున్న. అట్లా మా పరిచయం ఆర్నెళ్లల్లనే గాఢమైంది.

నేను క్రిస్టియన్‌. వసంత్‌ నాస్తికుడు. మా నాన్న పాస్టర్‌. మా ఇద్దరి భావాలు మాత్రం ఒక్కటే. పేదల విముక్తి, అణచివేత, వివక్షల్లేని సమాజాన్ని కలలు కనేటోళ్లం. కవిత్వమయ్యేవాళ్లం. ఆ వెన్నెల రాత్రులల్ల ఆర్ట్స్‌ కాలేజీ మెట్లమీద కూసోని ఎన్నెన్ని చర్చలో… మరెన్ని సంఘర్షణలో.

వసంత్‌ ఎప్పుడూ సాహిత్య సభలంటూ తిరిగేటోడు. పేదల కోసం, పేదల బతుకుల కోసం తపించేటోడు. ఇవన్నీ నాలో ఉత్తేజం నింపినయ్‌. నాకు తెల్వకుండనే వసంత్‌పై ఇష్టం కలిగింది. వసంత్‌ దగ్గర ఎన్ని పుస్తకాలో. ప్రపంచమంతా కళ్ల ముందు నిలిచినట్టయ్యేది. మాక్సిం గోర్కీ ‘అమ్మ’ నవల నుంచి జాక్‌ లండన్‌ ‘ఉక్కుపాదం’ దాకా. చలం రచనలన్నీ అక్కడే పరిచయం. రావిశాస్త్రి, బుచ్చిబాబు, రాహుల్‌ సాంకృత్యాయన్‌, రంగనాయకమ్మ, కాళీపట్నం రామారావు, అల్లం రాజయ్య, అంపశయ్య నవీన్‌, చెరబండరాజు… ఇలా ఎందరో రచనల్ని పరిచయం చేసిండు వసంత్‌. అతనితో ఉన్నపుడు నాకు కాలమే తెలిసేది కాదు. సాహిత్య చర్చలతో.

‘వసంత్‌… మనం పెళ్లి చేసుకుందామా…?’ అని అడిగిన. మా ఇద్దరి మధ్య కొన్ని క్షణాల మౌనం. కలసి పేదలకు అండగా ఉందామన్నడు. ఆ క్షణాన చిన్న పిల్లలా సంతోషంతో ఎంత ఎగిసిన్నో. ఆ క్షణాలు అట్లనే నిలిచిపోతే బాగుండనిపించింది.

కానీ, మా ఇంట్లె పెళ్లికి ఒప్పించుడు నావల్ల కాలేదు. ‘నువ్‌ వసంత్‌ని పెళ్లి చేసుకుంటే ఇంటిల్లిపాదీ విషం తాగి చస్తమన్నడు’ నాన్న. నాకు దిక్కు తోచలేదు. నా వసంత్‌ను ఎట్లా వదులుకోను. లోలోపల ఎంత సంఘర్షణ జరిగిందో ఇంకిపోయిన నా కన్నీళ్లకే తెలుసు. నే తల్లడిల్లిన ఆ కాలానికే తెలుసు’’.

హో హో హో

ఉన్నట్టుండి కరెంట్‌ పోయింది. హాస్టలంతా చిమ్మ చీకటైంది.

డైరీని మూసేసి పక్కన పెట్టింది వెన్నెల. స్టడీ చైర్‌లోంచి లేసిన వెన్నెల విండోలోంచి బయటకు చూసింది.

ఉరుములు, మెరుపులతో బయటంతా దద్ధరిల్లుతోంది. ఈదురు గాలులకు తన గది కిటికీ తలుపులు ఆగకుండా కొట్టుకుంటున్నయ్‌. విండోలోంచి దూసుకువస్తున్న గాలికి వాన జల్లు తుంపర్లు వేగంగా లోపలికి వస్తున్నయ్‌.

గాలి ఉధృతమవుతున్నపుడల్లా చల్లని జల్లులు చెంపలను తాకుతున్నయ్‌. అచ్చం అమ్మ చేతి స్పర్శలాగే అన్పిస్తోంది వెన్నెలకు.

ఒక్కసారిగ మనసంతా తేలికైనట్లనిపించింది. అమ్మ గురించి ఆలోచన మొదలైంది.

అమ్మకూ ప్రేమ కథ ఉన్నదా…? ఆశ్చర్యపోయింది వెన్నెల.

ఏ దాపరికమూ లేకుండా తనతో అన్నీ పంచుకునే అమ్మ ఈ విషయాన్నెప్పుడూ ఎందుకు చెప్పలేదా… అని ఆలోచిస్తోంది.

‘బువ్వ పెట్టే భూమినీ, నీడనిచ్చే చెట్లనూ, సెలయేళ్లనూ ప్రేమించలేనివాళ్లు మనుషుల్నెప్పటికీ ప్రేమించలేరు’.

అప్పుడెప్పుడో అమ్మ చెప్పిన మాటలివి. ఈ మాటలు గుర్తొచ్చిన వెన్నెల బెడ్‌పై పడుకుని గుండెలవిసేలా… మౌనంగా ఏడుస్తోంది.

అమ్మతో తన జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చి గుండెనంతా ఎవరో మెలిపెట్టినంత బాధ. అమ్మ బతికున్నపుడు తన గుండెలపై తలపెట్టి పడుకోవడం ఎంతిష్టమో వెన్నెలకు.

కానీ, ఇప్పుడు అమ్మ లేదు. ఆమె జ్ఞాపకాలు తప్ప.

గుర్తొస్తున్నాయి అమ్మ నవ్వులు. పసిపాప లాంటి నవ్వులు. మనుసులోని సంతోషాన్నంతా వెన్నెల్లా బయటకు విరజిమ్మే ఆ నవ్వులు. ఇంకా స్పష్టంగా విన్పిస్తున్నయ్‌.

వెన్నెల కళ్లలోంచి రాలుతున్న అమ్మ జ్ఞాపకాల తాలూకు నీటి బొట్లు. జల జలా రాలుతున్నయ్‌. గుండెల్ని బరువెక్కిస్తూ.

ఈ జ్ఞాపకాలను చెరిపేందుకా అన్నట్లు కరెంట్‌ వచ్చింది.

కన్నీళ్లు నిండిన మసక కళ్లతో బెడ్‌పై ఉన్న డైరీని మళ్లీ తెరిసింది వెన్నెల. ఈ డైరీని చదువుతున్నపుడల్లా అమ్మ వచ్చి ఆప్యాయంగా అలుముకున్న ఫీలింగ్‌. చదవడం మొదలుపెట్టింది వెన్నెల.

 – 1985 నవంబర్‌ 18

‘‘వసంత్‌ను సాయంత్రం ఆరు గంటలకు ఆర్ట్స్‌ కాలేజీకి రమ్మని కబురు పంపిన. మనసంతా తేలికపరుస్తున్న చల్లని గాలులు తీసుకువచ్చే పరిమళాలతో ఆర్ట్స్‌ కాలేజీ మెట్ల దగ్గర వసంత్‌ కోసం వెయిట్‌ చేస్తున్న. నా చేతిలో శివసాగర్‌ ‘ఉద్యమం నెలబాలుడు’ కవితా సంకలనం. మది నిండా వసంత్‌ ఆలోచనలు. నిండైన వెన్నెల్లో కాలేజీ ఆవరణంతా వెలుగుతోంది. వసంత్‌ కోసం ఎదురుచూస్తున్న నాలాగే.

అంతల్నే నాగన్న ఉరుక్కుంటొచ్చి పిడుగు లాంటి వార్తజెప్పిండు. పోలీసులు వసంత్‌ను అరెస్టు చేసిండ్రని. ఏం జరుగుతున్నదో నాకేమీ అర్థం కాలేదు. అంతా అయోమయం. వసంత్‌ ఎక్కడున్నడో తెల్వక మిత్రులందరం శాన టెన్షన్‌ పడ్డం. బేజారైనం. ఆ రాత్రి తెల్లారంగనె రాష్ట్రమంతటా ర్యాలీలు… వసంత్‌ ప్రాణాలకు హాని తలపెట్టొద్దని. వెంటనే కోర్టులో హాజరుపరచాలని.

పోలీసులు మాత్రం అరెస్టును ధృవీకరించట్లేదు. తమకేమీ తెల్వదని బుకాయిస్తుండ్రు. వార్తా పత్రికల్లో చూసినంక తెల్సింది వసంత్‌ విప్లవోద్యమంలో ఎంతగ మమేకమైండనేది. ప్రజల కోసం ఎంత తపనపడ్డడో అర్థమైంది. అతనితో ప్రేమలో ఉన్నందుకు లోలోపల తొణికిసలాడే గర్వం లాంటి ఏదో ఫీలింగ్‌.

తీవ్ర చిత్రహింసల తర్వాత కొద్దిరోజులకు జైలునుంచి విడుదలయిండు. మల్లా ఆర్ట్స్‌ కాలేజీకొచ్చిండు. ఇంతకాలం తాను కోల్పోయిన కవిత్వాన్ని సాయుధంజేసిండు. ప్రజల బతుకుల్ని ఆగంజేస్తున్న పాలకుల తీరును మాకందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిండు. అరె… గింత చిన్న వయసుల ఎంతటి అనుభవం? అన్నన్ని సంగతులెట్ల తెల్సుకున్నడో నాకస్సల్‌ సమజ్‌గాలే.

ఆర్ట్స్‌ కాలేజీల వసంత్‌ మళ్లీ పాటల ప్రవాహమైండు. మిత్రులందర్నీ కలిసి మాట్లాడిరడు. ఎన్నెన్నో సాహిత్య సమావేశాలు ఏర్పాటుజేసిండు. తన సహచరులందరికీ మంచి పుస్తకాలు పరిచయం చేస్తూ ప్రోత్సహించిండు. వ్యాస రచన, కరపత్రం, రిపోర్టులు రాయడం, కథలు, కవిత్వం ఎట్లా రాయాలనే విషయంపై వర్క్‌షాపులు నిర్వహించిండు వసంత్‌. భావసారూప్యం ఉన్న విద్యార్థులందర్నీ కూడగట్టిండు. దీంతో ఇంటిలిజెన్స్‌ వాళ్లు వసంత్‌పై నిఘా పెట్టిండ్రు. అతనిపై నిర్బంధం పెరిగింది. అతనెక్కడికి వెళ్లినా వేట కుక్కల్లా వేటాడే పోలీసులు.

ఒకరోజు ఏం జరిగిందో తెల్వదు. నన్ను కల్వకుండనే, నాకేమీ చెప్పకుండనే ఎక్కడికో వెళ్లిపోయిండు. చాలా రోజులకు తెల్సింది నల్లమల అడవులల్లకు వెళ్లిండన్న సంగతి.

రోజులు

నెలలు

సంవత్సరాలు గడిచినై

ఇక బయటకు రాలేడని క్రమంగా అర్థమయింది.

వసంత్‌ను చూడాలంటే నేనే నల్లమలకు పోవాలె. కానీ అమ్మను వదిలి పోవుడెట్ల? మనసంతా ఇదే నిండిరది. వసంత్‌ను చూడకుండ ఉండుడు నావల్ల కాలేదు. కానీ, ఇల్లు దాటి బయ్‌టికి పోలేని నిస్సహాయత నన్ను కుంగదీసింది. ఒంటరిగ ఉన్నప్పుడల్లా వసంత్‌ జ్ఞాపకాలు చుట్టుముట్టేవి. ఎన్నో ఒంటరి రాత్రులు వసంత్‌ కవిత్వం నాకు ఓదార్పయింది. నా కన్నీళ్లను తుడిచింది. ధైర్యాన్నిచ్చింది.

కొన్నాళ్లకు…

ఇంట్లో నా పెళ్లి ప్రయత్నాలు మొదలయినయ్‌. ఈ పెళ్లి చూపులూ, వాటి తాలూకు సంగతులన్నీ నాకు అస్సలిష్టం లెవ్వు. నాన్నకు ఖరాఖండిగ చెప్పిన. వసంత్‌ను తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేస్కోనని. మా చుట్టాలంతా నన్ను పిచ్చిదాన్లెక్క జూసిండ్రు. అసలు వస్తడో… రాడో… తెల్వని వాడి కోసం ఎదురుచూడటం మూర్ఖత్వమన్నరు. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు. ఇక జీవితాంతం వసంత్‌ జ్ఞాపకాలతో బత్కనీకి డిసైడైన.

ఇప్పుడు వసంత్‌ నాకు మానసికంగా దగ్గర్నే

ఉన్నట్లన్పిస్తాంది. క్రమంగా కవిత్వంల ఓదార్పు వెతుక్కున్న. ఎప్పుడు ఒంటరితనం ఆవరించినా వసంత్‌ కవిత్వం నాకు తోడయ్యేది.

ఇట్లా… మూడేండ్ల తర్వాత ఎవరో ఒక ఉత్తరం తెచ్చిచ్చిండు. అది వసంత్‌నుంచి వచ్చిన ఉత్తరం.

‘అరుణా…

ఎట్లున్నవ్‌? నేనైతే ఇక్కడ అంతా మంచే. మేమిక్కడ యుద్ధం మధ్యల నిలబడి ఉన్నం. దండకారణ్యంల ఆదివాసీలను రాజ్యం అల్లకల్లోలం జేస్తాంది. బహుళజాతి కంపెనీలకు ఆదివాసీల కాళ్ల కిందున్న భూమిని తాకట్టుపెట్టింది రాజ్యం. వందల ఏళ్లుగా అక్కణ్నే ఉంటున్న ఆ అడవి బిడ్డల్ని సల్వాజుడుం పేరిట రాజ్యం నెత్తురు పారిస్తాంది. వాళ్లు అమాయకులు. నోరు లేనోళ్లు. అందుకే మేమంతా వాళ్లందర్నీ ఏకంజేసి పోరుకు సిద్ధంజేస్తున్నం. ఇక్కడి ప్రజలపై రాజ్యం యుద్ధం ప్రకటించింది. రాజ్యంతో వాళ్లు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగున్నం.

నీకు గుర్తుందా…? వెన్నెల రాత్రుల్ల మనం ఆర్ట్స్‌ కాలేజీ మెట్ల మీద కూసోని శ్రామిక జన విముక్తి కోసం ఎన్నెన్ని కలలుగన్నం? ఎంత ఆరాటపడినం? మనం కలలుగన్న పేదల రాజ్యం తప్పక వస్తది. ఆ స్వప్నం ఏనాటికైనా నిజమైతది. నువ్వెప్పటికీ గుర్తొస్తవు. నీ నవ్వులూ అంతే. నిన్నెప్పుడైనా కలవాలనుకున్నా… బయ్‌టికి రాలేని పరిస్థితి.

నిరుడు హైదరాబాద్‌ల ఓ కాంటాక్ట్‌ కోసం వచ్చిన. నిన్ను కలుద్దామని సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌ దగ్గరికి రాంగనె ఎవరో నన్ను వేటాడుతున్నట్టనిపించింది. ఎమ్మటే అక్కణ్నించి వెళ్లిపోయిన. నీకు తెల్సు కదా. రాజ్యం నా తలపై వెల నిర్ణయించింది. ఏ అండా లేనివాళ్లకు ఇక్కడ తోడుండటం, ఈ ఆదివాసీల మధ్య బత్కడం మరో వసంత మేఘ గర్జనను ఆవిష్కరించినట్లన్పిస్తాంది. ఎప్పుడైనా వీలు దొరికితే తప్పక కలుస్త. అయినా మనం దూరమయిందెపుడని? నువు నాతోనే ఉన్నవు. నాలోనే వున్నవు. నా మనసంతా వెన్నెలయి కురుస్తూ. ఏదో ఓ రోజు మనం కలిసే రోజు తప్పక వస్తది. ప్రియమైన వెన్నెల నవ్వుల అరుణా… ఉంటానిక.

‘‘తానిక బయ్‌టికి రాలేనన్నడు. నన్నే లోపలకు రమ్మన్నడు. ఆదివాసీ జనాన్ని ప్రేమించేందుకు రమ్మన్నడు. మళ్లీ నాలుగేండ్ల కింది సంగతులు, మిత్రుల క్షేమ సమాచారం, కవిత్వం రాయమని ప్రోత్సాహం… ఇట్లా ఎన్నెన్ని చెప్పిండో ఆ ఉత్తరంల.

ఆ అడవిల వసంత్‌ ఎట్లా ఉంటున్నడో? ఏం తింటున్నడో? ఆ బక్కపల్చని దేహం ఎన్నెన్ని కష్టాలుపడుతున్నదో .. తల్సుకుంటె గొంతు దుఃఖంతోటి పూడుకుపోయేది. ఎన్ని వసంతాలయింది వసంత్‌ నన్ను వదిలివెళ్లి? అరె… కాలం ఎంత కర్కశమైంది. కలల్ని, గళాల్ని నిషేధించే రాజ్యంల ఎట్లా

ఉండుడు? నల్లమల దాటి నాలుగు రాష్ట్రాలకు విస్తరించిన విప్లవోద్యమం గురించి వార్తా పత్రికల్ల వస్తున్న వార్తలు చదివి ఆకాశమంత ఎగిరేదాన్ని. మేం కలలుగన్న సమాజం వస్తదని ఆశ ఉండేది. ఏనాటికైనా వసంత్‌ను చూస్తననే చిన్న ఆశ నాలో.

ఇట్లా కొన్నేండ్ల తర్వాత…

సికింద్రాబాద్‌ కెథెడ్రల్‌ చర్చిలో అలెగ్జాండర్‌తో నా పెళ్లయింది. ఆయన గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ లెక్చరర్‌. వాళ్ల నాన్న టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లో డైరెక్టర్‌. దేనికీ లోటు లేదు. చింతలేని కుటుంబం. కానీ, వసంత్‌ జ్ఞాపకం నన్ను నిలువెల్లా దగ్ధంచేస్తాంది. అలెగ్జాండర్‌తో నా గతం గురించి చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్న. కానీ, ఏమవుతుందోనన్న భయంతో చెప్పలేదు. మూడేండ్లు తిరిగేసరికి ఒక పాప. ఒక బాబు. పాప వెన్నెల. బాబు క్రాంతి రణధీర్‌.

భద్రజీవితంల చిక్కి నా స్వేచ్ఛను చేతులారా నాశనం చేస్కున్న. యూనివర్సిటీల కన్న కలలన్నీ కల్లలయినయ్‌. పెండ్లయినప్పట్నించీ నా కవిత్వం ఆవిరయింది. భావుకత్వం బంధనాలల్ల చిక్కింది. ఛీ… ఏం బతుకిది? ఎన్నిసార్లు నన్ను నేను తిట్టుకున్ననో. కానీ, ఏనాడైనా వసంత్‌ కన్పిస్తడనే చిన్న ఆశ నాలో జీవితేచ్ఛను రగిలిస్తాంది. కానీ సాధ్యమేనా? కాదు. రాడు. రాలేడు. ఇంకెప్పుడూ రాకుండ రాజ్యం ఇక్కడ వల పన్నింది. ఎప్పుడు వేటాడుదామా అని రాజ్యం వసంత్‌ కోసం ఎదురుచూస్తాంది.

ఇట్లా వసంత్‌ ఒక్కడేనా? ఇంకెందరు వసంత్‌లు రాజ్యం కర్కశత్వానికి బలవుతున్నరో. ఎందరు తల్లులు కానరాని తమ బిడ్డల కోసం శోకం బెడుతున్నరో. ఇల్లునొదిలి, చిన్ననాటి స్నేహాలు, కాలేజీ మిత్రులనొదిలి ఈ దేశ విముక్తి కోసం బందూకు పట్టిన వీరులెందరో’’.

‘‘ఒక్కసారిగ నా నరాలల్ల నెత్తురు ఉప్పొంగినట్లయింది. సెలైన్‌ నా వంట్లో అణువణువూ వ్యాపిస్తాంది. నిమ్మలంగ కండ్లు తెరిసిన. నా చుట్టూ వెన్నెల, క్రాంతి రణధీర్‌, అత్తమ్మ, మామయ్య, ఇంకా… రోజూ చర్చికి వచ్చే సహవాసులు. నాకేమయిందోనని అందరిలో ఆందోళన.

డాక్టర్‌ వచ్చి మల్లా పరీక్ష జేసింది. నాకేమీ ప్రమాదం లేదని చెప్పింది. ఇక ఇంటికి వెళ్లొచ్చన్నది. అలెగ్జాండర్‌, పిల్లలు… ఇంటికి పోనీకి కారు రడీ జేసిండ్రు.

మళ్లోసారి ఆ పేపర్‌ కండ్లల్ల కలెమెదిలింది. నెత్తుటి మడుగుల వసంత్‌ నిర్జీవ దేహం. నా వసంత్‌ బక్కపల్చని దేహం. భూమిపై రాలిన మోదుగు పువ్వు లెక్క నిశ్శబ్దంగ పడివున్నడు. పోలీసుల బుల్లెట్లతోటి జల్లెడయిన ఒళ్లు. నరికేసినట్టున్న చేతి వేళ్లు. కమిలిన ముఖం. ప్రపంచాన్ని కొత్తగ పరిచయం చేసిన ఆ కంచు కంఠం ఇప్పుడు మూగవోయింది. వెన్నెల జలపాతాల కవిత్వం రాసిన చేతులు అచేతనంగ పడివున్నయ్‌. ఎన్ని ప్రపంచాల్నో, ఎన్నెన్ని బాధల గాథల్నో అనుభవించి, పలవరించిన ఆ గుండె ఇప్పుడు ఆగిపోయింది. నన్ను ఓదార్చి, నా మనో ప్రపంచంల విడదీయరాని భాగమైన నా ప్రాణం ఇప్పుడు ఇట్లా… తల్సుకుంటె ఏడ్పు ఆగుతలేదు. గుండె బరువెక్కింది. మనసంతా ఒకటే దిగులు.

లేదు. ఇంటికి పోవద్దు. వసంత్‌ను చివరిసారిగ చూడాలె. ఆ ముద్దు మోమునోసారి చూడాలె. పేదల బతుకుల్ల చీకట్లను తరిమిన వసంత్‌… ఇప్పుడిట్ల అవుడు ఎట్టా తట్టుకోవాలె?

మూడు గంటలల్లనే సూర్యాపేటకు 30కిలోమీటర్ల దూరంల ఉన్న వసంత్‌ ఊరికి చేరుకున్నం. ఆ మారుమూల పల్లెల అప్పటికే వేలాది మంది జనం. రోడ్డంతా ఎర్ర జెండాలు. అక్కడక్కడా వసంత్‌ ఫొటోలున్న బ్యానర్‌లు. ఇంకా జనం వందలాదిగ లారీలల్ల వస్తనే ఉన్నరు. అప్పుడప్పుడే అవని అంతా చీకట్లు అలముకునేందుకు సిద్ధమైంది. వసంత్‌ నిర్జీవ దేహం చుట్టూ ఇసుకేస్తె రాలనంత జనం. వాళ్లందర్నీ తోసుకుంటూ ముందుకు పోయినం. బల్ల పీట మీద వసంత్‌ నిశ్శబ్దంగ పడుకుని ఉన్నట్లున్నడు. వసంత్‌ చుట్టూ మందార, మోదుగు పూలు. పైన ఎర్రని జెండాలు.

నెత్తుటితో నిండిన ఆ దేహాన్ని చూస్తూ గోడు గోడున ఏడుస్తున్న వసంత్‌ తల్లిని చూడంగనె తల్లడిల్లిన. ఆ వాడ వాడంతా, ఊరు ఊరంతా ఏడ్పుల వాగై ప్రవహిస్తున్నది. వసంత్‌ మీదపడి ఏడ్వాలనుంది. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయత. అప్పుడూ అంతే. ఇప్పుడూ అంతే. వసంత్‌ రూపం నా కన్నీళ్లలో అస్పష్టమయింది. నేలరాలిన కన్నీళ్లు చివరిసారిగ జోహార్లు చెప్పినయ్‌.

అంతిమయాత్రకు ఏర్పాట్లు పూర్తయినయ్‌. డెడ్‌బాడీని ట్రాక్టర్‌పై ఉంచి ఎర్రజెండాలు కప్పిండ్రు. అంతిమయాత్ర సాగుతాంది. రోడ్డు రోడ్డంతా జనం. ఆ ఊరంతా దుఃఖ సంద్రమయింది.

‘‘జోహార్‌ కామ్రేడ్‌ వసంతన్నకు’’… అంటూ వేలాది గళాలు మిన్నంటుతున్నయ్‌. ఇరవై ఏండ్ల కిందట ఊరొదిలి పోయిన వసంత్‌ ఇప్పుడు నిర్జీవంగ వచ్చుడు ఆ ఊరిజనం తట్టుకోలేకపోతున్నరు. వసంత్‌ చిన్ననాటి దోస్తులంతా ఒచ్చిండ్రు. ఒక్కడుగా వెళ్లిన వసంత్‌ ఇప్పుడు వేలాది మంది అశ్రు నయనాల మధ్య సాగిపోతున్నడు.

పడమట చీకట్లు అలుముకున్నయ్‌.

అంతిమయాత్ర వసంత్‌ వాళ్ల చెల్క దగ్గరకు చేరింది. ఒక్కసారిగ దిక్కులు పిక్కటిల్లేటట్టు నినాదాలు. అరుణారుణ పాటలు. వసంత్‌ చితికి వాళ్ల తమ్ముని కొడుకు క్రాంతి నిప్పు పెట్టిండు. చితి మంటలు జ్వాలలై రగులుతున్నయ్‌. అక్కడికి కొద్ది దూరంలనే నిలబడ్డ చిన్నప్పటి దోస్తులు, సహచరులు. చిమ్మ చీకట్లె ఆకాశాన్నంటుతున్నట్లు లేస్తున్న జ్వాలలు అప్పుడు ఈ దోపిడీ రాజ్యాన్ని తుదముట్టించడానికి లేస్తున్న జన జ్వాలల్లెక్క అన్పించింది.

తిరుగు ప్రయాణంల దారి దారంతా వసంత్‌ జ్ఞాపకాలే. వసంత్‌… నా జీవితంలకి కవిత్వమై వచ్చిండు. పాటల ప్రవాహమై పెనవేసుకున్నడు. ఈ బతుకంతా దాచుకునే జ్ఞాపకాలను మనసంతా ఒంపి పోయిండు.

నమ్మిన ప్రజల కోసం ప్రాణాలిచ్చిన వసంత్‌ ఇప్పుడు నా గుండెల్నిండా పరివ్యాప్తమయిండు’’.

హో హో హో

వెన్నెల లోలోపల ఎడతెరిపి లేని దు:ఖం. అమ్మ మనసులో ఇంత విషాదం ఉన్నదా? మనసంతా దిగులు కమ్ముకుంది. బయటంతా జోరు వాన. వెన్నెల లోపలా దుఃఖపు వాన.

డైరీని మూసింది వెన్నెల. కిటికీ తెరిసింది. అప్పుడే తెలవారుతున్నది. జోరు వానతో కలిసి. వెన్నెల కన్నీళ్లలో కలిసి ఆ వాన కరిగిపోయింది. బెడ్‌పైనుంచి లేసి ఒక్కో అడుగేస్తూ డోర్‌ బోల్ట్‌ తీసి డోర్‌ ఓపెన్‌ చేసింది. అప్పటికే కారిడార్‌లో పడివున్న న్యూస్‌ పేపర్‌. చేతుల్లోకి తీసుకుని లోపలికి వెళ్లింది. పేపర్‌ తెరిసింది. ఎర్రటి అక్షరాలతో బ్యానర్‌ వార్త.

ఏఓబీలో భారీ ఎన్‌కౌంటర్‌.. 25 మంది మృతి…

అనే బ్యానర్‌ వార్త. వెన్నెల మనసంతా మళ్లీ దుఃఖం నిండిరది. లోలోపల అలజడి. ఆ వార్తంతా చదివింది.

బెడ్‌పై కూలబడి ఆలోచిస్తోంది వెన్నెల.

ఎందుకీ బూటకపు ఎదురు కాల్పులు? అన్ని కథల్లాగే ఈ కథ కూడా అల్లిండ్రనుకున్నది. ఎందుకు అమాయక ఆదివాసీలను చంపడం? ఈ దేశ వనరుల్ని కాపాడుతున్న మూలవాసుల్ని రాజ్యం ఎందుకు వేటాడుతోంది?

వెన్నెల ఆలోచిస్తోంది. లోలోపల కోపం. దుఃఖం. నెత్తురు మరుగుతున్నది.

ఏడ్చీ ఏడ్చీ ఉబ్బిపోయి, ఎర్రబారిన కండ్లతో యూనివర్సిటీకి వెళ్లింది వెన్నెల. విద్యార్థి సంఘాలన్నీ ఈ మారణకాండ గురించే మాట్లాడుకుంటున్నరు. చర్చిస్తున్నరు. మీడియాలో ఆంధ్రా డీజీపీ రోజుకో వార్త చెప్తున్నడు. కూబింగ్‌ ఆపేది లేదంటూ హూంకరిస్తున్నడు. ఎన్‌కౌంటర్‌ మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అది మూడు రోజుల్లో 31కి చేరింది. వారం రోజులుగా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు వెన్నెల. ఆ వారం రోజులూ రీసెర్చ్‌ వర్క్‌ ఆపేసింది. ఆ టైమ్‌లో ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీల దగ్గరికి ఫీల్డ్‌ వర్క్‌ మీద వెళ్లాల్సిన షెడ్యూల్‌ ఉండె ఆమెకు. వాయిదా వేసుకున్నది.

హో హో హో

దేశవ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీల నుంచి సుమారు 30మంది రీసెర్చ్‌ స్కాలర్స్‌ ఎన్‌కౌంటర్‌ సంఘటన స్థలానికి వెళ్లి నిజ నిర్ధారణ చేయాలనుకున్నరు. అన్ని యూనివర్సిటీలనూ కోఆర్డినేట్‌ చేసుకున్నరు. ఆ బృందం కోఆర్డినేటర్‌ నుంచి వెన్నెలకు పిలుపు వచ్చింది. ఏఓబీకి వెళ్తున్నం. రమ్మని.

తాను అధ్యయనం చేస్తున్న ఆదివాసీల జీవితాలు ఎట్లా అల్లకల్లోలం అవుతున్నయో తలుచుకుంటెనే గుండె బరువెక్కుతోంది వెన్నెలకు.

నిజ నిర్ధారణ బృందం ఏఓబీకి పయనమైంది. ఆ బృందంలో వెన్నెలా ఉన్నది.

ఎన్‌కౌంటర్‌ జరిగిన రామగూడ, బెజ్జంగి, బచ్చల్‌పొదర్‌ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించింది ఆ బృందం. ఆ మారణకాండ గురించి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి నోట్స్‌ రాసుకున్నరంతా. అక్కడి అడవుల్లో అణువణువూ నిశితంగా పరిశీలించిండ్రు. పదిహేనేళ్ల తన కొడుకును తల నరికి, చేతుల్ని భుజాల నుంచి వేరు చేసి చంపిన దుర్మార్గాన్ని చెప్తున్న ఆదివాసీ డేనియల్‌ తల్లిని హత్తుకొని గుండెలవిసేలా ఏడ్చింది వెన్నెల. ఇండ్లల్లోంచి బయటకు లాక్కుపోయి తమ బిడ్డల్ని కాల్చి చంపారని చెప్తున్న ఆ తల్లుల కడుపు కోత విని తట్టుకోలేకపోయింది వెన్నెల. దుఃఖం. ఆగని దుఃఖం. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లింకిపోయిన దుఃఖం. మనసంతా కకావికలమైంది. అక్కడున్న ఆ నాలుగు రోజులూ వెన్నెల ఎంత తల్లడిల్లిందో. మనసంతా ఎప్పటికీ మానని గాయమైంది.

నాలుగు రోజులు పరిశీలించిన ఆ బృందం హైదరాబాద్‌కు తిరిగివచ్చింది. నాలుగైదు రోజుల పాటు ఆ సంఘటనపై తాము పరిశీలించిన విషయాలన్నీ డాక్యుమెంటేషన్‌ చేయాలనుకున్నది నిజ నిర్ధారణ బృందం. తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాకు వెల్లడిరచాలకున్నరు. ఈ పనుల్లోనే ఆ స్కాలర్స్‌ బృందమంతా తలమునకలైండ్రు. రిపోర్టులు రాసేవాళ్లొకరు, డాక్యుమెంటేషన్‌ రెడీ చేసేవాళ్లొకరు. వెన్నెల కూడా ఈ పనుల్లో బిజీ అయిందనుకున్నరు హాస్టల్‌ మిత్రులంతా.

 హాస్టల్‌లో, యూనివర్సిటీలో వెన్నెల కన్పించక చాలా రోజులే అయింది. ఆమె గురించి రీసెర్చ్‌ సూపర్‌వైజర్‌ రోజూ అడుగుతున్నడు సహ విద్యార్థుల్ని. నాన్నను చూసేందుకు ఊరెళ్లిందనుకున్నరు. ఫోన్‌చేస్తే స్విచాఫ్‌ వస్తోంది. వారం పది రోజుల్లో యూనివర్సిటీకి వస్తదనుకున్నరు.

కానీ, వెన్నెల యూనివర్సిటీలో లేదు. ఊర్లోలోనూ లేదు. ఇప్పుడు వెన్నెల ఇక్కడ లేదు. దండకారణ్యం ఆదివాసీల బతుకుల్లో వెన్నెలై కురుస్తోంది. ఈ ఎరుపెక్కిన వెన్నెల.

One thought on “వెన్నెల వసంతం

  1. ENCOUNTER —NO MEANING IN POLICE DICTIONARY-ALL ENCOUNTERS ARE FALSE -MEANINGLESS ONES –
    NICE STORY – VENNELA. DECISION IS RIGHT ONE
    —————————-
    BUCHIREDDY GANGULA

Leave a Reply