మరోసారి ‘మందిర్-మస్జిద్’ వివాదంపైన పోలీసులతో జరిగిన ఘర్షణలో స్థానిక ముస్లిం పురుషులు మరణించిన, శతాబ్దాల నాటి ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో నిర్జన వీధుల నిశ్చలత భారంగా వుంది. మసీదు వెలుపల జరుగుతున్న పథ్‌రావ్ (రాళ్లు విసరడం) మధ్య హసన్ తన తమ్ముడిని వెతకడానికి వెళ్లినప్పుడు ఒక బుల్లెట్ లేదా ఒక పదునైన ముక్క తగిలి  అతని కుడి చేతిని గాయపరిచింది. అది ఎటు వైపు నుంచి వచ్చిందో -స్థానిక ప్రజలా లేదా పోలీసుల వైపు నుంచా అనేది – చూడలేకపోయాడు. ఎవరు కాల్చుతున్నారో కూడా గమనించలేదు.

పోలీసులు మొదట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ తర్వాత చేర్చిన సంభల్ జిల్లా ఆసుపత్రిలో మూడు రోజుల తర్వాత “మై బీచ్ మె ఫస్ గయా. జో బి థా, ఆర్ పార్ చలా గయా” (నేను మధ్యలో చిక్కుకుపోయాను. అదేమిటో కానీ నాకు తగిలింది) అన్నాడు.

ఆదివారం ఐదుగురు మృతి చెందడంతో సంబాల్ పోలీసులు కేసు పెట్టిన 2,500 మందిలో (చాలామంది గుర్తు తెల్యనివారు) అతను ఒకరు. ఆలయ శిధిలాల మీద ఈ మసీదు నిర్మించారన్న వాదనల నేపథ్యంలో సంభాల్ షాహి జామా మసీదుపై కోర్టు ఆదేశించిన ‘సర్వే’పై జరిగిన ఘర్షణలో పోలీసులు ప్రాణాంతక కాల్పులు జరిపారని స్థానికులు, నాయకులు ఆరోపించారు.

హసన్ సోదరి, ఆషియా బీబీ, తన సోదరుడిని “తూటాతో కాల్చారని”; హింసలో ప్రమేయం ఉన్నదనే ఆరోపణతో   “కస్టడీలో ఉన్నాడు” అని చెప్పింది. కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉందని కూడా ఆమె అన్నది. “హసన్ అక్కడ వున్న గుంపులో లేదు; మా తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్లాడు. మా నాన్న కేవలం 20 రోజుల క్రితమే చనిపోయాడు; తమ్ముడు సమీపంలోనే వున్న సమాధి దగ్గర ప్రార్థనలు చేయడానికి వెళ్లినట్లు తెలిసింది ”అని ఆమె చెప్పింది. “హాసన్ ఉండకూడని సమయంలో ఉండకూడని  స్థలంలో ఉన్నాడు”

సంభల్‌లో ఆమెలాంటి వేదననే ప్రతిధ్వనించిన ఇతరులు కూడా ఉన్నారు. ఆదివారం హింసలో మరణించిన ఇద్దరు యువకులతో సహా ఐదుగురు పురుషుల కుటుంబాలు అన్నీ శ్రామిక వర్గ ముస్లింలు. 17 ఏళ్ల మొహమ్మద్ అయాన్ తాను పనిచేసే రెస్టారెంట్‌కు వెళ్తున్నాడు. 18 ఏళ్ల మోహద్ కైఫ్ సౌందర్య సాధనాలను అమ్మే తన దుకాణం కోసం సామగ్రిని కొనదానికి వెళ్ళాడు. చేనేత దుకాణం యజమాని బిలాల్ అన్సారీ, 22,, ఢిల్లీ డిస్ట్రిబ్యూటర్‌తో పెద్ద ఒప్పందం చేసుకున్న తర్వాత రాబోయే సామాగ్రి కోసం ఎదురు చూస్తున్నాడు.  ఒక మిఠాయి దుకాణం నడుపుతున్న 35 ఏళ్ల నయీమ్ గాజీ, నూనె, పిండి కొనేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ హింసలో వారంతా ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలు నాశనమయ్యాయి.

సివిల్ జడ్జి ఆదిత్య సింగ్ జిల్లా& సెషన్స్ కోర్టులో నవంబరు 19 మంగళవారం నాడు న్యాయవాది విష్ణు కుమార్ జైన్‌తో సహా హిందూ పిటిషనర్ల బృందం పిటిషన్ దాఖలు చేసినప్పటి నుండి సంభల్ ముస్లిం సముదాయం అత్యధికంగా వున్న  పరిసరాల్లో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హరిహర్ ఆలయ శిధిలాల మీద ఈ మసీదును నిర్మించారని, ఈ స్థల స్వభావాన్ని నిర్ణయించాలని, హిందువులు పూజలు చేసుకోవడానికి  అనుమతినివ్వాలని పిటిషన్‌లో డిమాండ్ చేసారు. యాదృచ్ఛికంగా, అయోధ్య, వారణాసి, మథురలలో కూడ ఇలాంటి కేసుల్లో జైన్ పాల్గొన్నాడు.

పాత పిటిషన్, కొత్త సిరా

మసీదు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంభల్ లోని కైలా దేవి ఆలయ ప్రధాన పూజారి మహంత్ రిషిరాజ్ గిరి గత వారం రోజులుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మసీదును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా తనను “ హరి”(దేవుడు) ఆదేశించాడని చెప్తున్నాడు.

“ఇది హరి హర దేవాలయం. ఇది ఎప్పుడూ ఉంది. మసీదు నిర్మించడానికి బాబర్ ఆలయాన్ని ధ్వంసం చేసాడు” అని, సాయుధ పోలీసు సిబ్బంది సమక్షంలో తన వాకి-టాకీలో వచ్చే చిటపటల శబ్దం మధ్య మాట్లాడాడు. బాబర్‌నామా, ఐన్-ఇ-అక్బరీ వంటి గ్రంథాలలో డాక్యుమెంట్ చేసిన “వాస్తవాలు”గా వీటిని పేర్కొన్నాడు. “ఇదంతా పిటిషన్‌లో ఉంది. ఇది ఇంటర్నెట్‌లో కూడా ఉంది”అని నొక్కి చెప్పాడు.

ఆదివారం జరిగిన ఘటన ‘జరగకూడనిది’ అని అన్నాడు. “మరణాలు దురదృష్టకరం. అయితే, కోర్టు ఆదేశించిన సర్వే పనిలో స్థానికులు జోక్యం చేసుకోకూడదు” అని కూడ అన్నాడు. మసీదు ప్రాంగణంలో “సంక్లిష్టమైన హిందూ దేవాలయ నిర్మాణం” ఉందని; కాని తాను ఎప్పుడూ మసీదులోకి ప్రవేశించలేదని ఒప్పుకున్నాడు. సంభల్‌లోని హరిహర్ ఆలయాన్ని చూడటం తన ‘చిన్నప్పటి కల’ అని ఆయన అభివర్ణించినప్పటికీ, ‘గత ఒకటి లేదా రెండు సంవత్సరాలలో’ మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలని తాను నిర్ణయించుకున్నానని కూడ చెప్పాడు.

కానీ ఇప్పుడు ఎందుకు?

శతాబ్దాల తరబడి మసీదు ఉనికిలో ఉన్నప్పటికీ, ‘దేవుడు అలా కోరుకున్నాడు’ అని పిటిషన్ దాఖలు చేసినట్లు కైలా దేవి పూజారి పేర్కొన్నాడు. ఏదేమైనా, ఈ సర్వేను నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం “తొందరపాటు”తో జరిగిందని, మతపరమైన అశాంతికి దారితీసే అవకాశాలను పట్టించుకోలేదని ముస్లిం పక్షం ఆరోపించింది.

పిటిషన్ దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే సర్వే ఉత్తర్వును నవంబర్ 19న ఆమోదించారు. మసీదు పరిపాలనా యంత్రాంగానికి లేదా మసీదు కమిటీకి సరైన నోటీసులు జారీ చేయకుండానే సాయంత్రం 5.30 గంటలకు సర్వే ప్రారంభమైంది. ఇలాంటి కేసుల్లో ఇది ప్రామాణికం” అని సంభల్‌లో వుండే న్యాయవాది, మసీదు న్యాయ సలహా బృందంలో సభ్యుడైన కమర్ హుస్సేన్ అన్నారు. ఈ పిటిషన్ “కొత్త సీసాలో పాత సారా” అని ఆయన చమత్కరిస్తూ, “అయోధ్య తీర్పు తర్వాత ముస్లింల ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకోవడం ఒక ధోరణిగా మారింది” అన్నారు.

భారతీయ రాజకీయ చర్చలో మందిర్ – మసీదు వివాదాలు ఒక ప్రధాన అంశంగా మారాయి; తరచుగా ఒక సుపరిచితమైన లిపిని అనుసరిస్తాయి. వారణాసి (2022) లో, మసీదును శ్రీనగర్ గౌరి ఆలయ శిధిలాలపై నిర్మించినట్లు కోర్టు ఆదేశించిన సర్వే పేర్కొన్న తరువాత జ్ఞానవాపి మసీదు వివాదం పెరిగింది. అదేవిధంగా, మథురలోని షాహీ ఈద్గా మసీదును ఆలయ భూమిలో నిర్మించారని, అది శ్రీకృష్ణుని జన్మస్థలమని హిందువులు పేర్కొన్నారు; ఈ నిర్మాణాలలో పూజా హక్కుల కోసం డిమాండ్లు లేవనెత్తారు.

అయోధ్య, కాశీ లేదా మధుర కంటే తక్కువగా తెలిసిన సంభాల్ మసీదు చాలా కాలంగా మత వివాదానికి సంబంధించిన అంశం. 1976లో, దాని ఇమామ్‌ను శివరాత్రి రోజున ఒక హిందూ మతోన్మాది మసీదు ఆవరణలోనే హత్య చేసాడు; ఈ ఘటన నెల రోజుల పాటు కర్ఫ్యూలు, ఉద్రిక్తతలను ప్రేరేపించింది. మతాధికారి మమ్లుక్ ఉర్ రెహమాన్ బార్క్ ఈ ఘటన కలిగించిన శాశ్వత ప్రభావాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు, అతని కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహ్మాన్ బార్క్, ఎమ్మెల్యే నవాజ్ ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ హింసను ప్రేరేపించినందుకు పోలీసు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. మసీదును సంరక్షించడంపై బార్క్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయని, అస్థిర పరిస్థితి మరింత దిగజారిందని సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్ ఆరోపించారు.

ఇతర రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని బార్క్ సీనియర్లు, స్థానిక ఎస్ పి నాయకులు నమ్ముతున్నారు. “బహుశా మతపరమైన ఇబ్బందులను రెచ్చగొట్టే లక్ష్యంతో కుందర్కి ఉప ఎన్నికలు మొదటి సర్వే జరిగిన మర్నాడు జరిగాయి. 30 ఏళ్ల తర్వాత కుందర్కీలో బీజేపీ గెలిచింది; బహుశా, ఇక్కడి అల్ప సంఖ్యాత సముదాయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టడం కోసం ఆ మరుసటి రోజే మరో సర్వే జరిగి వుండచ్చు అని అన్నారు.

సమాజ్ వాదీ పార్టీ హింసకు ప్రేరేపిస్తోందని బిజెపి ఆరోపించింది. టర్క్, పఠాన్ వర్గాల మధ్య అధికార పోరాటమే ఈ “అల్లర్లు, కాల్పుల”కి  కారణమని ఉత్తరప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి నితిన్ అగర్వాల్ సోమవారం ఆరోపించారు.

టర్కీ సంతతికి చెందిన బార్క్, పఠాన్ కమ్యూనిటీ నాయకుడు సోహైల్ ఇక్బాల్‌తో ఉద్రిక్తతలకు దారితీసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2024 లోక్‌సభ విజయంతో ఇటీవల కుందర్కి ఉప ఎన్నికకు దారితీసిన కుందర్కి మాజీ ఎమ్మెల్యే బార్క్ ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతున్నారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, “నిజం దాచడానికి” పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు పెట్టారని ఆయన పేర్కొన్నారు.

వివాద చరిత్ర

బ్రిటీష్ పురావస్తు శాస్త్రజ్ఞుడు ఎ. సి. ఎల్ కార్లీలే 19వ శతాబ్దంలో యిచ్చిన రిపోర్టు ప్రకారం  ఆలయ భూమిపై మసీదును నిర్మించారు. ప్రస్తుత పిటీషనర్లు పేర్కొన్నట్లు 1979లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో ఈ మసీదును ఒక దేవాలయం నుంచి వచ్చిన శిధిలాల నుంచి నిర్మించివుండవచ్చు అని  వున్నది. బాబర్‌ను మసీదు దాతగా పేర్కొన్న శాసనంకి వున్న ప్రామాణికతను కూడా ఇది ప్రశ్నించింది; దాని నిర్మాణంలో అతని ప్రమేయంపై సందేహాన్ని వ్యక్తం చేసింది.

హిందూ పురాణాలలో ‘కలియుగం’ ముగుస్తుందని ప్రవచించిన విష్ణువు 10వ అవతారమైన కల్కి జన్మస్థలం సంభాల్ అని విశ్వాసం. బిజెపి ప్రభుత్వం ఇటీవల పునరుద్ధరించిన పురాతన కల్కి పూజా స్థలం నుండి జామా మసీదు దాదాపు 200 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని సందర్శించారు.

ఘటన తర్వాత సంభాల్‌కు వెళ్ళిన ప్రతినిధి బృందానికి జమియత్-ఉలమా-ఇ-హింద్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ హకీముద్దీన్ ఖాస్మీ నాయకత్వం వహించారు; కమిటీకి దేశ చట్టాలపై “విశ్వాసం” ఉందని అన్నారు. “మేం ఈ మసీదులో శతాబ్దాలుగా ప్రార్థనలు చేస్తున్నాం; ఎవరికీ సమస్య లేదు. మతాల భద్రత, మతాల సమగ్రత, మరీ ముఖ్యంగా మైనారిటీల భద్రత కోసం ప్రార్ధనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991 వచ్చింది. (ఇది భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన రోజున ఆగస్టు 15, 1947 నాటి ప్రార్థనా స్థలాల మతపరమైన స్వభావాన్ని కాపాడడం ఈ చట్ట ఉద్దేశ్యం. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాది ముందు అంటే 1991లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది) ఇది విజయవంతంగా అమలవుతుందని మేం ఆశిస్తున్నాం” అని ఆయన అన్నారు.

నవంబరు 19వ తేదీ ఉత్తర్వుపై స్టే విధించాలని సంబాల్ షాహి జమా మసీదు కమిటీ సుప్రీంకోర్టును కోరింది.

సంభల్‌లో నిశ్శబ్దం

ఇదిలా ఉండగా, సంభల్‌లో, ఒక విచిత్రమైన కల్పించిన  నిశ్శబ్దం నిర్జన వీధుల నిశ్చలతకు విఘాతాన్ని కలిగిస్తోంది.

హింసాకాండ జరిగినప్పటి నుండి ముగ్గురు మహిళలు, ముగ్గురు మైనర్లతో సహా ఇరవై ఏడు మందిని అరెస్టు చేశారు; అందరూ ముస్లిం సముదాయానికి చెందినవారే.  వీడియోలు, డ్రోన్ చిత్రాలు, ఇతర మూలాల ఆధారంగా 70 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనేక ఇళ్ళ తలుపులు, కిటికీలు, దుకాణాల ముందు భాగాలను పలకలతో మూసివేసారు; అరెస్టులకు భయపడిన అనేకమంది యువకులు, మధ్య వయస్కులైన పురుషులు ఆ ప్రాంతాల్లో కనిపించకుండా పోయారు. “నివారించదగిన” హింస అని అందరూ అంగీకరించే ఘటనలో, కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలు బిగ్గరగా ఏడవటానికి భయపడుతూండడంతో వారి దు:ఖం కూడా మూగబోయింది.

 “కాల్పులకు వారే కారణమని పోలీసులు ఇళ్లపై దాడి చేసి, ప్రజలను వేధిస్తున్నారు” అని నయీమ్ గాజి తల్లి ఇద్రిసా అన్నారు. మొహమ్మద్ కైఫ్, మొహమ్మద్ అయాన్ కుటుంబ సభ్యులు కూడా అలాంటి కష్టాలే ఎదుర్కొన్నారు. కైఫ్ సోదరుడు జైద్‌ను ఆదివారంనాడు హింసాత్మక ఘటన తరువాత జరిగిన దాడుల సందర్భంగా అరెస్టు చేసి, కొట్టారు. కైఫ్ మరణం గురించి చెప్పి, బతిమిలాడుకున్న తర్వాత మాత్రమే అతణ్ణి విడిచిపెట్టారు. కైఫ్ తండ్రి మొహమ్మద్ హుస్సేన్ ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. “మేం పేద వాళ్ళం. మేము ఇప్పటికే మా చిన్న కొడుకును కోల్పోయాం. ఇక ఎలాంటి ఇబ్బందులు రాకూడదనుకుంటున్నాం’ అని చేతులు జోడించి చెప్పాడు.

30 నవంబర్ 2024

తెలుగు: ఉదయిని

https://www.outlookindia.com/national/in-sambhal-an-engineered-silence?fbclid=IwY2xjawG4F5BleHRuA2FlbQIxMAABHRq7kk2X14aWvH-2-qoQWkqNyj2LlnXGZG8rYDW1oRifdbuqztpHI9-xiw_aem_NGjSQJrK87eKf68JW-BPFA

Leave a Reply