ప్రపంచం నాలుగు మూలల నుండి ఒకేసారి అరవై మంది కవయిత్రులతో సంభాషణ ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఎలా వచ్చిందో కాని దానికదే ఎంత అపురూపమైనది కదా అనిపించింది ఈ పుస్తకం గురించి విన్న వెంటనే. వైవిధ్యభరితమైన సాంస్కృతిక వ్యక్తీకరణలు, ప్రాకృతిక విశేషాలు, చారిత్రక నేపథ్యాలు ఒక్క చోటికి రావడం దానంతటదే ఒక ప్రత్యేకత. అయితే ఈ కవిత్వమంతా సౌందర్యారాధన కాదు. ఒట్టి నగిషీలు చెక్కిన కళ కాదు. అలా అయితే రంగుల పుష్పగుచ్ఛంలా మన కళాభిరుచిని అలంకరించుకోవచ్చు.

ఈ కవయిత్రులంతా వివిధ పీడిత సమూహాల తరపున అక్షరాలు పేర్చిన వాళ్లు. ఈ పేజీల పొడవునా ఒక పెనుగులాట ఉంది. మనిషి మనిషిగా బతికేందుకు, స్వేచ్ఛగా సంచరించేందుకు, కనీసమైన భౌతిక, మానసిక అవసరాలు తీర్చుకునేందుకు శతాబ్దాల నాటి పెనుగులాట. సకల జీవిరాశుల్లోకి ఉన్నత పరిణామం పొంది, ప్రకృతి సూత్రాలను ఔపోసన పట్టి నాగరీకులైన మనుషులు జంతువుల కన్నా ఘోరమైన బాధలెందుకు పడుతున్నట్లు? కొంత మంది కోసం అంతమందీ చస్తూ బతుకుతున్నదెందుకు? ప్రపంచమంతా ఇంతేనా? వేరు వేరు సమూహాల అనుభవాలు అనేక వైపుల నుండి ఈ ప్రశ్నలు అడుగుతున్నాయి.

ఇందులో మహిళల అనుభవాలేమిటి? ఒక స్త్రీ వ్యక్తీకరణలో సమాజం ఎలా పలుకుతుంది?

‘‘ప్రేమపూర్వకమైన కౌగిలిలో ఓదార్పును వెతికే ప్రయత్నం చేసిన నా కన్నీళ్ళని నేనారోజు చంపుకుందాం అనుకున్నాను’’.

‘‘నువ్వు ఇంటిలోంచి బైట పడ్తావు. తోటలో విచ్ఛిన్నమై పడున్న చిన్నచిన్న బొమ్మల శవాలను కనుగొంటావు.’’

ఇలా ప్రేమ రాహిత్యంతో, హింసతో నిండిపోయిన ప్రపంచం దిగ్భ్రాంతిని గొలుపుతూ మరింత బీభత్సంగా పలుకుంది.

ప్రతి సమూహపు అనుభవం నుండి సమాజాన్ని ఎంతగా చూడగలిగితే మన మనసంత విశాలం అవుతుంది. ఇలా చూసినప్పుడు మహిళల కవిత్వమూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని, సెన్సిటివిటీని, జ్ఞానాన్ని కలిగిస్తుంది.

ఈ కవిత్వమంతా సంకలనం చేయడం వెనక పనిచేసిందేమిటో సంపాదకురాలు చెప్పారు. స్త్రీల సాహిత్యం అనగానే పితృస్వామిక సమాజం వారికి ఆపాదించిన పాత్రల నుండే చూడడం ఇప్పటికీ ఉంది. ఒక మహిళ అనుభవంలో కుటుంబ హింస, లైంగిక దాడి మాత్రమే ఉంటాయా? ఈ అనుభవాలు లేని మహిళలు ఉండరు కాని కుటుంబం, లైంగికత దాటి ప్రపంచంలోని విషయాలన్నీ మగవాళ్లకు మాత్రమే సంబంధించినవి కావు కదా. అనేక రాజకీయ, సామాజిక, తాత్విక అంశాలపై స్త్రీలు రచనలు చేశారు. దాన్ని కొద్దిగా రుచి చూపడానికే ఈ ప్రయత్నం. అందుకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కవిత్వాన్ని సృష్టించిన నాలుగైదు తరాల కవయిత్రులను ఒక్కచోటికి చేర్చడం చిన్న విషయం కాదు.

అసలు ఈ కవిత్వమంతా ఎలా రూపొంది ఉంటుంది? ఈ స్త్రీలంతా ఈ సమాజంలో తమను తాము వ్యక్తీకరించుకోవడానికి, ఒక సంభాషణ చేయడానికి వెనక ఎటువంటి ప్రయాణం చేసి ఉంటారు? నాలుగైదు తరాలు వెనక్కి పోతే, స్త్రీలకు లోకం తెలీనివ్వకుండా బంధించిన స్థితి నుండి ఈ ప్రయాణం మొదలై ఉంటుంది. సాహిత్యం సామాజిక పరిణామంలో భాగమే. పాత సమాజానికి, రూపొందుతున్న సమాజానికి మధ్య ఘర్షణ సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. మనుషుల భావోద్వేగాలు, ఊహాశక్తి, వివేకం కవిత్వమవుతుంది. అసలు ఏ వ్యక్తీకరణ అయినా తెలుసుకోవడం దగ్గర మొదలవుతుంది. తనను తాను తెలుసుకోవడం, లోకం గురించి తెలుసుకోవడం దగ్గర మొదలవుతుంది. స్త్రీలు తమ గురించి తాము ఆలోచించడమే అపచారం కదా. వ్యవస్థీకృత ఆంక్షలను దాటి బైటికి రావడం ఒక గొప్ప సామాజిక పరిణామం. ఆ తొలి అడుగే ఒక మార్పును సూచిస్తుంది. ఏది వ్యక్తీకరించినా సరే, వ్యక్తీకరణే ఒక ప్రోగ్రెస్‌. పబ్లిక్‌ లైఫ్‌కు దూరంగా చాలా దుర్మార్గంగా అంత మంది మనుషుల్ని అజ్ఞానంలో ఉంచింది కదా ఈ వ్యవస్థ. జైలు కిటికీ నుండి బైటికి తొంగి చూసిన ఖైదీల్లా స్త్రీలు కూడా వంట గది నుండి, పడక గది నుండి బైటికి చూసిన అనుభవం ఎటువంటి భావోద్వేగాలను పలికి ఉంటుంది? అది రాజకీయంగా రూపొందిన క్రమం ఏమిటి? మొదట వ్యక్తిగత అనుభవమే, ఒక అందమైన ఊహే ఒక ఆకాంక్షను పలుకుతుంది. ఈ వ్యక్తీకరణ స్పష్టమైన రూపం తీసుకున్నప్పుడు, సామూహిక స్వరం అయినప్పుడు అది రాజకీయ అంశంగా రూపొందుతుంది. సొంత జీవితం, వ్యక్తిత్వమే లేని స్త్రీలు, వ్యక్తిగతమంతా రాజకీయమే అని తేల్చి చెప్పగలిగారు. ఒక నాలుగు తరాల స్త్రీల వ్యక్తీకరణలో కవిత్వం రాజకీయంగా రూపొందిన తీరు గమనించగలిగితే ఆసక్తికరంగా ఉంటుంది.

కిష్వర్‌ నహీద్‌ వంటివారు సూటిగా, వాడిగా దాన్నెట్లా కవిత్వంలో పలికించారో ఈ పుస్తకంలో చూడొచ్చు. నా ముక్కు మీద దర్జాగా వచ్చి కూచునే ఈగ నేను బంధించబడి ఉన్న చోట స్వతంత్రురాలు… నువ్వు నాకు ఈగకున్నంత స్వతంత్రాన్ని కూడా ఎక్కడ ఇవ్వగలవు అన్నారీమె.

‘‘మీ బతుకుల్లోని చీకటిని తరిమి వెలుగును నింపడానికి… చదువుకోవడానికి లేవండి… ఐక్యం కండి’’ అన్న సావిత్రీబాయి ఫూలే నుండి రోహిత్‌ వేముల జ్ఞాపకంలో

‘‘వాన్ని వాడి పేరుతో పిలవడానికి ధైర్యం చూపే మేము మా గుండె ధైర్యం పొడి, తేమ రెండింటినీ తినే అగ్ని అవుతుంది… శిథిలమైన గోడ గడ్డి నది రాయి వారి స్వంత వంకరతనం నుండి చలికాలపు చెట్లు విముక్తి చేస్తాయి… ఎర్రటి మూలాలు మమ్మల్ని వెలిగిస్తున్నాయి, అల్లరి నాలుకలు ముండుతున్నాయి’’

అని రాసిన మీనా అలెగ్జాండర్‌ కాలం నాటికి సాంద్రమైన భావాలు ఎటువంటి రాజకీయ రూపం తీసుకున్నాయో చూడొచ్చు. కవిత్వం అంటే భావోద్వేగాల వెల్లువ కదా. ఈ వెల్లువ ఎంత ఉధృతమవుతున్నదో గమనించవచ్చు.

కాలాన్ని దాటి నిలిచి ఉండే కవితలు కూడా ఇందులో ఉన్నాయి. నా ఆత్మవిశ్వాసం నిన్ను భయపెడుతుంది అని రాసిన మాయా ఏంజిలో కవిత అన్ని కాలాల ధిక్కారాలకు ప్రతీక. నా బరితెగింపు నిన్ను బాధిస్తుందా… నువ్వెందుకు అంధకారంలో ఉన్నట్టు అంటుందీమె. రాబోయే పరిణామాలను పట్టుకొని రాసిన కవిత్వం నిలిచి ఉంటుంది.

జాతి వివక్ష మీద నల్లజాతి స్త్రీ భావాల తీవ్రత, గాఢత బహుశా పురుషులు రాసిన కవితల్లో ఉండవేమో. అట్లాగే యుద్ధం గురించి యుద్ధరంగంలో ప్రత్యక్షంగా ఉన్న పురుషుల అనుభవం, ఆ యుద్ధం సమాజం లోపల చేసే అనేక విధాల విధ్వంసం నుండి స్త్రీలకు కలిగే అనుభవం భిన్నమైనవి.

అనార్‌ అనే కవయిత్రి యుద్ధ కవిత్వం ఇలా మొదలుపెడుతుంది:

‘‘ప్రతి నెల క్రమం తప్పకుండా రక్తం చూడటం అలవాటు చేసుకున్నప్పటికీ…’’

అక్కడి నుండి అనేక పొరల్లో హింస, భీభత్సం గురించి చెప్తుంది. ‘‘అత్యచారానికి గురైన మహిళ రక్తం.. తేమ రంగులో ఉన్న ఆమె జీవితంలో అది జిగటగా; హత్యగావించబడ్డ చిన్నారి మృతదేహం నుండి నిశ్శబ్దంగా, అమాయకంగా ఏమీ ఎరగనట్టు కారుతున్న రక్తం; ప్రతీకారపు రక్తం వాసన, వేటాడే రక్తం దుర్వాసన విచిత్రమైన వీధుల్లో గడ్డకడుతుంది, సమాధి గోడలపై పారుతుంది… చెరగని మరణజాడలుగా, అవి నన్ను అమాంతం వెంబడిస్తాయి.’’ ఒళ్లు జలదరించక మానదు. యుద్ధం పాఠకుల అనుభవంలోకి తీసుకొచ్చిందామె.

వ్యక్తిగత అనుభవం సాహిత్యంగా మారడం, అది సామూహికమవ్వడం వెనక ఒక రాజకీయ పరిణామం ఉంటుంది. సమూహాల ఆకాంక్షలు ఎలుగెత్తే రాజకీయ ఉద్యమం, ఎప్పుడూ సాహిత్యాన్ని తీర్చిదిద్దే దినుసు. తక్షణ ప్రతిస్పందనగా కవిత్వం ఒక గాఢమైన అనుభూతిని మోసుకొస్తుంది. ఈ సంకలనంలో వివిధ అంశాల కింద క్రోడీకరించిన కవితలు ఆయా సమాజిక చలనాలను ప్రతిఫలిస్తాయి. అయితే వ్యక్తిగత అనుభూతి మాత్రమే సాహిత్యమవుతుందా? లేదా ఏదైనా వ్యక్తిగత అనుభవంలో ఉన్నదే గొప్ప సాహిత్యమవుతుందా? ఎవరి గురించి వాళ్లు రాసుకోవడం, ముఖ్యంగా నిరాదరణకు, వివక్షకు, అణచివేతకు గురైన సమూహాలు తమను తాము వ్యక్తీకరించుకోవడం, ఒక ఉనికిని, ధిక్కారాన్ని ప్రకటించడం నిస్సందేహంగా చాలా గొప్ప విషయం. అయితే వ్యక్తిగత అనుభవాలన్నీ సమాజంలో భాగమే. మనిషి తనను తాను తెలుసుకుంటూ, సమాజంలో తాను ఏమిటో తెలుసుకోవడం ఒక ముందడుగు. తర్వాత ఎన్నో ప్రాపంచిక విషయాలు మనిషి ఎరుకలోకి వస్తాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపిస్తున్న వాటి వెనక వాటిని నడిపించే శక్తులేమిటో అర్థం చేసుకునే క్రమంలో కవిత్వంలో అంతర్లీనంగా ఒక తాత్వికత పలుకుతూ ఉంటుంది. సామాజిక సంఘర్షణ జీవితానుభవంలో, జీవన సంఘర్షణలో ప్రతిఫలింపజేస్తే అది మంచి సాహిత్యమవుతుంది. సుదూర ప్రపంచంలో మనుషులు పడుతున్న యాతన మన హృదయ సంస్పందనగా ఎలా మారుతుంది? అట్టడుగున అందరం మానవులమే అన్నట్టు మానిషి బుద్ధికి ఉండే ప్రాథమిక లక్షణమది. ఆ వివేకాన్ని తట్టి లేపే పని కళాసాహిత్యాలు బాగా చేస్తాయి. ఈ పుస్తకంలో అటువంటి కవిత్వం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సామాజిక కార్యకర్తలుగా ఒక ప్రగతిశీల మార్పును కోరుకునే మహిళలు రాసిన కవిత్వం లోతైన తాత్వికతో వ్యక్తమయింది.

ఇట్లా వివిధ అంశం మీద స్త్రీల కవిత్వ స్పందనను ఎంతో శ్రమకోర్చి ఇందులో రికార్డు చేశారు దియా విఘ్నేష్‌. ప్రతి సామాజిక సంచలనం స్త్రీల అనుభవం నుండి చూడగలిగే అవకాశం ఈ పుస్తకం కల్పిస్తుంది. దళిత, ముస్లిం, ఆదివాసీ, నల్లజాతి స్త్రీ, దేవదాసీ, ట్రాన్స్‌జెండర్‌ (మొత్తంగా ఎల్‌జిబిటిక్యు) సమూహాలకు ప్రాతినిథ్యం వహించిన స్త్రీల కవిత్వం వేరువేరు సమాజాల్లో, వేరువేరు భాషల్లో వెలువడినవి. వీటిని అనువదించడం మరో సాహసం. దియా విఘ్నేష్ ఈ సాహసం చేశారు.

అనువాదం అంటే కేవలం భాషను మార్చడం కానే కాదు. ఒక సమాజంలో, ఒక సాంస్కృతిలో వ్యక్తీకరించబడిన భావాలు వేరొక సమాజంలోకి అంతే ఉద్వేగభరితంగా తీసుకెళ్లగలగాలి. కవి కంఠస్వరం అదే రీతిన పలకాలి. ప్రతి సమాజానికి దానికే ప్రత్యేకమైన సాంస్కృతిక విశేషాలు ఉంటాయి. అనువాదకులు రెండు భాషా సమాజాల మధ్య సంధానకర్తగా వ్యవహరించాలి. మూల రచన వెనక గల చారిత్రక, సాంస్కృతిక మూలాలు తెలుసుకుంటేనే ఇది ఎంతో కొంత సాధ్యమవుతుంది. ఈ పుస్తకంలోకి ఎన్ని భాషల, ఎన్ని దేశాల కవిత్వం అనువాదమై వచ్చిందో చూస్తే, ఇదంతా ఒక్కరే చేశారా అని ఆశ్చర్యం వేస్తుంది. అందువల్ల ఈ సంకలనానికి అనివార్యమైన పరిమితులు కూడా ఏర్పడ్డాయి. చాలా చోట్ల ఒకే కంఠస్వరం పలికింది. వేరు వేరు కవయిత్రుల ఒరిజినల్‌ కంఠస్వరాలు పలకకపోతే ఇలా జరుగుతుంది. అలాగే వ్యంగ్యం వచ్చినంత నేర్పుగా ఆగ్రహం, భీభత్సం, దు:ఖం పలకలేదనిపిస్తుంది.

అంశాల వారిగా కవితల వర్గీకరణ ఉంది కాని, కాలక్రమం లేదు. మూల రచయిత్రుల పరిచయం కూడా ఉంటే పాఠకులకు మరింత ఆసక్తికరంగా, ఉపయుక్తంగా ఉండేది. అన్నిటి కన్నా పెద్ద లోటు ప్రేమ కవిత్వం, విప్లవ కవిత్వం లేకపోవడం. పాపులర్‌ వేదికల్లో ప్రేమ పురుష వ్యక్తీకరణగానే ఉంటున్నది. చాలా సార్లు అది స్త్రీల శరీర సౌందర్య వర్ణన చుట్టూతా ఉండిపోతుంది. అందువల్ల స్త్రీ ప్రేమ కవిత్వం ఉండాల్సింది. విప్లవ కవిత్వం బలమైన రాజకీయ వ్యక్తీకరణ. ఇది స్త్రీల వైపు నుండి అద్భుతంగా పలికింది. ఎందువల్లనో ఇది కూడా సంకలనంలోకి రాలేదు. ఈ పరిమితులెలా ఉన్నా ఇది ఒక అరుదైన అపురూపమైన సంకలనం. ఇటువంటి ప్రయత్నాలు మరెన్నో జరగాలి.

Leave a Reply